దండమయా! విశ్వంభర!


సృష్టి పరిణామక్రమాన్ని క్రమానుగతంగా ప్రతిబింబించే శ్రీమన్నారాయణుని దశావతారాలలో రామకృష్ణులు పరిపూర్ణ స్వరూపులు. జగత్తును ఉద్ధరించడానికి సంపూర్ణ మానవులై అవతరించి, విశ్వానికి మార్గదర్శనం చేసిన వారు. రామచంద్రమూర్తి ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో తాను చేసి చూపించిన మర్యాదా పురుషోత్తముడు. ఈ జగత్తు కల్లోలంలో ఉన్న సమయంలో తాను సమస్త విశ్వానికి గురుదైవమై నిలిచి, దుష్టశిక్షణ కావించిన వాడు. శ్రీకృష్ణుడు అనేక రూపాలలో అభివ్యక్తమైన వాడు. విశ్వాన్ని భరించిన వాడు కాబట్టి ఆయన భర్త అయినాడు. ప్రపంచాన్ని శాసించిన వాడు కాబట్టి ప్రభువైనాడు. జీవుల కర్మలన్నింటికీ సాక్షీభూతంగా నిలిచాడు. ఆయనే సృష్టి, ఆయనే స్థితి, ఆయనే లయ. ప్రపంచ సమస్తానికి, ఉత్పత్తికి బీజమైనవాడు కృష్ణుడు.

ఆయన అవతరించిన సమయం భూమి మహా కల్లోల పరిస్థితిలో ఉంది. కంసుడి వంటి అనేక రాజులు మహా సంక్షోభకారకులై విలయతాండవం చేస్తున్నారు. లోకమంతా దుష్టుల పాలన చేత భయంకరంగా ప్రజాకంటకంగా తయారైంది. మగధలో జరాసంధుడు, చేదిలో శిశుపాలుడు, హస్తినలో ధృతరాష్ట్రుడు, మధురలో కంసుడు రాజ్యాలు చేస్తున్నారు. ప్రజల సుఖదుఃఖాలు పట్టని కామక్రోధ వశులైన, అర్థకామ దాసులైన ప్రభువుల పరిపాలనలో లోకమంతా అరాచకం ప్రబలిపోయింది. తాను స్వయంగా భగవంతుడై కూడా కారాగారంలో జన్మించి అర్ధరాత్రి గోకులానికి పారిపోయి తనను తాను రక్షించుకోవలసి వచ్చింది. సంసారమంతా అధికారం కోసం, ఇంద్రియ కామనల కోసం విలవిల్లాడుతున్నది. ధర్మం జాడ తెలియకుండా పోయింది. ప్రజలు దుఃఖభాజనులై అల్లల్లాడి పోతున్నారు. ఈ దుఃఖసాగరం నుంచి తమను గట్టెంక్కించగల వాడికోసం వేనవేల కళ్లతో ఎదురుచూస్తున్న దశలో మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించాడు. తాను జన్మించిన క్షణంలోనే, శైశవ దశనుంచే ధర్మకార్యాచరణకు పూనుకున్నాడు. ఒకవైపు దుష్ట సంహారం చేస్తూ, శిష్టులను రక్షిస్తూ, ధర్మాన్ని నిలబెడుతూ జీవితాన్ని కొనసాగించవలసి వచ్చింది.

అతి విపత్కర పరిస్థితిలో, ప్రతికూల వాతావరణంలో, మృత్యువే ముంగిట నిలుచుని కాచుకుని ఉన్న దశలో దేవకీదేవి అష్టమ గర్భంలో, అష్టమి తిథిన జైలులో జగద్గురువు జన్మించాడు. సాధారణంగా అష్టమి తిథి మంచిది కాదని మనలో చాలా మంది విశ్వాసం. కానీ కృష్ణభగవానుడు అష్టమ గర్భం.. దశావతారాలలో అష్టమ అవతారం. రెండూ కలిస్తే సంఖ్య పదహారు. షోడశ సంఖ్య పరిపూర్ణతకు సంకేతం. అంటే శ్రీకృష్ణుడు షోడశ కళానిధి. తల్లి గర్భంలో ఉన్నంత వరకూ సుఖంగా ఉన్న శిశువు సుఖంగా ఉంటాడు. గర్భం నుంచి విముక్తుడైన వెంటనే ఈ ప్రపంచంతో జీవుడు పోరాటాన్ని ప్రారంభించాల్సిందే. శ్రీకృష్ణుడు చేసింది అదే. ఆయన జన్మించడంతోనే కన్నతల్లికి దూరం కావలసి వచ్చింది. బాలావస్థలోనే పూతన, శకటాసురుల వంటి వారిని అంతమొందించాల్సి వచ్చింది. యమునలో కాళీయుని ఆహంకారాన్ని అణచివేయడం, గోవర్ధనాన్ని ఎత్తి ఇంద్రుని గర్వమణచడం, కంస సంహారం, శిశుపాల వధ వంటివన్నీ ఆయన విశ్వ ఉద్ధరణలో ఒక క్రమపరిణామం. అందుకే
నీవే తల్లివి తండ్రివి/ నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము/ నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా..
అని శ్రీకృష్ణ శతక కారుడు వ్యాఖ్యానించాడు. సృష్టించిన వాడు ఆయనే, ప్రళయ కారకుడూ ఆయనే కావడం విశేషం.
త్రేతాయుగంలో శ్రీరాముడు తాను చేసి చూపిస్తే.. ద్వాపరంలో కృష్ణ భగవానుడు చెప్పి చేయించాడు. సర్వం త్యజించి తానే తప్ప శరణు లేదన్న స్థితిలో అవమానానికి గురవుతున్న ద్రౌపది ఆర్తితో పిలిచిన వెంటనే వచ్చి కాపాడాడు. ధర్మానికి అండగా నిలిచి దుష్ట శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయించిన వాడు కృష్ణ భగవానుడు.
ఆయన ధర్మనిర్ణయం ఆసాధారణమైంది. అనన్య సామాన్యమైంది. నేరం చేయకపోయినా, నేరస్థులకు సహాయంగా నిలవడం అంతకంటే పెద్ద నేరం. సజ్జనులు కూడా సరియైన మార్గదర్శకం లేక ధర్మ విచికిత్సలో పడిపోయారు. సకల ధర్మావతారుడైన భీష్ముడంతటి వాడు కూడా అధర్మ పక్షాన వుండవలసి వచ్చింది. అలాంటి సందర్భంలో తానే లోకానికి సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక నాయకత్వాన్ని వహించి జగద్గురుత్వాన్ని పొందినాడు. గోపాలక వృత్తి ఆయన గురుత్వానికి ప్రతీక. అజ్ఞానంతో చెల్లా చెదురయ్యే ఆలమందలను అదిలించి, మందలించి దారికి తీసుకురావడం గోపాలకుడి విధి. అజ్ఞానాంధకారంలో ఉన్న లోకంలో వెలుగు నింపి, గమ్యాన్ని చూపించడం గురువు కర్తవ్యం. గోపాలకుడుగా శ్రీకృష్ణుని పేర్కొనడంలోని ఆంతర్యం ఇది. యుద్ధరంగంలో కర్తవ్యమును మరచి మోహంలో పడ్డప్పుడు తనకు అభిన్నుడుగా భావించే మహావీరుడైన అర్జునుడు కార్పణ్య దోషాన్ని పొందినప్పుడు ధర్మ స్వరూపాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. అధర్మానికి పాల్పడకపోయినప్పటికీ, దాన్ని సమర్థించడమూ నేరమే. అందుకే భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి వారు ఎంతటి ధర్మనిరతులైనా, దుష్టుడైన దుర్యోధనుని పక్షాన నిలిచినందుకు వారే ముందు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. కురువృద్ధుడైన భీష్ముడే కురుక్షేత్ర సంగ్రామంలో మొదటి సమిధ కావడం గమనార్హం.
గోపికలకు చెప్పినా, అక్రూరునకు చెప్పినా, ధృతరాష్ట్రునకు చెప్పినా, బ్రహ్మాదులకు చెప్పవలసి వచ్చినా జగత్తునకు నియామకమైన శాశ్వతమైన సత్యాన్ని వ్యాఖ్యానించాడు. ఆయన చెప్పిన ధర్మస్వరూపం ఈనాటికీ వర్తిస్తుంది. మనిషి పాటించాల్సిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ధార్మిక విలువలను బోధించాడు కాబట్టే ఆయన జగద్గురువు అయ్యాడు. ఆయన చూపిన మార్గదర్శనం సార్వకాలీనమైంది. ఆయన చెప్పిన ధర్మం ఇవాళ్టికీ ఆచరణీయమైనది.