8, ఏప్రిల్ 2010, గురువారం

ఎన్నాళ్లీ మంటలు?

మళ్లీ యాసిడ్‌ మంటలు పెట్రేగుతున్నాయి. పైశాచికత్వం పెచ్చుమీరుతోంది.. చట్టాలు చేస్తామన్న వారు మాటలకే పరిమితమయ్యారు.. ఉన్మాదులు రెచ్చిపోతుంటే, అమాయకులు అన్యాయంగా బలవుతుంటే.. ఆర్చేవారు లేరు.. తీర్చే వారు లేరు.. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు చోట్ల యాసిడ్‌ దాడులు జరిగాయి... బాధితులు మృత్యువుతో పోరాడుతున్నారు... ఈ పరిస్థితి ఎంతకాలం? ద్రావకం దాడులను నిరోధించేదెలా?

మొన్న ప్రణీత.. నిన్న లలితాబాయ్‌... ఇవాళ సుల్తానా... యాసిడ్‌ దాడులకు బలైపోయిన అభాగ్యులు... కఠినంగా శిక్షిస్తామని సర్కారు హెచ్చరించినా, చట్టంలో సవరణలను ప్రతిపాదించినా ఉన్మాదుల దాడులు ఆగింది లేదు.. నియంత్రించిందీ లేదు.. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా తెనాలిలో లలితాబాయ్‌ అనే పధ్నాలుగేళ్ల బాలికపై సుబ్బారావు అనే వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశాడు.. దాదాపు నలభై శాతం ఆమె శరీరం కాలిపోయింది.

ఇదే సమయంలో ఇదే జిల్లాలో ఓ అన్నపై తమ్ముడు యాసిడ్‌తో దాడి చేసి మృత్యు ముఖంలోకి తోసేశాడు...అదేం దురదృష్టమో కానీ, గత ఏడాది కాలంలో రాష్ట్రం మొత్తం మీద ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనిమిది ఘటనలు ఇలాంటివి జరిగాయి. అయితే ఒక్కరిపైనా చర్య తీసుకున్న దాఖలా లేదు..

ఈ రెండు ఘటనలు జరిగి ౨౪ గంటలైనా కాలేదు.. నాంపల్లి కోర్టు సాక్షిగా అంతా చూస్తుండగానే ఓ మహిళపై మరో మహిళే దాడి చేసింది.
గతంలో యాసిడ్‌ దాడులు జరిగినప్పుడే అసెంబ్లీలో దుమారం రేగింది.. యాసిడ్‌ దాడులకు పాల్పడే వారిపై రౌడీషీట్‌ తెరిచి కఠినంగా శిక్షించేలా చట్ట సవరణకూ సర్కారు ప్రతిపాదన చేసింది. శాసనసభ ఆమోదమూ తెలిపింది కానీ, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడందే చట్టం సంపూర్ణం కాదు.. వాస్తవానికి యాసిడ్‌ అనేది మార్కెట్లో సులభంగా దొరికే సరుకైపోయింది. విచక్షణ లేకుండా ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోనైన క్షణంలో పైశాచిక ఆలోచనలు చేసే వారి వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. యాసిడ్‌ అమ్మకాలను నిషేధించాలన్న డిమాండ్‌ చాలాకాలంగా వినవస్తున్నదే.. కానీ, దాని వల్ల వాస్తవంగా కలిగే వస్తూత్పత్తి ప్రయోజనాలు దెబ్బతింటాయి. అలా అని ఇలాంటి దాడులను నిరోధించటానికి కఠినంగా వ్యవహరించకపోతే అమాయకుల జీవితాలు నాశనమవుతాయి.. ఇలాంటి దాడులకు పాల్పడేవారిపై హత్యానేరం మోపి విచారించాలన్న మహిళా సంఘాల డిమాండ్‌ను సర్కారు పరిగణించాలి.. ఒక్కరినైనా కఠినంగా శిక్షించగలిగితే.. దాని ప్రభావం మిగతావారిపై పడే అవకాశం ఉంది..


1 కామెంట్‌: