3, మే 2010, సోమవారం

నరహంతకుడి నేరం రుజువైంది.. ముంబైపై ఉగ్రవాదులు ప్రకటించిన యుద్ధంలో దొరికిన ఒకే ఒక్క ముష్కరుడు అజ్మల్‌ ఆమీర్‌ కసాబ్‌ను కరడుగట్టిన నేరగాడిగా న్యాయస్థానం నిర్ణయించింది.. ఉగ్రవాదాన్ని ప్రేరేపించటంలో పాకిస్తాన్‌ ఎలాంటి భూమిక నిర్వహిస్తోందో, మొట్టమొదటిసారిగా మన న్యాయస్థానంలో రుజువయింది..
ఉగ్రవాద పాకిస్తానీ నరహంతకుడని రుజువైంది.. 2008 నవంబర్‌ 26న ముంబయిలో ముష్కరులు నిర్వహించిన మహా మారణకాండకు బలైన బాధితులకు ఇన్నాళ్ల తరువాత కాస్తంత ఊరట లభించింది. ముంబయిపై యుద్ధం చేసిన ఉగ్రవాదుల్లో మన బలగాలకు చిక్కిన ఒకే ఒక్కడు అజ్మల్‌ అమీర్‌ కసాబ్‌ను నేరగాడిగా కోర్టు ప్రకటించింది..
కసాబ్‌పై దాదాపు ౮౬ ఆరోపణలు దాఖలయ్యాయి. మొత్తం పన్నెండు కేసుల్లో కసాబ్‌ను దోషిగా న్యాయమూర్తి నిర్ధారించారు. కసాబ్‌ చేసింది యుద్ధమేనని జడ్జి వ్యాఖ్యానించటం మన దేశంపై పాకిస్తాన్‌ ఇంతకాలంగా చేస్తున్నదేమిటో అర్థమవుతుంది..

26/11 దాడిలో కసాబ్‌ ఏమిటో న్యాయపరంగా కూడా తేలిపోయింది.. ఈ మొత్తం వ్యవహారంలో కసాబ్‌ ఒక పావు మాత్రమే.. అతని బాస్‌లు పాకిస్తాన్‌లో ఇంకా దర్జాగానే ఉన్నారు.. వీరిపై చర్య కోసం పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురాగలిగినప్పుడే, ముష్కరులపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితులు కల్పించగలిగనప్పుడే.. టెర్రరిజానికి, పాకిస్తాన్‌కు సిసలైన గుణపాఠం చెప్పినట్లవుతుంది...
కసాబ్‌పై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు బాధితులకు పూర్తిగా న్యాయం చేసిందా? అంటే లేదనే చెప్పాలి.. అజ్మల్‌ అమీర్‌ కసాబ్‌తో పాటు నిందితులైన మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేయటం దురదృష్టం.. కసాబ్‌ ను నేరస్థుడిగా నిర్ధారించిన న్యాయస్థానమే.. అతనికి సహకరించారన్న ఆరోపణలపై నిందితులైన ఫాహిమ్‌ అన్సారీ, షాబుద్దీన్‌లను నిర్దోషులుగా పేర్కొంది.. ౨౬/౧౧కు ముందు అన్సారీ, షాబుద్దీన్‌లు ఇద్దరూ తాజ్‌, ఓబెరాయ్‌లలో రెక్కీ నిర్వహించారని, కసాబ్‌, ఇతర ఉగ్రవాదులకు అవసరమైన సాయాన్ని అందించారని ప్రాసిక్యూషన్‌ చేసిన ఆరోపణలను బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద కొట్టివేసింది. ఈ ఇద్దరినీ కోర్టు విడుదల చేసింది.
ఆరోపణలను పూర్తిగా రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైంది.. దీనిపై పై కోర్టుకు వెళ్లవచ్చు. వాస్తవానికి షాబుద్దీన్‌, అన్సారీలు కరడుగట్టిన నేరగాళ్లు.. ౨౦౦౫ బెంగళూరు ఐఐఐఎంఎస్‌ పై టెర్రరిస్టు దాడిలో షాబుద్దీన్‌, ౨౦౦౮లో ఉత్తరప్రదేశ్‌ రాంపూర్‌ సిఆర్‌పిఎఫ్‌ క్యాంపుపై దాడి కేసులో అన్సారీ నిందితులుగా ఉన్నారు.. పాక్‌ టెర్రరిస్టు అబూ ఇస్మాయిల్‌ దగ్గర ముంబయి నగర ప్లాన్‌ దొరికింది. ఈ ప్లాన్‌ను షాబుద్దీన్‌, అన్సారీలే ఇస్మాయిల్‌కు అందించారని ఆధారాలు ఉన్నప్పటికీ, వారిని నిర్దోషులుగా విడుదల చేయటం అసంతృప్తికి గురి చేసింది.. భారత న్యాయ చరిత్రలో ౧౭ నెలల స్వల్పకాలంలో తీర్పు చెప్పి ఉండవచ్చు కానీ, న్యాయానికి పూర్తి న్యాయం జరిగిందా అంటే లేదనే భావించాలి..
ఇప్పుడీ తీర్పుతోనో.. కసాబ్‌కు వేసే శిక్షతోనో టెర్రరిజాన్ని జయించేశామని భారత సర్కారు చేతులు ముడుచుకు కూచుంటే పొరపాటే.. ఈ కేసులో మునుపెన్నడూ లేని విధంగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ పూర్తి సహకారాన్ని అందించినట్లే.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఏం చేయాలో దృష్టి సారించటం అవసరం..

1 కామెంట్‌:

Rishi చెప్పారు...

Hmmm...కసబ్ నేరగాడు అని తేల్చడానికి ఇన్ని రోజులు పట్టింది.ఇక శిక్ష వెయ్యడం,మానవ హక్కుల సంఘాల వాళ్ళ గోల,శిక్ష అమలు..ఇవన్నీ అయ్యే పనేనా మన దేశం లో చెప్పండి.ఏ శిక్ష పడీతే మాత్రం ఏమిటి,అఫ్జల్ గురూ ని చూడట్లేదూ..పైగా ఈ వీఐపీ నేరస్తులని కాపాడటానికి చిన్న తరహా పరిశ్రమ పెట్టుబడి అంత ఖర్చు మళ్ళీ ఎదురు...అన్నిటి కంటే నవ్వు వచ్చే విషయం ఈ దాడిలో మన పొరుగు దేశం ప్రమేయం ఉంది అని రుజువయ్యింది అనడం.ఆ విషయాన్ని యే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు ఎవరు చేయించి ఉంటారో ఈ దాడి.దానికి వీళ్ళు కొత్తగా రుజువు చేసిందేమిటో....న్యాయ వ్యవస్థ etc అనకండి...మన దేశం లో శిక్షలు అమలు అవ్వలంటే ఎన్ని అడ్డంకులో తెలుసు కనకే నేరాలు ఇలా పెరిగిపోతున్నాయి
.