19, మే 2010, బుధవారం

గుర్తుకొస్తున్నాయి...

రాష్ట్ర రాజకీయాల్లో మే 20 , 2009 ఒక సంచలనాన్ని నమోదు చేసిన రోజు.. తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించి వరుసగా రెండోసారి వైఎస్‌ఆర్‌ అధికార ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. ఏడాది తిరిగిపోయింది.. అంతలోనే ఎంత మార్పు...వైఎస్‌ఆర్‌ అకాల మరణం రాష్ట్ర రాజకీయాల రూపు రేఖల్ని సమూలంగా మార్చేసింది.. అధికార పార్టీలో నిరుటి వెలుగులు ఇవాళ కనిపించటం లేదు..
ఆరేళ్ల పాటు ఏక వ్యక్తి నేతృత్వంలో విజయపరంపరలతో కొనసాగిన కాంగ్రెస్‌ ఇప్పుడు బేలగా ఎందుకు తయారైంది.....

సరిగ్గా ఏడాది క్రితం లాల్‌బహదూర్‌ స్టేడియంలో అశేష జనవాహిని సాక్షిగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్న కలలను కల్లలు చేయటమే కాదు.. తెలంగాణా రాష్ట్ర సమితి తో సహా ప్రతిపక్షాలన్నింటినీ గుక్క తిప్పుకోకుండా చేసి చీలికలు, పేలికలు అయ్యే పరిస్థితిని తీసుకువచ్చారు..

వైఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రతిపక్షాలకు ఊపిరి తీసుకోవటమే కష్టమైంది. ఆపరేషన్‌ ఆకర్ష కానీ, ఆపరేషన్‌ స్వగృహలు కానీ, మరే పేరు కానీ,,, రాజకీయాల్లో చాణుక్యుడనుకున్న చంద్రబాబులో సైతం కల్లోలం రేపిన రాజకీయం వైఎస్‌ఆర్‌ది..
తొలిసారి అధికారంలోకి వచ్చి అయిదేళ్లూ, మూడు సంక్షేమాలు.. ఆరు ప్రాజెక్టులన్న రీతిలో విజయవంతంగా పూర్తి చేశారు... సాధారణ మెజారిటీయే అయినా, వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి వైఎస్‌ అందరినీ ఆశ్చర్యపరిచారు.. రాష్ట్రంలోనే సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రికార్డు సృష్టిస్తారనీ అంతా భావించారు. రెండో టర్మ్‌ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో విపక్షాలకు ఉనికే లేకుండా చేస్తారని భావించారు..కానీ అంతలోనే జరగరాని అనర్థం జరిగిపోయింది.. హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హఠాత్తుగా రాష్ట్ర ప్రజానీకానికి శాశ్వతంగా దూరమైపోయారు..
అప్పుడే తొమ్మిది నెలలు గడిచిపోయాయి.. వైఎస్‌ఆర్‌ లేరన్న లోటు స్పష్టంగానే కనిపిస్తోంది. అటు ప్రజల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ.. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ను వైఎస్‌ లోటు చీలికలు పేలికలు చేసింది...

కాలం చక్రంలా తిరుగుతూనే ఉంది.. వైఎస్‌ లేకపోవటం అన్నది ఇవాళ్టికీ అనూహ్యమైంది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు సంభవించిన ప్రతిసారీ, కొత్త సమీకరణాలు చోటు చేసుకున్న ప్రతిసారీ వైఎస్‌-- అధికార, విపక్షాలకు గుర్తుకురాని సందర్భం ఉండదు.. వైఎస్‌ అధికారంలో ఉన్నప్పటి రాజకీయానికీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు ఎక్కడైనా పొంతన ఉందా?
వైఎస్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించినప్పటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో ఆయన మాటే చెల్లుబాటు అవుతూ వచ్చింది.. ఆ తరువాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన తరువాత వైఎస్‌కు ఎదురే లేకుండా పోయింది.. ౨౦౦౪లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 2009 సెప్టెంబర్‌ 2న ఆయన ప్రమాద వశాత్తూ మరణించేంత వరకూ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి అన్నదే లేకుండా చేశారు.. అధిష్ఠానానికి ఏపి వైపు కన్నెత్తి చూసే అవసరమే లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్‌కు అన్నీ తానే అయ్యారు..
కాంగ్రెస్‌లో వైఎస్‌ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. ఆయన నాయకత్వంలో ఉన్నన్నాళ్లూ కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరం మచ్చుకైనా వినిపించలేదు.. ఆయన వినిపించనివ్వలేదు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు లేవు.. ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనంలా మారిపోయింది..

కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలా ఉంటే విపక్షాల పరిస్థితి అయోమయంలా మారిపోయింది.. వైఎస్‌ ఉన్నంతకాలం టిడిపి, టిఆర్‌ఎస్‌ల నాయకత్వాలు దాదాపుగా నిద్రలేని రాత్రులనే గడిపాయని చెప్పవచ్చు. నిత్య అసమ్మతులు, రాజీనామాలతో రెండు ప్రధాన పార్టీలు గందరగోళంలో పడిపోయాయి..

ఇప్పుడు.........వైఎస్‌ లేరు.. విపక్షాలు పుంజుకుంటున్నాయి.. కాంగ్రెస్‌లో పాత సంస్కృతి పూర్తిగా జడలు విప్పుకుంది... అధిష్ఠానం ఆశీస్సులతో మాత్రమే కొనసాగే ముఖ్యమంత్రి.. సహకరించని మంత్రులు.. అసమ్మతులు... పరస్పర ఆరోపణలు.. కాంగ్రెస్‌లో ఇంతకాలం మౌనంగా ఉన్న గొంతులన్నీ ఇప్పుడు స్వరం పెంచాయి.. అధిష్ఠానానికి ఫిర్యాదుల పైన ఫిర్యాదులు వెళ్తున్నాయి.. మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటున్నా ఆపేవారు లేరు..
రాజకీయం ఇలా ఉంటే.. వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమం మరోదారిలో వెళ్తోంది.. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ప్రకటించిన సంక్షేమ పథకాలను ఏ విధమైన ఆర్థిక నిర్వహణతో ఆయన కొనసాగించారో.. ఆ విధమైన నిర్వహణ ఇప్పుడు కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు.. వైఎస్‌ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా వ్యవహరించిన రోశయ్యే ఇప్పుడు సిఎంగా ఉన్నారు.. కానీ, ఆర్థిక నిర్వహణ మాత్రం భారంగా మారింది. వైఎస్‌ మొదలు పెట్టిన స్కీములన్నింటికీ క్రమంగా మంగళం పాడే పనిలో పడ్డారు.. ఎంతోమంది లబ్ధి పొందుతున్న ఈ స్కీములు ఆగిపోతే పరిస్థితి ఏమిటి అన్నది సామాన్యుల్లో మెదులుతున్న ప్రశ్న.. వైఎస్‌ ఒక నిర్దిష్టమైన దారిలో నడిపించిన కాంగ్రెస్‌ ఇప్పుడు దారీ తెన్నూ లేకుండా పోతోంది.. వైఎస్‌ ఒక ప్రణాళిక ప్రకారం మొదలు పెట్టిన పథకాలు ఒక్కటొక్కటిగా కనుమరుగవుతాయని వినిపిస్తోంది.. వైఎస్‌ మాత్రం అందరికీ గుర్తుకు వస్తూనే ఉన్నారు...

2 కామెంట్‌లు:

వంశీ చెప్పారు...

మీరు చెప్పింది అంతా సరిగ్గానే ఉంది కాని ఎక్కడో కొన్ని అపశృతులు లా వినపడ్డాయి నాకు. "వైఎస్‌ ఒక నిర్దిష్టమైన దారిలో నడిపించిన కాంగ్రెస్‌ ఇప్పుడు దారీ తెన్నూ లేకుండా పోతోంది" వరకూ సరిగ్గానే ఉంది కానీ "వైఎస్‌ ఒక ప్రణాళిక ప్రకారం మొదలు పెట్టిన పథకాలు" అన్నది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజదూరమని గ్రహించాలి.

"ఆయన అధికారంలో ఉన్నంతకాలం ప్రకటించిన సంక్షేమ పథకాలను ఏ విధమైన ఆర్థిక నిర్వహణతో ఆయన కొనసాగించారో.. ఆ విధమైన నిర్వహణ ఇప్పుడు కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు.. వైఎస్‌ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా వ్యవహరించిన రోశయ్యే ఇప్పుడు సిఎంగా ఉన్నారు"
అని అన్నారు. అప్పటి ప్రపంచ ఆర్ధిక రంగం నేటి పరిస్థితులలో తేడా గమనించండి. స్వయానా రాజశేఖరుల వారే రెండో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత "ప్రజా సంక్షేమ పధకాలకి డబ్బు లేనందువల్ల జనాల మద్యకి వెళ్ళ లేకపోతున్నా"మని పత్రికా ముఖంగా చెప్పిన సంగతి గంతంలోకి వెళ్ళి చూడాలని మనవి.

అజ్ఞాత చెప్పారు...

dikkumalina chavu chachadu kada.. inka ardham kaleda eduku ala ayindi ani ..

nee lanti talakumasina(?) vdi koduku malli ready ayyadu kada..