ఒక్క ప్రదేశంలో కేవలం మూడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 60 కోట్ల పవిత్ర మందిరాలు ఉన్నాయి.. అదీ మన దేశంలో.. మన కళ్ల ముందు ఉన్నాయి.. రోజూ వేలాది ప్రజలు ఈ ప్రాంతాల్ని సందర్శించుకుని వెళ్తున్నారు.. ఇదెలా సాధ్యం? ఒక్క ప్రాంతంలో కొద్ది పాటి నేలలో ఇన్ని కోట్ల పవిత్ర ప్రదేశాలు ఎలా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? వీటిని ఎవరు ఐడెంటిఫై చేశారు..? ఏ కాలం నాటివీ ప్రదేశాలు? ఎలా అయ్యాయి పవిత్ర ప్రాంతాలు?
అక్కడ ప్రపంచం మోకరిల్లుతుంది.. భక్తి భావన పొంగిపొర్లుతుంది.. రాసలీలలు మనసుల్ని తన్మయం చేస్తాయి. ప్రతి అడుగూ అక్కడ పవిత్రమే..ప్రతి లోగిలీ మందిరమే..గాలీ, ధూళీ..చెట్టూ, చేమా..ఆటాపాటా..అంతా భక్తిమయం..అణువణువునా స్వామి విగ్రహారాధన..ఎన్నని చూస్తారు?..ఎటువైపని చూస్తారు?..ఎన్నని లెక్కిస్తారు?..ఎన్ని మొక్కులిస్తారు?..ఎంత ఆరాధన చేస్తారు?..దేవుడు సర్వాంతర్యామి అన్న పదానికి అర్థం ఆ ప్రాంతం. మధుర భక్తికి పుట్టినిల్లు. రాసలీలలకు రసపట్టు. ప్రేమకు పెట్టినిల్లు 6౦ కోట్ల కృష్ణ భక్తి సామ్రాజ్యం. బృందావనం. శ్రీకృష్ణ బృందావనం. రాధాకృష్ణ బృందావనం. జయదేవుని బృందావనం.
..1..
అయిదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు నడిచిన ప్రాంతం ఇవాళ భక్తి సామ్రాజ్యంగా వెలుగుతోంది. ఆయన పుట్టిన మధుర, పెరిగిన గోకులం, ఆడుకున్న బృందావనం, ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ప్రాంతంగా రికార్డు సృష్టించింది. ఈ ప్రాంతం అంతటా చిన్నవీ పెద్దవీ కలిపి అరవై కోట్ల పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని మధుర. ఢిల్లీకి ఆగ్నేయంగా 145 కిలోమీటర్ల దూరం... ఆగ్రాకు వాయద్య దిశలో 45 కిలోమీటర్ల దూరం.... జగన్నాథుడి జన్మభూమి. యమునానదీ తీరంలో శ్రీకృష్ణుడు జన్మించిన మధురపై ఇప్పుడు ప్రపంచం కన్నుపడింది.. సంచలనం రేగుతోంది.. ఒకటా రెండా.. ఊహించని విధంగా, కన్నుల పండువగా కోట్లాది పవిత్ర ప్రదేశాలు ఎలా వచ్చాయి.. ఇన్ని వేల, లక్షల భక్తి క్షేత్రాలు ఒక్కదగ్గర ఉండటం సాధ్యమా?
యమున నదికి ఈస్టూ, వెస్టూ అంతటా కృష్ణ భక్తి సామ్రాజ్యం విస్తరించి ఉంది. గోకులం, మహావనం, బలదేవ్ మఠ్, బజ్న, బృందావనం, గోవర్థన్, కుసుమ సరోవర్, వర్సానా, నందగావ్, మథుర... అమ్మో ఇది ఆషామాషీ కాదు.. పేర్లు చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఆలయాలు కనిపిస్తాయి..
ఒక్క బృందావనంలోనే మట్టి రేణువు కూడా ఒక ఆలయంగా కనిపిస్తుంది.. మధుర ఒక సాధారణ నగరం.. అందులో బృందావనం ఒక భాగమే.. కానీ, ఇక్కడ దేవుడి ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఎన్నటికీ బృందావనాన్ని విడిచి వెళ్లేది లేదని శ్రీకృష్ణుడు చెప్పాడట. అందుకేనేమో... బృందావనంలో అడుగు పెట్టింది మొదలు తుదకంటా అడుగడుగునా శ్రీకృష్ణుడి స్పర్శ తగులుతున్నట్లుగా ఉంటుంది...
శ్రీకృష్ణుడి జన్మభూమి అయినా, బాల్యంలో ఆయన ఆడుకున్న ప్రాంతమయినా, మరేదైనా కానీ, ఒకటి రెండు ఆలయాలు.. కొన్ని ఆనవాళ్లు ఉంటాయి.. మిగతా భారత దేశంలో ఇలాంటివి మనం విన్నవే, కంటున్నవే.. కానీ, బృందావనంలో మాత్రం పాత కొత్త మందిరాలు అసంఖ్యాకంగా ఎలా వచ్చాయన్నది ఎవరికీ అర్థం కావటం లేదు...
ఇప్పుడు దీనిపై పెద్ద రీసర్చే జరుగుతోంది.. అంతర్జాతీయంగా ఉన్న శ్రీకృష్ణ భక్తి సంస్థలు బృందావనంపై సాధికారిక సమాచారం సేకరించాయి. కొత్త ఆలయాలను పక్కన పెట్టి దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుంచి పూజలు జరుగుతున్న ఆలయాలు, మందిరాలు, లోగిళ్ల ప్రాధాన్యం ఏమిటన్న దానిపై పెద్ద చర్చే జరుగుతున్నది.
...2..
భారత రామాయణాలను ఇప్పటికీ కేవలం కావ్యాలుగానో, ఇతిహాసాలుగానో పరిగణించటం తప్ప చరిత్రగా చెప్పుకోవటానికి మనలో మనకే బోలెడు విభేదాలు, భిన్నాభిప్రాయాలు. ఎందుకు బృందావనానికి, మధురకు ఇంత ప్రాచుర్యం? దేశంలో మిగతా ప్రాంతాలకు లేని ప్రాధాన్యం దీనికి ఎందుకు? ఎందుకంటే అక్కడ పుట్టింది కృష్ణుడు కాబట్టి.. అతని అస్తిత్వం ఇప్పటికీ స్పష్టం కాబట్టి.
భారత దేశంలో మహాభారత చరిత్ర పుక్కిటి పురాణం కాదనటానికి కృష్ణ జన్మభూమి ఖచ్చితమైన సాక్ష్యం. క్రీస్తు పుట్టడానికి చాలా కాలం ముందే భారత దేశంలో అద్భుతమైన నాగరికత అభివృద్ధికి మూలకారకుడైన జగద్గురుడు జన్మించిన ప్రదేశం మధుర. ఇది చరిత్రకారులు నిక్కచ్చిగా నిరూపించిన వాస్తవం...
మధుర శ్రీకృష్ణుడి జన్మభూమి.. క్రీస్తుపూర్వం 3228, జూలై 19న శ్రావణ శుక్ల అష్టమి నాడు మధురలో కంసుడి జైల్లో కృష్ణుడు జన్మించాడు.. ఇది ప్రపంచ చరిత్రకారులు నిర్ధారించిన టైమ్ పీరియడ్..
మధుర చుట్టు పక్కల ప్రాంతాల్లోనే కృష్ణుడు దాదాపు ముప్ఫై సంవత్సరాలు ఉన్నాడు.. ఆ తరువాత పశ్చిమం వైపు అరేబియా సముద్ర తీరంలో ద్వారక నగరాన్ని నిర్మించుకుని అక్కడ ఉన్నాడు. కృష్ణుడు పుట్టడంతోనే చావుతో పోరాడాల్సి వచ్చింది. కంసుడు చంపుతాడన్న భయంతో తండ్రి వసుదేవుడు అతణ్ణి గోకులాన్ని తరలించాడు. అక్కడ ఆయన యశోదా దేవి దగ్గర పెరిగాడు..
గోకులంలో కృష్ణుడు ఉన్నది ౩ సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే. ఈ లోగానే ఆయనపై పలు మార్లు హత్యాయత్నం జరిగింది. కంసుడు పంపిన పూతన, శకటాసురుడు లాంటి వాళ్లు జగద్గురువును మట్టుపెట్టే వెర్రి యత్నం చేశారు. ఈ ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి.
గోకులం నుంచి బృందావనానికి షిఫ్ట్ అయిన తరువాత అక్కడ మరో మూడేళ్ల పాటు కృష్ణుడు గడిపాడు.. అప్పుడే ఆయన అద్భుత రాసలీలలను అపురూపమైన మధుర భక్తిని రుచి చూపించాడు. బృందావనంలో గోపికలతో ఆయన రాసలీలా విలాసం భారతీయ సంస్కృతిలో ఒక అపురూప సన్నివేశం..
ఈ బృందావనంలోనే ప్రతి చెట్టూ పుట్టా శ్రీకృష్ణుడి జ్ఞాపకాలతో అలరారుతూ ఉంటుంది.. ప్రేమ సౌందర్యానికి బృందావనం అచ్చమైన ప్రతీక..
బృందావనంతో పాటుగానే దాని సమీపంలోనే ఉన్న నంద్‌గావ్‌లో మరో ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉన్నాడు.. తమ పల్లెను బీభత్సం సృష్టించిన వర్షాల నుంచి ప్రజల్ని కాపాడేందుకు చిన్ని కృష్ణుడు గోవర్ధన గిరిని చిటికెన వేలుతో పైకెత్తాడు.. ఈ గోవర్ధన గిరి ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. దీని చుట్టూ ప్రదిక్షణ చేయటం ఇక్కడికి వెళ్లిన వారి ఆనవాయితీ..
-3-
నంద్‌గావ్, మధుర, బృందావనం, గోకులం... శ్రీకృష్ణుడు 3౦ సంవత్సరాల పాటు గడిపిన ప్రాంతాలు.. గోపికలకు మధుర ప్రేమను అందించిన ప్రాంతాలు.. రాధా దేవితో రాసలీలలాడిన ప్రాంతాలు.. గోపాలురతో వెన్నె దొంగలించిన ప్రాంతాలు.. ప్రపంచంలో మరే దైవానికి లేని భక్తి సామ్రాజ్యం నెలకొన్న ప్రాంతాలు..
మధుర జిల్లాలో ప్రతి అణువు కృష్ణుడి ప్రతిరూపంగా కనిపిస్తుంది.. ఆయన ఆనవాళ్లు అడుగడుగునా వెలుగులీనుతాయి. నందగ్రామంలో ఉన్నప్పుడే కృష్ణుడిని కంసుడు మధురకు పిలిపించుకున్నాడు. పది సంవత్సరాల ఎనిమిది నెలల వయసులో శ్రీకృష్ణుడు మధురకు వెళ్లాడు. అంటే క్రీసు పూర్వం 3239 మార్చి నెలలో చైత్ర శుక్ల ఏకాదశి నాడు ఆయన మధురను చేరుకున్నాడు. అక్కడ ఆయన కుబ్జను అందాలరాశిగా మార్చటం, కంసుడి మల్లులను హతమార్చటం వంటివి చేశాడు.. ఆ తరువాత చతుర్దశి రోజున కంసుడిని చంపేశాడు..
తాను మధురలో ఉన్నప్పటికీ బృందావనాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు.. పదకొండో ఏట కంసుణ్ణి వధించినప్పటికీ ఆయన బృందావనానికి వెళ్లి వస్తూనే ఉన్నాడు.. అక్కడ రాధా దేవితో ఆయన రాసలీలలు ఒక మహాద్భుతం.. ప్రేమకు ఓ ఆకారాన్ని కల్పిస్తే దాని పేరు కృష్ణుడు.. బృందావనంలో గోపికలు కృష్ణుడి పట్ల వివశులైపోయారు.. వారి శ్వాస-ప్రాణాలు అన్నీ కృష్ణుడే అయిపోయాడు.. చివరకు శారీరక పనులన్నింటినీ వదిలేసుకున్నారు..సంసారాలనూ వదిలేసి కృష్ణుడి కోసం వచ్చేశారు.. ఆ బృందావనానికి పట్టమహిషి రాధ. ఉజ్వల రస వైచిత్రికి బృందావనం ఆధారం.. ఉదాత్తమైన ప్రేమ భావనకు రాధాకృష్ణులు ఆదర్శం..
బృందావనంలో కృష్ణ రాసలీలలు ఆయన ౧౫వ సంవత్సరంలో నిలిచిపోయాయి. అప్పటికి ఆయన వయసు 15సంవత్సరాల 9 నెలల 7 రోజులు.. అప్పుడు రాధాదేవి వయస్సు 14 సంవత్సరాల 2 నెలల 15 రోజులు. ఆ తరువాత ఆయన మధురలో రాజకీయ వ్యవహారాలను మోయాల్సి వచ్చింది. సాందీపని వద్దకు వెళ్లి చదువు కొనసాగించాల్సి వచ్చింది. 28 సంవత్సరాల 4 నెలల వయసు వరకు కృష్ణుడు మధురలోనే ఉన్నాడు..
అప్పుడే జరాసంధుడితో గొడవ వచ్చి పడింది.. దీంతో తన ప్రజల్ని కాపాడేందుకు అరేబియా సముద్ర తీరంలో ద్వారకను నిర్మించి అక్కడకు వెళ్లిపోయాడు...అయితే ద్వారకకు వెళ్లడానికి ముందే శిశుపాలుడు, అతని తమ్ముడు దంతవక్తృలను హతమార్చాడు.. ద్వారకకు వెళ్లిపోయే ముందు రెండు నెలల పాటు బృందావనానికి వచ్చి అక్కడ గోపికలతో గడిపి తిరిగి వెళ్లిపోయాడు..
కృష్ణుడు ఈ భూమ్మీద గడిపింది 126 సంవత్సరాలు.. ఆయన 90 ఏట మహాభారత యుద్ధం జరిగింది. క్రీస్తుపూర్వం 3138లో మహాసంగ్రామం ముగిసింది. క్రీస్తుపూర్వం 3102 ఫిబ్రవరి 18న ఆయన తిరిగి తన లోకానికి వెళ్లిపోయాడు. ఇదంతా జరిగి ఇప్పటికి అయిదు వేల సంవత్సరాలు గడిచిపోయింది. మధురలో, బృందావనంలో ఆ ఆనవాళ్లు అణువణువునా కనిపిస్తాయి. ఆయన నడిచిన ప్రతి ప్రాంతం ఒక పవిత్ర స్థలంగా మారిపోయింది. అందుకే బృందావనంలో లెక్కించలేనన్ని ఆలయాలు.. పవిత్ర స్థలాలు.. గాలిలో వినిపించే ప్రతిశబ్దంలో వేణువు ప్రతిధ్వనిస్తుంది. బృందావన వనమాలి ఆయన. అందుకే ఎటు చూసినా కృష్ణులే కనిపిస్తారు.. వేల కృష్ణులు.. లక్షల కృష్ణులు.. కోట్ల కృష్ణులు..
హాస్టల్కు విరాళంగా గ్రైండర్, ఫ్యాన్లు....
1 రోజు క్రితం











0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి