11, జనవరి 2012, బుధవారం

రైతుకు బ్రాండ్‌ అంబాసిడర్లు

ఏసి కార్లలో తిరిగి తిరిగి అలసిపోయిన ఇద్దరు ఇప్పుడు ఎండావానాచలి ని లెక్క చేయకుండా కాళ్లకు బూట్లు కట్టుకుని మరీ నడుస్తున్నారు.. రోడ్డు దిగి పల్లెల్లో.. పొలాల్లో .. గట్లలో.. బురదలో... పాదయాత్రలు చేస్తున్నారు.. బొమ్మ నాగళ్లను భుజానికెత్తుకుని.. తలలకు పాగాలు చుట్టేసుకుని ఆవేశపడుతున్నారు.. ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.. ఆందోళన చెందుతున్నారు.. ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఇద్దరిదీ ఒకే బాధ..  అందరికీ అన్నం పెడుతున్న రైతు చిక్కిపోయాడని.. తినటానికి బియ్యం గింజలు లేక నలిగిపోయాడని, అప్పులు తీర్చలేక ఆత్మాహుతికి పాల్పడుతున్నాడని.. ఇప్పుడు ఆ ఇద్దరికీ అతను కావాలి.. అతని క్షేమం కావాలి.. అతని సుఖం కావాలి.. అతను పచ్చగా ఉండాలి.. అతని పొలం పచ్చగా పండాలి.. ఆ రైతుకు ఈ ఇద్దరూ బ్రాండ్‌ అంబాసిడర్లు..


ఆరు మాసాలైంది.. ఆయన వెళ్లిన చోటికి ఈయన వెళ్తారు.. ఈయన వెళ్లిన చోటికి ఆయనా వెళ్తారు.. ఒకరిపై మరొకరికి పోటీ.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే యత్నం.. ఇద్దరూ వెళ్తున్నది ఒకే రూటు.. అదే రైతు రూటు.. కాకపోతే, ఆ రూటులో ఎవరు ముందు వెళ్తారన్నదే పెద్ద సమస్య..  ఇదొక రేస్‌.. పవర్‌ రేస్‌..

ఒకరేమో తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రి చేసి, ఆరు సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా ఢక్కామొక్కీలు తిన్న చంద్రబాబు నాయుడు..
మరొకరేమో.. నిన్నటి తండ్రిచాటు బిడ్డ.. తండ్రి అకాలమరణంతో రాజకీయాల్లో అస్తిత్వం కోసం తాపత్రయ పడుతున్న  జగన్‌మోహన్‌ రెడ్డి..
రైతులు పడుతున్న సమస్యల కొసం ఇద్దరూ పోరుబాట పట్టారు.. ఒకరిని మించి ఒకరు రైతుల పక్షాన నిలుస్తున్నారు.. పాలకులను తిడుతున్నారు..తామే పవర్‌లో ఉంటే రైతు కంట కన్నీరే ఉండదని  హామీలు కురిపిస్తున్నారు..

రాష్ట్రంలో రైతుకు బోలెడు సమస్యలున్నాయి. నానా అగచాట్లు పడి పంట పండిస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేని నిరంకుశ వ్యవస్థలో రైతు ఉన్నాడు.. దుక్కి దున్నటం దగ్గర నుంచి నారు పోయటం, నీరు పోయటం.. కలుపు తీయటం, ఎరువు వేయటం, కుప్ప నూర్చటం, దిగుబడి సంపాదించటం, దాన్ని మార్కెట్‌ చేయటం.....
వీటిలో ఏ ఒక్క దశలో కూడా రైతు సంతృప్తి పడట్లేదు..పాలకులు పట్టించుకోరు..



ఈ ఇద్దరు నేతలకు మాత్రం ఈ సమస్యలే నిచ్చెన మెట్లుగా ఉపయోగపడుతున్నాయి.
రైతు ఇవాళ హాట్‌కేక్‌గా మారిపోయాడు
మోస్ట్‌ కన్స్యూమబుల్‌ పొలిటికల్‌ ఐటమ్‌..
రైతుకు రాజకీయుల్లో స్పెషల్‌ డిమాండ్‌..రైతు
రాజకీయులను ఒడ్డుకు చేర్చే ప్రత్యేక ఇన్‌స్ట్రుమెంట్‌.. రైతు
హి ఈజ్‌ ఏ స్పెషల్‌ బ్రాండ్‌.. 

ఇప్పుడు చంద్రబాబు.. జగన్‌మోహన్‌ రెడ్డి ఇద్దరూ ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌లుగా మారిపోవాలని తెగ తాపత్రయ పడుతున్నారు.. ఒకరు పోరు బాటలతో.. మరొకరు రోజుల కొద్దీ దీక్షలతో.. ఒకరిపై ఒకరు.. ఒకరితో ఒకరు.. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు..కిరణ్‌కుమార్‌ రెడ్డి సర్కారుపై అవిశ్వాసం తంతు నడపటానికి రైతు ఉపయోగపడ్డాడు..  రెండేళ్ల పాటు తెలంగాణా ప్రాంతానికి దూరమైన ఈ ఇద్దరూ అక్కడ తిరగటానికి రైతే మాంఛి ఉపకరణంగా పనికొచ్చాడు. మొన్న ఖమ్మం, కరీంనగర్‌..  నిన్న పాలకుర్తి... చంద్రబాబుకు రాచబాట పరిస్తే.. ఇప్పుడు ఆర్మూరు జగన్‌మోహన్‌రెడ్డికి దారి చూపించింది..

రాబోయే ఎన్నికల్లో పవర్‌ పాలిట్రిక్స్‌కు రైతే అసలు సిసలు మాస్క్‌.. సెక్రటేరియట్‌లోని సమతా బ్లాక్‌లోని అయిదో ఫ్లోర్‌లో సిఎం చైర్‌లో కూర్చోబెట్టడానికీ రైతే అవసరమవుతున్నాడు.. చంద్రబాబు.. జగనే కాదు.. రాజకీయ నాయకులందరికీ ఇప్పుడు ప్రచార వస్తువు రైతు.. 


గమ్మత్తేమిటంటే వీళ్లిక్కడ వేల మంది పోలీసులను వెంటేసుకుని తెగ తిరిగేస్తున్నారు.. కానీ, గ్రౌండ్‌ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది, కరీంనగర్‌, అనంతపూర్‌లో టమాటా రైతు పండిన పంటను గేదెలపాలు చేశాడు.. గుంటూరులో మిర్చీ రైతు తన పంటను తానే తగులబెట్టుకుంటున్నాడు.. పాలమూరులో ఉల్లి రైతు కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు.. బ్రాండ్‌ అంబాసిడర్లు మాత్రం... పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు... దీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. నాగళ్లు పట్టుకుంటూనే ఉన్నారు.. పాలకులేమో అరకులోయలో అందాలను ఆస్వాదిస్తున్నారు.. వీళ్లందరి గోలా పవర్‌ది.... రైతు గోడు మాత్రం రైతుదే...

2 కామెంట్‌లు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

వీళ్ళు ప్రచారానికి పెట్టె కర్చు తో కొన్ని జిల్లాల రైతులకు చాల మేలు చేయవచ్చు.. కాని అది ఎవరు చేయరు.. వీళ్ళకి పుబ్లిసిటీ ముక్యం రైతు సౌక్యం కాదు

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

వీళ్ళ దీక్షలు రైతుల కష్టాలు కడగండ్ల మీద ఒక cruel joke.