2, మే 2012, బుధవారం

పాత సామాన్ల సంఘం ఎన్నికల మేనిఫెస్టో

అఖిల భారత పాత సామాన్లు కొనే సంఘం అత్యవసర సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో వచ్చే ఉప ఎన్నికల గురించి తీవ్రంగా చర్చించారు. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాల్సిందేనని ఇందులో ఎకగ్రీవంగా తీర్మానించారు. అసలు ఏ రాజకీయ పార్టీకి, నాయకులకు ఈ ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని ఇందులో స్పష్టం చేశారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా ఎన్నికల సమయంలో తప్ప మళ్లీ కనపడరని పాత సామాన్లు కొనే సంఘం నేతలు ఆరోపించారు. ఎన్నికలతో నిమిత్తం లేకుండా ప్రతి రోజూ ఇంటింటికీ తిరిగేది తామొక్కరమేనన్నారు. పాత సామాన్లను ఎలా వదిలించుకోవాలో తెలియక నానా పాట్లు పడే ఇళ్ల యజమానుల సమస్యను తాము మాత్రమే పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే కాలనీలలో రోజూ తిరుగుతూ సెక్యూరిటీ గార్డులు లేని కొరతను కూడా తామే తీరుస్తున్నామని అన్నారు. కష్టకాలంలో పాతసామాన్లకు బదులుగా ఉల్లిపాయలు, మామిడికాయలు, బఠానీలు, పల్లీలు ఇస్తూ ప్రజల ఆకలి తీరుస్తున్నామని అన్నారు.  ఇలా రోజూ ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న తమకు మాత్రమే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందని పాత సామాన్ల సంఘం నేతలు స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూసేది తాము మాత్రమేనన్నారు. ప్రజలకు ఎల్లవేళ్లలా అందుబాటులో ఉండేది కూడా తామేనని చెప్పారు. రాజకీయ నాయకులు అయిదేళ్లకోసారి హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి పాత సామాన్ల సంఘం ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది.
ఇందులో ప్రధానాంశాలు..
1. రోజుకు రెండుసార్లు పాత సామానర్లు కొనడం.
    దీని వల్ల ఇళ్లలో చెత్త తగ్గుతుంది.
2. రాత్రిపూట కూడా కొనే సదుపాయం కల్పించడం
     దీనివల్ల అదనపు గస్తీ ఏర్పాటవుతుంది.
3. పాత సామాన్లకు బదులుగా ఉల్లిపాయలతో పాటు, టీ, టిఫిన్‌,, మీల్స్‌ ఇచ్చే ఏర్పాటు
4. పాత సామాన్ల కొనుగోలుదారులు ఇంకా ఎక్కువగా తిరగడానికి వీలుగా సిమెంటు రోడ్లు వేయించటం
5. ప్రతి కాలనీలో ఒక పాత సామాన్ల దుకాణం ఏర్పాటు చేయటం. ఇది 24 గంటలూ తెరిచి ఉంటుంది.
6. పాత సామాన్లు ఎప్పుడు అమ్మాలన్నా ఫోన్‌ చేసి పిలిపించుకునే అవకాశం కల్పించటం. ఇందుకోసం టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయటం...

Report by sri venkat reddy, journalist

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.........