14, డిసెంబర్ 2009, సోమవారం

చీలిక దిశగా దేశం!

రాష్ట్ర విభజన జరుగుతుందో లేదో తెలియదు కానీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా 28ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ నిలువునా చీలిపోతున్నదా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టిడిపి నాయకులు ఆ దిశగానే ముందుకు వెళు్తన్నట్లు కనిపిస్తున్నది...

తెలంగాణ వస్తుందా? రాదా? సమైక్యాంధ్రప్రదేశ్‌ మనగలుగుతుందా? లేదా? వీటి వెనుక నిజానిజాలు ఎలా ఉన్నా, ఏది నిజమైనా, ఈ మొత్తం వ్యవహారం వల్ల పూర్తిగా ప్రభావితమైంది మాత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ రెండు ఉద్యమాల వల్ల తెలుగుదేశం పార్టీ నిట్ట నిలువునా చీలిపోయే పరిస్థితి దాపురించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అంగీకరించారు కూడా... ఆవేదనా వ్యక్తం చేశారు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినంత వరకు 2009 ఎన్నికలకు ముందు టిడిపి చేసిన ప్రకటన తప్ప ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇచ్చింది లేదు. ఆ ఇచ్చిన ప్రకటన కూడా ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తే మద్దతిస్తామన్నారు... తీరా తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించేసరికి ఏంచేయాలో పాలుపోలేదు.. ఓ పక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు తెలుగుదేశం పార్టీపై ఎక్కడలేని ఒత్తిడిని పెంచింది. టిడిపి ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా దూరమవుతూ వచ్చారు.. అప్పటిదాకా తెలంగాణ గురించి మాటమాత్రమైనా ప్రస్తావించని తెలంగాణలోని టిడిపి ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తుందని వాళు్ల కలలో కూడా ఊహించి ఉండరు.. కానీ, ఓ వైపు కేంద్రం ప్రకటించటం, మరోవైపు ఆంధ్ర ప్రతినిధులు తిరుగుబాట పట్టడంతో తెలంగాణ ప్రతినిధులు బహిరంగంగానే తెలంగాణకు అనుకూలంగా ముందుకు రావలసిన పరిస్థితి నెలకొంది.
చివరకు తెలుగుదేశం పార్టీకి తెలంగాణకోసం అంటూ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేసేదాకా వ్యవహారం వెళ్లింది...

మొత్తం మీద తెలుగుదేశం పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఇప్పుడు సమైక్యం, తెలంగాణ నినాదాల కంటే ఇల్లు చక్కబెట్టుకోవటం చంద్రబాబుకు పెద్ద సవాలుగా మారింది.

1 కామెంట్‌:

సమతలం చెప్పారు...

మంచి పరిణామం.