కైలాసం నుంచి అమర్‌నాథ్‌ దాకా....

ప్రకృతిలో పరమశివుడు..
అమర్‌నాథ్‌లో మంచు లింగం ఎలా ఏర్పడుతోంది?
కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్నదా? సహజంగా ఏర్పడుతోందా?
కొండ గుహలో ఒక్క చోటనే హిమ లింగం ఎలా వస్తోంది?
ప్రతి ఏడాది..
ఒకే సమయం..
ఒకే ఎత్తు..
ఒకే ఆకారంలో
శివలింగం ఏర్పడటంలో మర్మం ఏమిటి?
కైలాస పర్వతం నుంచి అమర్‌నాథ్‌కు శివుడు రావటం వాస్తవమేనా?

లయకారకుడి నిజరూపం శివలింగమేనా?

చావుకీ శివుడికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
1
ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి.. అని ఋగ్వేదం చెప్పింది. వస్తువు ఒక్కటే ఉంటుంది.. కానీ, అది అనేక పేర్లతో పిలువబడుతుంది..అని దీని అర్థం. ఈశ్వరుడు కూడా ఒక్కడే. కానీ ఆయన సహస్ర నామాంకితుడు. ఆయన త్రిమూర్తి స్వరూపుడు. సృష్టికార్యం నిర్వహించేప్పుడు ఆయన బ్రహ్మ అవుతాడు. లోకాల్ని పాలించినప్పుడు విష్ణువుగా ఉంటాడు. లయకారుడుగా మారినప్పుడు ఆయన శివుడవుతాడు. శివుడు దుష్టశక్తుల వినాశకారుడు. అందుకే ఋగ్వేదం శివుడిని రుద్రుడని సంబోధించింది. మనం త్రయంబకేశ్వరుని (రుద్రుని) పూజిస్తాం. ఆతడు పరిమళ భరితమైన ఓషధి వంటి వాడు ఆ ఓషధి మాకు బలమును కలిగిస్తున్నది. ఆతని వల్ల శ్రమ లేకుండా తొడిమ నుండి ఊడిపడిన దోసపండు వలె మృత్యువు నుంచి మేము విడిపోవుదము.''(ఋగ్వేదం).
యజుర్వేదం శివుడిని వీర యోగిగా అభివర్ణిస్తుంది. ఆయన జింకచర్మం ధరించి త్రిశూలధారియై, వీరాసనంలో కనిపిస్తాడని యజుర్వేదం చెప్తుంది. పరమేశ్వరుడి నివాస స్థానం కైలాస పర్వతం కాగా.. ప్రకృతిలో మమేకమైన పురుషుడు కాబట్టి ఆయన మనకు అనేక ప్రాంతాల్లో బహు రూపాలలో సహజసిద్ధంగా దర్శనమిస్తాడు. ప్రకృతిలోని అనేక రూపాలలో మనకు శివదర్శనం కలుగుతుంటుంది. మానస సరోవరం సమీపంలోని కైలాసంతో పాటు, గంగోత్రి సమీపంలో మరో కైలాస శిఖరం ఉంది. అంతే కాకుండా హిమాచల్‌ ప్రదేశ్‌లో కిన్నెర కైలాసం, బద్రీనాథ్‌లో నీలకంఠ శిఖరం, నేపాల్‌లోని ధౌలగిరి, బెంగుళూరులో నంది కొండలు.. ఇవన్నీ ఈశ్వర స్వరూపాలే.
అంతే కాకుండా టిబెట్‌లోని కైలాస్‌ ప్రభాత్‌ సమీపంలో పార్వతి కుండ్‌, కేదార్‌నాథ్‌లోని గౌరి కుండ్‌, గర్‌వాల్‌ దగ్గర కేదార్‌ తాళ్‌ సరస్సులు, కులు వాలీ మీదుగా ప్రవహించే పార్వతి నది, గంగోత్రి పట్టణంలోని కేదార్‌ గంగ, గర్‌వాల్‌లోని రుద్రప్రయాగ నది ప్రకృతిలోని మహాదేవుని రూపాలు.
కుమావ్‌ ప్రాంతంలో పాతాళ్‌ భువనేశ్వర్‌ గుహ, మధ్యప్రదేశ్‌లోని పాచ్‌మడి లోని జఠా శంకర్‌ గుహ, మహాదేవ గుహలు కూడా శివ తేజస్సుతో ఉట్టిపడుతుంటాయి.
2
చుట్టూ ఎతె్తైన కొండలు.. కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు.. పైకి వెళు్తన్న కొద్దీ ఆక్సీజన్‌ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్‌ డీగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి.. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా అంతే సంగతులు.. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళు్తంది.. ఒకే ఒక్క మంత్రం అంతటి దుర్భర వాతావరణాన్ని సైతం సానుకూలంగా మారుస్తుంది.. అదే పంచాక్షరి.. ఓం నమఃశివాయ.. మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది.. ఏడాదిలో కేవలం 45రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది..ఎందుకీ ఆరాటం? అమర్‌నాథ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అసలు మంచు లింగం ఏర్పడటం, కరిగిపోవటం ఎలా జరుగుతోంది.. జ్యోతిర్లింగం అని చెప్పుకునే అమర్‌నాథుడు కొన్ని రోజులు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు? అమర్‌నాథ్‌లో పరమేశ్వరుని ఉనికి ఏమిటి?
3
జూలై మాసం వచ్చిందంటే అమర్‌నాథ్‌కు భక్తుల యాత్ర మొదలవుతుంది.. ప్రపంచంలోనే అతి కష్టమైంది.. తిరిగి వస్తామో, రామో అన్నంత కఠినమైన ట్రెకింగ్‌.. ఇరుకైన దారి... ఇరుపక్కలా లోయలు.. కళు్ల తెరిస్తే గిర్రున తిరిగి ఎక్కడ పడిపోతామో అన్నంత భయం.. తెరవకపోతే ఎలా వెళు్తన్నామో తెలియని అయోమయం.. ఒక్క మాటలో చెప్పాలంటే.. మన వెనకే మృత్యువు నడుస్తుంటే... దాని బారిన పడకుండా వెళ్లటమే అమర్‌నాథ్‌ యాత్ర...
కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు కేవలం 145 కిలోమీటర్ల దూరం..కానీ, ఎత్తులో మాత్రం ఎవరికీ అందనంత..... సముద్రమట్టానికి అక్షరాలా 13, 700 అడుగుల హైట్‌లో అమర్‌నాథ్‌ గు„హ ఉన్నది.. ఇది సాదా సీదా గుహ కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి.. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ.. ఇది మానవనిర్మితం ఎంతమాత్రం కాదు..
ప్రతి ఏటా జూలై నుంచి ఆగస్టు చివరి వరకు అమర్‌నాథ్‌ గుహలో శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. కేవలం 45రోజులు మాత్రమే ఈ శివలింగం కనిపిస్తుంది. ఆ తరువాత క్రమంగా కరిగి, కరిగి అంతర్థానమవుతుంది.. ఈ శివలింగం సగటు మనిషి ఎత్తులో ఏర్పడుతుంది.. జాగ్రత్తగా పరికిస్తే మనిషి ఆకారం ఇందులో గోచరిస్తుంది కూడా..
అమర్‌నాథ్‌ గుహలో సహజంగా ఏర్పడే జ్యోతిర్లింగంతో పాటు, మరో రెండు చిన్న మంచు మూర్తులు కూడా కనిపిస్తాయి.. వీటిని పార్వతి, గణపతులంటూ భక్తులు కొలుస్తారు.. విచిత్రమేమంటే ఈ మూర్తులకు ప్రత్యేక ఆకారాలు ఉండవు.. మంచు ముక్కల్లా మాత్రమే కనిపిస్తాయి. కాకపోతే.. మహాదేవుని లింగరూపం ఏర్పడిన సమయంలో మాత్రమే ఈ రెండు మంచు మూర్తులు కనిపిస్తాయి. ఆ తరువాత ఇవీ ఉండవు..
ఏడాదిలో రెండు మాసాలు మాత్రమే తెరిచి ఉండే ఈ గుహకు వ్యయప్రయాలకు ఓర్చి భక్తులు వేల సంఖ్యలో వెళ్తారు.. ఇది మామూలు ప్రయాణం కాదు.. ఇంత కష్టపడి అంత దూరం వెళ్లటానికి ఎవరూ సంకోచించకపోవటం విచిత్రం.. ఓ పక్క జారిపడితే ఆనవాళు్ల సైతం చిక్కనంత లోతైన లోయలు.. మరోపక్క ఊపిరితిత్తులు బిగిసిపోయేలా ఆక్సీజన్‌ లేకపోవటం...సన్నటి దారులు.. గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం.. అయినా భక్తులు ఆగిపోరు.. వాళు్ల ముందు వెళు్తంటారు..చావు వాళ్ల వెంటే వస్తూందా అనిపిస్తుంది.. మనం ఒక సెకన్‌ తప్పటడుగు వేస్తే అది వాళ్లను దాటి మింగేస్తుంది.. ఇంత టెన్షన్‌లోనూ అమర్‌నాథ్‌ యాత్రకు అపూర్వంగా వెళు్తంటారు భక్తులు..
4
ఎందుకింత క్రేజి.. ప్రమాదమని తెలిసినా ఎందుకీ యాత్ర.. పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నా ఎందుకీ డిమాండ్‌.. అమర్‌నాథ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అసలు మంచు శివలింగం ఎలా ఏర్పడుతోంది.. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి?
పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అమర్‌నాథ్‌ ఒకటి.. సాధారణంగా ఎక్కడైనా ఈశ్వరుడు స్వయంభువుగా వెలిస్తే ఒకేసారి అవతరిస్తాడు.. కానీ, అమర్‌నాథ్‌లో ప్రతి ఏటా ప్రత్యేకంగా స్వయం వ్యక్తమవుతున్నాడు.. అంటే ఏర్పడుతున్నాడు.. అదీ మంచుతో.. శివలింగ రూపంలో.. ఇది ఎలా సాధ్యమవుతోంది..?
అమర్‌నాథ్‌ గుహ ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది.. ఆ సమయంలో మైనస్‌ అయిదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.. గుహను చేరుకోవటం అసాధ్యం... జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది.. మంచు విచ్చుకుంటుంది.. గుహ స్పష్టంగా కనిపిస్తుంది.. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది.. అందువల్లే 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది..
విచిత్రమేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది.. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుందన్నది ప్రశ్న.. సంవత్సరమంతా గడ్డకట్టుకుపోయిన అమర్‌నాథ్‌ గుహ క్రమంగా తేటపడుతున్న సమయంలో జ్యోతిర్లింగం ఏర్పడే చోట గుహ పైభాగం నుంచి ఒక్కొక్కటిగా నీటి చుక్క కింద పడుతూ ఉంటుంది.. సుమారు 45 రోజుల పాటు ఈ నీటిబొట్లు పడుతూనే ఉంటాయి.. ఈ నీటి బొట్లు క్రమంగా మంచుగా మారి, లింగరూపంగా ట్రాన్‌‌సఫామ్‌ చెందుతాయి.
భక్తులు ఈశ్వరుని సందర్శించుకునే 45 రోజులు కూడా నీటి బిందువులు పడుతూనే ఉంటాయి. అయితే శివలింగం గుహ పై భాగాన్ని తాకి ఉండటం వల్ల అవి మామూలుగా కనిపించవు.
భక్తులు చూసే 45 రోజుల తరువాత గుహను మంచు పూర్తిగా కప్పేసినప్పటికీ, శివలింగం ఉండాల్సిన ప్రాంతం నుంచి ఒకరకమైన తేజస్సు స్పష్టంగా కనిపిస్తుందని భక్తులను గుహదాకా తీసుకువచ్చి, మళ్లీ కిందకు తీసుకువెళ్లే స్థానికులు అంటారు.. అందుకే దాన్ని జ్యోతిర్లింగమని చెప్తారు.
5
అమర్‌నాథ్‌లో జ్యోతిర్లింగం మామూలుగా ఏర్పడుతున్నదేనా? లేదా నిజంగానే శివుడు కైలాసం నుంచి దిగి వచ్చి రెండు మాసాల పాటు భక్తులకు కనువిందు చేస్తున్నాడా? దేవుడే ఒక మిథ్‌ అని భావించే వాళు్ల కొల్లలుగా ఉన్నప్పుడు ఇక కైలాసం నుంచి శివుడు రావడమేమిటని అనుకుంటున్నారా? మరదే విచిత్రమంటే..
పరమేశ్వరుడు కైలాసం నుంచి అమర్‌నాథ్‌కు ప్రతి ఏటా బయలు దేరి వస్తున్నాడట.. ? విస్తు పోకండి.. ఆశ్చర్యం అసలే అక్కర్లేదు.. అర్థం లేని ఈ వాదన ఏమిటని నిలదీయకండి..పరమేశ్వరుడు ఈ భూమ్మీదే నడయాడుతున్నాడని అమర్‌నాథ్‌ ప్రజల విశ్వాసం.. హిమాలయాల్లో మరింత ఎతె్తైన కైలాస పర్వతంపైనే మహాదేవుడు ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన అమర్‌నాథ్‌కు తన మందీ మార్బలంతో తరలి వచ్చాడట. మార్గమధ్యంలో ఆయన ఎక్కడెక్కడ ఆగిందీ, ఏం చేసిందీ కూడా వీళు్ల వివరిస్తారు..
మృత్యువు గురించి పార్వతీదేవికి వచ్చిన సందేహాన్ని తీర్చేందుకు శివుడు ఆమెను అమర్‌నాథ్‌కు తీసుకువచ్చాడు.. ఈ దారి కైలాస్‌ మానస్‌ సరోవర్‌ నుంచి నేపాల్‌ మీదుగా కాశ్మీర్‌లోకి ప్రవేశించి అమర్‌నాథ్‌ దగ్గర ముగుస్తుంది.
కైలాసం నుంచి బయలు దేరిన శివుడు దారిలో బైల్‌గావ్‌ దగ్గర తన వాహనాన్ని అదే నందీశ్వరుని వదిలేశాడట.. ఈ బైల్‌గావే.. కాశ్మీర్‌లో ఇవాళ ఉన్న పహల్‌గామ్‌. ఆ తరువాత మరికొంత దూరంలో చందన్‌ వాడి దగ్గర చంద్రుని, మహాగణేశ్‌ గుహ దగ్గర గణపతిని విడిచిపెట్టాడు.. అక్కడి నుంచి అమర్‌నాథ్‌ దగ్గరలోని పంచతరణి ప్రాంతాల్లో పంచభూతాలను వదిలేశాడు. ఈ ప్రాంతాలన్నీ ఇప్పటికీ పవిత్ర శివ క్షేత్రాలుగా ఉన్నాయి.
అమర్‌నాథ్‌ గుహలోనే పార్వతీదేవికి మృత్యురహస్యం చెప్పాడని స్థానిక కథనం.. ఇదంతా పుక్కిటి పురాణంగా కొందరు కొట్టి పారేయవచ్చు. కానీ, ఇక్కడ టెక్నికల్‌ లాజిక్‌ ఉంది.. అమర్‌నాథ్‌ గుహ 13,700 అడుగుల ఎత్తున ఉంది. ఇరుకుదారిలో ప్రాణంతో చెలగాటమాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి.. ఊపిరి తిత్తులకు ఆక్సీజన్‌ సక్రమంగా అందదు.. మృత్యు బాధ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్లిన వారికి ఈజీగా అర్థమైపోతుంది.. పార్వతికి, శివుడు మృత్యురహస్యం చెప్పాడన్న కథలోని అంతరార్థం ఇదే.
భక్తులు ఒక్కసారి గుహ దగ్గరకు చేరుకున్నాక కూల్‌ అయిపోతారు. అక్కడి వాతావరణం అలాంటిది.. మంచులింగం ఒకవిధంగా భక్తులను మెస్మరైజ్‌ చేస్తుంది.. జీవితంలో చాలా కష్టమైన దారిలోనే సక్సెస్‌ఫుల్‌గా వెళ్లిన తరువాత మిగతా దారులన్నీ చిన్నగానే కనిపించేలా సైకలాజికల్‌ అనుభూతిని కలిగిస్తుంది.
మరి ఇంతటి అనుగ్రహాన్నిచ్చే మహాదేవునికి ఆగ్రహం ఎందుకు వచ్చింది.. ముక్కంటి తన మూడో కంటిని ఎందుకు తెరుస్తున్నాడు..భక్తులను ఆదరించకుండానే ఎందుకు అంతర్థానమైపోతున్నాడు?
ఏదైనా ఒక పని చేయాలంటే దానికి కొన్ని పద్ధతులుంటాయి... ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే దానికి కొన్ని మార్గాలుంటాయి.. ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటే గమ్యం చేరుకుంటారే కానీ, లక్ష్యం నెరవేరదు.. అమర్‌నాథ్‌ విషయంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఇలాంటిదే..
అమర్‌నాథ్‌ గుహ సముద్ర మట్టానికి చాలా ఎతె్తైన ప్రాంతంలో ఉంది. ఉష్ణోగ్రత పూర్తిగా మైనస్‌ డిగ్రీల్లో ఉంటుంది. దర్శనం చేసుకోవలసిన ఈశ్వరుడూ మంచు రూపంలో ఉంటాడు.. అలాంటి చోటికి హెలికాప్టర్‌లలో వెళ్లటం, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవటం అక్కడి వాతావరణాన్ని పూర్తిగా చెడగొడుతోంది.. చల్లగా ఉండాల్సిన చోటును వేడిమయం చేస్తోంది. చలిగా ఉండాల్సిన ప్రాంతంలో వెచ్చదనాన్ని కృత్రిమంగా సృష్టిస్తోంది.
ప్రశాంతంగా ఉన్న అమర్‌నాథ్‌ గుహకూ గ్లోబల్‌ వార్మింగ్‌ అంటుకునే ప్రమాదం మన వాళ్ల వల్లే ఏర్పడుతోంది.. దీనికి తోడు గుహలోకి పూలు, పండ్లు విసిరేయటం, వేలాది అగర్‌బత్తీలు వెలిగించటం అక్కడి విధానానికి వ్యతిరేకం..
ఏదైనా సరే ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే, ఆది విపత్తు సృష్టిస్తుంది.. అమర్‌నాథ్‌లో 2007 నుంచి జరుగుతున్న తంతు ఇలాంటిదే.. హెలికాప్టర్లు.. ఇతర ప్రత్యామ్నాయ దారుల్లో వివివిఐపిలు ఇలా వచ్చి అలా వెళ్లేందుకు చేసిన ఏర్పాట్లు మంచు లింగం త్వరగా అంతర్థానమవటానికి కారణమైంది.. వేలాది భక్తులు అమర్‌నాథ్‌కు చేరుకోకుండానే వెనక్కి తిరిగివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది..
మంచుకొండల్లో మహాదేవుని దర్శనం సామాన్యమైంది కాదు.. ఎంతో శ్రమిస్తే తప్ప ఆయన దర్శనం లభించదు.. సహజంగా ఉన్న వ్యవస్థను అసహజంగా మారిస్తే ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. భారతదేశానికి ఉన్నవి సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదలే.. వీటికి కూడా అస్తిత్వం లేకుండా చేసుకుంటామంటే, జవాబు చెప్పేదేముంటుంది?

1 comments:

Rajya Lakshmi చెప్పారు...

santosh garu namaskaramu.
thanks for the posting. nenu idivaraku ante e post chadavaka mundu machu sivalingam prakruthi siddhanga yerpadutunnade ani anukunnanu. akkada devudu ledu ani anukunnanu. kani every year ade size, ade height lo ela yerpadutundi. its mystery. manaku kanipinchani adrusya sakshi. ade e siva lingam yerpadataniki kuda karanam.
thanks.