2, మార్చి 2012, శుక్రవారం

అక్షరాయుధంతో అలుపెరుగని పోరు

            పౌర స్వేచ్ఛ అసలే లేని నియంతృత్వ నిజాం పాలనలో నిత్యమూ నిజాల్ని తెలిపేందుకు పత్రికల్ని ప్రచురించటం సాహసాల్లోకెల్లా సాహసం.. ఎడ్ల బళ్లు కూడా వెళ్లలేని ఊళ్లలో చాప్‌ఖానాలు (ప్రింటింగ్ ప్రెస్)ఆరంభించి పత్రికల్ని ప్రచురించటం తెలంగాణాలోనే సాధ్యమైంది. పక్కనే ఉన్న కోస్తాంధ్ర మేధావులు పలకరించకున్నా మొక్కవోని ధైర్యంతో తెలుగు తేజాన్ని అక్షర వేదికపై పత్రికా పాత్రలతో ప్రదర్శింపజేసిన మేధావులు ఆనాటి తెలంగాణా సంపాదకులు. ఎప్పుడో పాలమూరు నుంచి హితబోధినితో ఆరంభమైన తెలంగాణా పత్రికా ప్రస్థానం విశాలాంధ్ర అవతరణ వరకు తనదైన విశిష్ట వ్యక్తిత్వంతో విలక్షణ అస్తిత్వంతో వెలుగుదారుల్ని నిర్మిస్తూ పోయింది. మన పాత్రికేయులు మన ప్రతిభామూర్తులు. పెట్టుబడులు లేవు.. సొమ్ములు లేవు.. పైగా నిషేధాల సీమ. అంత నిర్బంధంలో పాత్రికేయ వృత్తిని ధర్మంగా, బాధ్యతగా స్వీకరించి ఒంటి చేత్తో నడిపించారు. ఇక్కడి పత్రికారంగం ఉద్యమాల్లో నెత్తురోడింది. ముష్కర రాజరికాన్ని నిర్నిరోధంగా ఎదురొడ్డి పోరాడింది.. మృత్యుకీలల్లో ఆహుతైనా సరే.. వెనుకడుగు వేయకుండా అధిక్షేపాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తెలంగాణా ప్రాంతంలో పత్రికల ప్రస్థానం ఒక పోరాటం.. ఒక ఉద్యమం.. జాతి అస్తిత్వం.. భాష అస్తిత్వం.. ఇక్కడి పత్రికల భాష మెతుకు భాష.. ఇక్కడి పత్రికల వాసన రైతు స్వేదన. ఇక్కడి పత్రికల రంగు ఏడువందల సంవత్సరాలుగా పాలకుల దాష్టీకంపై తెలంగాణా ప్రజలు నిరంతర పోరాటంతో చిందించిన రుధిరం.
....
1891 జూలై 5వ తేదీన హిందూ పత్రికలో ఒక వార్త వచ్చింది. అది నైజాం రాజ్యంలోని గుల్బర్గా నుంచి ఓ విలేఖరి రాసింది.. అందులో నైజాం రాజ్యంలో ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ‘‘గవర్నర్ జనరల్ పాలనలో ఉన్నప్పటికీ, బ్రిటిష్ ఇండియాలో లేని’’ ప్రాంతం అని స్పష్టంగా అందులో రాశారు. అంటే హైదరాబాద్ సంస్థానం అప్పటికీ స్వతంత్రంగా ఉంది. ఇదే విలేఖరి ఓ బ్రిటిష్ అధికారిని కలిసి హైదరాబాదులో పత్రిక పెట్టుకోవటానికి అనుమతి కోరితే.. మీకు అనుమతి దొరుకుతుందని నేననుకోవటం లేదన్నాడట సదరు అధికారి.. ఎందుకు అలా అనుకుంటున్నారంటే.. అలాంటి పత్రిక ఒకటి ఇక్కడ ఉండాలని మేము భావించటం లేదు కాబట్టి అని జవాబిచ్చాడట. నైజాం రాజ్యంలో  ఒక పత్రిక రావాలంటే అధికారుల ఇష్టాష్టాల మీద ఆధారపడి ఉండేవన్నది ఈ వార్త చెప్తుంది. నిజాం నవాబును ఎవరు ఆశ్రయిస్తే.. అందలం ఎక్కేవాళ్లకు ప్రోత్సాహం.. విమర్శించేవారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేదాకా వదిలిపెట్టకపోవటం.. ఇదీ ఆనాటి వాతావరణం. ది హైదరాబాద్ రికార్డ్(1890), దెక్కన్ టైమ్స్(1891), దెక్కన్ స్టాండర్డ్(1891), దెక్కన్ పంచ్ (1890లో వచ్చిన ఉర్దూ వార్తాపత్రిక)లు 19వ శతాబ్ది చివరలో హైదరాబాద్ నుంచి వచ్చిన పత్రికలు.  
పంధొమ్మిదో శతాబ్దపు తొలి దశకం వరకు హైదరాబాద్ రాజ్యంలో ఒక్క తెలుగుపత్రిక వెలువడిన దాఖలా లేదు.. కానీ, తొలి పత్రిక మాత్రం శేద్యచంద్రిక 1880లలోనే పాలమూరు నుంచి వెలువడింది. కానీ దాని దాఖలాయే దొరకలేదు.. ఉర్దూ మాతృభాష కాకపోయినా... మాట్లాడే వాళ్లు నూటికి ఇరవై మంది కూడా లేకపోయినా, హైదరాబాద్ సంస్థానంలో సుమారు ఇరవై దాకా ఉర్దూ పత్రికలు చెలామణిలో ఉండేవి.
ఈ మాట అనగానే, తెలంగాణా ప్రాంతంలో అసలు తెలుగే లేదని.. ఉర్దూ తప్ప ఇక్కడి ప్రజలకు తెలుగు రాదనే దుర్మార్గమైన ప్రచారం ఒకటి దుర్నీతితో జరుగుతూ వస్తోంది. దిక్కులేక తెలుగు చెప్పే మాష్టార్లను అరువు తెచ్చుకుని పాఠాలు చెప్పించుకున్నారనే నీతిబాహ్యమైన ప్రచారం జరుగుతోంది. తెలుగుకు అధికార ప్రోత్సాహం లేదు కానీ, ఆదరణ లేక కాదు. తెలంగాణేతర ప్రాంతంలో తెలుగు అధికార ప్రాపకంతో సంకరమైతే.. అచ్చతెనుగును తెలంగాణాలో ఇక్కడి ప్రజలు కాపాడుకున్నారు. ఇక్కడి ప్రతిభ ఎన్నడూ ప్రచారాన్ని కోరుకోలేదు.. ఇక్కడి క్రియాశీలత ఎప్పుడూ ఆడంబరాలను కోరుకోలేదు. ఇక్కడ వెలువడిన సృజన యావత్తూ పట్టెడు మెతుకులతో ప్రశాంతతను కోరుకున్నదే తప్ప కూటనీతితో ఒక జాతి అస్తిత్వాన్ని కూకటి వేళ్లతో కూలదోయాలని కోరుకోలేదు.. కుట్ర చేయలేదు.  దినపత్రికా, మాసపత్రికా అన్న తేడా లేదు. తెలంగాణాలో పత్రికలు ఎన్ని రూపాల్లో రావాల్లో అన్ని రూపాల్లోనూ వచ్చాయి. అన్ని రకాల ప్రయోగాలూ చేశాయి.. తరతమ భేదం లేకుండా, తెలంగాణా, తెలంగాణేతర ప్రాంతాల్లో అనన్యసామాన్యమైన గరిమ గలిగిన వాళ్లనెందరినో ఇక్కడ వెలసిన పత్రికలు తమ భుజాలమీద మోశాయి. అందరినీ ఒక్కటిగా, తెలుగువారిగా భావించి, తమ ప్రజానీకానికి వారి శేముషీప్రతిభను విస్తారంగా అందించాయి.
తెలంగాణాలో ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశకంలో మహబూబునగరానికి చెందిన శ్రీనివాసశర్మ, రామచంద్రరావు సోదరులు మొట్టమొదట ముద్రణాయంత్రాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు ఆత్మకూరు సంస్థానాధీశుడు మూడువేల రూపాయలు పెట్టుబడి పెడితే, ఆ మాత్రం యంత్రం కొనుగోలు సాధ్యమయింది. దాంతో 1912లో హితబోధిని మాసపత్రిక మొట్టమొదటి తెలంగాణా పత్రికగా వెలువడింది. 1917లో స్వామి వెంకట్రావు అనే సంపాదకుడు హైదరాబాద్ లోని గౌలిగూడ నుంచి ఆంధ్రమాత అనే పత్రిక నడిపారు కానీ, అది ఎక్కువ కాలం కొనసాగలేదు. 1920దశకం తెలంగాణ పత్రికా రంగానికి మైలురాయి. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టి.. ఇక్కడి జనజీవనాన్ని, ఉద్యమాల్ని, సమస్యల్ని, సామాజిక నేపథ్యాన్ని అచ్చంగా ప్రతిబింబించిన పత్రికలు ఈ దశకంలోనే వెలువడ్డాయి. ఎందుకంటే నిజాం సంస్థానంలోని పరిస్థితులు, ఇక్కడి ఉద్యమాల పట్ల, సమస్యల పట్ల, ఆందోళనల పట్ల కోస్తాంధ్ర పత్రికలు నామమాత్రంగానే స్పందించాయి. అప్పటికే నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల తెలంగాణేతర ప్రాంతానికి సరైన దృక్పథం లేదు.. అందువల్లే కావచ్చు తెలంగాణ ప్రాంతంలోని వార్తల పట్ల, ఇక్కడి ప్రజా సమస్యల పట్ల మొదటి నుంచీ అండదండలు అవసరమైన స్థాయిలో లభించలేదు.
ఇందుకు ఒకే ఒక్క ఉదాహరణ చెప్పవచ్చు. ఆంధ్రమహాసభ మితవాదుల చివరి సమావేశాలు మెదక్ జిల్లా కందిలో జరిగాయి. జమలాపురం కేశవరావు ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఆయన ప్రసంగాన్ని ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలు ప్రముఖంగా ప్రచురించాయి. ‘‘నిజాం రాష్ర్ఠ ఆంధ్ర మహాసభ అధ్యక్షుల ప్రసంగం కోస్తాంధ్ర నుంచి వెలువడే పత్రికల్లోనూ వెలుగు చూడటం అదే తొలిసారి’’ అని కోదాటి నారాయణ రావు రాశారు. మద్రాసు పత్రికల వ్యవహార శైలి తెలంగాణా పట్ల ఎలా ఉండేదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. వాళ్ల వైఖరి తెలుసు కాబట్టే కంది సభలపై తామే ఒక సంచికను ప్రచురించామని కోదాటి నారాయణ రావు తన ఆత్మకథల్లో రాసుకున్నారు... నిజాం కాలంలో ఎలాగూ ఆదరణ లేదు.. ఇవాళ తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనదని, తెలుగుజాతిని ఉద్ధరణను నెత్తికెత్తుకున్నవారికి అసలే లేదు.. స్వాతంత్రసమరయోధుడు మాడపాటి హనుమంతరావు మాటల్లో చెప్పాలంటే...
‘‘ ఆ కాలమున బ్రిటిషు ఆంధ్ర ప్రాంతము నుండి వెలువడుచుండిన తెలుగు పత్రికలు ఇచ్చటి ఆంధ్రోద్యమ వార్తలనప్పుడప్పుడు ప్రకటించుచుండెను. అయినను వాని వలన తగినంత అవసరమున నుండినంత సహాయము లభించలేదు. అది సహజమే. అవి దూరస్థలములుగా నుండుట యొక కారణము. బ్రిటిషిండియాలోని ఉద్యమముల బాహుళ్యము వలన ఇచ్చటి ఉద్యమముల ఎక్కువగా ప్రోత్సహించునవకాశము వారికి లేకయుండెను. ఆ కారణంము వలన నిజాం రాష్ట్రంలోని ఆంధ్రోద్యమము ఇచ్చటి తెనుగు పత్రికల యాశ్రయమునే నమ్ముకుని వానిపైననే ఆధారపడవలసినదయ్యెను. ఇట్టి స్థితిలో  మన రాష్ర్టములోని పత్రికలు చేసిన సేవ ఎంత యమూల్యముగా నుండెనో వేరుగా చెప్పవలసిన పని యుండదు. ’’
నిజమే.. నిజాం సంస్థానంలో పత్రికా స్వాతంత్య్రం నామమాత్రమే. తెలుగు పత్రిక స్థాపించాలనుకున్నా, స్థాపించుకున్న పత్రికలో ఏదైనా రాయాలనుకున్నా.. నిజాం మంత్రిమండలి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవలసిన పరిస్థితి... సర్కారుకు పూర్తిగా అనుకూలంగా ఉన్న పత్రికలను నిజాం సహజంగానే అక్కున చేర్చుకునేవాడు. కానీ, వాటి సంఖ్య వేళ్లపైన లెక్కపెట్టదగినవే. తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ మిత, అతివాద పంథాల్లో ప్రజల్లో జాతీయ వాద చైతన్యాన్ని మేల్కొల్పడంలో కృషి చేశాయి.
మాడపాటి హనుమంతరావు ముషీర్ ఏ దక్కన్ అనే పత్రికను నడిపించారు.. ఇది మితవాద పత్రిక.. కానీ, చరిత్రకారుడిగా నిలిచిన షోయబుల్లాఖాన్ నడిపించిన ఇమ్రోజ్ తన తరాన్ని మించిన స్వరాన్ని బలంగా వినిపించింది. అతివాదంతో రెచ్చిపోతున్న మత ఉన్మాదాన్ని నిర్ద్వంద్వంగా నిరసించింది.. ఇమ్రోజ్‌లో షోయబుల్లా ఉక్కుమాటలు.. ఖాసిం రజ్వీ రజాకార్ల మూకకు నిద్రలేకుండా చేసాయి. చివరకు షోయబ్‌ను హతమార్చేంత వరకూ రజాకార్లకు తిండి సయించలేదు..

హితబోధిని
తెలంగాణా నుంచి అన్ని లక్షణాలతో వెలువడిన పత్రిక హితబోధిని. 1913 జూన్ 13న మహబూబ్‌నగర్ నుంచి మొదటి సంచిక వెలువడింది. ఆనాటి దీని చిరునామా ఏమిటో తెలుసా? ‘సరోజినీ విలాస్ ప్రెస్ మహబూబ్ నగర్ నైజాం’ హైదరాబాద్ సంస్థానానికి నిజాంపేరుతో వచ్చిన ఫేమ్ నైజాం.. ఇవాళ్టికీ సినిమాలను ప్రాంతాల వారిగా పంపిణీ చేసేప్పుడు తెలంగాణా ప్రాంతాన్ని నైజాం అనే పిలుస్తారు. హైదరాబాద్‌కు పర్యాయపదంగా నైజాం అనేది వాడుకలో వచ్చింది.
హితబోధిని పత్రిక పెట్టుకోవటానికి దాని వ్యవస్థాపకులు బి.శ్రీనివాస శర్మ, బి.రామచంద్రరావు కనాకష్టం పడాల్సి వచ్చింది. వనపర్తి, ఆత్మకూరు సంస్థానాలకు విజ్ఞప్తి చేస్తే.. చివరకు ఆత్మకూరు సంస్థానాధీశుడు శ్రీరామ భూపాల బహిరీ బలవంత్ బహద్దూర్ ముద్రణా యంత్రానికి ఆర్థిక సాయం చేశారు.
ఇవాళ్టి పత్రికల్లో అనుబంధంగా వస్తున్న పుల్ అవుట్‌లను హితబోధిని ఆనాడే ప్రయోగాత్మకంగా ప్రచురించింది. పుల్ అవుట్ మాదిరి కాకపోయినా, పత్రికలో నాలుగు విభాగాలను ప్రత్యేకంగా ప్రచురించారు. 1. వ్యవసాయం, 2. వైద్యం, 3. పరిశ్రామికము, 4. సంఘ సంస్కరణము.
సంవత్సరం పూర్తయిన తరువాత 12 సంచికల్లోంచి ఏ విభాగానికి ఆ విభాగాన్ని విడదీసి కలిపి కుట్టుకుంటే ఎప్పటికీ ఉపయోగపడే పుస్తకాలుగా తయారయ్యే విధంగా వీటిని ప్రచురించేవారు. ఇటీవలి కాలంలో హిందూ దినపత్రిక ఇదే పనిని చేసింది. తన పుల్‌అవుట్‌లలో వివిధ రంగాలకు సంబంధించిన వ్యాసాలతో పుస్తకాలు ప్రచురించి మార్కెట్‌లోకి విడుదల చేసింది. దురదృష్టం ఏమంటే ఏడాది గడవకుండానే ఈ పత్రిక ఆర్థిక కష్టాల్లో కూరుకుని పోయి అంతర్థానం అయింది.
హితబోధిని తరువాత మనకు అందుబాటులోకి వచ్చిన పత్రిక నీలగిరి. 1921 నవంబర్ 12.. తెలుగు పంచాంగం ప్రకారమే చెప్పాలంటే, దుర్మతి నామసంవత్సరం, కార్తీక శుద్ధ ద్వాదశి రాత్రి హైదరాబాద్‌లోని ట్రూప్ బజార్‌లో హైకోర్టు వకీలు టేకుమాల రంగారావు నివాసంలో  11 మంది తెలుగు పెద్దలు సమావేశం అయి ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు. దీన్నుంచే ఆంధ్ర జన సంఘం ఏర్పాటయింది. దీని లక్ష్యాలలో ఒకటి పత్రిక ద్వారా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవటం.. ఈ టార్గెట్‌ను సాధించే దిశగా షబ్నవీసు వెంకట రామ నరసింహరావు నల్లగొంట నుంచి 1922 ఆగస్టు 24వ తేదీన నల్లగొండ పట్టణం నుంచి నీలగిరి పత్రికను ప్రారంభించారు. నల్లగొండకు సంస్కృత రూపం నీలగిరి. అందుకే ఆ పేరుతో పత్రిక వెలువడింది.  బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి లాంటి వాళ్లు ఈ పత్రికలో వ్యాసాలు రాసేవారు. పత్రిక పెట్టిన ఏడాది తరువాత జరిగిన ఆంధ్రమహాసభ సమావేశాలు నల్లగొండలోని నీలగిరి పత్రిక కార్యాలయంలోనే జరిగాయి. ఆంధ్రోద్యమానికి మద్దతునిస్తూ ఈ పత్రికలో వ్యాసాలు వచ్చేవి. దాదాపు అయిదు సంవత్సరాల పాటు నీలగిరి పత్రిక కొనసాగింది. అంతో ఇంతో డబ్బున్నవాడు కాబట్టి ఆయన పత్రిక ప్రారంభించగలిగాడు. కానీ, అదే పత్రిక ఆయన ఆర్థిక స్థోమతను అంతా దిగమింగేసింది. చివరకు పత్రికను మూసివేసిన కొన్నాళ్లకే షబ్నవీసు మరణించారు.. అప్పటికి ఆయన వయస్సు కేవలం 34 సంవత్సరాలంటే నమ్మబుద్ధి కాదు. కోస్తాంధ్ర నుంచి వలస వచ్చిన దూపాటి వెంకటరమణాచార్యులను షబ్నవీసు కొంతవరకు ఆదుకున్నారు. ఆయన జీవించి ఉంటే మరో సురవరం అయ్యేవారనటంలో సందేహం లేదు.
నీలగిరి పత్రిక వెలువడిన సరిగ్గా మూడే మూడు రోజుల తరువాత అంటే 1922 ఆగస్టు 27న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి అనే ఓ చిన్న గ్రామం నుంచి తెనుగు అనే పత్రిక వెలువడింది. తెలంగాణా వారి ప్రతిభకు, వాళ్ల శేముషీ సంపన్నతకు తెనుగు పత్రిక వ్యవస్థాపకులు మణికిరీటాలు. ఈ పత్రికను స్థాపించి,నడిపించిన వాళ్లు ఒద్దిరాజు సోదరులు. ఈ సోదరులు ఇద్దరిలో ఒకాయన ఒద్దిరాజు సీతారామచంద్ర రావు.  ఈయన హోమియో పతి వైద్యులు. తెనుగు పత్రికకు ఈయనే సంపాదకుడు. ఈయన తమ్ముడు ఒద్దిరాజు రాఘవ రంగారావు సహాయ సంపాదకుడు.  నీలగిరితో పాటు, తెనుగు పత్రిక సైతం దాదాపు అయిదు సంవత్సరాల పాటు నిజాం రాష్ట్రంలో ప్రతిభావంతులైన సంపాదకులతో నడిచింది. ఇద్దరు సోదరులు.. పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత భాషలలో రచనలు చేయగల సమర్థులు...
వీరిద్దరూ ఇనుగుర్తిలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు.. ఆ రోజుల్లో తెలంగాణాలో ప్రింటింగ్ ప్రెస్‌లు వేళ్లపైన లెక్కించేంతగా ఉండేవి. ప్రింటింగ్ ప్రెస్ సామాగ్రేమో మద్రాసులో దొరికేది.. ఇందుకోసం అన్నదమ్ములిద్దరూ మద్రాసు వెళ్లి అక్కడ ఉప్పల వీరన్న శ్రేష్టి అన్న వ్యాపారి దగ్గరి నుంచి సామాగ్రి తెచ్చుకునే వారు..
మద్రాసులో దొరికే కొత్త వస్తువులేవైనా సరే.. రోజుల వ్యవధిలోనే ఇనుగుర్తికి వచ్చేవి. గ్రామ్‌ఫోన్‌లు, సైకిలు, థర్మాస్ ఫ్లాస్క్.. ఇలా ప్రతి వస్తువూ కొత్తగా మార్కెట్‌లోకి వస్తే చాలు.. ఇనుగుర్తిలో ప్రత్యక్షమయ్యేవి.. వరంగల్లు జిల్లాకు కొత్తవస్తువులను చాలా వరకు పరిచయం చేసింది ఒద్దిరాజు సోదరులే. శుభకార్యాల ఆహ్వాన పత్రికలను వాళ్ల ప్రెస్‌లోనే ప్రచురించేవారు.ఈ సోదరులు పత్రికనే కాదు.. ఎస్. రాయ్ ఫార్మసీ అనే మందుల కంపెనీని కూడా స్థాపించారు. మధుర, పిత్త అనే మందులను వీళ్లే తయారు చేసేవారు. మొదటిది మలబద్దకానికి, రెండోది జ్వర నివారణకు బాగా పనికి వచ్చేది. మానుకోటలో మొట్టమొదట ఆయిల్ ఇంజన్ తెచ్చి బిగించిన వాళ్లు ఒద్దిరాజువారే.
వీళ్లు వైదిక సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసిన వాళ్లే.. షేక్‌స్పియర్ సాహిత్యం అంటే చెవి కోసుకునే వారు. గమ్మత్తేమిటంటే ఈ ఇద్దరు అన్నదమ్ములూ వయోలిన్‌కు అద్భుతంగా వాయించేవారు. తమ్ముడు రంగారావు వీణావాదనలోనూ ప్రతిభావంతుడే.. అంతే కాదు.. ఇద్దరికీ ఫోటోగ్రఫీ బాగాతెలుసు.. ఈ పేరుతో వీళ్లు ఓ పుస్తకాన్నే రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారి ప్రతిభకు అంతే ఉండదు.. వాళ్లకు చేతివృత్తుల్లో కూడా మాంఛి నైపుణ్యం ఉంది. వాళ్లకు వడ్రంగం తెలుసు. తాపీపని.. అంటే ఇల్లు నిర్మించే పని కూడా తెలుసు.. చెప్పులు కుట్టుకోవటం కూడా తెలుసు. ఇనుగుర్తిలో తమ ఇంటి ముఖద్వారపు నగిషీ పనిని వారే చేసుకున్నారు. వాళ్ల ఇంటిని వాళ్లే కట్టుకున్నారట.. ఎంత గట్టిగా కట్టుకున్నారంటే, కమ్యూనిస్టుల పోరాట కాలంలో దుండగులు గునపాలతో ఎంత ప్రయత్నించినా గోడ పెచ్చులు ఊడలేదట. దానితో విసుగు చెంది, ఒద్దిరాజు సోదరులు జీవితమంతా కష్టపడి సేకరించిన పుస్తకాలను తగులబెట్టి వెళ్లారట.
తెనుగు పత్రిక సగం డెమీ సైజలో, అంటే దినపత్రిక పరిమాణంలో సగం ఉండేది. ఇది వారపత్రిక. ప్రతి ఆదివారం వచ్చేది. వివిధ విషయాలపై సంపాదకీయాలు ఒకపేజీలో రాసేవారు.. స్థానిక వార్తలకు ఆనాడే పెద్దపీట వేసిన పత్రిక తెనుగు.. మోస్ట్ లోకలైజ్‌డ్ న్యూస్‌పేపర్ తెనుగు. మరో ఆరునెలల్లో మూతపడుతుందనగా తెనుగు పత్రిక వరంగల్‌కు మారింది. కానీ, మనుగడ సాగించలేకపోయింది. స్థానిక వార్తలకు ఇవాళ అన్ని పత్రికలూ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెనుగు ఆనాడే చేసి చూపింది.

1925లో హనుమకొండ నుంచి ఆంధ్రాభ్యుదయము తొలి సంచిక వెలువడింది. మార్చి నెలలో వచ్చిన ఈ సంచిక ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. పత్రికను ఆరంభించటానికి 1922లో ప్రభుత్వం అనుమతి కోరితే అది రావటానికి  ఏడాదిన్నర పట్టింది. ఈ సంచికలు నాలుగు రావటమే గగనమైపోయింది. నిజానికి ఈ పత్రికను 1919లోనే తీసుకురావాలని అనుకున్నారు. కానీ, 1923 నాటికి కానీ ఇది సాధ్యం కాలేదు. 1928 వరకు నాలుగు సంచికలు మినహా మిగతావి తీసుకురాలేదు. కోకల సీతారామ శర్మ ఈ పత్రికకు సంపాదకత్వం వహించారు.. తెలంగాణ ప్రాంతంలో గ్రాంధిక భాషావాదాన్ని సమర్థించిన పత్రిక ఆంధ్రాభ్యుదయము. గుర్రం జాషువా, సరిపల్లి విశ్వనాథ శాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, ఉమర్ అలీషా, సముద్రాల రాఘవాచార్యుల రచనలు ఈ సంచికల్లో మనకు కనిపిస్తాయి.

రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ దగ్గరలో మఖ్తేవడ్డేపల్లి అనే గ్రామం ఉంది. ఇప్పుడంటే రంగారెడ్డి జిల్లా కానీ, ఇది ఒకప్పుడు హైదరాబాద్ జిల్లానే.. ఇక్కడ బెల్లముకొండ నరసింహాచార్యులు అనే దేశభక్తుడొకాయన దేశబంధు అనే పత్రికను వెలువరించే సాహసం చేశారు. 1926 జూలైలో తూపురాన్ పోస్టు పరిధిలో ఉన్న ఈ మఖ్తేవడ్డేపల్లి నుంచి ఈ పత్రిక వచ్చింది. మూలధనంతో కాకుండా మూల రుణంతో పత్రికను ఆయన ప్రారంభించారు. ఏదైనా మంచిపని చేద్దామని అనుకుంటే ఎవరూ సహకరించలేదని ఆయన తన తొలి సంపాదకీయంలో పేర్కొన్నారు. దేశబంధు టైటిల్ కింద ఆంధ్ర విజ్ఞాన ప్రబోధక మాస పత్రిక అని టాగ్ లైన్ కూడా రాసుకున్నారు.
పత్రికకు వ్యాసాలు పంపే విషయంలో రచయితలు పాటించాల్సిన నియమాల గురించి సూచనలు చేసిన తెలంగాణా పత్రిక దేశబంధు. ‘‘ మా పత్రికకు పంపబడే వ్యాసములు సజ్జన సమ్మతముగా, దేశ హితముగా నుండవలెను. పరస్పరాంతః కలహాస్పదములగు మతముల విషయములు ఇందులో చేర్చబడవు. పత్రికల యందితరులు వ్రాయు వ్యాసములకు సంపాదకుడుత్తరవాది కాదు’’. ప్రింటింగ్ ప్రెస్ కోసం సంపాదకుడు విరాళాలు సేకరించి మరీ నడిపించారు.

తెలంగాణ ఉద్యమ శిఖరం గోలకొండ

తెలంగాణకు ఇవాళ మనం సమైక్యమని భావిస్తున్న తెలుగునేల నాలుగు చెరగలా తనదైన అస్తిత్వాన్ని నిలిపి చూపించిన పత్రిక గోలకొండ. తెలంగాణాలో సుదీర్ఘకాలం కొనసాగిన అచ్చమైన తెలుగు పత్రిక. మంచి అడ్వకేట్‌గా పేరు సంపాదించుకున్న సురవరం ప్రతాపరెడ్డి గారి మనసు పత్రికారంగంవైపు మళ్లింది.. దాని పర్యవసానంగా 1926 మే పదవ తేదీన.. అంటే ఉర్దూ కేలెండర్ ప్రకారం తీర్ నెల మూడో తేదీ.. గోలకొండ పత్రిక తొలి సంచిక అచ్చయింది. దీని తొలి పెట్టుబడి 7వేల రూపాయలు. మొదట అడ్డంకులు ఎన్నో ఎదురుకావచ్చు. కానీ, పత్రిక ప్రారంభించిన సంకల్పం గొప్పది.. అందుకే గోలకొండ పత్రిక పాతిక సంవత్సరాల పాటు తన కలం నుంచి అక్షర తూణీరాలను అప్రతిహతంగా వదులుతూనే ఉంది.
నిజంగా నిజాం కాలం నాటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే గోలకొండ పత్రిక  అన్నేళ్ల పాటు ఎలా కొనసాగిందా అన్న ఆశ్చర్యం వేస్తుంది. కానీ, సురవరం వారు ఆనాటి స్థితిగతులను వాస్తవిక దృష్టితో  చూసి తెలంగాణా సాంస్కృతిక, రాజకీయ, సామాజిక చిత్రాన్ని గోలకొండ పత్రిక ద్వారా ప్రపంచానికి చూపించారు.
‘‘ ఈ పత్రిక ఆంధ్రులకు (వారు బయటి వారు కానీ, రాష్ట్రీయులు కానీ) అసాధారణమగు సంబంధం కలది. సర్వకాలాలందు కానీ, అనుకూలం కానట్టి వాతావరణంలోనూ క్లిష్ట పరిస్థితులలోనూ ఈ పత్రిక నడపబడుతున్నది. అట్లున్నను మా పత్రికలలో అత్యగ్రస్థానం వహించిన మూడు నాలిగింటిలో దీనినొకదానినిగా చేసిన నిజాం రాష్ట్రాంధ్రుల సేవ ప్రశంసనీయం. సురవరం ప్రతాపరెడ్డిగారు వారి సహచరులును పత్రికను సజీవముగా నుంచుటయే గాక ఉత్తమమైన స్థాయిలో దీనిని బాగుగా నడుపుతూ తద్వారా ఆంధ్రుల శక్తి సామర్థ్యాలకు ప్రోద్బలం కలిగించినందులకు అన్ని విధాలా ఆంధ్రుల యొక్క గాఢమగు కృతజ్ఞతకు పాత్రులగుచున్నారు. ’’ కోదాటి నారాయణరావు స్వీయ చరిత్ర నారాయణీయంలో  వివరించారు. తెలంగాణాలో పత్రికారచనను అలవరచుకున్న వాళ్లు చాలా తక్కువగా ఉన్నారని, అందువల్ల ఆ రంగాన్ని ఎంచుకుంటే అభివృద్ధిలోకి వస్తావంటూ కోదాటి వారిని మాడపాటి వారు ప్రోత్సహించారట. ఆయన ప్రోత్సాహంతోనే కోదాటి వారు గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా చేరి తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు.
గోలకొండ మొదట అర్థవార పత్రిక.. ఆ తరువాత దినపత్రికగా మారింది. ఇది ఆనాడు ఆర్థిక స్థోమత లేక సరిగా రాలేకపోయింది. పత్రికను ఎలాగైనా బతికించేందుకు ఒకే పత్రికను, రేపటి పత్రిక, నిన్నటి పత్రిక, ఇవాళ్టి పత్రిక అని అమ్మే వారట.. జనం కూడా కొనటానికి వెనుకాడలేదు. పత్రిక క్రమం తప్పకుండా రావటం మొదలు పెట్టిన తరువాత ఈ ఆరోపణలు తగ్గిపోయాయి. వేతనాలు తక్కువగా ఉన్నాయని కంపోజిటర్లు ఆందోళన చేస్తే, తమ వద్ద తొందరగా పని పూర్తి చేసుకుని వేరే పత్రికలో పనిచేసే అవకాశాన్ని సురవరం వారు వారికి కల్పించారు.
‘‘గోలకొండ సంపాదకీయాలు అద్భుతం నిజాం ప్రభుత్వానికి అది గుండెలో కుంపటి. అది పత్రిక మాత్రమే కాదు, మహా సంస్థ. గాఢాంధకారంలో ఉన్న కాంతిరేఖ గోలకొండ’’ అని దాశరథి తన యాత్రాస్మృతిలో రాశారు. నాటి తెలంగాణాను మనం కళ్లకు కట్టినట్లు చూడాలంటే గోలకొండ పత్రికను చూస్తే చాలు.
ఒక పత్రిక వ్యక్తి స్థాయి నుంచి వ్యవస్థకు ఎదిగింది గోలకొండ తోనే. గోలకొండ నిర్వహణకు ఒక లిమిటెడ్ కంపెనీ ఏర్పడింది. డైరెక్టర్ల బోర్డుకు రాజా రామేశ్వరరావు అధ్యక్షులైతే, మేనేజింగ్ డైరెక్టర్‌గా నూకల నరోత్తమరెడ్డి వ్యవహరించేవారు. తెలంగాణా పత్రికా ప్రస్థానంలో ఒక పత్రిక ఇండస్ట్రీగా ఎదగటం అదే తొలిసారి. ప్రతాపరెడ్డినీ, గోలకొండ పత్రికనూ విడదీసి చూడటం సాధ్యం కాదు. అనారోగ్యం కారణంగా ఆయన నిష్ర్కమణ తరువాత గోలకొండ బలహీనమవుతూ వచ్చింది. 1966 ఆగస్టు 22న గోలకొండ పత్రిక మూతబడింది. గోలకొండ నుంచి బయటకు వచ్చిన తరువాత సురవరం ప్రతాపరెడ్డి ప్రజావాణి పత్రికను ప్రచురించేందుకు ప్రయత్నించారు కానీ, అది నడవలేదు..

సికిందరాబాద్ నుంచి 1942 ప్రాంతంలో వెలువడిన మాసపత్రిక తరణి. జ్యోతిష్య శాస్త్రం వంటి ప్రాచీన శాస్త్ర విషయాలతో పాటు ఆధునిక సాహిత్య విషయాల వరకు వైవిధ్యం కలిగిన రచనలతో కొద్ది కాలం మాత్రమే వచ్చిన పత్రిక ఇది. సుబ్బరాయ సిద్ధాంతి అనే ఆయన దీనికి సంపాదకుడు. దేవులపల్లి రామానుజరావు శోభ 1947లో ప్రారంభించి కొంతకాలం నడిపి చేతులు కాల్చుకున్నారు. ఇది మాసపత్రికగా తెలంగాణా సాహిత్య శోభలను వెదజల్లింది. ఇదే వరంగల్ జిల్లా జనగామ తాలూకా గూడూరు గ్రామంలో బొబ్బాల ఇంద్రసేనారెడ్డి (ఈయన నటుడు, దర్శకుడు కూడా)గ్రామజ్యోతి పేరుతో గోడ పత్రికను నడిపించాడు. వారానికోసారి గోడపై వార్తలు రాసేవారు.. వారం తరువాత వాటిని చెరిపేసి కొత్త వార్తలు రాసేవారు. ప్రభుత్వం ఈ గోడ పత్రికపై వార్తలను కూడా సెన్సార్ చేసేది. వరంగల్ పత్రికా రంగంలో ప్రభుత్వానికి 50 రూపాయలు జరిమానా కట్టిన మొదటి పత్రిక ఈ గోడ పత్రికే.


తొలి దినపత్రిక తెలంగాణ
తెలంగాణ ప్రాంతం నుంచి వెలువడిన తొలి తెలుగు దినపత్రిక తెలంగాణ. 1941-42 ప్రాంతంలో బుక్కపట్నం రామానుజాచార్యులు ఈ పత్రిక ప్రారంభించారు. బికె చారిగా ప్రసిద్ధి చెందిన ఈయన 1929లోనే హైదరాబాద్ బులెటిన్‌ను స్థాపించిన అనుభవం ఉంది. అంతే కాదు, తన మిత్రుడు కె. రాజగోపాల్‌తో కలిసి 1937లో దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రికను ప్రారంభించారు. దక్కన్ క్రానికల్‌లో బుక్కపట్నం వారు చార్మినార్ గాసిప్ అని కాలమ్ రోజూ నడిచేది. బడాబడా నవాబు అంతఃపురాలలోని విషయాలు, పై అధికార వర్గం కార్యాలయాల రహస్యాలు ఇందులో వచ్చేవి. ఇందులో ఉన్నప్పుడే తెలంగాణ దినపత్రిక ప్రారంభమైంది కానీ, ఎక్కువ కాలం కొనసాగలేదు. గోలకొండ పత్రిక దినపత్రిక అయినప్పటికీ అది వారపత్రికగా కొంతకాలం రావటం వల్ల తొలి దినపత్రికగా తెలంగాణాను పేర్కొనవచ్చు. ఆరోజుల్లో తెలంగాణలో దక్కన్‌క్రానికల్ ఆంగ్ల దినపత్రిక అయితే, గోలకొండ తెలుగు దినపత్రిక అనేవారు. ఉర్దూలో మీజాన్ ఉండేది. వీటి మధ్యలో తెలంగాణా వచ్చింది. నాంపల్లి స్టేషన్ రోడ్డు నుంచి వెలువడ్డ ఈ పత్రిక సంవత్సర చందా ఎంతో తెలుసా? 22 రూపాయలు.

ఆంధ్ర సారస్వత మహా సభ ప్రచురించిన పత్రిక ఆంధ్రశ్రీ. ఇది సికిందరాబాద్ నుంచి 1944లో త్రైమాసిక పత్రికగా మొదలైంది. అంతకు ముందు 1941లో సికింద్రాబాద్ నుంచే తెలుగుతల్లి పత్రిక వెలువడింది. రాచమళ్ల సత్యవతీదేవి ఈ పత్రిక సంపాదకులు. అడవిబాపిరాజు, వెల్దుర్తి మాణిక్యరావు, వట్టికోట ఆళ్వారుస్వామి సహాయ సంపాదకులు. కింగ్స్‌వే లోని ఇమాంబావి వీధిలో ఈ పత్రిక కార్యాలయం ఉండేది. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం నిర్వహణలో ఈ పత్రిక ప్రచురణ జరిగింది. 1949జూన్‌లో హైదరాబాద్ నుంచి ఓ పక్ష పత్రిక కొంతకాలం నడిచింది. దీనిపేరు భాగ్యనగర్. అయోధ్య రామకవి దీనికి సంపాదకుడు. సహాయ సంపాదకుడుగా యం రాజేశ్వరరావు పేరు పత్రికలో కనిపిస్తుంది. ఇది సుల్తాన్ బజార్ ప్రాంతంనుంచి వెలువడేది. పోలీసు చర్య తరువాత రాజకీయ వాసనలు పుణికిపుచ్చుకుని వెలువడిన పత్రిక భాగ్యనగర్. ఈ పత్రిక పాత ప్రతులు హైదరాబాద్ కేంద్ర గ్రంథాలయంలో కనిపిస్తాయి. మొత్తం ఆరు సంచికలు వెలువడిన తరువాత ఇది ఆగిపోయింది. 1940 అక్టోబర్‌లో హైదరాబాద్ సాహిత్య పరిషత్ ఏర్పడింది. ఇది 1945లో హైదరాబాద్ ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రికను ప్రారంభించినా ఆదిలోనే ఆగిపోయింది. అయితే 1955లో విద్యార్థుల వాణిని మాత్రమే వినిపించేందుకు హైదరాబాద్ నుంచి కె.ఎం నరసింహరావు విద్యార్థి వాణి పత్రికను తీసుకువచ్చారు. విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనాలా? పాల్గొంటే ఎలాంటి పాత్ర పోషించాలి వంటి వ్యాసాలను ఇందులో ప్రచురించేవారు.

మీజాన్
తెలంగాణాలో ఏకకాలంలో మూడు భాషల్లో వెలువడిన మొదటి పత్రిక మీజాన్. కలకత్తాకు చెందిన గులాం మహమ్మద్ ఈ పత్రికను స్థాపించాడు. ఏడవ నిజాముకు ఇతను నమ్మిన బంటు.. నవాబుకు పూర్తి మద్దతునిచ్చే పత్రికను నడిపించే ఉద్దేశ్యంతోనే మీజాన్ మొదలైంది. అడవి బాపిరాజు ఈ పత్రిక తెలుగు విభాగానికి సంపాదకుడుగా ఉండేవారు.. బాపిరాజు గురించి నాటి తెలంగాణా సాహితీవేత్తల్లో, నాయకుల్లో ఎలాంటి అపోహలు లేవు. అయితే మీజాన్ పత్రిక నిజాం అనుకూల పాలసీ కావటం వల్లనే చిక్కులు వచ్చాయి. మీజాన్‌లో చేరిన తరువాత నిజాం పరిపాలనలోని నిప్పులాంటి నిజాలు తెలిసి వచ్చాయి. తాను కలకత్తావాలా కబంధ హస్తాల్లో ఇరుక్కున్నానని తెలుసుకున్నారు. పత్రిక ప్రారంభించిన 65 రోజులకే నవాబు వారి పుట్టినరోజు వేడుకలు వచ్చాయి. అందులో రెండు సంపాదకీయాలు వచ్చాయి. ఒకటి నిజాంకు అభినందనలు అన్న పేరుతో వస్తే.. రెండవది తప్పుడు ప్రచారం అన్న శీర్షికతో వచ్చింది. రెండో సంపాదకీయంలో అప్పటికే ఉర్దూలో ప్రసిద్ధి చెందిన రయ్యత్ పత్రిక సంపాదకుడు మందుముల నరసింగరావును దేశద్రోహిగా చిత్రిస్తూ రాశారు.. దీనిపై ప్రజాకవి కాళోజీనారాయణరావు తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘‘ 65 రోజుల ఉనికి ఉన్న పత్రిక మీది. మీరు హైదరాబాద్ వచ్చి కూడా 65 రోజులే అయింది. నిజాం వంశీయుల కంటే ముందే నిజాం సంస్థానంలో ఉన్న మందుముల వారిని గురించి దేశద్రోహి అని ఎట్లా రాస్తార’’ని బాపిరాజును నేరుగా నిలదీశారు. దానికి బాపిరాజు ‘‘కాళోజీ నారాయణరావు గారూ.. ఏం చేయమంటరండీ నన్ను, నెలకు నూట యాభై రూపాయల జీతమిస్తమన్నారు. దాంతోటి నాకు రెండు పూటల తిండి దొరుకుతున్నది. వాండ్ల ప్రెస్‌లనే నా నవల లేవన్న ఉంటే అచ్చు వేసుకోమన్నారు’’ అన్నారట. 1940వ దశకంలో చోటు చేసుకున్న సంఘటన ఇది. కాళోజీ తన అంతేవాసి నాగిళ్ల రామశాస్త్రితో వివరించిన  ఈ ఘటనను ఆయన ఆ తరువాత అక్షరబద్ధం చేశారు. ఈ పత్రికలో విద్వాన్ విశ్వం, తిరుమల రామచంద్ర, రాంభట్ల కృష్ణమూర్తి, శ్రీనివాస చక్రవర్తి లాంటి వాళ్లు పని చేశారు.. ఆరోజుల్లో వీళ్లందరినీ కలిపి ద్వాదశ మార్తాండులని పిలిచేవారు. ఉగాది సందర్భంగా మీజాన్ పత్రిక తెలంగాణ ప్రముఖులకు బిరుదులు ప్రకటించేది.. ఇవి నవ్వుకునేట్లు ఉండేవి. కాకపోతే అంతా సరదాగా తీసుకునే వారు. అందులో మచ్చుకు ఒకటి.. దేవులపల్లి రామానుజరావుకు ఇచ్చిన బిరుదు. అది ‘‘ఏకశిలానగర శిలాఫలక కలకల శోభావిభావరి’’.
మీజాన్ క్రౌనుసైజు నాలుగు పేజీలుగా వచ్చింది. వార్తలకు తొలి, ఆఖరు పేజీలు. రెండో పేజీలో సంపాదకీయం, ధూపదీపాలు(బాపిరాజు రాసేవారు), నుడి నానుడి(తిరుమల రామచంద్ర రాసేవారు), నర్తనశాల(శ్రీనివాస చక్రవర్తి రాసేవారు.), కలంపోటు(బిసి కామరాజు రాసేవారు),  మిర్చిమసాలా (రాంభట్ల కృష్ణమూర్తి రాసేవారు), టైంబాంబులు (బొమ్మకంటి సుబ్బారావు రాసేవారు). మూడో పేజీలో బాపిరాజు నవల డైలీ సీరియల్ అచ్చయ్యేది. స్థూలంగా మీజాన్ పత్రిక కూర్పు ఇది.  దినపత్రికలో రోజూ నవలను ప్రచురించే సంప్రదాయాన్ని మొదలు పెట్టింది మీజాన్.

1941లో హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఆరుగురు ఉత్సాహవంతులైన యువకులు ప్రారంభించిన పత్రిక ఆంధ్రకేసరి. గుండవరపు హనుమంతరావు దీనికి సంపాదకుడు. 1941 ఫిబ్రవరిలో ఈ పత్రిక తొలి సంచిక వెలువడింది. ‘‘ నైజాము రాష్ట్రంలో 75లక్షల మంది ఆంధ్రులున్నారు. వారి ప్రత్యేక ఆర్థిక సాంఘిక సమస్యలకు తమకనుగుణ్యమగు పరిష్కరణా విధానములను ప్రజలకు తెలుపుటకై వార్తాపత్రికలు, సంచికలు వారికి స్వయముగానుండుట తప్పనిసరి’’ అన్నది ఈ పత్రిక లక్ష్యం. 1944లో మాసపత్రికగా ప్రారంభమైన పత్రిక కాకతీయ. పివి నరసింహరావు వరుసకు సోదరుడైన పాములపర్తి సదాశివరావు మరి కొందరు మిత్రులు కలిసి ఈ పత్రికను స్థాపించారు. అయితే ఇది ఏడాది పాటు కూడా నడవలేదు. కానీ, 1946లో ఇది సాంస్కృతిక, ప్రాంతీయ, రాజకీయ, సాహిత్య పత్రికగా తిరిగి ప్రారంభమై ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగింది. దేశ ప్రధానమంత్రిగా కీర్తిగడించిన పివి నరసింహరావు ఈ పత్రికలో మూడు పేర్లతో వ్యాసాలు రాసేవారు. ఆయన హాస్యరచనలు కూడా చేశారు. దురదృష్టమేమిటంటే ఈ పత్రిక ప్రతులు ఇప్పుడు లభించవు.

రయ్యత్
వాక్స్వాతంత్య్రము లేదు.. బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛ అంతకంటే లేదు.. ఆందోళనలకు, ధర్నాలకు, సహాయ నిరాకరణానికి ఎలాంటి అవకాశము కూడా లేదు. ఇలాంటి వాతావరణంలో పత్రికల ద్వారా ప్రజల్లో కొంతైనా చైతన్యం తేవచ్చనే ఒకే ఒక ఉద్దేశంతో ఉర్దూలో రయ్యత్ పత్రిక మొదలైంది. తెలంగాణ పత్రికారంగంలో రాజధిక్కార స్వరాన్ని ప్రత్యక్షంగా, తీవ్రంగా వినిపించిన తొలి పత్రిక రయ్యత్. మందుముల నరసింగరావు దీని సంపాదకులు.. నిజాం ప్రభుత్వం దేశద్రోహిగా అభివర్ణించినా తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ముందుకు వెళ్లగలిగిన పాత్రికేయుడు మందుముల. తన పత్రిక ద్వారా తెలంగాణ ప్రజానీకానికి అవసరమైన జాగృతిని కలిగించటంలో ఆయన విజయం సాధించారు. తెలంగాణాలో జరుగుతున్న నిజాం వ్యతిరేక యుద్ధాన్ని గురించి ఎక్కడో ఉన్న ఉత్తర భారతీయులకు సమాచారం అందిందంటే అది రయ్యత్ పత్రిక వల్లనే సాధ్యపడింది. ఆనాటి మితవాద యుగంలో దాని పరిమితులను దాటి అతివాద పోరాట పంథాను కలానికికెత్తుకున్న యోధా రయ్యత్ అని చెప్పటానికి సందేహం అక్కర్లేదు. ఆరోజుల్లో దేశ సమస్యలను గురించి ఆలోచించే ప్రతివారూ రయ్యత్ పత్రికను చదివేవాడు. ప్రభుత్వ విధానాలను విమర్శించటంలో ఎంతమాత్రం జంకకుండా ధైర్యంగా ప్రజల పక్షాన నిలిచిన గౌరవం రయ్యత్ పత్రికకే  దక్కుతుంది. నూరు రూపాయల పెట్టుబడితో 1927లో రయ్యత్ మొదలైంది. మొదటి సంచికకు సరోజినీ నాయుడు శుభాఃశీస్సులు అందించారు. రెండో సంచికలో మహరాజా కిషన్ పర్షాద్ కవితలు అచ్చయ్యాయి. 1929నిజాం ప్రభుత్వం రయ్యత్‌ను నిలిపివేసింది. తిరిగి 1932లో మళ్లీ మొదలైంది. పింగళి వెంకట రామరెడ్డి 500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. గోలకొండ పత్రికకు ఇది సమకాలీన పత్రికే. ఇది వారపత్రిక నుంచి దినపత్రిక స్థాయికి ఎదిగాక, గోలకొండ మాదిరిగానే, రయ్యత్ లిమిటెడ్ కంపెనీగా ఎదిగింది. ఇరవై సంవత్సరాల పాటు ఉద్యమ క్షేత్రంలో ఉరకలెత్తిన పత్రిక ప్రభుత్వం నిషేధించటంతో మూతపడాల్సి వచ్చింది.

షోయబుల్లాఖాన్

తెలంగాణా పాత్రికేయ రంగానికి ప్రాతఃస్మరణీయుడు, తెలంగాణా జర్నలిస్టులకు పూజనీయుడు షోయబుల్లాఖాన్. నిజాం సంస్థానంలో రజాకార్ల దురంతాలను నిర్భయంగా ఎండగట్టి.. పెన్ పవర్‌ను చూపించిన సాహసి. ముష్కర మూకల దొంగదెబ్బకు బలైపోయిన అమరుడు. ఈయన రాజకీయ ప్రస్థానం రయ్యత్ పత్రికతోనే మొదలైంది. మందుముల నరసింగరావు దగ్గర పని చేస్తున్న నలుగురు సహాయ సంపాదకులు రాజీనామా చేసి వెళ్లిపోవటంతో ఇద్దరు సంపాదకులను వెతుక్కోవలసి వచ్చింది. ఆ అన్వేషణలో దొరికిన ఆణిముత్యం షోయబుల్లాఖాన్. పాతికేళ్ల వయసులోనే వృత్తిలోకి వచ్చి వేడి నెత్తురు శక్తి ఏమిటో చూపించిన వాడు. షోయబ్ పూర్వికులు ఉత్తర ప్రదేశ్ వాళ్లు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాడు. తాను రాయిస్టుననీ, అయినా పత్రికా విధానాలను పాటిస్తానని షోయబ్ హామీ ఇచ్చాడు. 75 రూపాయలతో మొదలైన షోయబ్ జీతం వందరూపాయలకు చేరుకుంది. అయితే రయ్యత్ పత్రిక అనుసరిస్తున్న మితవాద ధోరణి ఆయనకు నచ్చలేదు. నిజాం విధానాలను నిర్ద్వంద్వంగా విమర్శిస్తున్నా.. మితవాదంతో వ్యవహరించటం ఆయనకు సరిపడలేదు. ఓ పక్క హైదరాబాద్ రాష్ర్టం తగులబడిపోతోంది. రజాకార్లు రెచ్చిపోతున్నారు.. ఊళ్లకు ఊళ్లను నామరూపాలు లేకుండా మట్టుబెడుతున్నారు. ప్రజలంతా కొందరు గుల్బర్గా వైపు, మరి కొందరు నాగపూర్ వైపు.. ఇంకొందరు విజయవాడ వైపు వలసలు పోవలసిన పరిస్థితి. అయినా రయ్యత్ విమర్శల్లో అతివాదం లేకపోవటంతో షోయబ్ ఆ పత్రికను విడిచిపెట్టాడు. బయటకు వచ్చి ఇమ్రోజ్ పత్రికను ప్రారంభించాడు. ఇది దినపత్రిక. ఆయన పత్రికను స్థాపించేనాటికే నిజాం రాజు రజాకార్ల చేతిలో బందీ అయ్యాడు.. రజాకార్ల నేత ఖాసిం రజ్వీ ఎలా చెప్తే అలా నడుచుకునే పరిస్థితి నెలకొంది. అదే సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా మంజూర్ జంగ్, ముల్లా అబ్దుల్ బాసిత్, సయ్యద్ మహమ్మద్ హుస్సేన్ జాఫరీ, బాఖరలీ మీర్జా, ఫరీద్ మీర్జా, హుసేన్ అబ్దుల్ ముసాదే అనే వాళ్లు ఓ పత్రికా ప్రకటన చేశారు. ఆ ప్రకటన యథాతథంగా ఇమ్రోజ్‌లో అచ్చయింది. దాని ఆధారంగా షోయబ్ సంపాదకీయాన్ని కూడా రాశాడు. ఇది రజాకార్లకు మింగుడు పడలేదు. 1948 ఆగస్టు 22న (ఇంకా అప్పటికి హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం రాలేదు.. పోలీసు యాక్షన్ మొదలు కాలేదు.. ఈ ఘటన జరిగిన 25 రోజుల తరువాత అంటే సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించింది. ) నగరం నడిబొడ్డున కాచిగూడ ప్రాంతంలో రజాకార్లు షోయబుల్లాఖాన్‌ను దారుణంగా హత్య చేశారు. మొదట షోయబ్ రెండు చేతులు నరికారు. ఆ తరువాత శరీరమంతా కత్తులతో పొడిచి పొడిచి కిరాతకంగా హతమార్చారు. అంతటితో ఆగక తుపాకీతో కాల్పులు కూడా జరిపారు. ఆ కాలంలో అంత భయంకరమైన హత్య మరొకటి లేదు. ఈ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజాం స్వతంత్ర ప్రతిపత్తి సరికాదన్నందుకు రజాకార్లకు ఒక గొప్ప పాత్రికేయుడు బలైపోయాడు.

తెలుగువారి ఆడబిడ్డగా పేరు తెచ్చుకున్న పత్రిక  తెలంగాణాలో సుజాత. 1927లో మొదటి సంచిక వచ్చినా.. దానితోనే ఆగిపోయింది. ఆ తరువాత 50వ దశకంలో మళ్లీ ప్రారంభమై తెలంగాణాకు సాహిత్య సేవలందించింది. 1950లో గడియారం రామకృష్ణ శర్మ తిరిగి ప్రారంభించారు. ఆగస్టు 15న తిరిగి ప్రారంభమైన ఈ సంచిక మూడేళ్ల పాటు నడిచి ఆగిపోయింది. సుజాత పత్రిక 48 పేజీలతో వచ్చేది. ఆ రోజుల్లో ఒక్కో సంచికకు నాలుగు వందల రూపాయల ఖర్చయ్యేది. దాన్ని భరించటమే కష్టమై మూసి వేయాల్సి వచ్చింది. తెలంగాణాలో సాహిత్య పత్రిక అంటే గుర్తుకు వచ్చేది సుజాతే.
వామపక్ష భావాలతో, స్పష్టమైన ఆధునిక దృక్పథంతో ‘‘సాహితీ మిత్రులు’’ వరంగల్లు నుంచి వెలువరించిన పత్రిక సృజన. 1966లో తొలి సంచిక కాళోజీ సంపాదకత్వంతో విడుదలైంది. నాలుగేళ్ల వరకూ ఆయనే సంపాదకుడుగా ఉన్నారు. ఆ తరువాత ఆ బాధ్యత, పేరు నవీన్ తీసుకున్నారు. పేరు ఎవరిదైనా పత్రికకు సంబంధించిన ప్రధాన బాధ్యతలన్నీ ప్రముఖ విప్లవకవి వరవరరావు నిర్వహించేవారు. మొదట త్రైమాసికంగా, ఆ తరువాత మాసపత్రికగా వచ్చింది. ఆయన ప్రత్యక్షంగా సంపాదకత్వ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే 1973లో అరెస్టు కావటంతో ఆయన భార్య హేమలత ఆ భారాన్ని స్వీకరించారు. 1992 వరకూ ఈ పత్రిక అవిచ్ఛిన్నంగా వస్తూనే ఉంది.
అచ్చమైన తెలుగు నగరి వరంగల్లు. ఒకప్పుడు కవులకు, ఖడ్గవీరులకూ ఇది ప్రసిద్ధి.. మేటి పోటరి జగజ్జెట్టీలను దేశవిదేశాలకు పంపించిన వీరభూమి. ఆధునిక యుగంలో కలం నడిపే మొనగాళ్లకూ ఇది కేంద్ర బిందువైంది. 1958లో ఎంఎస్ ఆచార్య జనధర్మ వారపత్రికను ప్రారంభించారు. ఆయనకు ఆ పత్రికే ఇంటిపేరుగా సార్థకమైంది. వరంగల్లుకు మంచినీటి సమస్యను పరిష్కరించిన కాకతీయ కాలువ, కాకతీయ విశ్వవిద్యాలయ స్థాపన, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు తెప్పించటం లాంటి అనేక అభివృద్ధి పనులను వరంగల్లుకు సాధించి పెట్టడంలో జనధర్మ కృషి ఉంది. ఆయన షష్టిపూర్తి సందర్భంలో  అభిమానులు పూల మాల వేయటానికి రెండు గంటలు క్యూలో నిలుచున్నారట. ఆయన కుమారుడు మాడభూషి శ్రీధర్ కూడా తొలికాలం జర్నలిస్టు. సంచలనాలకు పెట్టింది పేరు. జనధర్మ వారపత్రికను నడుపుతూనే సాహిత్య సంచికలు కూడా ప్రత్యేకంగా ప్రచురించేవారు. కోవెల సుప్రసన్నాచార్య దానికి సంపాదకత్వ బాధ్యతలను నిర్వహించారు. 1980 నాటికి వరంగల్ వాణి దినపత్రికను ఎంఎస్ ఆచార్య ప్రారంభించారు. 1994లో ఆయన మరణించేంత వరకూ ఆగకుండా నడిపించారు. ఆ తరువాత రుద్రాభట్ల కిషన్ పత్రికను కొనుక్కొని నడిపించారు. ఇప్పుడు శ్రీకృష్ణ దాని బాధ్యతలు తీసుకున్నారు.
తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ పక్షాన హైదరాబాద్ నుంచి వెలువడుతున్న వారపత్రిక గీటురాయి. ఎస్.ఎం మాలిక్ దీని ప్రచురణ కర్త. వ్యక్తి సంస్కార, సంఘ నిర్మాణ నైతిక పథంగా గీటురాయిని మాలిక్ అభివర్ణిస్తారు.
కాకతీయ యూనివర్సిటీ 1976లో డాక్టర్ కె.వి. రామకోటిశాస్త్రి సంపాదకుడుగా, డాక్టర్ కె. సుప్రసన్నాచార్య అసోసియేట్ ఎడిటర్‌గా ప్రచురించిన వార్షిక పత్రిక విమర్శిని. ఇప్పటికీ ఏడాదికో సంచిక సాహిత్యసేవలందిస్తూ వెలువడుతోంది.
వరంగల్లు జిల్లా మహబూబాబాద్ నుంచి వెలువడుతున్న వారపత్రిక మానుకోట. సిబి లక్ష్మి ఈ పత్రికకు సంపాదకులు. గత శతాబ్దపు చివరలో ప్రారంభమైన ఈ పత్రిక ఇప్పటికీ కొనసాగుతోంది. 1956లో దేవులపల్లి సుదర్శనరావు సంపాదకులుగా కాంగ్రెస్ వారపత్రిక వరంగల్ చౌరస్తా దగ్గర ఉన్న ఆదర్శ ప్రింటర్స్ నుంచి వచ్చేది. తెలంగాణా జిల్లాల్లో చిన్న పత్రికల సంఖ్య లెక్కపెట్టలేం. ఒక్కో జిల్లాలో వందకు తక్కువ కాకుండా పత్రికలు వెలువడ్డాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా తెలంగాణా కోసం తెలంగాణా వాణిని వినిపిస్తూ వెలువడుతున్న పత్రిక నమస్తే తెలంగాణా. రాజకీయ పార్టీ టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించిన పత్రిక ఇప్పుడు తెలంగాణా జన భావనలను భుజాన మోస్తున్నది.
అన్ని యిజాలలోని నిజాలను నివురు తొలగించి ప్రజల ముందుంచిన సాహసం తెలంగాణా పత్రికారంగానిది. ప్రజల్లో చైతన్యాన్ని ఉద్దీపనం చేసి కార్యోన్ముఖులను చేసేందుకు సాధనగా పత్రికారంగాన్ని ఎంచుకుని అద్భుతాలు సృష్టించిన పోతుగడ్డ తెలంగాణా. కలం పాళీతో తెలంగాణ నేలను దున్ని సాహిత్య సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ఉద్యమ వనాలను పెంచి స్వేచ్ఛ కోసం పౌరుషాగ్ని పుప్పొడులను వెదజల్లింది తెలంగాణ పత్రికారంగం.

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

ద్రవ్యోల్బణం...ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం

ద్రవ్యోల్బణం... దేశ ఆర్థిక వ్యవస్థలో ఇదో విచిత్రమైన పదం.. ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం. దీని సూచీ ఎందుకు పెరుగుతుందో.. ఎందుకు తగ్గుతుందో.. దీనికీ, ధరల సూచీకీ ఉన్న సంబంధం ఏమిటో.. ᆱద్రవ్యోల్బణం సూచీ పెరిగితే ధరలు పెరుగుతాయని, తగ్గితే తగ్గుతాయని చెప్తారు... కానీ, ఇప్పుడు మైనస్‌లోకి పడిపోయినా ధరలు తగ్గటం లేదు... పైగా చుక్కలనంటుతున్నాయి.  ఇదంతా ఒక  మాయ.. దీన్ని  ఎలా అర్థం చేసుకోవాలో  సామాన్య ప్రజానీకానికి అంతుపట్టని వ్యవహారం..
అర్థ శాస్త్రంలో  ఇన్‌ఫ్లేషన్‌ అంటే వివిధ వస్తువులు, సర్వీసులకు సంబంధించి సాధారణ స్థాయిలో ఉండే ధరలు అని అర్థం. దీన్నే ద్రవ్యోల్బణం అని మనం చెప్పుకుంటాం. దీన్ని ఒక నిర్ణీత కాలానికి లెక్కిస్తారు. అమెరికన్‌ సివిల్‌ వార్‌ సమయంలో ప్రెユవేట్‌ బ్యాంక్‌ నోట్‌ కరెన్సీ ప్రింట్‌ అయింది. అప్పుడే  మొట్టమొదటిసారిగా ఇన్‌ఫ్లేషన్‌ అన్న పదం ప్రత్యక్షంగా వాడుకలోకి వచ్చింది. కరెన్సీ డిప్రిసియేషన్‌ను సూచిస్తూ దీన్ని ఉపయోగించారు. మన కరెన్సీలోని ప్రతి రూపాయితో  వస్తువులను కానీ, సర్వీసులను కానీ కొనుగోలు చేస్తాం. మనీకి ఉండే నిజమైన విలువ, ప్రజల కొనుగోలు శక్తి మన ఆర్థిక వ్యవస్థలో జమాఖర్చులను ప్రభావితం చేస్తాయి. ఒక విధంగా సాధారణ ద్రవ్యోల్బణం రేటు వినియోగ దారుల ధరల సూచి అని చెప్పవచ్చు. ఇన్‌ఫ్లేషన్‌ రేటు సందిగ్ధంగా ఉంటే దాని వల్ల ఆర్థిక వ్వయస్థపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. పెట్టుబడులకు ప్రోత్సాహం లభించదు. హై ఇన్‌ఫ్లేషన్‌ రేటు వస్తువుల కొరతకు కారణమవుతాయి. ఇది స్థూల జాతీయోత్పత్తిపైనా ప్రభావం చూపుతుంది.  అందువల్లే ద్రవ్యోల్బణం అంటే అటు పాలకులకు, ఇటు పారిశ్రామిక వేత్తలకు అంత హడల్‌..

నిపుణులు చెప్పినట్లు ద్రవ్యోల్బణ సూచీ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. దీనిపై ఎవరికీ ఎలాంటి ఆక్షేపణ లేదు. కానీ, అదే సూచీ పడిపోయినప్పుడు ధరలు కూడా పడిపోవాలి కదా? కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. సరిగ్గా ఏడాది క్రితం ఇన్‌ఫ్లేషన్‌ రేటు పధ్నాలుగు శాతం చేరుకున్నప్పుడు పాలకులకు చెమటలు పట్టాయి. అప్పుడు ధరలను చూస్తే కందిపప్పు వంద రూపాయలు, బియ్యం నలభై రూపాయలు.. అన్ని వస్తువుల ధరలూ అమాంతంగా పెరిగిపోయాయి. ప్రజలు ఏదో భరించారు... సరే ఆ తరువాత రిజర్వు బ్యాంకు రెపోరేట్లను సవరించటం, ఇతర ఏర్పాట్లు చేయటంతో  ద్రవ్యోల్బణం రేటు కొంత తగ్గినట్లు అనిపించింది..  తగ్గినప్పుడు ఎలాగూ ధరలు తగ్గుతాయని అనుకున్నారు. ఆశపడ్డారు. కానీ పరిస్థితి తిరగబడింది. ఒక దశలో శాస్త్రీయతకు భిన్నంగా ద్రవ్యోల్బణం రేటు పూర్తిగా నెగెటివ్‌ జోన్‌లోకి పడిపోయింది.
అలాంటప్పుడు ధరలు పూర్తిగా తగ్గాలి. కానీ, అలా జరగలేదు. ఇన్‌ఫ్లేషన్‌ రేటు ఎక్కువగా ఉన్నప్పటికంటే ఎక్కువగా రేట్లు పెరిగిపోయాయి. అప్పుడు ఆ ధరలను భరించిన ప్రజలు ఆ తరువాతా.. భరిస్తూనే ఉన్నారు.
తరువాత పెరిగితే ఊహించని స్థాయిలో పెరిగిపోవటం.. తగ్గితే అనూహ్యంగా పడిపోవటం.. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది. బంగారం ధరలు కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయి. కంట్రోలింగ్‌ అనే పదానికి అర్థమే లేకుండా పోయింది ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర.

ఇప్పుడయితే దేని రేటు ఎంత ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి..   చివరకు కూరగాయలూ కొనే పరిస్థితి కనుచూపు మేరలో కొనే పరిస్థితి కనిపించటం లేదు. వంద రూపాయల నోటుకు ఒక రూపాయికున్నంత విలువ కూడా లేకుండా  పోయింది.
ద్రవ్యోల్బణం లెక్కింపులోని డొల్లతనాన్ని ఈ పరిణామం సూచిస్తున్నది. టోకు ధరల సూచీ ఆధారంగా దీన్ని లెక్కించటం వల్ల ఇన్‌ఫ్లేషన్‌ నెగెటివ్‌ జోన్‌లో పడిపోయిందని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో డిమాండ్‌ పడిపోవటం వల్ల ద్రవ్యోల్బణం మైనస్‌ అయిందని, మనం ఒక విధంగా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లినట్లేనని మరికొందరు అంటున్నారు.

ద్రవ్యోల్బణాన్ని తప్పుగా లెక్కిస్తున్న వాస్తవాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికి గుర్తించింది. వాస్తవాన్ని వాస్తవంగా ప్రతిబింబించే స్థాయిలో  కొత్త ద్రవ్యోల్బణ సూచీని తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, అది జరగలేదు..  టోకు ధరల ఆధారంగానే సూచించే ప్రయత్నమూ విఫలమైంది.  వాస్తవ ధరల ముఖచిత్రాన్ని నిష్కర్షగా ఆవిష్కరించే విధంగా ద్రవ్యోల్బణ సూచీ అవసరం. సూచీ మాటెలా ఉన్నా,  మోత మోగిస్తున్న ధరలను ఆకాశం నుంచి కిందకు దింపటానికి ప్రణబ్‌ ముఖర్జీ తన బడ్జెట్‌లో అర్జెంటుగా తీసుకునే చర్యలు ఏమిటన్నది ఇప్పటికి మాత్రం సస్పెన్సే....

బడ్జెట్‌-అంటే ఏమిటి?

బడ్జెట్‌ అనగానే మామూలు ప్రజలకు అర్థమయ్యేది ఒకే ఒక్కటి.. ధరలు.. ఏ వస్తువు ధర పెరిగింది? ఏ వస్తువు ధర తగ్గింది? రైతులకైతే.. అప్పులేమైనా మాఫీ చేస్తున్నారా? విత్తనాలపై సబ్సిడీ ఇస్తున్నారా అనేదే తెలుస్తుంది. ఇక ఉద్యోగుస్థులైతే ఇన్‌కమ్‌టాక్స్‌ పరిమితి ఏమైనా పెంచారా? లేదా? అన్నది తెలుసుకుంటే చాలనుకుంటారు.. బడ్జెట్‌ అంటే ఇంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే బోలెడు ఉందనే చెప్పాలి.. అంతా అనుకున్నట్లు బడ్జెట్‌  బ్రహ్మపదార్థమేం కాదు.. కొంత మనసు పెట్టి  గమనిస్తే.. చాలా తేలిగ్గా అర్థమవుతుంది...

ప్రతి వ్రభుత్వానికి ప్రజల పట్ల తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించటానికి మానవ వనరులతో పాటు ఆర్థిక వనరుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం చేసే ఖర్చుల కోసం పన్నులు, సుంకాలు, సెస్‌లు, అప్పులు ఇతర రూపాలలో నిధులు సమీకరిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం పార్లమెంటులో వార్షిక ఆర్థిక ప్రతిపాదనలు చేసి ఆమోదం పొందుతుంది. సదరు ఆర్థిక సంవత్సరంలో ఆ ప్రతిపాదనలనే ఆమలు చేస్తారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రాజ్యాంగంలోని 112 వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పేరు మీదుగా ఆర్థిక సంవత్సరపు వార్షిక స్టేట్‌మెంట్‌ తయారవుతుంది.  అయితే దాన్ని తయారు చేసే బాధ్యత 77(3)వ అధికరణం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రిపై ఉంటుంది. ఈ స్టేట్‌మెంట్‌కే బడ్జెట్‌ అని పేరు.
కేంద్ర ఆర్థిక మంత్రి జనరల్‌ బడ్జెట్‌తో  పాటు రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రాల బడ్జెట్‌ కూడా పార్లమెంటులో ప్రవేశపెడతారు.

 బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వామ్యం పంచుకునే విభాగాలు...విధులు
メ కేంద్ర ప్రణాళికా సంఘం...
అన్ని మంత్రిత్వ శాఖలకు ఇది ఓవరాల్‌ టార్గెట్‌లను నిర్దేశిస్తుంది.
メ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌...(కాగ్‌)
అక్కౌంట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. నిఘా వేస్తుంది.
メ అడ్మినిస్ట్రేటివ్‌ మినిస్ట్రీస్‌.. ప్రణాళికా ప్రాధాన్యాలను నిర్ణయించేముందు  ఆర్థిక మంత్రి
అడ్మినిస్ట్రేటివ్‌ మినిస్ట్రీస్‌ విభాగాన్ని తప్పక సంప్రతిస్తారు.
メ వ్యయం.. ఖర్చుకు సంబంధించిన రెవెన్యూ విభాగం...
メనాన్‌-టాక్స్‌- ఆర్థిక వ్యవహారాల విభాగం
メపన్నులు- రెవెన్యూ విభాగం
メలోటు-ఆర్థిక వ్యవహారాల విభాగం

నిజానికి ప్రతి సంవత్సరం బడ్జెట్‌ ప్రక్రియ సెప్టెంబర్‌లోనే ప్రారంభమవుతుంది.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ అన్ని మంత్రిత్వ శాఖలకు, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, వివిధ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శాఖలకు బడ్జెట్‌ సర్క్యులర్‌ విడుదల చేయటంతో ప్రారంభమవుతుంది. ఆయా విభాగాలు, రాష్ట్రాలు నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాలను సవరించుకోవటంతో పాటు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి  తమ ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖకు పంపిస్తాయి.  ఈ ప్రతిపాదనలన్నీ అందిన తరువాత అడ్మినిస్ట్రేటివ్‌ మినిస్ట్రీస్‌, ఇతర కీలక విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తుంది. అవసరమైన వ్యయ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.
దేశంలోని వివిధ వర్గాల నుంచి తమకు లభించే ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది.  వ్యవసాయం, రైతులు, కార్మికులు, సామాజిక వర్గాల నుంచి వచ్చే ఆదాయాలను బేరీజు వేస్తుంది. ఆదాయ వనరుల సమీకరణ ఎలా చేయాలో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో రెవిన్యూ విభాగంతో సంప్రతించి ప్రతిపాదనలు రెడీ చేస్తారు...
ఆ తరువాత ఖర్చుల అంచనాలను తయారు చేస్తారు. ప్రీ బడ్జెట్‌ మీటింగ్‌లు అయిపోయిన తరువాత స్టేట్‌మెంట్‌ బడ్జెట్‌ ఎస్టిమేట్స్‌ను బడ్జెట్‌ డివిజన్‌కు పంపిస్తారు.  అక్కడ తుది పన్నుల ప్రతిపాదనలు తయారవుతాయి. ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి వీటికి తుదిరూపాన్ని ఇస్తారు.....

చివరకు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం తయారవుతుంది. ఇది రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో సాధారణ ఆర్థిక వ్యవహారాలు, విధాన ప్రకటనలు ఉంటాయి. రెండో భాగంలో వివిధ రకాల పన్నుల గురించిన ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి.
లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత రాజ్యసభలోనూ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు.
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే లోక్‌సభ దానిపై చర్చ ప్రారంభిస్తుంది. సభ్యుల సూచనలు సలహాలు తీసుకున్న తరువాత ఆర్థిక మంత్రి జవాబిస్తారు. అనంతరం బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఓటింగ్‌ జరుగుతుంది. సాధారణ మెజారిటీతో పార్లమెంటు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఓడిపోతే.. రాజీనామా చేయాల్సి ఉంటుంది.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన ఆర్థిక మంత్రులు

1.
లియాఖత్‌ అలీఖాన్‌(1946-47)
1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ఆల్‌ ఇండియా ముస్లింలీగ్‌లో క్రియాశీల నాయకుడైన లియాఖత్‌ అలీఖాన్‌ భారత విభజనలో కీలక పాత్ర పోషించారు.  మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ముస్లిం లీగ్‌ ప్రతినిధిగా లియాఖత్‌ అలీఖాన్‌ను మంత్రివర్గంలో చేర్చుకుని ఆర్థిక శాఖను అప్పజెప్పారు. 1947లో పాకిస్తాన్‌ ఏర్పాటైన తరువాత స్వతంత్ర పాకిస్తాన్‌కు మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు...
2.
ఆర్‌.కె.షణ్ముగం శెట్టి(1947-48)
స్వతంత్ర భారత దేశానికి మొదటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముగంశెట్టి. 1947 నవంబర్‌ 26న మొదటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష తప్ప ఎలాంటి కొత్త పన్నులు విధించలేదు. ఎందుకంటే మరో 95రోజుల్లో పూర్తి స్థాయిలో 1948-49 బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి కాబట్టి  తొలి బడ్జెట్‌ రివ్యూకే పరిమితమైంది. ఈయన్ను కొద్ది రోజులకే ప్రధానమంత్రి నెహ్రూ రాజీనామా చేయించారు.
3.
కెసి నెర్గీ..(1948)
కేవలం 35 రోజులపాటే కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఒకే ఒక్కడు... నెర్గీకి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశమే రాలేదు.

4
జాన్‌ మొథాయ్‌(1948-50)
ఈయన ఒక ఆర్థిక వేత్త. దేశ తొలి రైల్వే మంత్రిగా వ్యవహరించారు. తరువాత ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టారు. ఈయన వరుసగా రెండు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 1950లో ప్రణాళికా సంఘానికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో రాజీనామా చేశారు.
5
సిడి దేశ్‌ముఖ్‌(1950-56)
ఈయన ఆర్థిక మంత్రి కావటానికి ముందు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు తొలి గవర్నర్‌గా పనిచేశారు. 1951లో తొలి జనరల్‌ ఎన్నికల నేపథ్యంలో  బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. తొలి ఎన్నికలు 1951-డిసెంబర్‌-1952 ఫిబ్రవరిలో జరిగాయి. ఎన్నికల తరువాత ఏర్పడ్డ ప్రభుత్వంలో  దేశ్‌ముఖ్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బడ్జెట్‌ కాపీలను హిందీలో తయారు చేయటం ఈయన హయాంలోనే మొదలైంది. తొలి రెండు పంచవర్ష ప్రణాళికలను రూపొందించి అమలు చేయటంలో ఈయన ముఖ్యభూమిక పోషించారు. ఇంపీరియల్‌ బ్యాంకును ఈయనే జాతీయం చేశారు. దేశంలో కొత్త కంపెనీల చట్టాన్ని ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర నుంచి ముంబయిని వేరు చేయాలన్న నిర్ణయంపై నిరసనలు వ్యక్తం అయిన నేపథ్యంలో దేశ్‌ముఖ్‌  రాజీనామా చేశారు.

6
టిటి కృష్ణమాచారిః(1957-58)(1964-66)
దేశానికి రెండుసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి నేత. 1957లో రెండో సాధారణ ఎన్నికలు ఈయన సమయంలోనే జరిగాయి. దేశంలో  మూడు భారీ ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసిన ఘనత, మూడు ఆర్థిక సంస్థలు ఐడిబిఐ, ఐసిఐసిఐ, యుటిఐ లను నెలకొల్పిన క్రెడిట్‌ కృష్ణమాచారికి దక్కుతుంది. 1958లో  ఎల్‌ఐసి ముంద్రా కేసులో జస్టిస్‌ చాగ్లా కమిషన్‌ తప్పు పట్టడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
1964-66లో మరోసారి కృష్ణమాచారి రెండోసారి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తొలిసారి సామాజిక భద్రత అన్న అంశాన్ని ప్రస్తావన చేసింది కృష్ణమాచారినే... ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. 1964లో ఫ్యామిలీ పెన్షన్‌ పథకాన్ని ప్రకటించారు. రాజస్థాన్‌ కెనాల్‌ స్కీమ్‌, దండకారణ్య, దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టులు, నైవేలీ లిగ్నైట్‌ ప్రాజెక్టులను టిటి కృష్ణమాచారి ప్రకటించారు.

7
జవహర్‌లాల్‌ నెహ్రూః(1958-59)
౧౯౫౮లో సరిగ్గా బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఫిబ్రవరి మాసంలోనే టిటి కృష్ణమాచారి రాజీనామా చేయటంతో   ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు.  1958-59 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనూహ్యంగా తనపై భారం పడిందని ఆయన ఆనాడు తన బడ్జెట్‌ ప్రసంగంలో అన్నారు.

 8
మొరార్జీ దేశాయ్‌(1959-64)(1967-69)
1959నుంచి 1964వరకు జవహర్‌ లాల్‌ నెహ్రూ కేబినెట్‌లో అత్యధిక కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన కీర్తి మొరార్జీ దేశాయ్‌కి దక్కింది. రెండు సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొరార్జీదేశాయ్‌ దాదాపు పది బడ్జెట్‌లను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ఇందులో అయిదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ తొలి దఫాలో ప్రవేశపెట్టారు. 1959 నుంచి 1964 వరకు పూర్తి స్థాయి బడ్జెట్‌లను, 1962-63లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఆ తరువాత 1967లో రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టారు. ఈసారి ఆయన మూడు పూర్తి స్థాయి బడ్జెట్‌లను, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1969లో దేశంలోని ప్రధాన బ్యాంకులను ఒక ఆదివారం సాయంత్రం జాతీయం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ ఉండటం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుందని ఆయన భావించారు. కానీ, దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
9
ఇందిరాగాంధీః(1970-71)
మొరార్జీ దేశాయ్‌ రాజీనామా చేసిన తరువాత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రిత్వ శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. ఈవిధంగా దేశానికి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు.
10
వై.బి.చవాన్‌(1971-1975)
౧౯౭౧లో అయిదో సాధారణ ఎన్నికలు పూర్తయిన తరువాత  ఆర్థిక మంత్రిగా వైబి చవాన్‌ను ఇందిర నియమించారు. 1971 నుంచి 75 వరకు ఆయన పూర్తి బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
11
సి. సుబ్రహ్మణ్యం(1975-77)
1975, 76లలో రెండు బడ్జెట్లను సుబ్రహ్మణ్యం ప్రవేశపెట్టారు. ఎక్సైజ్‌ ద్వారా ఆదాయాన్ని పెంచే మార్గాలను మొదటిసారి అమలు చేసిన ఆర్థిక మంత్రి సుబ్రహ్మణ్యం.
12
హెచ్‌ఎం పటేల్‌(1977-79)
మార్చి 1977లో ఏడో జనరల్‌ ఎన్నికల తరువాత మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీదేశాయ్‌ ప్రధానమంత్రిగా ఏర్పడిన కాంగ్రెసేతర ప్రభుత్వంలో  హెచ్‌ఎం పటేల్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

13
చౌదరి చరణ్‌సింగ్‌(1979-80)
1979వ  ఆర్థిక సంవత్సరానికి చౌదరి చరణ్‌సింగ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అప్పుడు ఆయన దేశ ఉపప్రధానమంత్రిగా ఉన్నారు.
14
రామస్వామి వెంకట్రామన్‌(1980-82)
1980లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌ వెంకట్రామన్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1980-81, 1981-82 ఆర్థిక సంవత్సరాలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తరువాత వెంకట్రామన్‌ ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా  ఉన్నత పదవులను చేపట్టారు.
15
ప్రణబ్‌ ముఖర్జీ(1982-84)
ఇందిర కేబినెట్‌లో ప్రణబ్‌ ముఖర్జీ తొలిసారి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడే.  ప్రణబ్‌ ముఖర్జీ 1982, 83, 84 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.
16
విపి సింగ్‌(1985-87)
ఇందిరాగాంధీ మరణం తరువాత ప్రధానమంత్రి అయిన రాజీవ్‌ మంత్రి వర్గంలో విపి సింగ్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 85, 86 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. దేశంలో లైసెన్స్‌ రాజ్యానికి చరమగీతం పాడే దిశగా చర్యలు తీసుకున్న ఘనత విపి సింగ్‌ది.....ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అదనపు అధికారాలను కట్టబెట్టారు. దీని వల్ల దేశంలో అత్యంత సంపన్నులపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేసింది. ఈ దాడులను ఎదుర్కొన్న వారిలో ధీరూభాయ్‌ అంబానీ కూడా ఉన్నారు. ఈ కారణంగా రాజీవ్‌గాంధీపై ఒత్తిళ్లు పెరగటంతో విపిసింగ్‌ను తప్పనిసరిగా తప్పించాల్సి వచ్చింది.

17
రాజీవ్‌గాంధీ(1987-88)
1987-88 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి  రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రుల్లో రాజీవ్‌ మూడో వారు. మరో విశేషమేమంటే ఈ ముగ్గురు ప్రధానులూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం. జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ... ముగ్గురూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1987లో నే దేశంలో జీరో బేస్డ్‌ బడ్జెటింగ్‌ ప్రారంభమైంది. జీరోబేస్డ్‌ బడ్జెట్‌ అంటే ఆర్థిక శాఖకు వచ్చిన ప్రతి డిమాండ్‌ను, ప్రతిపాదనలను ముందే సమీక్షించి, విశ్లేషించి తుది నిర్ణయం తీసుకోవటం. పార్లమెంటులో బడ్జెట్‌ తుది ఆమోదం పొందకముందే ఈ ఎక్సర్‌సైజ్‌ పూర్తవుతుంది. ఈ విధానాన్ని మూడు దశల్లో అమలు చేశారు.
18.
ఎన్‌డి తివారీ(1988-89)
ఎన్‌డి తివారీ రాజీవ్‌ కేబినెట్‌లో 1988-89 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.
19
మధు దండవతే(1990-91)
1989 నవంబర్‌లో సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. దీనికి నాయకత్వం జనతాదళ్‌  వహించింది. విపిసింగ్‌ ప్రధాని అయ్యారు. మధు దండవతే ఆర్థిక మంత్రిగా 1990-91 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

20
యశ్వంత్‌ సిన్హా(1991-92)(1998-2002)
కేంద్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యశ్వంత్‌సిన్హా ఆర్థిక మంత్రి అయ్యారు. 1991-92ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1998లో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 1998లో ఆర్థిక మంత్రిత్వ శాఖ చేపట్టారు. 1998లో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన యశ్వంత్‌ ఆ తరువాత 2002-03 వరకు వరుసగా బడ్జెట్లను ప్రవేశపెట్టారు. బ్రిటిష్‌ కాలం నుంచి సాయంత్రం అయిదు గంటలకు బడ్జెట్‌లను ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని మార్చారు. మధ్యాహ్నం 12 గంటలకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎక్సైజ్‌ డ్యూటీలను రేషనలైజ్‌ చేయటంపై యశ్వంత్‌ సిన్హా ప్రత్యేక దృష్టి పెట్టారు. దిగుమతులను మరింత సరళీకృతం చేశారు.

21.
మన్మోహన్‌ సింగ్‌ (1991-96)
రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ 1991లో ప్రధానమంత్రి పదవిని పివి నరసింహరావు చేపట్టిన తరువాత ఆర్థిక మంత్రి బాధ్యతలను చేపట్టారు. 1991-92 సంవత్సరానికి ఫైనల్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ను ఒక ఆర్థిక మంత్రి, పూర్తి స్థాయి బడ్జెట్‌ను మరో మంత్రి ఇద్దరు కూడా వేర్వేరు పార్టీలకు చెందిన వారు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. పివి నరసింహరావు, మన్మోహన్‌సింగ్‌ల నేతృత్వంలో ఆర్థిక సంస్కరణల పర్వం మొదలు కావటంతో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావటం ప్రారంభమైంది. సంక్షోభంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ వీరి హయాంలో మళ్లీ నిలదొక్కుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో కుదువబెట్టిన బంగారం రిజర్వులను ఈ ఇద్దరే విడిపించారు. ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్‌ ఆద్యుడు. దిగుమతి సుంకాన్ని 300 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు. కరంట్‌ అకౌంట్‌లో రూపీ కన్వర్టబిలిటీని రెండు దశల్లోనే జరిగేట్లు చేసిన ఘనత కూడా మన్మోహన్‌దే. ఆ తరువాత దేశంలో  పూర్తికాలం ప్రధానమంత్రిగా పనిచేసి, రెండో దఫా కూడా ప్రదానమంత్రిగా ఎన్నికైన ఘనతను సాధించారు.

22.
జస్వంత్‌సింగ్‌( 1996)(2002-04)
అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో తొలిసారి ఆర్థిక మంత్రిగా జస్వంత్‌సింగ్‌ 17 రోజులు మాత్రమే పనిచేశారు. 2002లో  రెండోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మార్కెట్‌ అనుకూల ఆర్థిక సంస్కరణలను జస్వంత్‌సింగ్‌ అమలు చేశారు..
23
పి.చిదంబరం(1996-1998)(2004-2008)
1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి చిదంబరం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అప్పుడు ఆయన తమిళ మానిలా కాంగ్రెస్‌లో సభ్యుడు. 1997-98లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అసలు చర్చ జరక్కుండానే ఆమోదం పొందింది. మళ్లీ 2004లో మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో యుపిఎ సర్కారు ఏర్పడ్డ తరువాత చిదంబరం తిరిగి ఆర్థిక మంత్రిగా ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాల పాటు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. మన్మోహన్‌, మాంటెక్‌ సింగ్‌ ఆహ్లువాలియా, చిందబరంలను ఆర్థిక వేత్తల త్రయంగా పిలుస్తారు.
24.
ప్రణబ్‌ ముఖర్జీ..
2009 ఎన్నికల తరువాత ప్రణబ్‌ ముఖర్జీ  ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  ప్రస్తుత లోక్‌సభలో ప్రణబ్‌ది ఇది నాలుగో బడ్జెట్‌.

8, ఫిబ్రవరి 2012, బుధవారం

మద్య గీత

మేమంతా పవిత్రులం... మాకు పాపం చేయటమే తెలియదు.. రాముడు కూడా మా మంచితనం ముందు ఆఫ్టరాలే.. మేమూ, మా వాళ్లూ కడిగిన ముత్యాలు.. కేవలం ౫ లక్షలు తీసుకున్నామని ఆరోపించటానికి మా స్థాయి ఏమిటో తెలుసుకోవద్దా.. ఎవరు పడితే వాళ్లు ఆరోపించగానే మాపై విరుచుకుపడేయటమేనా? ముందూ వెనుకా ఆలోచించనక్కర్లేదా? మన నాయకులు.. మంత్రుల ఆలపిస్తున్న మధువు గీతం ఇది.
                                  
నేను చాలా మంచి బాలుణ్ణి.. అసలు గాడి తప్పిన నా శాఖను చక్కదిద్దటానికి నేను పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అలాంటి నాకు ఓ వ్యాపారి పది లక్షలు ఇవ్వటం విడ్డూరం కాదా? సాక్షాత్తూ  మద్యం మంత్రి ఎక్సైజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆలపించిన గీతాసారం.

మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు ముట్టాయంటూ ఏసిబి రిమాండ్‌ నోట్‌లో మంత్రివర్యుల పేరు ప్రముఖంగా ప్రస్తావించటం రాజకీయంగా, ప్రభుత్వ పరంగా పెను సంచలనానికి దారి తీసింది. ఒక మంత్రి.. ఎమ్మెల్యేలు.. పార్టీ నాయకులు.. అధికారులు.. పాత్రికేయులు.. అందరూ ఒక తాను ముక్కలేనని సదరు రిమాండ్‌ నోట్‌ తేల్చింది.
ఒక్కొక్కరూ చెప్తున్న సుద్దులు వింటుంటే ప్రజాస్వామ్యం పగలబడి నవ్వుతోంది.
మంత్రిగారి మాటల ప్రకారం ఆరోపించిన వాడు ఓ క్రిమినల్‌ .. గంజాయి స్మగ్లర్‌.. రెండు డెకాయిట్‌ కేసులు.. ఆరు అటెంప్ట్‌ టు మర్డర్‌ కేసులు ఉన్న వాడు.. బినామీ పేర్లతో ౫౦ మద్యం దుకాణాలను నడిపిస్తున్నవాడు..  దొడ్డిదారిన మద్యం వ్యాపారం లైసెన్స్‌ తీసుకున్న ఓ క్రిమినల్‌ ఆరోపిస్తే... దాన్ని క్లారిఫై చేసుకోకుండా రిపోర్ట్‌ తీసుకుంటారా? విచారించండి.. తేలితే చూద్దాం.. రాజీనామా చేసే సంగతి.. ఇదీ మంత్రిగారి మాట.. ఇదిసరే.. మరి అలాంటి క్రిమినల్‌ స్వేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నాడు. మద్యం వేలం పాటల్లో ఎలా పాల్గొనగలిగాడు. లైసెన్స్‌ ఎలా సంపాదించగలిగాడు..? మంత్రిగారికి తెలియని బాగోతం ఇది..
మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కవితకయితే అయిదు లక్షలు ఆఫ్టరాల్‌. అసలు ఆ మాత్రం సొమ్ములు తనకిచ్చాననటం కూడా జస్ట్‌ ఏ సిల్లీ థింగ్‌..నాలాంటి దానికి కేవలం అయిదు లక్షల రూపాయలే ముడుపు ఇచ్చానని చెప్పటం ఆమెకు విడ్డూరంగా అనిపించింది. అంటే ఆమె స్థాయి అయిదు లక్షలు కాదేమో.. యాభై లక్షలు కావచ్చు.. ఆమెకే తెలియాలి.
ఇక టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆ పార్టీ నేతలకైతే కడిగిన ముత్యమే.. అసలు ఖమ్మంలో మద్య నిషేధం కోసం పోరాటం చేస్తున్న నాయకుడు. అలాంటి వాడు మద్యం వ్యాపారి దగ్గరి నుంచి లంచం తీసుకోవటం ఏమిటి? ఇది టిడిపి నేతల వాదన.

పాపం కమ్యూనిస్టులయితే మహా పేదవాళ్లు.. ఖమ్మంలో  మహాసభలు నిర్వహించేందుకు మాత్రమే ఈ  మద్యంవ్యాపారి నుంచి చందా రూపంలో వసూలు చేశారు. అదీ నెలకు పదివేల చొప్పున లెండి.... ఇంతకు మించి వాళ్లకు మరేమీ తెలియదు.
ఇదీ మన నేతల పవిత్రత.. ప్రజాప్రతినిధుల నీతివంతమైన జీవితం. అంతా మంచివాళ్లే.. మరి అవినీతి చేస్తున్నది ఎవరన్నది ఎవరికీ తెలియదు.. చివరకు ముఖ్యమంత్రికి కూడా.... 

6, ఫిబ్రవరి 2012, సోమవారం

చిలుక ఎగిరిపోతోంది

నిన్న ఉన్నట్లుగా ఇవాళ లేదు
రేపు ఉన్నట్లుగా ఎల్లుండి ఉండట్లేదు
శరీరంలో మార్పులు...
తలపుల్లో మార్పులు
నడకలో మార్పులు
నడతలో మార్పులు
కాలేజీలో తొలి అడుగు
కేరెక్టర్‌లో  సరికొత్త మలుపు
ఆమె అతను కావాలి..
అతనితోనే చనువు కావాలి..
చనువుతోని స్నేహం కావాలి
స్నేహంలోని ఆకర్షణ కావాలి
వాళ్లతోనే ఫ్రెండ్లీనెస్‌..
ఆ స్నేహంలో తెలియనిదేదో ఓ ఫీల్‌
టీనేజీ లైఫ్‌లో అదో థ్రిల్‌
స్నేహానికి హద్దులు లేవు
సరదాలకు నో లిమిట్స్‌
ఒద్దికకు.. అణుకువలకు చోటు లేదు
కలిసి తిరిగితే తప్పు లేదు..
తిరగకపోతే లైఫే వేస్టు
బాయ్‌ఫ్రెండ్‌ లేని గాళ్‌ కూడా ఉంటుందా?
ఫన్‌ అంతా మగాళ్లకేనా?
మాకేం తక్కువ
మా డ్రెస్‌కోడ్‌ మాది..
మా లైఫ్‌సెユ్టల్‌ మాది..
క్లబ్బులు..పబ్బులు..
పార్కులు.. షికార్లు...
అన్నీ మేమూ చేస్తాం...
బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తాం..
వై నాట్‌..
ఆమె బల్లగుద్ది చెప్తోంది
తాను మారానని
ఆమె రెక్కలు రెపరెపలాడుతున్నాయి
కోయిల రమ్మంటోంది
ఆమె ఎగిరిపోతోంది