8, జనవరి 2011, శనివారం

ఏపిఎస్‌ఇబి-1956....... కొత్తగూడెం కేరాఫ్ రాయలసీమ..

శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్పు చెప్పటం వల్లనే తెలంగాణా వాదులు అడ్డగోలుగా రెచ్చిపోతున్నారని అనడంలో హేతుబద్ధత ఉంది. బుర్ర ఉన్న ప్రబుద్ధాంధ్రులు కొందరు తెలంగాణా వాదులను గేలి చేయటంలో అర్థమూ ఉంది. ఇందులో ఎవరినీ ఆక్షేపించటానికి లేదు. ఒకవైపు తీర్పు వచ్చినప్పుడు మరో పక్షం వారు ఆందోళన చెందటం, అసంతృప్తి వ్యక్తం చేయటం సహజమే.  అయితే ఈ అసంతృప్తి నిర్హేతుకమైతే నిస్సందేహంగా తిరస్కరించాల్సిందే.. శ్రీకృష్ణ కమిటీ గుడ్డిగా ఎవరో ఇచ్చిన నివేదికను ఫాలో అయి ప్రచురించేసిందనటానికి ఒకటి రెండు ఉదాహరణలు చాలు.. తొమ్మిది నెలలు జాబ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసి  కమిటీ సభ్యులు హాయిగా ఇళ్లల్లో రెస్ట్ తీసుకుంటున్నారు.. ఇక్కడ కాలేజీల్లో విద్యార్థులు 27 రకాల నరకబాధలనూ అనుభవిస్తున్నారు.
ప్రపంచంలోనే ఇంత చెత్త నివేదిక లేదనటానికి ఇంతకంటే ఉదాహరణలు లేవు.

1 విద్యుత్తు గురించి చర్చిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట విద్యుత్తు బోర్డు ఏపిఎస్‌ఇబి 1956లో ఏర్పడిందని సోకాల్డ్ నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి ఏపిఎస్‌ఇబి 1959లో ప్రారంభమైంది. దాని ఎగ్జిస్టెన్స్ అనేది 1959లో జరిగింది.

2. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ రాయల సీమలో ఉన్నదని న్యాయమూర్తిగారి దివ్వదృష్టి చెప్తోంది. కొత్తగూడెం రాయలసీమకు ఎప్పుడెళ్లిందో ఆయనకే తెలియాలి.

3. విద్యుత్తు ఉత్పత్తికి తగిన వనరులు ఉన్న చోట పవర్ ప్లాంటులు ఉండాలన్నది సాధారణ సూత్రం..ఇన్ జనరల్‌గా విద్యుత్తు ఉత్పత్తికి కావలిసిన బొగ్గు, నీరు తెలంగాణాలో  ఉన్నాయి. కానీ, పవర్ ప్లాంట్లను సీమకు, కోస్తాంధ్రకు తరలించారు..  మణుగూరు పవర్ ప్లాంట్‌ను విజయవాడకు తరలించటం వంటి వాటి గురించి ప్రస్తావిస్తే.. పవర్‌ప్లాంట్లు ఎక్కడుంటే మాత్రమేం.. విద్యుత్తు సరఫరా అవుతోంది కదా అని కొట్టిపారేస్తారు జడ్జిగారు అప్పాయింట్ చేసిన విద్యుత్తు రంగ నిపుణుడు విబి గుప్తా చెప్తారు... ... ఇలాంటి తరలింపుల వల్ల  విద్యుదుత్పత్తికి సంబంధించి సుమారు 1200 కోట్ల రూపాయలు ఏటా నష్టపోతున్నట్లు విద్యుత్తు రంగ నిపుణులు నెత్తీనోరూ బాదుకుంటే వినేవాడెవడు? లగడపాటి వింటే కృష్ణగారికి వినిపించేదేమో...  ప్రపంచంలో ఎంత చెత్త నిపుణుడైనా ఇలా మాత్రం రిపోర్టు ఇవ్వడు.

4. విద్యుత్తు వినియోగంలో తెలంగాణా ప్రాంతానికే అగ్రతాంబూలం అనీ అన్నారు.. వాస్తవానికి వినియోగం రేటింగ్‌ను గృహ వినియోగం ఆధారంగా నిర్ధారిస్తారు.. కమర్షియల్ వినియోగం ఇందులో లెక్కకు రాదు.. ప్రపంచ దేశాలన్నీ పాంటిచే ఇంటర్నేషనల్ ప్రామాణికం ఇది. గృహ వినియోగంలో  సగటు కంటే 40 శాతం తక్కువ ఉన్నది తెలంగాణాలోనే... మిగతా వినియోగం అంతా లగడపాటి వారి ల్యాంకోలు.. కావూరి లాంటి వారి బడా పరిశ్రమల పరిధిలోకి వస్తాయి.. తెలంగాణా జిల్లాల్లో, పల్లెల్లో ఇళ్లల్లో కరెంటు లేక చీకట్లో మగ్గుతున్న వారు వారికి కనిపించలేదు.
5. ఇక పవర్ నెట్‌వర్క్... తెలంగాణాలో అద్భుతంగా ఉందని సెలవిచ్చారు జస్టిస్ శ్రీకృష్ణ.. అంత నెట్‌వర్కే ఉంటే.. మొన్నటికి మొన్న ఆదిలాబాద్‌లో ఒక టవర్ కూలిపోతే, పది రోజులు అంధకారంలో ఉండిపోయారు అక్కడి ప్రజలు.. నెట్‌వర్కే ఉంటే, వేరే టవర్ నుంచి వెంటనే కరెంటు వచ్చేది. మరి వీరికి కనిపించిన నెట్‌వర్క్ ఎక్కడుందో? లగడపాటినడిగి చెప్పండి..
6. కరీంనగర్‌లో 1200 మెగావాట్ల గ్యాస్ ఆధారిత పవర్‌ప్లాంట్‌కు ప్రభుత్వం ప్లాన్ చేసిందని, ఇక అక్కడ  బ్రహ్మాండంగా విద్యుదుత్పత్తి జరుగుతుందని నివేదిక పేర్కొంది.. కానీ వాస్తవం కమిటీ కళ్లకు కనిపించనే లేదు. అసలు గ్యాస్ సరఫరాకే నిర్ద్వంద్వంగా తిరస్కరించిన తరువాత ఇక్క అక్కడ విద్యుదుత్పత్తి ఏం జరుగుతుంది.. దీన్ని లెక్కల్లో చూపించి తెలంగాణా అభివృద్ధిలో ముందంజలో ఉందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది? రెండో పవర్ ప్లాంట్ సత్తుపల్లిలో ఉందని చెప్పారు.. కనీసం అక్కడ భూమి సేకరించటానికి సైతం ప్రభుత్వం పూనుకోలేదు..స్థల సేకరణకు నిరాకరించారు. ఆ కాగితాన్ని చెత్తబుట్టలో పడేశారు.. ఇవి కాకుండా 17 ప్లాంట్లు సీమాంధ్రలో పెడుతున్నారు.. ఇది న్యాయం.. ఇది అభివృద్ధి... ఆహా ఎంత గొప్ప తీర్పు?

7 . ఇక ఇరిగేషన్.. తెలంగాణా వ్యవసాయంలో మిగతా మూడు ప్రాంతాలలో కంటే చాలా అగ్రస్థానంలో ఉందన్నది నివేదికలోని ఉవాచ... తెలంగాణాలో  కల్వకుర్తి, భీమా, భీమా -2, నెట్టెంపాడు, కోలిసాగర్, ఏఎంఆర్‌పి సింగిల్ స్టేజ్, ఏఎం ఆర్‌పి లో లెవల్.. దేవాదుల, ఇచ్చంపల్లి, పోచంపాడు.. ఇలా లిస్టు ఇస్తూ వెళ్లారు.. వీటిలో ఇరిగేషన్ కూడా అద్భుతంగా సాగుతోందని చెప్పుకుంటూ వచ్చారు. వీటిలో అసలు పూర్తయిన ప్రాజెక్టులు ఎన్ని? పూర్తి స్థాయిలో పని చేస్తున్నవి ఎన్ని? వాస్తవంగా ఎంత నీరు భూముల్లోకి చేరుతోంది? కనీస నిజాలను తెలుసుకున్నారా? వీటిలో ఏ ఒక్కటి కూడా  పూర్తి అయిన ప్రాజెక్టు కాదు. ఇక వీళ్లిచ్చే నీళ్లెన్ని? అన్నింటికీ మించి శ్రీరాం సాగర్ ఆయకట్టు కింద 18 లక్షల ఎకరాలకు నీరు అందుతోందనీ శ్రీవారు సెలవిచ్చారు.. ఒక్కసారి వారు వారి అయ్యగారు లగడపాటి ప్రభృతులు, చిదంబరం దొరవారు, కేంద్ర జలసంఘం చైర్మన్‌ను వెంటబెట్టుకుని వచ్చి తెలంగాణా ప్రజలకు బాబూ మేము చెప్పిన ఆయకట్టు ఇదే.. ఇక్కడే నీరు వస్తుందని చూపిస్తే సంతోషం.. ఇంత ఆయకట్టులో పంటలు పండుతుంటే, ఉత్పత్తి జరుగుతుంటే ఇంక సమస్యేముంది? ఆంధ్రప్రదేశ్‌తో విడిపోతామనటం వీళ్ల వెర్రే కదా.. !

ఏపిఎస్‌ఇబి ఎప్పుడు పుట్టిందో చెప్పటంతోనే నివేదిక ఏపాటిదో తెలుస్తోంది. ఇక కొత్తగూడెంను రాయలసీమతో కలపడంతో మరింత అద్భుతంగా వారి న్యాయనైపుణ్యం, నిశిత దృష్టి తెలుస్తోంది. ఇక నివేదికలోని మిగతా విషయాలను గురించి మాట్లాడటం బుద్ధి ఉన్న ప్రబుద్ధాంధ్రులు తప్ప ఇంకెవరికైనా ఎలా సాధ్యపడుతుంది?

లగడపాటి శ్రీకృష్ణ..,

శ్రీకృష్ణ ఇంటిపేరు లగడపాటి అని మార్చుకుంటే బాగుంటుందేమో.. సర్కారీ లెక్కలు.. ఓ పక్క.. లగడపాటి వారి తొమ్మిది భాగాల రిపోర్టు ఒక పక్క రెండూ జత చేస్తే.. శ్రీకృష్ణవారి నివేదిక.. శ్రీకృష్ణ నివేదికలో మొత్తం తొమ్మిది చాప్టర్లు ఉన్నాయి.  ఆంధ్రులతో తెలంగాణా వాళ్లు బలవంతంగా విలీనం అయినప్పటి నుంచి అనేక అంశాలపై లగడపాటి వారు విడివిడిగా చాప్టర్ల వారిగా శ్రీకృష్ణుడు ఇబ్బంది పడకుండా అందించారు.

రాష్ట్ర ఏర్పాటు.. పెద్ద మనుషుల ఒప్పందం
హైదరాబాద్
నిధుల కేటాయింపు అభివృద్ధి
సామాజిక, సాంస్కృతిక, భాష అంశాలు
కోస్తాంధ్ర, రాయలసీమ వెనుకబాటు..
శాంతి భద్రతలు
ఉద్యోగాలు- నియామకాలు,
రాష్ర్ట విభజన..
విద్యాసంస్థలు, వైద్య విద్యలు
ఇలా లగడ పాటి వారు చాప్టర్ల విభజన చేసి మరీ శ్రీకృష్ణకు అందించారు.

మొన్న రిలీజ్ అయిన శ్రీకృష్ణ నివేదికలోని చాప్టర్లను గమనించండి...
1. రాష్ట్రంలో పరిణామాలు, చారిత్రక నేపథ్యం
2. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, సమతౌల్యత
3. విద్య, వైద్యం
4. నీటి వనరులు, సాగునీటి అభివృద్ధి
5. ఉద్యోగాలు
6. హైదరాబాద్
7. సామాజిక, సాంస్కృతిక అంశాలు
8. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత
9. భవిష్యత్తుకు సూచనలు

ఇంక మిగతావాళ్లు ఇచ్చిన నివేదికలను, రిపోర్టులను, సిడిలను పరిశీలించే అవసరమే కమిటీకి లేకుండా పోయింది. తొమ్మిది నెలల్లో దాదాపు పది సార్లు రాష్ట్రంలో తిరగడానికే సరిపోయింది. ఇక లక్షలాదిగా తమ చేతికి వచ్చిన రిపోర్టులను పరిశీలించే సమయం, తీరిక, ఓపిక ఎక్కడుంటుంది? ఆ కాగితాల కట్టలు, సీడీల ముక్కలు రీసైక్లింగ్‌కి పంపించి ఉంటారు. ఇన్ని రిపోర్టులను పరిశీలించి, సమగ్రంగా వాస్తవాలను గ్రహించటానికి కనీసం అయిదారేళ్లయినా కమిటీకి పట్టి ఉండాలి.. ఎంత గొప్ప కమిటీ అయినా, ఎంత టెక్నాలజీ ఉన్నా సరే.. కేవలం తొమ్మిది మాసాల్లో వీటన్నింటినీ క్రోడీకరించటం అంత సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే విజ్ఞాన్‌భవన్‌లో వారికిచ్చిన ఆఫీసు కానీ, కంప్యూటర్లు కానీ, జీతభత్యాలు కానీ, రానుపోను ఖర్చులు కానీ, అన్నీ కలిపితే పదిహేను కోట్ల రూపాయల ఖర్చయిందని శ్రీకృష్ణ కమిటీ లెక్కలు చెప్తున్నాయి. అయిదుగురు సభ్యులతో పాటు వారి దగ్గర ఉన్నది 28 మంది అధికారులు, ఇతర సిబ్బంది.. మిగతా టెక్నికల్‌సపోర్ట్.. అవసరమైన డాక్యుమెంట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించింది. ఫిబ్రవరి 3 2010న కమిటీ ఏర్పాటైంది. ప్రజల నుంచి విన్నపాల కోసం అదేనెల 20న తొలి నోటిఫికేషన్‌ను 32 పత్రికల్లో ప్రచురించారు. అప్పటికి కమిటీకి పూర్తి స్థాయిలో సిబ్బందిని ఇవ్వలేదు. మార్చి 22న రెండో నోటిఫికేషన్‌ను పబ్లిష్ చేశారు. ఏప్రిల్ 10 చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తరువాత జూన్ చివరి దాకా వివిధపార్టీలతో సమావేశమయ్యారు. 23 జిల్లాలను వంతుల వారిగా తిరిగి వచ్చారు. ఇక మిగిలింది జూలై నుంచి డిసెంబర్ దాకా సుమారు 34 సార్లు కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ ఆరు నెలల్లోనే ఇన్ని లక్షల విన్నపాలను చదవటం సాధ్యమైందా? కేవలం 28 మంది సిబ్బందితో ఇన్ని విన్నపాలను క్రోడీకరించటం సాధ్యపడిందా? అన్ని వైపుల నుంచి విన్నపాలను పరిశీలించి ఎక్కువ మందికి సంతృప్తిని కలిగించే రిపోర్టును ఇచ్చామని చెప్పారు. అన్నింటినీ పరిశీలించి ఉంటే ఫుట్‌నోట్ మొత్తం కేవలం ప్రభుత్వం నుంచి తీసుకున్న రిపోర్టుల ఆధారంగానే నివేదికను రూపొందించినట్లు స్పష్టంగా చెప్పింది. మరి మిగతా వారి నివేదికల్లో వాస్తవాలను నిర్ధారించేదెవరు? అవన్నీ తప్పుల తడకలనీ, చెత్త కాగితాలనీ అర్థమా? ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదన్న ఆరోపణపైనే కదా ఉద్యమం మొదలైంది..ఇంత ఆందోళన.. ఇన్ని మరణాలు.. సర్కారు నుంచి తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదనే కదా...  మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను వాస్తవాలతో సరిపోల్చి చూసుకుని నిజాల్ని నిర్ధారించాల్సిన బాధ్యత కమిటీపై లేదా?  వాస్తవాలను నిర్థారించకుండా రెడ్డొచ్చె మొదలాడే అన్నట్లు ఎవరో ఇచ్చిన ఏకపక్ష నివేదికను కార్బన్ కాపీ చేసి ప్రచురించేసి ఓ పని అయిపోయిందనిపించుకుంది. ఇంతోటి దానికి ఇన్ని నెలలు వారికి జీతభత్యాలు.. బుగ్గకార్లు.. సెక్యూరిటీలు.. అన్నింటికీ మించి తెగ హడావుడి.. ఆ కమిటీలో లగడపాటినే మెంబర్‌ను చేస్తే ఒకే ఒక్కరోజులో నివేదిక ఇచ్చేవాడు కదా... సోనియమ్మకు కావూరి ఆ అయిడియా ఇవ్వలేదేమో.. పాపం ఆయనకు సూట్‌కేస్‌లు మోయటం తప్ప ఐయిడియాలు ఇవ్వటం తెలియదు కావచ్చు...
కొసమెరుపు..
ఒక చట్టబద్ధమైన కమిటీ తాను చర్చించాల్సి వారితో చర్చించి సమాచారాన్ని సేకరించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. ఇంతవరకే దాని బాధ్యత. దేశంలో గతంలో వేసిన కమిటీల చైర్మన్లది కొంచెం తెలివైతే.. శ్రీకృష్ణది అతి తెలివి. ఆయన చేసినంత హడావుడి అంతా ఇంతా కాదు..మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు... వారికి విందుభోజనాలు.. బహుమతి ప్రదానాలు.. వావ్.. సూపర్.. హైదరాబాద్‌లో, ఢిల్లీలో చివరిసారిగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సుల్లో విలేఖరులకు ఒక్కొక్కరికి టైటాన్ గడియారాలు దొరికాయి. వాటి విలువ ఎంతో తెలుసా.. ఒక్కొక్కటి సుమారు ఎనిమిది వేల రూపాయలు.
 ఇక దుగ్గల్  దొరవారు.. తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి వారు పిలవగానే వారి ఇంటికి వెళ్లి తెగ మంతనాలు జరిపి వచ్చారు.. ఇదేం నైతికత అంటే అబ్బే అదేం లేదు లేదు.. మీరు మమ్మల్ని అనుమానించనే అక్కర్లేదు.. తెలంగాణ ఎంపి పిలినిచా వెళ్తానన్నారు.. కానీ, సూట్‌కేస్‌లు ఇవ్వటానికి తెలంగాణ ఎంపిలకు ఏమీ లేదు.. అంత దమ్మూ ధైర్యమూ లేదు.. అమ్మగారు.. బెంగాలీ బాబుగారి దగ్గర జీహుజూర్ అనటానికి తప్ప ఎందుకూ పనికిరారు. పైన విలేఖరులకు గడియారాలిచ్చారని చెప్పానే... వాటి స్పాన్సరర్ ఎవరో తెలుసా... ఇంకెవరు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి.. బుర్ర ఉన్న ప్రబుద్ధాంధ్రులు  ఎలాగూ తిడతారు.. కనీసం తెలంగాణా వాళ్లైనా వాస్తవాలు తెలుసుకుని చైతన్యవంతులైతే సంతోషం.

అమల్లోకి వచ్చిన శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు..

శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తక్షణ అమల్లోకి తీసుకు వచ్చింది. కమిటీ ఇచ్చిన నివేదికలోని తొలి నాలుగు సిఫార్సులు ప్రాక్టికల్ కావని తేలటంతో.. ఇక అయిదు, ఆరు సిఫార్సుల్లో ఒకదాన్ని ఆమోదించాల్సిన, లేదా పూర్తిగా తిరస్కరించాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ దశలో ఇప్పుడు ఆరో సిఫార్సు గురించి  ప్రస్తావించటం, అమలు గురించి ఆలోచించటం తొందరపాటు అవుతుంది కాబట్టి అయిదో సిఫార్సులో అంతర్గతంగా చేసిన సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయటం ప్రారంభించింది. ‘‘ అన్‌లెస్ హాండిల్డ్ డెఫ్ట్‌లీ, టాక్ట్‌ఫుల్లీ, ఫర్మ్‌లీ..’’ అప్పుడు మాత్రమే అయిదో సిఫార్సులోని ప్రధాన అంశం అయిన రాష్ట్ర విభజన చేయాలని శ్రీకృష్ణ స్పష్టంగా సూచించారు. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్నది అదే. ఉద్యమాన్ని అణచివేయటం మీకు సాధ్యం కానప్పుడు, చేతకానప్పుడు మాత్రమే రాష్ట్రాన్ని విభజించాలని పేర్కొంది. అందుకే ఇప్పుడు ఉద్యమాన్ని అణచివేయాలన్న సిఫార్సును ముందుగా అమలు చేస్తోంది.. దీని పర్యవసానలను బట్టి, తీవ్రతను బట్టి, జయాపజయాలను బట్టి ,  మిగతా సిఫార్సుల సంగతి.. వాటిలోని ఇతర అంశాలను అమలు చేయాలన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. శాంతిభద్రతల పేరుతో విద్యార్థులపై దమనకాండ సక్సెస్ అవుతే తెలంగాణ ఉద్యమం వెనక్కి పోవటం ఈజీ అన్నది నిఘా వర్గాలు రాష్ట్రానికి, కేంద్రానికి పంపిన సంకేతం. కాబట్టి కేంద్రం ప్రస్తుతం ఆ దిశగా తొలి అడుగు వేసింది.

7, జనవరి 2011, శుక్రవారం

బెస్ట్‌ ఫస్ట్‌ ఆప్షన్-‌ కొత్త సీసాలో పాత సారా

తెలంగాణ ఉద్యమం ఎక్కడ మొదలైందో.. అక్కడికే తెచ్చి వదిలిపెట్టారు జస్టిస్‌ శ్రీకృష్ణ. ఏ కారణంతో  ఉద్యమం మొదలైందో.. అదే కారణాన్నే మళ్లీ పరిష్కారంగా చూపించారు సదరు న్యాయమూర్తి.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే సువర్ణాక్షరాతో లిఖించదగిన తీర్పు ఇది..ఇలాంటి తీర్పు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా ఇచ్చి ఉండరు.  దీని వల్ల సమస్యను పరిష్కరించటం ఎలా సాధ్యపడుతుందో ఆయనకైనా అర్థం అయిందో లేదో తెలియదు.. ఫస్ట్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఆయన చేసిన సిఫార్సు కొత్త సీసాలో పాత సారా మాత్రమే..
----------------------------------------------------
సమైక్యానికే మొగ్గు... శ్రీకృష్ణ కమిటీ నివేదికపై సర్వత్రా వ్యక్తమైన సగటు అభిప్రాయం ఇది.. నివేదికలోని అంశాలను చూస్తే అందరికీ ఇలాగే కనిపించింది. మొత్తం ఆరు సిఫార్సుల్లో అన్నింటికీ ఏదో ఓ కామెంట్‌ చేసిన శ్రీకృష్ణ కమిటీ నాలుగో ఆప్షన్‌పై మాత్రం అలా చెప్పి ఇలా వదిలేసింది.. ప్రాక్టికల్‌గా అదీ వర్కవుట్‌ కాదు కాబట్టే దానిపై ఎక్కువ చర్చించకుండా వదిలేసింది.. ఇక మిగిలింది రెండు ఆప్షన్‌లు.. వీటిలోనూ ఆరో ఆప్షన్‌ శ్రీకృష్ణ కమిటీకి ఫస్ట్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపించింది.. ఫస్ట్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా ఆరో సిఫార్సు ఎలా అయింది?

ఇంతకీ ఆరో ఆప్షన్‌లో  ఏం చెప్పారు?

మూడు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంతానికి రాజ్యాంగ పరమైన చట్టపరమైన హక్కులు కల్పించాలి. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. ౧౯౫౬ నాటి పెద్ద మనుషుల ఒప్పందం స్ఫూర్తిగా నిధుల బదలాయింపు, విధులు నిర్వహించే అధికారాలు ఉండాలి. ఈ అభివృద్ధి మండలి  రాష్ట్ర అసెంబ్లీకి జవాబుదారిగా ఉండాలి. తెలంగాణా ప్రాంతాభివృద్ధి కోసం తాను చేసే సిఫార్సులను అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. మండలికి ప్రభుత్వానికి భిన్నాభిప్రాయాలు వస్తే, గవర్నర్‌ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీకి నివేదించాలి.
ఇందులో గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, స్పీకర్‌, డిప్యూటిస్పీకర్‌, ప్రతిపక్ష నాయకుడు, మండలి చైర్మన్‌ ఉంటారు. ఇందులో మెజారిటీ అభిప్రాయం మేరకు నడుచుకోవాలి.
మండలికో సచివాలయం అదే ఓ ఆఫీసు.. దానికో బిళ్ల బంట్రోతు.. ఆయన తిరగడానికి ఓ బుగ్గ కారు ఇవ్వాలి. కేబినెట్‌ మంత్రికి ఉండే అన్ని సౌకర్యాలూ అనుభవించేయొచ్చన్నమాట.
బ్రహ్మాండం..

ఈ సిఫార్సులు అమలయితే తెలుగు వారంతా ఒక్కటిగానే ఉండవచ్చన్నమాట.. అటూ, ఇటూ తిరిగి మొదలైన చోటికి రావడమంటే ఇదే... రాజ్యాంగంలోని ౩7౦, ౩71 అధికరణల ప్రకారం ఈ సిఫార్సు రాష్ట్రం ఏర్పడిన నాడే అమల్లోకి వచ్చింది.. ఆ విషయం పాపం జడ్జిగారు మరిచినట్లున్నారు.. లేదా మళ్లీ చెప్పినా నష్టం లేదనుకోవచ్చు. తెలంగాణ ప్రాంత నిధులను ఆ ప్రాంతానికే ఖర్చు చేయాలని, ఉద్యోగాల విషయంలో  ప్రాధాన్యం ఇవ్వాలని ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ రాజ్యాంగంలోనే పొందుపరిచి ఉంది.
మండలి ఏర్పాటు ఉత్తర్వు వచ్చిన తరువాత దశాబ్దాల తరబడి చైర్మన్‌ను నియమించని ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది. అంతా లొల్లి చేస్తుంటే వైఎస్‌ హయాంలో ఆర్టీసీ హెడ్‌ ఆఫీస్‌లో ఓ గదిలో ఓ కుర్చీ వేసి దానికి మండలి చైర్మన్‌ అని పేరు పెట్టి  ఉప్పునూతల పురుషోత్తమరెడ్డిని అక్కడ కూర్చోబెట్టారు. బుగ్గకారు కూడా ఇచ్చారనుకోండి.. తీరిగ్గా పేపరు చదువుకోవటానికి, మిత్రులతో పిచ్చాపాటీ చేయటానికి సర్కారీ ఖర్చుతో ఆ రూము భేషుగ్గా పనికొచ్చింది.

ఇక రాష్ట్రపతి ఉత్తర్వులు.. ఈ ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ను పార్లమెంటు ద్వారా రాష్ట్రపతి మినహా మరెవరూ మార్చేందుకు వీల్లేదని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది.. కానీ, ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఓ అసిస్టెంట్‌ సెక్రటరీ, ఓ జీఓ ద్వారా మార్చేశాడు.. దాన్ని అడ్డం పెట్టుకుని 1993 నుంచి 2000 సంవత్సరం దాకా అడ్డగోలుగా ఉద్యోగాల నియామకాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర హోంమంత్రి దగ్గరకు వెళ్లి ఈ ఉత్తర్వుల ఉల్లంఘనను క్రమబద్దీకరించుకుని వచ్చారు.  పార్లమెంటుతో సంబంధం లేకుండా హోంమంత్రిత్వ శాఖే డైరెక్టుగా ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌కు పోటు పొడిచింది. వాస్తవానికి మనదేశంలో ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ను మించిన రాజ్యాంగ భద్రత లేదంటారు.. దానికే తూట్లు పొడిచిన మహానుభావులు కొత్తగా ఎలాంటి హక్కులు కల్పించగలరు? అంతకు ముందు ఎన్టీయార్‌ ౬౧౦ జీవో తెచ్చారు.. అదీ బుట్టదాఖలైంది.
ఇక అసెంబ్లీకి మండలిని జవాబుదారి చేయటం.. అసెంబ్లీలో మెజారిటీ అభిప్రాయం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక తెలంగాణా మండలి సిఫార్సులకు ఎంతమాత్రం విలువ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అపెక్స్‌ కమిటీలో తెలంగాణ మండలి చైర్మన్‌ ఒక్కరే ఉంటారు.. ఆయన మాట నెగ్గుతుందని ఎవరు మాత్రం ఎలా భావిస్తారు?

గతంలో అమలు కావలసిన దాన్ని ఇప్పుడు అమలు చేయమని చెప్తున్నారు. గతంలో అమలు కాకపోవటం వల్లనే ఉద్యమం వచ్చింది. ఇప్పుడు అమలు జరుగుతుందని తెలంగాణా ప్రజలు ఎలా నమ్ముతారు? అది ఎలా సాధ్యమవుతుంది? దీని వల్ల తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ సమసిపోవటం జరిగే పనేనా? విచిత్రమేమంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండటం సాధ్యం కాదని తానే తిరస్కరించిన తొలి సిఫార్సులో శ్రీకృష్ణ స్పష్టంగా చెప్పారు.. అలాంటప్పుడు ఇప్పుడు ఈ రీజనల్‌ బోర్డులతో మండలితో రాష్ట్రాన్ని యునైట్‌గా ఉంచటం ఎలా వీలవుతుందో ఆయనే చెప్పాలి.. ఇదంతా చూస్తే ముక్కెక్కడుంది అంటే చుట్టూ తిప్పి తిప్పి కనిపించలేదని చెప్పి మీరే మళ్లీ తిరగండని చెప్పినట్లుంది..

6, జనవరి 2011, గురువారం

హైదరాబాద్‌కు బ్రసెల్స్‌తో శ్రీకృష్ణ కమిటీ పోలిక

రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌ను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ బెల్జియంలోని బ్రసెల్స్‌తో పోల్చింది. ఇలా ఎందుకు పోల్చాల్సి వచ్చింది. కమిటీ విశ్లేషణ ప్రకారం 1968లో బెల్జియంలో బ్రసెల్స్ సిటీపై ఎవరికి హక్కులు ఉన్నాయన్న దానిపై వరుస అల్లర్లు జరిగాయి.. ఉత్తర ఫ్లామండ్ ప్రాంతం బ్రసెల్స్ సిటీ ఉంది. ఈ సమస్యను పరిష్కరించటానికి బెల్జియం రెండు సంస్కృతులు, మూడు ప్రాంతాలుగా ప్రకటించటం తప్ప మరో మార్గం కనిపించలేదు. బెల్జియంలో పది లక్షల జనాభా ఉంది. అందులో ఆరు లక్షల మంది ఫ్లెమిష్ మాట్లాడే ప్రజలు.. మిగతా నాలుగు లక్షల మంది ఫ్రెంచి మాట్లాడతారు.. చాలా తక్కువ మంది జర్మన్ మాట్లాడే వారు ఉన్నారు. ఈ రెండు వర్గాల కోసం రెండు భాషలకు సమాన రాజధాని ప్రాంతంగా, స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా బ్రసెల్స్‌ను ప్రకటించారు.
ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా బ్రసెల్స్ మాదిరిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది.  హైదరాబాద్‌ను బ్రసెల్స్‌తో పోల్చటం అంటే ఇక్కడ కూడా ద్విభాష, ద్విజాతి సిద్ధాంతాలున్నాయని కమిటీ భావిస్తోందా? అంటే ఆంధ్ర, తెలంగాణా వాళ్లు మాట్లాడే భాషలు వేరని అనుకుందా? ఓ పక్క కామన్ కల్చర్ అంటూనే బ్రసెల్స్ ప్రస్తావన తీసుకురావటం వెనుక ఆంధ్ర, తెలంగాణ వేరు వేరని శ్రీకృష్ణ కమిటీ చెప్పటంలో ఆంతర్యం ఏమిటి?

ఇంతకీ వారేం చెప్పారో వారికైనా అర్థమైందా?

ఇంతకీ జస్టిస్‌ శ్రీకృష్ణ  చెప్పిందేమిటి? వివాదానికి సంబంధించి జడ్జిమెంటును ఇవ్వబోతున్నానని చెప్పిన జస్టిస్‌ శ్రీకృష్ణ.. ఏం తీర్పు చెప్పారో కనీసం ఆయనకైనా అర్థమైందా? ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సమస్య ఉత్పన్నమైంది? దానికి ఎలాంటి పరిష్కారాన్ని ఇవ్వాలన్న దానిపై ఆయన స్పష్టతకు వచ్చారా? లేదా? అన్న సందేహం నివేదికలోని సిఫార్సులు పరిశీలించిన వారందరికీ వస్తుంది.. చెప్పిందే చెప్పి.. తాను చెప్పినదాన్ని తానే ఖండించి.. చివరకు ఏమీ తేల్చలేకపోయారు.
అయోమయం జగన్నాథం.. జగన్నాథుడంటే శ్రీకృష్ణుడే.. మన శ్రీకృష్ణుడే.. మన రాష్ట్రం భావి తల రాతను రాసిన శ్రీకృష్ణుడే.. జగన్నాథుడి పేరు పెట్టుకున్నందుకు ఈ కృష్ణుడు కూడా నివేదికలో అయోమయమైపోయారు.
ఏం జరుగుతుంది? రాష్ట్రాన్ని విభజిస్తారా? కలిపి ఉంచుతారా? హైదరాబాద్‌ను తెలంగాణా నుంచి చీలుస్తారా? లేదా? రాష్ట్రమంతటా ఒకటే ఉత్కంఠ.. ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయిన జనం.. ఏదో ఒక పరిష్కారం కోసం ఆశగా ఊపిరి ఉగ్గబట్టుకుని చూసిన ప్రజలంతా ఇప్పుడు బుర్రలు గోక్కుంటున్నారు..

అయోధ్య తీర్పు మాదిరిగా కర్ర విరగకుండా, పాము చావకుండా ఆరు సిఫార్సులు చేసి నొప్పింపక, తానొవ్వక శ్రీకృష్ణుడు తప్పించుకుని పోయాడు బాగానే ఉంది. కనీసం ఆ సిఫార్సుల్లో తాను చెప్పిన దానికైనా చివరకంటా కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు.. నివేదికను బుద్ధుడి సూక్తితో మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ గెలవాలి.. ఏ ఒక్కరికీ ఓటమి ఎదురుకావద్దు అన్నట్లుగానే అందరికీ కోరినవన్నీ పంచి పెట్టారు. అదే నివేదిక చివరకు వచ్చేసరికి బుద్ధుడి సూక్తిని మరిచినట్లున్నారు. ఫస్ట్‌ హోం మినిస్టర్‌ పటేల్‌జీ గుర్తుకొచ్చారు.. గ్రౌండ్‌ రియాలిటీలను మరిస్తే మాత్రం చాలా ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న అంశంపై తాము బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తున్నామంటూనే తెలంగాణా ప్రత్యేక డిమాండ్‌ నిర్హేతుకం కాదని కూడా వ్యాఖ్యానించటం న్యాయమూర్తికే చెల్లింది.

అసలు శ్రీకృష్ణ కమిటీ  మొత్తం ఎన్ని సిఫార్సులు చేసిందో మీకు తెలుసా? నాలుగు..  ఇదీ కృష్ణ లీలలో భాగమే.. ఒకటో సిఫారసుకు కొనసాగింపు ఆరో సిఫార్సు.. రెండో సిఫార్సుకు కొనసాగింపు నాలుగో సిఫార్సు.. ఇక మిగిలింది నాలుగే కదా..
మొదటి సిఫార్సులో రాష్ట్రాన్ని విడగొట్టొద్దన్నారు.. ఆరో సిఫార్సులో విడగొట్టకుండా తెలంగాణాకు రాజ్యాంగ పరమైన హక్కులేమివ్వాలో సూచించారు. రెండో సిఫార్సులో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నారు.. ఏయే ప్రాంతాలను కలిపి చేయాలో నాలుగో సిఫార్సులో చెప్పారు.
విచిత్రమేమంటే ఒకటో సిఫార్సులో యథాతథ స్థితిని కొనసాగించటం అసలు సాధ్యమే కాదని తేల్చి చెప్పారు.. ఆ సిఫార్సును తామే తిరస్కరించారు.. అదే ఆరో సిఫార్సు వచ్చేసరికి రాష్ట్రాన్ని ఇప్పుడున్నట్టుగా ఉంటూనే తెలంగాణాకు బోర్డులు, మండళ్లు, హక్కుల రూపంలో రాజ్యాంగ భద్రత కల్పించమన్నారు.. యథాతథ స్థితే సాధ్యం కాదన్నప్పుడు, ఇక హక్కులు కల్పించేదెలా సాధ్యపడుతుందో శ్రీకృష్ణే చెప్పాలి.
ఇక రెండో సిఫార్సు.. తెలంగాణా నుంచి హైదరాబాద్‌ను విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం.. తెలంగాణాలో ఇంటిగ్రల్‌ పార్ట్‌గా ఉన్న హైదరాబాద్‌ను కేంఅద పాలిత ప్రాంతంగా మారిస్తే తీవ్రమైన ఆందోళనలు కొనసాగుతాయని, దానికి తోడుగా మరిని కొత్త సమస్యలు వస్తాయని కాబట్టి ఇది ప్రాక్టికల్‌ కాదని తేల్చారు. అదే నాలుగో సిఫార్సు వచ్చేసరికి హైదరాబాద్‌ యూనియన్‌ టెర్రిటరీగా ఎలా చేయాలి? సరిహద్దులు ఏమిటన్నదీ విపులంగా వివరించారు.. ఒక సిఫార్సులో ఉన్నదాన్ని మరో సిఫార్సులో వాళ్లే ఖండించారు.. సూపర్‌..
తెలంగాణా ఏర్పాటు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందని, దాని జిడిపి కొన్ని రాష్ట్రాల కంటే పెరుగుతుందనీ పేర్కొన్న కమిటీయే కొన్ని లైన్లు కిందకు వచ్చేసరికి మావోయిస్టు సమస్య పెచ్చరిల్లుతుందని, సంక్షోభం రేకెత్తుతుందని పేర్కొంది. ఈ రెంటికీ పొంతన ఎలా కుదురుతుందో చిదంబరం వారే చెప్పాలి.. ఎందుకంటే మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులన్నది వారి మాటే కదా..
ఇక మూడో సిఫార్సు సంగతి.. రాయల తెలంగాణా ప్రాక్టికల్‌ కాదని భావించినప్పుడు అసలు ఆ సిఫార్సు చేయాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు. 
ఇక మిగిలింది అయిదో సిఫార్సు.. అసలైన సిఫార్సు  రెండు రాష్ట్రాలను ప్రస్తుత సరిహద్దుల ప్రకారం విడగొట్టమనటం.. చివరకు ఈ సిఫార్సుపైనైనా గట్టిగా కమిటీ నిలబడిందా అంటే అదీ లేదు.. అసలు ఇది రెండో బెస్ట్‌ ఆప్షన్‌.. అందరినీ కన్సల్ట్‌ చేసి మరీ డిసైడ్‌ చేసుకోండన్నారు.. ఇంతకీ వారేం చెప్పారో వారికైనా అర్థమైందా? ఏమో.. చిదంబరానికెరుక...

5, జనవరి 2011, బుధవారం

తెలుగు వారికి ఓ అరుదైన కానుక...

తెలంగాణా ప్రాంతంలో 1933లో వరంగల్‌ నుంచి2.5 సంవత్సరాల పాటు నడిచిన తెనుగు పత్రిక ఇ-బుక్‌ను ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెస్తున్నా.. ఒద్దిరాజు సోదరులుగా పేరు పొందిన ఒద్దిరాజు రాఘవ రంగారావు, ఒద్దిరాజు సీతారామచంద్రరావు గార్లు ఈ పత్రికను నిర్వహించారు.. వీరు చిత్రలేఖనంలో, ఫోటోగ్రఫీలో, సైన్స్‌లో, సాహిత్యంలో, పాత్రికేయతలో ఇలా పలు రంగాలలో ప్రసిద్ధులు.. ఆరోజుల్లో లెటర్‌ ప్రెస్‌లకు సంబంధించిన అక్షరాల డైలను తామే స్వయంగా తయారు చేసుకుని ఈ పత్రికను నిర్వహించేవారని చెప్తారు.. దీన్ని కలకాలం భద్రపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికను విశ్వవ్యాప్తం చేస్తున్నా... చరిత్రలో నిలిచిపోయే పత్రిక తెనుగు పత్రిక....
 
తెనుగు పత్రిక