30, మార్చి 2010, మంగళవారం

ముప్ఫయ్యేళ్లుగా అలజడి...


హైదరాబాద్‌ పాతనగరంలో మరోమారు అలజడి చోటు చేసుకుంది. జెండాల విషయంలో మొదలైన వివాదం అంతకంతకు విస్తరించింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గతంలోనూ నగరంలో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. దాదాపు ముప్ఫయ్యేళ్లుగా అడపాదడపా ఇదే దుస్థితి... నాటి నుంచి నేటిదాకా సంఘటనల క్రమమిది...
రమీజామీ కేసు సందర్భంగా తొలిసారి 1978లో మొదటిసారిగా పాతనగరంలో మత ఘర్షణలు చెలరేగాయి. దీంతో తొలిసారి నగరంలో కర్ఫ్యూ విధించారు.

1983
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మజ్లిస్‌, భాజపాల మధ్య సాగిన హోరాహోరీ పోటీ మత ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ అల్లర్లలో నలుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు.

1984
సెప్టెంబరులో గణేష్‌ నిమజ్జనోత్సవం సందర్భంగా విధ్వంసం చోటు చేసుకుంది. దావనలంలా వ్యాపించిన అల్లర్లను అదుపు చేయటానికి తొలిసారి జంటనగరాల్లోని యాభై పోలీసుస్టేషన్లతో సహా శివారు పోలీస్‌స్టేషన్‌లలో కర్ఫ్యూ విధించారు. పదిరోజులపాటు కర్ఫ్యూ కొనసాగించారు. ఆ మారణకాండలో 12 మంది చనిపోగా, 60 మంది గాయపడ్డారు.
1990
పేరుమోసిన రౌడీషీటర్‌ సర్దార్‌ పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్‌లో హతం కావటంతో మొదలైన మతఘర్షణలు కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగాయి. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు సాక్షాత్తు అసెంబ్లీలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రకటించడం విశేషం. డిసెంబరు మొదటివారంలో శాలిబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షక్కర్‌గంజ్‌ పార్థివాడలో నిరుపేదల ఇళ్లపై ముష్కరమూకలు దాడి జరిపాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక మహిళ సజీవదహనమైంది. ఏడాది బాలిక ముఖంపై నరరూప రాక్షసులు పెట్టిన కత్తిగాటు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయి. అప్పటి అల్లర్లలో నగరం మొత్తమ్మీద 150 మంది మరణించగా 500 మంది గాయపడ్డారు. అప్పట్లో అత్యధికంగా 20 రోజులపాటు మధ్యలో సడలిస్తూ సుదీర్ఘకాలం పాతబస్తీ కర్ఫ్యూ గుప్పిల్లో విలవిలలాడింది.

1992
నిమిజ్జనం సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తత, అల్లర్లను అణిచివేయటానికి రెండు రోజులు కర్ఫ్యూ విధించారు.

1992
డిసెంబరు ఆరోతేదీన బ్రాబీ మసీదు విధ్వంసంతో చెలరేగిన మతఘర్షణలు ఐదుగురిని బలిగొన్నాయి. ఇరవై మందికిపైగా గాయపడ్డారు. మూడు రోజులపాటు పాతనగరంలో కర్ఫ్యూ విధించారు.

1995
ఆగస్టులో గణేష్‌ నిమిజ్జనం సందర్భంగా ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కత్తిపోట్లు, దుకాణాల లూటీలు జరిగాయి. ఈ సందర్భంగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది.

1997
డిసెంబరులో బ్లాక్‌డే సందర్భంగా హింస చెలరేగి ఇద్దరు మరణించారు.
1998
జూన్‌లో ఓ మతాన్ని కించపరుస్తూ వెలువడిన కరపత్రాలు పాతనగరంలో విధ్వంసకాండకు దారి తీశాయి. ఆ అల్లర్లలో ఐదుగురు మృతి చెందగా, కోటి రూపాయిలకు పైగా ఆస్తినష్టం జరిగింది. ఈ సందర్భంలో రెండు రోజులు నిరవధికంగా, నాలుగురోజులు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

2003
డిసెంబరులో కిషన్‌బాగ్‌ సిఖ్‌ఛావునిలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు కత్తిపోట్లకు గురై మరణించగా, ఆరుగురు గాయపడ్డారు.

2003
అదే ఏడాది డిసెంబరు ఆరో తేదీ బ్లాక్‌ డే సందర్భంగా అల్లరిమూకలు చెలరేగి పలుప్రాంతాల్లో రాళ్ల వర్షం కురిపించారు. ఈ సమయంలో జరిగిన అల్లర్లలో ఐదుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. దీంతో పాతనగరంలోని ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.

చి డెన్మార్క్‌లోని ఓ పత్రికలో మహ్మద్‌ ప్రవక్తను కించపరుస్తూ కార్టూన్‌ ప్రచురితం కావడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇదే సందర్భంలో పాతబస్తీలో ఓ వర్గం వారు దాడులకు తెగబడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

2008
చింతలబస్తీలో ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కత్తిపోట్లతో ఇద్దరికి గాయాలయ్యాయి.

2009
ఆగస్టులో చిన్న విషయమై ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న స్వల్పఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పాతనగరంలోని హబీబ్‌నగర్‌లో జరిగిన ఈ వివాదంతో ఒకరికి గాయాలయ్యాయి.

2009
సెప్టెంబరులో ఆసిఫ్‌నగర్‌ జేబాబాగ్‌ ప్రాంతంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

2009
గ్రేటర్‌ ఎన్నికల తర్వాత మాదన్నపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

2010
శ్రీరామనవమి సందర్భంగా మొదలైన చిన్న వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇప్పటికే ఒకరు మృతిచెందగా, మరికొందరు కత్తిపోట్లతో ఆస్పత్రి పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. పాతబస్తీలోని 17 పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో కర్ఫ్యూ విధించారు.

టార్గెట్‌ పాతబస్తీ

ప్రశాంతంగా ఉన్న పాతబస్తీలో కల్లోలం రేపిందెవరు?
అల్లరి మూకల చేష్టలకు రాజకీయ రంగు పులుముతున్నారా?
శాంతిని మరచి రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయా?
అల్లరిమూకల చేష్టలను అరికట్టే సత్తా పోలీసులకు లేదా?
భాగ్యనగరం బాధలకు బాధ్యులెవరు?
తమ ప్రయోజనాల కోసం ప్రజలను బలి చేస్తున్నారా?
పాతబస్తీ అల్లర్లు... రాజకీయమేనా? ఈ అల్లర్ల వెనుక రాజకీయ కుట్రకోణం దాగి ఉందన్న సందేహానికి పార్టీలు ప్రాణం పోస్తున్నాయి. శాంతియుతంగా ఉన్న ఓల్డ్‌సిటీ ఉన్నట్టుండి భగ్గుమనటానికి కారణం ఏమిటి? ఓ పక్క అల్లరి మూకలు రెచ్చిపోతున్నా వాళ్లను అడ్డుకోవటంలో సమర్థంగా వ్యవహరించలేకపోతున్నారు. రాజకీయ ప్రయోజనాలే ఇందుకు ప్రధాన కారణాలన్న వాదనలకు ఆధారం లేకపోయినా, అల్లరిమూకల చేష్టలకు మాత్రం రాజకీయ రంగు పులుముతున్నారు.. ముఖ్యమంత్రి రోశయ్యను గద్దె దింపటం కోసమే కొందరు అల్లర్లు సృష్టించారన్న ఆరోపణలూ షికార్లు ల్లో వాస్తవం ఎంత?

పదమూడేళ్ల విరామం తరువాత పాతబస్తీ ప్రశాంతత చెదిరిపోయింది. జెండాల కోసం చిన్నగా ప్రారంభమైన ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది.. ఉన్నట్టుండి ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు ఎందుకు రేగాయో ఎవరికీ అర్థం కాలేదు..చిన్న గొడవను చిన్నగా ఉన్నప్పుడే అణచివేయగలిగినప్పటికీ పోలీసులు ఎందుకు ఉపేక్షించారో అర్థం కాదు.. ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఈ అల్లర్ల వెనుక రాజకీయ కుట్రకోణం... అదే నిజమైతే.. దీనికి భారీమూల్యమే చెల్లించుకోవలసి వస్తుంది..
మతమైనా, రాజకీయమైనా... భాగ్యనగరంలో పాతబస్తీ ఫస్ట్‌ టార్గెట్‌... ఏ చిన్న సున్నితమైన సమస్య వచ్చినా.. పాతబస్తీ టెన్షన్‌ పడుతుంది. అయితే ఘర్షణలు తీవ్రస్థాయిలో జరిగే దశను పాతబస్తీ దాటిపోయిందనే ఇంతకాలం అనుకుంటూ వస్తున్నాం.. ఎందుకంటే.. పాతబస్తీలో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకుని పదమూడేళ్లు దాటింది...ఇప్పుడు మళ్లీ అవే సన్నివేశాలు.. అవే ఘర్షణలు.. అవే అల్లరిమూకలు.. ఎందుకీ అల్లరి.. కేవలం జెండాల కోసం ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయన్న వాదన ఎంతవరకు వాస్తవం? దీని వెనుక మరే కారణమేదైనా ఉందా? ఇలాంటి అనుమానం రావటానికి సహేతుకమైన కారణాలే ఉన్నాయి. ఎందుకంటే జెండాల పేరుతో అల్లర్లు జరుగనున్నాయని కొంతకాలంలో పాతబస్తీలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మామూలు ప్రజలు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన మాట వాస్తవం.. అయినా పోలీసులు మాత్రం ఈ అంశాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదో అర్థం కాదు.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరించలేదా? లేక తెలిసినా నిర్లిప్తంగా వ్యవహరించారా?
పోలీసుల నిర్లిప్తవైఖరి అనుకోండి.. లేక మరే కారణమైనా కావచ్చు.. అల్లరి మూకల కార్యకలాపాలు రాజకీయం రంగు పులుముకున్నాయి.. పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం కోసం ఈ అల్లర్లకు శ్రీకారం చుట్టాయని ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న టాక్‌... అందులో మొదటి ఆరోపణ.. ముఖ్యమంత్రి రోశయ్యను గద్దె దింపేందుకు ఆయన ప్రత్యర్థులు ఈ చర్యకు పూనుకున్నారని... గతంలో జరిగిన ఘటనలు ఈ పుకార్లకు బలమిస్తున్నాయి. గతంలో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసి నేదురుమల్లి జనార్థనరెడ్డిని సిఎం చేసిన సందర్భంలో ఇదే విధంగా అల్లర్లు జరిగాయి.. నెంబర్‌ ప్లేట్లు లేని కార్లు పాతబస్తీలో జబర్దస్తీగా తిరిగి గొడవలు సృష్టించాయి. ఆనాడు ప్రతి కాలనీలో యువకులు కర్రలు, ఆయుధాలు పట్టుకుని కాపలా కాసుకోవలసిన పరిస్థితి నెలకొంది.. ఇప్పుడూ మళ్లీ అదే పరిస్థితి తలెత్తనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...
అల్లర్ల వెనుక రాజకీయానికి మరోకారణం తెలంగాణ ఉద్యమం కావచ్చన్నదీ మరో సందేహం... ఇటీవల రాష్ట్రంలో తలెత్తిన తెలంగాణ ఉద్యమ సందర్భంలో హైదరాబాద్‌లో ముస్లింలలోని ఒక వర్గం తెలంగాణాకు అనుకూలంగా గళమెత్తింది.. జెఏసిగా కూడా ఏర్పడింది.. హైదరాబాద్‌ ప్రధాన రాజకీయ పార్టీ అయిన ఎంఐఎం మాత్రం తన వైఖరి వెల్లడించలేదు.. ఈ నేపథ్యంలో ఒకటిగా ఉన్న ముస్లింలలో చీలిక రాకుండా ఉండేందుకు ఇలాంటివి జరుగుతున్నాయా అన్న వార్తలు నగరంలో జోరుగా ప్రచారం అవుతున్నాయి.. ఇంకోవైపు బిజెపి అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి రావటం, ఆ పార్టీని తిరిగి బలోపేతం చేయటం లక్ష్యంగా ముందుకు వెళ్తానన్న కొద్ది రోజుల్లోనే అల్లర్లు జరగటం సున్నితమైన ప్రాంతాల్లో తప్పుడు సంకేతాలను ఇస్తోందని కొందరు బాహాటంగానే అంటున్నారు..
శాంతియుతంగా ఉన్న పాతబస్తీని తమ రాజకీయ ప్రయోజనం కోసం కల్లోలం పాలు చేయటం ఎంతవరకు సమంజసం? రాజకీయ ప్రయోజనాలు ప్రధానమైనప్పుడల్లా పాతబస్తీలో రక్తమోడటం మామూలైపోయింది.. అల్లరి మూకలను నియంత్రించలేకపోవటంలో పోలీసుల వైఫల్యం కంటే వాళ్ల చేతులకు సంకెళ్లు వేయటమే ప్రధానంగా కనిపిస్తున్నది... పార్టీలు రాజకీయాలతో చెలగాటమాడుతున్నాయి.. అది ప్రజలకు ప్రాణసంకటంగా మారింది.. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. అల్లర్లకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చర్య తీసుకోగలిగిన నాడు.. పాతబస్తీ ప్రశాంతంగా ఉంటుంది..

29, మార్చి 2010, సోమవారం

వెంకన్న ఖజానా నిలువు దోపిడీకి గురవుతోంది


తిరుమలకు వెళ్తున్నారా?
ఆపద మొక్కుల వాడికి నిలువు దోపిడీ సమర్పించుకుందామనుకుంటున్నారా?
పాపం శ్రీవారే నిలువు దోపిడీకి గురవుతుందే మీరు సమర్పించుకున్నది ఏమవుతుంది?
హుండీలో వేసిన సొమ్ము వేసినట్లుగా మాయమైపోతున్నది..
వెంకన్న ఖజానా నిలువు దోపిడీకి గురవుతోంది.. తిన్నంత వారికి తిన్నంత.. చిక్కినంత వారికి చిక్కినంత అన్నట్లుగా తయారైంది టిటిడిలో వెంకన్న ఆదాయం.. ఇటు నుంచి హుండీలో భక్తులు వేస్తున్న ఆదాయం.. అటు నుంచి టిటిడి అధికారుల ఇళ్లల్లోకి దొడ్డిదారిన.. చక్కగా చేరుతోంది.. దేవుడి సొమ్ము దొంగల పాలు అన్నట్లుగా మారిపోయింది టిటిడి పరిస్థితి.. ఆపద మొక్కుల వాడికి ఎంతో భక్తితో కోట్లాది భక్తులు సమర్పించే విలువైన కానుకలు అడ్డదారిలో అనర్హుల ఇళ్లను బంగారంతో నింపుతున్నాయి...

తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇవాళ అవినీతికి ఓ ట్రేడ్‌ మార్క్‌.. అదినకాడికి అందినంత దోచుకోవటమే దేవస్థానంలో పనిచేస్తున్న చాలామంది అధికారులు, బోర్డు సభ్యుల ఉద్యోగంగా, వృత్తిగా మారిపోయింది. వీరి దృష్టిలో దోచుకోవటానికి కాదేదీ అనర్హం.. అమ్ముకోవటానికి ఏది దొరికినా సిద్ధమే... అర్హత లేదు.. అనర్హత లేదు.. డబ్బులు కుమ్మరిస్తే ఎవరైనా విఐపియే.. సామాన్యుడు అన్న పదానికి టిటిడి అధికారుల నిఘంటువులో అర్థమే లేదు.. వెరసి ఇవాళ వెంకన్న డబ్బున్నోళ్ల దేవుడిగా మారుతున్నాడు...
తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరుగుతున్న ఆరోపణలు ఇవాళ కొత్తగా వస్తున్నవేం కాదు..కానీ, ప్రస్తుత చైర్మన్‌ ఆదికేశవులు నాయుడి హయాంలో టిటిడి పై వచ్చినన్ని ఆరోపణలు గతంలో ఎన్నడూ రాలేదు.. రాజకీయ ప్రయోజనం కోసం ఆదికేశవులు నాయుడిని తీసుకువచ్చి టిటిడికి చైర్మన్‌ చేయటం దగ్గర నుంచే వివాదం మొదలైంది.. కరడుగట్టిన సారా కాంట్రాక్టర్‌ను స్వామి వారి సేవలో వినియోగించటమే తప్పు.. ఆయన అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అక్కడ అక్రమాలు పరాకాష్టకు చేరుకున్నాయి. టిటిడి చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజునే శ్రీవారి పవిత్ర ఆనంద విమాన గోపురానికి అనంత స్వర్ణమయం చేస్తామంటూ ఓ భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు.. ఈ పథకం వల్ల తిరుమల సహజత్వం కొల్పోతుందనీ, అనేకానేక శాసనాలు శాశ్వతంగా కనుమరుగవుతాయని, ప్రముఖులు, ఆగమ పండితులు నెత్తీనోరూ బాదుకుంటున్నా.. ఆయన చెవికెక్కలేదు.. ఆది కేశవులునాయుడికి దన్నుగా మరో లిక్కర్‌ మాస్టర్‌ కింగ్‌ఫిషర్‌ విజయ్‌ మాల్యా ఆరోకోట్ల రూపాయలు సదరు స్వర్ణమయ పథకానికి విరాళమిచ్చారు..
ఇటీవల ఆలయ నిర్వహణలో భాగంగా బోర్డు ఓ ప్లాస్మా టివిని కొన్నది.. దానికి విలువ ౩౩ లక్షల రూపాయలుగా లెక్క చూపించారు.. మార్కెట్‌లో అంత ఖరీదైన టెలివిజన్‌ ఏముందో, ౩౩లక్షల రూపాయల విలువ చేసే అంత గొప్ప టెలివిజన్‌ను మరి టిటిడి వాళ్లు ఎక్కడ కొన్నారో.. దాని గొప్పతనం ఏమిటో వారే చెప్పాలి..
టిటిడి అవినీతి ఆరోపణలకు అంతే లేదు..ప్రత్యేక ఒఎస్‌డి హోదాలో డాలర్‌ శేషాద్రిపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు వస్తే పట్టించుకున్న నాథుడు లేడు..అధికారికంగా రిటైర్‌ అయి ఆరేళ్లు దాటినా.. దాండిగతనం ద్వారా, విఐపిల దగ్గర తనకున్న పలుకుబడితో బొక్కసం తాళం చెవులు బొడ్లో పెట్టుకొని పెత్తనం చెలాయిస్తున్నా దిక్కు లేదు.. ఆయనగారి అవినీతి ఎన్ని సార్లు వెలుగులోకి వచ్చినా ఎవరూ ఏమీ చేయలేకపోయారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు...
కొన్నాళ్ల క్రితం గోవిందరాజస్వామి దేవస్థానం పూజారి రమణదీక్షితులు స్వామి వారి నగలను ఏకంగా తాకట్టుపెట్టుకుంటే, ఆ బడుగుజీవిని జైలు పాలు చేసి చేతులు దులుపుకున్నారు కానీ, ఇలాంటి చర్యల వెనుక ఉన్న తిమింగళాలను ఎవరూ ఏమీ చేయలేకపోయారు.. అసలు ఆ కేసు అతీగతీ ఏమిటన్నది ఎవరికీ తెలియదు.. బోర్డు ఎలాంటి చర్యలు తీసుకున్నదీ తెలియదు..
స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఒకానొక సందర్భంలో శ్రీవారికి అలంకరించిన కోట్ల రూపాయల విలువైన కెంపు పోయింది.. ఎలా పోయిందంటే అధికారులు చెప్పిన కారణం వింటే విస్మయం కలుగుతుంది.. శ్రీవారి ఊరేగింపు జరుగుతున్నప్పుడు భక్తులు శ్రీవారి వైపు నగదు బిళ్లలు విసురుతారు.. అలా విసిరిన సందర్భంలో ఓ నగదు బిళ్ల తగిలి కెంపు కిందపడి ముక్కలు ముక్కలైపోయిందని, దాని ముక్కలు కూడా దొరకలేదని రికార్డు రాసి కేసు మూసేశారు.. ఇలాంటి వాళ్లను ఏమనాలి? ఏం చేయాలి? నగదు బిళ్ల విసిరితే స్వామి వారి ఆభరణాల్లో భాగమైన కెంపు ఎలా ఊడిపోతుందో పెరుమాళ్లకే తెలియాలి..
ఇక చైర్మన్‌కు, సభ్యుల మధ్య ఉన్న విభేదాల గురించి చెప్పనే అక్కర్లేదు.. బహిరంగంగానే ఒకరిపై ఒకరు నిప్పులు చిమ్ముకుంటారు.. ఎవరి వాటాలు వారికి దక్కలేదన్నంత స్థాయిలో విరుచుకుపడతారు.. ఒక్కమాటలో చెప్పాలంటే దాయాదుల్లా కొట్టుకుంటారు..
ఇప్పుడు ఈ టిటిడి అవినీతిపై దీనిపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది..సభ్యులు తీవ్రంగా ఆందోళనా వ్యక్తం చేశారు... మంత్రిగారూ జవాబిచ్చారు..అక్కడితో కథ తిరుపతికి చేరిపోయింది. ఇదే చర్చ మరో సందర్భంలో మళ్లీ జరుగుతుంది.. మళ్లీ మళ్లీ జరుగుతుంది.. కానీ, దేవుని సొమ్మును దిగమింగుతున్న తిమింగళాలను నిరోధించటం రాజకీయమే ప్రాణంగా బతికే శాసన వ్యవస్థకు సాధ్యమా?

25, మార్చి 2010, గురువారం

కార్పొరేట్లను మేపటానికే ఆరోగ్యశ్రీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ఉద్దేశించిన వర్గాలకు నిజంగా మేలు చేస్తున్నదా? ప్రభుత్వాసుపత్రుల్లో అందించలేని వైద్యాన్ని కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో ఉన్న ఆధునిక సౌకర్యాల ద్వారా అందించాలన్న లక్ష్యంతోనే సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించింది. కాగితాలపైనా, వాస్తవిక దృక్పథంతో చూస్తే ఈ పథకం ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ఉంది.. కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే పథకం కార్పోరేట్‌ ఆసుపత్రులకు ప్రజల సొమ్మును అప్పనంగా పందేరం చేసే పథకంగా మారిపోయింది..

ఆరోగ్యశ్రీ పథకం కింద మొన్నటి బడ్జెట్‌లో 925 కోట్ల రూపాయలు కేటాయించారు.. ౨౦౦౭లో ఈ పథకం మొదలైంది... దాదాపు ౩౮౯ వ్యాధులకు సర్జరీ చేసేందుకు, ౧౪౪వ్యాధులకు చికిత్స చేసేందుకు అనుమతి ఉంది. దీని కింద ఇప్పటి వరకు సుమారు ౩౫ వేల మందికి వివిధ ఆరోగ్య కేంద్రాల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు జరిగితే, అయిదున్నర లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు పూర్తయ్యాయి. మిగతా వాళ్లంతా ఇంకా వెయిటింగ్‌ లిస్ట్‌లోనే ఉన్నారు.. ప్రభుత్వం గొప్పగా లెక్కలు చెప్తోంది. కానీ, వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉంది. కార్పోరేట్‌ ఆసుపత్రులు ప్రభుత్వ సొమ్మును దొడ్డిదారిన పొందేందుకు ఇది కల్పవృక్షంగా ఉపయోగపడుతోంది.. చాలా కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి నామమాత్రంగానే చోటు కల్పిస్తున్నారు..
నిధులు మాత్రం బాగా దండుకుంటున్నారు..ఆరోగ్యశ్రీ అంటేనే ఆ రోగుల పట్ల కార్పొరేట్‌ ఆసుపత్రులు శ్రద్ధ వహించటం లేదు.. వాళ్లను పురుగుల్లా చూస్తున్న ఆసుపత్రులూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేసినా అవి ప్రభుత్వాసుపత్రులకంటే హీనంగా ఉంటాయి. ఇవే నిధులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతికి తావులేకుండా ఖర్చు పెడితే.. ఆ ఆసుపత్రులు బాగుపడేవి.. సామాన్య రోగులకు మంచి వైద్యసదుపాయం అందేది... ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన ప్రధాన సేవల్లో కీలకమైన వైద్య రంగం పట్ల ఇంత నిర్లక్ష్యం వ్యవహరించటం క్షంతవ్యం కాదు.. సర్కారు ఎంత అవినీతిదైనా, ఎన్ని నిధులు తిన్నా.. కొంతలో కొంత నిజాయితీతో వ్యవహరిస్తే సామాన్యుడికి ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది.. ఈ ఏడాది ఇంకా వింతరోగాలెన్నో వ్యాపిస్తాయి అని అంటున్నారు.. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుంది.


24, మార్చి 2010, బుధవారం

నైతిక విలువలకూ చట్టాలు చేయాలా?


పెళ్లికి ముందు సెక్స్‌ నేరం కాదు.. సహజీవనం వ్యక్తిగత ఇష్టానికి సంబంధించింది.. దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.. వివాహానికి ముందు సెక్స్‌లో పాల్గొనటం కానీ, సహజీవనం సాగించటం కానీ, నేరంగా పేర్కొనే చట్టాలు ఏవీ లేవు. అలాంటి చర్యలను ఏ చట్టాలూ నిషేధించలేదు.. కాబట్టి వాటిని తప్పుపట్టలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. వివాహానికి ముందు శృంగారం, సహజీవనం అనేవి నైతికతకు సంబంధించిన అంశాలు.. వాటికి కూడా చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందా? నైతిక విలువలకు, కట్టుబాట్లకు కూడా శాసనాలు చేయక తప్పదా? సమాజం కంటే వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమా? సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యానాలు ఒక కొత్త చర్చకు దారి తీశాయి.


అయిదేళ్ల క్రితం ౨౦౦౫లో సినీనటి ఖుష్బూ పెళ్లికి ముందు సెక్స్‌ తప్పేమీ కాదంటూ చేసిన వ్యాఖ్య దేశాన్నంతటినీ ఒక్క కుదుపు కుదిపింది. ఆమెను క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేయాలంటూ ఏకంగా ౨౨ కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కొట్టివేయాలని ఖుష్బూ మద్రాస్‌ హైకోర్టు ను ఆశ్రయించారు..కానీ హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను వేశారు.. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం చాలా తీవ్రమైన వ్యాఖ్యానాలనే చేసింది. పురాణాల్లో చెప్పినట్లు రాధా కృష్ణులే సహజీవనం చేసినప్పుడు, అది తప్పెలా అవుతుందని పేర్కొంది... సుప్రీం కోర్టు ధర్మాసనం ఈకేసును పూర్తిగా చట్టాల చట్రం నుంచి పరిశీలించింది. ఖుష్బూ వ్యాఖ్యల్ని నేరంగా పరిగణించటానికి చట్టంలోని ఏ సెక్షనూ లేకపోవటాన్ని ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించింది..
రాజ్యాంగంలోని ౨౧వ అధికరణం ప్రకారం సహజీవనం కూడా జీవించే హక్కులో ఒక భాగంగా వస్తుంది కానీ, నేరంగా మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.. అందువల్లే సుప్రీం కోర్టు ఖుష్బూ వ్యాఖ్యలను వ్యక్తిగతమైనవిగా పేర్కొంది.. ఇవి సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదని కూడా స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలో ఇంతకాలంగా అనుసరిస్తున్న నైతిక విలువలకు, కట్టుబాట్లకు కూడా చట్టాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందా అన్న సందేహం వ్యక్తం అవుతోంది... గ్లోబలైజేషన్‌ ప్రభావంతో పెళ్లికి ముందు సెక్స్‌ను, సహజీవనాన్ని అంగీకరిస్తే దాని పరిణామాలు సమాజంపై ఏ విధంగా చూపిస్తాయన్న ప్రశ్నా వ్యక్తమవుతోంది..


సుప్రీం కోర్టు తన వ్యాఖ్యానంలో రాధాకృష్ణుల పేర్లను ప్రస్తావించింది.. నిజానికి రాధాకృష్ణుల చరిత్ర... ప్రధానేతిహాసాలైన భారత, భాగవతాల్లో ఎక్కడా కనిపించదు.. ఈ రెంటిలోనూ రాధ పాత్ర లేదు.. అయితే దేవీ భాగవతంలో కొంత, బ్రహ్మ వైవస్త పురాణంలో కొంత రాధ పాత్ర కనిపిస్తుంది.. ఆ తరువాత రాధ పాత్ర ప్రధానంగా జయదేవుని గీతగోవిందం ద్వారా, రాసలీల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
భాగవతంలో రాధ గురించిన చర్చ లేకపోయినా, రాసలీల మాత్రం స్పష్టంగా ఉంది. బయట ప్రచారంలో ఉన్నట్లు ౧౬వేల మంది గోపికలతో శ్రీకృష్ణుడు రాసలీల జరిపిట్లు భాగవతంలో లేదు.. భాగవత దశమ స్కంధంలో రాసపంచాధ్యాయి పేరుతో అయిదు అధ్యాయాల్లో గోపికలతో కృష్ణుడు బృందావనంలో రాసలీలలాడినట్లు ఉంది... ఆ గోపికలు ఎందరు? అన్న మాట మాత్రం ప్రసావించలేదు..అదీ గాక మొదట్లో బెంగాల్‌ దాని పరిసర ప్రాంతాల్లో మాత్రమే రాధాదేవి బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాత క్రమంగా దేశమంతటికీ ఆమె గురించి తెలిసింది. రాధ పాత్రే ఓ మిధ్య అయినప్పుడు... ఆమెతో సహజీవనం అన్నది కూడా అదే కోవలోకి వస్తుంది కదా..? దేవీభాగవతం, బ్రహ్మవైవస్త పురాణంలో పేర్కొన్న రాధ అయినా, జయదేవుని రాధ అయినా మధుర భక్తి మార్గాన్ని అనుసరించినట్లు పేర్కొన్నారు. రాసలీల కూడా మధుర భక్తిలో ఒక భాగమే...మధుర భక్తి సంప్రదాయంలో శరీర సంపర్కం అనేది ప్రతీకాత్మకమేనని ఆ సంప్రదాయ వాదులు చెప్తారు..
జయదేవుని గీతగోవిందంలో పేర్కొన్న వర్ణనలు శరీర సంపర్కం గురించి చెప్పినా, గీతగోవిందాన్ని అనుసరిస్తూ వచ్చిన భక్తి చైతన్య మార్గం మొత్తం మధుర భక్తిని సహజీవనంగా భావించలేదు..ప్రస్తుత హేతువాదులు, కొందరు సంప్రదాయ వాదులు కూడా గీతగోవిందం ఆధారంగా రాధాకృష్ణులు సహజీవనం గడిపారని అంటారు..
౨.
అనైతిక కార్యకలాపాలన్నింటినీ నేరాలుగా పరిగణించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది..న్యాయస్థానం రాజ్యాంగంలో చట్టాల పరిధిని అతిక్రమించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోజాలదు.. చట్టాలను అనుసరించే సుప్రీం కోర్టు తీర్పు చెప్పాల్సి ఉంటుంది.. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు స్వతంత్ర వ్యవస్థలే అయినా, పరస్పర ఆధారితాలన్నది వాస్తవం.. ఒక్కోసారి న్యాయస్థానం ఏదైనా ఒక అంశానికి చట్టం చేయాల్సిన అవసరం ఏర్పడితే, దాన్ని సర్కారుకు సూచించే అవకాశం ఉంది. అంతే కానీ, చట్టం చేయకుండా, ఏ రకమైన తీర్పునూ ఇవ్వటానికి అవకాశం లేదు.. సహజీవనం విషయంలోనూ, పెళ్లికి ముందు సెక్స్‌ విషయంలోనూ సుప్రీం కోర్టు ప్రధానంగా పేర్కొంది ఈ అంశాలనే.. పెళ్లికి ముందు సెక్స్‌ను కానీ, సహజీవనాన్ని కానీ నిషేధిస్తూ భారత ప్రభుత్వం చట్టం చేయలేదు. అందువల్లే సినీనటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవిగానే సుప్రీం కోర్టు కొట్టి పారేసింది. రాజ్యాంగంలోని ౨౧వ అధికరణంలోని ప్రాథమిక హక్కు అయిన వాక్‌స్వాతంత్య్రం ప్రకారం ఖుష్బూ వ్యాఖ్యలు నేరమేం కాదని, వాటిని సవాలు చేయటం ఆమె హక్కును కాలరాయటమే అన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది..
౩.
ఈ దేశానికి ఒక సంస్కృతి ఉందనీ, దానికి కొన్ని విలువలు ఉన్నాయని, వాటిని పాటిస్తూ వస్తుండటం వల్లనే ఇంతకాలంగా మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ వస్తుందని భావిస్తున్నాం.. కొన్ని కట్టుబాట్ల మధ్యనే ఇవాళ్టికీ భారత సమాజం నడుస్తోంది... ఇవాళ గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని అమెరికా, యూరప్‌ల సంస్కృతిని కుప్పలుతెప్పలుగా దిగుబడి చేసుకుంటున్నాం.. ప్రపంచం ఓ కుగ్రామమైంది కాబట్టి సంస్కృతి, చట్టుబండలంటూ చాదస్తంగా ఉండటం సరి కాదని వాదించేవాళ్లు చాలామందే ఉన్నారు.. వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్లాలని, సుప్రీం కోర్టు కూడా వాస్తవిక దృక్పథంతోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేసిందని వాదిస్తున్నారు కూడా.. వారి కోణంలో వారి వాదన సమంజసమైందే కావచ్చు. కానీ, అదే సమయంలో మరి కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది..
సహజీవనం వల్ల మన దేశానికి సంబంధించినంత వరకు సమాజం కంటే వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం లభిస్తుంది. సంకెళ్లు లేని ఈ స్వేచ్ఛ యువతను ఏ దారిన తీసుకువెళ్తుంది? విశృంఖల శృంగారాన్ని అనుమతించటం వల్ల ఎలాంటి విపరిణామాలు సంభవిస్తాయనేది కొన్నాళ్ల క్రితమే పాశ్చాత్య దేశాలు తెలుసుకున్నాయి.. భారత దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థను అడాప్ట్‌ చేసుకోవటానికి ఒక క్రమ పద్ధతిలో ముందుకు పోతున్నాయి. కానీ, భారత దేశం ఇందుకు రివర్స్‌లో వెళ్తోందా? ఔను.. పెడధోరణుల పట్ల పాశ్చాత్య దేశాలు విసుగు చెంది విసర్జిస్తున్న తరుణంలో వాటిని మనం అందిపుచ్చుకుంటున్నామన్నది నిష్ఠుర సత్యం. ఇందులో ఒకటి, అదీ అతి తీవ్రమైన పెడధోరణి సహజీవనం, ప్రీ మ్యారీడ్‌ సెక్స్‌..
ఇదేమంటే మీరు చాందసవాదులంటూ నిందిస్తారు.. మార్పును కోరుకోకుండా కూపస్థ మండూకాల్లా ఉంటారంటారు.. కానీ, సహజీవనాన్ని అంగీకరించే పరిస్థితిలో భారత సమాజం ఉందా?
౧. వాస్తవిక ధోరణి ప్రకారమే అన్నీ మారాలని, విలువలను పాటించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని భావించినట్లయితే, ప్రస్తుతం అత్యంత వేగంగా రూపాంతరం చెందిన సమాజ జీవనం దృష్ట్యా సహజీవనం తప్పు కాదు...
౨. అలాంటి సహజీవనాన్నే భారత సమాజం అనుమతించినట్లయితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి?
౩. ప్రపంచంలో అనేక దేశాల్లో సహజీవనం అన్నదీ, స్వలింగ సంపర్కం అన్నది చట్టబద్ధమైంది..
౪. భారత సమాజం కొన్ని మార్గదర్శకాల బాటలో పయనిస్తోంది.
౫. మన సమాజం అనేక వైరుధ్యాలను కలిగి ఉంది. కులాల వైరుధ్యం, మతాల వైరుధ్యం, భాషా వైరుధ్యం, సంప్రదాయ వైరుధ్యం ఇలా అనేక రకాలుగా భారతదేశంలో భిన్నత్వం కనిపిస్తుంది.
౬. ఈ భిన్నత్వం లోపలి నుంచే ఏకత్వం అనేది అంతఃసూత్రంగా వెలువడింది. దీన్నే భారతీయత అన్నారు..ఇదే సంస్కృతి.. ఈ జాతి ఒక ఉన్నత నాగరికతతో సమస్త ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచేలా ఎదిగిందే భారతీయ సంస్కృతి..
౭. ఈ సంస్కృతిని ఇవాళ్టివారు చాదస్తం అనవచ్చు.. ఛాందసం అనవచ్చు... మరేదైనా వ్యాఖ్యానించవచ్చు. కానీ, ఈ విలువల వల్లనే, ఈ కట్టుబాట్ల వల్లనే మిగతా ప్రపంచం కంటే భారత్‌ ఆర్థికంగా వెనుకబడి ఉండవచ్చేమో కానీ, హార్థికంగా ఉన్నత స్థానంలో ఉందన్నది మాత్రం వాస్తవం..
౮. ఇవాళ మన దేశంలో సహజీవనాన్ని అంగీకరించామే అనుకుందాం.. దాని వల్ల ఎవరికి లాభం..? ఎవరికి నష్టం?
౯. ఇతర దేశాల్లో మాదిరిగా మన దేశంలో సామాజిక, ఆర్థిక సమానత్వం లేదు.. సంపన్నత లేదు.. ఇప్పటికీ మన దేశంలో తక్కువ శాతం మంది మాత్రమే ఎగువ మధ్యతరగతి స్థాయికి ఎదిగిన వాళ్లు ఉన్నారు..
౧౦. సహజీవనాన్ని అంగీకరిస్తే.. మన దేశంలో స్త్రీ పురుషులు కొంతకాలం సహజీవనం చేస్తే.. వారి సంబంధాన్ని ఈ సమాజం ఏమని పిలవాలి? ఇప్పటికైతే దీనికి నిర్వచనం లేదు..
౧౧. సహజీవనం అనేది మహిళలకు హక్కుగా భావించవచ్చా?
౧౧. స్త్రీ పురుషులు ఇద్దరు కొంతకాలం సహజీవనం చేసి, తరువాత ఇద్దరి మధ్య అయిష్టం ఏర్పడి విడిపోతే.. ఆ స్త్రీ పరిస్థితి ఏమవుతుంది?
౧౨. మహిళలు ఎంతో ఎదిగిపోయారని పత్రికల్లో, మీడియాలో ఎంతగా బాకాలూదినా.. అలా ఎదిగిన వాళ్ల శాతం చాలా తక్కువ.. అలాంటప్పుడు సహజీవనం చేసి విడిపోయిన తరువాత మహిళ పరిస్థితి ఏమవుతుంది. భార్యగా విడాకులు పొందితే భరణం లభిస్తుంది.. కానీ, సహజీవనం వల్ల విడిపోయిన మహిళకు సామాజిక భద్రత ఎలా ఉంటుంది? ఎవరు ఇవ్వాలి? దీనికీ చట్టం చేయాలా?
౧౩. సహజీవనం చేస్తున్న కాలంలో పిల్లలు పుడితే.. ఆ తరువాత కొంతకాలానికి విడిపోవలసి వస్తే ఆ పిల్లలకు తండ్రి హోదాలో ఎవరుంటారు? ఇందుకూ చట్టం చేయాల్సిందేనా?
౧౪. సహజీవనాన్ని అంగీకరించాల్సి వస్తే.. సామాజిక భద్రత అన్నది చాలా కీలకాంశం అవుతుందన్నది కఠిన వాస్తవం.. దీనికి ప్రభుత్వం జవాబుదారీ వహిస్తుందా? సమాజమా?
౧౫. ఓ పక్క సేఫ్‌ సెక్స్‌ గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నాం..విశృంఖల శృంగారం కారణంగా ఎయిడ్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తాయని ఆందోళన చెందుతున్నాం... సెక్స్‌ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, కుటుంబ వ్యవస్థను దాటి వెళ్లడం మంచిది కాదనీ సలహాలిస్తున్నాం.. సహజీవనం, పెళ్లికి ముందు సెక్స్‌ అన్న వాటిని ఒప్పుకోవటం సేఫ్‌ సెక్స్‌ అన్న ప్రచారానికి ఏ విధంగా దన్నుగా నిలుస్తుంది?

స్వలింగ సంసర్కం గురించి సుప్రీం కోర్టు గతంలోనే తప్పు కాదంటూ తీర్పు చెప్పింది.. ఇప్పుడు సహజీవనం గురించి, పెళ్లికి ముందు సెక్స్‌ గురించి సానుకూలంగా స్పందించింది.. వీటికి సంబంధించి రాజ్యాంగంలో, శాసనాల్లో ఎలాంటి విధి నిషేధాలు లేవు కాబట్టే న్యాయస్థానాలు వాటికి అనుకూలంగా స్పందించి ఉండవచ్చు.. ఈ రకమైన ధోరణి చూస్తే మన దేశంలో వేశ్యావృత్తిని క్రమంగా చట్టబద్ధం చేయనున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

23, మార్చి 2010, మంగళవారం

భద్రాద్రి రాముడికి సర్కారు బాకీ 5 లక్షలు


అదిగో భద్రాది... అంటూ.... లక్షలమంది భక్తులు... శ్రీరామనవమి వేడుకల్ని కనులారా వీక్షించేందుకు తరలివస్తారు. జన్మలో ఒక్కసారైనా... శ్రీ సీతారాముల కల్యాణాన్ని... వీక్షించాలని తాపత్రయపడతారు. అంతటి ప్రస్థమైన సీతారాముల కల్యాణం నాడే... పాలకులు... ఆ దేవదేవుడికి బాకీపడుతున్నారు... ఇది ప్రతి ఏటా జరుగుతున్న తంతు! శాసనాలనే కాదని.... కల్యాణరాముడికి టోకరా ఇస్తున్నారు.

శ్రీరాముడికే శఠగోపం పెడుతున్న పాలకులు
భద్రాద్రి రాముడికి సర్కారు బాకీ 5 లక్షలు
ఆనవాయితీని అటకెక్కిస్తున్న సీఎంలు
భద్రాచలం దేవస్థానం నెత్తిన సొంత ఖర్చులు
ప్రభుత్వం తెలిసే ఈ తప్పులు చేస్తోందా...?
భద్రాద్రి రాముడిపై ఎందుకీ చిన్నచూపు..?


"రామ..." అనే రమ్యమైన రెండక్షరాలు సర్వకాల సర్వావస్థలలో ... తమను రక్షిస్తాయని భక్తుల నమ్మకం. అయితే... ఈ నమ్మకాన్ని మన పాలకులు వమ్ము చేస్తున్నారు. సాక్షాత్తూ దేవదేవుడినే అవమానిస్తున్నారు.


భద్రాచలంలో ప్రతిసంవత్సరం జరిగే... సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం... పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించాలి. అలాగే... సమర్పిస్తున్నారు కూడా. అయితే... ఇది అధికారికంగా జరగట్లేదు.


వాస్తవానికి... ప్రభుత్వం సొంత ఖర్చుతో .... సీతారాముల కల్యాణానికి.... పట్టువస్త్రాలను, తలంబ్రాలను సమర్పించాలి. కానీ... ఘనత వహించిన మన పాలకులు....పట్టువస్త్రాలు, తలంబ్రాల ఖర్చును... భద్రాచలం దేవస్థానం నెత్తినే రుద్దుతున్నారు.


ఎందుకిలా జరుగుతోంది...? ఎందుకు ప్రభుత్వం సొంత ఖర్చుతో... రాముడ్ని సేవించట్లేదు.. అంటే...
నిర్లక్ష్యమే కారణమని చెప్పొచ్చు. ప్రతిఏడాది...మనం... సీతారాముల కల్యాణం నాడు.... వినే మాట .... రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు,
తలంబ్రాలను సమర్పించారు...అని! కానీ.... ఇన్నాళ్లూ...మనం విన్నది తప్పు. నిజానికి.... ప్రభుత్వం భద్రాచలం దేవస్థానం తరపునే... చాలా ఏళ్లుగా.... పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తోంది. ప్రభుత్వానికి దక్కాల్సిన పుణ్యం అంతా... దేవస్తానం హుండీలో జమవుతోంది.

ఒకటి కాదు... రెండు కాదు... 20 ఏళ్లుగా...ప్రభుత్వం ఈ నిర్వాకం చేస్తోంది. ఎవరూ పట్టించుకోరన్న ధీమా ఏమో.... సీతాముల కల్యాణం ఆనావాయితీని .... మన పాలకులు... చాలా లైట్ గా తీసుకుంటున్నారు.

ఒక్కసారి...చరిత్రలోకి వెళితే.... ప్రభుత్వం ఈ ఖర్చుల్ని ఎందుకు భరించాలో తెలుస్తుంది.

తానీషా హయంలో... తలంబ్రాలు, పట్టువస్త్రాల ఖర్చును ప్రభుత్వమే భరించాలని శాసనం చేశారు. రాష్ట్ర అవతరణ తర్వాత అప్పటి ప్రభుత్వం .. తానీషా శాసనాన్ని పునరుద్దరించింది. అందులో భాగంగా... తలంబ్రాలు, పట్టువస్త్రాల కొనుగోలు కోసం... 25 వేల రూపాలతో బడ్జెట్ కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆ తర్వాత ప్రభుత్వాలు... ఆ శాసనాన్ని...అటకెక్కించాయి. దీంతో... 20 ఏళ్లుగా... ఈ ఖర్చుల్ని భద్రాచలం దేవస్థానమే భరిస్తోంది.

ఇప్పటివరకు...రాష్ట్రప్రభుత్వం... భద్రాచల దేవస్తానానికి.... అక్షరాల అయిదు లక్షల రూపాయలు అప్పుంది. ఈ బాకీ తీర్చండిబాబోయ్...అంటూ... ఏ యేటి కా ఏడు... దేవస్తానం అధికారులు.... సర్కారుకు విన్నవించుకున్నా.... ఫలితం లేదు...! వచ్చే ఏడాది చూద్దాం లే...అంటూ.... పెండింగ్ మీద పెండింగ్ వేస్తోంది..ప్రభుత్వం.

ప్రతిసంవత్సరం... సీతారాముల కల్యాణం సమయానికి...దేవస్తానమే...తలంబ్రలు, పట్టువస్త్రాలు సిద్దం చేస్తోంది. వాటిని సమర్పించేందుకు వచ్చే... సీఎంలు... చాలా స్టైల్ గా, ఠీవీగా... ప్రభుత్వం తరపున.. అందజేస్తున్నామంటూ ఫోజులిచ్చేవారు.

కనీసం... ఈ శ్రీరామనవమికైనా... ప్రభుత్వం... సొంత ఖర్చుతో... సీతారాముల సేవ చేసుకుంటుందో లేదో చూడాలి.