ఆయన గురించి రాయాలంటే ఎంతో శక్తి కావాలి. అల్పుడిని నా వాళ్ళ అయ్యే పని కాదు. పుంభావ సరస్వతి కడుపున జన్మించటం ఎన్ని జన్మల పాటు తపస్సు చేస్తే మాత్రం సాధ్యం cheppandi? ఈ జీవితానికి ఆయన కడుపునా పుట్టినందుకు కొద్దో గొప్పో ఈ కాస్త నాలుగు మాటలు రాయగాలిగా. నా పాలిట నడిచే దేవుడు అయన.
.........................................................
నా పుట్టుకే పూర్వజన్మ సుకృతం. ఏమి తపస్సు చేసి జన్మించానో నాకైతే తెలియదు కానీ, సాక్షాత్తూ విద్యాసరస్వతి కడుపున పుట్టాను.
‘‘నిజమునకు భావుకుండని
సృజనన్ పదివేల మంది నెవ్వడొయొక్కం
డు జనించు, మెరయువానికి
రజనీపతి కాంతి భ్రూభరమ్మపుడపుడై’’
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచితమైన పద్యమిది. తెలుగుదేశంలో విశ్వనాథ సాహిత్యానికి ఈరోజు సాధికారత ఉన్న సారస్వత మూర్తి ఎవరైనా ఉన్నారంటే.. వారు మా నాన్నగారు.. ఆచార్య కోవెల సుపసన్నాచార్య.తెలుగు సాహిత్యంలో నవ్యసంప్రదాయవాదానికి నాంది పలికి, చేతనావర్తంతో అరాచక అధిక్షేపాన్ని నిరసించిన ఈ పుంభావ సరస్వతికి విశ్వనాథవారి ఈ పద్యం సంపూర్ణంగా వర్తిస్తుంది. సద్గురువులన్నట్లు సౌమ్య, గంభీర, మిత భాషాద్యనేక శుభలక్షణ సంపన్నులైన ఆ సరస్వతీ తీర్థులకు కుమారుడిగా పుట్టడం కంటే ఈ జన్మకు సార్థకత ఏముంటుంది? ఆయన సాహిత్య సాగరంలో నేను నీటిబొట్టునైనా కాలేకపోవచ్చు.. కానీ, సాహిత్యమైనా, సాంఘికమైనా రాయటమన్నదే వృత్తిగా మలచుకుని ఈషణ్మాత్రమైనా ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేయగలుగుతున్నానంటే ఆయన సంపూర్ణ కరుణా కటాక్షాలవల్లే.. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ.. నా రాతలోని ప్రతి పదంలోనూ ఆయన ముద్ర తప్ప అన్యథా కనిపించదు. నాకు అస్తిత్వం.. ఉనికి.. మనుగడ.. అంతా ఆ ‘‘కోవెల’’నే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి