10, ఆగస్టు 2010, మంగళవారం

సాగిపోయిన సంపద్విమర్శ..

ప్రముఖ సాహితీ వేత, కవి, విమర్శకుడు ఆచార్య కోవెల సంపత్కుమారా చార్య గత గురువారం కన్నుమూశారు.. ఈ వార్త ఆలస్యంగా చెప్తున్నందుకు మన్నించాలి.. కర్మ, ఇతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల చెప్పలేకపోయాను.. నిన్నటి నుంచే రొటీన్‌ కార్యక్రమాల్లో పడ్డాను.. సంపత్కుమార వయస్సు ౭౭ సంవత్సరాలు.. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.. చిట్టిగూడూరు ప్రాచ్యకళాశాలలో, సంస్కృత ప్రాకృతాలను అధ్యయనం చేసి భాషాప్రవీణ సాధించిన సంపత్కుమార పలు కళాశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేశారు.. తరువాత కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు.. ౧౯౫౪లో తన అన్నగారి అబ్బాయి, సుప్రసన్నతో కలిసి హృద్గీత కావ్యాన్ని జంటకవులుగా ప్రచురించారు.. దీనికి కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ముందుమాట రాయటం విశేషం.. సుప్రసన్న శ్రీఅరవిందులు, వివేకానందులు, రామకృష్ణులు, రమణ మహర్షి వంటి తాత్త్వికుల కోవలో ముందుకు వెళ్తే.. సంపత్కుమార సంప్రదాయ ఉదార శ్రీవైష్ణవం ద్వారా ముందుకు వెళ్లారు.. అపర్ణ, ఆముక్త వంటి కావ్యాలు ఆయన రచనల్లో ప్రముఖమైనవి.౧౯౬౦లలో ఆంధ్ర సాహిత్య అకాడమీ చందస్సు మీద పోటీలు నిర్వహించింది. ఈ పోటీలకు మూడు గ్రంథాలు వచ్చాయి. అందులో సంపత్కుమార చందో వికాసం ఒకటి.. న్యాయ నిర్ణేతల్లో ఒకరైన అబ్బూరి రామకృష్ణారావుగారికి చందో వికాసం నచ్చినప్పటికీ, అప్పటికే ఈ రంగంలో అద్భుతమైన కృషి చేసిన, వయసులో పెద్దవారైన శ్రీ గిడుగు సీతాపతి గారికి బహుమతిని ఇచ్చారు. అయితే, సంపత్కుమార చందోవికాసాన్ని సాహిత్య అకాడమీ ఆర్థికసాయం చేసి అచ్చు వేయించింది. విశ్వనాథ సాన్నిహిత్యం వీరి సాహిత్యమార్గాన్ని విరిదారిగా మార్చింది.. ఆయన విమర్శ అపురూపం.. అన్ని ప్రక్రియలపైనా  సాధికారికంగా విమర్శించగలిగిన పండితుడు.. అలంకార శాస్త్రం, చందః శాస్త్రంపై సమకాలీనుల్లో  సంపత్కుమారది అగ్రస్థానం. గుప్తాఫౌండేషన్‌ అవార్డు, రాజీవ్‌ ప్రతిభా పురస్కారం, దాశరథి అవార్డు వంటివి ఎన్నెన్నో సంపత్కుమారను వరించాయి. విశ్వనాథ వారి అసంకలిత సాహిత్య రచనలను ఆరు సంపుటాలుగా వెలుగులోకి తీసుకురావటంలో సంపత్కుమార, సుప్రసన్నల కృషి ప్రధానమైంది.. వీరి ప్రయత్నం సాగకపోతే, అమూల్య సాహిత్య భాండాగారం వెలుగులోకి వచ్చేది కాదు..