దేవుడికి మరణమా? అసలు ఉన్నాడో, లేడో అన్న వాదోపవాదాలు జరిగే దేవుడికి చావు ఉండటం ఏమిటి? మన వేదాల ప్రకారం పుట్టుకే లేని భగవంతునికి మృత్యువు ఎక్కడిది..? చావు పుట్టుకలకు అతీతమైన దేవుడు శరీరాన్ని త్యాగం చేస్తాడా? ఆ శరీరానికి అంత్యక్రియలు జరుగుతాయా? అదీ మనుషులు అంతిమ సంస్కారం చేస్తారా? ఇది వింతా? విచిత్రమా? విడ్డూరమా? లేక వాస్తవమా?
అవును.. ఇది నిజం... ఈ భూమ్మీదే జరుగుతోంది. మన దేశంలోనే జరుగుతోంది.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దేవుడికి జరుగుతున్న కార్యక్రమం ఇది.. మనుషులే చేస్తున్న అద్భుతమైన సంస్కారం ఇది. ఎందుకిలా చేస్తారు? దేవుడికి పార్థివ శరీరం ఉండటం ఎలా సాధ్యపడుతుంది? అంటే దేవుడు ఉన్నాడన్నది వాస్తవమేనా? కేవలం విశ్వాసం కాదా?
మన పురాణాల ప్రకారం దేవుడు నిరాకారుడు.. అంటే ఆకారం అంటూ లేని వాడు.. అందుకే మన వాళు్ల భూమిని కొలుస్తారు.. ఆకాశాన్ని కొలుస్తారు.. రాయి, రప్పను కొలుస్తారు.. పామును కొలుస్తారు.. గోవును కొలుస్తారు.. ఒక ఇటుకకు పసుపు కుంకుమ పెట్టి దాన్ని దేవతగా కొలుస్తారు.. దేనికీ ఆకారమే ఉండదు.. తమకు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపంలో దేవుళ్లను కొలుస్తారు..
మరి ఓ స్పెసిఫిక్ ఆకారమే లేని దేవుడికి శరీరం మాత్రం ఎలా ఉంటుంది? అదే దేవ రహస్యం.. దేవుడికి రూపం అనేది ఓ పదార్థం. అంటే మెటీరియల్.. ఈ మెటీరియల్ లోపల ఉండే చైతన్యమే దైవత్వం అని మనవారి గాఢ విశ్వాసం..
సైన్‌స ఎప్పుడూ మెటీరియలిస్టిక్‌గా ఆలోచిస్తుంది.. ఇదిగో ఈ దేవుడు ఆ మెటీరియల్ ఏమిటో మనకు చూపిస్తున్నాడు.. దాని రహస్యాన్ని వివరిస్తున్నాడు. మెటీరియల్‌లో చైతన్యం ఎలా ఉంటుందో.. ఆ చైతన్యం లేనప్పుడు ఎలా నిర్జీవంగా మారుతుందో రుజువు చేస్తున్నాడు..
మనం బట్టల్ని మార్చినట్లు ఈ దేవుడు తరచూ తన శరీరాన్ని మార్చేస్తున్నాడు..ఇది మన కళ్ల ముందు జరుగుతున్న ప్రక్రియ.. ప్రజలు ఒక పండుగలాగా చేసుకునే అద్భుతమైన కార్యక్రమం ఇది.. ఇదెలా జరుగుతోంది?
2
పూరీ జగన్నాథుడు.. అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రథయాత్ర... ప్రపంచంలో మరెక్కడా లేని అతి పెద్ద రథయాత్ర... లక్షలాది ప్రజలు అతి పెద్ద రథాలను లాగే అపురూప ఉత్సవం.. ప్రతి ఏడాది ప్రపంచంలోని లక్షలాది ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూసే వేడుక... కానీ, రథయాత్రను మించిన ఎన్నో ప్రత్యేకతలు మనకు ఇక్కడ కనిపిస్తాయి... అందులో ఒకటి జగన్నాథుడు తన శరీరాన్ని విడిచిపెట్టడం..
పూరీలో జగన్నాథ రథచక్రాలు మరోసారి కదిలాయి..
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు మూడు రథాలపై పూరీలో తిరుగుతున్నారు..
ఈ రథయాత్రను చూసేందుకే లక్షలాది ప్రజలు తరలి వస్తారు.
రోజుల తరబడి వేచి చూస్తారు..
రథాన్ని లాగడానికి ఉత్సాహపడతారు..
మూడు కిలోమీటర్ల పొడవైన తాడును ఎన్ని వేల మంది లాగుతారో మీరే ఊహించుకోండి...
మామూలుగా దేవుళ్లకు రథోత్సవం జరుగుతుంది. కానీ, రథంలో ఊరేగే దేవుడు ఉత్సవ మూర్తే...
కానీ, పూరీలో సాక్షాత్తూ మూల విరాట్టే వీధిలోకి వచ్చి రథంపై కూర్చొని ఊరేగుతాడు..
ఇది విచిత్రం ఏం కాదు.. ఇక్కడి ప్రత్యేకతే అది..
గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు మూర్తులను కదిలించి బయటకు తీసుకువచ్చి రథంపై కూర్చోబెట్టి పది రోజుల పాటు రథయాత్ర నిర్వహించటం ఇక్కడ మాత్రమే కనిపించే సంప్రదాయం..
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఊరేగే రథాలు ఏ యేటికాయేడు కొత్తగా తయారు చేసేవే. ఒకసారి ఉపయోగించిన రథాన్ని మళ్లీ ఉపయోగించరు.. పోనీ ఆ రథం మామూలుగా ఉంటుందా అంటీ అదీ లేదు.. ఒక్క జగన్నాథుడి రథమే 45 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏకంగా పదహారు రథచక్రాలు ఉంటాయి. ఇది నందఘోష రథం. ఇక బలభద్రుడి రథం ఒక అడుగు తక్కువ ఉంటుంది. ఇదీ 14 రథచక్రాలతో నడుస్తుంది. మూడోరథం ఇంకో అడుగు తక్కువతో తయారు చేస్తారు.. ఇవన్నీ పూర్తిగా కలపతో చేసినవే.. ప్రత్యేకంగా పెంచిన చెట్ల కలపను వాడి తయారు చేసినవే.
ప్రతి ఏడూ కొత్త రథాన్ని తయారు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు.. అంత ఈజీ కూడా కాదు.. కానీ, పూరీలో మాత్రం ఇది సాధ్యమవుతోంది. వందల సంవత్సరాలుగా ఈ రథయాత్ర ఆగకుండా సాగుతోంది..
3
రథయాత్ర ఓకే.. చాలా గొప్పగా జరుగుతుంది.. యాత్ర పూర్తి కాగానే రథాల్ని పూర్తిగా ఏ భాగానికి ఆ భాగం విడగొడతారు.. మళ్లీ ఏడాది కాగానే కొత్త రథాలు తయారవుతాయి. పూరీలో ఇదొక్కటే విచిత్రం కాదు.. ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవం దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది.. ఇక్కడి జగన్నాథుడు మనలో ఒకరుగానే ఉన్నట్లుగా ఇక్కడి ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగమేనా అంతిమ సంస్కారం.. ? ఇదేం విడ్డూరం?
ప్రపంచంలో పూరీలోని ఆలయమే ఒక విచిత్రమైన ఆలయం.. సాధారణంగా ఆలయాల్లో లక్ష్మీ నారాయణులో, సీతారాములో, శ్రీనివాస పద్మావతులో, శివ పార్వతులో ఇలా జంటలుగానే దేవతా మూర్తులు కనిపిస్తారు.. కానీ, పూరీలోని ఆలయంలో అన్నా చెల్లెళు్ల ఉంటారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, వాళ్ల చెల్లెలు సుభద్రలు ఇక్కడ ప్రధాన దేవతలు. ఈ మూల విగ్రహాలను సైతం కలపతోనే తయారు చేస్తారు..
ఇక్కడ ఇంకో విచిత్రమూ ఉంది..ఇక్కడ కనిపించే జగన్నాథ స్వామి మొండి చేతుల వాడు.. ఈ మూర్తికి చేతులు పూర్తిగా ఉండవు. ఈ విగ్రహాన్ని తొలిసారి విశ్వకర్మ రూపొందిస్తున్నప్పుడు ఒరిస్సా రాజు ఇంద్రద్యుము్నడు ఆటంకం కలిగించటం వల్ల విగ్రహం పూర్తి కాకుండానే విశ్వకర్మ వెళ్లిపోయాడట.. అప్పటి నుంచీ జగన్నాథ స్వామి మొండి చేతుల వాడిగానే భక్తులకు దర్శనమిస్తున్నాడు.
స్వామి వారి విగ్రహమైనా సాధారణంగా ఉంటుందా అంటే అదీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటుంది.. పెద్ద పెద్ద గుండ్రని కళు్ల జగన్నాథుడికి ఉంటే, బలభద్రుడికేమో ఓవెల్‌షేప్‌లో కళు్ల ఉంటాయి. వీటికి కింది నుంచే కాస్తంత ఉన్న మొండి చేతులు ఉంటాయి. విగ్రహాన్ని చూడగానే ప్రత్యేక ఆసక్తి కలుగుతుంది.
వీటన్నింటినీ ఓ ప్రత్యేకమైన కలపతోనే తయారు చేస్తారు.. వీటికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది.. మరి అలాంటి విగ్రహాలకు కాలనుగుణంగా కొన్ని నియమిత సంవత్సరాలకు అంతిమ సంస్కారం జరగటం వెనుక పెద్ద రహస్యమే దాగి ఉంది.. అదే పూరీలోని పరమ అద్భుతమైన విశేషం...
4
ఇంతటి విశిష్ఠత కలిగిన జగద్గురువుకు అంతిమ సంస్కారం చేయటం ఏమిటి? ఇలాంటి విశేషమైన ఉత్సవం అన్నది ప్రపంచంలో పూరీలో తప్ప మరెక్కడా జరగదు.. ఇది అంతిమ సంస్కారం కాదు.. కొత్త శరీరంలోకి భగవంతుడు మారటం.. అవును.. జగన్నాథుడు పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడు.. అదే పూరీలో జరిగే నవ కళేవర ఉత్సవం...
మనం మాసిన బట్టలను వదిలేసి ఉతికిన బట్టలను రోజూ మార్చుకుంటాం.. పూరీలో జగన్నాథుడు పాత శరీరాన్ని విడిచిపెట్టి, సరికొత్త శరీరాన్ని ధరిస్తాడు.. దీన్ని నవ కళేవర ఉత్సవంగా పిలుస్తారు.. ఇది దాదాపు రెండు మాసాల పాటు సాగే అతి పెద్ద కార్యక్రమం..
ఖగోళ శాస్త్రం పద్ధతులను అనుసరించి ప్రతి 8, 11, 19 సంవత్సరాలకు ఒకసారి పూరీ జగన్నాథుడికి నవ కళేవర ఉత్సవాన్ని నిర్వహిస్తారు.. ఇది అంత ఈజీగా జరిగే తంతు కాదు.. మూల విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠించటం.. ఇందుకోసం చాలా పెద్ద కసరత్తే చేస్తారు...విగ్రహాల తయారీ అత్యంత రహస్యంగా నిర్వహిస్తారు..
నవ కళేవర ఉత్సవాలు ప్రారంభం కాగానే ఆలయ ప్రధానార్చక కుటుంబీకులు పూరీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కకట్‌పూర్‌కు వెళ్తారు.. అక్కడ ప్రాచీ నదిలో స్నానం చేసి పక్కనే ఉన్న మంగళాదేవి ఆలయంలోకి వెళ్లి అక్కడే నిద్రిస్తారు.. అమ్మవారు వారి కలలో కనిపించి జగన్నాథ స్వామి వారి విగ్రహానికి కావలసిన చెట్టు ఎక్కడుందో చెప్తుంది..
పూజారులు అక్కడి నుంచి అమ్మవారు చెప్పిన దిశలో కాలినడకన బయలు దేరి వెళ్తారు.. కొన్ని ప్రత్యేకతలు కలిగిన వేప వృక్షాలను కనుగొంటారు..
ఈ చెట్లకు ఖచ్చితమైన గుర్తులు కనిపించి తీరాలి..
జగన్నాథుడి విగ్రహం తయారు కావలసిన చెట్టు కాండంపై సుదర్శన చక్రం గుర్తు...
బలభద్రుడి విగ్రహ తయారీకి వాడే చెట్టుపై గద గుర్తు
సుభద్ర విగ్రహం కోసం వినియోగించే చెట్టుపై కమలం గుర్తు
ఆ చెట్ల నీడలో విషపాములు కనిపించాలి
దగ్గరలో తప్పనిసరిగా ఓ చింత చెట్టు ఉండాలి...
విగ్రహాల తయారీకి ఉపయోగించే చెట్టు కాండం నిటారుగా పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తుకు ఎదిగి ఉండాలి..
కాండం నాలుగు నుంచి ఏడు భాగాలుగా విస్తరించి ఉండాలి
చెట్లకు సమీపంలో ఒక స్మశానం, నీటి వనరు, శివాలయం ఉండి తీరాలి.
ఇన్ని రకాలుగా అన్నీ కుదిరిన తరువాత ఎంపిక చేసుకున్న చెట్లకు పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు.. ఆ తరువాత ఆ చెట్లను కొట్టేస్తారు.. వాటిని చెక్కతో తయారు చేసిన బండ్లపై ఎక్కించి పూరీ ఆలయానికి తీసుకువస్తారు.. ఉత్తర ద్వారం గుండా వాటిని ఆలయంలోకి తీసుకెళ్లి కోయిల్ వైకుంఠం ప్రాంగణంలో ఉంచుతారు.. అక్కడే విగ్రహాల తయారీ జరుగుతుంది. ఇది అత్యంత రహస్యంగా జరుగుతుంది.. సదరు శిల్పికి తప్ప ఎవరికీ అనుమతి ఉండదు.. చైత్ర మాసంలో మొదలయి, సరిగ్గా ఆషాఢ శుద్ధ చతుర్థి నాటికి విగ్రహాల తయారీ పూర్తవుతుంది.
అదే రోజు రాత్రి బ్రహ్మ ముహూర్తంలో పాత విగ్రహాలలోపల ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉన్న బ్రహ్మ పదార్థాన్ని ప్రధాన పూజారి కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు.. దీంతో కొత్త విగ్రహాలకు చైతన్యం వస్తుంది. ఈ పదార్థాన్ని ఆ ముగ్గురు దేవతల అస్థికలని కొందరంటారు..మరికొందరు సాలగ్రామాలని పిలుస్తారు.. బౌద్ధులు బుద్ధుడి పన్ను అంటారు..శ్రీకృష్ణుడి నిర్యాణానంతరం ఆయన అస్థికను ఈ విగ్రహాల్లో ఉంచారట.. అదే విధంగా సముద్రంలో శరీర త్యాగం చేసిన బలరాముడు, సుభద్రల అస్థికలనూ ఇందులో ఉంచారట.. వీటిని మారుస్తున్నప్పుడు పూజారి సైతం కళ్లకు గంతలు కట్టుకుంటారు..
కొత్త విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత పాత విగ్రహాలను అత్యంత శాసో్తక్త్రంగా గుడిలోనే కోయిల్ వైకుంఠం అన్న ప్రాంగణంలో ఖననం చేస్తారు.. ఇక్కడ స్వామి తన పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి ప్రవేశించాడు..ఇది దేవుడికి మరణం కాదు.. జీవుడు తన దేహాన్ని మార్చుకోవటమే ఈ నవకళేవరలోని ప్రధాన అంశం.. ఇప్పటి వరకు 17సార్లు పూరీలో నవ కళేవర కార్యక్రమం జరిగింది. చివరి సారి 1996లో జరిగింది. రథయాత్ర కంటే ఈ కార్యక్రమానికి లెక్కించలేనంత మంది భక్తులు హాజరవుతారు.. శరీరంలో జీవుడు ప్రవేశించి, ఆ తరువాత బయటకు వచ్చి మరో శరీరంలో ఎలా ప్రవేశిస్తాడో.. జగద్గురువు ఇక్కడ బోధిస్తున్నాడు.. పునరపి జననం.. పునరపి మరణం లోని రహస్యార్థం ఇదే. ఆయన రథంపై స్థిరంగా కూర్చుని తిరగడం కూడా ఇలాంటిదే.. జీవుడిలోపల గూడు కట్టుకుని ఉండిపోయి, అతనికి మార్గదర్శనం చేస్తున్నాడు.. రాముడు తానుగా చేసి చూపించాడు.. కృష్ణుడు చెప్పి చేయించాడు.. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు.. పూరీలో ఆయన చూపించిందీ, చూపిస్తున్నదీ అంతా జీవ రహస్యమే.. కృష్ణం వందే జగద్గురుమ్.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)











3 comments:
దేహత్యాగం/పార్దివశరీరం అనే పదాలు దారు నిర్మిత విగ్రహాలకు ఉపయోగించారు.కానీ ఇది తప్పు.నవకళేబర అని వ్రాయాలి.ఇందులో జీవుని దేహంలోని నవ-అవరణలకు ప్రతీకలు.దసరా లోని పూజకూ+దీనికీ అవినాభావ సంభందమున్నది.పాటకులచేత చదివించే ఉద్దేశ్యంలో మీరు ఇల్లాంటి హెడ్డింగ్స్ ఉపయోగించరాదు.మీ సైన్స్ ప్రకారం "గాలి"ఎందుకు మనకు కనిపించదో ,సర్రిగ్గా దేముడుకూడా అదేవిధంగా మనకు కనిపించడు.అయన మనకు కనిపించాలి అనుకున్నాప్పుడు అణుసమ్మిశ్రితం జరిగి రూపం గోచరం అవుతుంది.అందుకే అన్నమయ్య "ఎంతమాత్రమున నెవ్వరు తలచిన అంతమాత్రమే నీవు"అంటాడు .దేవుని అవతారం పూర్తికావడాన్ని'పరి'అంటారు.అంటే తిరిగి రావడానికి నిర్దేశించిన క్రియ అని అర్ధం.అందుకే "పరిసమాప్తి"/పరిత్యాగం అనే మాటలను మాత్రమే వాడాలి.నిర్యాణం అనే పదాన్ని కూడా వాడరాదు.మీ పోస్ట్ సమాచారం బాఉంది--జయదేవ్.చల్లా,చెన్నై-౧౭
జయదేవ్ గారు.. మీ పరిశీలన వాస్తవమే.. కేవలం పాఠకుల చేత చదివింప చేసేందుకే ఇలాంటి పదాల్ని వాడాల్సి వచ్చింది.. తెలుగులో కనీస పదజాల పరిజ్ఞానం కూడా లేని ఈ తరానికి మనం చెప్పాల్సిన విషయాన్ని వారికి కనీసం అవగాహన అయ్యేలా చెప్పటమే ప్రధానంగా భావించాను. అందుకే ఇలా రాయాల్సి వచ్చింది. మీడియాలో నేను ఇలాంటివి చాలా అనుభవించాను.. తెలుగు హాస్యానికి చిరునామా బ్రహ్మానందం అంటే న్యూస్ రీడర్‌కు అర్థం కాకపోతే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అని మార్చి రాసిన పరిస్థితి.. భగవంతుడి ఎదుట తప్పు చేయరాదు.. ఇలాంటి పదాలను వాడటం కంటే నవకళేబర ఉత్సవాన్ని గురించి ఈ తరానికి తెలియచేయటం నా ఉద్దేశ్యం.. మీకు చాలా చాలా ధన్యవాదాలు
సంతోష్ కుమార్ గారు...
అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయాల పట్ల ప్రత్యేక ఆసక్తికి కనబరిచి, వివిధ సాంప్రదాయాల వెఉకగల శస్త్రీయ కారణాలను విశ్లేషిస్తూ సాగిన మీ కధనం చాలా బాగుంది. మీ ప్రయత్నం అభినందనీయం. ఇలాంటి ప్రత్యేకమయిన పోస్టులు మీ నుంచి మరిన్ని రావాలని కోరుకుంటూ....
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి