9, మార్చి 2010, మంగళవారం

ఒక అడ్డంకిని అధిగమించిన మహిళాబిల్లు...

అలజడులు.. అల్లర్లు.. ఆందోళనలు.. గల్లీ కొట్లాటలకు వేదికగా తలపించిన రాజ్యసభ.. సభాపతి అన్న మర్యాదను సైతం సభ్యులు ఉల్లంఘిస్తే.. ప్రజాస్వామ్యం విస్తుపోతూ చూస్తూ ఉండిపోయింది.. ఏడుగురు సభ్యులు.. ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్లే.. అయినా గద్దల్లా ప్రజాస్వామ్యాన్ని పొడుచుకుతినేందుకు ప్రయత్నించారు ఈ డర్టీ సెవెన్‌...భారత స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారి రాజ్యసభలో సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడటం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని కళంకం.. దాని పేరే పెద్దల సభ.. కానీ, సభ్యులు మాత్రం పెద్దల్లా ప్రవర్తించింది లేదు.. ఇలాంటి వాళ్లనా మన రాజకీయ పార్టీలు పెద్దల సభకు పంపేది... ఆ సభకు ఇంతకాలంగా ఉన్న మర్యాదలన్నింటినీ ఈ డర్టీ సెవెన్‌ మంటగలిపేశారు.

ఈ గొడవల మధ్యలోనే.. ఈ గందరగోళం కొనసాగుతుండగానే బిల్లుపై చర్చనూ మమ అనిపించారు.. ఓటింగూ జరిపించారు.. విచిత్రమేమంటే.. రాజ్యసభలో ౨౩౩ మంది సభ్యులు ఓటింగ్‌ సమయంలో హాజరు అయితే బిల్లుకు అనుకూలంగా ౧౮౬ ఓట్లే పడ్డాయి.. ఒకే ఒక్క ఓటు వ్యతిరేకంగా పడింది.. మిగతా ౪౬ మంది ఓట్లేయలేదు.. వాస్తవానికి సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న ఎస్‌పి, ఆర్‌జెడి ఇతర సభ్యులు ౩౪ మందే ఉన్నారు.. ఇద్దరు బిఎస్‌పి సభ్యులు ముందే బహిష్కరించారు.. మరి మిగతా పది మంది ఎవరు..? ఏ పార్టీకి చెందిన వారు? వీరిలో అధికార పార్టీ, బిజెపికి చెందిన వాళ్లెవరైనా ఉన్నారా? ఇవన్నీ తెలియాల్సి ఉంది...
ఏమైతేనేం.. మొత్తం మీద మహిళాబిల్లుపై రాజ్యసభ ముద్రపడింది.. ఇక లోక్‌సభ ఆమోదమే తరువాయి.. దీనికి ఎంత హంగామా జరుగుతుందో.. ఎన్ని గందరగోళం సృష్టిస్తారో చూడాలి....
మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రకారం........
లోక్‌సభలో, శాసన సభల్లో...౩౩.౩శాతం సీట్లను మహిళలకు కేటాయించటం జరుగుతుంది..
పార్లమెంటులో ఇప్పటికే ఎస్‌సి, ఎస్‌టిలకు ౨౨.౫ శాతం రిజర్వేషన్లు ఉన్నాయి..

ఈ ఎస్‌సి ఎస్‌టి రిజర్వేషన్లలోనూ ౩౩.౩ శాతం మహిళలకు కేటాయించాలని బిల్లు నిర్దేశిస్తోంది.. అదే జరిగితే ఎస్‌సి ఎస్‌టిలకు ఉన్న ౨౨.౫ శాతంలో ౭.౫ శాతం మహిళలకు కేటాయించాల్సి వస్తుంది..
మొత్తం మీద లోక్‌సభలో మహిళల సంఖ్య ౧౮౧మందికి చేరనుంది...
మన రాష్ట్ర అసెంబ్లీలో మహిళల సంఖ్య ౯౮కి చేరుతుంది.
ప్రస్తుతం ౧౫వ లోక్‌సభలో ౫౯ మంది మహిళలు ఉన్నారు.. అంటే మహిళల సంఖ్య ౧౦.౮శాతం..
మన రాష్ట్రానికి సంబంధించి ౧౩వ శాసనసభలో ౩౪ మంది మహిళలు ఉన్నారు.. అంటే మన అసెంబ్లీలో మహిళల శాతం ౧౧.౫

డర్టీ సెవెన్‌...

డాక్టర్‌ ఇజాజ్‌ అలీ...
జెడి(యు) ద్వారా రాజ్యసభలో ప్రవేశించారు..
పేరుకు పెద్ద డాక్టర్‌... చదువులు గొప్ప.. చేష్టలు దిబ్బ..


షబీర్‌ అలీ...
లోక్‌ జనశక్తి పార్టీ నుంచి రాజ్యసభకు చేరుకున్న ఈయన
చదువుకున్నది తక్కువ...
సెటిల్మెంట్లు చేయటంలో.. పంచాయతీలు పరిష్కరించటంలో మేధావి..

కమల్‌ అఖ్తర్‌..
ఉత్తరప్రదేశ్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఈయన గారి రాజకీయ ఆవాసం
ఎస్‌పి మార్క్‌ రాజకీయానికి ఈయన మచ్చుతునక..
సమాజసేవకుడి నుంచి రాజకీయాల్లో ఎదిగిన నేత

ఆమీర్‌ అలం ఖాన్‌
ఈయనా సమాజ్‌వాదీ మాణిక్యమే...
ఈయన రైతు.. పలు పుస్తకాలు కూడా రాశారు..

వీర్‌పాల్‌సింగ్‌ యాదవ్‌
యుపి నుంచే ఎస్‌పి ద్వారా రాజ్యసభకు ఎంపిక..
బిఎ ఎల్‌ఎల్‌బి. చదివి చాలా పదవులు నిర్వహించారు

నందకిశోర్‌ యాదవ్‌..
యుపికే చెందిన ఈయన ములాయంకు సన్నిహిత సహచరుడు
రాజనీతి శాస్త్రంలో ఎంఎ చదువుకున్నాడరు..
లాయర్‌ వృత్తినీ వెలగబెడుతున్నారు..

సుభాష్‌ యాదవ్‌...
ఈయన అడ్రస్‌ కేరాఫ్‌ లాలూ...
లాలూ గారి ముద్దుల బావమరిది...
బావగారి అండతో బీహార్‌లో రాజ్యమేలుతున్న పెత్తందారీ..

కామెంట్‌లు లేవు: