22, మార్చి 2010, సోమవారం

నెత్తికెక్కిన కళ్లు!


ఢిల్లీ పాకిస్తాన్‌లో ఉందిట.. మీకు తెలుసా?
కోల్‌కతా ఏకంగా బంగాళాఖాతం మధ్యలో ఉండిపోయింది..
బుద్ధగయ బంగ్లాదేశ్‌ అవతల సముద్రంలో కలిసిపోయింది..
ఖజురహో కర్ణాటకలోకి..
గ్వాలియర్‌ గుజరాత్‌లోకి ..
ఆగ్రా రాజస్థాన్‌లోకి వచ్చి చేరిపోయాయి...

ఈ దేశంలో ఎవరైనా ఏమైనా చేయవచ్చు... తప్పు చేసినా.. ఒప్పు చేసినా ఎవర్నీ శిక్షించటం మన దేశంలో సాధ్యమయ్యే పని కాదు.. ఒకరు దేవతల బొమ్మల్ని నగ్నంగా చిత్రిస్తారు.. ఇంకొకరు అవే బొమ్మల్ని టాయిలెట్‌ ఉపకరణాలపై ముద్రిస్తారు.. ఇంకొకరు ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగురవేస్తానంటారు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని సైతం నిందించినా పట్టించుకునే పరిస్థితి ఉండదు.. మూడు రంగుల జెండాను ఏ విధంగా ఎగురవేయాలో కూడా తెలియని ప్రబుద్ధులు సైతం ఉన్న దేశం మనది... ఇక దేశ మ్యాప్‌లను తప్పుగా చూపించటంలో వింతేముంది?


రైల్వేశాఖ ఓ ఆడ్‌ ఏజెన్సీకి రూట్‌మ్యాప్‌ ఒకటి గీయమన్నందుకు ఫలితం ఇది.. దేశంలో అత్యంత ఖరీదైన రైలు మహారాజా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే దారి మ్యాప్‌ను చిత్రించే బాధ్యతను తూర్పు రైల్వేస్‌ ఆధునిక్‌ -౭౬ అన్న యాడ్‌ ఏజెన్సీకి అప్పగించేశారు..

సదరు యాడ్‌ ఏజెన్సీ భారత మ్యాప్‌లో రూట్‌ గీయటంలో పూర్తి నిర్లక్ష్యం... ఏదో ఒకటి గీసిస్తే సరిపోతుంది.. బిల్లు చేతికి వచ్చేస్తే చాలు.. అన్నట్లుగానే వ్యవహరించారు.. మహారాజా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే ఎనిమిది ఊళ్ల పేర్లు రాసుకున్నారు.. వాటిని లింక్‌ చేస్తూ ఓ గీత గీశారు.. ఆ గీతను తీసుకువచ్చి భారతదేశం మ్యాప్‌ పైన పెట్టేసి ఇచ్చేశారు..

తాము గీసిన రూట్‌ భారత మ్యాప్‌లో సరిగ్గా సరిపోయిందా లేదా చూసుకున్న వాడు లేదు.. కనీసం తమకు అందిన తరువాత యాడ్‌ ఏజెన్సీ సరైన మ్యాప్‌ ఇచ్చిందా? లేదా? అని వైరిఫై చేసిన పాపాన అటు రైల్వే అధికారులూ పోలేదు. అచ్చంగా కళ్లు మూసుకుని ఇచ్చిన మ్యాప్‌ను ఇచ్చినట్లుగా ముద్రణకు పంపించేశారు..
తీరా వ్యవహారం రచ్చకెక్కాక యాడ్‌ ఏజెన్సీని బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతున్నట్లు ఓ ఉత్తర్వులు ఇచ్చేశారు.. ఇంతటితోనే సరిపోయిందా? యాడ్‌ ఏజెన్సీ గీసిచ్చిన మ్యాప్‌ను ఆమోదించిన రైల్వే అధికారులు ఎవరు? మ్యాప్‌ను చూసే వాళ్లు ఓకే చేశారా? లేక గుడ్డిగా మమ అన్నారా? ఇందుకు బాధ్యులు ఎవరు? ఎవరిపై చర్యలు తీసుకోవాలి?

మ్యాప్‌లను అడ్డగోలుగా చూపించటం ఇవాళ కొత్తగా జరుగుతున్నదేం కాదు.. ఇంతకాలం మన శత్రు దేశాలు.. అమెరికా వంటి అగ్రరాజ్యాలు తప్పుడు మ్యాప్‌లు.. తప్పుడు సరిహద్దులను చూపిస్తూ మ్యాప్‌లను ప్రకటించాయి.. ఇప్పుడు దేశంలోనే ఓనమాలు కూడా రాని వాళ్లు ఇష్టం వచ్చినట్లు గీసేస్తున్నారు.. అంతే తేడా..

భారత మ్యాప్‌లపై వివాదం ఇప్పటిది కాదు.. పాకిస్తాన్‌, చైనాల పుణ్యమా అని మన దేశ మ్యాప్‌ ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో రకంగా కనిపిస్తుంది. అమెరికా నిఘా సంస్థ సిఐఏ మన దేశ మ్యాప్‌ను ఒకలాగా చూపిస్తుంది.. సిఎన్‌ఎన్‌ చానల్‌ ఇంకోరకంగా ప్రొజెక్ట్‌ చేస్తుంది.. ఇక ఆంగ్ల దొరల చానల్‌ బిబిసి మరో రకంగా దాన్ని చిత్రీకరిస్తుంది.. మొత్తం మీద కాశ్మీర్‌ ప్రాంతం ఎవరికి తోచిన రీతిలో వాళ్లు తమ మ్యాపుల్లో పెట్టేసుకుంటారు.. చైనా ఇంకో అడుగు ముందుకేసి అటు అరుణాచల్‌లో కొంత తమ భాగంలో చూపించుకుంటుంది.. కాశ్మీర్‌ విషయంలో ఎవరికి వారు ముక్కలు ముక్కలు చేసి చూపించటం భారత్‌ సర్కారు నిరసన వ్యక్తం చేయగానే సరిదిద్దుకోవటం పరిపాటిగా మారిపోయింది.
మొన్నటికి మొన్న జనవరి ౨౬న భారత గణతంత్ర వేడుకల రోజునే, కామన్‌వెల్త్‌ ఫెడరేషన్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో భారత మ్యాప్‌ను తప్పుగా చూపించేసింది. కాశ్మీర్‌తో పాటు గుజరాత్‌లోని కొంత భాగాన్నీ పాకిస్తాన్‌లో కలిపేస్తూ బొమ్మను చిత్రించింది...
కేం్రద ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన తరువాత కానీ ఆ మ్యాప్‌ను కామన్వెల్త్‌ తొలగించలేదు..
మరో గమ్మత్తేమిటంటే దేశ రాజకీయ వ్యవస్థకు నీతి పాఠాలు వల్లించిన ఓ తెలుగు సినిమాలో సైతం ఇదే తప్పు జరిగింది... అవినీతిని అంతం చేయటం కోసం హీరో లీడర్‌గా మారిన సినిమా.. ప్రతి ఒక్కరూ నిజాయితీతో వ్యవహరించాలని సందేశమిచ్చిన సినిమా.. దేశం గురించి అంత గొప్పగా చెప్పిన సినిమాలో.. అవినీతి రహిత సమాజానికి దారి చూపిన సినిమాలో ఈ దేశానికి సంబంధించిన మ్యాప్‌నే తప్పుగా చిత్రించటం వింత.
ఇవాళ జనం నోళ్లలో బాగా నానుతున్న, మెచ్చుకుంటున్న సినిమా లీడర్‌ లో ఓ భారత మ్యాప్‌ చూపిస్తారు.. మన శత్రుదేశం పాకిస్తాన్‌ అన్యాయంగా ఆక్రమించిన కాశ్మీర్‌ ప్రాంతాన్ని ఈ మ్యాప్‌ ద్వారా సినిమా వాళ్లు ఆ దేశానికి ధారాదత్తం చేసేశారు.. ఏ కాశ్మీర్‌ కోసం రెండు దేశాల మధ్య చిచ్చు రగులుతోందో.. ఏ భూభాగం కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా రక్షణ బడ్జెట్‌లో ఖర్చు పెడుతున్నామో... ఆ భూభాగాన్ని దిగ్రేట్‌ లీడర్‌ సినిమా వాళ్లు అప్పనంగా పాకిస్తాన్‌ పరం చేసేశారు...
దేశం గురించి కుప్పలు తెప్పలుగా గొప్పలు చెప్పిన సినిమాలో అదే దేశానికి సంబంధించిన మ్యాప్‌ను వాడుతున్నప్పుడు వహించాల్సిన శ్రద్ధ కనీసంగానైనా నిర్మాతలు కానీ, దర్శకులు కానీ పాటించలేదు.. ఏదో ఇంటర్నెట్‌లో వెతికి దొరికిన మ్యాప్‌ను గుడ్డిగా, ఆలోచించకుండా, నిర్లక్ష్యంగా సినిమాలో వాడేశారు..
నిర్మాతల కంటే ఆలోచన లేదనుకుందాం.. చూసుకోలేదనుకుందాం... కానీ, సినిమాను క్షుణ్ణంగా చూసి సర్టిఫికెట్‌ జారీ చేసి విడుదలకు అనుమతించిన సెన్సార్‌ బోర్డు వారిని ఏమనాలి? వాళ్ల పరిశీలన ఏమైపోయింది? సినిమాను చూసే సర్టిఫికేట్‌ జారీ చేశారా? లేక ఈ అంశాన్ని అసలు పట్టించుకోలేదా? దేశాన్ని, జాతీయ చిహ్నాలను, సార్వభౌమత్వాన్ని కించపరిచే ఎలాంటి సన్నివేశాలను అనుమతించరాదన్న నియమం వారికి కనీసం గుర్తుందా?
సర్కారుకయితే ఈ అంశం అసలు పట్టింపునకే ఉండదు.. ఈ దేశంలో ఉన్న అపరిమిత స్వేచ్ఛకు ఇది మరో ఉదాహరణ...

4 కామెంట్‌లు:

SRRao చెప్పారు...

సంతోష్ కుమార్ గారూ !
అర్హత, ప్రతిభ చూడకుండా అధికారులుగా నియమిస్తే ఫలితాలు ఇంతకంటే భిన్నంగా ఉంటాయా ? విలువలకు పాతరేసి డబ్బే రాజ్యం చేస్తున్న సినిమా రంగం ఇంతకంటే గొప్పగా ఉంటుందా ? మ్యాప్ సరిగా తయారుచెయ్యడానికి ఆ యాడ్ ఏజన్సికి గానీ, సినిమా వాళ్లకు గానీ అదనంగా అయ్యే ఖర్చు ఏమీ వుండదు, కాస్త విషయ పరిజ్ఞానం వుంటే చాలు.

అజ్ఞాత చెప్పారు...

అసలికి ఇప్పుడు ప్రజముందు ఉన్న తక్షణ కర్తవ్యం ప్రేక్షక సంఘాలు ఏర్ఫడి చతికిల పడి ఉన్న సెన్సార్ బోర్డ్ సభ్యుల మీద కేసులు వేయాలి. లేక పోతే అసభ్య కరమైన మాటలు,పాటలు,దృశ్యాలతో సినేమా తీసే వారిమీద ఈ సంఘాలు ప్రభుత్వానికి నిలదీయటం, లేక పోతె కోఋటులో కేసులు వేయటం చేయాలి. బ్లాగర్లందరిని కలుపుకొని మీరు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయండానికి ముందుకు రండి.

అజ్ఞాత చెప్పారు...

Govt should initiate criminal cases against the Ad agency and on the officers if they approved it.

అజ్ఞాత చెప్పారు...

దేశభక్తి అవసరమా అనే బ్లాగులు రాసే వెధవలదే ఈ కాల౦. తల్లి పాలు తాగి వయసొచ్చాక తల్లి రొమ్మును గుద్దేవాడికే సమర్థత పేరుతో పట్ట౦. ఇట్లా౦టి ఎదవలున్న మన దేశ౦లో మీకు ఇన్ని ఆశలు౦డట౦ నేర౦.

చేతనయితే లౌకికత్వ౦ పేరుతో హి౦దూమతాన్ని తిట్ట౦డి. విశాలభావాల పేరుతో విశృ౦ఖల శృ౦గారాన్ని ప్రోత్సహి౦చ౦డి. ఆవేశ౦గా సమాజ౦ కోస౦ వ్యక్తులె౦దుకు త్యాగాలు చేయాలని విత౦డవాద౦ చేయ౦డి. వీలైతే కొ్న్ని కేసులు పెట్టడానికి రెడీగా వు౦డ౦డి. ఉదార౦గా మన దేశాన్ని తిట్ట౦డి...కాశ్మీరును పాకిస్తానుకు ఇచ్చేయాలని చెప్ప౦డి. మీకు ఉన్నఫళ౦గా కీర్తిప్రతిష్టలు వచ్చేస్తాయి. వీలైతే ఇ-తెలుగు,హేతువాద లా౦టి అనేక స౦ఘాల్లో పదవులొచ్చేస్తాయి.