శ్రీ తాడేపల్లి లలితా సృబ్రహ్మణ్యం గారు...
నమస్కారం..
మీరు తాజాగా చేసిన వ్యాఖ్య మరోసారి ఆలోచించేదిగా ఉంది. ధన్యవాదములు.. తెలంగాణా కోసం జరుగుతున్న చర్చలో మీరు మేధావి.. నిజమే.. మీ లాంటి వారు ఈ చర్చాకార్యక్రమంలో పాల్గొనటం చాలా అవసరమే.. తెలంగాణా రాకపోవటం ఎందుకు మంచిదో మీరు ముందు నుంచీ వివరిస్తున్నారు.. వీళ్లకే అర్థం కావటం లేదు.. మీరు ప్రస్తావించిన అంశాలనే నేనూ చర్చించదలచుకున్నాను.. అంశాల ప్రాతిపదికన ఒక్కొక్కటే మాట్లాడుకుందాం..వీలైతే.. టైమ్ ఉంటే.. అంశాల వారిగా విడివిడిగా..డొంకతిరుగుడు లేకుండా సూటిగా చర్చించండి..
తెలంగాణా గురించి కాసింత మంచి మాట్లాడే వారందరికీ తలపొగరని మీరు భావిస్తున్నారు.. సంతోషం.. ఇక్కడ మేధావి తనానికి అవకాశం లేదనీ మీరన్నారు. కానీ, మీరు మాట్లాడుతుంటే తెలంగాణా వాదులనుకునే మేతావులంతా వింటున్నారు.. తెలంగాణా భావోద్వేగాలను పనికిమాలినవిగా కొట్టిపారేశారు ధన్యవాదములు.. తెలంగాణా గురించి మాట్లాడే వాళ్లంతా మెదడు లేకుండా.. మాట్లాడుతున్నారనీ ఎద్దేవా చేశారు.. సంతోషం.. మేధావితనం అంటే ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా తాము మాట్లాడేది మాత్రమే సరైనది.. ఇదే కరెక్టని.. దీన్నే ఎదుటివాళ్లు ఇష్టం ఉన్నా..లేకున్నా అంగీకరించాలని భావించటమో.. ఏమో.. చిన్నవాణ్ణి నాకైతే తెలియదు.. నేను మేధావిని కాను.. మీరు చెప్తే తెలుసుకుంటా..
తెలంగాణా రాష్ట్రం ఎందుకు రాకూడదో.. మీరు తొలి కామెంటులో కొన్ని కారణాలు చెప్పారు.. వాటిని గురించి ప్రస్తావించాలి.. తెలంగాణాలో బాగుపడాలంటే ఇక్కడ పని సంస్కృతి మెరుగుపడాలని మీరే చెప్పారు.. మీకు అవగాహన ఎంత వరకు ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఇక్కడ ఏసి రూముల్లో కూర్చుని.. ఏసి కార్లలో తిరిగే అలవాటు కానీ, స్థోమత కానీ ఎవరికీ తెలియదు.. ఇక్కడ పని చేస్తేనే గుక్కెడు నీళ్లు.. పిడికెడు కూడు దొరుకుతుంది. (కూడు అన్నది అచ్చమైన తెలుగు పదం.. అన్నం అన్నది సంస్కృతం..) పని చేయటం మాత్రమే ఇక్కడి వాళ్లకు తెలిసిన ఒకే ఒక విద్య.. గొడ్డు చాకిరీ చేయటం తప్ప.. దాష్టీకం చేయటం ఇక్కడి వాళ్లకు తెలియదు.. శాతవాహనుల కాలం నుంచి వాళ్లు చేస్తున్నది పనే.. వాళ్లు పని చేయటం వల్లనే ఇక్కడి నుంచి అద్భుతమైన నిర్మాణాలు వెలుగుచూశాయి. దాదాపు 280 కోటలు.. బురుజులు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత నిజాం కాలంలోనూ వాళ్లే పని చేశారు.. ఇప్పుడు దురదృష్టవశాత్తూ తోటి తెలుగువాళ్లమని చెప్పుకునే వారి కాలంలోనూ వాళ్లే పని చేస్తున్నారు.. గతంలో సర్దార్ పాపారాయుడు అని ఎన్టీరామారావుగారు ఒక సినిమా తీశారు 1984లో.. అందులో ఓ కేరెక్టర్ చెప్తుంది.. ‘‘ మా వంటవాడు భారతీయుడు.. మా తోట వాడు భారతీయుడు.. మా పని వాడు భారతీయుడు..’’ అని అంటూనే.. భారతీయులంతా నా సోదరులని చెప్తాడు.. ఇప్పుడు ఉన్నది అచ్చంగా అదే పరిస్థితి..
ఇక రెండవది.. ఇక్కడ అక్షరాస్యత మెరుగుపడటం.. 1956కు ముందు నిజాం కాలంలో ఉన్న చదువు సంధ్యలకు ఇప్పటికి ఉన్న తేడా మీకు తెలియకపోవచ్చు..నిజాం కాలంలో చదువుకుని మేధావులైన మహాపురుషులెందరో అటు నిజాం రాజ్యాన్ని వైభవోపేతం చేశారన్న సంగతి మీకు తెలుసనే అనుకుంటున్నా..వలస వచ్చిన ముస్లిం అధికారులు అధికారాన్ని చెలాయించారే తప్ప.. ఇక్కడ రాజ్యాన్ని సుశ్యామలం చేసి దేశంలోనే సంపన్నతను సాధించి పెట్టిన వాళ్లు తెలంగాణా ప్రజలే. ఇక్కడి వ్యవసాయం.. ఇక్కడి నిర్మాణ నైపుణ్యం.. ఇక్కడి విద్యావైభవంతో నిర్వహించిన పత్రికలు..సెంట్రలైజ్‌డ్ ఏసి వంటి టెక్నాలజీ.. మద్రాసు కంటే ముందు ఇక్కడ జరిగిన విద్యుదుత్పత్తి.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి ఇక్కడ ఉండింది.. కాకపోతే దాన్ని మీరు కప్పిపుచ్చుతున్నారు.. (వాస్తవానికి ఈ వనరుల కోసమే..ఆంధ్ర తెలంగాణాను బలవంతంగా కలుపుకుంది). చదువులో వెనుకబడటానికి కారణం 1956 మెర్జ్ మాత్రమే.. 1956 మెర్జ్ తరువాత ఇక్కడ డెలిబరేట్‌గా విద్యావకాశాలను తొక్కి పారేశారు.. తాము అక్రమంగా ఆక్రమించుకున్న హైదరాబాద్‌లో మాత్రం విద్యకు సంబంధించిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసుకుని.. మిగతా తొమ్మిది జిల్లాలకు మొండిచెయ్యి చూపించారు.. తెలంగాణా అంటే హైదరాబాద్ మాత్రమే అని ఒకానొక భావనలో ఉండిపోయారు. కాగితాల్లో లెక్కల్లోకొచ్చేసరికి తెగ చెప్పేస్తారు.. తొమ్మిది జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నదన్నది ఎవరికీ అక్కర్లేదు.. వీటి గురించి మాట్లాడితే మీకు తలపొగరుగా కనిపిస్తుంది.. మెదడు లేని వాళ్లుగా కనిపిస్తారు.. తెలంగాణాలో అక్షరాస్యత పెరగాలన్నారు.. ఎలా చేసే పెరుగుతుందో మీరు చెప్పగలరా? శ్రీచైతన్య, నారాయణ టెక్నోస్కూళ్లు గల్లీకొకొటి కుప్పలు తెప్పలుగా తెచ్చిపోసి ఎల్‌కెజికి 50 వేల చొప్పున నిలువుదోపిడీ చేయించుకోవటం వల్ల పెరుగుతుందా? ఈ స్కూళ్లలో చదువుకోవటమేనా అక్షరాస్యత పెరగటం? తొమ్మిది జిల్లాల్లో అక్షరాస్యత ఎలా పెరుగుతుంది? బాసరలో ఐఐటి పెట్టాలంటే.. దాన్ని దిగ్విజయంగా గండికొట్టి అది కూడా తెచ్చి హైదరాబాద్‌లో పడేసిన మేధావితనం ఎవరిది? ఎయిర్‌పోర్ట్ లేదనో.. మరో కుంటి కారణాలు తెచ్చి చూపి.. అక్కడ ఒక పెద్ద విద్యాసంస్థ రాకుండా చేసిన ఘనత ఎవరిది? ఒక సంస్థను ఏర్పాటు చేయమని ఎందుకు కోరతారో మేధావులైన మీకు తెలియంది కాదనే నేననుకుంటున్నా... ఒక సంస్థను ఏర్పాటు చేయటం వల్ల దానికి అనుబంధంగా ఆ ప్రాంతానికి చాలా సౌకర్యాలు వస్తాయి.. దాని వల్ల మౌలిక వనరులు.. సదుపాయాలు పెరుగుతాయి. దాని వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. అక్కడ ఏమీ లేదనే అది కావాలని అడిగింది.. అది వస్తే అన్నీ వస్తాయని ఆశపడింది.. అది లేకుండా.. రాకుండా చేసిందెవరు? తోటి తెలుగువాడు. తెలంగాణా అభివృద్ధికి ఇది ఒక మచ్చుతునక.
ఇక తరువాతి విషయం.. ఇక్కడ మొబిలిటీ లేదన్నారు.. మొబిలిటీ అంటే కేవలం హైదరాబాద్‌కు మాత్రమే వచ్చి ఉండటం కాదని నేననుకుంటున్నా.. నిజమేమిటో మీరే చెప్పాలి.. మొబిలిటీ అంటే ఇక్కడ ఉపాధి దొరక్కపోతే దొరికిన చోటికి వెళ్లి ఎంత కష్టపడైనా సరే సంపాదించటం.. గల్ఫ్ దేశాలకు వెళ్లటం.. మహారాష్టక్రు వెళ్లటం.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లటం.. పాట్నా వెళ్లటం... ఐరోపా దేశాలకు వెళ్లటం.. రష్యాకు వెళ్లటం.. ఎక్కడైనా.. సరే.. నాలుగు రాళ్లు దొరికితే కుటుంబాన్ని పోషించగలిగితే సంతృప్తి చెందటం..ఇది మాత్రమే వాళ్లకు తెలిసిన విద్య.. దీన్ని ఇంగ్లీషులో సోకుగా మొబిలిటీ అంటారన్న విషయం కూడా వారికి తెలియదు.. పొట్ట కట్టేసుకుని రాత్రికి రాత్రి డాలర్లు సంపాదించి.. ఆ డాలర్లను తల్లిదండ్రులకు పంపించి వాటితో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేసి ఏసి కార్లలో తిరగటం కాదు మొబిలిటీ అంటే... ఎక్కడికైనా వెళ్లి బతకటమే వాళ్లకు తెలిసింది.. తామున్న దగ్గరికే అన్నీ రావాలనుకుంటారనటం తమ ఆలోచనను ఎదుటివాళ్లపై ఆపాదించటమే అవుతుంది. ఇక్కడి వాళ్లు ఎక్కడికైనా వెళ్లి దుకాణాలు పెట్టుకునో.. ఉద్యోగాలు చూసుకునో బతుకుతారు.. కానీ, తోటి తెలుగు ప్రాంతానికి మాత్రం వెళ్లలేరు.. ఎందుకంటే వాళ్లను అక్కడ సహించేవాళ్లే లేరు.. అక్కడ అక్కున చేర్చుకుని సోదరులుగా ఆదరించే వాళ్లు లేరు.. అక్కడ వాళ్లకు మీరు ఇంగ్లీష్‌లో రూమ్ అన్నారే.. అది కూడా దొరకదు.. ఇది నిజం. దీని గురించి మీరు మాట్లాడరు.. ఒప్పుకోరు.. రజాకారులు దుర్మార్గంగా ప్రజలపై దాడి చేస్తున్న కాలంలో ప్రాణాలరచేత పట్టుకుని ఒక్కుదుటున పక్కనున్న విజయవాడకు వెళ్లిన తోటి తెలుగు ప్రజలను ‘గాడిద కొడుకులు ఇక్కడికి వచ్చారు.. మా ప్రాణం మీదకు’’ అని ముఖం మీదే తిట్టిన ఉదారవాద సంస్కృతి నిజంగా మేధావి వర్గానికే సాధ్యమైంది.
ప్రజాస్వామిక భావనలు లేని వారు తెలంగాణ ప్రజలని చెప్పుకొచ్చారు.. ప్రజాస్వామిక భావనలు అంటే ఏమిటి? ఇక్కడి వాళ్లకు ప్రజాస్వామిక భావనలే లేకపోతే.. 1940లలోనే ఇక్కడికి వలసలు ప్రారంభమయ్యేవి కావు.. అన్ని జిల్లాల్లో రాత్రికి రాత్రి గుంటూరు పల్లెలు పుట్టుకొచ్చేవి కావు. ఇక్కడి వాళ్లకు ప్రజాస్వామిక భావనలు లేకపోతే.. ఎక్కడికక్కడ మండలాలకు మండలాలే ఇతర ప్రాంతాల వాళ్ల పాలన పడేవి కావు. తోటి తెలుగువారితో ఇంటిగ్రిటీ కోసం ప్రయత్నించే వాళ్లు కారు. తోటి సంస్కృతిని తమదిగా సొంతం చేసుకుని తమలో అబ్సార్బ్ చేసుకునే వాళ్లు కారు. పొరుగు పండుగలను తమవిగా చేసుకుని ఆనందంగా సంబురాలు చేసుకునే వారు కారు. ఆ ఔదార్యం ఇక్కడి సంస్కృతిలో భాగం.. అందరినీ తమవాళ్లని అనుకోవటం ఇక్కడి అమాయకత్వం.. బతుకమ్మ పండుగను మీరు ఎన్నడైనా చేసుకున్నారా? బతుకమ్మ అంటే అదీ ఒక పండుగేనా.. గడ్డిపూలు పెట్టి చుట్టూ తిరుగుళ్లు తిరిగి వెఱ్రి పాటలు పాడుకోవటం కూడా ఓ పండుగేనా అని ఎద్దేవా చేయటం ప్రజాస్వామిక భావనా? తోటి తెలుగువాణ్ణి తమ ప్రాంతంలో అడుగుపెడితే సహించలేకపోవటం.. చాపకింద నీరులా అతణ్ణి వెనక్కి వెళ్లిపోయేలా చేయటం ప్రజాస్వామిక భావనా? స్థానిక ఉద్యోగాలను రాష్ట్ర ఉద్యోగాలుగా జీవోల్లో మార్చేసుకుని స్థానికుల నోట్లో మట్టి కొట్టడమేనా ప్రజాస్వామిక భావన? మీకు తెలుసా? నీటిపారుదల శాఖలో తెలంగాణా అన్న ఒకే ఒక్క కారణం వల్ల దాదాపు రెండు వందల మంది ప్రమోషన్లు ఆగిపోయాయన్న విషయం? జిహెచ్‌ఎంసి అనే ఒక లోకల్ బాడీ సంస్థలో 80శాతంమంది ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లన్న విషయం మీకు తెలుసా? చివరకు అటవీ శాఖలో పూర్తిగా లోకల్ ఉద్యోగాలను భర్తీ చేయమని 152 జివో ఇస్తే.. వాటిని రాత్రికి రాత్రి రాష్ట్ర పోస్టులుగా మార్చి అడవితో సంబంధం లేని విజయవాడ.. గుంటూరు.. రాజమండ్రి వారికి వాటిని కట్టబెట్టిన సంగతి మీకు తెలుసా? 1969లో 24వేల ఉద్యోగాలను తెలంగాణా పొట్ట కొట్టి ఇతర ప్రాంతాల వారికి ఇచ్చారన్న ప్రాతిపదికపై ఆందోళన జరిగితే.. దాన్ని రెక్టిఫై చేసేందుకు కాసుబ్రహ్మానందరెడ్డి జివో నెం.36 రిలీజ్ చేస్తే ఎందుకు అమలు కాలేదో మీరు చెప్పగలరా? 1985లో 58, 962 ఉద్యోగాలు అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఇచ్చిన పొరపాటును సవరిస్తూ.. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసైనా సరే తెలంగాణా ప్రాంతం వారికి న్యాయం చేయాలని ఎన్టీరామారావు విడుదల చేసిన జీవో ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదో మీరు చెప్పగలరా? సాగర్ డామ్ కట్టి గ్రావిటీతో కృష్ణా డెల్టాకు సులభంగా నీళ్లు వదులుకుని నల్గొండకు చుక్క నీరు కూడా వదలకుండా ఆ జిల్లాను ఫ్లోరిన్ బాధితురాలిగా ఎందుకు చేశారో చెప్పగలరా? ఆ జిల్లాలో డ్యామ్ కట్టి ఆ జిల్లా కోసం కట్టిన కెనాల్‌ను ఎందుకు పనిచేయకుండా ఆపేశారు? ఒక్కసారి చెప్పండి? వ్యవసాయానికి చుక్కనీరు రాకుండా చేసి.. బోర్లమీద బోర్లు వేసుకుని దిక్కులేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు కరెంటు వేసుకుని నీళ్లు వాడుకుంటే.. ఓహో.. విద్యుత్తు వినియోగంలో తెలంగాణా నెంబర్ వన్ అంటారు.. 50 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటంటే ఒక్క డ్యామ్ పూర్తి చేయకుండా.. ఎవరి మేలును ఆకాక్షించినట్లు..ఎవరికి సంక్షేమం చేసినట్లు? తోటి తెలుగువాడిగా ఇక్కడే ఉంటున్న వారిగా.. బహుశా మీరు హైదరాబాద్ కావచ్చు.. మిగతా తెలంగాణా గురించి మీకు ఎంత వరకు ఆవేదన ఉందోలేదో నాకైతే తెలియదు..
తెలంగాణాకు లేనివన్నీ ఉన్నాయని చెప్తున్నారన్నారు? ఏవి లేవో మీరు చెప్పలేదు.. మీరు చెప్పినవి అక్షరాస్యత లేదన్నది.. కానీ, ఇక్కడ అక్షరాస్యత ఉంది.. మీరు చెప్పింది మొబిలిటీ లేదన్నది.. ఇక్కడ మాత్రమే మొబిలిటీ ఉంది...మీరు చెప్పింది పని సంస్కృతి లేదన్నది అన్నింటికీ మించి ఇక్కడ మాత్రమే పని సంస్కృతి ఉంది. ఇక్కడ సోమరులు లేరు.. ఎందుకంటే మిగతా చోట్ల పని చేసినా జీవితం నడుస్తుంది.. ఇక్కడ పని చేయకపోతే పూట గడవదు.. ఇక్కడి ప్రజానీకానికి పెరిగిపోయిన సంపన్నతతో ఎంజాయ్ చేయటానికి హంసమేడలు లేవు.. వీరికి తెలిసిన ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా మాత్రమే. మీరు చెప్పింది ఇక్కడ ప్రజాస్వామిక భావనలు లేవన్నది ఇక్కడ మాత్రమే ప్రజాస్వామిక భావనలు ఉన్నవి. ఇక్కడ సృజన ఉంది.. అక్షరం రాయటం రాకపోయినా.. అద్భుతమైన సారస్వత పంటను పండించే వేనవేల పోతన్నలు ఉన్నారు..ఇక్కడి పోతన్నను అక్కడికి లాక్కుపోవాలని చూడటం వారికి తెలియదు.. ఇక్కడి కాకతీయులను రాజమండ్రికి పరిమితం చేయటం వీరికి తెలియదు.. ఇక్కడి సోమనాథుని హాల్కురికి తీసుకుపోవటం తెలియదు. మల్లినాథసూరిని.. అప్పకవిని ఎత్తుకుపోవటం వీరికి తెలియదు.. వీరికి తెలిసిందల్లా బుద్ధి కంటే ఎక్కువగా హృదయాన్ని అభిమానించటం. ఇక్కడి సంస్కృతిలో మర్యాదలు, మన్ననలు విశిష్టంగా ఉంటాయి. కులభేదాలకు అతీతంగా ఉంటాయి. గ్రామానికి గ్రామాలు ఒక కుటుంబంగా ఉంటాయి. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, తమ్మలి, దళిత, బేగారె, నీరడి కులాలెన్నో తెలంగాణా పల్లెల్లో మనకు కనిపిస్తాయి. వీళ్ల మధ్య అనూహ్యమైన అనుబంధాలు, బంధుత్వ పిలుపులు కనిపిస్తాయి. వినిపిస్తాయి. వారిలో ఒకరికి ఒకరు అన్న, మామ, బావ, వదిన, అక్క, ఇలా రకరకాల బంధాలు ప్రజల అనుబంధాలను పెనవేస్తాయి. ఇళ్లల్లో కూడా ఇదే రకమైన విధానం కనిపిస్తుంది. ‘‘ఏందె నాయినా’’ అని పిలవటంలో ఉండే ఆత్మీయత, నాన్నగారూ...వదినగారూ.. మరిదిగారూ.. అని పిలవటంలో ఉండదు. ఎవరినైనా ఆప్యాయంగా అక్కున చేర్చుకోవటంలో కానీ, సహాయపడటంలో కానీ, తెలంగాణా ప్రజలు ముందుంటారు..
సరే మళ్లీ విషయానికి వద్దాం.. తెలంగాణ ఎందుకు వెనుకబడింది? ఒక్కసారి చెప్పండి? ఆంధ్ర రాష్ట్రంతో మెర్జ్ అయిన సమయానికి తెలంగాణా బడ్జెట్ 63 కోట్ల మిగులు.. ఆంధ్ర బడ్జెట్ మైనస్ 24 కోట్లు.. ఈ డబ్బు కోసమే.. ఈ మౌలిక వనరుల కోసమే.. ఈ మానవ వనరుల కోసమే.. ఆదరాబాదరాగా.. టెంట్ల కింద దిక్కులేకుండా నడుస్తున్న పాలనను చక్కదిద్దుకోవటం కోసమే షరతులతో మెర్జ్ చేసుకున్నారు. అంతే తప్ప తెలుగు వారినంతా ఒక్కటిగా చేయటం కోసం కాదన్నది మీరు గ్రహించాలి.. తెలంగాణాను బేషరతుగా కలుపుకోలేదు.. ఒప్పందం చేసుకుని మరీ కలుపుకున్నారు. ఒప్పందం ఉల్లంఘన జరిగింది కాబట్టే ఉద్యమాలు జరుగుతున్నాయి.
తోటి తెలుగువారు మీరు.. తెలుగువారు సంపూర్ణంగా సమైక్యంగా ఇప్పుడు ఉన్నారా? ఇక్కడ నిజామాబాద్‌లో ఉన్న ప్రజానీకానికి విశాఖపట్నం గురించి ఎంతవరకు తెలుసు.. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఒక జిల్లాలో ఉన్నవారికి తెలంగాణా జిల్లాల గురించి ఎంతవరకు అవగాహన ఉంది.. రెండు ప్రాంతాల మధ్య ఇంటిగ్రిటీ కోసం ఏనాడైనా.. ఎవరైనా ప్రయత్నించారా? ఇంతెందుకు? ఉద్యోగం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్లు ఎవరైనా తెలంగాణా వారితో మమేకం కావటానికి ఒక్కసారైనా ప్రయత్నించారా? ఇక్కడి సంస్కృతిని తమదిగా చేసుకున్న సందర్భం ఉందా? తెలంగాణాకు సంబంధించిన పండుగలను, పబ్బాలను, పిండి వంటలను ఏనాడైనా తమ ఇళ్లల్లో చేసుకున్నారా? ఇలా ప్రశ్నిస్తే.. మీదీ ఓ పండుగేనా? మీ తిండీ ఓ తిండేనా అంటారు? ఇక్కడి వాళ్లతో కలిసి ఉండరు.. వీళ్లను మాత్రం మీతో కలిసి ఉండాలంటారు.. అసలు మమేకమే కానప్పుడు కలిసి ఉండటం ఎలా సాధ్యమవుతుంది?
మీకు తెలియంది మరొకటుంది.. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరటం లేదు.. ఎనిమిది సంవత్సరాల పాటు సంపన్నంగా విలసిల్లిన రాష్ట్రాన్ని తిరిగి తీసుకోవాలనుకుంటోంది.
చివరగా ఒకటి సుస్పష్టం.. తెలంగాణా, ఆంధ్రా అన్నవి రెండు జాతులు.. రెండు సంస్కృతులు.. రెండు భాషలు.. రెండు జనజీవన విధానాలు.. ఇవి రెండు ఎప్పటికీ కలవవు.. బలవంతంగా రెంటినీ కలిపారు.. ఈ రెండూ కలిసి ఉండటం అసాధ్యం. ఇప్పుడు విడిపోవటాన్ని ఆపవచ్చు. కానీ, మానసికంగా విడిగా ఉన్న జాతులను శాశ్వతంగా కలిపి ఉంచటం ఎవరివల్లా అయ్యేపని కాదు.