30, జూన్ 2009, మంగళవారం

ద్రవ్యోల్బణం ఓ బ్రహ్మ పదార్థం

ద్రవ్యోల్బణం ...... దేశ ఆర్థిక వ్యవస్థలో ఇదో విచిత్రమైన పదం.. ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం. దీని సూచీ ఎందుకు పెరుగుతుందో.. ఎందుకు తగ్గుతుందో.. దీనికీ, ధరల సూచీకీ ఉన్న సంబంధం ఏమిటో.. ద్రవ్యోల్బణం సూచీ పెరిగితే ధరలు పెరుగుతాయని, తగ్గితే తగ్గుతాయని చెప్తారు... కానీ, ఇప్పుడు మైనస్‌లోకి పడిపోయినా ధరలు తగ్గటం లేదు... పైగా చుక్కలనంటుతున్నాయి. ఇదంతా ఒక మాయ.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో సామాన్య ప్రజానీకానికి అంతుపట్టని వ్యవహారం..
అర్థ శాస్త్రంలో ఇన్‌ఫ్లేషన్‌ అంటే వివిధ వస్తువులు, సర్వీసులకు సంబంధించి సాధారణ స్థాయిలో ఉండే ధరలు అని అర్థం. దీన్నే ద్రవ్యోల్బణం అని మనం చెప్పుకుంటాం. దీన్ని ఒక నిర్ణీత కాలానికి లెక్కిస్తారు. అమెరికన్‌ సివిల్‌ వార్‌ సమయంలో ప్రైవేట్‌ బ్యాంక్‌ నోట్‌ కరెన్సీ ప్రింట్‌ అయింది. అప్పుడే మొట్టమొదటిసారిగా ఇన్‌ఫ్లేషన్‌ అన్న పదం ప్రత్యక్షంగా వాడుకలోకి వచ్చింది. కరెన్సీ డిప్రిసియేషన్‌ను సూచిస్తూ దీన్ని ఉపయోగించారు. మన కరెన్సీలోని ప్రతి రూపాయితో వస్తువులను కానీ, సర్వీసులను కానీ కొనుగోలు చేస్తాం. మనీకి ఉండే నిజమైన విలువ, ప్రజల కొనుగోలు శక్తి మన ఆర్థిక వ్యవస్థలో జమాఖర్చులను ప్రభావితం చేస్తాయి. ఒక విధంగా సాధారణ ద్రవ్యోల్బణం రేటు వినియోగ దారుల ధరల సూచి అని చెప్పవచ్చు. ఇన్‌ఫ్లేషన్‌ రేటు సందిగ్ధంగా ఉంటే దాని వల్ల ఆర్థిక వ్వయస్థపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. పెట్టుబడులకు ప్రోత్సాహం లభించదు. హై ఇన్‌ఫ్లేషన్‌ రేటు వస్తువుల కొరతకు కారణమవుతాయి. ఇది స్థూల జాతీయోత్పత్తిపైనా ప్రభావం చూపుతుంది. అందువల్లే ద్రవ్యోల్బణం అంటే అటు పాలకులకు, ఇటు పారిశ్రామిక వేత్తలకు అంత హడల్‌.. నిపుణులు చెప్తున్నట్లు ద్రవ్యోల్బణ సూచీ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. దీనిపై ఎవరికీ ఎలాంటి ఆక్షేపణ లేదు. కానీ, అదే సూచీ పడిపోయినప్పుడు ధరలు కూడా పడిపోవాలి కదా? కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఇన్‌ఫ్లేషన్‌ రేటు 14 శాతం చేరుకున్నప్పుడు పాలకులకు చెమటలు పట్టాయి. అప్పుడు ధరలను చూస్తే కందిపప్పు 45 రూపాయలు, బియ్యం 25 రూపాయలు.. అన్ని వస్తువుల ధరలూ అమాంతంగా పెరిగిపోయాయి. ప్రజలు ఏదో భరించారు... సరే ద్రవ్యోల్బణం రేటు తగ్గినప్పుడు ఎలాగూ ధరలు తగ్గుతాయని అనుకున్నారు. ఆశపడ్డారు. కానీ పరిస్థితి తిరగబడింది. శాస్త్రీయతకు భిన్నంగా ద్రవ్యోల్బణం రేటు పూర్తిగా నెగెటివ్‌ జోన్‌లోకి పడిపోయింది. అలాంటప్పుడు ధరలు పూర్తిగా తగ్గాలి. కానీ, అలా జరగలేదు. ఇన్‌ఫ్లేషన్‌ రేటు ఎక్కువగా ఉన్నప్పటికంటే ఎక్కువగా రేట్లు పెరిగిపోయాయి. అప్పుడు ఆ ధరలను భరించిన ప్రజలు ఇప్పుడు భరించలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలో తోచక అల్లల్లాడిపోతున్నారు. కందిపప్పు 70 రూపాయలైంది. బియ్యం37 రూపాయలైంది. చివరకు కూరగాయలూ కొనే పరిస్థితి కనుచూపు మేరలో కొనే పరిస్థితి కనిపించటం లేదు. వంద రూపాయల నోటుకు ఒక రూపాయికున్నంత విలువ కూడా లేకుండా పోయింది. అప్పుడు రూపాయి ఇరవై పైసలు ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు మూడు రూపాయలకు చేరుకుంది. ద్రవ్యోల్బణం లెక్కింపులోని డొల్ల తనాన్ని ఈ పరిణామం సూచిస్తున్నది. టోకు ధరల సూచీ ఆధారంగా దీన్ని లెక్కించటం వల్ల ఇన్‌ఫ్లేషన్‌ నెగెటివ్‌ జోన్‌లో పడిపోయిందని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో డిమాండ్‌ పడిపోవటం వల్ల ద్రవ్యోల్బణం మైనస్‌ అయిందని, మనం ఒక విధంగా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లినట్లేనని మరికొందరు అంటున్నారు.ద్రవ్యోల్బణాన్ని తప్పుగా లెక్కిస్తున్న వాస్తవాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికి గుర్తించింది. ఈ సెప్టెంబర్‌ నుంచి ఇప్పటికన్నా మరింత మెరుగైన, వాస్తవాన్ని వాస్తవంగా ప్రతిబింబించే స్థాయిలో కొత్త ద్రవ్యోల్బణ సూచీని తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే దీన్నికూడా టోకు ధరల ఆధారంగానే సూచిస్తామంటున్నారు. దీంతో దీని విశ్వసనీయతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవ ధరల ముఖచిత్రాన్ని నిష్కర్షగా ఆవిష్కరించే విధంగా ద్రవ్యోల్బణ సూచీ అవసరం. సూచీ మాటెలా ఉన్నా, మోత మోగిస్తున్న ధరలను ఆకాశం నుంచి కిందకు దింపటానికి ప్రణబ్‌ ముఖర్జీ తన బడ్జెట్‌లో అర్జెంటుగా తీసుకునే చర్యలు ఏమిటన్నది ఇప్పటికి మాత్రం సస్పెన్సే....

23, జూన్ 2009, మంగళవారం

సంధ్యా సమీరం....

ఒక అబద్ధాన్ని నిజం అన్ని నమ్మించటానికి పెద్దగా శ్రమించనక్కర లేదు.. ఆ అబద్ధాన్ని పదే పదే చెప్తే చాలు... అదే నిజమై పోతుంది. నియంత హిట్లర్‌ దగ్గర పనిచేసిన గోబెల్‌‌స ఇందుకు ఆద్యుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయంలో తేడా రాలేదు.. న్యాయానికి న్యాయం చేయటం కంటే... అన్యాయాన్ని న్యాయంగా నమ్మించటానికి పెద్దగా శ్రమించనక్కరలేదు. చట్టం చుట్టపు చూపు చూస్తుంటే.. న్యాయం కళు్ల మూసుకుని పోతే.. సత్యం సంకెళ్లతో బందీ అయి విలవిల్లాడిపోతుంది.
నివురు గప్పి ఉన్నంత వరకే నిప్పు గుంభనంగా ఉంటుంది. ఒక్కసారి గాలి తాకిడికి నివురు తొలగిపోయిందంటే... నిప్పు కణిక మహాజ్వాల అయి భస్మరాశుల్ని మిగులుస్తుంది. సత్యం నిప్పులాంటిది. సత్యాన్ని వెలుగులోకి రాకుండా బంధించి ఉన్నంత వరకు దుర్మార్గులు, నేరం చేసిన వారు పబ్బం గడుపుకుంటారు... నిజం వెలుగుచూస్తే.. న్యాయం కళు్ల తెరుస్తుంది. నేరం ఆమడదూరం పరిగెడుతుంది. కానీ, ఆ నిజం వెలుగు చూసేదెలా? న్యాయం జరిగేదెలా? అప్పు తీసుకున్న పాపానికి ప్రేమ నటించిన ప్రియుడి కారణంగా చరిత్రాత్మక చార్మినార్‌ నుంచి కింద పడి మరణించిన సమీర విషయంలో ఇవే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి...... కానీ జవాబు చెప్పే వారే లేరు...
నాలుగు వందల ఏళ్ల భాగ్యనగరానికి నిలువెత్తు సంతకం చార్మినార్‌.. ప్లేగు వ్యాధి బాధితుల స్మృతి చిహ్నంగా నిజాం నవాబునిర్మించిన ఈ అద్భుత కట్టడాన్ని సందర్శించేందుకు రోజూ వందలాది మంది వస్తుంటారు. అందునా ప్రేమికులకు ఇది ఓ చక్కని విహార ప్రదేశం.. ఆ రోజు కూడా చార్మినార్‌ ఎప్పటిలాగే సందడిగా ఉంది. చార్మినార్‌ చుట్టూ చిన్న చిన్న వ్యాపారస్థులు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ కట్టడాన్ని సందర్శించేవాళు్ల.. చూసి తిరిగి వచ్చేవాళ్లతో హడావుడిగా ఉంది. సంధ్యా సమయం అప్పుడే మొదలవుతోంది. సూర్యుడు అస్తమించేందుకు పశ్చిమం దిశగా కదులుతున్నాడు.. ఇంతలోనే పెద్ద అరుపు.. ఆ వెంటనే పెద్ద శబ్దం.. చార్మినార్‌ తొలి అంతస్థునుంచి ఓ యువతి కిందకు పడిపోయింది. నెత్తుటి మడుగులో కొట్టుకుంటోంది. అక్కడ ఉన్న వాళు్ల ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు... ఆందోళనతో పరిగెత్తుకొచ్చారు.. ప్రాణాలతో ఉన్న ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు..
ఆ యువతి పేరు సమీర... పాతబస్తీలోని డబిర్‌ పుర ప్రాంతంలోని ఓ పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. సమీరమంటే గాలి.. ఆసుపత్రిలో 24 గంటలు మృత్యువుతో పోరాడి అలసిన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
ఇంతకీ చార్మినార్‌ నుంచి ఆమె ఎందుకు పడిపోయింది? ప్రమాదం అని కొందరు అన్నారు. కానీ, ఆమె ప్రియుడే ఆమెను చార్మినార్‌ తొలి అంతస్తు నుంచి కిందకు తోసి వేసాడు. చేతిలో చెయ్యి వేసి బాసలు చేసిన సఖుడే తన చెలిని చార్మినార్‌ సాక్షిగా చంపేశాడు...
అర్షద్‌ సమీరా ప్రియుడు ఉరఫ్‌ హంతకుడు.. నిజంగా ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసే హతమార్చాడా? లేక దీని వెనుక మరో కారణం ఏమైనా ఉందా? లోతుల్లోకి విచారణ చేస్తే ఈ వ్యవహారంలో ఎవరి దృష్టీ పడని ఓ కొత్తకోణం ఆవిష్కారమైంది. దశాబ్దాలుగా పాత బస్తీ వాసుల్ని పీల్చి పిప్పి చేస్తున్న వడ్టీ వ్యాపారం ఈ కిరాతకానికి కారణమయింది......
సమీర తల్లిదండ్రులు అర్షద్‌ దగ్గర 14 వేల రూపాయల అప్పు తీసుకున్నారు...సకాలంలో దాన్ని తీర్చలేని పర్యవసానం సమీర హత్య.
అసలేం జరిగింది. వడ్డీ వ్యాపారానికి సమీర హత్యకు లింకేమిటి? ఇందులో ప్రేమ ప్రస్తావన ఎందుకు వచ్చింది. ఈ వ్యవహారంలో పోలీసులు తేల్చింది ఏమిటి? కూతుర్ని పోగొట్టుకున్న సమీర తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా? ...............
సమీర హత్యతో ఉలిక్కి పడిన పోలీసులు రంగంలోకి దిగి హంతకుడిని సునాయాసంగానే పట్టుకున్నారు. అర్షద్‌ను కొన్ని గంటల పాటు విచారించిన తరువాత మీడియా ముందుకు తీసుకువచ్చారు. అసలు సమీర హత్యకు అప్పు కారణం కానే కాదని పోలీసులు తేల్చేసరికి అవాక్కయ్యే పరిస్థితి విలేఖరులకు ఏర్పడింది. ఆమె ఇతరులతో సన్నిహితంగా తిరగడం చూసి సహించలేకే అర్షద్‌ అంతమొందించాడని చెప్పారు.
నిందితుడు కూడా పోలీసులు చెప్పమన్న మాటల్ని పొల్లు పోకుండా చెప్పుకొచ్చాడు. అసలు తనకు ఫైనాన్‌‌స వ్యాపారమే లేదని కూడా అర్షద్‌ కుండబద్దలు కొట్టాడు. సంఘటన ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పారు. నిందితుడూ అదే పాట పాడారు. మరి పాత బస్తీ వాస్తులు, సమీర తల్లిదండ్రులు చెప్పున్నవన్నీ అబద్ధాలేనా? అసలేది నిజం?
అర్షద్‌ దగ్గర తీసుకున్న అప్పు చెల్లించేందుకు సమీర అప్పుడప్పుడూ అర్షద్‌ ఇంటికి వెళు్తండేది. క్రమంగా ఆమెపై మోజు పెంచుకున్న అర్షద్‌ ఆమె ఆర్థిక బలహీనతను సొము్మ చేసుకున్నాడు. కుటుంబం కోసం ఆమె అర్షద్‌కు లొంగిపోయింది. హత్యకు ముందు రెండు రోజులు సమీర అర్షద్‌ను కలవలేదు.. దీంతో ఆమె ఇంటికి వెళ్లి వాకబు చేశాడు. తరువాత 2009 జూన్‌ 11న సమీర చార్మినార్‌ దగ్గర అర్షద్‌ను కలిసింది. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కోపంతో సమీరను చార్మినార్‌ నుంచి కిందకు పడదోశాడు. కేవలం వడ్డీ వ్యాపారమే సమీరను బలి తీసుకుందన్నది నిర్వివాదం.. తనకు ఫైనాన్‌‌స వ్యాపారం లేదని అర్షద్‌ చెప్పి ఉండవచ్చు. కానీ, అతను వ్యాపారం చేశాడు. ఫైనాన్‌‌స బుక్కులు కూడా నిర్వహించాడు. మరి పోలీసులు ఈ వ్యవహారంలో వడ్డీ వ్యాపారం అన్న సంగతిని ఎందుకు వదిలిపెట్టారు?... దాని ప్రస్తావన ఎందుకు చేయటం లేదు?.. అసలు ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయటం లేదు....? దీనికి కారణం లేకపోలేదు.. పాతబస్తీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న చాలా మంది వడ్డీవ్యాపారం చేస్తున్న వారే. 10 నుంచి 20 రూపాయల వరకు వడ్డీ ఇస్తున్న వ్యాపారులూ ఉన్నారు. వీరికి ఉన్న రాజకీయ పలుకుబడి సైతం సామాన్యమైందేమీ కాదు.. అర్షద్‌కు కూడా పలుకుబడి బాగానే ఉంది. ఈ విషయం పోలీసులపై ప్రభావం చూపించిందా? అందుకే నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారా? కేసు దర్యాప్తులో నిష్కర్షగా ఉండకపోతే.. సమీర లాంటి కేసులు ఏమీ తేలకుండానే, న్యాయం జరక్కుండానే గాల్లో కలిసిపోతాయి.

22, జూన్ 2009, సోమవారం

మావోయిస్టులపై దేశ వ్యాప్త నిషేధంమావోయిస్టులు ఇక ఉగ్రవాదులే.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.

వారం రోజులుగా లాల్‌గఢ్‌లో సాగిస్తున్న మారణ హోమానికి మావోయిస్టులు భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. అందివచ్చిన అవకాశాన్ని కేంద్రం ఏమాత్రం చేజార్చుకోలేదు. మావోయిస్టులను టెరర్రిస్టులుగా ప్రకటిస్తూ, సిపిఐ మావోయిస్టు పార్టీని ఉగ్రవాద సంస్థగా డిక్లేర్‌ చేయటానికి ఆలోచించనే లేదు... భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఎక్కడో బెంగాల్లోని నక్సల్‌బరీలో ప్రారంభమైన ఉద్యమం చివరకు ఉగ్రవాద సంస్థగా భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మరింత తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కోనుంది....
******************
వర్గశత్రు నిర్మూలన.... జమీన్‌దారీ అంతం.. భూపోరాటం... కరడు గట్టిన ఫ్యూడల్‌ సమాజం రూపొందించిన రాజ్యాన్ని ఛేదించి, నూతన రాజ్యాంగ వ్యవస్థను సాయుధ పోరాటం ద్వారా నిర్మించటం...........

1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీ గ్రామంలో చిన్నగా ప్రారంభమైన విప్లవోద్యమం లక్ష్యాలివి... చారు మజుందార్‌, కాను సన్యాల్‌ వంటి మేధావులు విప్లవోద్యమాన్ని నక్సలిజంగా ఒక సిద్ధాంతంగా మలిచారు. జమీందారులు, భూస్వాముల దాష్టీకానికి పండుటాకుల్లా అల్లల్లాడిపోయిన అణగారిన వర్గాన్ని ఉద్ధరించటానికి ఆనాడు నక్సలిజం ఒక సైద్ధాంతిక సాయుధ ఉద్యమంగా ప్రారంభమైంది. అది క్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరించింది. 1969లో నక్సల్‌బరీ ఉద్యమ స్ఫూర్తితో శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం ఉప్పెనలా ఎగిసింది. ఆనాటి ఆ ఉద్యమంలో చారూమజుందార్‌ కూడా వచ్చి స్థానిక నాయకులకు ప్రేరణను ఇచ్చారు. వెంపటాపు సత్యం... ఆదిభట్ల కైలాసం, నాగభూషణ్‌ పట్నాయక్‌ వంటి వారు నాటి ఉద్యమ నాయకులు... అప్పటికి కొండపల్లి సీతారామయ్య తెరమీదకు రాలేదు.. పీపుల్‌‌స వార్‌ పార్టీ కూడా ఏర్పడలేదు.. మార్కి్సస్టు పార్టీ నుంచి విడిపోయిన నాయకులు సిపిఐ ఎంఎల్‌ పార్టీగానే వాళు్ల ఉద్యమాన్ని నడిపించారు.
1970లలో నక్సల్‌బరీ ఉద్యమం ఉత్తరతెలంగాణా మీదుగా దండకారణ్యానికి విస్తరించింది. కొండపల్లి సీతారామయ్య ఉత్తర తెలంగాణలో ఉద్యమ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ నిర్మూలనలో నక్సల్‌ ఉద్యమం ప్రధాన భూమిక నిర్వహించిందనటంలో సందేహం లేదు. ఆ తరువాత క్రమంగా ఉద్యమం విస్తరించింది.
కొండపల్లి సీతారామయ్య ఉద్యమానికి శక్తిమంతులైన నాయకులను అందించారు.
1. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి
2. నల్లా ఆదిరెడ్డి
3. సంతోష్‌రెడ్డి
4. జగన్‌
5. శ్యామ్‌
6. పులి అంజయ్య
7. పటేల్‌ సుధాకర్‌
8. మల్లోజుల కోటేశ్వర రావు
9. రామకృష్ణ
ఉద్యమ పంథాలో మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ కొండపల్లి సీతారామయ్యను పక్కకు తప్పించి గణపతి పగ్గాలు చేపట్టి ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారు. కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోనే 1980లో పీపుల్‌‌స వార్‌ ఏర్పడింది. సీతారామయ్య నాయకత్వంతో విభేదించిన వారు వేరు కుంపట్లు పెట్టుకున్నారు.. ఈ పరిణామంలోనే జనశక్తి, ప్రజాప్రతిఘటన, చండ్రపుల్లారెడ్డి వర్గాలు ఏర్పడ్డాయి.. సమాంతరంగా ఉద్యమాలు నడిపిస్తూ వచ్చాయి. అవన్నీ క్రమంగా నిర్వీర్యం అవుతూ వచ్చాయి....కానీ పీపుల్‌‌సవార్‌ మాత్రం బలపడుతూ వచ్చింది. ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లలో తమ కార్యక్రమాల్ని విస్తరించింది. రాష్ట్రంలో నిషేధానికి గురైనా, ఉద్యమం నీరుగారలేదు... బీహార్‌లోని మావోయిస్టు కమూ్యనిస్టు సెంటర్‌తో సత్సంబంధాలు కొనసాగించింది. నేపాల్‌లోని మావోయిస్టులతోనూ మంచి స్నేహాన్ని పెంపొందించుకుంది. దండకారణ్యం నుంచి నేపాల్‌ దాకా రెడ్‌ కారిడార్‌ నిర్మించేందుకూ ప్రయత్నం జరిగింది. 2004లో ఓ పక్క రాష్ట్రంలో ఇక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే ఎంసిసితో పీపుల్‌‌సవార్‌ విలీనమై సిపిఐ మావోయిస్టు పార్టీగా కొత్త రూపంలోకి మారిపోయింది.

అయితే వైఎస్‌ సర్కారుతో చర్చలు విఫలం కావటంతో, మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. కానీ అదే సమయంలో ఇతర రాషా్టల్ల్రో తమ బలాన్ని బలగాన్ని విస్తరించుకున్నారు. మన రాష్ట్రం నుంచి బయటకు వెళ్లిన నాయకులే జాతీయ స్థాయిలో ఉద్యమానికి నేతృత్వం వహించటం సాధారణం కాదు.. వారం రోజులుగా లాల్‌గఢ్‌లో జరుగుతున్న హింసాకాండలో సూత్రధారిగా మల్లోజుల కోటేశ్వరరావు వ్యవహరించారంటేనే మన రాష్ట్రం నుంచి వెళ్లిన వారు జాతీయస్థాయి ఉద్యమంలో ఏ స్థాయిలో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఉద్యమం పరిమిత స్థాయిలో ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వం దీన్ని రాషా్టల్ల్రో శాంతి భద్రతల సమస్యగానే పరిగణించింది. రాషా్టల్రకు అవసరమైన సైనిక సాయాన్ని అందిస్తూ వచ్చింది. కానీ, యుపిఏ సర్కారు వచ్చిన తరువాత ప్రధాని మన్మోహన్‌ ఈ సమస్యను సీరియస్‌గా పరిగణించారు. మావోయిస్టు సమస్య దేశానికి ప్రమాదకారిగా పరిణమించబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు కూడా... లాల్‌గఢ్‌, చత్తీస్‌గఢ్‌లలో పాల్పడుతున్న విధ్వంస కాండ యుపిఏ సర్కారుకు మంచి అవకాశం వచ్చింది. అటు సహజంగా నిషేధానికి వ్యతిరేకంగా ఉండే మార్కి్సస్టులు బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాల వల్ల నోరు మెదపలేని స్థితి ఏర్పడింది. నందిగ్రామ్‌, సింగూరు, ఇవాళ లాల్‌గఢ్‌ ఘటనలు లెఫ్‌‌టఫ్రంట్‌ను ఆత్మరక్షణలో పడేసింది. అంతే కాదు.. ఎనిమిది నెలల క్రితం ఇదే లాల్‌గఢ్‌లో అప్పటి కేంద్రమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌పైనా, ముఖ్యమంత్రి బుద్దదేవ్‌ భట్టాచార్జీపైనా హత్యాయత్నం చేసింది తామేనని కోటేశ్వరరావు ఇటీవలే అంగీకరించటం మరింత కలకలం రేపింది. మన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, నేదురుమల్లిపైనా హత్యాయత్నం చేసిన చరిత్ర మావోయిస్టులకు ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో హత్యారాజకీయాలు ఎంతమాత్రం సమర్థనీయం కాదు.. దీన్ని కారణంగా చూపే యుపిఎ సర్కారు మావోయిస్టులపై ఉగ్రవాద ముద్ర వేసింది. ఇక మావోయిస్టులు ఏ విధంగా కొత్త విప్లవ మార్గాన్ని నిర్మించుకుంటారో చూడాలి...

19, జూన్ 2009, శుక్రవారం

రాజీనామా చేసిన కెసిఆర్‌

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం మునుపెన్నడూ లేని విధంగా కెసిఆర్‌ను టార్గెట్‌ చేసింది. పార్టీలో అసమ్మతి తనకు తీవ్ర మనస్తాపం కలుగజేసిందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం సీనియర్‌ నేత రవీంద్ర నాయక్‌పై దాడి. నిన్నటికి నిన్న తెలంగాణ విమోచన సమితి ఆవిర్భావం.. అన్నీ కలగలిసి కెసిఆర్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాయి. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్‌, కెసిఆర్‌పై తీవ్రస్థాయిలో సంధించిన విమర్శనాసా్తల్రు టిఆర్‌ఎస్‌ ముసలాన్ని ముదిరేలా చేశాయి. వైఎస్‌ వూ్యహాత్మకంగా వేసిన ఎత్తుగడ దాదాపుగా ఫలించిందనే చెప్పాలి. అయితే కెసిఆర్‌ గతంలో కూడా ఒకసారి రాజీనామా డ్రామా ఆడారు. ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత రాజీనామా లేఖను పంపించటం, రాష్ట్ర కార్యవర్గం దాన్ని నిరాకరించటం క్షణాల్లో జరిగిపోయిన పని. అప్పుడు పార్టీలో అసమ్మతి రేగకుండా కెసిఆర్‌ను ఆ రాజీనామా ఖేల్‌ కాపాడింది. కానీ, ఇప్పుడు పార్టీలో అసమ్మతి పతాక స్థాయికి చేరుకుంది. ఒకరి వెంట ఒకరుగా పార్టీని వీడిపోవటం, అదీ, కెసిఆర్‌ ఆనుపానులన్నీ తెలిసిన అత్యంత సన్నిహితులు, పార్టీ స్థాపన నుంచి వెన్నంటి ఉన్నవారు రాజీనామా బాటలో నడవటం కెసిఆర్‌కు తలనొప్పిగా పరిణమించింది. దీనికి తోడు కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు రావటంతో హరీశ్‌, రామారావులు తెరచాటుకు బలవంతంగా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కూడా రాజీనామా డ్రామా అవుతుందా? అన్నది 24 గంటలు వేచి చూస్తే కానీ అర్థం కాదు. రేపు రాష్ట్ర కార్యవర్గం సమావేశమై కెసిఆర్‌ రాజీనామా గురించి చర్చిస్తుంది. కానీ, ఇప్పటికే ఆయన వందిమాగధ బృందం ఆయన నాయకత్వాన్ని వేనోళ్ల కొనియాడుతూ ప్రకటనలు చేయటం ప్రారంభించింది. 1969 తరువాత తెలంగాణ భావోదేగానికి మళ్లీ ఊపిరులూదింది కెసిఆర్‌ అన్నది నిస్సందేహం. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు పార్టీని ముందుకు తీసుకుపోగలిగిన సమర్థుడైన నాయకుడు కెసిఆర్‌. దేవేందర్‌ గౌడ్‌ లాంటి నేతే సొంత కుంపటిని పెట్టుకుని పట్టుమని పది రోజులైనా ముందుకు నడపలేక చిరంజీవి పంచన చేరారు. కెసిఆర్‌ తన నియంతృత్వ ధోరణికి తెలంగాణ భావోద్వేగం తోడై పార్టీని ఇంతకాలం నిర్వహించగలిగారు. కానీ, ఆయన ఒంటెత్తు పోకడలు, తెలంగాణ రాష్ట్రం విషయంలో పలుమార్లు ఆయన వేసిన పిల్లి మొగ్గలు, వైఎస్‌తో సెల్‌‌ఫ కిల్లింగ్‌ గేమ్‌‌స ఆడటం చివరకు ఆయన అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేశాయి. తాజాగా తెలంగాణ విమోచన సమితి ఏర్పాటు కావటంతో అసమ్మతికి తిరుగులేని బలం వచ్చినట్లయింది. దీనికి తోడు టిఆర్‌ఎస్‌ నుంచి మరో కీలక నేత కూడా బయటకు వెళ్లిపోతున్నారన్న వార్తలు మీడియాలో షికారు చేశాయి. రవీంద్రనాయక్‌ గొడవ టిఆర్‌ఎస్‌ కుము్మలాటలను తారాస్థాయికి చేర్చింది. చివరకు గిరిజనులకు కెసిఆర్‌ క్షమాపణ కూడా చెప్పుకున్నారు. కానీ పరిస్థితి చక్కబడలేదు సరికదా మరిన్ని చిక్కుముడులు పడింది. పర్యవసానం ప్రస్తుత కెసిఆర్‌ రాజీనామా. కెసిఆర్‌ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక ఇదీ ఒక డ్రామేనా తెలియదు. సీనియర్‌ నేతలు ఆయన్ను ఎంతవరకు ఒప్పించగలరు? కెసిఆర్‌ రాజీనామాను మిగతా నేతలు ఒప్పుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటన్నది కూడా ఆలోచించాలి. కెసిఆర్‌ కాకపోతే పార్టీ అధ్యక్ష పదవి రేసులో ముందుగా ఉండేది హరీశ్‌రావు. ఆయన్ను కెసిఆర్‌ కుటుంబ సభ్యుడిగా లెక్కలోకి తీసుకుంటే విజయశాంతి ఆ పదవికి పోటీ పడతారు. లేక అందరికీ న్యూట్రల్‌గా ఉండేందుకు పార్టీ సిద్ధాంత కర్త జయశంకర్‌ను రంగం మీదకు తీసుకువచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు... ఎవరు అధ్యక్షులు అయినా తెరవెనుక రాజకీయం నడిపేది మాత్రం కెసిఆరేనని నిస్సందేహం...రాబ్రీ దేవిని సిఎం కుర్చీపై కూర్చోబెట్టి లాలూ ఏం చేశారో తెలియదా? అలాంటి రాజకీయమే ఇక్కడా నడుస్తుంది. తల పగుల గొట్టుకోవటానికి ఏ రాయి అయితేనేం. టిఆర్‌ఎస్‌లోని ఈ పరిణామాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ నిలబెడతాయా? ముందుకు నడిపిస్తాయా? అంటే అనుమానమే... కెసిఆర్‌... జర సోచియే....

16, జూన్ 2009, మంగళవారం

ఈ పూట గడిస్తే చాలు..

గండం గడిచింది. అసమ్మతి సెగల్ని తగ్గించేందుకు రాష్ట్ర కార్యవర్గాన్ని హడావుడిగా సమావేశపరచి తనకు జై కొట్టించుకుని అప్పటికది ప్రస్తుతమన్నట్లుగా కెసిఆర్‌ ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ సమస్య వచ్చినప్పుడు చూసుకుందామనుకున్నట్లుగా కెసిఆర్‌ వ్యవహరించారు. కానీ, పార్టీలో అసమ్మతి గతంలో మాదిరిగానే చల్లబడుతుందా? అంటే అనుమానమే... ఇంతకు ముందు చెలరేగిన అసంతృప్తికి ఇప్పుడు జరుగుతున్న తిరుగుబాటుకు చాలా తేడా ఉంది. ప్రస్తుత వాతావరణం కెసిఆర్‌కు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టేలాగానే కనిపిస్తోంది.
నిత్య అసమ్మతి వాదం టిఆర్‌ఎస్‌ సొంతం.. అదేం ముహూర్తమో కానీ, టిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లే వారే తప్ప వచ్చే వారు లేరు. 2001 నుంచి ఇదే తంతు.. అసంతృప్తి రేగినప్పుడల్లా అంతుపట్టని విధంగా ఏదో ఒక హడావుడి చేయటం.. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించిన తన నాయకత్వానికి ఓటేయించుకోవటం కెసిఆర్‌కు పరిపాటే... ఈ సారి కూడా అచ్చంగా అదే చేశారు. అసమ్మతి వాదులు డిమాండ్‌ చేసినట్లే... రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో పాల్గొనేందుకు వచ్చిన రవీంద్రనాయక్‌ను అన్ని మర్యాదలు చేసి వెళ్లగొట్టారు. తరువాత తీరిగ్గా కూర్చుని రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. బయట అంత హడావుడి అవుతుంటే కనీసం చిత్తశుద్ధితో సమీక్షించారా అంటే అదీ లేదు. నామమాత్రంగా వ్యవహారం నడిపించి కెసిఆర్‌ నాయకత్వానికి జైజై అనిపించుకుని, విధేయత ప్రకటింపచేసుకుని వెళ్లిపోయారు.
కెసిఆర్‌ ఎప్పడు చేసేలాగానే సమస్య అంతా సమసిపోయినట్లు పిక్చర్‌ ఇచ్చారు. ఇప్పటికి అంతా ముగిసినట్లే కనిపించవచ్చు. కానీ, కెసిఆర్‌కు నిజంగా గండం గడిచినట్లేనా? కెసిఆర్‌పై గతంలో వచ్చిన అసమ్మతి వేరు... అప్పటి రెబల్‌‌స వేరు. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్న నాయకులంతా కెసిఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే... ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఉన్నవారే.
* సీనియర్‌ నేత ఏ చంద్రశేఖర్‌ కెసిఆర్‌తో అత్యంత సన్నిహితంగా రాజకీయ జీవితంలో కలిసి ఉన్న నాయకుడు.
* ఇక తెలంగాణ విమోచన సమితి ఏర్పాటు చేసుకున్న దిలీప్‌ కెసిఆర్‌కు చాలా కాలం పిఎస్‌గా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు.
* ఇక కెకె మహేందర్‌ రెడ్డి కెసిఆర్‌ ఇంట్లోనే ఎక్కువ కాలం గడిపిన వారు. ఆయన కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. టిఆర్‌ఎస్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేత.
* రవీంద్ర నాయక్‌ గిరిజన నేతగా కెసిఆర్‌కు ఆప్తుడైన నాయకుడు. బంజారా గాంధీ అంటూ నాయక్‌ను అక్కున చేర్చుకున్న కెసిఆర్‌ చివరకు ఆయనకే చేయిచ్చారు.
* బెల్లయ్య నాయక్‌ మహబూబ్‌ నగర్‌లో కెసిఆర్‌ గెలుపునకు కారకుడైన నాయకుడు.
కెసిఆర్‌కు సంబంధించిన బలాలు బలహీనతలు అన్నీ తెలిసిన ఈ నాయకులే ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్లే కాకుండా తెలంగాణా ధూంధాం నేత రసమయి బాలకిషన్‌, ఇతర మేధావులు కూడా కెసిఆర్‌కు దూరమయ్యారు. ఇప్పుడు ఆయన వెంట ఉన్నది, నడుస్తున్నది సిద్ధాంత కర్త కొత్తపల్లి జయశంకర్‌ మాత్రమే.
అందుకే గతంలో అసమ్మతి నాయకులను వెళ్లగొట్టినా, వారిపై తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేసినా కెసిఆర్‌ ఏది చెప్తే అది జరిగిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. వీళ్లను కెసిఆర్‌ ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాలి.
మరోపక్క అసమ్మతి వాదులైనా తమ వాదంపై గట్టిగా నిలబడగలరా అంటే అనుమానమే. ఒక ఉద్యమాన్ని కానీ, రాజకీయ పార్టీని కానీ ముందుకు నడపాలంటే ఆర్థిక, హార్థిక బలం అవసరం. దేవేందర్‌ గౌడ్‌ లాంటి పెద్ద నాయకుడే పార్టీని నడపలేక చిరంజీవితో విలీనం కావలసి వచ్చింది. ఈ విధమైన కారణాలే కెసిఆర్‌ నాయకత్వాన్ని కాపాడుతున్నాయి. అసమ్మతి నేతలు మీడియాలో హల్‌చల్‌ సృష్టించడం కంటే మించి ఏం చేయగలరన్నది జవాబు లేని ప్రశ్న. పైగా కెసిఆర్‌లో న్యాయపోరాటం చేస్తామని అసమ్మతి నాయకులు చెప్తున్నారు. దాని రూపం ఎలా ఉంటుందన్న దానిపై వారికి ఎలాంటి స్పష్టత లేదు. అంతే కాదు.. టిఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని పూర్తిగా మార్చాలంటున్న అసమ్మతివాదులు కెసిఆర్‌ లేకుండా ప్రత్యేక ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోగలమన్న విషయంపైనా క్లారిటీ ఉన్నట్లు కనిపించదు.... ఈనేపథ్యంలో అసమ్మతి వాదులు పోరాటం కొనసాగించగలరా? ఇంతకు ముందు నేతల్లా జారుకుంటారా అన్నది ఇప్పటికైతే సందేహమే...

లొల్లి ముదిరింది

తెలంగాణ లొల్లి ముదిరింది. పరిష్కరించటానికి వీల్లేనంతగా జటిలమైపోయింది... రెబల్‌‌స రెచ్చిపోయారు. సామరస్యంగా వ్యవహారాన్ని చక్కబెట్టాల్సిన టిఆర్‌ ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు చిక్కుముడులు వేసుకుంటూ వస్తున్నారు. టిఆర్‌ఎస్‌ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సీనియర్‌ నాయకుడు రవీంద్ర నాయక్‌ను కార్యకర్తలు వెంటపడి కొట్టి వెళ్ల గొట్టారు. పాపం రవీంద్రనాయక్‌ చిరిగిన చొక్కాతో, వచ్చిన కారులో తెలంగాణ భవన్‌ నుంచి పారిపోవలసి వచ్చింది. అసమ్మతి వాదులు సమావేశమవుతున్న మాజీ ఎమ్మెల్యే ఏ.చంద్రశేఖర్‌ ఇంటికి చేరుకున్న రవీంద్రనాయక్‌ కెసిఆర్‌పై విజృంభించారు. విరుచుకుపడ్డారు. ఆయన ఆగ్రహానికి, ఆవేశానికి అడ్డూ ఆపూ లేకుండా పోయింది. చిరిగిన చొక్కాను చూపుతూ, నిప్పులు చిమ్మారు. చంద్రశేఖర్‌ రావుతో ఇంతకాలం పనిచేసినందుకు తెలంగాణ ప్రజలకు ముక్కు నేలకు రాసి మరీ క్షమాపణ చెప్పారు. తనకు, తన ప్రజానీకాన్ని దారుణంగా అన్యాయం చేశారని కెసిఆర్‌పై దుమ్మెత్తి పోశారు. తనను వైఎస్‌ ఏజంటని విమర్శించటాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ ఆరోపణకు వైఎస్సే జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కెసిఆర్‌ కరడుగట్టిన దొర అని, తన తాతలు, ముత్తాతలు దొరల దగ్గర వెట్టి చేసినట్టే తనతో కూడా వెట్టి చేయించుకున్నారని తీవ్ర అభియోగాన్ని మోపారు. మొత్తం మీద కెసిఆర్‌తో అసమ్మతి వాదుల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. కెసిఆర్‌ను ఎలా ఎదుర్కోవాలో అసమ్మతి నేతలంతా తీవ్రంగా మంతనాలు జరుపుతున్నారు. కెసిఆర్‌ కూడా వాళ్ల ఎత్తుల్ని చిత్తు చేసేందుకు అంతే సీరియస్‌గా వర్కవుట్‌ చేస్తున్నారు. ఏమైతేనేం.. ఓటమితో కుంగిన టిఆర్‌ఎస్‌ను దెబ్బ తీసేందుకు వైఎస్‌ అసెంబ్లీ సాక్షిగా విసిరిన రాయి తగలాల్సిన చోటే తగిలినట్లుంది.
మొత్తం మీద టిఆర్‌ఎస్‌ అసమ్మతి వాదులు మీడియాలో పెద్ద హడావుడే సృష్టించారు. కెసిఆర్‌ కతను కంచికి చేర్చే దాకా నిద్రపోమని భీషణ ప్రతిజ్ఞలు చేశారు. చొక్కాలు చింపించుకున్నారు. ముక్కు నేలకు రాశారు. కెసిఆర్‌పై దుమ్మెత్తి పోశారు... పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టారు.. అంతలోనే ఉపసంహరించుకున్నారు. ఇక తరువాతి వూ్యహానికి పదును పెట్టేందుకు రాత్రంతా రహస్య మంతనాలు, చర్చలు, తర్జన భర్జనలు జరిగాయి. నిజానికి కెసిఆర్‌ను నిలువరించే సామర్థ్యం నిజంగా వీళ్లకు ఉందా? లేక గతంలో అసమ్మతి వాదుల మాదిరిగానే కొంతకాలం హల్‌చల్‌ సృష్టించి ఏదో ఒక పార్టీలో చేరిపోతారా? వూ్యహాత్మకంగా ముందుకు సాగటానికి వీరి ముందున్న అవకాశాలేమిటి? అన్నది ఇప్పటికైతే జవాబు దొరకని ప్రశ్నలే...

చేసుకున్న వారికి చేసుకున్నంత....

తెలంగాణకు సోల్‌ గుత్తేదార్లమనుకుంటున్న వాళ్ల లొల్లి ముదిరి పాకాన పడింది. సమ్మతి, అసమ్మతుల మధ్య గొడవ తాడో పేడో తేల్చుకునేదాకా వెళ్లింది. తమ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం కెసిఆర్‌ను తెలంగాణ భవన్‌ నుంచి వెళ్ల గొట్టేదాకా లొల్లి ఆపే ప్రసక్తే లేదన్న స్థాయిలో తిరుగుబాటు దారులు విజృంభించారు. రోజు రోజుకూ ఆయన వెన్నంటి ఉన్నవారి సంఖ్య తగ్గిపోతోంది. సంక్షోభం నుంచి బయటపడే దారి తెలియక చంద్రశేఖర్‌ రావు తల పట్టుకుంటున్నారు. చివరకు కెసిఆర్‌ తన కారును ఎలా ముందుకు తీసుకువెళ్తారన్నది అంతుచిక్కటం లేదు.
చివరకు గులాబీ పువ్వును దాని ముళ్లే గుచ్చి గుచ్చి విధ్వంసం చేస్తున్నాయి. ముళ్ల దాడిని ఎలా అడ్డుకోవాలో తోటమాలికి అర్థం కావటం లేదు. ఎనిమిదేళు్లగా నారుపోసి, నీరు పెట్టి పెంచి పోషించిన తెలంగాణ గులాబీ మొక్కలో ఒక్కో పువ్వే రాలిపోతుంటే తోటమాలి మాత్రం ఏమీ చేయలేక చేవచచ్చి నిర్లిప్తంగా చూస్తూ కూర్చున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఇది దర్పణం. ఒంటెత్తు పోకడలతో అర్థం లేని నిర్ణయాలతో, అంతుపట్టని వైఖరితో, ఒక రాజకీయ పార్టీని వంకరటింకర దారిలో నడిపిన ఫలితాన్ని కె.చంద్రశేఖర్‌ రావు అనుభవిస్తున్నారు. నియంతృత్వ పోకడలు ఎవరికీ విజయాన్ని తెచ్చిపెట్టవని కెసిఆర్‌ విషయంలో మరోసారి రుజువయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాల్ని చవిచూసినప్పటి నుంచి అసమ్మతివాదులు ఒక్కరొక్కరుగా గళం విప్పుతున్నారు. కెసిఆర్‌ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ దిలీప్‌తో లొల్లి మొదలైనా గుంభనంగానే సాగింది. కొంతమంది అసమ్మతివాదులతో కలిసి తెలంగాణ విమోచన సమితిని ఆయన ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంతలోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ వూ్యహాత్మకంగా కెసిఆర్‌పై దాడి చేయటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కెసిఆర్‌ను గుక్కతిప్పుకోకుండా చేశాయి. పూర్తిగా రక్షణాత్మక పరిస్థితిలో పడేశాయి. ఎప్పుడూ ఎదురుదాడికి అలవడ్డ కెసిఆర్‌కు వైఎస్‌ఆర్‌ ప్రకటన తరువాత అసలు మాట్లాడే పరిస్థితే లేకుండా పోయింది. అప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న నేత అప్పటికప్పుడు బయటపడి మొక్కుబడిగా ఖండించారు.
వైఎస్‌ వ్యాఖ్యలు, కెసిఆర్‌ డిఫెన్‌‌స.. తిరుగుబాటుదారులు రెచ్చిపోయేందుకు దోహదపడ్డాయి. ఇంకేముంది..... యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఏ. చంద్రశేఖర్‌ రావు, ఉమాదేవి, సోమిరెడ్డి ఇలా ఒకరి తరువాత ఒకరు అధినేతను నిలదీశారు.. ప్రశ్నలు సంధించారు.. జవాబులడిగారు..
అసమ్మతివాదుల ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు? జవాబు చెప్పటం కంటే, సస్పెన్షన్‌ వేటు సులభం కాబట్టి కెసిఆర్‌ ఆ పని వెంటనే చేసేశారు..
కానీ, అసమ్మతి వాదులను సస్పెండ్‌ చేసి ప్రశ్నలను సమాధి చేశామనుకుంటే అది పొరపాటే.. తెలంగాణ ఉద్యమానికి ఇంతకాలం బలాన్ని, బలగాన్ని అందిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజానీకాన్ని సమాధానపరచాల్సిన బాధ్యత కెసిఆర్‌పైనే ఉంది.
అసమ్మతి సెగ ఈరోజు తెలంగాణ భవన్‌ను తాకింది. మంటలు మరింత రేగకముందే దాన్ని ఆపటం, పార్టీ కేడర్‌లో మళ్లీ విశ్వాసాన్ని పెంచటం కెసిఆర్‌ బాధ్యత.

14, జూన్ 2009, ఆదివారం

వైద్యులు నిరసన వ్యక్తం చేయటానికి సమ్మె తప్ప ప్రత్యామ్నాయం లేదా?....

జూనియర్‌ డాక్టర్లు మరోసారి సమ్మె నిర్వహించారు. ఈసారి ఇది రాష్ట్ర వ్యాప్తం కాకపోవటం మన అదృష్టం. దాదాపు ప్రతి ఏడాదీ ఏదో ఒక కారణంతో జూనియర్‌ వైద్యులు సమ్మె బాట పడుతూనే ఉన్నారు. పలుమార్లు న్యాయస్థానం జోక్యం చేసుకుని సమ్మె విరమింపజేయాల్సి వచ్చింది. వైద్య సేవలు అనేవి అత్యవసర పరిధిలోకి వచ్చేవి. అలాంటి అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే వైద్యులు ఒక్క రోజు సమ్మె చేసినాఅది రోగుల ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుంది. అలాంటి వైద్యులు తమ సమస్యల పరిష్కారానికి, నిరసన వ్యక్తం చేయటానికి, సమ్మె తప్ప ప్రత్యామ్నాయం లేదా? వాస్తవానికి జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేస్తే దాని వల్ల రోగులకు నష్టం రావటం ఏమిటి? జూనియర్‌ డాక్టర్లు అంటే వైద్య విద్యార్థులు అని స్పష్టమైన అర్థం. వైద్య విద్యను నేర్చుకునే దశలో ఉన్న విద్యార్థులు సమ్మె బాట పడితే, ప్రభుత్వాసుపత్రులు బోసిపోవటం విచిత్రం కాదు.. మన రాష్ట్రంలో ఇది సహజం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు భర్తీ కావు కాబట్టి, జూనియర్‌ డాక్టర్లకే డ్యూటీలు వేసి వైద్యం చేయిస్తారు. ఇదేమిటని ఎవరూ అడగరు.. ప్రభుత్వం పబ్లిగ్గా చేసే పని. అందరికీ ఆరోగ్యం అంటూ, ఆరోగ్యశ్రీ అంటూ కార్పోరేట్‌ వైద్యశాలలకు కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టే ప్రభుత్వానికి ప్రభుత్వాసుపత్రులను కార్పోరేట్‌ ఆసుపత్రుల స్థాయికి చేర్చాలన్న ఆలోచన మాత్రం రాదు. ఫలితం... ఏం చెప్పేది.. ఎవరికి చెప్పేది. ఒక సారి వివరాలు చూడండి..
జూనియర్‌ డాక్టర్లు సమ్మె
2003లో 43 రోజుల పాటు జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేశారు.
2004జనవరిలో దాదాపు 25 రోజుల పాటు జూడాల సమ్మె జరిగింది.
2004 జూలైలో ఏడు రోజుల పాటు జూడాలు సమ్మె చేశారు.
2004 అక్టోబర్‌లో డివిఆర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు గాంధీ హాస్పిటల్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించటంతో మరోసారి జూడాలు సమ్మె చేశారు. తెలుగు టివి చానల్‌ సిబ్బంది సంచలనం సృష్టించేందుకు విద్యార్థులను రెచ్చగొట్టారని ఆరోపించారు.
2005 జూన్‌ 23 నుంచి ఎనిమిది రోజుల పాటు సమ్మె చేశారు.
2005 జూలై14న అంటే నెల రోజులుకూడా కాకుండానే మరోసారి ఆరురోజుల పాటు సమ్మె జరిగింది. హైకోర్టు జోక్యంతో అప్పుడు జూడాలు సమ్మె విరమించారు.
2006 ఏప్రిల్‌ లో పది రోజుల పాటు జూడాలు సమ్మె చేశారు. అప్పుడు కూడా హైకోర్టు సమ్మె విషయంలో జోక్యం చేసుకోవలసి వచ్చింది.
2007 డిసెంబర్‌లో ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే అఫ్సర్‌ ఖాన్‌ జూనియర్‌ డాక్టర్‌ను కొట్టారన్న కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేశారు.
2009 జూన్‌ 10న గాంధీ ఆసుపత్రిలో మరోసారి జూడాల సమ్మె రెండు రోజుల పాటు జరిగింది.


వివిధ సందర్భాల్లో జూనియర్‌ డాక్టర్లు చేసిన ప్రధాన డిమాండ్లు....
2004లో ....
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరి రోజుల్లో జరిగిన సమ్మె.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాబు సర్కారు అమలు చేసిన యూజర్‌ చార్జీలను రద్దు చేయాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేశారు.
వైద్యవిద్యను ప్రైవేటైజేషన్‌, కమర్షియలైజేషన్‌ దిశగా తీసుకువెళ్లే జీవో నెం. 90ని రద్దు చేయాలని కూడా వారు అప్పుడు డిమాండ్‌ చేశారు.
2005లో...
తెలుగుదేశం హయాంలో అనుమతించిన మెడికల్‌ కాలేజీలను సీల్‌ చేయడాన్ని జూడాలు వ్యతిరేకించారు. పదిహేను మెడికల్‌ కాలేజీలకు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్లు పునరుద్ధరించాలని కోరారు.
టీచింగ్‌ మెడికల్‌ కాలేజీల్లో రెసిడెన్షియల్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.
గుర్తింపు లేని పిజి సీట్లకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.
ప్రైవేటు మెడికల్‌ కాలేజీల పనితీరును పర్యవేక్షించేందుకు మాజీ నిమ్‌‌స డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు కమిటీని తిరిగి నియమించాలని కూడా డిమాండ్‌ చేశారు. (తెలుగుదేశం హయాంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీని అప్పుడు వైఎస్‌ సర్కారు రద్దు చేసింది. )
రద్దు చేసిన యూజర్‌ చార్జీలకు బదులుగా ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వ ఆసుపత్రులకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాను, మేనేజిమెంట్‌ కోటాను పెంచటాన్ని కూడా జూడాలు వ్యతిరేకించారు.
జూడాల సమ్మెను రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. సమ్మె విరమించి తమ సమస్యల పరిష్కారం కోసం జూడాలు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయమని ఆదేశించింది. హైకోర్టు ఒత్తిడితోనే జూడాలు సమ్మెను విరమించారు.

2006లో...
పోస్‌‌ట గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు సంవత్సరాల పాటు తప్పనిసరిగా పనిచేస్తామని బాండ్‌పై సంతకం చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను జూడాలు తీవ్రంగా వ్యతిరేకించారు. బాండ్‌ను ఉల్లంఘిస్తే 20 లక్షల రూపాయల జరిమానా కూడా విధించే నిబంధనను ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై లక్షలాది రూపాయలు ఖర్చు చేసి డాక్టర్లను తయారు చేస్తుంటే వారు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయకుండా వెళ్లిపోవటాన్ని నియంత్రించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, దీన్ని జూడాలు ఆమోదించలేదు.
ఇన్‌ సర్వీస్‌ డాక్టర్లకు తొమ్మిది మార్కులు అదనంగా కలపాలని జారీ చేసిన జిఓ నెం. 19ని రద్దు చేయాలని కూడా వారు డిమాండ్‌ చేశారు.

2007లో..
డిసెంబర్‌ 15న నయాపూల్‌ ఆసుపత్రిలో కార్వాన్‌ ఎమ్మెల్యే అఫ్సర్‌ ఖాన్‌ డాక్టర్‌ కామాక్షి అనే ఓ హౌస్‌ సర్జన్‌పై చేయి చేసుకున్నారు. దీన్ని నిరసిస్తూ జూడాలు సమ్మె చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయాలన్నది ఆనాటి వారి ప్రధాన డిమాండ్‌...
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్‌‌సను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
దీని ఫలితంగా వైఎస్‌ ప్రభుత్వం డాక్టర్లను పబ్లిక్‌ సర్వంట్‌‌సగా గుర్తిస్తూ ప్రత్యేగ ఆర్డినెన్‌‌సను జారీ చేసింది. వీరిపై ఎవరు దాడి చేసినా వారిపై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేస్తూ నిబంధన విధించింది. జూనియర్‌ డాక్టర్లను కూడా ఈ ఆర్డినెన్‌‌స పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్‌‌స ప్రకారం దోషులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడుతుంది.
డాక్టర్లకు తమ రక్షణ కోసం ఆయుధాలు ఉంచుకునే లైసెన్‌‌సలు ఇవ్వాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది.
2009 జూన్‌
మళ్లీ జూడాలపై దాడి జరిగింది. తమకు రక్షణ లేదంటూ జూడాలు మరోసారి సమ్మె బాట పట్టారు.
ఈ నేపథ్యంలో అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే వైద్యులు తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? ఆలోచించండి.





కమలనాథుల కప్పల తక్కెడ


పరివారానికి ఇప్పుడు ఓ కొత్త అనుబంధ సంస్థ కావాలి. ఇంతకాలం తనకు రాజకీయ బలాన్ని బలగాన్ని అందించిన భారతీయ జనతాపార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. వరుస పరాజయాలు పార్టీ దిగ్గజాల శక్తి సామర్థా్యలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒకరిని ఒకరు నిందించుకుంటూ.. అంతర్గత కుము్మలాటలతో సతమతమవుతోంది. రాజకీయంగా ఆత్మరక్షణలో పడిన కమలనాథులు పయనం ఏ దిశగా సాగుతోంది? పరివర్తన దిశలోనా...? పతనం దిశగానా?
***
భారత రాజకీయాల్లో మాది విభిన్నమైన పార్టీ...వ్యక్తి పూజకు ఆస్కారం లేని పార్టీ... అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చే పార్టీ.. అని కమలనాథులు ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే రొటీన్‌ మాటలు... 2004లో గుడ్‌ గవర్నెన్‌‌స పేరుతో ముందస్తు ఎన్నికలకు పోయి బోర్లా పడ్డ బిజెపి.. 2009లో అద్వానీని తెరమీదకు తెచ్చి హైటెక్‌ ప్రచారం అద్భుతంగా చేసినా కించిత్‌ ఫలితం కూడా లేకపోయింది. చివరకు తాను అధికారంలో ఉన్న రాషా్టల్ల్రోనైనా తగినన్ని సీట్లు తెచ్చుకోలేకపోయింది. అయిదేళ్లలో యుపిఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరకు తీసుకుపోవటంలో సమష్టిగా విఫలమైన బిజెపి నేతలు ఓటమికి ఎవరు బాధ్యులో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. నీవంటే, నీవని సిగపట్లు పడుతున్నారు. సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా తాజాగా పార్టీని విడిచిపెట్టడం భారతీయ జనతాపార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితికి నిలువెత్తు దర్పణం.
1996లో తొలిసారి అధికారంలోకి రానంతవరకు బిజెపి నేతలంతా ఒక్కమాటపై నిలబడి, ఒక్కతాటిపై నడిచినవారే... వాస్తవానికి వారికా అధికారం కూడా ఊరిస్తూ, ఊరిస్తూ వచ్చింది. మొదట రెండు సీట్లు, ఆ తరువాత 80 సీట్లు.. ఆ తరువాత 140 సీట్లు ఇలా నెమ్మది నెమ్మదిగా వాళ్ల బలం పెరిగినట్లే.. అధికారం కూడా మొదట పదమూడు రోజులు, తరువాత పదమూడు నెలలు, ఆ తరువాత పూర్తి ఆధిపత్యం లభించింది. పవర్‌ పవరేమిటో ఒకసారి తెలిసిన తరువాత ఓటమి బాధను బిజెపి ఎంతమాత్రం తట్టుకోలేకపోతున్నది.
2004లో ఓటమి తరువాత వాజపేయి తెరమరుగైపోయారు. ఎంతోకాలంగా అధికారం కోసం అర్రులు చాస్తున్న అద్వానీ రంగంమీదకు వచ్చారు. గత అయిదేళ్లలో ఉమాభారతి, మదన్‌లాల్‌ ఖురానా, గోవిందాచార్య వంటి నేతలను దూరం చేసుకుంది. సాహిబ్‌ సింగ్‌వర్మ, ప్రమోద్‌ మహాజన్‌ వంటివారిని కోల్పోయింది. అద్వానీ జిన్నా ప్రకటనలు, గుజరాత్‌లో విహెచ్‌పితో మోడీ గొడవతో పరివారం బిజెపికి దూరమైంది. చివరకు మొన్నటి ఎన్నికలు దగ్గరపడేసమయానికి పార్టీకి సరైన వూ్యహకర్తలే కరవయ్యారు. ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూసినవారే... పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీల మధ్య ఘర్షణ ఒక దశలో పతాక స్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ గొడవ పార్టీ ప్రతిష్ఠను మరింత మంటగలిపింది. వరుణ్‌గాంధీ వివాదం మరింత దిగజార్చింది. ఫలితాలు వెల్లడైన తరువాత అద్వానీ అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన చోటామోటా నేతలా రాజకీయ సన్యాసం అంటూ ఒక రోజు సీన్‌ క్రియేట్‌ చేశారు.. నేతలంతా పోయి ఒప్పించగానే ఇక తప్పేదేముందంటూ మళ్లీ రంగంమీదకు వచ్చారు. ప్రతిపక్ష నేత కుర్చీ ఎక్కారు. ఇంతవరకు బాగానే ఉంది. బిజెపికి అధ్యక్షుడు ఎవరైనా అద్వానీ కనుసన్నల్లోనే నడవాల్సిందే. అలాంటప్పుడు పార్టీ ఓటమికి బాధ్యత వహించాల్సిన అద్వానీ ఆ పని చేయలేదు. కనీసం ఓటమిపై చిత్తశుద్ధితో సమీక్ష అయినా జరిపారా అంటే అదీ లేదు. యశ్వంత్‌ సిన్హా వంటి సీనియర్ల ప్రశ్నలకు జవాబు చెప్పేవారే లేరు. ఈయనతో మొదలైన రాజీనామాల పరంపర ఇంకా కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇప్పటికే పార్టీ కేడర్‌ పూర్తిగా నిస్సత్తువగా మారింది. ఈ దశలో ఓటమికి కారణాలను నిబద్ధతతో విశ్లేషించి కేడర్‌లో మళ్లీ ఉత్సాహం నింపాల్సిన బిజెపి నేతలు న్యూఢిల్లీ అశోక రోడ్‌లోని తమ కార్యాలయంలో కూర్చుని తీరిగ్గా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.. కమలనాథుల బెకబెకలతో బిజెపి ఆఫీసు కప్పల తక్కెడలా మారింది.



6, జూన్ 2009, శనివారం

మళ్లీ తెరపైకి మహిళా బిల్లు ...ఇదో రాజకీయం

వంద రోజుల్లో మహిళాబిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా చూస్తామని రాష్టప్రతి ప్రసంగం ద్వారా యుపిఏ సర్కారు తాజాగా ప్రకటించింది. కనీసం ఈసారైనా బిల్లు ఆమోదం పొందుతుందా? బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు సమాజ్‌వాది అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఇప్పటికే ప్రకటించారు. బిల్లును ఆమోదిస్తే సభలోనే విషం తాగి చస్తానని యునైటెడ్‌ జనతాదళ్‌ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందటం సాధ్యమేనా? ఓవైపు 33.3శాతం బిల్లే ఇన్ని సార్లు మురిగిపోతుంటే, యుపిఏ సర్కారు మహిళల కోసం మరిన్ని హామీలనిచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామన్నారు. . అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల సాధికారతకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమాలను మరింత సమన్వయంతో అమలు చేస్తారు. ఇందుకోసం జాతీయ మిషన్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్దేశాలు మంచిగనే ఉన్నాయి. కానీ ఇవి ఎంతవరకు అమలవుతాయి? అన్నదే అనుమానం...చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన పాతదే అయినప్పటికీ, 1996 నాటికి కానీ అది ఒక బిల్లు రూపంలోకి రాలేదు. 1996లో తొలిసారి లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఉంది.తొలిసారి 1996 సెప్టెంబర్‌ 12న దేవెగౌడ సర్కారు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పుడు ఏకాభిప్రాయం కుదరలేదన్న కారణంతో బిల్లు ఆమోదం పొందలేదు. పెండింగ్‌లో పడిపోయింది. ఇక్కడ ఏకాభిప్రాయం కుదరకపోవటానికి ప్రధాన కారణం రాష్ట్రీయ జనతాదళ్‌, సమాజ్‌వాది పార్టీ వంటివి. జాతీయ పార్టీలు అంగీకరించినా, ఈ రెండు పార్టీలు ఒప్పుకోవటం లేదు... అప్పటి నుంచి ఇప్పటి దాకి మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. 1998లో అటల్‌ బిహారీ వాజపేయి సర్కారు రెండోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. (199884వ రాజ్యాంగ సవరణ బిల్లు) కానీ, పార్లమెంటు పూర్తి గడువు తీరకుండానే రద్దు కావటంతో బిల్లు మురిగిపోయింది. 1999లో మరోసారి మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. 1999 డిసెంబర్‌ 23న దిగువ సభలో బిల్లును ఎన్‌డిఏ సర్కారు ప్రవేశ పెట్టింది. రాజకీయ ఏకాభిప్రాయం అన్నది లేదన్న కారణంతో మరోసారి అది విఫలమైంది. 2008 మే ఆరో తేదీన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం వూ్యహాత్మకంగా రాజ్యసభలో తాజాగా రిజర్వేషన్‌బిల్లును ప్రవేశపెట్టింది. ఈ విషయంలో యుపిఏ సర్కారు చాలా తెలివిగా వ్యవహరించింది. ఒకవేళ 14వ లోక్‌సభ గడువు ముగిసినా, లేక రద్దయినా, బిల్లు మురిగిపోయే అవకాశం లేదు. ఎందుకంటే రాజ్యాంగంలోని 107(4) అధికరణం ప్రకారం విధాన మండలి, రాజ్యసభలో ఏదైనా ఒక బిల్లు పెండింగ్‌లో ఉండి, సదరు బిల్లు లోక్‌సభ పాస్‌ చేయకపోయినప్పటికీ అది డెడ్‌లెటర్‌గా మురిగిపోయినట్లు కాదు... అందువల్లే 14వ లోక్‌సభ రద్దయిన తరువాత కూడా రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి అక్కడ బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లే లెక్క. మన దేశంలో పార్లమెంటు నిబంధనల ప్రకారం రాజ్యాంగ సవరణలు ఏవి చేసినా పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల ద్వారా నిశితంగా పరిశీలించి, స్క్రూటినీ చేసి మరీ చేయాల్సి ఉంటుంది. విషయాన్ని బట్టి అవసరమైతే రాషా్టల్ర చట్టసభల సహకారం కూడా తీసుకోవాలి. దీని దృష్టా్య గత లోక్‌సభలో ఎంపి ఇఎం సుదర్శన నాచియప్పన్‌ నేతృత్వంలో పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇది ఇప్పటికే మూడు సార్లు గడువు పెంచుకుంది. ఇప్పుడు ఈ కమిటీ తన నివేదికను 15వ లోక్‌సభకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కమిటీ నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వందరోజుల్లో బిల్లు పాస్‌ చేస్తామని చెప్తున్నప్పటికీ, నిర్ణయం తీసుకోవటానికి ఈ ప్రభుత్వానికి ఎలాగూ అయిదేళు్ల గడువైతే ఉంది. బిల్లులో ప్రధానంగా ఉన్న విషయాలు ...రాష్ట్రాల శాసన సభల్లో, లోక్‌సభలో 33.3 శాతం కోటా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఇప్పటికే ఉన్న 22.5 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోటాకు ఇది అదనం...ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్‌ కోటాలోనూ మూడో వంతు మహిళలకే కేటాయించాలని బిల్లు చెప్తోంది. అంటే ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్‌ కోటా 22.5 శాతం ఉంది. ఇందులో 7.5శాతం మళ్లీ మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. మొత్తం మీద చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లు 33.3+7.5=40.8 శాతం అవుతుందన్నమాట. బిల్లుకు అనుకూలంగా సాగుతున్న వాదాలు... బిల్లు ద్వారా పార్లమెంటులో స్త్రీ పురుషులకు సమానావకాశాలు కల్పించవచ్చు. తద్వారా మహిళా సాధికారత పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రాతినిథ్యం పెరగటం వల్ల వివక్ష, వేధింపులకు వ్యతిరేకంగా వారు పోరాడ గలుగుతారు...బిల్లును వ్యతిరేకిస్తున్న వారు అంటున్న మాటలు.. బిల్లు వల్ల అగ్రవర్ణ మహిళలకే లాభం కలుగుతుంది. అధిక ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా పేద అణగారిన వర్గాల మహిళలు వివక్షకు గురవుతారు.లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వాదన...నేను, నాపార్టీ బిల్లును వ్యతిరేకించటం లేదు. అయితే మహిళలకు 33.3శాతం కోటా అవసరం లేదు. వారికి 10 నుంచి 15శాతం రిజర్వేషన్లు కల్పిస్తే చాలు...మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు ముస్లింలు, ఓబిసిలు, మైనారిటీలపై ఎందుకు వివక్ష చూపాలి?ములాయం సింగ్‌ యాదవ్‌ వాదన....మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందితే వారి 33.3శాతం, ఎస్సీ, ఎస్టీ కోటా 22.8 శాతంకలిపితే మొత్తం రిజర్వేషన్లు 55.8శాతం అవుతాయి. ఇలాంటి చర్య సమాజంలోని మిగతా వర్గాల వారి పట్ల వివక్ష చూపటమే అవుతుంది. లోక్‌సభలో ముస్లింలకు మాత్రం ఎందుకు రిజర్వేషన్‌ కల్పించకూడదు...? బిల్లుతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలే 10శాతం టిక్కెట్లను మహిళలకు స్వచ్చందంగా ఇవ్వాలి. అన్ని పార్టీలూ దీన్ని తప్పనిసరిగా పాటించాలి.15లోక్‌సభలో 59 మంది మహిళలు ఉన్నారు. అంటే దాదాపు 10.8శాతం మహిళలు లోక్‌సభలో ఉన్నారు. 13వ అంధ్రప్రదేశ్‌ శాసన సభలో 34 మంది మహిళలు ఉన్నారు. 294 సభ్యులున్న మన శాసనసభలో మహిళల శాతం 11.5శాతం. రాష్టప్రతిగా(ప్రతిభాదేవీ సింగ్‌ పాటిల్‌,) లోక్‌సభ స్పీకర్‌గా(మీరాకుమార్‌) ప్రస్తుతం మహిళలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.యుపిఎ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కూడా మహిళయే...(సోనియాగాంధీ)రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో తొలిసారి ఆరుగురు మహిళలు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నారు.(కొండా సురేఖ, సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గల్లా అరుణకుమారి) కేంద్ర కేబినెట్‌లో ప్రస్తుతం ఉన్న మహిళా మంత్రుల సంఖ్య 8. అంతకు ముందు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన మీరాకుమార్‌ రాజీనామా చేసి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడున్న మంత్రులు పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, కుమారి షెల్జా, అంబికాసోనీ, అగాథా సంగ్మా, మమతా బెనర్జీ, కృష్ణతీర్థ, ప్రణీత్‌ కౌర్‌....దేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌,(మమతాబెనర్జీ) బహుజన్‌ సమాజ్‌ పార్టీ,(మాయావతి) ఆలిండియా అన్నాడిఎంకె,(జయలలిత) పీపుల్‌‌స డెమొక్రాటిక్‌ పార్టీ(మహబూబా ముఫ్తీ), భారతీయ జనశక్తి పార్టీ(ఉమాభారతి) లకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. ఇదీ దేశంలో మహిళా రాజకీయ శక్తి... ఇందరు సబలలు ఉండగా రిజర్వేషన్లు పదమూడేళు్లగా సాగిలపడటానికి కారణం ఏమిటి?