9, మార్చి 2010, మంగళవారం
పాపం టైగర్...
జాతీయ జంతువుపై జనరాకాసుల పంజా...
అడవుల్లో యథేచ్చగా సాగుతున్న పులుల వేట..
లాభసాటి వ్యాపారంగా మారిన స్మగ్లింగ్..
వేగంగా కనుమరుగవుతున్న పులులు..
జవాబుదారీ లేని సర్కారు..
అడవుల్లో వేట... అదీ టైగర్‌ను వేటాడటం.. అబ్బో... ఒకప్పుడు రాజులకు, రాచరిక దర్పానికీ షాన్... పహచాన్.. అప్పుడు అడవులు ఎక్కువగా ఉండేవి.. జంతువులు ఎక్కువగా ఉండేవి.. జనావాసాల మీదకు క్రూర జంతువులు దాడులు చేయకుండా కాపాడేందుకు వేట జరిగేది.. ఇప్పుడూ వేట కొనసాగుతూనే ఉంది.. కానీ, ఇప్పుడదొక లాభసాటి వ్యాపారం.. దొంగతనం.. స్మగ్లింగ్... ఫలితం క్రమంగా కనుమరుగవుతున్న వన్యప్రాణి సంపద..
పులి.. వన్యప్రాణుల్లో అరుదైన జంతువు.. అందునా మన జాతీయ జంతువు.. ఇవాళ వేగంగా కనుమరుగవుతున్న జంతువూ అదే.. సర్కారు వారు ఏదైతే చేయకూడదని నిషేధిస్తారో,... ఆ పని చేయటంలోనే కొందరికి మజా.. హాబీ.. అదే బిజినెస్... అందులో పులి వేట ఒకటి.. ఇప్పుడు ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జోరుగా సాగుతున్న స్మగ్లింగ్...
టైగర్ గర్జన ఇక వినిపించదా? మన జాతీయ జంతువును మనమే వేటాడుతుంటే.. చర్మాన్ని అందిన కాడికి అమ్ముకుంటుంటే ఆపేవారెవరు? అభయారణ్యాలనీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలనీ ఓ... బోర్డులయితే తెగ పెట్టేస్తారు.. టైగర్ జోన్‌లోకి వెళ్లవద్దని హెచ్చరికలూ చేస్తారు.. కానీ... అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా కొనసాగుతున్న వేట చూస్తుంటే... చివరకు ఈ బోర్డులు తప్ప వన్యప్రాణులు మిగులుతాయా అన్న సందేహం కలుగుతోంది...
ఇది నిజం.. ఇవాళ ఖమ్మం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న తంతు ఇదే.. అత్యంత ప్రమాదకరంగా పులుల వేట జరుగుతోంది.. పెద్ద పులులు, చిరుతల సంహారం యథేచ్ఛగా కొనసాగుతోంది.. పకడ్బందీ ప్రణాళికతో.. పక్కా ఎత్తుగడతో ఉచ్చు వేసి మరీ పులులను హతమారుస్తున్నారు..
పులులు, చిరుతల సంచారమున్న అటవీ ప్రాంతంలో వీళ్లు ముందుగా ఉచ్చులు వేస్తారు.. వాటికి పులుల మెడలు బిగుసుకుని చచ్చిపోతాయి..
అలా సాధ్యం కాని పక్షంలో మరో దారుణమైన ప్రత్యామ్నాయాన్నీ ప్రయోగిస్తారు.. అడవుల్లో ప్రవహించే వాగులు, వంకలు, నీటి గుంటల్లో పురుగు మందులు కలిపేస్తారు.. దాహం తీర్చుకోవటానికి వచ్చిన పులులు ఆ నీటిని అమాయకంగా తాగి మృత్యువాతపడతాయి...
నిజానికి ఈ వేటగాళ్లు అమాయక గిరిజనులు... అసలైన వేటగాళ్లు వేరే ఉన్నారు.. వాళ్ల ఉచ్చులో ముందుగా వీళ్లు పడతారు.. వాళ్లు చెప్పిన పనల్లా చేసి పెడతారు...కొద్దో గొప్పో డబ్బులకు ఆశపడ్డ గిరిజనులు పులులను హతమారుస్తారు.. అసలైన స్మగ్లర్లు వీళ్ల దగ్గర నుంచి మూడు నాలుగు వేల రూపాయలు చెల్లించి పులి చర్మాన్ని తీసుకువెళ్తారు..
౨
పులి చర్మం కేవలం మూడు వేల రూపాయలేనా? ఆశ్చర్యపోకండి.. పులుల చర్మాలు, గోళ్ల వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో జరిగేది... మిగతా వ్యాపారాల్లో మాదిరిగానే ఇందులోనూ సొమ్ములు దండుకునేది, దళారులు.. అసలు స్మగ్లర్లు... గిరిజనులు కేవలం వీరికి ఉపయోగపడే పావులు మాత్రమే...
పులుల వేట జరుగుతున్నట్లు సమాచారం అందిన ప్రతిసారీ అటవీ శాఖాధికారులు పెద్ద ఎత్తున నిఘా వేసి దొంగల్ని పట్టుకుంటారు.. ప్రతి సంవత్సరమూ ఈ తరహా కేసులు నమోదవుతూనే ఉన్నాయి...
పులులను వేటగాళ్లు వేటాడినట్లే.. వాళ్లను అటవీ అధికారులు వేటాడి పట్టుకుంటున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది... కానీ వచ్చిన చిక్కల్లా వేరే ఉంది.. అటవీ అధికారులకు పట్టుబడే వాళ్లంతా సామాన్య గిరిజనులే... వాస్తవంగా పులులను వీళ్లే హతమార్చినా.. వీరి చేత ఈ పని చేయిస్తున్న అసలు వేటగాళ్లు వేరే ఉన్నారు.. వారు పట్టణ వాసాలను వీడి బయటకు రారు.. బయటపడరు..
అధికారులు మాత్రం గిరిజనులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేసి పనయిందనిపించుకుంటారు..
అసలు స్మగ్లర్లపై మాత్రం ఎలాంటి కేసులూ నమోదు జరగవు.. వారి వంక కన్నెత్తి కూడా చూసేవాళ్లు కనపడరు..వీరంతా హైదరాబాద్ కేంద్రంగానే అంతర్జాతీయ వ్యాపారం వెలగబెడుతున్నారు.. మూడునాలుగు వేల రూపాయలకు గిరిజనుల నుంచి కొనుక్కున్న పులి చర్మాలను ఒక్కొక్కటిని ౭౫ వేల రూపాయల వరకు ఎగుమతి చేస్తారు..ఇక గోళ్ల ధర కూడా తక్కువేం పలకదు.. ౩వేల నుంచి ఒక్కోసారి పది వేల రూపాయల దాకా ఒక్కో గోరు పలుకుతుంది.. ఎముకలకు కూడా విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది...
వన్యప్రాణులను కాపాడుకోవటానికి చట్టాలు ఉన్నాయి.. జంతు సంరక్షణ సంస్థలూ ఉన్నాయి.. అయినా వేట నిరాటంకంగా కొనసాగుతోంది.. మరెందుకు ఈ చట్టాలు..? ఓ వైపు దేశంలో ఎన్ని పులులు ఉన్నాయనే గణాంకాలు తీస్తున్నారు.. ఇంకోపక్క పులుల వేట కొనసాగుతోంది.. వేటను నియంత్రించలేనప్పుడు గణాంకాలు చేసి మాత్రం ఏం ప్రయోజనం?
ఖమ్మం జిల్లాలో అటవీప్రాంతం ౮, ౪౦౦ చ.కిమీ..
కిన్నెర సాని అభయారణ్యం ౬౩౫ చ.కిమీ.
పాపికొండలు అభయారణ్యం ౧౧,౨౦౦ చ.కిమీ
(భద్రాచలం సౌత్ డివిజన్, (తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు కలుపుకుని)
పాపికొండలు అభయారణ్యంలోనే పులులు, చిరుతల సంచారం
వీటి చర్మాలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్..
౨౦౦౦ నుంచి ౨౦౦౯ వరకు ౧౩ చిరుత చర్మాల స్వాధీనం..
౧౯౭౨లోనే అమల్లోకి వచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం
౨౦౦౫లో చట్టానికి సవరణ చేసిన సర్కారు...
అయినా పులి సంహారం..ఆగడం లేదు
మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఒరిస్సాల నుంచీ స్మగ్లర్లు ఖమ్మం అడవుల్లో చొరబడుతున్నారు.. వీళ్లందరికీ దేశ వ్యాప్తంగా పక్కా నెట్‌వర్కింగ్ ఉంది.. వీళ్లకుండా పలుకుబడి కూడా తక్కువేమీ కాదు. బ్యూరోక్రసీని, రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేయగల సమర్థులు కాబట్టే వీరి ఆటలు సాగిపోతున్నాయి. వీళ్లను పట్టుకోవటం మామూలు అధికారుల వల్ల అయ్యే పని కాదు..పాలకులు ఇందుకు పూనుకోవాలి.. పకడ్బందిగా వ్యవహరించాలి...అప్పుడే జాతీయ జంతువును కాపాడుకోవటం సాధ్యపడుతుంది..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి