మళ్లీ చిచ్చు మొదలైంది... ఆరు మాసాల క్రితం ఫ్రీజోన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మొదలైన ప్రాంతీయ ఘర్షణలు.. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు సర్కారు పిటిషన్‌ను కొట్టివేయటంతో మరోసారి చెలరేగనున్నాయా? సుప్రీంలో ఫ్రీజోన్‌పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అడ్మిషన్ దశలోనే కొట్టివేతకు గురికావటం రోశయ్య సర్కారును మరోసారి ఇరుకున పెట్టింది. టిఆర్‌ఎస్ మరోసారి రెచ్చిపోకుండా రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని ౧౪ఎఫ్ నిబంధనను తొలగించాలంటూ అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానాన్నయితే సర్కారు ఆమోదించింది. కానీ, సీమాంధ్ర నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురుకానుంది... అధిష్ఠానం ఆమోదంతోనే రోశయ్య నిర్ణయం తీసుకున్నప్పటికీ, సీమాంధ్ర నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను ఎలా ఎదుర్కొంటారో చూడాలి..
ఆరు నెలల క్రితం అంటే అక్షరాలా అక్టోబర్ తొమ్మిదో తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు రాష్ట్రాన్ని ప్రాంతీయ వాదాల కొలిమిగా మార్చేసింది. పోలీసు ఉద్యోగాల నియామకానికి సంబంధించి హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణాలో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కారణమైంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్‌ను ఆరోజోన్ పరిధిలోకి తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మన్నించింది. తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోవటానికి కెసిఆర్‌కు మంచి అస్త్రం లభించినట్లయింది...
ఈ ఒత్తిడిని తట్టుకోలేకే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును మళ్లీ ఆశ్రయిస్తామంటూ ఆనాడు రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చింది.. ఆ మేరకే స్పెషల్ లీవ్‌పిటిషన్‌ను దాఖలు చేసారు.. కానీ, అడ్మిషన్ దశలోనే పిటిషన్‌ను న్యాయమూర్తులు కొట్టివేయటం మళ్లీ వివాదానికి దారితీసింది..
సర్కారు వేసిన ఎస్‌ఎల్‌పిని సుప్రీం కోర్టు ఎందుకు స్వీకరించలేదు..? పిటిషన్‌ను తయారు చేయటంలో ప్రభుత్వం బలహీనంగా వ్యవహరించిందా? తన వాదనలను గట్టిగా వినిపించలేకపోయిందా? తెలంగాణాలోని ప్రతిపక్షాలు అన్నీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి.
ప్రభుత్వమూ దీటుగానే స్పందించింది..తెలుగుదేశం నేతల తీరుపై రోశయ్య తీవ్రంగానే మండిపడ్డారు.. చివరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ తీర్మానం చేస్తానని హామీ ఇచ్చాక కానీ, టిఆర్‌ఎస్ వెనక్కి తగ్గలేదు..
లేకపోతే... తెలంగాణ రాష్ట్ర సమితి మళ్లీ ఫ్రీజోన్ విషయాన్ని నానాయాగీ చేసేదనటంలో సందేహం లేదు..
తెలంగాణ జెఎసి ఇప్పటికే ఆందోళన ప్రారంభించింది. హైదరాబాద్‌ను ఆరోజోన్‌లో భాగంగా నిర్ధారిస్తూ రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనంటూ తెలంగాణా వాదులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మాత్రం కర్రవిరక్కుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తూంది..విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ఈ వివాదాన్ని ఆయుధంగా మార్చుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాలు..మొత్తం మీద అసెంబ్లీ తీర్మానం పేరుతో ఆందోళన పెద్దగా కాకుండా రోశయ్య సర్కారు ఇప్పటికయితే ఊపిరి పీల్చుకోగలిగింది.. అయితే ఇది శాశ్వత పరిష్కారమా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి