30, మార్చి 2009, సోమవారం

కెసిఆర్‌ తమాషా

అజ్ఞాతం ప్రదేశాలు.. అర్ధరాత్రి చర్చలు.. ఫోన్‌ల ద్వారానో.. మరో పరోక్ష పద్ధతిలో  మీడియాకు జాబితాల విడుదల... ఇదేదో నిషిద్ధ మావోయిస్టు పార్టీనో.. మరో టెరర్రిస్టు బృందమో చేస్తున్న పని అనుకుంటే పొరపాటే... 119 నియోజక వర్గాల్లో దాదాపు 30 శాతం ఓట్ల బలం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి  అధినేత కె. చంద్రశేఖర్‌ రావు తీరు ఇది. ఆయన ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. ఎవరికీ తెలియదు.. అడపాదడపా చంద్రబాబు ఇంటికి మాత్రం వెళ్లి వస్తుంటారు.. అదీ మీడియా కంటపడకుండా... కార్యకర్తల కంటికి కనపడకుండా... వెరసి ఆయన కప్పుకున్న ముసుగు ప్రత్యేక తెలంగాణా.. ఆయన నైజం.. చిక్కడు.. దొరకడు
కెసిఆర్‌ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఎవరికీ అంతుపట్టని విషయం. ఆయన వెంట థింక్‌ ట్యాంక్‌గా పేరు తెచ్చుకున్న వారికి సైతం ఆయనేమిటన్నది అర్థం కాదు.. పేరుకే వారు థింక్‌ ట్యాంక్‌.. చేసేదంతా ఆయనే.. రబ్బర్‌ స్టాంపులు వీరు.. పార్టీ స్థాపించిన నాడు ఆయన ఎంత నిజాయితీగా కనిపించినా.. మొదట్నుంచీ ఒంటెత్తు పోకడలే... ఎన్నికలొస్తే చాలు.. పార్టీలో, కేడర్‌లో ఆయన సృష్టించే అయోమయం అంతా ఇంతా కాదు.. మహాకూటమితో సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభమైనప్పటి నుంచి మీడియాకే కాదు... పార్టీలోని ఏ ఒక్క కార్యకర్తకూ అందుబాటులోకి లేరు... ఎందుకింత భయం... ఎవరికి భయపడి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు... ఒక విచిత్రమైన సంకట స్థితిలోకి పార్టీలోని ప్రతి ఒక్కరినీ నెట్టేశారు..అందుకే ఆందోళనలు.. నిరసనలు.. ఆవేదనలు..
పోనీ ఆయన వూ్యహాత్మకంగా వ్యవహరించారనీ, దాని వల్ల పార్టీకి కానీ, తెలంగాణ ఉద్యమానికి కానీ రాజకీయంకా లాభం కలిగిందా అంటే అదీ లేదు... ఆయన చేస్తున్న తమాషా వల్ల టీఆర్‌ఎస్‌ మాత్రమే కాదు.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమమూ పలుచబడింది. 2004 ఎన్నికల దగ్గర నుంచి  ఆయన వ్యవహారశైలి ఇదే విధంగా ఉంది. అన్నీ తానే.. అన్నట్లుగా కెసిఆర్‌ వ్యవహరిస్తూ వచ్చారు. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ఆయనకు వచ్చిన సీట్లు 45మాత్రమే. కానీ సంకీర్ణ ధర్మాన్ని  కాలదన్ని 54 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపారు.. ఆరోజు ఇదేమని ఆయన్ను కాంగ్రెస్‌ వారు అడిగే దము్మ చేయలేదు.. పోనీ అదనంగా, అనధికారికంగా పోటీ చేసిన సీట్లలో టిఆర్‌ఎస్‌ ఒక్కదాంట్లోనైనా గెలిచారా అంటే అదీ లేదు.. పొత్తు వల్ల సంక్రమించిన సీట్లలో  సైతం సగం కంటే ఎక్కువ సీట్లు గెలవలేకపోయారు.. గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలలో కూడా పది మంది తిరుగుబాటు చేశారు. అయిదుగురు ఎంపీల్లో నరేంద్రను అవినీతిపరుడన్న ముద్ర వేసి వెళ్లగొట్టారు. తిరగబడ్డ ఎమ్మెల్యేలలందరిపైనా ద్రోహులన్న ముద్ర వేసిన కెసిఆర్‌... కనీసం వారిపైన పోటీ చేసేందుకు ఆ స్థానాలను సైతం ఇప్పుడు తెచ్చుకోలేకపోయారు. ఆరోజు తెలుగుదేశం ప్రభుత్వంలోని తెలంగాణా మంత్రులందరిపైనా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌పై ఒత్తిడి చేసి సీట్లు తెచ్చుకున్న కెసిఆర్‌ ఈసారి బాబుపై ఆమాత్రం ఒత్తిడి చేయలేకపోయారు. కనీసం తాను  ప్రకటించిన జాబితాపైనా కట్టుబడి ఉండలేకపోయారు...అడ్డగోలుగా టిక్కెట్లు ఇస్తున్నారంటే.. దానికి ఆయన ఇచ్చే జవాబూ విచిత్రంగానే ఉంటుంది...
టిఆర్‌ఎస్‌ ప్రతి వేదికపైనా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ధూంధాంనూ దూరం చేసుకున్నారు. అర్థం లేని లెక్కలు.. ఉపయోగపడని సమీకరణాలు.. పకడ్బందీ వూ్యహం లేని ప్రణాళికలు.. కూటనీతితో రాజనీతిని ఎంతోకాలం సక్సెస్‌గా నడిపించలేరని కెసిఆర్‌ విషయంలో మరోసారి రుజువైంది. టిఆర్‌ఎస్‌లో జరుగుతున్నదేమిటో ఆ పార్టీ ఆఫీస్‌ బేరర్లకు కూడా తెలియదు.. కెసిఆర్‌ కుటుంబ సభ్యులకు తప్ప... ఆ కుటుంబ సభ్యులు ముచ్చటగా ముగ్గురే... వారు కెసిఆర్‌.. ఆయన తనయుడు రామారావు... ఆయన మేనల్లుడు హరీష్‌రావు...
దటీజ్‌ టిఆర్‌ఎస్‌ తమాషా.....సారీ.. కెసిఆర్‌ తమాషా

కామెంట్‌లు లేవు: