14, జూన్ 2009, ఆదివారం

వైద్యులు నిరసన వ్యక్తం చేయటానికి సమ్మె తప్ప ప్రత్యామ్నాయం లేదా?....

జూనియర్‌ డాక్టర్లు మరోసారి సమ్మె నిర్వహించారు. ఈసారి ఇది రాష్ట్ర వ్యాప్తం కాకపోవటం మన అదృష్టం. దాదాపు ప్రతి ఏడాదీ ఏదో ఒక కారణంతో జూనియర్‌ వైద్యులు సమ్మె బాట పడుతూనే ఉన్నారు. పలుమార్లు న్యాయస్థానం జోక్యం చేసుకుని సమ్మె విరమింపజేయాల్సి వచ్చింది. వైద్య సేవలు అనేవి అత్యవసర పరిధిలోకి వచ్చేవి. అలాంటి అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే వైద్యులు ఒక్క రోజు సమ్మె చేసినాఅది రోగుల ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుంది. అలాంటి వైద్యులు తమ సమస్యల పరిష్కారానికి, నిరసన వ్యక్తం చేయటానికి, సమ్మె తప్ప ప్రత్యామ్నాయం లేదా? వాస్తవానికి జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేస్తే దాని వల్ల రోగులకు నష్టం రావటం ఏమిటి? జూనియర్‌ డాక్టర్లు అంటే వైద్య విద్యార్థులు అని స్పష్టమైన అర్థం. వైద్య విద్యను నేర్చుకునే దశలో ఉన్న విద్యార్థులు సమ్మె బాట పడితే, ప్రభుత్వాసుపత్రులు బోసిపోవటం విచిత్రం కాదు.. మన రాష్ట్రంలో ఇది సహజం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు భర్తీ కావు కాబట్టి, జూనియర్‌ డాక్టర్లకే డ్యూటీలు వేసి వైద్యం చేయిస్తారు. ఇదేమిటని ఎవరూ అడగరు.. ప్రభుత్వం పబ్లిగ్గా చేసే పని. అందరికీ ఆరోగ్యం అంటూ, ఆరోగ్యశ్రీ అంటూ కార్పోరేట్‌ వైద్యశాలలకు కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టే ప్రభుత్వానికి ప్రభుత్వాసుపత్రులను కార్పోరేట్‌ ఆసుపత్రుల స్థాయికి చేర్చాలన్న ఆలోచన మాత్రం రాదు. ఫలితం... ఏం చెప్పేది.. ఎవరికి చెప్పేది. ఒక సారి వివరాలు చూడండి..
జూనియర్‌ డాక్టర్లు సమ్మె
2003లో 43 రోజుల పాటు జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేశారు.
2004జనవరిలో దాదాపు 25 రోజుల పాటు జూడాల సమ్మె జరిగింది.
2004 జూలైలో ఏడు రోజుల పాటు జూడాలు సమ్మె చేశారు.
2004 అక్టోబర్‌లో డివిఆర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు గాంధీ హాస్పిటల్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించటంతో మరోసారి జూడాలు సమ్మె చేశారు. తెలుగు టివి చానల్‌ సిబ్బంది సంచలనం సృష్టించేందుకు విద్యార్థులను రెచ్చగొట్టారని ఆరోపించారు.
2005 జూన్‌ 23 నుంచి ఎనిమిది రోజుల పాటు సమ్మె చేశారు.
2005 జూలై14న అంటే నెల రోజులుకూడా కాకుండానే మరోసారి ఆరురోజుల పాటు సమ్మె జరిగింది. హైకోర్టు జోక్యంతో అప్పుడు జూడాలు సమ్మె విరమించారు.
2006 ఏప్రిల్‌ లో పది రోజుల పాటు జూడాలు సమ్మె చేశారు. అప్పుడు కూడా హైకోర్టు సమ్మె విషయంలో జోక్యం చేసుకోవలసి వచ్చింది.
2007 డిసెంబర్‌లో ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే అఫ్సర్‌ ఖాన్‌ జూనియర్‌ డాక్టర్‌ను కొట్టారన్న కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేశారు.
2009 జూన్‌ 10న గాంధీ ఆసుపత్రిలో మరోసారి జూడాల సమ్మె రెండు రోజుల పాటు జరిగింది.


వివిధ సందర్భాల్లో జూనియర్‌ డాక్టర్లు చేసిన ప్రధాన డిమాండ్లు....
2004లో ....
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరి రోజుల్లో జరిగిన సమ్మె.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాబు సర్కారు అమలు చేసిన యూజర్‌ చార్జీలను రద్దు చేయాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేశారు.
వైద్యవిద్యను ప్రైవేటైజేషన్‌, కమర్షియలైజేషన్‌ దిశగా తీసుకువెళ్లే జీవో నెం. 90ని రద్దు చేయాలని కూడా వారు అప్పుడు డిమాండ్‌ చేశారు.
2005లో...
తెలుగుదేశం హయాంలో అనుమతించిన మెడికల్‌ కాలేజీలను సీల్‌ చేయడాన్ని జూడాలు వ్యతిరేకించారు. పదిహేను మెడికల్‌ కాలేజీలకు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్లు పునరుద్ధరించాలని కోరారు.
టీచింగ్‌ మెడికల్‌ కాలేజీల్లో రెసిడెన్షియల్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.
గుర్తింపు లేని పిజి సీట్లకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.
ప్రైవేటు మెడికల్‌ కాలేజీల పనితీరును పర్యవేక్షించేందుకు మాజీ నిమ్‌‌స డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు కమిటీని తిరిగి నియమించాలని కూడా డిమాండ్‌ చేశారు. (తెలుగుదేశం హయాంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీని అప్పుడు వైఎస్‌ సర్కారు రద్దు చేసింది. )
రద్దు చేసిన యూజర్‌ చార్జీలకు బదులుగా ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వ ఆసుపత్రులకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాను, మేనేజిమెంట్‌ కోటాను పెంచటాన్ని కూడా జూడాలు వ్యతిరేకించారు.
జూడాల సమ్మెను రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. సమ్మె విరమించి తమ సమస్యల పరిష్కారం కోసం జూడాలు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయమని ఆదేశించింది. హైకోర్టు ఒత్తిడితోనే జూడాలు సమ్మెను విరమించారు.

2006లో...
పోస్‌‌ట గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు సంవత్సరాల పాటు తప్పనిసరిగా పనిచేస్తామని బాండ్‌పై సంతకం చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను జూడాలు తీవ్రంగా వ్యతిరేకించారు. బాండ్‌ను ఉల్లంఘిస్తే 20 లక్షల రూపాయల జరిమానా కూడా విధించే నిబంధనను ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై లక్షలాది రూపాయలు ఖర్చు చేసి డాక్టర్లను తయారు చేస్తుంటే వారు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయకుండా వెళ్లిపోవటాన్ని నియంత్రించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, దీన్ని జూడాలు ఆమోదించలేదు.
ఇన్‌ సర్వీస్‌ డాక్టర్లకు తొమ్మిది మార్కులు అదనంగా కలపాలని జారీ చేసిన జిఓ నెం. 19ని రద్దు చేయాలని కూడా వారు డిమాండ్‌ చేశారు.

2007లో..
డిసెంబర్‌ 15న నయాపూల్‌ ఆసుపత్రిలో కార్వాన్‌ ఎమ్మెల్యే అఫ్సర్‌ ఖాన్‌ డాక్టర్‌ కామాక్షి అనే ఓ హౌస్‌ సర్జన్‌పై చేయి చేసుకున్నారు. దీన్ని నిరసిస్తూ జూడాలు సమ్మె చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయాలన్నది ఆనాటి వారి ప్రధాన డిమాండ్‌...
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్‌‌సను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
దీని ఫలితంగా వైఎస్‌ ప్రభుత్వం డాక్టర్లను పబ్లిక్‌ సర్వంట్‌‌సగా గుర్తిస్తూ ప్రత్యేగ ఆర్డినెన్‌‌సను జారీ చేసింది. వీరిపై ఎవరు దాడి చేసినా వారిపై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేస్తూ నిబంధన విధించింది. జూనియర్‌ డాక్టర్లను కూడా ఈ ఆర్డినెన్‌‌స పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్‌‌స ప్రకారం దోషులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడుతుంది.
డాక్టర్లకు తమ రక్షణ కోసం ఆయుధాలు ఉంచుకునే లైసెన్‌‌సలు ఇవ్వాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది.
2009 జూన్‌
మళ్లీ జూడాలపై దాడి జరిగింది. తమకు రక్షణ లేదంటూ జూడాలు మరోసారి సమ్మె బాట పట్టారు.
ఈ నేపథ్యంలో అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే వైద్యులు తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? ఆలోచించండి.





కామెంట్‌లు లేవు: