6, జనవరి 2010, బుధవారం

ఎస్సార్సీ చెప్పిందేమిటి?




రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కింద భారత ప్రభుత్వం 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌(ఎస్సార్సీ)ను నియమించింది. కమిషన్‌కు ఫజల్‌ అలీ నేతృత్వం వహించగా, కె.ఎం.పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రు సభ్యులుగా ఉన్నారు. 1955లో ఈ కమిషన్‌ నివేదిక సమర్పించింది. దీన్ని ఎస్సార్సీ నివేదికగా పేర్కొంటారు. ఇందులో ఇతర అంశాలతోపాటు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లోని సమస్యలను ప్రస్తావించారు. రెండు ప్రాంతాల కలయికకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్న వాదనలను పరిశీలించారు. కమిషన్‌ నివేదికలోని అంశాలు పేరాల సంఖ్యల వారీగా....

విశాలాంధ్ర అనుకూల వాదన
369)మనం పరిశీలించాల్సిన తదుపరి అంశం ప్రస్తుత హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల భవిష్యత్తు. ముఖ్యంగా విశాలాంధ్ర ఏర్పాటు డిమాండ్‌ నేపథ్యంలో దీన్ని చూడాలి.

370) ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆంధ్రా ఉద్యమం చరిత్ర గురించి ఇప్పుడు మనం లోతుగా చర్చించాల్సిన అవసరం లేదు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే, 1953 నాటి ఏర్పాటును శాశ్వత ఏర్పాటుగా నూతన రాష్ట్రంలోని ఆంధ్రులు, ముఖ్యంగా సర్కారు ప్రాంతం వారు భావించడం లేదు. నిజానికి కూడా విశాలాంధ్ర ఏర్పాటు వాదనను ఇంతవరకు సమగ్రంగా పరిశీలించలేదు.

371) తెలంగాణతో కూడిన విశాలాంధ్ర ఏర్పడితే కలిగే లాభాలు... చెప్పుకోదగిన స్థాయిలో సాగుభూమి, 3.2 కోట్ల మంది జనాభా, భారీ స్థాయిలో జల వనరులు, ఇంధన వనరులు, తగినంత ఖనిజ సంపద, విలువైన ముడి ఖనిజాలతో కూడిన రాష్ట్రం అవతరిస్తుంది. అత్యంత కష్టసాధ్యమైన, ఆందోళన కలిగిస్తున్న ఆంధ్రరాష్ట్ర శాశ్వత రాజధాని సమస్య కూడా తీరిపోతుంది. హైదరాబాద్‌-సికిందరాబాద్‌ జంట నగరాలు విశాలాంధ్ర రాజధానిగా బాగా సరిపోతాయి.

372) మరో లాభం కృష్ణ, గోదావరి నదుల అభివృద్ధిని ఏకీకృత నియంత్రణలోకి తీసుకొచ్చే వీలుండటం. కృష్ణ, గోదావరి ప్రాజెక్టులు భారత్‌లోకెల్లా సమున్నతమైన ప్రాజెక్టుల సరసన నిలుస్తాయి. వివిధ కారణాల వల్ల నిష్క్రియగా సుదీర్ఘ కాలాన్ని వృధాచేసిన తర్వాత ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ సంధికాలంలో డెల్టా ప్రాంతంలో మాత్రమే ఆనకట్టలు నిర్మించారు. వాటికి సాంకేతిక, పాలనా పరమైన కారణాలున్నాయి. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్ని మొత్తం ఏకీకృతం చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, తెలంగాణ అనే ఒక స్వతంత్ర రాజకీయ పరిధిని తొలగించ గలిగితే (ఎలిమినేటెడ్‌) ఈ రెండు గొప్ప నదుల తూర్పు పరీవాహక ప్రాంతాల్లో సాగునీటి ప్రణాళికల రచన, అమలును మరింత వేగవంతం చేయొచ్చు. విశాలాంధ్రలో భాగమయ్యే తెలంగాణ ఈ అభివృద్ధి వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లాభపడుతుంది. ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణ విలీనానికి అనుకూలంగా చెప్పడానికి చాలా ఉంది.

373) ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణను ఆర్థికంగా అనుసంధానం చేయడం కూడా అంత ప్రాధాన్యం లేని అంశమేమీ కాదు. తెలంగాణ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా ఆహార ధాన్యాల సరఫరాలో లోటును ఎదుర్కొంటోంది. ప్రస్తుత ఆంధ్రరాష్ట్రం సాధారణంగా మిగుల్లో ఉంటోంది. మిగులు ధాన్యాలను తెలంగాణ ప్రాంతం వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రరాష్ట్రంలో బొగ్గులేదు. సింగరేణి నుంచి సరఫరా చేయొచ్చు. ప్రత్యేక రాష్ట్రంగా ఉండకపోతే తెలంగాణ ప్రాంతం తన సాధారణ పాలనా ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చు.

374) పెద్దసంఖ్యలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని వ్యక్తులు, ప్రజా సంస్థలు చాలాకాలంగా భావోద్వేగాల పరంగా సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో విశాలాంధ్ర ఏర్పాటు ఆదర్శవంతమైనది. అందుకు విరుద్ధంగా బలమైన కారణాలు ఉంటే తప్ప ఈ(విశాలాంధ్ర) సెంటిమెంట్‌ పరిగణనలోకి తీసుకోవడానికి అర్హమైనదే.

తెలంగాణ అనుకూల వాదన
375) విశాలాంధ్ర వాదనలు ఆ విధంగా ఒప్పించే విధంగా ఉన్నాయి. అయితే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూల వాదనలు కూడా అంత తేలిగ్గా కొట్టిపారేయలేని విధంగానే ఉన్నాయి.

376) ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రరాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజల నుంచి తలసరి పన్ను ఆదాయం తక్కువ. మరోవైపు తెలంగాణకు ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు బహుతక్కువ. తెలంగాణలో భూమి పన్ను ఆదాయం ఎక్కువ. మద్యం మీద ఏటా రూ.5 కోట్ల ఆదాయం వస్తుంది. రెండు ప్రాంతాల ప్రభుత్వ ఆదాయాల్లో తేడాకు ఇదే కారణం. చెబుతున్న కారణం ఏదైనప్పటికీ... తెలంగాణ స్థిర ఆదాయ వనరుల నుంచి వచ్చే మొత్తాలను ఏకీకరణ తర్వాత ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక అస్థిరతల వంటి పరిస్థితుల్లో ఉమ్మడి అభివృద్ధి పథకాలకు వెచ్చించే అవకాశం ఉందని తెలంగాణ నేతలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రగతి పథంలో ఉన్నట్లు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రాంతానికి ఈ ఏకీకరణ వల్ల పాలనాపరంగా ఎలాంటి లాభం ఉండదనే వాదన ఉంది.

377) భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుంటే... తమప్రాంత డిమాండ్లను విశాలాంధ్రలో అంతగా పట్టించుకోరేమోననే భయం తెలంగాణలో వ్యక్తం అవుతోంది. ఉదాహరణకు నందికొండ (కృష్ణానది), కుష్టాపురం(గోదావరినది) ప్రాజెక్టులు తీసుకుంటే ఇవి తెలంగాణలోనే కాకుండా యావత్‌ భారతదేశంలో చేపట్టిన అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుల కోవకు చెందినవి. అదే సమయంలో ఈ రెండు నదులపై కోస్తా డెల్టాలో సాగునీటి పారుదలకూ ప్రణాళికలు తయారు అవుతున్నాయి. అందుకే, తెలంగాణ ఈ రెండు నదులకు సంబంధించి తన ప్రాంత స్వతంత్ర జల వినియోగ హక్కులను వదులు కోవడానికి ఇష్టపడటం లేదు.

378) కోస్తాకు చెందిన ఆధునికులు దోపిడీ చేస్తారేమోనన్న అనుమానం విద్యాపరంగా వెనుకబడిన తెలంగాణ ప్రజల్లో నెలకొనడం విశాలాంధ్రపై వ్యతిరేకతకు ముఖ్యమైన కారణాల్లో ఒకటి కావొచ్చు. హైదరాబాద్‌ను దాటితే తెలంగాణ జిల్లాల్లో విద్యారంగం దారుణంగా వెనుకబడి ఉంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో కనీస విద్యార్హతలు ఆంధ్రా ప్రాంతంతో పోలిస్తే తక్కువగా ఉండేవి. తెలంగాణ ప్రజల అసలు భయమేంటంటే... ఆంధ్రరాష్ట్రంతో కలిస్తే తమను ఆంధ్రా వాళ్లకన్నా తక్కువ స్థానంలో ఉంచుతారని, ఈ భాగస్వామ్యంలో ప్రధాన వాటాదారైన ఆంధ్రా అన్ని రకాలుగా తక్షణమే లబ్ధి పొందుతుందని, వాణిజ్యరంగంలో ఆరితేరిన కోస్తాంధ్రకు తెలంగాణ వలసప్రాంతంగా(కాలనీ) మారుతుందేమోనని.

379) తెలంగాణ తనకు తానుగా ఒంటరిగా మనగలిగిన సుస్థిర రాష్ట్రం అవుతుందనే వాదన వినిపిస్తున్నారు. ఈ ప్రాంత రెవెన్యూ వసూళ్లు రూ.17 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్మాణానికి తెచ్చే భారీ అప్పులకు ఏటా చెల్లించాల్సిన వడ్డీల వల్ల కొత్త(తెలంగాణ) రాష్ట్రానికి పడే లోటు భారీగా ఏమీ ఉండబోదని విశ్వసిస్తున్నారు. అనుకూల పరిస్థితుల్లో ఆదాయం-ఖర్చు సమానం అయ్యే అవకాశం ఉందని, మిగులు బడ్జెట్‌ కూడా చూపించొచ్చనే వాదనలు ఉన్నాయి. అయితే, ఇది పూర్తిగా ఆశాజనకమైన భవిష్యత్‌ అంచనా. పలు కారణాలతో దీన్ని సమర్థించుకోవచ్చు.

380) మరో ముఖ్యమైన కారణం ఉంది. 1952 ఏప్రిల్‌ నాటి ఆర్థిక సంఘం సూచనలతో హైదరాబాద్‌ రాష్ట్రంలో భాగమైన తెలంగాణ చెప్పుకోదగ్గ స్థాయిలో లబ్ధి పొందింది. ప్రస్తుత విధానంలో మాత్రమే కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా ఇప్పటిలా గరిష్ఠంగా ఉంటుంది. తెలంగాణలో పరిస్థితులు మెరుగు పడినందున పోలీసు శాఖపై ఖర్చు తగ్గిస్తే దిగుమతుల పన్ను రద్దు వల్ల ఏర్పడుతున్న లోటు భర్తీ అవుతుంది. రాష్ట్రంలో పన్ను వసూళ్ల అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ ప్రాంత ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.

హైదరాబాద్‌ రాష్ట్రం
381) విశాలాంధ్ర ఏర్పాటు వల్ల లాభాలు స్పష్టం. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలను ఏకీకృత నియంత్రణ వ్యవస్థ కిందకు తెవాల్సిన అవసరం, తెలంగాణ-ఆంధ్రల మధ్య వాణిజ్య అనుబంధం, మొత్తం విశాలాంధ్ర ప్రాంతానికి రాజధానిగా హైదరాబాద్‌ సరిపోవడం... స్థూలంగా విలీనానికి చెప్పుకోదగ్గ అనుకూల అంశాలివి.

382) విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని సూచించడానికి అనుకూల అంశాలు చాలా ఉన్నాయి. ఈ లక్ష్య సాధనకు ఆటంకం కలిగించే ప్రయత్నాలేవీ జరగరాదు. ఇక్కడొక ముఖ్యమైన విషయం చెప్పదలచుకున్నాం. ఆంధ్రా మొత్తం విశాల రాష్ట్రానికి అనుకూలంగా బలంగా స్పందిస్తోంది. తెలంగాణలోనే ప్రజాభిప్రాయంలో ఇంకా స్థిరత్వం రాలేదు. ఆంధ్రాకు చెందిన ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే నేతలు కూడా ఈ ఏకీకరణను స్వాగతిస్తున్నారు. అయితే, కలయిక స్వచ్ఛందంగా జరగాలి. తమ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకొనే బాధ్యత తెలంగాణ ప్రజలదే.

383) విశాలాంధ్ర ఏర్పాటు జరిగితే తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు తగిన హామీలు ఇచ్చేందుకు ఆంధ్రరాష్ట్ర నేతలు సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకున్నాం. ఈ హామీలు (కోస్తా, సీమ నేతల మధ్య కుదిరిన శ్రీబాగ్‌ ఒడంబడిక లాంటి) ఒప్పందంగా రూపొందే అవకాశం ఉంది. విశాలాంధ్రలో ఏర్పడే ప్రభుత్వోద్యోగాల్లో కనీసం మూడో వంతు తెలంగాణ ప్రజలకు దక్కేట్లు చూడటం, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే హామీ ఇవ్వడం లాంటివి జరగొచ్చు.

384) ఈ దిశగా జరిగే ఏర్పాట్ల వివరాల్లోకి వెళ్లి జాగ్రత్తగా గమనించాం. శ్రీబాగ్‌ తరహా ఒప్పందం కానీ, బ్రిటన్‌లో స్కాట్లాండ్‌ విలీనం అయినప్పుడు ఇచ్చిన రాజ్యాంగ హామీ లాంటిది గానీ... తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చలేవు. తెలంగాణ ప్రత్యేక అవసరాలను తీర్చేచర్యలపై కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ తప్ప మరేదైనా నిరుపయోగమే. అలాంటి ఒప్పందాలను, ఏర్పాట్లను సూచించే బాధ్యత మాకు ప్రభుత్వం అప్పగించలేదు.
385) గమనంలో ఉంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఆంధ్ర రాష్ట్రం ఇటీవలే ఏర్పడింది. మార్పు దశలో ఒత్తిడి నుంచి ఇంకా కోలుకోలేదు. ఉదాహరణకు... భూసంస్కరణల విషయంలో అదింకా విధానాన్ని రూపొందించుకోలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన సందర్భంగా తలెత్తిన సమస్యలు ఇంకా సమసిపోలేదు. ఈ దశలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా తెలంగాణ, ఆంధ్రాల విలీనం రెండు ప్రాంతాలకు పాలనాపరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

386) ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మేం కొన్ని అవగాహనలకు వచ్చాం. ఆంధ్ర, తెలంగాణల ఉమ్మడి ప్రయోజనార్థం ప్రస్తుతానికయినా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలి. ఆంధ్రతో విలీనం అంశాన్ని 1961 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడే హైదరాబాద్‌ శాసనసభ చేపట్టే వీలు కల్పించాలి. హైదరాబాద్‌ శాసనసభ 2/3 మెజారిటీతో విలీనానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేయాలి.
387) ఈ ఏర్పాటులో లాభాలేమిటంటే... ఆంధ్రుల ఏకీకరణ ప్రక్రియకు ఈ ఆరేళ్లలో ఎవరూ ఆటంకాలు కల్పించకుంటే... రెండు ప్రభుత్వాలు తమ పాలనా యంత్రాంగాన్ని చక్కదిద్దుకుంటాయి. కుదిరితే తమ భూమి పన్ను విధానాలను సమీక్షించుకుంటాయి. రెండు ప్రాంతాల్లో ఏకీకృత విధానాల కోసం ప్రయత్నం చేస్తాయి. ఈ సంధికాలం విలీన భయాలను పారదోలేందుకు ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది. రెండు రాష్ట్రాల మధ్య నిజమైన కలయికకు అవసరమైన ఏకాభిప్రాయ సాధనకు సమయం దొరుకుతుంది.

388) ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాలు వారిని మరింత దగ్గర చేస్తాయని ఆశిస్తున్నాం. ఒకవేళ రెండు ప్రాంతాల విలీనానికి అనుకూలమైన వాతావరణం వృద్ధిచెందాలన్న మన ఆకాంక్షలు కార్యరూపం దాల్చకపోతే, తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ ఇరు రాష్ట్రాల ఏకీకరణకు వ్యతిరేకంగా స్థిరత్వం చెందితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగుతుంది.

389) హైదరాబాద్‌ రాష్ట్రం ప్రస్తుతానికి కొనసాగుతుంది. మహబూబ్‌ నగర్‌, నల్గొండ, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మెదక్‌, బీదర్‌ జిల్లాలు... ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న మునగాల (సంస్థానం) హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉంటాయి.

కామెంట్‌లు లేవు: