హైదరాబాద్సికిందరాబాద్ జంటనగరాల్లో అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంది. ఇక్కడ బతికిన వాళు్ల.. బతుకుతున్న వారందరికీ ఇది అనుభవమైనదే. జంటనగరాల ఆశ్రయాన్ని ఒకసారి పొందిన వారు తిరిగి ఆ ప్రాంతం నుంచి కదిలేందుకు ఇష్టపడరు...
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం వరకు హైదరాబాద్‌కు ప్రాధాన్యం లేదు.. గోలకొండ ప్రాంతం నుంచే నగర పరిపాలన సాగింది. ఔరంగజేబ్ తరువాతే హైదరాబాద్‌కు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది.
హైదరాబాద్ నూటికి నూరుపాళు్ల తెలుగు పట్టణం కాదు.. జంటనగరాల్లో ఈనాటికీ నికారై్సన తెలుగుదనం కనిపించదు. తెలుగు తెలంగాణ జిల్లాల ప్రజల భాష. తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, తమిళ, ఇరానియన్ తదితర భాషలతో భాగ్యనగరం బహుభాషా నిలయంగా రూపుదిద్దుకుంది.
(courtesy..ఆత్మ కథల్లో ఆనాటి తెలంగాణా పుస్తకం లోంచి..రచన జి.బాల శ్రీనివాసమూర్తి )
హైదరాబాద్‌లో విలసిల్లిన సంస్కృతి దక్కనీ సంస్కృతి. తెలుగు, మరాఠీ, కన్నడ భాషల ప్రజలు.. ఇరానియన్ దక్కన్ ప్రవాసుల భాషలతో కలగలిసిన భాషగా దక్కనీ భాష పుట్టుకొచ్చింది. ఇవాళ ఇది నిర్లక్ష్యానికి గురైంది.
19వ శతాబ్దంలోనే భాగ్యనగరానికి వలసలు ఆరంభమయ్యాయి. ఉత్తర భారతం నుంచి కాయస్థులు, ముస్లింలు తరలివచ్చారు. నిజాం సర్కారులో ఉన్నతోద్యోగాలు సంపాదించారు. రాజస్థానీ మార్వాడీలు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. 1948 తరువాత ఆంధ్రప్రాంతం నుంచి వలసలు మొదలయ్యాయి. 1956 తరువాత ఉద్ధృతమయ్యాయి. గుంటూరు పల్లెలు అప్పుడు ఏర్పడినవే.
1938 దాకా హైదరాబాద్ నగరంలో చిన్నస్థాయి మతకల్లోలం కూడా జరగలేదు.. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సామరస్యంతో జీవించారు.
హైదరాబాద్ నగర పాలన విషయంలో నిజాం రాజ్యవ్యవస్థ అపరిమితమైన ఆసక్తిని చూపించింది. దేశం మొత్తం మీద తొలి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఘనత హైదరాబాద్‌దే.
ఇవాళ నగరం నడిబొడ్డులో ఉన్న పంజగుట్ట ప్రాంతం ఒకనాడు నగరానికి నాలుగుమైళ్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి విద్యానగర్ ప్రాంతం కూడా అడవే.. అక్కడ పశువులను మేతకు తీసుకువెళ్లేవారట...
మహానగరిలో అడవిని నిర్మించిన ఘనత కూడా ఆనాటి పరిపాలకుల ఖాతాలోకే చేరుతుంది. నాంపల్లిలో కృత్రిమ అటవీ నిర్మాణం జరిగింది. అదే ఇవాళ్టి పబ్లిక్ గార్డెన్స... దీన్ని ఆ కాలంలో `బాగే ఆమ్' అని పిలిచేవారు. ఇందులోనే ఓ మూల జూ ఉండేది. బాగ్ అంటే తోట అని అర్థం.
ఒకనాటి భాగ్యనగరం కాలుష్యానికి ఆమడ దూరంలో ఉండేది. పటాన్ చెరువు, జీడిమెట్ల, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో చాలాకాలం క్రితమే భారీ పరిశ్రమలు విస్తరించాయి. అయినా ఆనాడు అవి నగర శివార్లలో ఉన్నవే. నగరం నగరం నలువైపులా చమన్లు, తోటలు పెంచటంతో కాలుష్యానికి తావే లేకుండాపోయింది.
1922నాటికే హైదరాబాద్‌లో వస్త్ర పరిశ్రమకు పునాదులు పడ్డాయి. దివాన్ బహదూర్ రాంగోపాల్ మిల్లుల్లో 1300 మంది కార్మికులు పనిచేసేవారు..
జంటనగరాల్లో 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు మోటర్ కారు అంటే తెలియదు. ఎక్బాలుద్దౌలా అనే ఆయన మొట్టమొదటిసారి మోటారు కారును హైదరాబాద్ వీధుల్లో నడిపించారు. ఆయన వాడింది ఆనాటికే పాతబడిన మోటారు కారు.. ఆ తరువాత ముసల్లింజంగ్, కమాల్యార్జంగ్, రాజారామ్రాయన్, లక్ష్మణ్రాజ్లు కొత్త తరహా మోటారు కార్లు కొన్నారు.. వీరంతా ఆనాటి హైదరాబాద్ ప్రముఖులు.
1911 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఉన్న మోటారు కార్ల సంఖ్య 118 అని నిజాం ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. 1934లో గాంధీజీ హైదరాబాద్ వచ్చినప్పుడు సంపన్నుడైన ధన్‌రాజ్ గిర్జీ తన రోల్‌సరాయిస్ కారును ఆయన కోసం అందుబాటులో ఉంచారు. అప్పటికే రోల్‌సరాయిస్ కారు హైదరాబాద్ వీధుల్లో తిరిగింది.
1920 నాటికి హైదరాబాద్ జనాభా నాలుగు లక్షలు. మోటారు కార్ల సంఖ్య తక్కువ. అప్పుడు రిక్షాలు లేవు. ఆటోరిక్షాలు అంతకంటే లేవు. సంపన్నులకు బగ్గీలు ఉండేవి. అద్దె టాంగాలు ఉండేవి. సైకిళ్ల సంఖ్య మాత్రం వేల సంఖ్యలో ఉండేవి. మోటారు వాహనం వస్తుందంటే ట్రాఫిక్ పోలీసు సీటీ ఊదేవాడు..ప్రజలంతా ఆ మోటారును విచిత్రంగా చూసేవారు.
1930వ దశకంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ తీవ్రత తక్కువైనా పూర్తిస్థాయి ట్రాఫిక్ క్రమశిక్షణను పాటించేవారు. రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండేవి.. టాంగాలు ఎక్కువ. రోడ్ల మీద కొంత కొంత దూరాలకు రేకులు, తట్టలు పట్టుకుని కొందరు మనుష్యులు ఉండేవారు. గుర్రం లద్ది పెట్టినా, చెత్త పడినా వెంటనే తీసేవారు.
హైదరాబాద్ నగరంలో దేవిడీల సంస్కృతి ఎక్కువ. ఢిల్లీ, లక్నో, కాశీ వంటి నగరాల మాదిరిగానే ఇక్కడా దేవిడీలు ఎక్కువగానే ఉన్నాయి. ఆనాటి నవాబులు, జమీందారులు దేవిడీలు నిర్మించుకుని అందులో దర్జాగా నివసించేవారు. ఇప్పటికీ కొన్ని దేవిడీలు నేటికీ నగరంలో కనిపిస్తాయి.
20వ శతాబ్దం ప్రారంభం కావటానికి ముందువరకు హైదరాబాద్‌లో హోటళు్ల, వసతి గృహాలు లేవు. ధర్మశాలలే ఉండేవి. హైదరాబాద్‌కు వచ్చిన వారు ధర్మశాలలో వండుకుని తినే వారు. ఉచితంగా అన్నదానం కూడా చేసేవారు.
1943లో ఉస్మానియా ఆసుపత్రి ఎదురుగా చింతల నర్సమ్మ భోజనశాల ఉండేది. అన్నం, పప్పు, రెండు కూరలు, ఊరగాయ, కాచిన నెయ్యి, గడ్డ పెరుగుతో భోజనం లభించేది. నెలకు రెండుపూటల భోజనానికి రెండు రూపాయలు, వసతికి మరో రెండురూపాయలు తీసుకునేవారు.
హైదరాబాద్‌లో హోటళు్ల ప్రారంభమైన తొలినాళ్లలో విచిత్రమైన పరిస్థితి ఉండేది. జనం హోటళ్లకు వెళడానికి మొహమాటపడేవారు.. ఆనాడు హోటళ్లను చాయ్ఖానా అని పిలిచేవారు.. చాయ్ఖానాకు వెళ్లడం అంటే సారాయి దుకాణానికి వెళ్లినట్లు భయపడేవారు..
1920 నాటికి కానీ హైదరాబాద్‌లో హోటళు్ల రాలేదు. టీ, కాఫీలతో పాటు ఉప్మా, వడ,దోశ వంటి టిఫిన్లు ఎక్కడో అరుదుగా లభించేవి. గౌలిగూడ రామమందిరం ప్రాంతంలో సుబ్బారావు హోటల్ అనేది తొలి హోటళ్లలో ఒకటి.
1920 లలో హైదరాబాద్‌లో నాష్తాలు ఖాజీ పకోడా, పూరీసాగ్, పూరీచూన్లు.. మాంసాహారంలో మేక కాళ్ల ముక్కల పులుసు(పాయ), బన్ను రొట్టెలు ఆనాటి టిఫిన్లు..
హైదరాబాద్‌లో ఇరానీచాయ్కు విపరీతమైన క్రేజ్ ఉంది. 1920లలో గౌలిగూడెంలోని శంకర్‌షేర్ అనే హోటల్లో మలాయ్దార్(మీగడతో కూడిన) చాయ్ ఆనాడు ఫేమస్.. మూడు పైసలకు చాయ్.. ఒక పైసకు లవంగం గుచ్చిన పాన్.. ఒక పైసకు నాలుగు చార్మినార్ సిగరెట్లు.. ఇవీ ఆనాటి హైదరాబాద్ ధరలు..
హైదరాబాద్ ప్రజలకు టీ ని అలవాటు చేసేందుకు టీ కంపెనీలు చాలా కష్టపడాల్సి వచ్చింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో బహిరంగంగా స్టౌ వెలిగించి అందరిముందే టీని తయారు చేసేవారు. ఒకరు టీ వల్ల వచ్చే లాభాలను గురించి చెప్పేవారు.. మరొకరు తయారు చేసిన టీని ఉచితంగా అందరికీ పంచేవారు.. టీ గొప్పతనాన్ని గురించి ఇంకొకరు ప్రసంగించేవారు.. తరువాత ఇంటింటికీ తిరిగి టీని పంపిణీ చేసేవారు. మొత్తం మీద టీ ని జనానికి అలవాటు చేసి కానీ కంపెనీలు విడిచిపెట్టలేదు..
గండిపేట్కీ పానీ, మదీనాకీ బిర్యానీ హైదరాబాద్ ప్రత్యేకతలు.. గండిపేట నీటిలో తేటదనం ఎక్కువగా ఉంటుంది. మదీనా బిర్యానీలో నిర్వచనాలకే అందని రుచి ఉంటుంది.
1950 వదశకంలోనే హైదరాబాద్‌లో సినిమాలు వచ్చాయి. ఆనాడు ఆబిడ్సలో సాగర్ టాకీస్ ప్రసిద్ధమైంది. నాంపల్లిలో మోతీమహల్ టాకీసులో హిందీ సినిమాలు వచ్చేవి. 1956లో ఈ మోతీమహల్లో అగ్నిప్రమాదం జరిగింది. కొంతకాలం తరువాత దిల్షాద్ అని పేరు మార్చుకుని తిరిగి ప్రారంభమైంది.
1908 సెప్టెంబర్‌లో రెండు రోజుల్లో 19 అంగుళాల వర్షం కురిసింది. మూసీ నది కట్టలు తెంచుకుంది. 221 చెరువులు తెగిపోయాయి. నాలుగు వంతెనలు మునిగిపోయాయి. 15వేల మంది మరణించారు. 20 వేల ఇళు్ల నేలమట్టమయ్యాయి.
మూసీ వరదలకు దానిపై నిర్మించిన మూడు వంతెనలు చాదర్‌ఘాట్, పురానాపూల్, నయాపూల్లు పూర్తిగా మునిగిపోయాయి. చెన్నరాయని గుట్ట(నేటి చాంద్రాయణ గుట్ట) నుంచి షాలిబండ వరకు నగరం పూర్తిగా మునిగిపోయింది.
మూసీ వరదలు నిజాం సర్కారుకు నేర్పిన గుణపాఠాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి పిలిచి ఆయన సారథ్యంలో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట)లు నిర్మించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నెలకొల్పారు. మురికివాడల స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించారు.. భారీ ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రదర్శించిన చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
1911లో హైదరాబాద్‌లో ప్లేగు రోగం విస్తరించింది. ప్లేగు గత్తరల వల్ల 15 వేల మంది మృత్యువాత పడ్డారు. చలికాలంలో హైదరాబాద్ రావాలంటేనే జనం భయపడేవారు.
1919లో ఇన్‌ఫ్లూయెంజా తీవ్రంగా వ్యాపించింది. భాగ్యనగరంలో రోజూ కనీసం 500 మంది మరణించేవారని నిజాం సర్కారు రికార్డులు చెప్తున్నాయి.
1936లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనా రజతోత్సవాలను నిర్వహించారు. జూబ్లీహాల్ అప్పడు కట్టిందే. జూబ్లీహిల్స, జూబ్లీ క్లబ్, జూబ్లీ బజార్ వంటివన్నీ అప్పుడు పెట్టిన పేర్లే.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోలకొండపై దండెత్తి కుతుబ్‌షాహీల చివరి రాజు తానీషాను జయించాడు. అప్పుడు మొగలాయూ సైనికులు నిలిచిన చోటును ఫతే మైదాన్ అని పిలిచారు.. ఇదే ఇప్పుడు లాల్‌బహదూర్ స్టేడియంగా మారింది.
తానీషాను ఓడించిన తరువాత ఫతేమైదాన్ పక్కనే ఉన్న కొండపైన ఔరంగజేబ్ సైనికులు నగారా మోగించారు. అదే నౌబత్పహాడ్... ఇప్పుడు నగరం సిగలో మల్లెపూవులా వెలిగిపోతున్న బిర్లామందిర్ ఉన్న కొండ అదే.
హైదరాబాద్‌లో రెసిడెన్సీ ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉండేది. ఈ ప్రాంతంలో నిజాం చట్టాలు అమలు కాలేదు.. పోలీస్ చర్య తరువాత కోఠీలోని రెసిడెన్సీ భవనాన్ని పోలీసు కేంద్ర కార్యాలయానికి ఇవ్వాలని ఆనాటి సైనిక అధికారి జె.ఎన్.చౌదరి ప్రభుత్వాన్ని కోరారు.. కానీ, దాన్ని మహిళా కళాశాలకు ఇచ్చారు.. అదే ఇవాళ్టి కోఠీ మహిళా కళాశాల.
కోఠీలో మొదట రెసిడెన్సీరోడ్డుగా పిలిచిన ప్రాంతం ఆ తరువాత తుర్రేబాజ్‌ఖాన్ రోడ్డుగా మారింది. 1857లో తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో తుర్రెబాజ్‌ఖాన్ బలమైన తిరుగుబాటుదారు.. అతని స్మృతి చిహ్నంగానే తుర్రెబాజ్‌ఖాన్ రోడ్డు ఏర్పడింది.
హైదరాబాద్సికిందరాబాద్ల మధ్య ప్రజల వ్యవహారంలో చాలా తేడాలు ఉండేవి. హైదరాబాద్‌ను పట్నం అని పిలిచేవారు.. సికిందరాబాద్ను లష్కర్ అని పిలిచేవారు. నాడు సికిందరాబాద్ ముందు బెజవాడ చిన్న పల్లెలా కనిపించేది.
హైదరాబాద్‌లో ఉర్దూ భాషకు ఎంత దర్జా ఉండేదో.. సికిందరాబాద్‌లో ఇంగ్లీషుకు ఆ స్థాయిలో గౌరవం ఉండేది. ఆ రోజుల్లో కందస్వామి మొదలియార్ అనే ఆయన సికిందరాబాద్‌లో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయనే మెహబూబ్ కాలేజీని స్థాపించాడు.
హైదరాబాద్‌లో తీవ్ర నిర్బంధం ఉండటంతో, సికిందరాబాద్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా చేసుకునే వారు. కర్బాలా మైదానంలో సద్దుల బతుకమ్మ జరిగేది.
సికిందరాబాద్‌లోని కింగ్సవే రహదారి, మారేడ్‌పల్లి ప్రాంతాలను బ్రిటిష్‌వారు తమ అధీనంలో ఉంచుకున్నారు.. తామే అభివృద్ధి చేసారు.
హైదరాబాద్‌కు భాగ్యలక్ష్మి అధిష్ఠాన దేవత.. సికిందరాబాద్‌కు ఉజ్జయిన మహంకాళి అధిష్ఠాన దేవత. అమ్మవారికి ఆషాఢమాసంలో సమర్పించుకునే బోనాలు హైదరాబాదీలకు అతి పెద్ద పండుగ.
సికిందరాబాద్‌లోని ఆనందభవన్, ఆబిడ్‌సలోని తాజ్‌మహల్ హోటళు్ల చాలా పాత హోటళు్ల.. అవి హోటళు్ల కావు.. మిత్రులు కలిసే ప్రదేశాలు.
3 కామెంట్లు:
నగరం గురించి చాలా సమాచారం ఇచ్చారు, నెనరులు. తుర్రెబాజ్ఖాన్ను రజాకార్లు హత్య చేసినది ఆ రెసిడెన్సీ దగ్గరేనని చదివాను.
అన్నట్టు సైదాబాదులో కూడా సాగర్ టాకీసు ఒకటున్నట్టుంది కదండీ?
I fully enjoyed reading your article (జంట నగరాల చరిత్రలోకి...) on the past history of Hyderabad/Secunderabad. You have underlined many a point of those times when people of different faiths, languages and trades lived there harmoniously. My own experiences of particularly Secunderabad go back from late 1940s to mid 1950s with much admiration.
I appreciate your efforts in reminding people of this generation.
Nijamga baga santosham ayyindi chadivi,endukante aambagh,Naubat pahad lanti perlu chinnapatinundi vintuu vadutu vunna perle kani avi anni prastutaniki vadakam maruguna padi poyindi. Blog chadivina taruvata pata hyderabad anta kalla munduga kana padindi..goppaga rasaru.
కామెంట్‌ను పోస్ట్ చేయండి