29, డిసెంబర్ 2008, సోమవారం

చిరంజీవి విజేత అవుతారా?

మెగాస్టార్‌ చిరంజీవి సుదీర్ఘకాలం ఆలోచించి ఆలోచించి ముహూర్తం పెట్టుకుని రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి రావటం ఒక మహా సంచలనం అంటూ మీడియాలో హోరెత్తింది. తిరుపతి సభ మీడియా మాటల్ని నాటికి నిజం చేసింది. చిరంజీవి పార్టీని ప్రారంభించి నాలుగు నెలలు కావస్తున్నది. కానీ, ఆయన పార్టీ దశ ఏమిటి? దిశ ఏమిటి? అది ప్రజలకు ఇస్తున్న మార్గ నిర్దేశన ఏమిటన్నవి.. ఇప్పటికీ ఒక స్పష్టత రాని ప్రశ్నలు. చిరంజీవి రాజకీయాల్లోకి రావలసిన అవసరానవసరాల గురించి ఇప్పుడు చర్చించి ప్రయోజనం లేదు. ఆయన ఎలాగూ వచ్చారు. ఇప్పుడు ఆయన రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయనున్నారన్నదే సందేహం. చిరంజీవిని ఎన్టీయార్‌తో పోల్చటం ఒక విధంగా సమంజసమే కావచ్చు. కానీ, ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేవలం ఆయన చరిష్మా ఒక్కటే పని చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన చరిష్మా కంటే కూడా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత్వమే ఎక్కువగా ప్రభావితం చేసింది. కేవలం సినిమాల్లో వేషాల వల్లనే ఎన్టీయార్‌ తొమ్మిది నెలల్లో అధికారంలోకి రాలేదు. దాదాపుగా అప్పుడే భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందిన జనసంఘం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఉండకపోతే అధికారంలోకి వచ్చేది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న వ్యతిరేకత అలాంటిది. దీనికి తోడు ఎన్టీయార్‌కు నాడు పూర్తిగా సహకరించిన వాళు్ల కమూ్యనిస్టులు. ఆయన సభలకు పెద్ద ఎత్తున జనాల్ని తరలించిన వాళు్ల కమూ్యనిస్టులు అన్నది నిర్వివాదం. వీటన్నింటికీ మించి నాడు మీడియా రారాజుగా నిలిచిన ఈనాడు పత్రిక పూర్తిగా తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించింది. ఈనాడు పత్రిక ఏది రాస్తే అది వేదంగా చెలామణి అయిన కాలం అది. తెలుగుదేశం పార్టీ జెండా ఈనాడు హైదరాబాద్‌ కార్యాలయంలో రూపొందిన మాట వాస్తవం. ఎన్టీయార్‌ ప్రసంగాలతో పాటు, తెలుగుదేశం పార్టీలోని చిన్న నాయకులకు, సినిమా తారలకు ప్రసంగ పాఠాలు రాసివ్వటమే కాకుండా, వారు ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చింది కూడా ఈనాడు కార్యాలయంలోనే. ఇన్ని రకాలుగా ఎన్టీయార్‌కు కాలం కలిసి వచ్చింది కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చారు. అదే ఎన్టీయార్‌ను అయిదేళ్ల తరువాత ఓడించి మరీ గద్దె దింపింది ఈ ప్రజలేనన్నదీ మరవద్దు...చిరంజీవిని ఎన్టీయార్‌తో పోల్చుకున్నా.. చరిష్మా విషయంలో  చిరంజీవికి ఉన్న అభిమానులు అధికంగా మాస్‌.. యూత్‌ అన్నది నిర్వివాదం. యువతలో ఓటు హక్కు ఉన్న వారి సంఖ్య పరిమితం. వీళ్లలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్యే ఎక్కువ. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అర్బన్‌ ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువ. వీళ్లలో చాలామందికి ఓటు పైన ఆసక్తి కూడా ఉండటం లేదని చాలా సందర్భాల్లో తేలింది. మరి సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న గ్రామీణ ఓటర్ల మాటేమిటి? వీళ్లలో ఎంతమందిని చిరంజీవి తనవైపు తిప్పుకోగలరు? పార్టీ స్థాపించి ఇప్పటికి నాలుగు నెలలు అయింది. మూడు ప్రాంతాలలో 13 రోజుల పాటు రోడ్డు షోలు నిర్వహించారు. ఇప్పుడు ప్రజా అంకిత సభలు పెడుతున్నారు. మొట్ట మొదట సిరిసిల్ల వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తన ప్రసంగాల్లో రాజకీయాల్లో మార్పు గురించో... అవినీతి నిర్మూలన గురించో.. వివిధ అంశాలపైన సాధారణీకరణ(జనరలైజ్‌) వ్యాఖ్యానాలు చేస్తున్నారే తప్ప .. నిర్మాణాత్మకంగా తన అజెండాను స్పష్టంగా చెప్పింది లేదు. లక్షల మంది ప్రజలు తనను చూసేందుకు వస్తున్నప్పుడు వారిలో భావోద్వేగాన్ని (ఎమోషన్‌) సృష్టిస్తే తప్ప ఆయన మాటలు వారి మనసుల్లో ఎక్కువ కాలం నిలవవు. ఈ వాస్తవాన్ని ఆయన గ్రహించినట్లు లేదు.  అప్పుడే వారు తనకు ఓటర్లుగా మారే అవకాశం ఉంటుంది. ఆయనకు ప్రసంగాలు రాసిస్తున్న వారు కూడా కేవలం ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పడికట్టు పదాలు రాసివ్వటం తప్ప తనకు అవకాశం ఇస్తే ప్రజలకు ఇప్పుడున్న నాయకుల కంటే మెరుగ్గా తానే పని చేయగలనన్న ధీమా కలిగించే ప్రసంగ పాఠాలు మచ్చుకైనా కనిపించవు. ఎందుకంటే  ఆ రాయసగాండ్రు కూడా ఈనాడు సంస్థలో నలిగి నలిగి వచ్చిన వారే కాబట్టి. 
ఆయన పార్టీ స్థాపించిన తరువాత అందులో చేరిన వారంతా రాజకీయ కురువృద్ధులూ.. రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడిన వారే కావటం గమనార్హం.. చేగొండి హరిరామ జోగయ్య, శివశంకర్‌, పర్వతనేని ఉపేంద్ర లాంటి ముసలివాళు్ల.. భూమా దంపతులు.. తమ్మినేని సీతారాం లాంటి వాళు్ల 2004లో వాళ్ల నియోజక వర్గాల్లోనే ఓడిపోయిన నేతలు.. ఒకరిద్దరు ఛోటామోటా నాయకులు తప్ప ప్రజారాజ్యం పార్టీలో ప్రజలపై ఖచ్చితమైన ప్రభావం చూపగల నాయకులంటూ ఎవరూ లేరన్నది నిష్ఠుర సత్యం. కత్తిపద్మారావు లాంటి నేతలు రాజకీయంగా చిరంజీవికి ఎంతమాత్రం ఉపయోగపడతారన్నది అనుమానమే.
ఇక పార్టీ ప్రతినిధులూ అలాగే ఉన్నారు. ఒకరు బిజెపిలో ఇమడలేక ఈటీవీలో ప్రతిధ్వని కార్యక్రమానికి యాంకరింగ్‌ చేస్తూ.. రామోజీరావు గారి సిఫార్సుమేరకు పిఆర్‌పి ప్రతినిధిత్వం స్వీకరించిన పరకాల ప్రభాకర్‌.. మరొకరు చిరంజీవికి తొలి నుంచి రాజకీయ సలహాదారుగా ఉన్న పుచ్చలపల్లి వారి మనవడు మిత్రా. ఈ ఇద్దరూ కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారు కారు..వారికి ఉన్న బలం అల్లా ఒక్కటే.. భాషాదోషం లేకుండా, తడబడకుండా మాట్లాడగలగటం. పార్టీలో అభిమానులకు లభించిన ప్రాధాన్యమూ అంతంతమాత్రమేనని పలు జిల్లాల్లో తరచూ జరుగుతున్న గొడవలే స్పష్టం చేస్తున్నాయి. చిరంజీవి అభిమాన గణానికి,  అభిమానేతర వర్గానికి మధ్య అంతరం అన్ని నియోజక వర్గాల్లో కనిపిస్తూనే ఉన్నది. ఒక్కో నియోజక వర్గంలో పది నుంచి పదిహేను మంది టిక్కెట్ల కోసం ఆశిస్తున్నట్లు అంచనా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వీళ్లందరి మధ్య సమన్వయం కుదర్చటం చిరంజీవికి తల బొప్పి కట్టించే విషయం.
దీనికి తోడు మార్చి ఏప్రిల్‌లలో ఎన్నికలు జరగ వచ్చని ఎన్నికల సంఘం అప్పుడే సూచన ప్రాయంగా ప్రకటించింది. అంటే ఎన్నికలకు ఇంకా మూడు మాసాల గడువే ఉంది. ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల గుర్తు ఏమిటన్నది ఇంకా ఖరారు కానే లేదు. అభ్యర్థులందరికీ ఒకే గుర్తు కేటాయించాలని చిరంజీవి ఇసికి విజ్ఞప్తి చేసి వచ్చారు కూడా. ఎన్నికల సంఘం గుర్తు కేటాయించిన తరువాత దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటం పెద్ద సవాలు.. ప్రజారాజ్యం పార్టీ జెండా ఇప్పుడు ప్రజలకు బాగా తెలిసిపోయింది. ఓట్ల సమయంలో వేరే గుర్తు ఉంటే గ్రామీణ ఓటర్లు దాన్ని గుర్తించటం ఓ సమస్య. పార్టీ గుర్తు ఎంత తొందరగా ఖరారైతే అంత మంచిది. చివరి నిమిషంలో ఖరారైతే.. ఓటర్లలో అయోమయం నెలకొనవచ్చు. 
119 సీట్లు ఉన్న తెలంగాణాలో తెలంగాణ అనుకూల పార్టీలు మూడు వర్గాలుగా పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు ఇప్పటికైతే వినవస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ అనుకూల ఓట్లు ఈ మూడింటి మధ్య చీలిపోవచ్చు. దాని వల్ల అంతిమంగా సత్ఫలితాన్ని పొందేది కాంగ్రెసే.. ఈ అడ్డంకిని చిరంజీవి ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి. మరోవైపు ఎన్నికల పొత్తుల విషయంలోనూ చిరంజీవికి ఎదురుదెబ్బే తగిలింది. పార్టీ ప్రారంభానికి ముందు చిరంజీవితో ఆయన తము్మళ్లతో, బావమరిదితో మాట్లాడటానికి ఉత్సాహం చూపిన వారంతా ఒక్కరొక్కరుగా వెనక్కిపోయారు. మొదట్లో అత్యుత్సాహం ప్రదర్శించిన ఉభయ కమూ్యనిస్టులు ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు. కొంతకాలం ఊగిసలాడిన కెసిఆర్‌ సైతం మొహం చాటేశారు. ఇప్పుడు చిరంజీవితో కలిసి పని చేయాలని భావిస్తున్న వ్యక్తి నవతెలంగాణ పార్టీ అధినేత దేవేందర్‌ గౌడ్‌ మాత్రమే. దేవేందర్‌ గౌడ్‌ పార్టీ తెలంగాణ ప్రజలపై చూపిస్తున్న ప్రభావం అంతంతమాత్రమే. అలాంటప్పుడు గౌడ్‌ చిరంజీవికి ఎంతవరకు లాభం చేస్తారో చూడాల్సిందే. 
తెలుగు సినీపరిశ్రమను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న కుటుంబం చిరంజీవిది. అలాంటి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే.. ఆయన వెంట ఆయనకు వెన్నుదన్నుగా సినీపరిశ్రమ కదలిరాకపోవటం విచిత్రం. పైగా సినీపరిశ్రమ మూడు ముక్కలుగా రాజకీయాల్లో చీలిపోయింది. సూపర్‌స్టార్‌ కుటుంబం కాంగ్రెస్‌ వైపు వెళ్తే.. నందమూరి కుటుంబం పూర్తిగా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే బాధ్యతల్ని భుజానికెత్తుకుంది. నాగార్జున సైతం కాంగ్రెస్‌ పథకాలకు ప్రచారం మొదలు పెట్టారు. ఈ దామాషా పద్ధతిలోనే అభిమానుల ఓట్లు పార్టీల మధ్య చీలుతాయన్నది నిర్వివాదం. అలాంటప్పుడు చిరంజీవి 225 సీట్లు సాధిస్తానని ఏ ధీమాతో చెప్తున్నారో ఆలోచించాలి.
చిరంజీవి ఇప్పటివరకు ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. అన్నీ తానే అయి.. అంతటా తానే నిలిచి పని చేస్తున్నారు. ఈ పోరాటంలో చివరికి విజేతగా నిలుస్తారా? విజితులవుతారా? వేచిచూద్దాం....

7, డిసెంబర్ 2008, ఆదివారం

నిజం నిప్పులాంటిది


పదహారు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరువాత 46చానళ్లతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న జీ నెట్‌వర్‌‌క తెలుగులో కొత్త న్యూస్‌ చానల్‌ను ఒక సరికొత్త రూపంలో, సరికొత్త ఆలోచనలతో వార్తలను వార్తలుగా ప్రజల ముందుంచడానికి అత్యాధునిక హంగులతో సంసిద్ధమైంది. వక్రీకరణకు తావు లేకుండా, వార్తల్లోని సీరియస్‌నెస్‌ను, ప్రాధాన్యాన్ని ఎంతమాత్రం తగ్గించకుండా జీ24గంటలు ఫోకస్‌ చేస్తుంది. వార్తల్లోని వాస్తవాలపై ప్రేక్షకుల్లో ఆలోచనల్ని రేకెత్తించటమే కొత్త నినాదంగా జీ24 గంటలు మీముందుకు వస్తున్నది..
నిజం నిప్పులాంటిది. ఒక నిజం అనేకుల జీవితాల్లో వెలుగుల్ని నింపితే.. మరో నిజం కొందరిని మాత్రం నిలువునా కాల్చేస్తుంది.. నిజానికి రూపం ఉండకపోవచ్చు.. కానీ, దానికి హేతువు ఉంటుంది. ఆ హేతువుకు అనేక రూపాలు ఉంటాయి. అవి భవిష్యత్తుకు నిర్దేశిస్తాయి. సామాజిక మార్పునకు నాంది పలుకుతాయి. ఈ లక్ష్యంతోనే జీ 24 గంటలు సరికొత్త రూపంలో తెలుగు మీడియాలో దూసుకువస్తున్నది. ఇంతకాలం అబద్ధాల నివురు వెనుక దాగిన నిజాన్ని వెలుగులోకి తెచ్చేందుకు సర్వ సన్నద్ధమవుతున్నది. వక్రీకరణలకు ఆలవాలంగా మారిన మీడియా ప్రపంచంలో వార్తల్ని వార్తలుగా ఇవ్వటమే ప్రధాన లక్ష్యంగా జీ24 గంటలు, అహరహం కృషి చేస్తుంది. .
మీడియా ప్రసారం చేసే ప్రతి వార్త గురించి ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. ప్రేక్షకుల ఆలోచనను తక్కువ అంచనా వేయరాదు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఉండటం, వారికి మార్గదర్శకం కావటం మీడియా లక్ష్యం కావాలి. వారి ఆలోచనలకు వార్తలు మరింత పదును పెట్టాలి కానీ, అర్థాలు అపార్థాలు కారాదు.. ప్రజలకోసం, ప్రజల పక్షంలో వార్తల ప్రసారాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత ఆసక్తికరంగా అందించటం జీ 24గంటలు చానల్‌ పరమార్థం..ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా నిలవాలన్న సామాజిక బాధ్యతను జీ 24 గంటలు అక్షరాలా నెరవేరుస్తుంది.

ఇవీ మన దేశంపై జరిగిన దాడులు

మన దేశంలో టెరర్రిజం 1970వ దశకంలో మొదట కళు్ల తెరిచింది. అప్పటి నుంచి నాలుగేళ్ల క్రితం అంటే 2004 వరకు 4100 టెరర్రిస్టు దాడులు భారత మంతటా రకరకాల స్థాయిల్లో జరిగాయి. ప్రపంచ టెరర్రిజం డేటాబేస్‌ ఈ సమాచారాన్ని ధృవీకరించింది. ఈ డేటాబేస్‌ను అమెరికాలోని మేరీలాండ్‌ యూనివర్సిటీలోని స్టడీ ఆఫ్‌ టెరర్రిజం, రెస్పాన్సెస్‌ టు టెరర్రిజం విభాగాలు నిర్వహిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం 1970 నుంచి 2004 వరకు జరిగిన దాడుల్లో దాదాపు 12540మంది మృత్యువాత పడ్డారు.  దాదాపు సగటున ఏడాదికి 360 మంది చనిపోతున్నారు. 1991, 1992లలో భారత్‌లో ఉగ్రవాదం పరాకాష్టకు చేరుకుంది. ఆ రెండేళ్లలో వరుసగా 1184, 1132 మంది తీవ్రవాదుల ముష్కర చర్యలకు చనిపోయారు. దేశంలో జరుగుతున్న టెరర్రిస్టు దాడుల్లో 38.7శాతం ఫిదాయూలు ఇతర రూపాల్లో నేరుగా దాడులు జరపడం కాగా, 29.7శాతం బాంబు పేలుళ్ల రూపంలో జరుగుతున్నాయి. 25.5 శాతం హత్యల రూపంలో కొనసాగుతున్నాయి. 
దేశంలో 1993 నుంచి చోటు చేసుకున్న ప్రధాన టెరర్రిస్టు దాడుల వివరాలు...
12 మార్చి 1993.. బొంబాయిలో బాంబు పేలుళు్ల.. 257 మంది మృతి
14 ఫిబ్రవరి 1998..కోయంబత్తూరు బాంబు పేలుళు్ల.. 46మంది మృతి
1 అక్టోబర్‌, 2001.. శ్రీనగర్‌ అసెంబ్లీపై ఉగ్రవాదుల దాడి.. 35 మంది మరణం
13 డిసెంబర్‌, 2001.. పార్లమెంటు భవనంపై ఉగ్రవాదుల దాడి.. 7గురు మృతి..
21 డిసెంబర్‌ 2001.. కర్నూలు ట్రైన్‌ క్రాష్‌.. 20 మంది మృతి
10 సెప్టెంబర్‌, 2002.. రఫీగంజ్‌ రైలు దుర్ఘటన.. 130 మంది మృతి
27, ఫిబ్రవరి, 2002.. గుజరాత్‌లో గోధ్రా దహనం.. 55మంది మృతి
24 సెప్టెంబర్‌, 2002.. గుజరాత్‌ అక్షరధామ్‌ గుడిపై టెరర్రిస్టుల దాడి. 31 మంది మృతి 
13, మార్చి, 2003.. ముంబై రైల్లో బాంబు దాడి.. 11 మంది మృతి
14 మే, 2003 జము్మ ఆర్మీ క్యాంప్‌పై టెరర్రిస్టుల దాడి.. 30మంది మృతి 
25 ఆగస్టు, 2003.. ముంబయిలో రెండు కారు బాంబు పేలుళు్ల.. 60 మంది మృతి
15 ఆగస్టు, 2004.. అసోంలో బాంబు పేలుడు.. 16 మంది స్కూలు పిల్లల మరణం
5, జూలై, 2005.. అయోధ్యలో రామజన్మభూమిపై టెరర్రిస్టుల దాడి..
29 అక్టోబర్‌, 2005.. న్యూఢిల్లీలోని మూడు మార్కెట్లలో పేలుళు్ల.. 70 మంది దుర్మరణం
7, మార్చి, 2006..వారణాసిలోన సంకట్‌ మోచన్‌ మందిర్‌లో పేలుళు్ల..21మంది మృతి
11 జూలై  2006.. ముంబై లోకల్‌ రైళ్లలో ఏడు బాంబుల పేలుళు్ల.. 209 మంది మృతి
8 సెప్టెంబర్‌ 2006..ముంబై సమీపంలోని మాలేగావ్‌లో వరుస పేలుళు్ల.. 32 మంది మృతి
19 ఫిబ్రవరి, 2007.. సంఝోతా ఎక్‌‌సప్రెస్‌లో పేలుళు్ళ.. 66మంది సజీవ దహనం
18 మే, 2007.. హైదరాబాద్‌ మక్కా మసీద్‌లో పేలుడు..11 మంది మృతి
25ఆగస్టు, 2007..హైదరాబాద్‌ లుంబినీపార్‌‌క, గోకుల్‌చాట్‌లలో పేలుళు్ల.. 42మంది మృతి
11 అక్టోబర్‌, 2007..ఆజ్మీర్‌లో బాంబు పేలుడు.. ముగ్గురి మృతి
14 అక్టోబర్‌, 2007.. లూథియానా సినిమాహాల్‌లో పేలుడు.. ఆర్గురు మృతి.
24 నవంబర్‌ 2007.. లక్నో, వారణాసి, ఫైజాబాద్‌లలో పేలుళు్ల...16మంది మృతి
13 మే, 2008.. జైపూర్‌లో తొమ్మిది చోట్ల వరుస పేలుళ్లు 63మంది దుర్మరణం...
25 జూలై 2008..బెంగళూరులో ఎనిమిది చోట్ల చిన్న చిన్న బాంబుపేలుళ్లు.. ఇద్దరు మృతి
26జూలై, 2008.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 17చోట్ల వరుస బాంబు పేలుళు్ల.. 45 మంది మృతి..
13 సెప్టెంబర్‌, 2008.. న్యూఢిల్లీ మార్కెట్లలో అయిదు చోట్ల పేలుళు్ల..21 మంది మృతి
27 సెప్టెంబర్‌, 2008.. ఢిల్లీ పూల మార్కెట్‌లో రెండు బాంబు పేలుళు్ల.. ఒకరి మృతి
29 సప్టెంబర్‌, 2008 మహారాష్ట్ర, గుజరాత్‌లలో పేలుళు్ల.. 10 మంది మృతి
29 సెప్టెంబర్‌, 2008.. మాలేగావ్‌లో మళ్లీ పేలుళు్ల.. 7గురు బలి
1 అక్టోబర్‌, 2008... అగర్తలాలో బాంబు పేలుడు.. నలుగురు మృతి
21 అక్టోబర్‌ 2008.. ఇంఫాల్‌లో బాంబు పేలు.. 17 మంది మృతి
30 అక్టోబర్‌ 2008, అసోంలో 11 బాంబు పేలుళు్ల.. 77మంది మృతి
26 నవంబర్‌, 2008, ముంబయిలో  ఉగ్రవాదుల దాడి.. 183 మంది మృతి

మొబైల్ నెట్వర్క్ నూ హైజాక్ చేసిన పాక్

భారత్‌పై జరుగుతున్న టెరర్రిస్టు దాడులతో తమకు ఎలాంటి సంబంధాలు లేవంటూ పాకిస్తాన్‌ ఎప్పటికప్పుడు పతివ్రత మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. ముంబై దాడుల తరువాత కూడా అదే పనిగా పాత పాటే పాడుతూ వస్తున్నది. అధికారంలో ముషారఫ్‌ ఉన్నా, జర్దారీ ఉన్నా అదే తంతు.. దాడుల్లో అరెస్టు అయిన అజ్మల్‌ కసావ్‌ భారత్‌పై టెరర్‌ దాడులకు సంబంధించి ఒక్కో అంశాన్ని బయటపెడుతున్న కొద్దీ విస్మయం కలుగుతోంది. ముంబయికి సముద్ర మార్గంలో ఉగ్రవాదులను పంపించే కార్యక్రమాన్ని పాక్‌ నౌకాదళం స్వయంగా పర్యవేక్షించింది. మరోవైపు పాకిస్తాన్‌ స్థల సేన కాశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌  సరికొత్త ముప్పును తెచ్చి పెట్టింది.  సరిహద్దుకు ఆవలివైపున తన భూభాగంలో  తొమ్మిది మొబైల్‌ టవర్లను నెలకొల్పడంతో  మన దేశ అంతర్గత భద్రతకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ పెను ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే గమనించింది. అయినా కొట్టడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. భారత్‌ పాకిస్తాన్‌ సరిహద్దు లోని మునబావ్‌ దగ్గర హద్దుకు ఆవలి వైపున పాకిస్తాన్‌ భూభాగంలో ఒకదాని వెంట ఒకటిగా కనిపిస్తున్న మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేసింది. వీటిని చూస్తేనే చాలు.. మన భూభాగంలోని గ్రామాల ప్రజల గుండెల్లో రైళు్ల పరిగెత్తిస్తున్నాయి. ఈ టవర్ల వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనుందో సామాన్యుడికి సైతం అర్థమవుతున్నా, మన ప్రభుత్వానికి మాత్రం ఇంకా ఈ విషయం పట్టనే లేదు. ఈ మొబైల్‌ టవర్ల వల్ల రాజస్థాన్‌లోని మొత్తం మొబైల్‌ నెట్‌వర్‌‌క పాకిస్తాన్‌ చేతుల్లోకి వెళ్లినట్లయింది. ఈ ప్రమాదం ఏ స్థాయికి వెళ్లిందంటే పాకిస్తాన్‌ గూఢచారులు స్వేచ్ఛగా సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న తమ సహచరులతో స్వేచ్ఛగా లోకల్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోవచ్చు. పాకిస్తాన్‌లోని ఏదైనా నెట్‌వర్‌‌క ఫ్రీకాల్‌ ఆఫర్‌ ఇచ్చిందంటే ఇక అడ్డేముంటుంది. ఇంత ఫ్రీగా గూఢచర్యం నిర్వహించే వ్యవస్థ ప్రపంచంలోనే మరొకటి ఉండదేమో. సరిహద్దు గ్రామాల్లో మన లోకల్‌ టవర్లు పనిచేయవు.. కానీ, పాకిస్తాన్‌ టవర్ల నుంచి మాత్రం స్పష్టమైన సిగ్నల్‌‌స వస్తాయి. అంటే ఈ ప్రాంతం నుంచి సైనికులు మాట్లాడే ప్రతి మాటా పాకిస్తాన్‌లోని కాల్‌ సెంటర్లలో రికార్డు అవుతుందన్నమాట. పాకిస్తాన్‌ మొబైల్‌ నెట్‌వర్‌‌క గురించి సరిహద్దుల్లో కీలకమైన 46 ప్రాంతాల్లో మన ప్రభుత్వం దర్యాప్తు చేసింది. అందులో  39 ప్రాంతాల్లో పాక్‌ మొబైల్‌ నెట్‌వర్‌‌క బ్రహ్మాండంగా పని చేస్తున్నట్లు తేలింది.  అంటే దాదాపు సరిహద్దు అంతటా పాక్‌ మొబైల్‌ నెట్‌వర్‌‌క పనిచేస్తున్నది. సరిహద్దుల్లో మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేయటం అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకం. పాకిస్తాన్‌ అన్ని అంతర్జాతీయ నిబంధనలకు అతీతమని భావిస్తుంది కాబట్టే ఈ ఆగడాలకు పాల్పడుతోంది. అన్నింటికీ మించి మునబావ్‌ఖోక్రాపార్‌ రహదారిలో రాకపోకలు ప్రారంభమైన తరువాత పాకిస్తాన్‌కు చెందిన సిమ్‌ కార్డులు మన దేశంలోకి యథేచ్ఛగా వచ్చేస్తున్నాయి. కనీసం వాటిని దేశంలోకి రాకుండా అడ్డుకునే అవకాశం కూడా లేకపోయింది. ప్రభుత్వం దీనిపై దష్టి కూడా పెట్టలేదు. ఈ సమస్య తీవ్రత తెలిసి కూడా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించటం లేదు. సరిహద్దు గ్రామాల ప్రజలకు సమాచార వ్యవస్థ ఎంత అవసరమో, అంతకంటే మించి దేశ భద్రత ముఖ్యం. ఇందుకోసం సరిహద్దుల్లో మొబైల్‌ నెట్‌వర్‌‌క పని చేయకుండా జామర్లు ఏర్పాటు చేయటం అత్యవసరం. పాకిస్తాన్‌ విషయంలో మన ప్రభుత్వాలు ఇప్పటికే దారుణమైన అలసత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి. దాని ఫలితాన్ని ముంబయిలో నాలుగుసార్లు.. మిగతా చోట్ల పలుమార్లు  అనుభవించాం. ఇప్పటికైనా నేతలు కళు్ల తెరిస్తే ఈ దేశ ప్రజలు గుండె నిండా నిద్ర పోతారు.


2, డిసెంబర్ 2008, మంగళవారం

ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఎందుకు కావాలి?

ప్రధాన నగరాల్లో సామాన్యులను టార్గెట్‌ చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసిన ప్రతిసారీ దేశమంతటా తలెత్తే ప్రశ్న ఒకటే.. టెరర్రిజాన్ని అణచివేసేందుకు సమర్థమైన చట్టం అవసరం లేదా? అని... చట్టం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోతాయి. ఒకరు చట్టం అవసరం.. మరొకరికి అనవసరం.. ఇందులో  ఎలాంటి లాజిక్‌ ఉండదు. వాళు్ల కావాలన్నారు కాబట్టి వీళు్ల వద్దంటారు. అంతకు మించి ఓట్ల లెక్కలు కీలకమవుతాయి. ఒకవేళ చట్టం అంటూ చేస్తే ప్రస్తుత కాలానికి ఇలాంటి చట్టాలు పనికిరావన్న వాదనా చేస్తారు? దీనికీ లాజిక్‌ ఉండదు. ప్రపంచంలో అన్ని దేశాలూ చట్టాల్ని చేసుకుంటాయి. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తాయి. అయినా మన దేశంలో మాత్రం చట్టం అంటూ చేస్తే.. అది ఏ అంశానికి సంబంధించినదైనా సరే.. ఉల్లంఘనకు అవకాశం లేకుండా రూపొందదు. ఉల్లంఘనకు గురికాని చట్టం అంటూ ఉండదు. రూపకల్పన దశలోనే రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని `జాగ్రత్తలు' తీసుకుంటారు. టెరర్రిజం విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్నది ఇవాళ్టికీ మన రాజకీయ నాయకులకు అర్థం కావటం లేదు. ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ఏర్పాటు చేస్తామంటున్నారు.. నాలుగు దిక్కులా జాతీయ భద్రతా గార్డుల బలగాలను మోహరిస్తామంటున్నారు. కానీ చట్టం ప్రస్తావన మాత్రం చేయటం లేదు. చట్టం అంటూ ఒకటి ఉంటే కదా.. విచారణ సంస్థలు ఏవైనా ముందుకు పోగలవు! కఠిన చట్టం లేకుండా ఎఫ్‌బిఐని ఏర్పాటు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఇందుకు కారణం.. మరో పార్టీ చేసిన చట్టాన్ని ఈ పార్టీ రద్దు చేసింది కాబట్టి తిరిగి చట్టం చేయటం అంటే అది ప్రతిష్ఠకు భంగం కలిగినట్లే అవుతుంది కనుక.. రేపు ఆ పార్టీ వస్తే వారు ఓ చట్టాన్ని చేస్తారు... ఇంతే తప్ప ఈ దేశ అంతర్గత భద్రతను కాపాడటానికి ఏ విధంగా రాజకీయాలకు అతీతంగా ఎలాంటి విధానం అనుసరించాలో ఏ రాజకీయ పార్టీకీ అవగాహన లేదు... అర్థమూ కాదు.. కనీసం ఆ దిశగా ఆలోచించనైనా ఆలోచించరు...ఇందుకు కారణాలు, భ్రమలు అనేకం ఉన్నాయి. 
1.
మన దేశంలో ఉగ్రవాదం పట్ల ప్రభుత్వ వర్గాలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, విశ్లేషకులకు కానీ ఒక స్పష్టమైన దృష్టికోణం లేదు. ఒకరి దృష్టిలో టెరర్రిస్టు అయిన వాడు.. మరొకరి దృష్టిలో  ఫ్రీడం ఫైటర్‌గా మారుతున్నాడు. పవిత్ర యుద్ధం చేస్తున్న యోధుడుగా కీర్తి పొందుతున్నాడు.. అంతే కానీ, ఉగ్రవాదంపై ఈ దేశంలో ఖచ్చితమైన నిర్వచనం అంటూ ఏమీ లేదు. మన రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ధోరణులు ఇందుకు స్పష్టమైన ఉదాహరణలు.  జాతీయ ప్రయోజనాల గురించి రాజకీయ పార్టీలు ఒక్క క్షణం అయినా సమష్టిగా, ఒకటిగా ఆలోచించవు. ఆందుకు అంగీకరించవు...
కానీ, కాస్త ఆలోచించండి.. విచక్షణ లేకుండా మానవ సమూహాన్ని హననం చేస్తున్న మూకను యోధులుగా నిర్వచించటం నాగరిక సమాజంలో సాధ్యమేనా? మారణకాండ సృష్టించే లక్ష్యంతో, ఒక పథకం ప్రకారం రక్తపుటేరులను పారించేవారిని ఏమనాలి? మార్కెట్‌లలో, షాపింగ్‌ మాల్‌లలో బాంబులు పెట్టడం, విద్యార్థులు ఉన్న బస్సులను కిడ్నాప్‌ చేయటం, థియేటర్లలోకి చొరబడి కుటుంబాలకు కుటుంబాలనే అంతం చేసేవారి  వారి పట్ల ఎవరైనా ఎలా వ్యవహరించాలి? చివరకు ఫిదాయూలు చొరబడి అత్యాధునిక ఆయుధాలతో మారణ కాండ చేయటం జిహాద్‌ అనటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. మతం పేరుతో, రాజకీయం „పేరుతో, దేవుడిపేరుతో,  భయోత్పాతాన్ని సృష్టించే క్షుద్ర హవనం ఇది. ఇది ఉద్యమం కాదు.. సిద్ధాంతం అంతకన్నా కాదు.. ఇది ఒక ఉన్మాదం.. ఒక దేశం మరో దేశంపై పరోక్షంగా చేస్తున్న యుద్ధం..
2
9/11 తరువాత అమెరికాలో కానీ, ఆ మరుసటి సంవత్సరం రష్యా థియేటర్‌లో చెచెన్‌ ఉగ్రవాదుల దాడుల తరువాత కానీ ఆయా దేశాల్లో దాడులు జరగలేదంటే అందుకు  కారణాలు వేరు.  అక్కడ ఉన్నది పరిమిత వర్గాలు..., పరిమిత జాతులు..అన్నింటికీ మించి అక్కడి రాజకీయ వ్యవస్థ వేరు. అమెరికాలోనైనా, రష్యాలోనైనా అడ్డగోలుగా ప్రభుత్వాలు పడిపోవు. ఒకసారి ఎన్నికలు పూర్తయితే, మళ్లీ నాలుగేళ్ల దాకా రాజకీయ పార్టీల మధ్య అనారోగ్యకరమైన స్పర్థలు ఉండవు. అత్యున్నత అధికార పీఠం ఎక్కే అర్హత ఎవరికైనా రెండే సార్లు దక్కుతుంది.  రష్యా అధ్యక్షుడుగా పుతిన్‌ ఎంత సమర్థంగా పని చేసినప్పటికీ, పరిమిత కాలం తరువాత అధికారం నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఆయన సేవలను మరో రూపంలో వినియోగించుకోవటం అక్కడి రాజకీయ వ్యవస్థ గొప్పతనానికి నిదర్శనం.  మన దేశంలో ఉన్న పరిస్థితులు ఇందుకు భిన్నం. ఇక్కడ కొల్లల కొద్దీ పార్టీలు.. అన్నీ పుట్టగొడుగులు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఎప్పుడు ఏ పార్టీ కుర్చీకిందకు నీళు్ల తెస్తాయా అన్న ఆందోళనే ప్రధాని పీఠంపై కూర్చున్నాయనను పట్టి పీడిస్తుంది. చిన్న, చితక పార్టీల గొంతెమ్మ కోర్కెలను `సంకీర్ణ ధర్మాన్ని'  పాటించే పేరుతో తీర్చటంతోనే దొరవారి పుణ్యకాలం అంతా గడిచిపోతుంటే ప్రజల సమస్యలను పట్టించుకోవటం ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడ అధికారం అనుభవించటానికి  పరిమితి అంటూ ఉండదు. ముదిమి వయసు మీదపడుతున్నా.. మోకాలి చిప్పలు అరిగిపోయినా, కళు్ల కనిపించకున్నా, కాళు్ల సహకరించకున్నా పదవి మాత్రం భేషుగ్గా అనుభవించవచ్చు. హత్యానేరం లాంటి తీవ్రమైన నేరాభియోగాలు నమోదయి, క్రిమినల్‌ కేసు విచారణలను ఎదుర్కొంటున్న వాళు్ల కూడా `నేరం రుజువు కానంతవరకు దోషి కాదన్న' న్యాయ సూత్రాన్ని అనుసరించి ఎంపిలుగా ఎన్నికవుతారు. ఇలాంటి అస్తవ్యస్త రాజకీయ వ్యవస్థ నుంచి ఉగ్రవాదానికే కాదు.. మరే సమస్యకైనా పరిష్కారాన్ని ఎలా ఆశించగలం?
3
మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడి సమాజంలోని వర్గాలు అనేకం. వాటి మధ్య వ్యత్యాసం అనంతం. ఆర్థిక, హార్థిక వ్యత్యాసాలు ఇక్కడ ఉన్నన్ని మరెక్కడా కనిపించవు.  ఇందులో కొన్ని వర్గాల పట్ల పాలకవర్గాలు చూపించినఉదాసీనత తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నది. ఈ అసంతృప్తిని ప్రత్యర్థి దేశ ఉగ్రవాద మూకలు సొము్మ చేసుకుంటున్నాయి. అణగారిన వర్గాల ఆర్థిక బలహీనతలను టెరర్రిస్టు, మావోయిస్టు సంస్థలు సొము్మ చేసుకుంటున్నాయనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. టెరర్రిస్టు సంస్థలను నిర్వహించేవారు విద్యావంతులైన మేధావులైతే, టెరర్‌ సృష్టించేవారు మాత్రం ఈ బలహీనులే. కోట్ల కొద్దీ సొము్మలు ఆశచూపి రిక్రూట్‌ చేసుకుంటారు. ఆ తరువాత అర్థం లేని సిద్ధాంతాలను నూరిపోసి, రెచ్చగొట్టి, మైండ్‌సెట్‌ మార్చి ఫిదాయూలుగా మార్చి  ఉన్మాదానికి రక్తతర్పణం చేస్తున్నారు.  మసూద్‌ అజర్‌ లాంటి నాయకులు సురక్షితంగానే ఉంటారు. సమిధలవుతున్నది మాత్రం మానవ బాంబులుగా మారిన యువతే. అమాయకుల ప్రాణాలను బలిగొంటూ తాము బలవుతున్నారు. తాము చేస్తున్న పని తప్పు అన్న ఆలోచన కూడా వారికి రానీయకుండా చనిపోయేదాకా పోరాడాలంటూ వాళ్ల మెదళ్లను పురుగు తొలిచినట్లు తొలిచి మనపైకి అసా్తల్రుగా వదులుతున్నారు. ఈ అణగారిన వర్గాల ఆర్థిక అభివృద్ధి  కోసం కొంతైనా చిత్తశుద్ధిని పాలకులు ప్రదర్శిస్తే.. యువతను వక్రమార్గం నుంచి తప్పించవచ్చు. దాంతో పాటే ఈ మార్గంలో ఉగ్రవాదాన్ని విస్తరిస్తున్న సంస్థల కార్యకలాపాలను నిరోధించటానికి పకడ్బందీగా ఉండే చట్టం మనకు కావాలి. అంతే కానీ, ఉత్తుత్తి మాటల చట్టాలు ఎందుకూ కొరగావు.
4.
దాడులు జరిగిన ప్రతిసారీ మీడియాలో బీభత్సమైన దృశ్యాలను ప్రదర్శిస్తారు. మానవీయ కథనాలను ప్రసారం చేస్తారు. తొలి దర్యాప్తు ఏజెన్సీలుగా మీడియాయే వ్యవహరిస్తుంది. వీటన్నిటి కంటే ముందు మీడియాలో వినిపించే ముందుమాట నిఘా వైఫల్యం. మన దేశంలో ప్రత్యేకించి చట్టాలు లేకపోవటం, నిఘా వ్యవస్థ కేంద్రీకృతం కాకపోవటం పెద్ద సమస్య. నిఘా అన్నది కేంద్ర, రాషా్టల్ర మధ్య రెండుగా పనిచేస్తోంది. ఉగ్రవాద వ్యవస్థ ఆనుపానులు కనిపెట్టే సామర్థ్యం రాషా్టల్ర వద్ద లేదు. సూక్ష్మస్థాయిలో పెద్ద ఎత్తున జరిగే రిక్రూట్‌మెంట్‌ను కనిపెట్టడం బొటాబొటి శిక్షణ కలిగిన రాష్రా్టల్ర నిఘా సిబ్బంది వల్ల కాదు. ఇందుకు ఉదాహరణ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయానికి  వంద అడుగుల దూరంలో ఉన్న టాస్‌‌కఫోర్‌‌స కార్యాలయంపై 2006లో మానవబాంబు దాడి. ఏదో భావోద్వేగంతో మాట్లాడటం కాకుండా నిఘా వ్యవస్థను చక్కబెట్టడంపై పూర్తి దృష్టి సారించాలి.  ఏ దేశానికైనా నిఘా వ్యవస్థే భద్రతకు, శాంతికి పునాది. ఇది గట్టిగా లేనప్పుడు మరేమీ చేయలేం. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాషా్టల్రు నిరంతరంగా నిఘా ఉంచే విధంగా అన్ని అధికారాలను ఇస్తూ ఒక నిఘా సంస్థను నెలకొల్పటం, దానికి పూర్తి స్వతంత్రత కల్పించటం అవసరం. ఇందుకోసం ఒక చట్టం అవసరం. గుజరాత్‌ లాంటి రాషా్టల్రు ఏదైనా తీవ్రవాద నిరోధక చట్టాల్ని చేసుకుంటే, అది మోడీ లాంటి వాడు చేశాడు కాబట్టి గుడ్డిగా తొక్కిపెట్టటం సమర్థనీయం కాదు.. అది కాదనుకుంటే మరో మార్గం చూపించటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. మనం చేయం.. మరొకరిని చేయనివ్వం అనే ధోరణి భారీ మూల్యానికి దారి తీస్తుంది. జాతీయ స్థాయిలో పటిష్ఠమైన నిఘా వ్యవస్థ.. అందుకు తగిన చట్టం లోప రహితంగా ఉండటం తప్పనిసరి.  
5. 
టెరర్‌ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు అందుకు పాల్పడిన సంస్థలను గుర్తించటం గొప్పతనం కాదు. దాడులు చేసిన టెరర్రిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయటంతోనే విజయం సాధించినట్లు కాదు.. వారి మూలాలను కూకటి వేళ్లతో సహా పీకినప్పుడే అది నిజమైన విజయం అవుతుంది. 
సమర్థమైన చట్టాలు అంటూ ఉండాలనేది ఇందుకోసమే. టెరర్‌ ఆపరేషన్‌లో పాల్గొనే కిందిస్థాయి వారిపై చర్యలు తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవచ్చు. కానీ, వాళ్లను ప్రేరేపించిన వారి బాస్‌లను ఏరివేయటం కోసం చట్టాలు కావాలి. వారికి నిధులు  సమీకరించి ఇస్తున్న సంస్థలను తునుమాడటం కోసం చట్టాలు కావాలి. కూటనీతి రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదులను సమర్థిస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసి, వాటి నేతలపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు కావాలి. 
6.
1985లో టెరర్రిస్‌‌ట్స అండ్‌ డిస్రప్టివ్‌‌స ఆక్టివిటీస్‌ ఆక్‌‌ట (టాడా) చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి 1987లో సవరణ కూడా జరిగింది. ఈ చట్టాన్ని 1995లో అంటే ముంబయిలో తొలి సారి వరుస పేలుళు్ల జరిగిన రెండేళ్లకు రద్దు చేశారు.  ఆ తరువాత 2001లో ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెరర్రిజం ఆర్డినెన్‌‌స(పోటో)ను తీసుకువచ్చారు. దీన్నే 2002 మార్చిలో ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెరర్రిజం ఆక్‌‌ట(పోటా)గా పార్లమెంటు ఆమోదించింది. ఈ రెండు చట్టాలు కూడా  వివిధ అమలు దశల్లో మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించాయన్న ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఇందుకు సంబంధించి పుష్కలమైన ఆధారాలూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా ఈ చట్టాలు కాలరాచాయి. సంక్షిప్తంగా చెప్పుకుంటే ఈ చట్టాల ప్రకారం  ఒక వ్యక్తిని 180 రోజుల పాటు ఎలాంటి  నేరాభియోగాలు నమోదు చేయకుండా నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టాల్లో టెరర్రిజం అన్న పదం నిర్వచనంలో అన్ని నేరాలూ కలిసిపోయాయి. చాలా విస్తృత పరిధిలో దీన్ని నిర్వచించారు. సాధారణ పీనల్‌ కోడ్‌లోని హత్య, దొంగతనం వంటి నేరాలు కూడా ఇందులో మిళితమయ్యాయి. ఈ చట్టాల కింద రాషా్టల్రకు అపరిమిత అధికారాలు లభించాయి. ఇంకేముంది, రాజకీయ కక్ష సాధింపు కోసం పలు రాషా్టల్రు ఈ చట్టాల్ని దారుణంగా దుర్వినియోగం చేశాయి. తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర వంటివి వీటిలో కొన్ని.  ఒక్కో రాష్ట్రం ఒక్కో తీరులో ఈ చట్టాల్ని అడ్డగోలుగా వాడాయి కాబట్టే తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చివరకు రద్దు అయ్యాయి. 
మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్న పేరుతో చట్టాల్ని రద్దు చేస్తే సమస్య పరిష్కారమైందా? కాలేదు. పకడ్బందీగా, ఎలాంటి లొసుగులకు తావు లేకుండా చట్టాల్ని చేసే సామర్థ్యం ప్రభుత్వాలకు లేదా? అంటే అవుననే చెప్పాలి. దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా, పక్షపాతానికి తావు లేకుండా చట్టాన్ని రూపొందించటం తప్పదు. ఎప్పుడో 1935లో బ్రిటిష్‌వాడు చేసిన పాచి పట్టిన పోలీసు చట్టాన్నే ఇవాళ్టికీ మనం అనుసరిస్తున్నాం. వాడి చట్టాల్ని, వాడి సంస్కృతిని, వాడి నాగరికతను యథాతథంగా అనుకరించి, అనుసరించేటట్లయితే, స్వాతంత్య్రోద్యమం చేసిందెందుకో అర్థం కాదు. స్వతంత్రం రాకముందు ఎలా ఉందో.. వచ్చిన తరువాత కూడా అలాగే ఉంది. 
ముంబయిలో దాడుల తరువాత దేశ ప్రజలు తీవ్రస్థాయిలో  ప్రతిస్పందించటంతో ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. ఇంతకాలం వేచి చూద్దాం అన్న విధానం సమాజాన్ని భయం గుప్పిట్లోకి నెట్టి వేసింది. ఫెడరల్‌ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌ ఏర్పాటు అవుతున్నది. కానీ, దీనికి ఉండే పరిధి ఏమిటి? పరిమితి ఏమిటి? అధికారం ఏమిటి? బాధ్యత ఏమిటన్న విషయాలపై ప్రభుత్వం నిక్కచ్చిగా మార్గదర్శకాలు జారీ చేయటం అవసరం. 
* రూల్‌ ఆఫ్‌ లా పరిధిలోనే ఒక శక్తిమంతమైన   ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని  తీసుకురావాలి. 
* ఈ ఎఫ్‌బిఐ కూడా దీని పరిధిలోనే ఉండాలి. ఉగ్రవాద సంస్థలను, వాటికి నిధులు అందించే సంస్థలను క్రమంగా నిర్వీర్యం చేసే విధంగా  ఈ చట్టం రూపకల్పన జరగాలి. 
* టెరర్రిస్టు సంస్థల్లో కేడర్‌ నియామకాలను ఇది నిరోధించగలగాలి. 
* నిధుల సమీకరణను ఆపగలగాలి.
*  నాయకులు, సభ్యులు, సానుభూతి పరులపై నిరంతరం నిఘా ఉంచేందుకు ఈ చట్టం వీలు కల్పించాలి. 
* పక్షపాతం లేకుండా, మినహాయింపులు, రాయితీలు లేకుండా అన్ని వర్గాల, మతాల, జాతుల ప్రజల పట్ల ఒకే విధంగా వ్యవహరించేలా చట్టం ఉండాలి. అందరికీ సమన్యాయం అన్న సూత్రాన్ని అక్షరాలా పాటించాలి.
* విమానాశ్రయాలు, హోటళు్ల, షాపింగ్‌ మాల్‌లు, మార్కెట్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలి. ప్రైవేటు మాల్‌లకు భద్రత ఏర్పాట్లు నెలకొల్పుకునేలా ఈ చట్టం పరిధిలోనే ఆదేశాలు జారీ చేయాలి. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
* తమ తమ రాషా్టల్ల్రో  సంఘ విద్రోహ శక్తులను నిర్వీర్యం చేయటం స్థానిక ప్రభుత్వాల బాధ్యత. ఇలాంటి విషయాల్లో  అలసత్వానికి తావు లేకుండా ప్రభుత్వాలు వ్యవహరించాలి.
* సాధారణ క్రిమినల్‌ నేరాలకు, దేశద్రోహంతో సమానమైన టెరర్రిజంకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని విస్పష్టంగా నిర్వచించాలి. 
* సాక్షుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు కల్పించాలి.
* అన్నింటికంటే మించి ఈ చట్టం అమలు జాతీయ స్థాయిలో ఒకే విధంగా, ఒకే పద్ధతిలో అమలు కావాలి. 
* చట్టం అమలుపై జాతీయ స్థాయిలో పర్యవేక్షణ అవసరం. ఇది కేంద్రీకృతమై ఉండాలి. 
* ఈ చట్టం పరిధిలో ఏర్పాటు చేసే స్పెషల్‌ ఏజెన్సీలకు పూర్తి అధికారాలు, నిధుల కేటాయింపు సమృద్ధిగా ఉండాలి. 
ఇంత ఖచ్చితంగా చట్టాన్ని రూపొందించి అమలు చేస్తేనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం పడుతుంది. లేకపోతే.. ముంబయి తాజ్‌పై ఫిదాయూల దాడి అనంతరం అప్పటి ఉప ముఖ్యమంత్రి ఆర్‌.ఆర్‌ పాటిల్‌ అన్నట్లు `బడే బడే షహరోంమే.. ఐసా ఛోటీ ఛోటీ చీజెస్‌ హోతే రహతీహై' అనుకుంటూ ఉండాలి.