25, మార్చి 2010, గురువారం

కార్పొరేట్లను మేపటానికే ఆరోగ్యశ్రీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ఉద్దేశించిన వర్గాలకు నిజంగా మేలు చేస్తున్నదా? ప్రభుత్వాసుపత్రుల్లో అందించలేని వైద్యాన్ని కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో ఉన్న ఆధునిక సౌకర్యాల ద్వారా అందించాలన్న లక్ష్యంతోనే సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించింది. కాగితాలపైనా, వాస్తవిక దృక్పథంతో చూస్తే ఈ పథకం ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ఉంది.. కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే పథకం కార్పోరేట్‌ ఆసుపత్రులకు ప్రజల సొమ్మును అప్పనంగా పందేరం చేసే పథకంగా మారిపోయింది..

ఆరోగ్యశ్రీ పథకం కింద మొన్నటి బడ్జెట్‌లో 925 కోట్ల రూపాయలు కేటాయించారు.. ౨౦౦౭లో ఈ పథకం మొదలైంది... దాదాపు ౩౮౯ వ్యాధులకు సర్జరీ చేసేందుకు, ౧౪౪వ్యాధులకు చికిత్స చేసేందుకు అనుమతి ఉంది. దీని కింద ఇప్పటి వరకు సుమారు ౩౫ వేల మందికి వివిధ ఆరోగ్య కేంద్రాల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు జరిగితే, అయిదున్నర లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు పూర్తయ్యాయి. మిగతా వాళ్లంతా ఇంకా వెయిటింగ్‌ లిస్ట్‌లోనే ఉన్నారు.. ప్రభుత్వం గొప్పగా లెక్కలు చెప్తోంది. కానీ, వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉంది. కార్పోరేట్‌ ఆసుపత్రులు ప్రభుత్వ సొమ్మును దొడ్డిదారిన పొందేందుకు ఇది కల్పవృక్షంగా ఉపయోగపడుతోంది.. చాలా కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి నామమాత్రంగానే చోటు కల్పిస్తున్నారు..
నిధులు మాత్రం బాగా దండుకుంటున్నారు..ఆరోగ్యశ్రీ అంటేనే ఆ రోగుల పట్ల కార్పొరేట్‌ ఆసుపత్రులు శ్రద్ధ వహించటం లేదు.. వాళ్లను పురుగుల్లా చూస్తున్న ఆసుపత్రులూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేసినా అవి ప్రభుత్వాసుపత్రులకంటే హీనంగా ఉంటాయి. ఇవే నిధులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతికి తావులేకుండా ఖర్చు పెడితే.. ఆ ఆసుపత్రులు బాగుపడేవి.. సామాన్య రోగులకు మంచి వైద్యసదుపాయం అందేది... ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన ప్రధాన సేవల్లో కీలకమైన వైద్య రంగం పట్ల ఇంత నిర్లక్ష్యం వ్యవహరించటం క్షంతవ్యం కాదు.. సర్కారు ఎంత అవినీతిదైనా, ఎన్ని నిధులు తిన్నా.. కొంతలో కొంత నిజాయితీతో వ్యవహరిస్తే సామాన్యుడికి ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది.. ఈ ఏడాది ఇంకా వింతరోగాలెన్నో వ్యాపిస్తాయి అని అంటున్నారు.. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుంది.


1 కామెంట్‌:

Krishna Reddy చెప్పారు...

Yes.you are right.This sceme is intended to fill the coffers of corporate hospitals.