11, ఆగస్టు 2009, మంగళవారం

వివాదాలు ఒక వైపు.. కలెక్షన్లు ఒక వైపు


పాపం చిరంజీవికి ఇప్పట్లో కష్టాలు తప్పేట్లు కనిపించటం లేదు.. అసలే రాజకీయ జీవితం ఒడిదుడుకులతో సాగుతుంటే... కుమారుడు రామ్‌ చరణ్‌ తేజ సినిమా కలెక్షన్ల వర్షంతో పాటు వివాదాల పరంపరనూ వెంటాడి తెచ్చుకుంది. మొదట వంగపండు రాసిన ఏం పిల్లడో ఎల్దమొస్తవా పల్లవిని ఒక వ్యాంప్‌ క్యారెక్టర్‌పై అభ్యంతరకరంగా వాడుకోవటంతో ప్రారంభమైన వివాదాల పరంపర.. ఇంకా కొనసాగుతూనే ఉంది. వంగపండు చివరకు వీధుల్లోకి వచ్చారు. తన పల్లవని తొలగించేదాకా నిర్మాతలను విడిచిపెట్టేది లేదన్నారు. అల్లు అరవింద్‌ ఇంటి ముందు ధర్నా చేశారు. దీంతో నిర్మాతలు కొత్త పుకార్ని పుట్టించారు. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అన్న పాట రాసింది వంగపండే అయినప్పటికీ, ఆ లైను మాత్రం ఆయన రాసింది కాదని, అది జనపదం నుంచి జనం నాలుకల్లోంచి వచ్చిందని కాబట్టి ఆయన క్లెయిమ్‌ చేసుకోవటానికి వీల్లేదని...

జానపద పాటలు ఏవైనా జనం నోళ్ల నుంచి వచ్చినవేనని ఒకరు ప్రత్యేకంగా చెప్పేది కాదు... జనులు పాడుకునే పదాలే జానపదాలు.. జనం నోళ్లలో నానే మాటలు.. వారి మనోభావాలను ప్రతిబింబించేలా వారి పదజాలంతో, వారి పరిభాషలో సాగే రచనే జానపదం అవుతుంది.దీనికి శాస్త్రీయ పద్ధతిలో రాగం ఉండనవసరం లేదు.. తాళం ఉండనవసరం లేదు.. శ్రుతి అంతకంటే ఉండదు. పాట రాసింది ఆయనేనట.. ఆ లైను రాసింది ఆయన కాదట... ఇదొక వితండ వాదాన్ని తెలివిగా లేవనెత్తారు.. అల్లు అండ్‌ టీం.. చిరు వీరాభిమానులూ దీన్ని అందిపుచ్చుకున్నారు. జనం నాలుకపై నాలుగు దశాబ్దాలుగా నానుతున్న గొప్పగీతం, దాని బాణీని సినిమాలో వినియోగించుకున్న తీరును మాత్రమే వంగపండు ప్రశ్నిస్తున్నారు. ఆ బాణిని ఒక స్ఫూర్తి దాయకంగా ఉపయోగించుకుంటే ఆయన అభ్యంతరం చెప్పేవారు కారేమో... ఒక వ్యాంప్‌ క్యారెక్టర్‌పై ఆ పల్లవిని వాడుకోవటం నిస్సందేహంగా ఆక్షేపణీయమే. ఇక్కడ పదే పదే స్పష్టం చేయాల్సింది పాటను వాడుకున్న సందర్భాన్ని మాత్రమే వంగపండు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అంతా గమనించాల్సిన విషయం ఏమంటే ఒక వీర నక్సలైట్‌ అయిన వంగపండు మొన్నటి ఎన్నికల సందర్భంలో ప్రజారాజ్యం పార్టీ నినాదమైన సామాజిక న్యాయాన్ని మనఃస్ఫూర్తిగా సమర్థించారు. ఆ పార్టీకి ఓటేయమని ఒకటి రెండు చోట్ల ప్రచారమూ చేశారు.
ఈ వివాదం ఓ వైపు ఇలా కొనసాగుతూ ఉండగానే, ఇద్దరు రచయితలు మా కథలను కాపీ కొట్టారని గందరగోళం సృష్టించారు. ఒకరు తాను రాసిన చండేరి నవలను యథాతథంగా తీశారంటే, మరొకరు ఎప్పుడో రిజిష్టర్‌ చేయించుకున్న తన కథను కాపీ కొట్టారన్నారు. అటు బందరులో లాయర్లు కేసు వేశారు.
ఇన్ని వివాదాల నడుమే సినిమా కోట్లాది రూపాయలను నిర్మాతలకు కురిపిస్తున్నది. పాపం చిరంజీవి అభిమానులు సినిమా కోసం ఎంతమాత్రం రక్షణ లేని థియేటర్లకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ సినిమా మోజులో పడి ఇప్పటికి ఏడుగురు ప్రేక్షకులు మృత్యువాత పడటం దురదృష్టం. థియేటర్లు సరైన సౌకర్యాలు కలిగి ఉండకపోవటం... విద్యుత్తు, ఫైర్‌ వంటి వాటి విషయంలో పకడ్బందీ నిర్మాణాలు చేపట్టకపోవటం ఇందరి ప్రాణాలను బలిపెట్టింది. భూగర్భంలోనో, గోడలోపలి నుంచో ఉండాల్సిన విద్యుత్తు కనెక్షన్‌లు తాత్కాలిక ప్రాతిపదికన నెలకొల్పటం వల్ల టిక్కెట్ల కోసం జరిగిన తోపులాట.. అటు వరంగల్‌ భవానీ టాకీస్‌, ఇటు విజయనగరం జిల్లా సాలూరులో లక్ష్మీ థియేటర్‌లలో ఏడుగురిని మృత్యు కుహరంలోకి నెట్టేసింది. 1998లో ఉపహార్‌ ఉదంతం నేర్పిన గుణపాఠాలను దేశంలో ఏ ఒక్క థియేటర్‌ యాజమాన్యం కూడా నేర్చుకోలేదు. చివరకు మల్టిప్లెక్‌‌స కూడా సేఫ్‌జోన్‌ కాదని స్పష్టంగా తేలిపోయింది. చనిపోయిన వారి కుటుంబాలకు లక్షరూపాయల పరిహారం, రామ్‌చరణ్‌తేజ పరామర్శలతో సరిపుచ్చుతారు.. కానీ, ఆ తరువాత... సినిమాలను నిర్మించిన నిర్మాతలు కోట్లు దండుకుని అత్యాధునిక కార్లలో తిరిగేది.. ఈ సామాన్యుల సొము్మలతోనే... ఈ పిచ్చిలో పడి అమాయకులే అన్యాయం అయిపోతున్నారు.. ఇలాంటి వివాదాలు, దుర్ఘటనల వల్ల నిర్మాతలకు మరిన్ని కాసులు వచ్చిపడుతున్నాయే తప్ప, పేదోడికి ఒరిగిందేమీ లేదు. కనీసం సినిమా హాళ్లయినా బాగుపడవు.
కొసమెరుపు...
తెలుగులోని పలు వార్తాచానళ్లలో ప్రైమ్‌ టైమ్‌(0709పిఎం)లో టాలీవుడ్‌ సినిమాల ప్రచార ప్రకటనలు ఉచితంగా వేయాలన్న నిర్మాతల డిమాండ్లను పలు చానళు్ల నిషేధించాయి. దీంతో వాటిని నిర్మాతల మండలి బ్యాన్‌ చేసింది. మగధీరకు మాత్రం వివాదాల పుణ్యమా అని మినహాయింపు లభించినట్లయింది. మొత్తం మీద నెగెటివ్‌ ప్రచారం ఎంత మేలు చేస్తుందో ఈ సినిమా నిరూపించింది.

6 కామెంట్‌లు:

  1. వాళ్ళు వ్యక్తి ఆరాధన వల్ల ఆ సినిమా చూస్తున్నట్టు ఉన్నారు. మీకో నాకో సినిమాలలో నటించే టాలెంట్ ఉందనుకుందాం. అప్పుడు మనం ముక్కూ మొహం తెలియని యాక్టర్లమన్న వంకతో మన సినిమాని హిట్ చెయ్యకపోవచ్చు.

    రిప్లయితొలగించండి
  2. Praveen, i am sure you have got the talent man. I 've told you some time back that you would have been somewhare in hyderabad if jandhyala alive for few more years..

    రిప్లయితొలగించండి
  3. వాళ్ళు వ్యక్తి రుద్రవీణ వల్ల ఆ సినిమా చూస్తున్నట్టు ఉన్నారు. మీకో నాకో బ్లాక్ టికెట్లు అమ్మే టాలెంట్ ఉందనుకుందాం. అప్పుడు మనం ముక్కు చెవులూ తెలియని బ్లాక్ గాళ్ళమన్న వంకతో మన టిక్కెట్ట్లు కొనకపోవచ్చు.

    రిప్లయితొలగించండి
  4. వాళ్ళు వ్యక్తి రుద్రవీణ వల్ల ఆ సినిమా చూస్తున్నట్టు ఉన్నారు. మీకో నాకో బ్లాక్ టికెట్లు అమ్మే టాలెంట్ ఉందనుకుందాం. అప్పుడు మనం ముక్కు చెవులూ తెలియని బ్లాక్ గాళ్ళమన్న వంకతో మన టిక్కెట్ట్లు కొనకపోవచ్చు.

    రిప్లయితొలగించండి
  5. vinay just wait and watch.....serious comedy just started.

    రిప్లయితొలగించండి