23, అక్టోబర్ 2009, శుక్రవారం

కెసిఆర్‌ మళ్లీ గర్జిస్తున్నారు

కెసిఆర్‌ మళ్లీ గర్జిస్తున్నారు.. 2009 ఎన్నికల తరువాత కెసిఆర్‌ ఇక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించలేరన్న వాదనలకు జవాబు లభించింది. రాజకీయ రణరంగం మీదకు అన్ని అస్త్రశసా్తల్రతో ముందుకు దూకారు... ఎన్నికల ఫలితాల తరువాత అసలు బహిరంగ సభనే నిర్వహించనని అలిగిన కెసిఆర్‌.. ఉద్యోగుల బ్యానర్‌పై రంగప్రవేశం చేశారు...

కర్నూలు వరదల తరువాత కెసిఆర్‌ మాటల వరద రాష్ట్ర రాజకీయాల్ని నిండా ముంచేస్తోంది...2009 ఎన్నికల ఫలితాల తరువాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ వేసిన ఎత్తుగడలకు టిఆర్‌ఎస్‌ విలవిల్లాడింది... కెసిఆర్‌ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన్ను తప్పుకోవాలన్న డిమాండ్ల స్వరం హెచ్చింది. నాడు వైఎస్‌ ఇచ్చిన హామీతో కొందరు కాంగ్రెస్‌ పంచన చేరిపోయారు.. పార్టీని ఎలా నడిపిస్తారో తెలియని పరిస్థితి.. ప్రజల్లో నెలకొన్న గందరగోళం.. దీనికి తోడు ఇక తెలంగాణ ఉద్యమం సమసిపోయినట్లేనన్న వ్యాఖ్యానాలతో టిఆర్‌ఎస్‌ నాయకత్వం స్తబ్దుగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ అకస్మాత్తుగా, అనూహ్యంగా మరణించిన తరువాత టిఆర్‌ఎస్‌లో నెమ్మదిగా కదలిక మొదలైంది...

పార్టీ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలా అని మథన పడుతున్న కెసిఆర్‌కు కృష్ణమ్మ వరదలు బ్రహ్మాసా్తన్న్రే అందించాయి. శ్రీశైలం డ్యాంలో బ్యాక్‌ వాటర్‌ స్టోరేజీని పెంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లివ్వాలన్న సర్కారు నిర్ణయం వల్లనే కర్నూలు జిల్లా మునిగిపోయిందన్న వాదన కెసిఆర్‌కు మళ్లీ మాటలను ఇచ్చింది. పోతిరెడ్డిపాడును ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న టిఆర్‌ఎస్‌ వాదనలకు కర్నూలు వరదలు బలం చేకూర్చాయి. ఈ వివాదం సమసిపోకముందే సుప్రీం కోర్టు హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించటం కెసిఆర్‌కు తిరుగులేని బలాన్నిచ్చినట్లయింది. ఇంకేం.. ఆయన నేరుగా రంగంలోకి దూకారు.. తాను మారానన్నారు.. భాష మార్చారు.. నడత మార్చారు.. సంయమనంతో మాట్లాడుతున్నారు.. సహేతుకంగా, ఆధార సహితంగా తన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉండేలా తన వాదనలకు పదును పెట్టారు... ఎవరినీ నిందించటం లేదు.. అన్నింటికీ మించి ఒక్కసారిగా మీడియాఫ్రెండ్లీగా మారిపోయారు..

ఇప్పుడీ ఫ్రీజోన్‌ వివాదాన్ని సొము్మ చేసుకోవటం కోసమే సిద్దిపేట ఉద్యోగ గర్జనకు పూనుకున్నారు... మొదట్నుంచీ సిద్దిపేట టిఆర్‌ఎస్‌కు కలిసివచ్చిన ప్రాంతం.. అటు కరీంనగర్‌, ఇటు మెదక్‌ మరోపక్క వరంగల్‌.. వెరసి జనసమీకరణకు ఉత్తర తెలంగాణలో అనువైన ప్రాంతం. పైగా హైదరాబాద్‌ ఉన్న ఆరోజోన్‌లోనే మెదక్‌ కూడా ఉండటం ఇక్కడ మరో కీలకాంశం...

సిద్దిపేట సభ పార్టీ సభ కాదని ముందే కెసిఆర్‌ స్పష్టం చేశారు.. ఉద్యోగుల జెండాను పట్టుకునే మళ్లీ తన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.. టిఆర్‌ఎస్‌ స్థాపించిన నాటి నుంచీ ప్రత్యక్షంగా అంత దగ్గరగా లేని తెలంగాణ ఎన్‌జీవోలు ఇప్పుడు ప్రత్యక్షంగా సిద్దిపేటలో టిఆర్‌ఎస్‌ జత కట్టారు.. ఎన్నికల తరువాత పార్టీకి దూరమైన ఉద్యోగులు, మేధావులను మళ్లీ దగ్గర చేసుకోవాలన్న కెసిఆర్‌ ప్రయత్నం ఈ సభ ద్వారా ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి....

ఉద్యోగుల ప్రధాన సమస్యను తలకెత్తుకున్న కెసిఆర్‌ ఎత్తుగడ సవ్యంగానే వేశారు... కానీ అదే సమయంలో పట్టుమని తొమ్మిది మందైనా ఎమ్మెల్యేలు లేకుండా, పార్టీకి దూరమైన విజయశాంతి సహకారం లేకుండా, తానొక్కడే ఎంపిగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలు పెడతామంటూ మళ్లీ పాత పోకడలు పోవటం కేసిఆర్‌ను ట్రాక్‌ తప్పేట్లు చేస్తోంది. అర్థం లేని రాజకీయ వ్యాఖ్యానాలు, డెడ్‌లైన్లు, డెత్‌ వారంట్ల జోలికి వెళ్లకుండా మారిన మాటతీరుతో, నడతతో వూ్యహాత్మకంగా ముందుకు నడిస్తేనే కెసిఆర్‌ ఉద్యమ లక్ష్యానికి చేరువ అయ్యే అవకాశం ఉంటుంది...

22, అక్టోబర్ 2009, గురువారం

పూర్వవైభవం దిశగా కాంగ్రెస్‌..

పవార్‌ పాలిటిక్‌‌స... కాంగ్రెస్‌ విజయ ప్రస్థానం... రాజ్‌థాక్రే కేవల్‌ మరాఠా వాదం, నీరుగారిపోయిన బిజెపి, చప్పబడ్డ శివసైనికులు అన్నీ కలగలిస్తే.. మహారాష్టల్రో హస్తం హ్యాట్రిక్‌ గెలుపు.... ముంబయిపై ఉగ్రవాదుల దాడి కాంగ్రెస్‌ అధికార పీఠాన్ని ఎంతమాత్రం కదిలించలేకపోయింది. ముంబయి మహానగరంలో శివసేనకు ఉన్న కొద్దిపాటి బలాన్ని రాజ్‌థాక్రే తన్నుకుపోయారు.. ప్రతిపక్షాల ఓట్లను చీల్చటంలో కాంగ్రెస్‌ మంత్రాంగం ఫలించింది...

పదేళ్ల తరువాతైనా అధికారంలోకి వస్తామనుకున్న శివసేనబిజెపి కూటమికి మరోసారి భంగపాటు తప్పలేదు.. ప్రతిపక్షాల్లో నెలకొన్న అనైక్యత, ప్రభుత్వంపై అధికార వ్యతిరేకతను కమ్మేసింది. విపక్షాల ఓట్లు నిలువునా చీలిపోయాయి. మరాఠా లోకల్‌ నినాదంతో వివాదాస్పద రాజకీయాలు నడిపిన రాజ్‌థాక్రే.. బిజెపిశివసేన విజయావకాశాలను నిలువునా ముంచేశారు... శివసేన బలంగా ఉందనుకున్న ముంబయిలో పలు నియోజక వర్గాల్లో రాజ్‌థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన తన ప్రభావాన్ని చూపించగలిగింది. పూణె, నాగ్‌పూర్‌, లాతూర్‌, విదర్భ వంటి చాలా ప్రాంతాల్లో ఎంఎన్‌ఎస్‌ ఎన్‌డిఏ ఓట్లను చీల్చేసింది. రాజ్‌థాక్రే కారణంగా శివసేనబిజెపి 15 సీట్లను నష్టపోయింది. ఆ సీట్లన్నీ ఎంఎన్‌ఎస్‌ ఖాతాలో పడిపోయాయి.
మూడేళ్ల క్రితం ఉద్ధవ్‌ థాక్రేతో వివాదం కారణంగా బయటకు వచ్చిన రాజ్‌థాక్రే, సొంత పార్టీ పెట్టుకున్నారు... అప్పటి నుంచీ కూడా ఆయన మరాఠా స్థానిక వాదాన్ని తలకెత్తుకున్నారు.. ఆయన అనుచరులు మహారాష్టల్రో మరాఠేతరులపైన దాడులు కూడా చేశారు.. దేశమంతా ఆయన్ను ఎంత విమర్శించినా, చివరకు ఆ వాదమే ఆయన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడింది.. పదిహేను సీట్లతో చెప్పుకోతగ్గ స్థాయికి చేర్చింది.
అటు బిజెపి పూర్తిగా డీలా పడిందనే చెప్పాలి.. జాతీయ స్థాయిలోనే అటు పార్టీలో అంతర్గతంగా, రాజకీయాల్లో బహిర్గతంగా చెప్పరానన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్న బిజెపి ప్రస్తుత ఫలితాలను విశ్లేషిస్తే సమీపభవిష్యత్తులో మళ్లీ బలం పుంజుకునే అవకాశం కనిపించటం లేదు. ఒక్కో రాష్ట్రం ఆ పార్టీ చేజారిపోతూ వస్తోంది. ఏళ్లతరబడి అధికారం లేకపోతే రాజకీయంగా కేడర్‌ను కాపాడుకోవటం ఎంతకష్టమో తెలియంది కాదు.. ప్రమోద్‌ మహాజన్‌ వంటి నాయకులు లేకపోవటం, ఒక్క గోపీనాథ్‌ ముండేపైనే పూర్తిగా భారం మోపడం బిజెపికి మైనస్‌ అయింది...
ఇక శివసేనలో మునుపటి ఊపు లేనే లేదు.. మొదట్నుంచీ ఆ పార్టీకి సైనికుల్లా పనిచేసిన ఛగన్‌ భుజబల్‌, నారాయణ్‌రాణె, సంజయ్‌ నిరుపమ్‌ లాంటి వారందరినీ కొడుకును అందలం ఎక్కించటం కోసం బాల్‌థాక్రే దూరం చేసుకున్నారు.. ఫలితం ఎన్నికల్లో మరోసారి శృంగభంగం....
అయితే కాంగ్రెస్‌ఎన్‌సిపికి కూడా కంఫర్టబుల్‌ మెజారిటీ రాలేదు.. ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కనీస స్థాయిలో రాసలసిన సీట్ల సంఖ్యతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే, ముంబయిపై టెరర్రిస్టుల దాడి కాంగ్రెస్‌ విజయావకాశాలపై పెద్దగా ప్రభావం చూపించలేదు.. . అటు విదర్భ ప్రాంతంలో కరవు, కునారిల్లిన వ్యవసాయం, ఇటు పూణె వంటి చోట్ల విజృంభించిన సై్వన్‌ఫ్లూ వంటి వ్యాధులు ఎన్నికల్లో అంశాలుగా మారినా, అధికార కూటమి విజయాన్ని నిలువరించలేకపోయాయి. ఈ అంశాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో విపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయనటంలో సందేహం లేదు.. ఎందుకంటే క్రితం ఎన్నికల్లో 140 సీట్లు వచ్చిన అధికార కూటమి ఈసారి సింపుల్‌ మెజారిటీ ఫిగర్‌ను తాకగలిగింది. విపక్షాల ఓట్లలో చీలికే వారికి పూర్తిగా లాభించింది.
మరోవైపు కాంగ్రెస్‌ఎన్‌సిపి కూటమిలో కాంగ్రెస్‌ బలం క్రమంగా పెరుగుతోందని ఈ ఎన్నికలు స్పష్టంగా రుజువు చేశాయి. మహారాష్టల్రో ఇంతకాలం చక్రం తిప్పుతూ వస్తున్న శరద్‌పవార్‌ బలం తగ్గుతూ వస్తోంది. రాషా్టన్రికి సంబంధించినంతవరకు పవార్‌ కంటే కాంగ్రెస్‌కే ప్రజలు ఆదరణ చూపిస్తున్నారు.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సీట్లు గెల్చుకుంటే ఎన్‌సిపికి దక్కించుకున్నది కేవలం ఎనిమిదే... ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ బలం ఇంతకు ముందున్న 69స్థానాల నుంచి పదిహేను సీట్లకు మించే ఎక్కువ పెంచుకోగలిగింది. అటు ఎన్‌సిపి ఖాతాలో కోత పడింది... మొత్తం మీద మొన్నటి లోక్‌సభ ఎన్నికలు... ఇప్పటి మహారాష్ట్ర ఎన్నికలు కాంగ్రెస్‌ను పూర్వవైభవం దిశగా తీసుకువెళు్తన్న సంకేతాల్ని స్పష్టంగానే చూపిస్తున్నాయి...

20, అక్టోబర్ 2009, మంగళవారం

వైఎస్‌ అంతిమ పోరాటం


సెప్టెంబర్‌ రెండున జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తుదకంటా మృత్యువును తప్పించుకోవటానికి ప్రయత్నం చేశారా? ప్రమాదం నుంచి బయట పడేందుకు హెలికాప్టర్‌నుంచి దూకేందుకు యత్నించారా? తోటి అధికారులు ఆయన్ను కిందకు దింపేందుకు కృషి చేశారా? హెలికాప్టర్‌ రూటర్‌ ఫ్యాన్‌ బ్లేడ్‌లు తగిలిన కారణంగానే వైఎస్‌ చనిపోయినట్లు పోస్‌‌టమార్టమ్‌ నివేదికలో తేలింది... అంతిమ క్షణంలో ఆయన కిందకు దిగటానికో లేక దూకేందుకో ప్రయత్నం చేసినట్లు ఈ రిపోర్‌‌ట స్పష్టం చేస్తోంది....

అప్పుడే నెల పదిహేను రోజులు దాటిపోయింది, రాష్ట్రంలో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన వైఎస్‌ మనకు దూరమైపోయి..... సెప్టెంబర్‌ రెండు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో వైఎస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. జన నేత అర్ధాంతరంగా మృత్యువాత పడ్డారు.. ప్రమాదం అనూహ్యంగా జరిగిందా? లేక మానవ తప్పిదమా? దీనిపై ఇప్పటికే తర్జన భర్జనలు జరుగుతున్నాయి...

ఈ వాద వివాదాలు.. నిర్ధారణల మాటెలా ఉన్నా.... ఘటన జరిగిన తీరు... వైఎస్‌ మృతదేహం పడిఉన్న తీరు... పోస్‌‌టమార్టమ్‌ నివేదికలు అన్నీ కూడా వైఎస్‌ చివరి క్షణం వరకూ పోరాడి ఓడిపోయినట్లు స్పష్టం చేస్తున్నాయి... బాహ్య ప్రపంచానికి బయట పెట్టని పోస్‌‌ట మార్టమ్‌ నివేదికలో ఈ సమాచారం పొందుపరిచినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.

వైఎస్‌ మృతిపై కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ, సిఐడి విభాగాలు వైఎస్‌ మృతిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. ఈ అంచనాల ప్రకారం... ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఎటిసితో సంబంధాలు తెగిపోయిన తరువాత చాపర్‌ దారితప్పింది... సిరిమాను కొండను దాటి పావురాల గుట్టకు చేరుకుంది. ఎదురుగా దట్టమైన మేఘాలు... పైలెట్లు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి....

ఈ అయోమయంలోనే పైలెట్లు హెలికాప్టర్‌ను పైకి లేపే ప్రయత్నం చేశారు... దీంతో చాపర్‌ తోక భాగంలో ఉన్న రూటర్‌ కొండకు తగిలి వేలాడుతోంది. కానీ, దాని కనెక్టివిటీ కట్‌ కాలేదు.. ఆ కారణంగా రూటర్‌ ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది. కాకపోతే ఈ టెయిల్‌ రూటర్‌ గతి తప్పింది.. ఫలితం హెలికాప్టర్‌ పైకి ఎంతమాత్రం లేవలేని పరిస్థితి.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సహా హెలికాప్టర్‌లో ఉన్న వాళ్లందరికీ పరిస్థితి అర్థమయింది. చాపర్‌ కూలిపోవటం ఖాయమని తేలిపోయింది. ప్రాణాలు దక్కించుకునేందుకు వైఎస్‌ బృందం చివరి ప్రయత్నం చేసింది. బహుశా వైఎస్‌తో పాటు ఉన్న ఇద్దరు అధికారులు ముందుగా ఆయన్ను కిందకు దింపే ప్రయత్నం చేశారు... సైడ్‌ డోర్‌ ద్వారా సిఎంను కిందకు దింపే యత్నం చేస్తుండగా తీవ్రంగా ఉన్న గాలి ఒత్తిడికిఇ వేగంగా ఊగుతున్న టెయిల్‌ రూటర్‌ ఫ్యాన్‌ బ్లేడ్లు మృత్యురూపంలో ఆయనకు తగిలాయి... ఈ బ్లేడ్ల తాకిడికి వైఎస్‌ కాలు పూర్తిగా తెగిపోయింది... వెనువెంటనే మరో బ్లేడు ఆయన ఉదరభాగాన్ని చీల్చివేసింది... అంతే వైఎస్‌... నేలపై బోర్లా పడిపోయారు...ఆ మరుక్షణమే హెలికాప్టర్‌ పక్కనే ఉన్న కొండను ఢీకొని పేలిపోయింది.

హెలికాప్టర్‌ పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం చిమ్మి వైఎస్‌ వీపున పడినప్పటికీ అప్పటికే ఆయన చనిపోయారు. ఈ ఘటనలో చనిపోయిన మిగతా వారి మృతదేహాలు బాగా కాలిపోయినా, వైఎస్‌ భౌతిక కాయం మాత్రం ముక్కలు ముక్కలుగా తెగిపోయింది. హెలికాప్టర్‌ కూలిపోకముందే వైఎస్‌ మరణించినట్లు పోస్‌‌టమార్టమ్‌ నివేదిక ధృవీకరించింది...

16, అక్టోబర్ 2009, శుక్రవారం

వెలుగు మొలక చివురించిన వేళ


కంప్యూటర్లు, కాంక్రీటు గోడల మధ్య జీవితాలను వెళ్లదీసే ఈ తరం సమాజానికి పండుగలు ఊరటనిచ్చే ఉపకరణాలు. పండుగలు ఆధ్యాత్మిక ప్రవృత్తికి అవసరమా? లేక పరలోక సుఖప్రదమా? వంటి అంశాలు ఇప్పుడు అనవసరమైనవి.

ఆధ్యాత్మిక భావాలు కలిగిన వాళు్ల పూజలు చేసుకుంటారు. లేని వాళు్ల కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మొత్తం మీద మన పండుగలన్నీ కూడా నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న భారాన్ని తగ్గించి ఉల్లాసాన్ని కలిగించడానికి తోడ్పడుతున్నాయి. ఒకే ఇంట్లో ఉంటూ ఉన్నా, ఏడాది కాలంలో ఎన్నడూ మనసు విప్పి మాట్లాడుకోవడానికైనా తీరిక దొరకని భార్యాభర్తలు, అన్నదము్మలకు పండుగ రోజుల్లోనే సంబరాలు. ఇందుకు అన్ని మతాలూ ఒకటే. అన్ని మతాల్లోనూ పండుగలు ఉన్నాయి. ఒక్కో సందర్భాన్ని పురస్కరించుకుని, ఒక్కో ఉద్దేశాన్ని లక్షించుకుని ఒక్కో పండుగను ఏర్పరుచుకున్నాం. అయితే హిందువులలో ఉన్నన్ని పండుగలు మరే మతంలో ఉండవనడం అత్యుక్తి కాదు. లోకానికి, మన దేశానికి మేలు చేసిన మహాపురుషుల జన్మదినోత్సవాల సందర్భంగా జరుపుకునే పండుగలు శ్రీరామనవమి, జన్మాష్టమి వంటివైతే, ఋతుసంబంధమైన ఉత్సవాలు ఉగాది, సంక్రాంతి, హోళి, రథసప్తమి వంటివి. శైవ, వైష్ణవ సంబంధమైన పండుగలు శివరాత్రి, వినాయక చతుర్థి, ముక్కోటి ఏకాదశి వంటివి మరికొన్ని.
వీటన్నింటి కంటే ప్రధానమైన పండుగలు దసరా, దీపావళి. ఏ పండుగను జరుపుకోవడానికైనా కొన్ని ప్రధానమైన కారణాలు చెప్పుకుంటాం. ఆదిశక్తి మహిషాసురుని సంహరించిన రోజు, రాముడు రావణున్ని హతమార్చిన రోజు, ఉత్తరగోగ్రహణాన అర్జునుడు కౌరవసేనను దునుమాడిన రోజును విజయదశమిగా జరుపుకుంటే, దీపావళి ప్రత్యేకం వేరు. ఇది దీపాల పండుగ. చీకట్ల చీల్చుకుని వెలుగును ప్రసరించే దివ్యమైన పర్వదినం. నరకుని నుంచి ప్రపంచానికి సత్యభామాకృష్ణులు విముక్తి కలిగించిన శుభవేళగా ఈ పండుగను జరుపుకుంటాం. మిగతా పండుగల కంటే దీపావళి విశిష్ఠత వేరు. ఇందుకు మరికొన్ని కారణాలున్నాయి. సత్యభామా సహాయుడై శ్రీకృష్ణుడు నరకాసురుని హతమార్చడం ఒకటైతే, బలి చక్రవర్తి వామనుని చేత పాతాళానికి అణగదొక్కిన రోజు కూడా ఇదే కావడం విశేషం. ఇదే రోజు విక్రమార్క చక్రవర్తి పట్టాభిషక్తుడయ్యాడు. దీపావళి జరుపుకోవడానికి ఇంకా కొన్ని కారణాలున్నాయి కానీ, వాటికున్న ప్రాధాన్యం తక్కువ. దక్షిణ భారత దేశంలో విక్రమార్కుని శకం పెద్దగా ప్రచారంలో లేదు. తొలి తెలుగు రాజు శాలివాహనుడు విక్రమార్కుని ఓడించాడు. కాబట్టి ఆయన పేరుతోనే దక్షిణాపథమున శకసంవత్సరాల కాల గణన జరుగుతోంది. క్రీస్తుకు పూర్వం 55 సంవత్సరాల క్రిందట ఉజ్జయిని రాజధానిగా విక్రమార్కుడు భారత ఖండాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు. బలి చక్రవర్తిని దేవుడు వామనరూపుడై మూడడుగుల నేలను యాచించినప్పుడు ఆయన సర్వలోకాన్ని ధారపోశాడు. ఆర్యులకు దేవుడంటే సూర్యుడని అర్థం. అందుకు కృతజ్ఞతగా ఈ రోజున బలి పూజను నిర్వహిస్తారు.
లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ వైదిక నిలయం అన్న గ్రంథంలో మరో అంశాన్ని చెప్పారు. పదివేల సంవత్సరాలకు పూర్వం ఆర్యులు ఉత్తరధృవ ప్రాంతంలో నివసించారు. ఆ మండలంలో ఆరునెలలు పగలుగానూ, మరో ఆరు నెలలు చీకటిగాను ఉంటుంది. దీనినే మనవారు దేవతలకు ఒక దినంగా పేర్కొన్నారు. ఈ ఉత్తరధృవమే మేరుపర్వతం. మేరు పర్వతం వద్ద దేవతలకు మేష సంక్రమణం నాటి సూర్యోదయం ఒక్కటే సూర్యోదయం. ఆ దినం మొదలుకొని అర్ధావృతము వరకు, అంటే ఆరు నెలల వరకు వాళు్ల సూర్యుని చూస్తూనే ఉంటారు. తులాసంక్రమణం వచ్చేంత వరకూ సూర్యుడు ఆకాశంలో వెలుగుతూనే ఉంటాడు. తులాసంక్రమణంతో అస్తమయం అవుతుంది. మళ్లీ మేష సంక్రమణం వచ్చేంతవరకు చీకటి ఆవరిస్తుంది. వీటినే ఉత్తరాయణ, దక్షిణాయనాలని అన్నారు. తులా సంక్రమణం రోజున ఆర్యులకు దీర్ఘరాత్రి ప్రారంభం అవుతుంది కదా! ఆ చీకటి ప్రవేశించిన రోజునే దీపోత్సవం చేసి `బలి' అన్న శత్రువును అణగద్రొక్కి, అచ్చటనే తాను బహుకాలం ఉండాల్సి ఉండకుండా త్వరగా సూర్యుడు మళ్లీ అగుపడాలని ప్రార్థిస్తూ దీపావళి జరుపుకుంటారన్నది మరో కథనం.
నరకుడిపై స్త్రీ బాణమును ప్రయోగించింది కాబట్టి, ఆ స్ఫూర్తితోనే బాణాసంచా కాలుస్తున్నాం. అంతే కానీ ఈ పండుగ నాడు పటాకులు కాల్చాలని ఏ గ్రంథంలోనూ చెప్పలేదు. దీపావళి పండుగ మార్వాడీలకు చాలా ముఖ్యమైంది. ఈ రోజున వాళు్ల జమాఖర్చుల పుస్తకాలన్నింటినీ పరిష్కరించి కొత్త పుస్తకాలను ప్రారంభిస్తారు. వారికి ఈ పండుగ సంవత్సరాది. దీపావళి నుంచి కార్తీకమాసాంతము దాకా మన దేశంలో దీపోత్సవాలను నిర్వహిస్తారు. కథలెన్ని చెప్పుకున్నా, అన్నింటి వెనుకా ఉన్న ప్రధాన సూత్రం ఒక్కటే. కష్టకాలం పోయి, జీవితంలో మళ్లీ వెలుగులు నిండాలన్నదే దీపావళి ప్రధానోద్దేశం. తమసోమా జ్యోతిర్గమయ!

10, అక్టోబర్ 2009, శనివారం

నోబెల్సా గోబెల్సా

ప్రపంచంలో నోబెల్‌ శాంతి బహుమతికి ఉండే గౌరవం అసాధారణమైంది. ప్రపంచ శాంతి కోసం నిరంతరం శ్రమించిన వారికి చంద్రునికో నూలుపోగులా అందించే పురస్కారంగా భావిస్తారు.. కానీ, ఈసారి నోబెల్‌ శాంతి బహుమతి సంబరాలకు కాదు.. సంశయాలకు నాంది పలకింది.. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు శాంతి బహుమతి ప్రకటించటం నోబెల్‌ ప్రతిష్ఠనే ప్రశ్నిస్తోంది.

నోబెల్‌ ప్రైజ్‌... ఈ బహుమతికి ప్రపంచంలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ ఏ ముహూర్తంలో ఈ అవార్డులను ఇవ్వాలని సంకల్పించాడో కానీ, ఈ అవార్డు ప్రపంచ అవార్డుగా మారిపోయింది. అన్ని దేశాలూ, వ్యక్తులు, వ్యవస్థలు ఈ అవార్డు కోసం పరితపిస్తాయి... ఒక వ్యక్తికి అవార్డు వస్తే తమ దేశానికే గౌరవం లభించినంత సంబరపడతారు. అందులోనూ నోబెల్‌ శాంతి బహుమతికి అన్ని దేశాల్లో అపారమైన ప్రతిష్ఠ ఉంది. ప్రపంచ శాంతి కోసం పని చేసిన వారికి మాత్రమే ఈ అవార్డు ఇస్తారు.. నోబెల్‌ ఆశయం కూడా అదే...
వివిధ దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు, సైనిక ప్రమేయాన్ని తగ్గించేందుకు లేదా నిర్మూలించేందుకు శాంతియుత సమైక్య భావనను పెంపొందించేందుకు అవిశ్రాంతమైన కృషి చేసిన వారికి శాంతి బహుమతి ఇవ్వాలి.
శాంతి బహుమతి ఎలాంటి వారికివ్వాలో ఆల్‌ఫ్రడ్‌ నోబెల్‌ తన వీలునామాలో స్పష్టంగా చెప్పిన మాటలివి... మరి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నోబెల్‌ పేర్కొన వాటిలో దేనికి అర్హుడని నోబెల్‌ కమిటీ భావించిందో అర్థం కాదు.. అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతున్నందుకు, అంతర్జాతీయ దౌత్యాన్ని పరిపుష్టం చేస్తున్నందుకు శాంతి బహుమతి ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించటం నోబెల్‌ స్ఫూర్తికే విరుద్ధం... శాంతి పురస్కార లక్ష్యం ఒకటి... కమిటీ తీసుకున్న నిర్ణయం ఒకటి... శాంతి బహుమతి పొందటానికి ఇప్పటి వరకు ఒబామా ఎంతమాత్రం అర్హుడు కాడు.. మున్ముందు ఆయనేం చేస్తారనేది ఇప్పటికైతే ఊహాజనితమే...
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు వరకు బరాక్‌ హుస్సేన్‌ ఒబామా ఎవరన్నది ప్రపంచానికి పెద్దగా తెలియదు.. ఒక రాష్టంలో సెనెటర్‌ అని మాత్రం అమెరికా రాజకీయాల గురించి తెలిసిన కొద్ది మంది మాత్రం ఆయన పేరు విన్నారు... హోరాహోరీగా పోరాటం చేసి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టి ఒబామా పట్టుమని తొమ్మిది నెలలైనా పూర్తి కానే లేదు. ఈ తొమ్మిది నెలల కాలంలో ఆయన చేసిన ఘనకార్యాలేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు.. అది చేస్తా.. ఇది చేస్తా... అంటూ హామీల వర్షం కురిపించినంత మాత్రాన్నే నోబెల్‌ శాంతి బహుమతి పొందడానికి ప్రపంచంలో కోతల రాయుళు్ల కుప్పలు తెప్పలుగా దొరుకుతారు..
ఒబామా అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ప్రసంగంలోనే ఇరాక్‌లో అమెరికా సైనిక కార్యకలాపాలను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ముగిస్తామన్నారు... సైనికులను ఉపసంహరిస్తామన్నారు... గ్వాంటనామో బే డిటెన్షన్‌ క్యాంపును మూసేస్తామన్నారు... అణు పరీక్ష నిషేధ ఒప్పందాన్ని అమెరికా సెనేట్‌ చేత ఆమోదిస్తానన్నారు... అమెరికా ఆర్థిక సాయాన్ని అణు ఆయుధాల పెంపుకోసం పాకిస్తాన్‌ ఉపయోగిస్తోందంటూనే, మరిన్ని ఆయుధాలు, సొము్మలు అందిస్తున్న ఒబామా అణు నిరాయుధీకరణకు తోడ్పడతారంటే ఎవరైనా ముక్కున వేలేసుకోరా? అధ్యక్షుడు ఎవరైనా కావచ్చు.. అమెరికా మూల విధానాన్ని మార్చే ధైర్యం సాహసం చేయగలరా? ఆయుధాల అమ్మకాలను ఆపగలరా?
కనీసం అంతర్జాతీయ శాంతి కోసం ఈ నల్లకలువ దొరగారు ఏమైనా పాటుపడ్డారా అంటే అదీ లేదు.. ఇరాన్‌ అణు కార్యక్రమాలపై చర్చ మొదలైంది కానీ, ఇజ్రాయిల్‌తో సయోధ్య సాధ్యమయ్యే పరిస్థితి లేదు.. పాలస్తీనా విమోచనానికీ ఒబామా ఒక్క అడుగు కదిపింది లేదు.. ఇక ఆఫ్గనిస్తాన్‌లో ఎన్నికలు జరిపించటం మాత్రం ఆయన ఘనత అంటున్నారు.. కానీ, అక్కడ మరిన్ని సైన్యాలను మోహరించాలన్న డిమాండ్‌ను ఆయన పరిశీలిస్తున్నారు.. అంటే యుద్ధం మరింత తీవ్రం చేయటమే కదా? ఇదేనా ప్రపంచ శాంతి? దీనికేనా పురస్కారం? గతంలో ఈ పురస్కారం స్వీకరించిన వాళు్ల సైతం ఒబామాకు ప్రకటించటాన్ని విని విస్తుపోయారు.. తీవ్ర నిర్బంధాలకు లోనైనా పీడితుల కోసం పోరాడిన తియానన్మెన్‌స్కే్వర్‌ బాధితుల దగ్గరి నుంచి మహామహులు ఎంతోమంది నామినేషన్లు పరిశీలనకు వచ్చినా... రాత్రికి రాత్రి ఒబామా పేరు పైకి రావటం వెనుక రాజకీయం అర్థం కాదు.. నిజానికి ఒబామా కంటే పాలస్తీనా శాంతి కోసం ఎంతో కొంత కృషి చేసిన మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కు ఈ అవార్డు ప్రకటించినా అభ్యంతరాలు వచ్చి ఉండేవి కావేమో... తాము ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి ప్రాతిపదికన అవార్డు ప్రకటించినా ప్రపంచం దాన్ని ఆమోదించి తీరాలన్న అభిప్రాయంతో నోబెల్‌ కమిటీ ఉంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు..

9, అక్టోబర్ 2009, శుక్రవారం

ఇక గరీబోళ్ల గోడు వినిపించేదెవరు?


తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడి ఉండటం అన్నది సాధారణంగా అరుదు... ముఖ్యంగా మన సమకాలంలో... అలాంటి వ్యక్తులు ఉండటం అన్నది దాదాపు అసాధ్యం... తమ ఉనికిని నిలబెట్టుకోవటానికి ఎప్పటికప్పుడు ప్రస్తుతమన్నట్లుగా మనసును మార్చుకునే వాళు్లన్న కాలం ఇది. ప్రతికూల పరిస్థితుల్లోనూ తాను నమ్మిన భావాల కోసం చివరి శ్వాస వరకూ గొంతు వినిపించిన, కనిపించిన ఒకే ఒక్కరు బాలగోపాల్‌. అసమాన మేధావి అర్ధాంతరంగా అందరినీ విడిచి వెళ్లిపోయారు.. ఇక గరీబోళ్ల గోడు వినిపించేదెవరు?

పేదల హక్కుల సేనాని వెళ్లిపోయారు...మనిషి జీవించే హక్కును పరిరక్షించేందుకు పరితపించిన గుండె ఆగిపోయింది. పేద ప్రజలకు న్యాయం చేసే న్యాయ వాది ఇక లేరు... గరీబోళు్ల పిలిస్తే పలికే గొంతు ఇక వినిపించదు... తెలుగు నేల తనకున్న ఏకైక మార్కి్సస్టు మహా మేధావిని కోల్పోయింది. బడుగుజీవుల ఆపన్న హస్తం బాలగోపాల్‌ ఇక లేరన్న వార్తను దిగమింగుకోలేకపోతోంది.... కరవుసీమ అనంతపురంలో జన్మించి, ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లులో మేధోమధనం చేసిన శక్తికి పేరు బాలగోపాల్‌... ఆయన నిజంగా బాల గోపాలుడే... చిన్ని కృష్ణుడు పురిట్లోంచే మృత్యువుతో పోరాడాల్సి వచ్చింది. జైల్లో పుట్టిన క్షణం నుంచే రాజ్యవ్యవస్థకు ప్రతిరూపమైన కంసుడితో సుదీర్ఘ పోరాటమే చేశాడు కృష్ణుడు... కృష్ణుణ్ణి మనం చూడలేదు కానీ, బాలగోపాల్‌ నాటి కృష్ణుడికి అచ్చమైన ప్రతీక... తెలుగు సాహిత్యలోకంలో గొప్ప విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మనవడిగా జన్మించిన బాలగోపాల్‌ వ్యక్తిత్వ వికాసానికి ఓరుగల్లు కేంద్రమైంది.
మేథమెటిక్‌‌స విద్యార్థిగా రీజనల్‌ ఇంజనీరిగ్‌ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే బాలగోపాల్‌ ఉద్యమాల వైపు అడుగులు వేయటం ప్రారంభించారు.. రాష్ట్రంలో పీపుల్‌‌సవార్‌ ఉద్యమం అప్పుడప్పుడే ప్రారంభమైన కాలం... దానికి కేంద్రంగా మారిన వరంగల్లు... ఒకరి వెంట ఒకరుగా విద్యార్థులు ఆకర్షితులు కావటం.. సైద్ధాంతికంగా బాలగోపాల్‌ ను మార్కి్సస్టు ఉద్యమానికి దన్నుగా నిలిచేలా చేసింది. అదే పంథాలో ఎదిగాడు... కాకతీయ యూనివర్సిటీలో కొంతకాలం ప్రొఫెసర్‌గా పనిచేసిన బాలగోపాల్‌ అదే మార్గంలో ముందుకు వెళ్తే ఇవాళ్టికి నోబెల్‌ లారెట్‌ అయ్యేవారని ఆయన్ను బాగా ఎరిగిన వారు చెప్తారు.. మేథమెటిక్‌‌స కంటే సులభమైంది మరేదీ లేదని బాలగోపాల్‌ చాలా సార్లు అన్నారంటేనే ఆయను ఎంతటి మేథావో అర్థం చేసుకోవచ్చు.
కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు బాలగోపాల్‌, విప్లవకవి వరవరరావు లాంటి ఇతర విద్యావంతులతో కలిసి పౌరహక్కుల సంఘంలో కార్యకర్తగా కీలక పాత్ర పోషించారు.. అక్కడి నుంచి ఆయన ఉద్యమ ప్రస్థానం మొదలైంది. పేద ప్రజలకు న్యాయం చేయటం కోసం... వారి హక్కులను కాపాడటం కోసం 30 ఏళ్ల పాటు నిరంతరం కృషి చేశారు.. శ్రమించారు.. పీడితులను అక్కున చేర్చుకుని సేద తీర్చారు...
మార్కి్సస్టు మేధావుల్లో బాలగోపాల్‌ది ఒక ప్రత్యేకమైన పంథా... మిగతా మార్కి్సస్టులకు ఆయనకూ మధ్య తేడా ఎంతో ఉంది. తాను జీవించి ఉన్నంత వరకు ఏది నమ్మితే దాన్ని చిత్తశుద్ధితో ఆచరించాడు.. అనుసరించాడు.. నమ్మనిదాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.. రాజ్యహింసను నిరసించినట్లే, ప్రైవేటు హింసనూ నిందించాడు.. మనిషి ఎవరైనా అతని హక్కును కాలరాసే అధికారం మరో మనిషికి లేదని గట్టిగా నమ్మాడు.. వాదించాడు.. గెలిచాడు.. మనీషిగా ఎదిగాడు...
నక్సలైటు ఉద్యమానికి బయటి నుంచి చాలాకాలం పాటు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి బాలగోపాల్‌... ఒకటా.. రెండా... రాష్ట్రంలో జరిగిన వేలాది ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేశాడాయన... బూటకపు ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులందరిపైనా హత్యకేసు నమోదు చేయాలని ఆయన చేసిన పోరాటం విజయం సాధించింది. పీడిత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జరిగిన ఏ పోరాటమూ బాలగోపాల్‌ ప్రమేయం లేకుండా జరగలేదు.. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శ్రమించాడు.. పౌర హక్కుల ఉద్యమంలో ఎన్ని నిర్బంధాలు ఎదురైనా... హత్యాయత్నాలు జరిగినా, కోబ్రాలు కిడ్నాప్‌ చేసినా.. ఆయన వెరవ లేదు.. వెనుకడుగు వేయలేదు... దేశంలో, రాష్ట్రంలో మానవ హక్కుల పట్ల జరుగుతున్న అరాచకాలను తీవ్రంగా నిరసించాడు..
కోర్టు మెట్లంటే తెలియని పేద ప్రజలకు న్యాయం చేసేందుకు విశ్రాంతి ఎరుగకుండా శ్రమించిన వాడు బాలగోపాల్‌... ఆయన ఒక ఉద్యమానికి పరిమితం కాలేదు.. ఒక వర్గాన్ని మాత్రమే సమర్థించలేదు.. ఆయన భావాలు పీడిత ప్రజానీకపు హక్కులకు అనుగుణంగా ఎదుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర పౌరహక్కుల సంఘానికి దూరమయ్యారు... రాజ్యహింసను వ్యతిరేకించినట్లే... ప్రైవేటు హింస కూడా సరికాదన్న అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు..
ఏపిసిఎల్‌సికి దూరమైన తరువాత మానవహక్కుల సంఘాన్ని ఏర్పాటు చేశారు.. దాని తరపున అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.. పోరాటాలు చేశారు..ఒక్క మాటలో చెప్పాలంటే మానవ హక్కులంటే బాలగోపాల్‌... బాలగోపాల్‌ అంటే మానవ హక్కులు అన్న స్థాయికి ఆయన చేరుకున్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సైతం ఆయన ప్రశ్నించారు. ఇందుకోసం గద్వాల వేదికగా ఆయన నడిపించిన ఉద్యమం చరిత్రాత్మకమైంది...
నక్సలైట్ల బాటలో బాలగోపాల్‌ భారత రాజ్యాంగాన్ని నిరసించలేదు. రాజ్యాంగ స్ఫూర్తితోనే పౌర హక్కులను పునారచించటంలో కీలక పాత్ర పోషించారు.. హక్కుల పరిరక్షణకు ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేశారు.. ఇవాళ మానవ హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం రావటం వెనుక బాలగోపాల్‌ పాత్రను మరవటం సాధ్యం కానిపని. ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్న పీడిత వర్గాలకు బాలగోపాల్‌ పెద్ద దిక్కు. గత మూడు దశాబ్దాల్లో రాష్ట్రంలో, దేశంలో చోటు చేసుకున్న ప్రతి సంక్షోభ సందర్భంలోనూ క్రియాశీలంగా స్పందించిన వ్యక్తి బాలగోపాల్‌...
చదివింది గణిత శాస్త్రం అయినా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో విశేష ప్రతిభ కనపరచిన మేధ బాలగోపాల్‌ది... సామాజిక పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ పేదల హక్కుల కోసం నిజాయితీతో, నిబద్ధతతో సైద్ధాంతికంగా అరమరికలు లేకుండా నిలబడిన బాలగోపాల్‌ వంటి వారు లేని లోటు తీర్చటం దుర్లభం... ప్రజల గోడును తన గొడవగా కవిత్వంలో తీవ్ర స్వరంతో వినిపించిన వాడు కాళోజీ... ప్రజల గొంతును తన గళంగా మార్చుకుని వ్యవస్థను నిలదీసిన వాడు బాలగోపాల్‌...

8, అక్టోబర్ 2009, గురువారం

ఆపదలో ఆపన్న హస్తం - జై జవాన్

ఉక్కునరాలు.. ఇనుప కండరాలు.. కఠోరమైన సంకల్పం కలిగిన పది మంది యువకులు నా వెంట వస్తే... భారత దేశం రూపు రేఖలనే మార్చేస్తానన్నాడట స్వామి వివేకానంద...ఇవాళ మన సైన్యానికి ఆ యువశక్తే ఊపిరి...... అదే కఠిన సంకల్పం ఆర్మీకి తిరుగులేని బలం..... సరిహద్దుల్లో శత్రు మూకల నుంచి దేశాన్ని రక్షించటంతో పాటు... అంతర్గతంగా ఆపదలు కము్మకున్నప్పుడు ఆ జవానులే ఆపన్న హస్తం అందిస్తున్నారు... అన్ని విధాలా ఆదుకుంటున్నారు... కర్నూలు జిల్లాను అతలాకుతలం చేసిన వరదల్లో చిక్కుకుపోయిన అభాగ్యుల పాలిట వైమానిక దళ జవానులే దేవుళ్లె నిలిచారు...

దేశ ప్రజల రక్షణ వారి ప్రాథమిక బాధ్యత... ఆపద ఏ రూపంలో వచ్చినా మేమున్నామంటూ క్షణాల్లో వచ్చి చేయూతనందివ్వటం వారికన్నా ముందుండేవారు లేరు... వాతావరణం అనుకూలించినా, అనుకూలించకపోయినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ప్రమాదాలకు వెరవక... జడివానకు జడవక వరదల్లో చిక్కుకున్న ఆర్తులను ఆదుకోవటంలో భారత వైమానిక దళ జవానుల పాత్ర కీలకంగా మారింది... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమనే ఒకే ఒక సంకల్పంతో వారు ముందుకు కదిలారు.. సోదరభారతీయుల ప్రాణాలను కాపాడుకున్నారు...

ఈ నెల రెండో తేదీ కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చీకటి రోజు.. కన్నీరు మిగిల్చిన రోజు... కష్ణ, తుంగభద్ర, హంద్రీ, కుందు నదుల ఉగ్ర వరదలకు వందలాది గ్రామాలు జలసమాధి అయ్యాయి. కొద్ది గంటల వ్యవధిలోనే రహదారులు ఏరులుగా మారాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది... కరెంటు లేదు.. కము్యనికేషన్‌ లేదు.. లక్షల మంది ప్రజలు నీళ్లలో మొకాళ్లకు పైగా లోతులో చిక్కుకుపోయారు.. ఏం చేయాలో.. ఎలా బయట పడాలో.. తెలియక బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి.. ఆదుకొమ్మన్న అర్తనాదాలను వినేవారే లేరు.. ఊరు ఊరంతా నీట మునిగితే బయటి నుంచి వచ్చే వారు లేక.. లోపలి నుంచి కాపాడే వారు లేక కర్నూలు కల్లోలమైంది.
ప్రజలను కాపాడటానికి మిగిలింది ఒకే ఒక్క మార్గం ఆకాశం... ఆ సమయంలో రంగంలోకి దిగింది భారత వైమానిక దళం.. హెలికాప్టర్లు దిగేందుకు సరైన వాతావరణం లేదు..నేలంతా నీటితో నిండిపోయింది. హెలీపాడ్‌లు ఏర్పాటు చేసే అవకాశమూ లేదు.. 35 మంది సభ్యులున్న వైమానిక దళం ఏడు హెలికాప్టర్లలో బయలు దేరారు.. మహబూబ్‌ నగర్‌, కర్నూలు జిల్లాల పరిధిలో నీటిలో చిక్కుకుపోయిన దాదాపు 42 మందిని సురక్షితంగా కాపాడారు..
రెండు జిల్లాలను వరదలు ముంచెత్తిన రెండో తేది నుంచి విరామం లేకుండా వైమానిక దళ జవానులు విధులు నిర్వర్తిస్తున్నారు.. రాత్రి లేదు.. పగలు లేదు.. విరామం లేదు.. విసుగు లేదు.. సమన్వయంతో...సహదయతతో తోటి ప్రజలను కాపాడటంలో వైమానిక దళ సభ్యులు తమ సేవలందించారు.. తిండి లేక అవస్థలు పడుతున్న ప్రజలకు ఆహారం అందించారు.. మందులు అందించారు.. మంచినీటిని అందించారు..
తమ తోటి పౌరులకు సహాయం అందించటంలో సైనికులు అనుభవిస్తున్న తప్తి వాళ్లలో అలసటను మరిపిస్తున్నది... జనం కోసం జనమేజయంగా సేవలందిస్తున్న జవానులను ప్రశంసించేందుకు మాటలేముంటాయి.. జై జవాన్‌ అని నినదించటం తప్ప....

యాదవ్ - హిట్ వికెట్


మొత్తానికి రాష్ట్ర పోలీసు బాసుపై వేటు పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ అధికారంలో ఉన్నంత వరకు ఒక వెలుగు వెలిగిన ఎస్‌ఎస్‌పి యాదవ్‌పై సర్కారు ఇంతకాలానికి వేటు వేయగలిగింది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వివాదాల పుట్టగా యాదవ్‌కు వచ్చిన పేరు బహుశా రాష్ట్రంలో మరే డిజిపి మూట గట్టుకోలేదేమో... అటు ప్రజల్లో మంచి పేరు లేక.. పోలీసు శాఖలో మంచిపేరు తెచ్చుకోలేక కేవలం రాజకీయ పలుకుబడితో అందలం ఎక్కిన అధికారిగా యాదవ్‌ అన్నది బహిరంగ రహస్యం... ఒక్కమాటలో చెప్పాలంటే... బ్యూరోక్రసీ, రాజకీయానికి మధ్య అక్రమ సంబందానికి అచ్చమైన ప్రతీక డిజిపి ఎస్‌ఎస్‌పి యాదవ్‌...

రాష్ట్ర పోలీసు శాఖ నుంచి నియంత తప్పుకున్నారు... లేదు.. తప్పించారు.. డిజిపి ఎస్‌ఎస్‌పి యాదవ్‌ను నియంత్రించటం ఇంతకాలం సర్కారుకు ఒక విడిపోని సమస్య... ఎందుకంటే యాదవ్‌ ఎవరికీ కొరుకుడు పడని అధికారి.. ఎవరినీ లెక్క చేయని మొండి వ్యక్తి... రాష్ట్ర పోలీసు శాఖకు ఇంతవరకు డిజిపిగా పనిచేసిన అధికారులందరిలోనూ ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి...మంత్రులు, అధికారులు, మీడియా.. ఎవరూ ఆయన కంటికి ఆనింది లేదు... కనీసం రాష్ట్ర హోం మంత్రికి కూడా ఆయన ఇచ్చిన ప్రాధాన్యం తక్కువే... అధికారంలోకి వచ్చింది మొదలు ఎన్ని కామెంట్లు... ఎన్ని వివాదాలు.. ఎవరితోనూ సఖ్యంగా ఉన్నది లేదు.. సరిగా వ్యవహరించింది లేదు.. ఇతర విభాగాలతో సమన్వయం లేదు.. తన విభాగంలో ఎవరినీ లెక్క చేసింది లేదు.. వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం ఆయన నైజం... వేధించటం ఆయన సరదా...
2007 అక్టోబర్‌లో స్వరణ్‌జిత్‌ సేన్‌ పదవీవిరమణ అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఏరికోరి యాదవ్‌ను డిజిపిగా నియమించుకున్నారు... తనపట్ల విధేయంగా ఉన్నవాళ్లను ఎంతటి అందలమైనా వైఎస్‌ ఎక్కిస్తారనటానికి యాదవ్‌ నియామకం ఉదాహరణ. 1972 బ్యాచ్‌కు చెందిన యాదవ్‌ డిజిపి దండాన్ని పట్టుకున్న వెంటనే, పోలీసు క్వార్టర్లలోకి వెళ్లి సిబ్బంది బాగోగులను పరిశీలించటం, జైళ్లకు వెళ్లి ఖైదీల స్థితిగతులను సమీక్షించటం చూస్తే.. ఆయన పోలీసు శాఖలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని అంతా అనుకున్నారు... కానీ, అవన్నీ ఒట్టివే అని తేలటానికి ఎంతోకాలం పట్టలేదు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఆయన అసలు స్వరూపం బయటపడింది. హోం మంత్రికి సైతం తెలియకుండా నియామకాలు జరిపించటం, ఇష్టారాజ్యంగా బదిలీలు చేయటం వివాదాస్పదమయ్యాయి. 2009 ఎన్నికలకు ముందు వైఎస్‌ను కీర్తిస్తూ యాదవ్‌ చేసిన కామెంట్లు... ఆయన వ్యవహారాన్ని బయటపెట్టాయి. వైఎస్‌ అధికారంలో ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపించేది... ఎన్నికల ముందు సిఎంను పొగడటాన్ని ఎన్నికల కమిషన్‌ తప్పుపట్టి ఆయన్ను బదిలీ చేసింది. కానీ.. రెండు మాసాల్లోనే తన అధికారాన్ని తాను దక్కించుకున్నారు... ఎన్నికల ఫలితాలు వెల్లడై... వైఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఇడుపుల పాయకు వెళ్లినప్పుడు యాదవ్‌ అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యారు... ఆ తరువాత రెండు రోజులకే తిరిగి ఆయన కుర్చీ ఆయనకు దక్కింది.
ఇక అక్కడి నుంచి ఆయన తన విశ్వరూపం ప్రదర్శించటం ప్రారంభించారు.. తనను తప్పించిన సమయంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల పట్ల నిరాదరణ చూపించటం మొదలు పెట్టారు..అంతే కాదు.. తన అధికారం పోవటానికి కారణమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐవి సుబ్బారావుతో హోరాహోరీగానే పోరాడారు.. తనను తప్పించటానికి కారణాలు ఏమిటో చెప్పాలని, కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో తనపై చేసిన ఫిర్యాదులేమిటో తనకు చెప్పి తీరాలంటూ సుబ్బారావు గారికి ఉత్తరాలపై ఉత్తరాలు రాశారు.. ఈ వ్యవహారం అంత తేలిగ్గా సమసిపోలేదు... ఐఏఎస్‌ఐపిఎస్‌ల మధ్య పోరాటంగా మారిపోయింది. చివరకు యాదవ్‌ బాస్‌ వైఎస్‌ స్వయంగా జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సివచ్చింది.
హోం మంత్రిగా మొట్టమొదటిసారి ఒక మహిళకు బాధ్యతలు అప్పగిస్తే.. ఆమెను ఏనాడూ గౌరవించింది లేదు,... చివరకు వైఎస్‌ మరణించిన తరువాత అంత్యక్రియల సందర్భంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిన యాదవ్‌, తాను మాత్రం హెలికాప్టర్లో వెళ్లి, హోం మంత్రి సహా, మంత్రులు, ప్రతిపక్ష నేతల భద్రతను ట్రాఫిక్‌కు వదిలేశారు. దాదాపు ఎనిమిది గంటల పాటు విఐపిలు వేంపల్లెఇడుపుల పాయ రహదారిపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే.. అది తన వైఫల్యం కాదన్నట్లుగా వ్యవహరించటం యాదవ్‌కే చెల్లింది. ఇదేమని మీడియా వాళ్లడిగితే, ప్రభుత్వమే తనను సంజాయిషీ అడగనప్పుడు మీరెవరు నన్నడగడానికి అని ఎదురు ప్రశ్నించారు...

విచిత్రమేమంటే... దివంగత సిఎం హెలికాప్టర్‌ ప్రమాదంపైనా పొంతన లేని వ్యాఖ్యలు చేశారు... అమెరికాలోని డబ్లు్యటిసి టవర్లపై టెరర్రిస్టుల దాడితో సిఎం చాపర్‌ క్రాష్‌ను పోల్చటం మరింత గందరగోళం సష్టించింది... తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఎదురుపడ్డ విలేఖరులపైనా మైకులు మూయించి నానా దుర్భాషలాడటం డిజిపి స్థాయి వ్యక్తికి తగని పని.. చివరకు హోం మంత్రి సైతం యాదవ్‌ను తప్పించాల్సిందేనని స్పష్టం చేయాల్సి వచ్చింది. పర్యవసానం డిజిపైపై వేటు.... ఇప్పుడు ఆయన్ను ఆర్టీసీ ఎండి పదవిలో కూర్చోబెట్టారు.. ఇక అక్కడ ఎన్ని వ్యవహారాలు చక్కబెడతారో... ఎన్ని వివాదాలు సష్టిస్తారో చూడాలి....

7, అక్టోబర్ 2009, బుధవారం

కర్నూలు రైస్‌ కనుమరుగవుతుందా?

కష్ణమ్మ తన తీర ప్రాంతంలో మిగిల్చి పోయిన కడగండ్లు ఇప్పుడప్పుడే తీరేవి కావు... కానీ ఈ విపత్తు ప్రభావం పరోక్షంగా రాష్టమ్రంతటా కనిపించబోతోంది. రాష్ట్రంలో అత్యంత క్రేజ్‌ ఉన్న కర్నూల్‌ రైస్‌ వచ్చే సీజన్‌లో మార్కెట్లో కనిపించబోవటం లేదా? వరద సష్టించిన బీభత్సం దాదాపుగా అవుననే చెప్తోంది...

వరదలు మనకు కొత్త కావు.. తుపానులూ మనకు తెలియనివి కావు.. చిన్న చిన్న వాటి నుంచి భారీ విపత్తులను సైతం మనం ఎదుర్కొన్నాం.. ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్నీ అనుభవించాం.. కానీ, దాదాపు వందేళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో కష్ణమ్మలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది.. ఈ వరదలకు తక్షణం ప్రభావితం అయిన ప్రాంతాల బాధ తీవ్రమైతే.... పరోక్షంగా ఇబ్బంది పడబోయే మిగతా ప్రాంతాల పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజల్లో అత్యంత క్రేజ్‌ ఉన్న కర్నూల్‌ రైస్‌ వచ్చే సీజన్‌లో మార్కెట్‌లో కనపడుతుందా? అన్న అనుమానం కలుగుతోంది. కష్ణానది వరద కెసి కెనాల్‌ పరిధిలోని వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా నాశనమైంది... హాట్‌ హాట్‌ డిమాండ్‌ ఉన్న కర్నూలు రైస్‌ ప్రధానంగా పండే ప్రాంతం ఇది కావటంతో ఈసారి ఈ ఫేవరేట్‌ రైస్‌ కొరతను ఎదుర్కోవలసి వస్తోంది..
కర్నూలు, నెల్లూరు, వరంగల్‌ జిల్లాలు నాణ్యమైన సోనా మసూరీ బియ్యానికి ప్రసిద్ధి... నాణ్యత, రుచి పరంగా ఈ ప్రాంతాల బియ్యానికి భలే డిమాండ్‌ ఉంటుంది. అందులోనూ కర్నూలు రైస్‌ ప్రత్యేకత వేరు... రాజధాని హైదరాబాద్‌లో అయితే కర్నూలు రైస్‌ ఓ బ్రాండ్‌ నేమ్‌.. ధర ఎంతైనా సరే... హైదరాబాదీల ఫస్‌‌ట ప్రయారిటీ కర్నూలు రైసే... వేరే ప్రాంతాల నుంచి వచ్చిన బియ్యానికి కూడా కర్నూలు రైస్‌ పేరు తగిలించి దొంగతనంగా వ్యాపారులు అము్మకుంటారంటే దానికున్న క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కష్ణమ్మ వరద అటు పండించిన రైతులు, తినే ప్రజల నోళ్లల్లో మట్టి కొట్టింది. ఈ సీజన్‌లో దాదాపు మార్కెట్లో కర్నూలు రైస్‌ 60శాతం తగ్గిపోనుంది.. పర్యవసానంగా పెరిగే ధరల సంగతి తలచుకుంటే ఇప్పటి నుంచే వినియోగదారుల్లో గుబులు పట్టుకుంది..
వాస్తవానికి బియ్యం కొరత అన్న భయం భవిష్యత్తుది.. ప్రస్తుతానికి బియ్యం నిల్వలు తగినంత ఉన్నాయి. అయినా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వ్యాపారులు భావిస్తున్నట్టున్నారు.. క్వింటాలుకు 200 రూపాయలు పెంచేందుకు సిద్ధమయ్యారు...
వరద తాకిడికి పొలాలపై ఇసుక మేట వేసింది. బురద పేరుకుపోయింది. ఎక్కడలేని చెత్తాచెదారమూ వచ్చి చేరింది. మరుభూమిగా మారిన వేలాది ఎకరాలు మళ్లీ పంటపొలాలుగా మారటానికి శ్రమించాల్సింది చాలానే ఉంది. వరద నీరు సులభంగా వెళ్లిపోయే పంట క్షేత్రాల్లో మాత్రం మళ్లీ పంట వేసుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు... రిజర్వాయర్లలో నీళు్ల పుష్కలంగా ఉండటంతో పరిస్థితి త్వరగా మెరుగుపడే అవకాశం ఉంటుందంటున్నారు వ్యవసాయ నిపుణులు.
మొత్తానికి రాబోయే బియ్యం కొరతకు తోడు, ప్రస్తుతం పెరిగే ధరలు రాజధాని వాసుల పాలిటి శాపంగా మారాయి. ప్రభుత్వం ముందే మేల్కొని వ్యాపారులను, దళారులను నియంత్రించకపోతే పరిస్థితి అదుపు తప్పటం ఖాయం...

కేంద్ర సాయం గుట్టుమట్లు

ఒక్కుదుటున పెల్లుబికి పెను విధ్వంసం సష్టించిన కష్ణమ్మ శాంతిస్తోంది. ఇక రాజకీయ నాయకుల పర్యటనలు.. పరామర్శలు ప్రారంభమయ్యాయి...అన్ని విధాలా ఆదుకుంటామని జాతీయ నాయకులు, పాలకులు మాటల మూటలు విప్పేశారు.. కానీ, వాళ్లిచ్చే సాయం మనకందేదెప్పుడు? అది ఎంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది? వేల కోట్ల నష్టంతో రాజులు తరాజులైన వరద విపత్తుకు యుపిఏ సర్కారు తక్షణం ప్రకటించిన నిధులు బాధితుల కన్నీరును ఏమేరకు తుడుస్తాయి?

ఆంధ్రప్రదేశ్‌కు కనీవినీ ఎరుగని విపత్తు సంభవించింది.. ఆపన్నులను అన్ని విధాలా ఆదుకుంటాం... కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ అన్న మాటలివి... ఇది తీవ్రమైన ఆపద... బాధితులను ఆదుకోవటంలో రాష్ట్ర సర్కారుకు అన్ని విధాలా అండగా ఉంటాం... యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఇచ్చిన హామీ ఇది... నిన్నటి వరకు వరద ముంపుతో అల్లాడిపోయిన కష్ణా బాధితులు... ఇప్పుడు పరామర్శల వరద మొదలైంది. వరద తెరిపిగొనటంతో ఒకరి తరువాత ఒకరుగా రాష్ట్ర జాతీయ నాయకులు వరద ప్రాంతాలను సందర్శిస్తున్నారు.. ఆపన్నులను అక్కున చేర్చుకుని మేమున్నామంటూ స్వాంతన వాక్యాలు పలుకుతున్నారు.. బాధితులకు ఈ స్వాంతన అవసరమే.. ఈ మాటసాయమూ అవసరమే.. కానీ, సమస్తం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఈ ప్రజలకు ఈ కాస్త స్వాంతన సరిపోతుందా? ఆర్థికంగా ఆదుకునేదెవరు? వందేళ్లలో కనీవినీ ఎరుగని వైపరీత్యం సంభవించినప్పుడు తక్షణం అందించాల్సిన సహాయం కేవలం 418 కోట్లంట... ఈ 418 కోట్లలోనూ రాష్ట్రం 115 కోట్లను భరించాల్సిందేనట... వినడానికే విడ్డూరంగా ఉంది...

రాషా్టన్రికి తుపానులు, వరదలు కొత్తేం కావు... ప్రతి ఏటా కాకున్నా ప్రకతి విపత్తులను రాష్ట్రం తరచూ ఎదుర్కొంటున్నదే... కానీ, ప్రతిసారీ కేంద్రం చూపించేది సవతి తల్లి ప్రేమే... శ్రీశైలం జలశాయాన్ని ముంచెత్తేంతగా వచ్చిన వరద ఉధతి మహా విషాదాన్ని మిగిల్చింది... ఈ ఆపదను జాతీయవిపత్తుగా ప్రకటించాలని రాష్ట్రం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కానీ, ఘనత వహించిన ఢిల్లీ సర్కారు మాత్రం ఇంకా మీన మేషాలు లెక్కిస్తూనే ఉంది. గొప్ప ఆపద అంటూనే.. జాతీయ విపత్తు మాట ఊసే లేకుండా మొయిలీ నుంచి మన్మోహన్‌ వరకు ఆచితూచి మాట్లాడుతున్నారు... అదే నిరుడు బీహార్‌ను వరదలు ముంచెత్తినప్పుడు ఎవరూ కోరకముందే అది జాతీయ విపత్తు అని సాక్షాత్తూ ప్రధాని స్వయంగా ప్రకటించేసి... వెయ్యి కోట్ల ఆర్థిక ప్యాకేజీని వెంటనే ప్రకటించేశారు... బెంగాల్‌ ఐలా తుపాను కానీ, లాతూరు భూకంపం కానీ జాతీయ విపత్తులుగా గుర్తించినవే.. 1970ల నాటి దివిసీమ తుపానును సైతం జాతీయ విపత్తుగా గుర్తించారు.. కానీ, ఇప్పుడు మాత్రం ఇంకా సంకోచంలోనే ఉంది.

రాష్ట్రాల ఆర్థిక వనరులపైనే పూర్తిగా ఆధారపడే కేంద్రాన్ని అవే రాషా్టల్రు ఆపద వచ్చినప్పుడు దేబిరించాల్సిన ఆగత్యం పడుతోంది... ఎంతగా వేడుకున్నా కేంద్రం ఆర్థిక సాయం అందేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతుంది... కేంద్రం ఇప్పుడు ప్రకటించిన ఆర్థిక సాయం 418 కోట్లు... అందులోనూ రాష్ట్ర వాటా తీసేస్తే...వాస్తవ సాయం 303 కోట్లే... అసలు సాయం అందటానికి పెద్ద తంతే జరగాల్సి ఉంది... రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన నష్టం 12, 225 కోట్ల రూపాయలు.. వరద తీవ్రత పూర్తిగా తగ్గిన తరువాత కానీ అసలు నష్టం తేలదు... రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఢిల్లీకి పంపించాలి... ఢిల్లీ పెద్దలు ఆ నివేదికను పరిశీలించి.. తమ నిపుణుల బందాన్ని వీలును బట్టి రాషా్టన్రికి పంపిస్తారు.. వారికి మన సర్కారు వారు అన్ని సేవలు చేసి, బాధిత ప్రాంతాల్లో తిప్పి క్షేమంగా ఢిల్లీకి పంపిస్తారు.. వారు తీరి కూర్చుని ఓ నివేదిక తయారు చేసి హస్తినలో సింగ్‌ దొరవారికి సమర్పిస్తారు.. వారు తమ మంత్రివర్గ సహచరులతో సమావేశమై లెక్కలేసుకుని సాయాన్ని ప్రకటిస్తారు.. ఇదంతా జరిగేసరికి ఇక్కడి బాధితులు తమ బాధను పూర్తిగా మరచిపోయి, సాధారణ జనజీవనాన్ని గడుపుతున్నా ఆశ్చర్యపోనవసరం లేదు..
ప్రకతి విపత్తుల కారణంగా దేశంలో ఏటా 75 లక్షల హెక్టార్లలో 3కోట్ల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు...దాదాపు లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతోంది... వీటిని నివారించేందుకు 21వేల కోట్ల రూపాయలతో జాతీయ విపత్తు సహాయ నిది ఉన్నా... ఉపయోగం సున్నా... జరిగే నష్టం కొండంత... సాయం ఆవగింజంత.. అదీ ఆపద సంభవించిన ఎన్నో రోజుల తరువాత కానీ, అందని స్థితి... అందులోనూ కేంద్రం విధించే రకరకాల తిరకాసులు... రాషా్టన్రికి వచ్చే ఏడాది ఇవ్వాల్సిన కేటాయింపుల్లోంచి కొంత అడ్వాన్సుగానో... జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి కేంద్ర పథకాల ద్వారా అందించే నిధులను అడ్వాన్సుగానో ఇవ్వటం మినహా కేంద్రం నేరుగా గ్రాంటుగా ఇచ్చే మొత్తం చాలా తక్కువ... మరి ఢిల్లీలో సర్కారు ఉన్నదెందుకు? ఎవరిని పాలించేందుకు? ఎవరికి మేలు చేసేందుకు..? ఆపద వచ్చినప్పుడే సరిగ్గా స్పందించని పాలకులు, మామూలు సమయాల్లో ఎన్ని ముచ్చట్లు చెప్తే మాత్రం ఏం ప్రయోజనం?