6, జనవరి 2010, బుధవారం

ముఖ్యమంత్రి పాత్రేమిటి?


రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. నెలరోజుల్లో రెండు ప్రాంతాలుగా రాష్ట్రం చీలిపోయింది. ఇరువైపులా ఉద్యమాలు ఉవ్వెత్తును ఎగిసిపడుతుండటంతో, రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఈ సమస్యపై కేంద్రం ఏదో విధంగా అడపాదడపా స్పందిస్తూనే ఉంది. మరి రాష్ట్రానికి పరిపాలకుడైన ముఖ్యమంత్రి మాత్రం నిమిత్తమాత్రుడిగా మారిపోయారు.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తన పాత్రేమిే తనకే తెలియనంత అయోమయంలో పడిపోయారు..
శాంతి లేదు..భద్రతా లేదు..
ఉద్యమాలు.. ఆందోళనలు..
బందులూ రాస్తారోకోలు..
సమస్య ఒకటి.. పరిష్కారం ఏది?
ముఖ్యమంత్రి భూమిక ఏమిటి?
కేంద్రంపై భారం వేయటమేనా?
తానుగా చేసేదేమైనా ఉందా?


నెల రోజులకు పైగా రాష్ట్రం ఆందోళనలతో, ఉద్యమాల వేడితో సలసల కాగిపోతోంది. రాష్ట్రం రెండు ప్రాంతాలుగా నిట్ట నిలువునా చీలిపోయింది. పార్టీలు చీలిపోయాయి. ఉద్యోగులు చీలిపోయారు... ఇంత జరుగుతున్నా.. ముఖ్యమంత్రి హోదాలో కొణిజేటి రోశయ్య సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన భూమిక ఏమిటి? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఉద్యమాలకు పరిష్కారం కోసం ఆయన ఏం ప్రయత్నించారు అన్నది సందేహంగా మారింది. కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా? అధిష్ఠానంవైపు చూపులు చూస్తూ బిన్‌దాస్‌ సిఎంగా పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారా? పైగా సంయమనం పాటించాల్సిన ఆయనే అడపాదడపా వివాదాస్పద ప్రకటనలు చేయటం సమస్యకు మరింత చిక్కుముళ్లు పడేలా చేశాయి.

దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిపోయింది. డజన్లకొద్దీ మంత్రులు రాజీనామా చేశారు.. వందలకొద్దీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు... ఎవరి రాజీనామాలు ఆమోదం పొందకపోయినా ఎవరూ విధులకు హాజరు కావటం లేదు.. అంతా ఆందోళనలు.. సంప్రతింపులు.. సమావేశాలు.. లాబీయింగ్‌లలోనే కాలం మునిగితేలుతున్నారు.. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కరే ప్రభుత్వంలో ఉన్నారా అన్న అనుమానం కలుగుతుంది. మంత్రులుకానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరూ ఆయన నియంత్రణలో లేరు.. శాంతిభద్రతల పరిస్థితి ఎప్పుడెలా మారుతోందో తనకు తెలియని స్థితి ఏర్పడింది. ఒక దశలో తనను కలవటానికి వెళ్లిన విపక్ష నేతలను ఏ విషయాలై్ననా గవర్నర్‌తో మాట్లాడండి అంటూ సిఎం సెలవిచ్చారంటే ఆయన ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు.. విద్యార్థి గర్జనకు అనుమతి ఇవ్వమని వినతిపత్రం ఇవ్వటానికి జెఎసి నేతలు వెళ్లినప్పుడు కూడా కమిషనర్‌కు ఫార్వర్డ్‌ చేస్తానన్నారు.. డిల్లీ అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నానన్నారే కానీ, తానేం మాట్లాడేది లేదని వ్యాఖ్యానించటం రోశయ్యకే సాధ్యమైంది.
చివరకు శాంతిభద్రతలను కాపాడటంలో తన వైఫల్యాన్ని పూర్తిగా ఒప్పేసుకున్నారు మన ముఖ్యమంత్రి. రాజమండ్రిలో జరిగిన ఓ సమావేశంలో తన ముందున్న చివరి ప్రత్యామ్నాయం రాష్ట్రపతి పాలనే అని కూడా అన్నారు..

సమస్యలన్నింటినీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లటం వరకే ముఖ్యమంత్రి రోల్‌ తయారైంది. అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలు కూడా అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు.. జిల్లా పర్యటనలకు వెళ్లలేని స్థితిలో సిఎం ఉన్నారు.. పూర్తిగా ఢిల్లీ ఆదేశాలతోనే ఆయన పాలన చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆదేశం రాకుండా ఒక్క అడుగు కూడా కదపలేని స్థితిలో రోశయ్య ఉన్నారంటే రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు....


1 కామెంట్‌: