25, మే 2011, బుధవారం

ఒక చిరునవ్వు చచ్చిపోయింది

(-ప్రియ మిత్రుడు, సహచరుడు దివాకర్ రెడ్డి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని స్మృతిలో)


ఉన్నట్టుండి అకస్మాత్తుగా అతను వెళ్లిపోయాడు..
చెట్టును వీడి గాలి,  కొండల వైపు.. ఆకాశం వైపు వెళ్లిపోయినట్టు
అతను కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

ఎప్పటికీ ఇంకిపోదనుకున్న ఇంకు హఠాత్తుగా ఇంకిపోయింది
సరదాకు చిరునామా జాడలేని లోకాలకు వెళ్లిపోయింది
73ఏళ్ల పాటు మిగిలి ఉన్న జీవితాన్ని వదిలేసి
ఒక చిరునవ్వు హఠాత్తుగా చచ్చిపోయింది

తొందరలు.. తొక్కిసలాటలు... మితిమీరిపోవటాలు
పత్రికల నిండా.. టీవీల నిండా ఎన్నెన్ని
ఆత్మాహుతులు.. రక్త ప్రవాహాలు.. క్రౌర్యాలు..
ఎన్ని చూడలేదు.. ఎన్ని రాయలేదు..
నీ దాకా వచ్చేసరికి చిన్న  పిచ్చి హేతువు చాలిందా ప్రాణం తీసుకోవటానికి

పైకి కనిపించకుండా లోలోపల తొలచి తొలచివేసే
బడబాగ్ని వంటి అనుభవం నీకు మాత్రమే తెలుసు
దినం గడుస్తున్న కొద్దీ పలుచబడకుండా గాఢమయిన
ఆవేదన నీకు మాత్రమే తెలుసు
అంచనాలు తలక్రిందులయినాయి

ఆ క్షణంలో ఏం జరిగింది
నిన్ను నువ్వు తిరస్కరించుకోలేని ఆదేశం నీవే ఇచ్చేసుకున్నావు
నువ్వు నిర్మించుకున్న కలల పరిధులను చేరుకోకముందే అచంచలంగా నిశ్చయించుకున్నావ్
మృత్యువు గుహలోకి నిన్ను నువ్వే తోసేసుకున్నావు
ఎందుకింత తొందర?

ఎంత ఒత్తిడి.. ఎంత వ్యధ..
ఎంత నిరాశ? ఎంత తొక్కిడి..
ఇంతమందిమి ఉన్నాం..
ఎవరమూ వెనక్కి లాగలేకపోయాం
కళ్ల ముందే ఉదయాస్తమయాలు యథావిధిగా వెళ్లిపోతున్నాయి
నీవు వదిలి వెళ్లిన ఆ క్షణం మాత్రం చిత్తంలో పదిలంగా ఉండిపోయింది

ప్రియ మిత్రమా మమ్మల్ని సగం కత్తిరించేశావు
మిగిలిన సగంలో ఏదో గుర్తించరాని లోపం
నడకలో... నడతలో మమ్మల్ని ఆవహేళన చేస్తోంది
క్షణిక భావ  వలయాల్లో చిక్కుకుపోయి
జీవితాన్ని సరళ రేఖగా మలచుకోలేకపోయావు
ఎప్పటికప్పుడు ముడి మీద ముడి వేసుకుంటూ
కొంచెం కొంచెంగా బిగించుకుంటూ పోయావు

అందిందంతా  అఇష్టమైన చోట పంచుతూ
అయిష్టమైన చీకట్లోనే సంతృప్తిని వెతుక్కున్నావు
నీ వారి ఇష్టాల హోరులో నీ అయిష్టం కలగలిసిపోయింది
ఎదుగుతున్న కొద్దీ ముక్కలుగా తరిగిపోతూ
నువ్వు  నడిపిన జీవితం ఒక సమరం
ఇందులో ఓటమి లేదు.. గెలుపు లేదు.

2 కామెంట్‌లు:

  1. దివాకర్ రెడ్డి గారి ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  2. SANTOSHANNA

    NEE AKSHARA NIVALI BAAGUNDI....

    ANNI VISHAYALLO DUKUDUGA UNDE DIVAKAR
    MRUTYU KOUGILINI KOODA ANTE DUKUDUGA
    AALINGANAM CHESUKOVADAM BAADHAKARAM.

    రిప్లయితొలగించండి