చిదంబరం మరో ప్రకటన చేశారు.. అంతా ఊహించినట్లుగానే తెలంగాణాపై కమిటీ వేస్తున్నామన్నారు.. ‘‘ తెలంగాణాపై కమిటీ ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ వారాంతం లోగా తుది రూపం వస్తుంది. వచ్చే వారంలో కమీటీని ప్రకటించవచ్చు. తెలంగాణాలో ఆందోళనలు దాదాపుగా తగ్గిపోయాయి. అక్కడక్కడ కొద్ది కొద్దిగా నిరసనలు జరుగుతున్నాయి. కాకపోతే కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటమే విచారకరం.. పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి. వాటిని అడ్డుకునే బాధ్యత తల్లిదండ్రులపై, ఉపాధ్యాయులపై, స్నేహితులపై ఉంది. మేము మా మాటలకు కట్టుబడి ఉన్నాం.. ఇలాటి చిన్న చిన్నవి తప్పిస్తే శాంతిభద్రతల పరిస్థితి మొత్తం మీద నియంత్రణలోనే ఉంది. కమిటీ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. దాని స్వరూపం మాత్రం ఇప్పుడే చెప్పలేను..’’.
మొత్తం మీద చిదంబరం మరో ఫీలర్ వదిలారు.. రాజకీయాలు వేడెక్కినప్పుడు.. ఆందోళనలు రేగినప్పుడు... వాటి దిశను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తున్నది. అందులో భాగమే చిదంబరం నోట మరో మాట.. డిసెంబర్ ౯న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడటం దగ్గర నుంచి కేంద్రం ఈ వ్యవహారాన్ని అతి సున్నితంగా డీల్ చేస్తూ వస్తున్నది. తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా తొలి ప్రకటన చేసిన తరువాత వెల్లువెత్తిన నిరసనలను చల్లార్చేందుకు రెండో ప్రకటన చేశారు.. వ్యవహారం తెలంగాణాలో రివర్స్ కావటంతో ఏకంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ అనిపించారు.. శాంతియుతంగా ఉండండంటూ సందేశం ఇచ్చారు.. ఇప్పుడు రాజీనామాల బెదిరింపులను సమాధానపరచటానికి కమిటీ ప్రకటన చేశారు.. దీని వల్ల కాంగ్రెస్ నేతలు కొంతవరకు సంతృప్తి పడవచ్చేమో కానీ, మిగతా పార్టీల నేతలు సంతోషపడే పరిస్థితి కనిపించటం లేదు.. చిదంబరం ప్రకటనను ఎవరికి తోచిన రీతిలో వారు అర్థం చేసుకుంటున్నారు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఏర్పాటు దిశగా సాగే ప్రయత్నంలో భాగంగానే కమిటీ అంటుంటే.. స్పష్టత లేని ప్రకటనలు మోసం చేసేందుకేనని మిగతా పార్టీల వాదన... అటు సీమాంధ్ర నేతల్లోనూ అంతగా సంతృప్తి కనిపించటం లేదు.. తెలంగాణ ఏర్పాటు చేయటం కోసమే ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారంటూ రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ విస్పష్టంగానే చెప్పుకొచ్చారు.. ఇక మిగిలింది పంపకాలేనంటూ ఆయన తేల్చేశారు కూడా... అటు తెలుగుదేశం నేతలు పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ లాంటి వారు కూడా ఈ ప్రకటన బ్లాక్మెయిల్ రాజకీయాలకు లొంగటమేనన్నారు.. తెలంగాణ తెలుగుదేశం నేతలు మాత్రం విస్పష్టంగా ప్రకటన చేస్తే తప్ప ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు.. వెరసి కర్రవిరక్కుండా, పాము చావకుండా చిదంబరం మరో నాలుగు మాటల అస్త్రాలను రాష్ట్రంలోని ఇరుపక్షాల మధ్యలో విడిచిపెట్టారు..అటు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రం ఎలాంటి కమిటీలను అంగీకరించేది లేనేలేదు పొమ్మంటోంది. ఇక నేతల ఇళ్లను ముట్టడించటమే తరువాయి అని కూడా స్పష్టం చేసింది. చిరంజీవి సానుకూలంగానే స్పందించారు.. వైఖరి స్పష్టం కాని పార్టీలకు ఇబ్బంది కానీ, కమిటీతో మాకేం నష్టం లేదన్నది ఆయన వాదన.. ఇక చంద్రబాబు ఏం మాట్లాడతారో తెలియదు.. అసలు మాట్లాడతారో లేదో కూడా తెలియదు.. ఇక మూలవిరాట్టు కెసిఆర్ మీడియా ముందుకు రావలసి ఉంది... జెఏసి ఏదో ఒకటి తేల్చుకుంటే కానీ ఆయన మాట్లాడరు.. మొత్తం మీద జనవరి ౨౮ డెడ్‌లైన్ ఏదీ తేల్చకుండానే తేలిపోయింది.. తెలంగాణ ఉద్యమ కారులు ఇప్పుడేం చేస్తారు? వేచి చూడాలి..
2 కామెంట్లు:
Whatever the committee is for, what is the guarantee that everybody will respect it's report(opinion)? Even then also, one side is going to loose. It is probably best to probe deeply all the aspects of the issue, instead of generating a report which is binding on everybody.
media (including the free lance blogs) should NOT carry/propogate the mis-interpretations of these statements.
politicians, esp. congress politicians are playing dirty tricks.
chidambaram did not say, "telangana formation is in the final stages"
he said, "a committee formation is in the final stages"
sarvey, vh, kk, janareddy, damodara reddy should be slapped to propogate stupid interpretations
కామెంట్‌ను పోస్ట్ చేయండి