3, ఫిబ్రవరి 2010, బుధవారం

తెలంగాణాపై కమిటీ ఏర్పాటు

తెలంగాణాపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మొత్తం మీద కమిటీని ఏర్పాటు చేసింది. ఏ వర్గానికీ ఇబ్బంది లేకుండా, విధి విధానాలను ఖరారు చేయకుండానే ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ దీనికి నేతృత్వం వహిస్తారు.. ఈయనతో పాటు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ రీసర్చ్‌ ఫెలో డాక్టర్‌ అబు సలీం షరీఫ్‌, ఢిల్లీ ఐఐటిలో హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌ కౌర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు..
కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి వినోద్‌ కె.దుగ్గల్‌ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తారు..
డిసెంబర్‌ 9, 23౩న కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనలు, జనవరి 5న ఎనిమిది రాజకీయ పార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు హోం శాఖ ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులు, ప్రజలతో విస్తృతమైన చర్చలు జరుపుతుందని మాత్రమే వెల్లడించింది. ఈ ప్రకటనలో హోం శాఖ ఎక్కడా తెలంగాణా ఊసు ఎత్తలేదు.. కమిటీ చైర్మన్‌తో చర్చించిన తరువాతే విధి విధానాలను ఖరారు చేస్తారని పేర్కొంది..



5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మూన్నెల్ల సంది అంతగనం లొల్లి పెట్టిండ్రు. ఇగ కోదండరాము,జయశంకరు,కేసీఆర్ చెమ్మచెక్క ఆడుకుంటే మంచిదన్నట్టు
గద్దరన్న గోరటన్న జజ్జినకరి చిందెయ్యాలె.
తెలంగానా జనం పూనకంతో ఊగిపోవాలె
తెలుగుతల్లి సొమ్మసిల్లి పడిపోవాలె.
అప్పుడే తెలుగుజిన్నాకు ఆత్మశాంతి.

Nrahamthulla చెప్పారు...

తెలంగాణకే నా ఓటు!''
చిన్నరాష్ట్రాల రూపశిల్పి పాత్రపోషణలో చిదంబరం
ఆయన వ్యాసం (2003 ఫిబ్రవరి 23, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)లోని ముఖ్యాంశాలు
'వేకప్‌ టు ది స్టేట్‌ ఆఫ్‌ స్టేట్స్‌' అనే ఈ రచనలో తెలంగాణ, విదర్భ రాష్ట్రాల ఏర్పాటును ఆయన స్వాగతించారు.
ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పనితీరులో అట్టడుగు స్థానంలో ఉన్నాయి. అందుకు భిన్నంగా ఢిల్లీ, గుజరాత్‌, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు తూర్పు ఆసియా 'ఆర్థిక పులుల'(సింగపూర్‌, మలేషియా, తైవాన్‌, దక్షిణ కొరియా)తో పోటీ పడ్డాయి.
గోవా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, హర్యానా, పంజాబ్‌ వంటి చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలకన్నా ముందున్నాయి. పెద్ద రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా జనాభాలో, పరిమాణంలో పెద్దవి ఫలితాలు సాధించడంలో ఘోరంగా వైఫల్యం చెందాయి. పంజాబ్‌, మహారాష్ట్రల విభజన సముచితమని చెప్పడానికి వాటి నుంచి వేరుపడ్డ హర్యానా, గుజరాత్‌ రాష్ట్రాలు సాధించిన గణనీయమైన అభివృద్ధి దాఖలా పలుకుతున్నది.'
కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాంచల్‌ ఈ మూడు రాష్ట్రాలలో అభివృద్ధి శరవేగంతో జరుగుతున్నదన్న సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి విదర్భ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లను మరోమారు విభజించాల్సిన అవసరం ఉంది.'
"చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కొన్ని ప్రతికూలాంశాలు ఉన్నాయి. మొత్తం ఖర్చులో పాలనావ్యయం అధికపాళ్లలో ఉండటం, రాజకీయ అస్థిరత్వం వాటిలో ముఖ్యమైనవి. కానీ, ఒక్కసారి కొత్త రాష్ట్రాలు పోటీతత్వం అలవరచుకుంటే, రాజకీయపార్టీలు ఈ ప్రతికూలాం శాలను అధిగమించి, ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోగలుగుతాయి. తద్వారా సజావైన పాలనకు వెసులుబాటు ఏర్పడుతుంది. హర్యానాలో 1970-80; 1980-90 మధ్యకాలంలో రాజకీయ అస్థిరత్వం హెచ్చు మోతాదులో ఉండగా, 1990 అనంతర కాలంలో అది బాగా తగ్గుముఖంపట్టింది. గోవాను తొలి పదేళ్లలో 11 మంది ముఖ్యమంత్రులు పాలించారు. అయినా కొత్తగా ఏర్పడ్డ ఆ రాష్ట్ర అభివృద్ధి ఈ 'అస్థిరత్వం' మూలంగా కుంటుపడిన దాఖలాలు లేవు. చిన్న రాష్ట్రాలలో ప్రజలు ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడటం తగ్గిపోతుంది.'
ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒరిస్సా రాష్ట్రాలను చూస్తే, దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న మొత్తం భారతీయుల్లో నూటికి 45 మంది ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాలలో పెరుగుదల రేటు, తలసరి ఆదాయం బహుతక్కువ. మానవాభివృద్ధి సూచికలో కూడా వాటిస్థానం అట్టడుగునే ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వ వనరులను రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఆ మూడు రాష్ట్రాలు అతి పెద్దమొత్తంలో తీసుకుంటున్నాయన్నది కాదనలేని నిజం.
తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి వసతులు కల్పించడం అంత సులువుకాదు. పెద్ద రాష్ట్రాలకన్నా చిన్న రాష్ట్రాలు ఈ సదుపాయాలను కల్పించడంలో మెరుగ్గా ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. ఉదాహరణకు గోవా, పంజాబ్‌, హర్యానా. చిన్న రాష్ట్రాల దిశగా మనం అడుగులు వేయకతప్పదనే దీనర్థం?'
"ఒకవేళ చిన్న రాష్ట్రాల ఏర్పాటు కుదరకపోతే, ప్రజల ఈ మౌలిక అవసరాలు తీర్చగల పాలనా విభాగాలను చిన్నవిగానైనా ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం జిల్లా పాలనాయంత్రాంగం ఆసాంతం ఉన్నతాధికారుల చేతుల్లో బందీగా ఉన్నందున, అధికార గణానికి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టవలసిన బాధ్యత మనపై ఉంది. ప్రజలు ఎన్నుకున్న జిల్లాస్థాయి ప్రతినిధులు, జిల్లా స్థాయి చట్టసభకు జవాబుదారీగా ఉండేలా చూసినప్పుడు ఇది సాధ్యపడుతుంది. జిల్లా కేంద్రంగా పరిపాలన సాగిస్తే దేశవ్యాప్తంగా ఐదువేల విభాగాలు ఏర్పడేమాట నిజమే. కానీ అప్పుడైనా ప్రజలకు మంచినీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి కనీస సదుపాయాలు సమకూరే సావకాశం ఏర్పడుతుంది.'
సాక్షి 4.2.2010

Nrahamthulla చెప్పారు...

విడిపోతే బలపడతాం!
సమైక్యతతో నష్టపోయినది ఆంధ్ర ప్రాంతమే
ఆంధ్రప్రదేశ్‌ అవతరించిన నాటి నుంచీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.కేసీఆర్‌ దీక్ష పుణ్యమా అని కేంద్రం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన ఇచ్చింది.
ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర కావాలనే వారు కూడా వారివారి వాదనలు వినిపిస్తున్న కాలమిది.ఆంధ్రరాష్ట్రంలో విలీనం కావడానికి తెలంగాణ వారు విముఖులన్న సంగతి మొదటి ఎస్సార్సీయే చెబుతుంది. వెనుకబడి ఉన్న తెలంగాణ వారిని అభివృద్ధి చెందిన ఆంధ్రప్రాంతం వారు దోపిడీ చేసే అవకాశం ఉందని వారు భయాందోళనలు వ్యక్తం చేశారు. అభివృద్ధితో సంబంధంలేదనీ, ఇది ఆత్మగౌరవ సమస్య అనీ, విడిపోతే తమ బాగోగులు తామే చూసుకోగలమనీ తెలంగాణ వారి వాదన.
తెలంగాణ సెంటిమెంట్‌ ఒక వాస్తవం. సమైక్య రాష్ట్రం తుమ్మితే ఊడిపోయే ముక్కుమాత్రం కాకూడదు. అందుకు కేంద్రం నుండి కొన్ని హామీలు పొందాలి.
హైదరాబాద్‌ను ఉద్యోగాల విషయంలో ఫ్రీజోన్‌గా ఉంచాలి. ఆరు సూత్రాల పథకం స్ఫూర్తిగా రాష్ట్రంలోని ఒక నగరాన్ని రెండవ రాజధానిగాను, ఇంకొక నగరంలో లేదా పట్టణంలో హైకోర్టు బెంచీలను ఏర్పాటు చేయడానికి, మరొక ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చే సే విధంగా ఉండాలి. విశాఖ, గుంటూరు, తిరుపతి పట్టణ ప్రభుత్వ ఆస్పత్రులను నిమ్స్‌ స్థాయికి పెంచాలి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. అయితే ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు అందని ద్రాక్షలే. ఇక ఏ ప్రయోజనాలూ లేని సమైక్య రాష్ట్రం ఎందుకో?
ప్రత్యేక ఆంధ్ర కావాలని కూడా అప్పుడు కోరారు. చివరకు 6 సూత్రాల పథకంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 6 సూత్రాల పథక స్ఫూర్తిని కొనసాగించకుండా, ఆంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడపటంలో ప్రభుత్వం విఫలం కావడాన్ని నిరసిస్తూ 2007వ సంవత్సరంలోనే ప్రత్యేక ఆంధ్ర కోరుతూ పార్లమెంట్‌ కొందరు సభ్యులం మరో ప్రత్యేక ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టాం. సమైక్యరాష్ట్రంతో సీమాంధులకు అన్యాయం జరుగుతున్నదనేది మా వాదన.
సమైక్యాంధ్రలో ఆంధ్రా అన్ని రంగాల్లో దోపిడీకి గురవుతూనే ఉంది.
ధాన్యాగారమని ఇప్పటివరకు చెప్పుకుంటున్న పశ్చిమగోదావరి జిల్లా కరీంనగర్‌ కంటే ఈనాడు వెనుకబడింది.
నిమ్స్‌ స్థాయిలో ఒక్క సూపర్‌ స్పెషాలిటీస్‌ ఆసుపత్రి కోస్తా, రాయలసీమలలో ఒక్కటి కూడా లేదు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో ఉన్న సదుపాయాలు, ఆధునిక పరికరాలు మొత్తం ఆంధ్రప్రాంతంలో ఉన్న అన్ని జనరల్‌ హాస్పిటల్స్‌కు కలిపి చూసినా కూడా లేవు.అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి అనేక మెగా ప్రాజెక్టులు తెలంగాణకే వెళ్లాయి. ఏ రంగంలో చూసినా కొత్త అభివృద్ధి తెలంగాణలోనే ఎక్కువ జరిగింది. కలిసి ఉండటంవల్ల ఆంధ్ర, రాయలసీమ ప్రజకు జరిగిన నష్టం ఇది.
రెండు లేక మూడు తెలుగు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి? 42 పార్లమెంట్‌ సభ్యులు ఉన్న మన 'పెద్ద' రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లోకాని ఇతరత్రా కాని ఒరిగింది ఏమిటి? చిన్న రాష్ట్రాలుగా ఉండి, తక్కువ పార్లమెంట్‌ సభ్యులుగా ఉన్న ఇతర రాష్ట్రాలు సాధించలేనిదేమిటి? ఆంధ్రప్రాంతంలో చక్కని వనరులు ఉన్నాయి. కృష్ణా గోదావరి బేసిన్‌లో దేశానికి అంతటికీ సరిపోయే గ్యాస్‌ నిక్షేపాలు బయటపడ్డాయి. విడిపోతే ఆంధ్రప్రాంతం దేశంలోనే బలమైన రాష్ట్రంగా రూపొందే అవకాశం ఉంది. రాయలసీమ వారు విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామంటే ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ను రెండవ దేశ రాజధానిగా ప్రకటించాలి. ఇది అంబేద్కర్‌ అభిమతం కూడా. రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్యలు తలెత్తకుండా ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఉన్న ఈ అంశాన్ని కేంద్ర జాబితాలోకి మార్చాలి. రాజధాని నిర్మాణం చేసుకునే వరకు, కనీసం 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన హైదరాబాద్‌ నుంచే జరగాలి.
చేగొండి హరిరామజోగయ్య
కార్యనిర్వాహక సభ్యులు, ప్రత్యేకాంధ్ర సాధన సమితి (సాక్షి 6.2.2010)

Nrahamthulla చెప్పారు...

సులభ పాలనకు చిన్న రాష్ట్రాలు
పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా చూసినా, చిన్న రాష్ట్రాల ఆవశ్యకత ఎంతైనా ఉందని అంగీకరించాలి. పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకొ ని వెళ్ళాలనే ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు రాష్ట్రంలోని 315 తాలూకాలను విడగొట్టి, వాటి స్థానంలో 1110 మండలాలను 1985 మే 25న ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. తరువాత కాలంలో హైదరాబాద్‌ జిల్లాలోని 4 రెవెన్యూ మండలాలను విడగొట్టి 16 మండలాలను చేశారు. నేడు రాష్ట్రంలో 1128 మండలాలున్నాయి. అదనపు రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాట్లను కూడా పాలకులు వ్యతిరే కించారు.
మన కంటే చిన్న రాష్ట్రాలైన తమిళనాడులో 30 జిల్లాలు, కర్ణాటకలో 28 జిల్లాలు, ఒరిస్సాలో 30 జిల్లాలు ఉన్నాయి. డివిజన్లు, జిల్లాలు, రాష్ట్రాలను విభజించినా, ఎక్కడున్న ప్రజలు అక్కడే ఉంటారు. ఇవన్నీ కేవలం పరిపాలనా యూని ట్లు, కేవలం పరి పాలనా విభాగాలు! మనది వైశాల్యం లో, జనాభాలో అతిపెద్ద నాలుగవ రాష్ట్రం. శ్రీకాకుళం, అదిలాబాద్‌, చిత్తూరు జిల్లా ప్రజలు రాజధాని హైదరాబాద్‌కు రావా లంటే ఎంత ఖర్చు, ఎంత ఇబ్బందో ఆలోచించాలి.కొత్త రాష్ట్రాలు ఏర్పడితే పాలకుల శక్తి సామర్ధ్యాలను బట్టి అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చును. అభివృద్ధి సులభతరమవుతుంది.
వి. జయరాముడు
రచయిత ప్రభుత్వ ఉప కార్యదర్శి (రి) (సూర్య 7.2.2010)

Nrahamthulla చెప్పారు...

కొత్త రాష్ట్రాలు ఏర్పడవచ్చు
మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడింది. ఈ ప్రక్రియలో ఎలాంటి గొడవలు జరగలేదు. రాష్ట్రాలు వేరైనా మనమంతా భారతీయులం. పరిపాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధికి ఆటంకం కాకుండా, దేశశాంతికి ముప్పు వాటిల్లకుండా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. ---ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ 21.2.2010