12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

శ్రీ కృష్ణ కమిటి విధివిధినాలను ప్రకటించారు

శ్రీ కృష్ణ కమిటి విధివిధినాలను కేంద్ర హోం శాఖ పీఆర్‌ఓ ఓంకార్‌ కేడియా ప్రకటించారు.. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకూ దీనికి కాలపరిమితి విధించారు. మొత్తం ఏడు అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది.
ఏడు అంశాలను కేంద్ర హోంశాఖ ఇవాళ ప్రకటించింది.
1. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తో పాటు రాష్ట్రాన్ని యదాతథంగా ఉంచాలన్న డిమాండ్లను కమిటీ అధ్యయనం చేస్తుంది.
2.రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధిని సమీక్షించడంతో పాటు.. వివిధ ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ ప్రోగ్రెస్‌ను కమిటీ పరిశీలిస్తుంది.
3.మహిళలు, విద్యార్థులు, మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీలపై.. ఇటీవలికాలంలో జరిగిన అభివృద్ధిపైనా కమిటీ దృష్టి పెడుతుంది.
4.ఈ మూడు అంశాలకు సంబంధించి కీలకమైన విషయాలను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గుర్తిస్తుంది.
5.రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు.. అందరి సంక్షేమం కోసం రాజకీయ పార్టీల నుంచి సలహాలు స్వీకరించి.. రోడ్‌మ్యాప్‌కు ప్రణాళికను కమిటీ రూపొందిస్తుంది.
6. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికోసం.. ట్రేడ్‌యూనియన్లు, రైతుసంఘాలు, మహిళ,విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరుపుతుంది.
7. కమిటీ ప్రాధాన్యం ఉందని భావించిన ఇతర అంశాలపైనా సలహాలు, సూచనలను చేస్తుంది. ఇలా ఏడు అంశాలతో విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం.. కమిటీ కాలపరిమితిని డిసెంబర్ 31 వరకూ విధించింది.




10, ఫిబ్రవరి 2010, బుధవారం

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు !

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు దాదాపుగా ఖరారయ్యాయి. కోల్‌కతాలో నక్సల్‌ సమస్యపై జరుగుతున్న సమావేశంలో ఉన్న కేంద్ర హోం మంత్రి చిదంబరం ఢిల్లీ తిరిగి వచ్చిన తరువాత ఈ సాయంత్రం కమిటీ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్సెస్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎనిమిది నెలల నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల డిమాండ్లను సమన్వయ పరుస్తూ ఈ విధి విధానాలను కేంద్ర హోం శాఖ ఆచితూచి రూపొందించింది...

రాష్ట్ర రాజకీయం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తుదిరూపునిచ్చింది. ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీల ఆమోద ముద్ర పడిన వెంటనే వీటిని కేంద్ర హోం మంత్రి ప్రకటిస్తారు... కమిటీ ఏ విధంగా పనిచేయాలి.. ఏయే అంశాలపై దృష్టి సారించాలన్న విషయంపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా కసరత్తు చేసింది. జస్టిస్‌ శ్రీకృష్ణ, కమిటీ కార్యదర్శి వికె దుగ్గల్‌లతో పూర్తి స్థాయి సంప్రతింపులు జరిపిన తరువాత ఈ మార్గదర్శకాలు ఖరారయినట్లు తెలుస్తోంది..
౧. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీకృష్ట కమిటీ కాలపరిమితి ఎనిమిది నెలలుగా విధించే అవకాశం ఉంది. అవసరమైతే మరో నాలుగు నెలలు ఈ కాలపరిమితిని పొడిగించవచ్చని కేంద్ర హోం శాఖ వర్గాలు చెప్పాయి...౨. రాష్ట్రంలో నెలకొన్న సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారాన్ని చూపడం జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ప్రధాన బాధ్యత.
౩. కమిటీ మార్గదర్శకాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఏ ఒక్క ప్రాంతానికీ మొగ్గు చూపకుండా జాగ్రత్త పడ్డారు..
౪. అదే సమయంలో ఉద్యమాలకు ప్రధాన కారణమైన తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు..
౫. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రమే ప్రాతిపదిక కాదు..
తెలంగాణ వెనుకబాటు తనం.. అందుకు గల కారణాలను కమిటీ పూర్తిగా పరిశీలిస్తుంది. ఇందుకోసం పలు అంశాల అజెండాను రూపొందించారు..
౬. జస్టిస్‌ ఫజల్‌ అలీ నేతృత్వంలో మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిటీలో తెలంగాణ గురించి ప్రస్తావించిన చారిత్రక, సామాజిక, అభివృద్ధి అంశాలను ప్రస్తుత కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది.
౭. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు... అవసరాన్ని బట్టి మరింత లోతుల్లోకి వెళ్లి సమస్యను పరిష్కరించటమే లక్ష్యంగా జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ పనిచేస్తుంది.

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ న్యూఢిల్లీ, హైదరాబాద్‌ కేంద్రాలుగా పనిచేస్తుంది. ప్రభుత్వం లాంఛనంగా నోటిఫికేషన్‌ జారీ చేసిన వారం రోజుల్లోగా మొదటి సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఇతర వర్గాలు, ప్రజలతో విస్తృతంగా చర్చలు జరుపుతుంది..
అన్నింటికంటే కీలకం జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కావచ్చు... కానీ, దీని మార్గదర్శకాలు భవిష్యత్తులో వెల్లువెత్తే చిన్న రాష్ట్రాల డిమాండ్ల ను సమర్థంగా ఎదుర్కునేందుకు బ్లూప్రింట్‌ గా ఉండేట్లు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది..

8, ఫిబ్రవరి 2010, సోమవారం

బిరుదురాజు రామరాజు కన్నుమూశారు


ప్రముఖ సాహిత్య వేత్త, జానపదాల పరిశోధకులు ఆచార్య బిరుదురాజు రామరాజు ఈ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు.. ఆయన వయస్సు ౮౬ సంవత్సరాలు.. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.. తెలుగు సాహిత్యంలో మరుగున పడిపోతున్న జానపద సాహిత్యాన్ని, గేయాలను పరిశోధించి వెలుగులోకి తీసుకువచ్చిన మేధావి ఆయన.. జానపదాలలోని అనేక ప్రక్రియలను తెలుగు ప్రపంచానికి మరోసారి పరిచయం చేసిన సాహిత్యవేత్త రామరాజు.. దీంతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యోగుల గురించి ఆరు సంపుటాల్లో పరిశోధనాత్మక గ్రంథాలను వెలువరించారు.. జాతీయ ప్రొఫెసర్‌గా అరుదైన గౌరవం పొందిన ఆచార్యులు బి.రామరాజు... ఆయన మృతికి ప్రజాకవి, అందశ్రీ, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు..



3, ఫిబ్రవరి 2010, బుధవారం

అసలైన ఫాదర్స్ డేగా ఫిబ్రవరి 2 nu జరుపుకోవాలి

ఇష్టమైంది తొలగిపోయింది.. అయిష్టమైంది మిగిలిపోయింది. ప్రేమ దూరమైంది... కన్నపేగు తెగిపోయింది. ఆ కన్న గుండె ఎలా తట్టుకుంటుంది... వైసూ.. వైసూ అని ౭౨ గంటల పాటు పలవరించిన ఆ గుండె... తన పిలుపుకు ఇక జవాబు రాదని తెలిసి అలసిపోయి ఆగిపోయింది..
మూడు రోజుల క్రితం వరకు ఆ ఇల్లు పూదోట.. ఆనందం తప్ప అలజడే తెలియని భవనం అది.. భార్యాభర్త.. ముగ్గురు పిల్లలు.. కావలసినంత ఆస్తి.. అంతు లేని ఆప్యాయతలు.. తమకు అసలు కోరతే లేదనుకున్నారు.. రాదనుకున్నారు.. సంతోషం తప్ప మరేదీ ఉండదని తలచారు..
ఇప్పుడు అంతా కొరతే... కొరతే...

అనుకోకుండా వచ్చిన సునామీలో అంతా కొట్టుకుపోయింది... కలల సౌధం కుప్పకూలిపోయింది. శాంతియుత వాతావరణం భగ్నమైంది.. నిన్నటి దాకా అన్నీ ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా అనాథగా మారింది... ఇది ఆ ఒక్క కుటుంబానికే కాదు.. రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా నివ్వెర పోవటం కూడా కష్టమే అయింది... ఏమిటీ దారుణం? ఎందుకింత కష్టం? ప్రతి మాటలో, ప్రతి చర్చలో, ప్రతి ఆలోచనలో ప్రకంపన సృష్టించిన ఘటన...దీనికి మరపు లేదు.. అది సాధ్యం కాదు..

వైసూ... వైసూ.. ఆయన గుండెంతా ఇదే చప్పుడు... తొమ్మిదేళ్ల పాటు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నప్రేమ... పుట్టినప్పటి నుంచి తన చిన్నారి పాపను పొత్తిళ్లలో దాచుకుని కాపాడుకున్న తండ్రి ప్రభాకర్.. చివరి నిమిషం వరకూ భద్రంగానే తిరిగి వస్తుందని అనుకున్నాడు... డబ్బుల కోసమే తన పాపను దుండగులు ఎత్తుకెళ్లారని.. పోలీసుల హడావుడి కాస్త తగ్గిన తరువాత డబ్బులు డిమాండ్ చేస్తే ఇచ్చేసి తన పాపను తాను తెచ్చుకుంటాననే ధీమాతోనే ఉన్నాడు... కానీ, దుండగులు డబ్బుల కోసం కాకుండా ఉసురు తీసేందుకే తన పాపను ఎత్తుకెళ్లారని ఊహించలేకపోయాడు.. మూడు రోజుల తరువాత తన చిన్నారిని నిప్పుల కొలిమిలో బూడిద చేయటం అంతటి తండ్రినీ ఒక్కసారిగా దిగ్భ్రమకు గురిచేసింది.. ఏ దశలోనూ అలా జరుగుతుందని ఊహించనైనా ఊహించని తండ్రి ఒక షాక్కు గురవటం దురదృష్టం.. అదే షాక్లో ఆయన హృదయం చలించటం మానేసింది..

ఆ తండ్రికి కూతురిపై ఉన్న ప్రేమ అంత గొప్పది.. వైష్ణవి చనిపోయినప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడ్డారు.. కానీ, కూతురి కోసం తండ్రి విగత జీవుడవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు..
మనం ప్రపంచంలో ఎన్నో జీవితాలను చూస్తున్నాం.. ఎన్నో వార్తల్ని కంటున్నాం.. కానీ, ఇలాంటి ఘటన అనూహ్యం... అందుకే ఈ తండ్రీ కూతుళ్ల ప్రేమకు శాశ్వతత్వం కల్పించాలని ప్రజానీకం బలంగా కోరుకుంటున్నారు... అంతర్జాతీయంగా ఎన్నో రోజుల్ని ప్రత్యేకంగా మనం జరుపుకుంటున్నాం.. మదర్స్డే.. ఫాదర్స్ డేలు అందులో కొన్ని... ఇవి ఎందుకోసం జరుపుకుంటారో మనలోనే చాలా మందికి తెలియదు.. ఇదిగో ఫిబ్రవరి ౨ ప్రభాకర్ తన పాప కోసం ప్రాణం విడిచిన రోజును ఫాదర్స్డేగా ఎందుకు జరుపుకోకూడదు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది ఇదే..
ఇది నిజం.. తండ్రి ప్రేమకు అసలైన నిర్వచనం వెల్లడైన రోజు ఫిబ్రవరి 2....
ఇది నిజం.. కూతురిపై ఆప్యాయత ప్రతిఫలించిన రోజు ఫిబ్రవరి 2....
ఇది నిజం... కూతురంటే గుండెలపై కుంపటి కాదు... ఆనందాల సందడి అని రుజువైన రోజు ఫిబ్రవరి 2...
ఇది నిజం.. కన్న కూతురికోసం తండ్రి హృదయం తల్లడిల్లిన రోజు ఫిబ్రవరి 2...
ఇది నిజం.. కూతురి ప్రాణం తన ప్రాణంగా తండ్రి గుండె ఆగిపోయిన రోజు ఫిబ్రవరి 2...
అందుకే ఆ తండ్రీ తనయల ప్రేమను అజరామరం చేయాలి..అసలైన ఫాదర్స్ డేగా ఫిబ్రవరి 2ను జరుపుకోవాలి...




తెలంగాణాపై కమిటీ ఏర్పాటు

తెలంగాణాపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మొత్తం మీద కమిటీని ఏర్పాటు చేసింది. ఏ వర్గానికీ ఇబ్బంది లేకుండా, విధి విధానాలను ఖరారు చేయకుండానే ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ దీనికి నేతృత్వం వహిస్తారు.. ఈయనతో పాటు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ రీసర్చ్‌ ఫెలో డాక్టర్‌ అబు సలీం షరీఫ్‌, ఢిల్లీ ఐఐటిలో హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌ కౌర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు..
కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి వినోద్‌ కె.దుగ్గల్‌ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తారు..
డిసెంబర్‌ 9, 23౩న కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనలు, జనవరి 5న ఎనిమిది రాజకీయ పార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు హోం శాఖ ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులు, ప్రజలతో విస్తృతమైన చర్చలు జరుపుతుందని మాత్రమే వెల్లడించింది. ఈ ప్రకటనలో హోం శాఖ ఎక్కడా తెలంగాణా ఊసు ఎత్తలేదు.. కమిటీ చైర్మన్‌తో చర్చించిన తరువాతే విధి విధానాలను ఖరారు చేస్తారని పేర్కొంది..



2, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఆరోప్రాణం



ఒక పసి మొగ్గను విరిసీ విరియకుండానే చిదిమేశారు.. తాను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న మొగ్గ తన కళ్ల ముందే రాలిపోతే చెట్టు తట్టుకోలేకపోయింది... ఒక్కసారిగా కూకటివేళ్లతో సహా కుప్ప కూలిపోయింది... ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకున్న కొమ్మలూ, రెమ్మలూ ఏం కావాలి? దానిపై గూడు కట్టుకున్న పక్షులు ఎక్కడ తలదాచుకోవాలి..
తప్పు చేసిందెవరు?
శిక్ష అనుభవిస్తున్నదెవరు?
ఆ తండ్రీ కూతుళ్లు ఎవరికి అపకారం చేశారు..?
చిట్టితల్లిని వేల డిగ్రీల కొలిమిలో వేసి బూడిద చేసేంత కసాయిలు ఎవరు?
ఎందుకిలా జరిగింది?

ఎవరికీ అర్థం కావటం లేదు.. ఎంతకీ అంతుపట్టడం లేదు.. రాష్ట్ర మంతటా ఒకటే ఆలోచన.. ఒకే ఆవేదన.. ఈ కాలంలో కూడా ఇలాంటి దారుణాలు ఉంటాయా? అనే అందరినీ తొలుస్తున్న ప్రశ్న.. ఎన్నో కిడ్నాపు వార్తలు కన్నాం.. విన్నాం...హత్యలూ చూశాం... కానీ, విజయవాడలో పెను విషాదంగా ముగిసిపోయిన కిడ్నాపు ఉదంతం ఏ ఒక్కరికి మింగుడు పడటం లేదు..
బెజవాడలో పసిపిల్ల నాగవైష్ణవిని కిడ్నాప్‌ చేసినప్పుడు అంతా ఇదొక వార్త అనుకున్నారు..
టెలివిజన్లలో ఆమె చిత్రాన్ని చూసినప్పుడు అంత చక్కని అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు..
౪౮ గంటల తరువాత కూడా ఆ అమ్మాయి చనిపోయిందన్న వార్త విని చలించిపోయారు..
అయ్యో పాపం అని బాధపడ్డారు.. ఆగ్రహించారు..దుర్మార్గులు దొరికితే తామే చంపేస్తామన్నారు...
తెల్లవారేసరికి తన బిడ్డ ప్రాణం తన ప్రాణంగా చేసుకున్న ఆ తండ్రి చనిపోవటం ప్రజల్ని ఒక కుదుపు కుదిపింది...
ఒక్కసారిగా ఊపిరి స్తంభించిపోయింది..
ప్రతి శరీరం ఉన్న పాటున ఉలికిపాటుకు గురైంది...
ప్రతి ప్రాణం కలవర పడింది...
ఎవరికీ అర్థం కావటం లేదు.. ఎంతకీ అంతుపట్టడం లేదు..
కూతురును పదకొండేళ్ల పాటు ఎంతో అపురూపంగా పెంచుకున్న తండ్రి ప్రేమ..
చిట్టితల్లిని కిడ్నాప్‌ చేసిన క్షణం నుంచి ఆమెకోసం అహరహం పరితపించిన నాన్న మనసు...
మీరేం అడిగినా ఇస్తా... మీ పైన కేసులూ పెట్టను.. నా పాపను నాకివ్వండి.. ఎక్కడో ఓ చోట వదిలిపెట్టండి.. నేను తెచ్చుకుంటానని ప్రాధేయపడ్డ హృదయం...
ఆమె లేదని తెలిసి.. అతి కిరాతకంగా బూది చేసారని విని భళ్లున పగిలిపోయింది. శ్వాస ఆగిపోయింది. కూతురితోపాటే తానూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. ఒకే ఊపిరిగా, ఒకే ప్రాణంగా.....

‘‘నేను తండ్రిని.. ఓ కూతురికి తండ్రిని.. తల్లే కాదు.. తండ్రి కూడా బిడ్డల కోసం ప్రాణాలిస్తాడు.. నా వైష్ణవిని కూతురిలా కాదు.. పూవులా పదిలంగా పెంచుకున్నాను..గుండెల్లో దాచుకున్నాను.. ఆడపిల్ల తండ్రి గుండెలపై కుంపటి కాదు.. కలల పంట.. ఆశల మూట.. ఆనందాల పూదోట అని ప్రతి తండ్రికీ చెప్పాలనుకున్నాను.. చెప్పకుండానే వెళ్లిపోతున్నాను.. ’’ అని అనుకుంటూ వెళ్లిపోయాడు.
ఆ కూతురిపై ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది.. కూతురిపై ఇంతగా ప్రేమను పంచుకుని.. ఆమెను ప్రాణంగా పదిలపరుచుకున్న తండ్రి ప్రభాకర్‌... ఆమెతో పాటే వెళ్లిపోవటం ప్రజలందరిలో ఒక ఉద్వేగానికి కారణమైంది. ఇప్పుడు ఆ కుటుంబం వ్యథ తీర్చేదెవరు? ఒకే సారి భర్త, కూతురును పోగొట్టుకున్న ఆ ఇల్లాలి వేదన చల్లారేది ఎలా?
ఇవాళ తన బంధువుల్ని హటాత్తుగా కోల్పోయిన కుటుంబం ఈ రాష్ట్రం.. శోకతప్త హృదయంతో తల్లడిల్లిపోతోంది.. ఈ ఘోరాన్ని చూడలేక.. విషాదాన్ని దిగమింగుకోలేక మౌనంగా రోదిస్తోంది..