రాష్ట్రంలో ఉప ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది.. టిఆర్‌ఎస్ తో పాటు మరో ఇద్దరు ఇతర పార్టీల సభ్యులు ఖాళీ చేసిన తెలంగాణా స్థానాల్లో ఉప ఎన్నికలు టిఆర్‌ఎస్ కోరుకుంటున్నట్లుగా ఏకాపక్ష ఎన్నిక జరిగే సూచనలు కనిపించటం లేదు.. టిఆర్‌ఎస్‌ను కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది..
ఉప ఎన్నికల రాజకీయాలు రంజుగా మారాయి... తెలంగాణా ఉద్యమంకోసం రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని టిఆర్‌ఎస్ చేసిన ప్రయత్నానికి గండి కొట్టిన కాంగ్రెస్... ఇప్పుడు దాని విజయావకాశాలను కూడా దెబ్బ తీయాలని పావులు కదుపుతోంది... ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కొన్నాళ్లక్రితం పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి వీరప్పమొయిలీ నిజం చేసేశారు... తాము ఖచ్చితంగా పోటీ చేసేస్తామని ఖండితంగా చెప్పేశారు.. దీంతో ఉప ఎన్నికల్లో పోటీ తప్పదని తేలిపోయింది.
శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను ప్రకటించిన మరునాడే తెలంగాణా జెఎసి సమావేశమై ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాల్సిందేనంటూ తీర్మానం చేసింది.. ఆ మేరకే టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు సమర్పించారు..వెంటనే ఆయన ఆమోదించేశారు కూడా.. వాళ్లతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దామోదర్ రెడ్డి, ముత్యం రెడ్డిలు రాజీనామా చేసినా అధిష్టానం వాళ్లను తమ దారికి తెచ్చుకుంది. వీరితో పాటు రాజీనామా చేసిన నిజామాబాద్ బిజెపి ఎమ్మెల్యే లక్ష్మినారాయణ రాజీనామా కూడా ఆమోదం పొందింది... ఇక అంతకు ముందు రాజీనామా చేసిన వారిలో వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ రాజీనామాను మాత్రమే స్పీకర్ ఆమోదించారు.. టిడిపి మాత్రం చాలా తెలివిగా కాంగ్రెస్‌పై నెపం మోపి తప్పుకుంది. దీంతో మొత్తం ౧౨ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణా కోసం రాజీనామా చేసిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామంటూ ముందుగా జెఎసి ప్రకటించింది. కానీ, వాస్తవ పరిస్థితుల దగ్గరకు వచ్చేసరికి పార్టీల వారిగా ఎవరికి వారు రాజకీయం రంజుగానే నడుపుతున్నారు.. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినా, పోటీ జరిగినా తెలంగాణ అంశం ప్రధానంగానే సాగుతాయన్నది నిర్వివాదం.. మరి ఈ ఎన్నికల్లో గెలుపును రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజాభిప్రాయంగా పరిగణిస్తాయా? లేదా అన్నది వేచి చూడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి