గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. జారిపోతే...భయం.

1 comments
అమ్మ కడుపులో ఆటలాడుకుంటున్నప్పుడు ఎంత ఆనందం...
ఆందోళన అంటే ఏమిటో తెలియని ఒక అద్భుతమైన లోకం అమ్మ కడుపు..

ఆ కడుపులోంచి బయట పడినప్పుడు
సడన్‌గా ఏదో శత్రులోకంలోకి వచ్చిన ఫీలింగ్‌
అప్పుడు శిశువు మొదలు పెట్టే ఏడుపు పేరు భయం..

అన్నం తిననంటూ మారాం చేస్తుంటే..
అమ్మ చూపించే బూచీ పేరు భయం..

స్కూలుకు ఎగ్గొట్టినప్పుడు
నాన్న కోపంగా చూసే చూపు పేరు భయం..

హోం వర్క్‌ చేయకపోతే..
మాస్టారు చూపే బెత్తం పేరు భయం..

ఇంటర్‌లో మార్కులు సరిగా రాకపోతే..
అంతా ఏమంటారో అన్న ఆందోళన పేరు భయం...

పెండింగ్‌ వర్క్‌ కంప్లీట్‌ చేయకపోతే
ఆఫీస్‌లో బాస్‌ ఇచ్చే వార్నింగ్‌ పేరు భయం..

అజ్ఞానం, అమాయకత్వం జతకడితే
వెంటాడే అతీంద్రియ శక్తుల పేరు భయం..

వెంటాడే జ్ఞాపకాల నీడ భయం..
చెట్టు భయం..
పుట్ట భయం..
పురుగు భయం..
నీడను చూసినా భయం..
మనిషి మనిషిని చూస్తే భయం...
ఒక నీలి నీడ మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతోంది... స్థిమితంగా ఉండనివ్వకుండా కేకలు పెడుతోంది... ఏదో చేసేస్తానంటూ అరుస్తోంది.. నిలుచున్నా, నడుస్తున్నా, కూచున్నా, లేచినా, నిద్రపోతున్నా, కళ్లు తెరిచి ఉన్నా..  వేధిస్తూనే ఉంది.. దాన్ని చూస్తేనే ఉలికిపాటు.. తలుచుకుంటే గగుర్పాటు.. ఆలోచనల్లో అదురుపాటు.. శరీరం చెమటలు కక్కుతోంది.. ఒళ్లు వణికిపోతోంది.. గుండె తన వేగాన్ని పెంచేసింది.. ఊపిరి భారంగా మారిపోయింది.. ఆర్చేవారు లేరు.. తీర్చేవారు లేరు.. ఆ నీడను తరిమేసే వారు లేరు.. అది నీడ కాదు.. దాని పేరు భయం.. భయం...
మానవాళి నెత్తిపై ఇప్పుడు మరో శత్రువు రాజ్యమేలుతోంది... ఇది మానసిక శత్రువు.. ఈ తరాన్ని అదే పనిగా వేధిస్తున్న శత్రువు.. ధైర్యం, సాహసం, నమ్మకం లాంటి పదాలకు చోటు లేని లోకంలో మనుషుల్ని ఆమాంతంగా మింగేస్తోంది.. చిన్నతనంలోనే చిదిమేస్తోంది.. అర్థం లేని కారణాలతో జీవితాల్ని అనర్థంగా నాశనం చేసేస్తోంది...ఎవరీ శత్రువు.. ?

భయం అన్న పదాన్ని కొంత పాలిష్డ్‌గా వాడితే దానిపేరు ఫోబియా...  ప్రతి మనిషి మనసు లోపలి పొరల్లో ఈ ఫోబియా ఏదోరకంగా మనిషిని వెంటాడుతూనే ఉంది.. కారణాలు ఉండవు.. అర్థం ఉండదు.. ఏదో ఆలోచన.. ఏదో సంఘటన... ఒక ఓటమి.. ఈ ఫోబియాను సృష్టిస్తుంది.. పెను భూతంగా మార్చేస్తోంది.. ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది రకరకాల ఫోబియాలతో బాధపడుతున్నారట..
2
ఊహ తెలియని రోజుల్లో  ఏదో చిన్న ఘటన మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది..  పెరిగిన కొద్దీ  ఆ ఘటన మర్చిపోతాం.. ఏం జరిగిందో కూడా మనకు గుర్తుండదు.. కానీ దాని ఛాయలు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా రూపాల్లో వేటాడుతుంది..
కొందరికి కొన్ని రూపాలను చూస్తే భయం.. కొందరికి కొన్ని ప్రాంతాలకు వెళ్తే భయం.. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా భయం కలుగుతుంది.. వీటన్నింటికీ కారణాలు ఏమిటి? మెదడులో జరిగే రసాయనిక ప్రక్రియలో సంతులనం తప్పితే వచ్చే అనర్థాలివి...
ప్రతి వాళ్లలోనూ భయం ఛాయలు ఉంటాయి.. ఎవరూ బయటపడరు.. ఎప్పుడూ అవి కనిపించవు.. ఇవి ఉన్నట్లు కూడా వారికి తెలియదు.. చిన్న విషయం పెద్దదై... చూస్తుండగానే భయంకరమైందిగా మారిపోతుంది..
పాలుగారే పిల్లవాడు పరుగులు పెట్టి డాలర్లు సంపాదించాలనే ట్రెండ్‌ ఉన్న సొసైటీ మనది.. ఈ ఒత్తిడి పిల్లలపై పడి.. నూటికి నూరుశాతం మార్కులు రాకపోతే ఏమవుతుందోనన్న టెన్షన్‌ భయంగా మారి డిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భాలు ఎన్నెన్నో.. సరదాగా చదువుకోవాల్సిన పిల్లలు భయంతో చదువుతున్నారు.. ఈ భయం వాళ్లను బలవన్మరణానికి పురికొల్పుతోంది..
నిజానికి ఈ భయం అనవసరమైంది.. కానీ, దీన్ని సృష్టించింది మన సొసైటీయే.. పసివాళ్ల లేత నరాలను చదువు పేరుతో పట్టి పిండేస్తున్నదీ సొసైటీ..

ఆడపిల్లల్లో ఈ ఫోబియా మరీ దారుణం.. చిన్నప్పుడు కుటుంబంలో.. పెద్దయిన కొద్దీ స్కూల్‌లో, ఉద్యోగంలో.. లైంగిక వేధింపులు వాళ్ల మానసిక పరిస్థితిని ఛిద్రం చేస్తుంది.. ఇది పెరుగుతున్న కొద్దీ డిప్రెషన్‌లోకి మారుతుంది.. అర్థంతరంగా జీవితాన్ని ముగించాలన్న భయంకరమైన నిర్ణయాన్ని తీసుకునే స్థితిని కలిపిస్తుంది...
భయం చిన్నగానే మొదలవుతుంది.. అది పెద్దగా మారుతున్నప్పుడే మెదడులో టెన్షన్‌ పెరుగుతుంది.. ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు.
ఏ రకమైన భయం ఎందుకు కలుగుతుందో తెలియని పరిస్థితి... ఈ భయాలు ఎలా ఉంటాయంటే వినటానికి సిల్లీగా.. మనకే నవ్వు వచ్చేలా ఉంటాయి.. కానీ, భయపడుతున్న వ్యక్తికి మాత్రం అది ఒక పెను ముప్పుగా కనిపిస్తుంది.. ప్రపంచంలో ఎన్ని రకాల భయాలు జనాలను వేధిస్తున్నాయో మీకు తెలుసా.. పదివేల వరకూ ఉన్నాయిట..
3
ఫోబియా అనేది విచిత్రం.. దానికి ఎలాంటి కారణాలు ఉండవు.. ఎందుకు కలుగుతుందో తెలియదు.. దానికి చిన్నాపెద్దా తేడా ఉండదు.. ఊహ తెలియని రోజుల్లో ఎప్పుడో ఏదో రకంగా పుట్టిన భయం.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది..
మాడొన్నా.. ఆ వంపులు వయ్యారంగా సయ్యాటలాడుతుంటే,  కళ్లల్లో కసి రేపుతుంటే,  కనుగుడ్డు కదిలించకుండా చూడని వాడు ఈ తరంలో ఎవరుంటారు చెప్పండి...
ఇంతటి మడొన్నాకు ఓ ఫోబియా ఉంది.. పది కిలోమీటర్ల దూరంలో పిడుగు పడిన శబ్దం వినిపించినా ఇంతే సంగతులు.. బెడ్‌పై ఎగిరి గంతేసి భయంతో దుప్పటి కప్పేసుకుంటుంది..
నికొల్‌ కిడ్‌మాన్‌..... నాలుగేళ్ల క్రితం ఆస్కార్‌లో హల్‌చల్‌ సృష్టించిన లేడీ బాస్‌.. హాలీవుడ్‌ను ఒక ఊపేసిన బ్యూటీస్టార్‌...

ఈ హాలీవుడ్‌ బ్యూటీకి నేచర్‌లో ఈమెతో పోటీ పడుతున్న బ్యూటీ బటర్‌ఫ్లైస్‌ అంటే చాలా భయం..షూటింగ్‌ స్పాట్‌లో ఒక బటర్‌ఫ్లై కనిపించినా ప్యాకప్పే...
స్కార్లెట్‌ జాన్సన్‌... అమెరికన్‌ బ్యూటీ.. నటి.. సింగర్‌..  ఈ న్యూయార్క్‌ బేబీ అమెరికన్లనే కాదు.. ప్రపంచ ఇంగ్లీష్‌ మూవీ వ్యూయర్స్‌ మనసుల్ని ఇట్టే కొల్లగొట్టేసింది..
ఇంతటి పుత్తడి బొమ్మ దేన్ని చూస్తే భయపడుతుందో తెలుసా.. కాక్రోచెస్‌.. సింపుల్‌గా బొద్దింక.. అది ఏమీ చేయదని తెలుసు.. కానీ, అదంటే మాత్రం ఏదో తెలియని భయం..
బాలీవుడ్‌ సెక్సీగాళ్‌.. కంగనా రనౌత్‌ ... కళ్లతోనే కైపెక్కించే  ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే....
ఇంత గొప్ప స్టార్‌కు కార్‌ లేకుండా ఎలా ఉంటుంది? కానీ, ఆమెకు కారు నడపాలంటే భయం.. కనీసం ముంబైలోని తన ఫ్లాట్‌ ఆవరణలో నడపాలన్నా గువ్వలా వణికిపోతుంది..
బిపాషా బసు.. బాలీవుడ్‌లో సెక్సీలెగ్‌ సుందరి.. ఈ అమ్మడితో నటించేందుకు బాలీవుడ్‌ హీరోలు క్యూ కట్టేస్తారు..
ఈమెకు ఉన్న ఫోబియా ఏంటో తెలుసా... సెల్‌ఫోన్‌లో మాట్లాడటం.. సెల్‌ఫోన్‌ను ముట్టుకోవటం.. ఎవరైనా ఫోన్‌ చేస్తే.. ఎస్‌ఎంఎస్‌ ఇవ్వండి అంటుందిట.. ఆ ఎస్‌ఎంఎస్‌ను సెక్రటరీ చదివి చెప్తే.. అవసరమైతే, ల్యాండ్‌లైన్‌ నుంచి కాల్‌ చేసి జవాబిస్తుందిట..

4
అసలు ఇవన్నీ భయాలేనా? బొద్దింకల్ని, సీతాకోక చిలుకల్ని చూస్తే భయపడటం ఏమిటి? అదే విచిత్రం.. వీటినే ఫోబియాలంటారు... ఎవరికి, దేన్ని చూస్తే, ఎందుకు భయమో అర్థం కాదు.. వారికే తెలియదు.. కారణాలు ఉండవు.. మనసులో ఏదో మూలన నక్కి ఉన్న గుబులు.. ఒక్కసారిగా బయటపడుతుంది.. శరీరంలోని అన్ని నరాలను కుదిపేస్తుంది. బ్రెయిన్‌ను ఇన్‌బ్యాలెన్స్‌ చేస్తుంది.   
ఇరవై ఏళ్ల పాటు ఏ అలజడీ తెలియని ఓ అమ్మాయికి ఒక్కసారిగా ఉలికిపాటు మొదలవుతుంది.. టెలివిజన్‌లో మూవీ మసాలా వస్తోంది. అంతలోనే ఆందోళన.. తన వెనుక ఎవరో ఉన్నారన్న భ్రమ.. వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది.
ప్రియుడితో సరదాగా కబుర్లు చెప్తుంటే ఏదో దయ్యం తననే చూస్తున్నదన్న ఆలోచన ప్రియురాలికి చెమటలు పట్టిస్తుంది..
.ఒకటి కాదు.. రెండు కాదు.. వేల రకాల భయాలు.. ఫోబియాలు ప్రజల్ని చిత్తడి చేస్తున్నాయి. తన భయానికి పరిష్కారమే లేదన్న ఆందోళన, జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది.. తమలో కలుగుతున్న ఆందోళన ఏమిటని విశ్లేషించుకోలేరు.. తాము ఊహించుకున్నదే కరెక్టని అనుకుంటారు.. ఎవరితోనూ తమ భయాన్ని పంచుకోరు.. ఒకవేళ ఎవరికైనా చెప్పినా.. వారు చెప్పే మంచి మాటలకు అంత తేలిగ్గా కన్విన్స్‌ కారు. ఆ క్షణం వరకు కాస్త కన్విన్స్‌ అయినట్లు కనిపించినా.. లోలోపల గుబులు వెంటాడుతూనే ఉంటుంది.

రకరకాల ఫోబియాలతో బాధ పడుతున్న వారి సంఖ్య మన దేశంలోనే దాదాపు ఆరు కోట్ల మంది దాకా ఉందంట.. అన్నీ ఉన్న అమెరికాలాంటి అగ్రదేశంలోనే ౫౦ లక్షల మంది ఈ ఫోబియాలతో అల్లాడిపోతుంటే ఇక మన దేశం సంగతి చెప్పేదేముంది?
ఆడపిల్లల్లో చిన్ననాట లైంగిక వేధింపులకు గురైతే.. దాని భయం.. పెద్దయ్యాక పడకగదిలో కూడా వెంటాడుతుంది..వింత వింతగా ప్రవర్తిస్తారు.. కారణాలు తెలియక, సరైన కౌన్సిలింగ్‌ చేయలేకపోవటం మహిళల పట్ల సమస్యాత్మకంగా మారుతోంది..
ఫోబియా.. భయం.. ఇదేమీ చిన్న విషయం కాదు.. అలా అని నిజంగా భయపడి పారిపోయేంత పెద్ద విషయమూ కాదు.. మనిషి లోపలి పొరల్లో దాక్కున్న దౌర్బల్యం అతణ్ణి ఫోబియా ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తోంది.. అందుకే గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. అది జారిపోతే....అదే భయం.

చారియట్స్‌ ఆఫ్‌ గాడ్స్‌- దేవుళ్ల రథాలు

0 comments
వాతావరణంలో ఉన్నా...శూన్యంలో ఉన్నా..భూమిపై అయినా, ఆకాశంలో అయినా,  వాయువు అందుకోలేని వేగం
కాల వేగాన్ని మించిన స్పీడ్‌.. ఒక గ్రహం నుంచి వేరే గ్రహానికి... ఒక మిల్కీ వే నుంచి మరో మిల్కీ వే వరకు
అలవోకగా జర్నీ... గాల్లో ఎగురుతాయి... శూన్యాన్ని చీల్చుకుని వెళ్తాయి...రోదసి నుంచి భూమ్మీదకు.. ఫ్లైయింగ్‌ డివైస్‌లలో రాక... వెహికిల్స్‌లో వాడిన ఇంధనం ఏమిటి?... ఆనాడు పెట్రోలు ఉందా?.. మరింకేదైనా ఇంధనమా?
ఇంజన్‌ స్పీడ్‌ ఎంత?  హెల్మెట్లు ధరించేవారా?  చారియట్స్‌ ఆఫ్‌ గాడ్స్‌ దేవుళ్ల రథాలు
నలభై వేల ఏళ్ల క్రితం దేవుళ్లు భూమ్మీదకు తరచూ వచ్చేవారా? వాళ్లు వ్యోమగాములా? అంతరిక్షం నుంచి అవనిలోకి ఎలా వచ్చేవారు? ఏ వాహనంపై వచ్చేవారు? టూవీలర్స్‌ ఉండేవా? లేక ఫోర్‌ వీలర్సా... అసలు వీల్సే లేని ఫ్లైయింగ్‌ సాసర్లా? ఎలా వచ్చే వారు.. ఒక వేళ ఫ్లైయింగ్‌ మిషన్‌ అయితే అది ఎలా ఉండేది? అందులో ఏ ఇంధనాన్ని వాడేవారు?  బోలెడు ప్రశ్నలు.. ? జవాబులు వెతుక్కున్నా దొరుకుతాయో లేదో తెలియని ప్రశ్నలు.. మనం సినిమాల్లో చూసినట్లు దేవుళ్లు అనుకున్న  సమయానికి మాయమై.. అనుకున్న చోటికి క్షణాల్లో చేరిపోవాలి కదా... మరి ఈ వాహనాలేమిటి? వీటి కథా కమామిషు ఏమిటి?
రోదసి నుంచి భూమి మీదకు... భూమి నుంచి తిరిగి రోదసిలోకి... సూపర్‌ సోనిక్‌ రాకెట్‌ కంటే వేగం.. మనం ఇవాళ ఉపగ్రహాలలో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తున్నట్లే, నాడు ఇతర గ్రహాల నుంచి కూడా భూమి మీదకు రాకపోకలు సాగాయి. అద్భుతమైన టెక్నాలజీతో తయారు చేసిన చారియట్‌లలో  భూమ్మీదకు ప్రయాణాలు జరిగాయి.  ఆ వచ్చిన వారు రోమ్‌ ప్రజలకు ఏంజిల్స్‌ అయితే, భారత దేశానికి దేవుళ్లయ్యారు.. మరి వారి వాహనాలు సూపర్‌ టెక్నాలజీకి రుజువులు.

2
పురాణాల్లో, ఇతిహాసాల్లో  భక్తులకు దేవుడు దర్శనమివ్వటం మనకు తెలుసు. ఎన్టీయార్‌ సినిమాల్లో ఇలాంటి సీన్లు మామూలే.. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు.. యజ్ఞం చేస్తే దేవుడు వచ్చేస్తాడు.. నోములు నోస్తే అమ్మవారు కరుణిస్తుంది. దివి నుంచి భువికి దిగి వచ్చి కోరిన వరాలను కొండంత ఇచ్చి వెళ్లిపోతారు. నిజానికి వాళ్లు ఎలా వచ్చేవారు.. ఎలా వెళ్లి పోయేవారు? వారు ఉపయోగించిన వెహికిల్స్‌ ఏమిటి?
మహాశివుడికి నంది వాహనం.. విష్ణుమూర్తికేమో గరుత్మంతుడు, అమ్మల్లో ఒక అమ్మకేమో సింహం, మరో అమ్మకు హంస... ఇంద్రుడికి ఏనుగు.. గణపతికి ఎలుక.. కుమారస్వామికి నెమలి, అయ్యప్పకు పెద్ద పులి.. ఏమిటివి? వాహనాలేనా? దేవుళ్లను చూస్తేనేమో మన లాగే కనిపిస్తారు.. కాకపోతే వేషంలో  కాస్త డిఫరెంట్‌.. మరి అలాంటప్పుడు ఈ జంతువులపై దేవుళ్లు తిరగటమేమిటి? భక్తుల కోర్కెలు తీర్చేందుకు ఈ వాహనాలపైనే వాళ్లు వచ్చేవారా? లేక వేరే వాహనాలేమైనా ఉన్నాయా? అసలు దేవుళ్లకు ఉన్న వాహనాలేమిటి?
గుర్రాలు పూన్చిన రథాలపై రామాయణ, మహాభారత యుద్ధాలు జరిగాయన్నది మనకున్న సినిమా నాలెడ్జి. కానీ అంతకంటే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ మన వాళ్ల సొంతం. రోదసి నుంచి గాడ్స్‌ సూపర్‌ టెక్నలాజికల్‌ ఎయిర్‌ వెహికిల్స్‌పై తిరిగేవారు. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్లేవారు.. మనుషులకూ హెల్ప్‌ చేసేవారు. ఇవే వారికి రథాలు.. మనకు విమానాలు.. జస్ట్‌ అంతే తేడా..
దేవుళ్లకు జంతు వాహనాలన్నది మన ఇతిహాసాల్లో ప్రతీకాత్మకంగా చెప్పిందే తప్ప.. మరేమీ కాదు.. ఆయా దేవీ దేవతల స్వరూప స్వభావ సామర్థ్యాలను బట్టి ఆయా జంతు వాహనాలను మనమే కల్పించుకున్నాం. కానీ, వాళ్లు ఇంతకంటే జెట్‌స్పీడ్‌ వాహనాల్లో తిరిగారు.

గ్రహాంతర వాసులు, గాడ్స్‌ భూమ్మీదకు వచ్చి వెళ్లినట్లు ప్రీ -హిస్టారిక్‌ ఆనవాళ్లు చాలా ఉన్నాయి. పెరూ ఇందుకు పెద్ద ఉదాహరణ.. పెరూలోని నాజ్కా ప్రాంతంలో ౪౦ వేల ఏళ్ల నాటి ఎయిర్‌ఫీల్డ్‌లు కనిపించాయి. 
గాడ్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించిన నమూనాలు కూడా వరల్డ్‌ ఆర్కియాలజిస్టులకు లభించాయి. అంతే కాదు.. పెరూలో కనిపించిన కొన్ని బొమ్మల్లో  ఇతర గ్రహాల నుంచి వచ్చిన వాళ్లవీ ఉన్నాయి. వాళ్లు హెల్మెట్‌ కూడా ధరించినట్లు తెలుస్తోంది.
జీసెస్‌కు సంబంధించిన బైబిల్‌ చిత్రాల్లో, రామాయణ భారతాలకు చెందిన ప్రాచీన పెయింటింగ్స్‌లో  ఏంజిల్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను మనం చూడవచ్చు. ఎగిరే రథాలపై తిరుగుతూ యుద్ధాలు కూడా చేసినట్లు ఈ బొమ్మలు చెప్తున్నాయి. అంటే మన పురాణాలు, ఇతిహాసాల్లో పేర్కొన్న అంశాలు, బైబిల్‌ చెప్తున్న కథలు, ఖురాన్‌ విప్పి చెప్పిన విషయాలు పూర్తిగా సత్యదూరం కావన్నమాట.

3
మనం ఇవాళ ఉపగ్రహాలను పంపిస్తున్నాం.. స్పేస్‌ రీసర్చ్‌ కోసం వ్యోమగాములు వాటిలో వెళ్తున్నారు. స్పేస్‌ టూరిజం కూడా డెవలప్‌ అవుతోంది.. స్టోన్‌ ఏజ్‌లో కూడా ఇతర గ్రహాల నుంచి మన ప్లానెట్‌పైకి గ్రహాంతర వాసులు వచ్చేవారా? అవుననటానికి చాలా ఆధారాలున్నాయి. చిత్రాల్లో సాక్ష్యాలు కనిపించాయి. ఆర్కియాలజికల్‌ ఎవిడెన్స్‌ కూడా చాలినంత ఉంది.. దేవుళ్లు కూడా భూమికి ఆవల ఉండేవారు కాబట్టి వాళ్లూ గ్రహాంతర వాసులే కదా... మనిషికి సహాయం చేసేందుకు వారూ ఇలాగే వచ్చేవారా?
1969 జూలై 20౦ నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై తొలి అడుగు మోపిన మనిషి.. ఈ భూమ్మీద నుంచి మరో గ్రహానికి వెళ్లిన తొలి వ్యక్తి. జస్ట్‌లైక్‌ గ్రహాంతర వాసి..
2008 మేలో వాటికన్‌ ఒక ప్రెస్‌ రిలీజ్‌ చేసింది. ఇతర గ్రహాల్లో జీవులు ఉన్నట్లు ఆధారాలున్నాయన్నది ఆ ప్రెస్‌నోట్‌ సారాంశం..
2002లో మార్స్‌లో ఐస్‌ కనిపించింది.. నీటి ఆధారాలు ఉన్నట్లు తేలింది.

ఇవన్నీ ఇతర గ్రహాల్లో జీవులు ఉన్నారనటానికి క్రమంగా బలపడుతున్న ఆధారాలు.. వీటన్నింటికీ మించి 1968లో అంటే నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపైకి వెళ్లటానికి సరిగ్గా ఏడాది ముందు ఎరిక్‌ వాన్‌డానికెన్‌ అన్న పరిశోధకుడు చారియట్‌ ఆఫ్‌ గాడ్స్‌ పుస్తకాన్ని ప్రచురించాడు. సైన్స్‌కు అందని అనేక విషయాలను, అంతుపట్టని అంశాలను ఇందులో చర్చించాడు. బైబిల్‌, ఖురాన్‌, భారత రామాయణ, భగవద్గీతల్లో, వివిధ పురాణ ఇతిహాసాల్లో  దేవతల గురించి చెప్పిన అంశాలు, ప్రాచీన నాగరికత ఆనవాళ్లలో బయటపడ్డ అరుదైన ఆధారాలతో  పోల్చుకుని చూశాడు.. దేవతలు, గ్రహాంతర వాసులు గతంలో, కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ భూమ్మీదకు తరచూ వచ్చేవారు.. మనుషులతో చెలిమి చేశారు.. సహాయం చేశారు.
భూమ్మీద నాగరికత అభివృద్ధి చెందడంలో  గాడ్స్‌ పాత్ర చాలా కీలకమైంది. ఈస్టర్‌ ఐలండ్‌లోని జెయింట్‌ స్టోన్స్‌, గిజా పిరమిడ్‌లు, ఈజిప్ట్‌ పిరమిడ్‌లు, సింధులోయ నాగరికత, హరప్పా, మొహంజదారోల్లో లభించిన అనేక ఆనవాళ్లు గ్రహాంతర వాసులతో మనుషుల సంబంధాలను బలపరుస్తున్నాయి. మన వాళ్లు ఆనాడే విమానాలను తయారు చేయటం, విమాన శాస్త్రాలను రచించటం వెనుక వీరి ప్రమేయం తప్పక ఉండి ఉండాలి.
రాతి యుగానికి ముందు కాలం నాటి కొన్ని ఆనవాళ్లు, రూపాలు ఇవాళ్టి ఆధునిక విమానాల కంటే టెక్నాలజీలో చాలా ముందున్నాయి. కొన్ని ప్రాచీన పెయింటింగ్స్‌లో ఉన్న స్పేస్‌ షటిల్స్‌, విమాన శాస్త్రంలో కనిపించే నమూనాలతో సరిపోలుతున్నాయి. వెరసి, దేవతలు తమ ఆధునిక వాహనాలపై భూమికి వచ్చి పోయారన్నది సైన్స్‌ కూడా దాదాపు నిర్ధారణకు వచ్చేస్తోంది.

4
ఆధునిక వాహనాలు... దేవతలు.. లేదా గ్రహాంతర వాసులు వాడిన వాహనాలు ఎలాంటి టెక్నాలజీతో తయారయ్యాయి? అవి గాల్లో ప్రయాణించటానికి కానీ ఎలాంటి ఇంధనాన్ని వాడారు? వాటితో యుద్ధం చేయటం సాధ్యమేనా? అప్పుడే అంత టెక్నాలజీ వారికెలా సొంతమైంది? అంటే గ్రహాంతర వాసులు, గాడ్స్‌ మనుషుల కంటే ఎంతో ఇంటెలిజెంట్సా.. నిజమే.. గాడ్స్‌ టెక్నాలజీ ఆ రోజుల్లోనే సూపర్‌ సోనిక్‌ ఏజ్‌ని క్రియేట్‌ చేసింది.
రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రాముడికి దేవతలు రథాన్ని పంపించారట... రావణుడు అప్పటికే విమానాల తయారీలో ఎక్స్‌పర్ట్‌.. ఆయన గాల్లో ఎగిరే రథంతో యుద్ధభూమికి వచ్చాడు.. రావణుడి ఎయిర్‌క్రాఫ్ట్‌ గురించి, అతని ఎయిర్‌పోర్ట్‌ల గురించి గతంలో విన్నాం.. రాముడికేమో దేవతలు తమ వెహికిల్‌ను క్షణాల్లో పంపించారు..
గాడ్స్‌  వాహనాల గురించి వరల్డ్‌ ఆర్కియాలజిస్టులు చాలా పరిశోధనలే చేశారు. ఆనాటి స్పేస్‌ వెహికిల్స్‌కి ఇటు భూ వాతావరణంలో, అటు అంతరిక్షంలో అత్యంత వేగంగా ప్రయాణించే సామర్థ్యం ఎలా వచ్చింది? ఒక్కో ప్లానెట్‌ మధ్య దూరం కొన్ని లక్షల కిలోమీటర్లు ఉంటుంది. అలాంటప్పుడు స్పేస్‌ క్రాఫ్ట్‌లు కానీ, ఇతర ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఎలా ప్రయాణించేవి.. అందులో ఏ ఇంధనం వాడారన్నదానిపై చాలా రీసర్చే జరిగింది..రోదసిలో హైడ్రోజన్‌ వాయువు చాలా అధికంగా ఉంటుంది. భూ వాతావరణంలో దాని పరిమాణం తక్కువగా ఉంటుంది. గ్రహాంతర వాసులు, గాడ్స్‌ రోదసిలోని హైడ్రోజన్‌ను విజయవంతంగా క్యాప్చర్‌ చేయగలిగారు. కాబట్టే హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకున్నారు. దాని వల్లే అత్యంత వేగంగా ఎక్కడికైనా వెళ్లి రాగలిగే శక్తి సామర్థ్యాలు వారికి వచ్చాయి.
రావణుడి కాలంలో మనుషులు వాడిన విమానాల్లో మెర్క్యురీని ఇంధనంగా వాడినట్లు తెలుస్తోంది. భూవాతావరణంలో ఆనాడు వారికి హైడ్రోజన్‌ అవసరం రాలేదు. మెర్క్యురీని ఇంధనంగా ఉపయోగించారు.. దీని వల్ల గాడ్స్‌ వెహికిల్స్‌ కంటే తక్కువే అయినా, ఇవాళ మనం ఉపయోగిస్తున్న విమానాల కంటే ఎన్నో రెట్లు వేగంగా ప్రయాణించేవి.
ఈ వెహికిల్స్‌లో ఇంజన్‌లు కూడా రాకెట్లలో వాడే జెట్‌ ఇంజన్ల లాంటివేనని ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. దీనివల్లనే స్పీడీనెస్‌ను సాధించగలిగి ఉండవచ్చు. భారతీయ విమాన శాస్త్రంలో చూపించిన నమూనాల్లోనూ జెట్‌ ఇంజన్‌ ప్రస్తావన ఉంది. నాటి విమానాలకు వార్‌హెడ్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాచీన నాగరికతలో దొరికిన ఆనవాళ్లు, మనుషులకు టెక్నాలజీపరంగా గాడ్స్‌, గ్రహాంతర వాసుల నుంచి పూర్తి సహకారం అందినట్లు చెప్తున్నాయి.
గ్రహాంతర వాసులను గాడ్స్‌గా వాటికన్‌ సిటీ పరోక్షంగా అంగీకరించింది. మన ఇతిహాసాలు, చారిత్రక ఆధారాలు, ఖగోళ పరిశోధనలు వీటిని ఎప్పుడో నిర్ధారించాయి. చారియట్స్‌ ఆఫ్‌ గాడ్స్‌ రచయిత ఎరిక్‌ వాన్‌డానికెన్‌ వాళ్ల ఉనికిని స్పష్టం చేస్తున్నాడు.. ప్రపంచంలో ప్రాచీన నాగరికత అభివృద్ధికి వాళ్లు దోహద పడ్డారనటానికి అన్ని రకాల ఆధారాలను చూపిస్తున్నాడు. ఇక ఎంతమాత్రం ఖండించే వీలు లేదని స్పష్టం చేస్తున్నాడు.

అరవై కోట్ల కృష్ణులు..

0 comments
ఒక్క ప్రదేశంలో కేవలం మూడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 60 కోట్ల పవిత్ర మందిరాలు ఉన్నాయి.. అదీ మన దేశంలో.. మన కళ్ల ముందు ఉన్నాయి.. రోజూ వేలాది ప్రజలు ఈ ప్రాంతాల్ని సందర్శించుకుని వెళ్తున్నారు.. ఇదెలా సాధ్యం? ఒక్క ప్రాంతంలో కొద్ది పాటి నేలలో ఇన్ని కోట్ల పవిత్ర ప్రదేశాలు ఎలా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? వీటిని ఎవరు ఐడెంటిఫై చేశారు..? ఏ కాలం నాటివీ ప్రదేశాలు? ఎలా అయ్యాయి పవిత్ర ప్రాంతాలు?

అక్కడ ప్రపంచం మోకరిల్లుతుంది.. భక్తి భావన పొంగిపొర్లుతుంది.. రాసలీలలు మనసుల్ని తన్మయం చేస్తాయి. ప్రతి అడుగూ అక్కడ పవిత్రమే..ప్రతి లోగిలీ మందిరమే..గాలీ, ధూళీ..చెట్టూ, చేమా..ఆటాపాటా..అంతా భక్తిమయం..అణువణువునా స్వామి విగ్రహారాధన..ఎన్నని చూస్తారు?..ఎటువైపని చూస్తారు?..ఎన్నని లెక్కిస్తారు?..ఎన్ని మొక్కులిస్తారు?..ఎంత ఆరాధన చేస్తారు?..దేవుడు సర్వాంతర్యామి అన్న పదానికి అర్థం ఆ ప్రాంతం. మధుర భక్తికి పుట్టినిల్లు. రాసలీలలకు రసపట్టు. ప్రేమకు పెట్టినిల్లు 6౦ కోట్ల కృష్ణ భక్తి సామ్రాజ్యం. బృందావనం. శ్రీకృష్ణ బృందావనం. రాధాకృష్ణ బృందావనం. జయదేవుని బృందావనం.
..1..
అయిదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు నడిచిన ప్రాంతం ఇవాళ భక్తి సామ్రాజ్యంగా వెలుగుతోంది. ఆయన పుట్టిన మధుర, పెరిగిన గోకులం, ఆడుకున్న బృందావనం, ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ప్రాంతంగా రికార్డు సృష్టించింది. ఈ ప్రాంతం అంతటా చిన్నవీ పెద్దవీ కలిపి అరవై కోట్ల పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని మధుర. ఢిల్లీకి ఆగ్నేయంగా 145 కిలోమీటర్ల దూరం... ఆగ్రాకు వాయద్య దిశలో 45 కిలోమీటర్ల దూరం.... జగన్నాథుడి జన్మభూమి. యమునానదీ తీరంలో శ్రీకృష్ణుడు జన్మించిన మధురపై ఇప్పుడు ప్రపంచం కన్నుపడింది.. సంచలనం రేగుతోంది.. ఒకటా రెండా.. ఊహించని విధంగా, కన్నుల పండువగా కోట్లాది పవిత్ర ప్రదేశాలు ఎలా వచ్చాయి.. ఇన్ని వేల, లక్షల భక్తి క్షేత్రాలు ఒక్కదగ్గర ఉండటం సాధ్యమా?
యమున నదికి ఈస్టూ, వెస్టూ అంతటా కృష్ణ భక్తి సామ్రాజ్యం విస్తరించి ఉంది. గోకులం, మహావనం, బలదేవ్‌ మఠ్‌, బజ్న, బృందావనం, గోవర్థన్‌, కుసుమ సరోవర్‌, వర్సానా, నందగావ్‌, మథుర... అమ్మో ఇది ఆషామాషీ కాదు.. పేర్లు చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఆలయాలు కనిపిస్తాయి..
ఒక్క బృందావనంలోనే మట్టి రేణువు కూడా ఒక ఆలయంగా కనిపిస్తుంది.. మధుర ఒక సాధారణ నగరం.. అందులో బృందావనం ఒక భాగమే.. కానీ, ఇక్కడ దేవుడి ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఎన్నటికీ బృందావనాన్ని విడిచి వెళ్లేది లేదని శ్రీకృష్ణుడు చెప్పాడట. అందుకేనేమో... బృందావనంలో అడుగు పెట్టింది మొదలు తుదకంటా అడుగడుగునా శ్రీకృష్ణుడి స్పర్శ తగులుతున్నట్లుగా ఉంటుంది...
శ్రీకృష్ణుడి జన్మభూమి అయినా, బాల్యంలో ఆయన ఆడుకున్న ప్రాంతమయినా, మరేదైనా కానీ, ఒకటి రెండు ఆలయాలు.. కొన్ని ఆనవాళ్లు ఉంటాయి.. మిగతా భారత దేశంలో ఇలాంటివి మనం విన్నవే, కంటున్నవే.. కానీ, బృందావనంలో మాత్రం పాత కొత్త మందిరాలు అసంఖ్యాకంగా ఎలా వచ్చాయన్నది ఎవరికీ అర్థం కావటం లేదు...
ఇప్పుడు దీనిపై పెద్ద రీసర్చే జరుగుతోంది.. అంతర్జాతీయంగా ఉన్న శ్రీకృష్ణ భక్తి సంస్థలు బృందావనంపై సాధికారిక సమాచారం సేకరించాయి. కొత్త ఆలయాలను పక్కన పెట్టి దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుంచి పూజలు జరుగుతున్న ఆలయాలు, మందిరాలు, లోగిళ్ల ప్రాధాన్యం ఏమిటన్న దానిపై పెద్ద చర్చే జరుగుతున్నది.
...2..
భారత రామాయణాలను ఇప్పటికీ కేవలం కావ్యాలుగానో, ఇతిహాసాలుగానో పరిగణించటం తప్ప చరిత్రగా చెప్పుకోవటానికి మనలో మనకే బోలెడు విభేదాలు, భిన్నాభిప్రాయాలు. ఎందుకు బృందావనానికి, మధురకు ఇంత ప్రాచుర్యం? దేశంలో మిగతా ప్రాంతాలకు లేని ప్రాధాన్యం దీనికి ఎందుకు? ఎందుకంటే అక్కడ పుట్టింది కృష్ణుడు కాబట్టి.. అతని అస్తిత్వం ఇప్పటికీ స్పష్టం కాబట్టి.
భారత దేశంలో మహాభారత చరిత్ర పుక్కిటి పురాణం కాదనటానికి కృష్ణ జన్మభూమి ఖచ్చితమైన సాక్ష్యం. క్రీస్తు పుట్టడానికి చాలా కాలం ముందే భారత దేశంలో అద్భుతమైన నాగరికత అభివృద్ధికి మూలకారకుడైన జగద్గురుడు జన్మించిన ప్రదేశం మధుర. ఇది చరిత్రకారులు నిక్కచ్చిగా నిరూపించిన వాస్తవం...
మధుర శ్రీకృష్ణుడి జన్మభూమి.. క్రీస్తుపూర్వం 3228, జూలై 19న శ్రావణ శుక్ల అష్టమి నాడు మధురలో కంసుడి జైల్లో కృష్ణుడు జన్మించాడు.. ఇది ప్రపంచ చరిత్రకారులు నిర్ధారించిన టైమ్‌ పీరియడ్‌..
మధుర చుట్టు పక్కల ప్రాంతాల్లోనే కృష్ణుడు దాదాపు ముప్ఫై సంవత్సరాలు ఉన్నాడు.. ఆ తరువాత పశ్చిమం వైపు అరేబియా సముద్ర తీరంలో ద్వారక నగరాన్ని నిర్మించుకుని అక్కడ ఉన్నాడు. కృష్ణుడు పుట్టడంతోనే చావుతో పోరాడాల్సి వచ్చింది. కంసుడు చంపుతాడన్న భయంతో తండ్రి వసుదేవుడు అతణ్ణి గోకులాన్ని తరలించాడు. అక్కడ ఆయన యశోదా దేవి దగ్గర పెరిగాడు..
గోకులంలో కృష్ణుడు ఉన్నది ౩ సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే. ఈ లోగానే ఆయనపై పలు మార్లు హత్యాయత్నం జరిగింది. కంసుడు పంపిన పూతన, శకటాసురుడు లాంటి వాళ్లు జగద్గురువును మట్టుపెట్టే వెర్రి యత్నం చేశారు. ఈ ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి.
గోకులం నుంచి బృందావనానికి షిఫ్ట్‌ అయిన తరువాత అక్కడ మరో మూడేళ్ల పాటు కృష్ణుడు గడిపాడు.. అప్పుడే ఆయన అద్భుత రాసలీలలను అపురూపమైన మధుర భక్తిని రుచి చూపించాడు. బృందావనంలో గోపికలతో ఆయన రాసలీలా విలాసం భారతీయ సంస్కృతిలో ఒక అపురూప సన్నివేశం..
ఈ బృందావనంలోనే ప్రతి చెట్టూ పుట్టా శ్రీకృష్ణుడి జ్ఞాపకాలతో అలరారుతూ ఉంటుంది.. ప్రేమ సౌందర్యానికి బృందావనం అచ్చమైన ప్రతీక..
బృందావనంతో పాటుగానే దాని సమీపంలోనే ఉన్న నంద్‌గావ్‌లో మరో ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉన్నాడు.. తమ పల్లెను బీభత్సం సృష్టించిన వర్షాల నుంచి ప్రజల్ని కాపాడేందుకు చిన్ని కృష్ణుడు గోవర్ధన గిరిని చిటికెన వేలుతో పైకెత్తాడు.. ఈ గోవర్ధన గిరి ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. దీని చుట్టూ ప్రదిక్షణ చేయటం ఇక్కడికి వెళ్లిన వారి ఆనవాయితీ..
-3-
నంద్‌గావ్‌, మధుర, బృందావనం, గోకులం... శ్రీకృష్ణుడు 3౦ సంవత్సరాల పాటు గడిపిన ప్రాంతాలు.. గోపికలకు మధుర ప్రేమను అందించిన ప్రాంతాలు.. రాధా దేవితో రాసలీలలాడిన ప్రాంతాలు.. గోపాలురతో వెన్నె దొంగలించిన ప్రాంతాలు.. ప్రపంచంలో మరే దైవానికి లేని భక్తి సామ్రాజ్యం నెలకొన్న ప్రాంతాలు..
మధుర జిల్లాలో ప్రతి అణువు కృష్ణుడి ప్రతిరూపంగా కనిపిస్తుంది.. ఆయన ఆనవాళ్లు అడుగడుగునా వెలుగులీనుతాయి. నందగ్రామంలో ఉన్నప్పుడే కృష్ణుడిని కంసుడు మధురకు పిలిపించుకున్నాడు. పది సంవత్సరాల ఎనిమిది నెలల వయసులో శ్రీకృష్ణుడు మధురకు వెళ్లాడు. అంటే క్రీసు పూర్వం 3239 మార్చి నెలలో చైత్ర శుక్ల ఏకాదశి నాడు ఆయన మధురను చేరుకున్నాడు. అక్కడ ఆయన కుబ్జను అందాలరాశిగా మార్చటం, కంసుడి మల్లులను హతమార్చటం వంటివి చేశాడు.. ఆ తరువాత చతుర్దశి రోజున కంసుడిని చంపేశాడు..
తాను మధురలో ఉన్నప్పటికీ బృందావనాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు.. పదకొండో ఏట కంసుణ్ణి వధించినప్పటికీ ఆయన బృందావనానికి వెళ్లి వస్తూనే ఉన్నాడు.. అక్కడ రాధా దేవితో ఆయన రాసలీలలు ఒక మహాద్భుతం.. ప్రేమకు ఓ ఆకారాన్ని కల్పిస్తే దాని పేరు కృష్ణుడు.. బృందావనంలో గోపికలు కృష్ణుడి పట్ల వివశులైపోయారు.. వారి శ్వాస-ప్రాణాలు అన్నీ కృష్ణుడే అయిపోయాడు.. చివరకు శారీరక పనులన్నింటినీ వదిలేసుకున్నారు..సంసారాలనూ వదిలేసి కృష్ణుడి కోసం వచ్చేశారు.. ఆ బృందావనానికి పట్టమహిషి రాధ. ఉజ్వల రస వైచిత్రికి బృందావనం ఆధారం.. ఉదాత్తమైన ప్రేమ భావనకు రాధాకృష్ణులు ఆదర్శం..
బృందావనంలో కృష్ణ రాసలీలలు ఆయన ౧౫వ సంవత్సరంలో నిలిచిపోయాయి. అప్పటికి ఆయన వయసు 15సంవత్సరాల 9 నెలల 7 రోజులు.. అప్పుడు రాధాదేవి వయస్సు 14 సంవత్సరాల 2 నెలల 15 రోజులు. ఆ తరువాత ఆయన మధురలో రాజకీయ వ్యవహారాలను మోయాల్సి వచ్చింది. సాందీపని వద్దకు వెళ్లి చదువు కొనసాగించాల్సి వచ్చింది. 28 సంవత్సరాల 4 నెలల వయసు వరకు కృష్ణుడు మధురలోనే ఉన్నాడు..
అప్పుడే జరాసంధుడితో గొడవ వచ్చి పడింది.. దీంతో తన ప్రజల్ని కాపాడేందుకు అరేబియా సముద్ర తీరంలో ద్వారకను నిర్మించి అక్కడకు వెళ్లిపోయాడు...అయితే ద్వారకకు వెళ్లడానికి ముందే శిశుపాలుడు, అతని తమ్ముడు దంతవక్తృలను హతమార్చాడు.. ద్వారకకు వెళ్లిపోయే ముందు రెండు నెలల పాటు బృందావనానికి వచ్చి అక్కడ గోపికలతో గడిపి తిరిగి వెళ్లిపోయాడు..
కృష్ణుడు ఈ భూమ్మీద గడిపింది 126 సంవత్సరాలు.. ఆయన 90 ఏట మహాభారత యుద్ధం జరిగింది. క్రీస్తుపూర్వం 3138లో మహాసంగ్రామం ముగిసింది. క్రీస్తుపూర్వం 3102 ఫిబ్రవరి 18న ఆయన తిరిగి తన లోకానికి వెళ్లిపోయాడు. ఇదంతా జరిగి ఇప్పటికి అయిదు వేల సంవత్సరాలు గడిచిపోయింది. మధురలో, బృందావనంలో ఆ ఆనవాళ్లు అణువణువునా కనిపిస్తాయి. ఆయన నడిచిన ప్రతి ప్రాంతం ఒక పవిత్ర స్థలంగా మారిపోయింది. అందుకే బృందావనంలో లెక్కించలేనన్ని ఆలయాలు.. పవిత్ర స్థలాలు.. గాలిలో వినిపించే ప్రతిశబ్దంలో వేణువు ప్రతిధ్వనిస్తుంది. బృందావన వనమాలి ఆయన. అందుకే ఎటు చూసినా కృష్ణులే కనిపిస్తారు.. వేల కృష్ణులు.. లక్షల కృష్ణులు.. కోట్ల కృష్ణులు..