9, మార్చి 2010, మంగళవారం

పాపం టైగర్‌...


జాతీయ జంతువుపై జనరాకాసుల పంజా...
అడవుల్లో యథేచ్చగా సాగుతున్న పులుల వేట..
లాభసాటి వ్యాపారంగా మారిన స్మగ్లింగ్‌..
వేగంగా కనుమరుగవుతున్న పులులు..
జవాబుదారీ లేని సర్కారు..
అడవుల్లో వేట... అదీ టైగర్‌ను వేటాడటం.. అబ్బో... ఒకప్పుడు రాజులకు, రాచరిక దర్పానికీ షాన్‌... పహచాన్‌.. అప్పుడు అడవులు ఎక్కువగా ఉండేవి.. జంతువులు ఎక్కువగా ఉండేవి.. జనావాసాల మీదకు క్రూర జంతువులు దాడులు చేయకుండా కాపాడేందుకు వేట జరిగేది.. ఇప్పుడూ వేట కొనసాగుతూనే ఉంది.. కానీ, ఇప్పుడదొక లాభసాటి వ్యాపారం.. దొంగతనం.. స్మగ్లింగ్‌... ఫలితం క్రమంగా కనుమరుగవుతున్న వన్యప్రాణి సంపద..
పులి.. వన్యప్రాణుల్లో అరుదైన జంతువు.. అందునా మన జాతీయ జంతువు.. ఇవాళ వేగంగా కనుమరుగవుతున్న జంతువూ అదే.. సర్కారు వారు ఏదైతే చేయకూడదని నిషేధిస్తారో,... ఆ పని చేయటంలోనే కొందరికి మజా.. హాబీ.. అదే బిజినెస్‌... అందులో పులి వేట ఒకటి.. ఇప్పుడు ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జోరుగా సాగుతున్న స్మగ్లింగ్‌...

టైగర్‌ గర్జన ఇక వినిపించదా? మన జాతీయ జంతువును మనమే వేటాడుతుంటే.. చర్మాన్ని అందిన కాడికి అమ్ముకుంటుంటే ఆపేవారెవరు? అభయారణ్యాలనీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలనీ ఓ... బోర్డులయితే తెగ పెట్టేస్తారు.. టైగర్‌ జోన్‌లోకి వెళ్లవద్దని హెచ్చరికలూ చేస్తారు.. కానీ... అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా కొనసాగుతున్న వేట చూస్తుంటే... చివరకు ఈ బోర్డులు తప్ప వన్యప్రాణులు మిగులుతాయా అన్న సందేహం కలుగుతోంది...
ఇది నిజం.. ఇవాళ ఖమ్మం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న తంతు ఇదే.. అత్యంత ప్రమాదకరంగా పులుల వేట జరుగుతోంది.. పెద్ద పులులు, చిరుతల సంహారం యథేచ్ఛగా కొనసాగుతోంది.. పకడ్బందీ ప్రణాళికతో.. పక్కా ఎత్తుగడతో ఉచ్చు వేసి మరీ పులులను హతమారుస్తున్నారు..
పులులు, చిరుతల సంచారమున్న అటవీ ప్రాంతంలో వీళ్లు ముందుగా ఉచ్చులు వేస్తారు.. వాటికి పులుల మెడలు బిగుసుకుని చచ్చిపోతాయి..

అలా సాధ్యం కాని పక్షంలో మరో దారుణమైన ప్రత్యామ్నాయాన్నీ ప్రయోగిస్తారు.. అడవుల్లో ప్రవహించే వాగులు, వంకలు, నీటి గుంటల్లో పురుగు మందులు కలిపేస్తారు.. దాహం తీర్చుకోవటానికి వచ్చిన పులులు ఆ నీటిని అమాయకంగా తాగి మృత్యువాతపడతాయి...
నిజానికి ఈ వేటగాళ్లు అమాయక గిరిజనులు... అసలైన వేటగాళ్లు వేరే ఉన్నారు.. వాళ్ల ఉచ్చులో ముందుగా వీళ్లు పడతారు.. వాళ్లు చెప్పిన పనల్లా చేసి పెడతారు...కొద్దో గొప్పో డబ్బులకు ఆశపడ్డ గిరిజనులు పులులను హతమారుస్తారు.. అసలైన స్మగ్లర్లు వీళ్ల దగ్గర నుంచి మూడు నాలుగు వేల రూపాయలు చెల్లించి పులి చర్మాన్ని తీసుకువెళ్తారు..


పులి చర్మం కేవలం మూడు వేల రూపాయలేనా? ఆశ్చర్యపోకండి.. పులుల చర్మాలు, గోళ్ల వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో జరిగేది... మిగతా వ్యాపారాల్లో మాదిరిగానే ఇందులోనూ సొమ్ములు దండుకునేది, దళారులు.. అసలు స్మగ్లర్లు... గిరిజనులు కేవలం వీరికి ఉపయోగపడే పావులు మాత్రమే...
పులుల వేట జరుగుతున్నట్లు సమాచారం అందిన ప్రతిసారీ అటవీ శాఖాధికారులు పెద్ద ఎత్తున నిఘా వేసి దొంగల్ని పట్టుకుంటారు.. ప్రతి సంవత్సరమూ ఈ తరహా కేసులు నమోదవుతూనే ఉన్నాయి...
పులులను వేటగాళ్లు వేటాడినట్లే.. వాళ్లను అటవీ అధికారులు వేటాడి పట్టుకుంటున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది... కానీ వచ్చిన చిక్కల్లా వేరే ఉంది.. అటవీ అధికారులకు పట్టుబడే వాళ్లంతా సామాన్య గిరిజనులే... వాస్తవంగా పులులను వీళ్లే హతమార్చినా.. వీరి చేత ఈ పని చేయిస్తున్న అసలు వేటగాళ్లు వేరే ఉన్నారు.. వారు పట్టణ వాసాలను వీడి బయటకు రారు.. బయటపడరు..
అధికారులు మాత్రం గిరిజనులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేసి పనయిందనిపించుకుంటారు..
అసలు స్మగ్లర్లపై మాత్రం ఎలాంటి కేసులూ నమోదు జరగవు.. వారి వంక కన్నెత్తి కూడా చూసేవాళ్లు కనపడరు..వీరంతా హైదరాబాద్‌ కేంద్రంగానే అంతర్జాతీయ వ్యాపారం వెలగబెడుతున్నారు.. మూడునాలుగు వేల రూపాయలకు గిరిజనుల నుంచి కొనుక్కున్న పులి చర్మాలను ఒక్కొక్కటిని ౭౫ వేల రూపాయల వరకు ఎగుమతి చేస్తారు..ఇక గోళ్ల ధర కూడా తక్కువేం పలకదు.. ౩వేల నుంచి ఒక్కోసారి పది వేల రూపాయల దాకా ఒక్కో గోరు పలుకుతుంది.. ఎముకలకు కూడా విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది...
వన్యప్రాణులను కాపాడుకోవటానికి చట్టాలు ఉన్నాయి.. జంతు సంరక్షణ సంస్థలూ ఉన్నాయి.. అయినా వేట నిరాటంకంగా కొనసాగుతోంది.. మరెందుకు ఈ చట్టాలు..? ఓ వైపు దేశంలో ఎన్ని పులులు ఉన్నాయనే గణాంకాలు తీస్తున్నారు.. ఇంకోపక్క పులుల వేట కొనసాగుతోంది.. వేటను నియంత్రించలేనప్పుడు గణాంకాలు చేసి మాత్రం ఏం ప్రయోజనం?
ఖమ్మం జిల్లాలో అటవీప్రాంతం ౮, ౪౦౦ చ.కిమీ..
కిన్నెర సాని అభయారణ్యం ౬౩౫ చ.కిమీ.
పాపికొండలు అభయారణ్యం ౧౧,౨౦౦ చ.కిమీ
(భద్రాచలం సౌత్‌ డివిజన్‌, (తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు కలుపుకుని)
పాపికొండలు అభయారణ్యంలోనే పులులు, చిరుతల సంచారం
వీటి చర్మాలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌..
౨౦౦౦ నుంచి ౨౦౦౯ వరకు ౧౩ చిరుత చర్మాల స్వాధీనం..
౧౯౭౨లోనే అమల్లోకి వచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం
౨౦౦౫లో చట్టానికి సవరణ చేసిన సర్కారు...
అయినా పులి సంహారం..ఆగడం లేదు
మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఒరిస్సాల నుంచీ స్మగ్లర్లు ఖమ్మం అడవుల్లో చొరబడుతున్నారు.. వీళ్లందరికీ దేశ వ్యాప్తంగా పక్కా నెట్‌వర్కింగ్‌ ఉంది.. వీళ్లకుండా పలుకుబడి కూడా తక్కువేమీ కాదు. బ్యూరోక్రసీని, రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేయగల సమర్థులు కాబట్టే వీరి ఆటలు సాగిపోతున్నాయి. వీళ్లను పట్టుకోవటం మామూలు అధికారుల వల్ల అయ్యే పని కాదు..పాలకులు ఇందుకు పూనుకోవాలి.. పకడ్బందిగా వ్యవహరించాలి...అప్పుడే జాతీయ జంతువును కాపాడుకోవటం సాధ్యపడుతుంది..


స్కూలు అంటే ఓ దుకాణం..

స్కూలు అంటే ఓ దుకాణం.. ఓ చిట్‌ఫండ్‌ కంపెనీ.. ఓ ఫైనాన్స్‌ సంస్థ... ఇదేమని ఆశ్చర్యపోకండి... మన దేశంలో చదువు అనేది అచ్చొచ్చే బిజినెస్‌గా ఎప్పుడో మారిపోయింది. స్కూళ్లు చదువును అమ్ముకునే అంగళ్లుగా రూపాంతరం చెంది చాలా కాలమే అయింది... విద్యార్థుల నుంచి అడ్డగోలుగా డబ్బులు దండుకోవటం.. స్కూలును చూపించి బయట వడ్డీలకు అప్పులు చేయటం.. రొటేషన్లు.. సెటిల్మెంట్లు.. అన్నీ కలిస్తే దాని పేరు విద్యాలయం... అలియాస్‌ కెపిఎస్‌ స్కూల్‌...

పేరుకు మాత్రం అది పెద్ద స్కూలు.. కానీ అక్కడ యాజమాన్యం నడిపేది ఓ దుకాణం.. అదే చదువుల కొట్టు.. ఇక్కడ చదువు చెప్పరు.. అమ్ముతారు.. నాలుగు వందల మంది విద్యార్థుల దగ్గర నుంచి అందినకాడికి దండుకోవటంలో వీళ్ల ఎక్స్పీరియన్స్‌ అబ్బో బోలెడంత... పిల్లల దగ్గర నుంచే కాదు... ఈ బడిని చూపించి బయట కూడా చేతికి తోచినంత అప్పులు చేసి చక్కా ఉడాయించారు సదరు స్కూలు యజమాని...

దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని మారుతీనగర్‌లో ఉన్న స్కూలు వైభవానికి ఆ స్కూలు బోర్డు ఉదాహరణ. నీతి సూత్రాలు.. వివేకానందుడు, మదర్‌ థెరెస్సాల ఆదర్శాలు తెగ వల్లెవేశారు... పాపం వాటన్నింటినీ నిజమేనని నమ్మిన పిల్లలు పొలోమని వచ్చి చేరిపోయారు...అక్షరాలా నాలుగు వందల యాభై మంది విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయం.. ఈ నెలాఖరు నుంచి యాన్యువల్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఇవాళో, రేపో హాల్‌టికెట్లు ఇస్తారని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.. ఇవాళ ఉదయం హటాత్తుగా పాఠశాలను మూసేస్తున్నట్లు ప్రకటించేసి బోర్డు తిప్పేశారు..
ఉన్నట్టుండి స్కూలు ఎందుకు మూసేశారో అర్థం కాక విద్యార్థులు, తల్లిదండ్రులు అవాక్కయ్యారు..
జవాబు ఇచ్చేవారు లేరు.. అయోమయం...పరీక్షలు దగ్గరకు వచ్చిన సమయంలో ఇలా జరగటం మింగుడు పడని పరిస్థితి...
గమ్మత్తేమిటంటే గత నాలుగు రోజులుగా వరుసగా సెలవులు వచ్చాయి. ఈ సెలవులను పాఠశాల యాజమాన్యం చక్కగా వినియోగించుకుంది. అన్నీ చక్కబెట్టుకుని ఎంచక్కా చెక్కేసింది.
అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయటంలో ఈ స్కూలుకు సాటిరాగలది మరోటి లేనే లేదు.. సిబ్బందికి మాత్రం నాలుగైదు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు.. పరిస్థితి చేయి దాటినా ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. అధికారులు పట్టించుకోలేదు.. పదో తరగతి దాకా అనుమతి లేకుండా స్కూలు నడుపుతుంటే... ఫీజులు దండుకుంటుంటే.. విద్యార్థులను ప్రెユవేటుగా పరీక్షలను రాయిస్తుంటే చేష్టలుడిగి చూస్తున్నారో... లేక కావాలనే తేలిగ్గా తీసుకున్నారో... అర్థం కాని స్థితి....
వేరే పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తామంటూ అధికారులైతే చెప్తున్నారు కానీ, పరీక్షలు ముంచుకొచ్చిన ఈ తరుణంలో ఇది ఎంత వరకు సాధ్యమన్నది అర్థం కాదు.. పరీక్షల ముందు సహజంగానే మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు.. ఈ పరిణామంతో మరింత దిగాలు పడిపోయారు.. ఇలాంటి యాజమాన్యాలను ఏం చేయాలి? ప్రభుత్వమూ పట్టించుకోక, పార్టీలూ పట్టించుకోక..నడివీధిలో విద్యార్థులను నిలబెట్టారు..


ఆత్మహత్యల తెలంగాణా...

ఎవరు ఆపాలి...ఈ ఆత్మహత్యల పరంపరని... రాజకీయ నాయకులు చప్పబడిపోయారు.. తమ వ్యవహారాలను బహుబాగా చక్కబెట్టుకుంటున్నారు.. నిరాహార దీక్షల శిబిరాలు బోసిపోయాయి.. శ్రీకృష్ణ కమిటీ వచ్చింది.. వెళ్లింది.. ఎవరైనా నివేదికలు ఇవ్వవచ్చంటూ ఓ మాటనేసి పాపం న్యాయమూర్తి వెళ్లిపోయారు.. కానీ, తెలంగాణాలో పిల్లల భావోద్వేగాలు, లోలోపల రేగుతున్న అలజడులు ఎంతమాత్రం చల్లారటం లేదు.. ప్రతిక్షణం ఒకే ఆలోచన.. ఏం జరుగుతుంది? తెలంగాణా వస్తుందా? రాదా? ఇక రాదేమో.. ఈ చేవచచ్చిన, చేతకాని రాజకీయ నాయకుల వల్ల సాధించేదేమీ ఇక లేదు.. ఈ మానసిక ఆందోళనలను చల్లబరిచే ప్రయత్నం చేస్తున్న వాళ్లెవరూ లేరు.. నిన్నటికి నిన్న వరంగల్‌ నగరంలో ప్రజాశక్తి పత్రిక విలేఖరి సునీల్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని అంతిమ యాత్ర అక్కడ కొనసాగుతుండగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం మినీటెక్‌ హాస్టల్‌లో నల్గొండ జిల్లా కోదాడకు చెందిన సాయికుమార్‌ ఉరివేసుకున్నాడు.

. సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదంటూ ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్తున్నా.. వీళ్లను కన్విన్స్‌ చేయలేకపోతున్నాయి..ఒక పరిష్కారాన్ని సాధించుకోవటానికి మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ, వాటన్నింటినీ వదిలేసి ఆత్మహత్యలు చేసుకోవటం ద్వారా వాళ్లనుకున్న లక్ష్యం ఎలా సాధ్యమవుతుంది? అమరులవటం వల్ల తల్లిదండ్రులకు గర్భశోకం.. స్నేహితులకు విషాదం... తల్లి తెలంగాణాకు తీరని దుఃఖం.. దీన్ని గ్రహించాలి.. నేతలు చేస్తున్న ద్రోహానికి వాళ్లను నిలదీయాలి.. పోరాటం దిశగా వాళ్లను కదిలించండి... మరింత ఉధృతంగా పోరాటం చేయండి.. లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లాలి కానీ, ఆత్మహత్యలు చేసుకోవటం యుద్ధం నుంచి పిరికివాళ్లలా పారిపోవటం లాంటిదే... ఉన్నతంగా సాగుతున్న పోరాటంలో ఒక ఆత్మహత్య జరిగితే , . ఉద్యమించిన సైన్యంలో ఒక యోధుడు తగ్గినట్లేనని భావించాలి...తెలంగాణాకు నిజమైన రాజకీయ నాయకత్వం అనేది ఉండి ఉంటే తెలంగాణ అసలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యేదే కాదు.. ఈ సత్యాన్ని గ్రహించండి.. తెలంగాణాకు రాజకీయ నాయకత్వం అంటూ లేనే లేదు.. చెన్నారెడ్డి అయినా, కెసిఆర్‌ అయినా.. ఆ రాజకీయ నాయకత్వానికి ముసుగుల్లాంటి వారే.. ముసుగు తొలగిస్తే.. అంతా డొల్లే.. తెలంగాణా ప్రజను ముందుండి నడిపించే, మార్గదర్శనం చేసే నాయకత్వాన్ని ముందుగా పెంపొందించుకోవాలి.. సైన్యాధ్యక్షుడు లేకుండా సైన్యం తలోదిక్కున పయనిస్తే.. ఎదురయ్యేది ఇదిగో.. ఇలాంటి ఓటమే... దీన్ని అధిగమించటానికి ఏం చేయాలో.. ఎలా ముందుకు సాగాలో ఆలోచించుకోవాలి కానీ, ఆత్మహత్యలు చేసుకోవటం సరి కాదు.. మనం జీవించి ఉండి కలల్ని సాకారం చేసుకోవాలి కానీ, జీవితాన్ని అంతం చేసుకున్న తరువాత ఏం సాధించినా ఏం ఫలితం?

ఒక అడ్డంకిని అధిగమించిన మహిళాబిల్లు...

అలజడులు.. అల్లర్లు.. ఆందోళనలు.. గల్లీ కొట్లాటలకు వేదికగా తలపించిన రాజ్యసభ.. సభాపతి అన్న మర్యాదను సైతం సభ్యులు ఉల్లంఘిస్తే.. ప్రజాస్వామ్యం విస్తుపోతూ చూస్తూ ఉండిపోయింది.. ఏడుగురు సభ్యులు.. ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్లే.. అయినా గద్దల్లా ప్రజాస్వామ్యాన్ని పొడుచుకుతినేందుకు ప్రయత్నించారు ఈ డర్టీ సెవెన్‌...భారత స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారి రాజ్యసభలో సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడటం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని కళంకం.. దాని పేరే పెద్దల సభ.. కానీ, సభ్యులు మాత్రం పెద్దల్లా ప్రవర్తించింది లేదు.. ఇలాంటి వాళ్లనా మన రాజకీయ పార్టీలు పెద్దల సభకు పంపేది... ఆ సభకు ఇంతకాలంగా ఉన్న మర్యాదలన్నింటినీ ఈ డర్టీ సెవెన్‌ మంటగలిపేశారు.

ఈ గొడవల మధ్యలోనే.. ఈ గందరగోళం కొనసాగుతుండగానే బిల్లుపై చర్చనూ మమ అనిపించారు.. ఓటింగూ జరిపించారు.. విచిత్రమేమంటే.. రాజ్యసభలో ౨౩౩ మంది సభ్యులు ఓటింగ్‌ సమయంలో హాజరు అయితే బిల్లుకు అనుకూలంగా ౧౮౬ ఓట్లే పడ్డాయి.. ఒకే ఒక్క ఓటు వ్యతిరేకంగా పడింది.. మిగతా ౪౬ మంది ఓట్లేయలేదు.. వాస్తవానికి సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న ఎస్‌పి, ఆర్‌జెడి ఇతర సభ్యులు ౩౪ మందే ఉన్నారు.. ఇద్దరు బిఎస్‌పి సభ్యులు ముందే బహిష్కరించారు.. మరి మిగతా పది మంది ఎవరు..? ఏ పార్టీకి చెందిన వారు? వీరిలో అధికార పార్టీ, బిజెపికి చెందిన వాళ్లెవరైనా ఉన్నారా? ఇవన్నీ తెలియాల్సి ఉంది...
ఏమైతేనేం.. మొత్తం మీద మహిళాబిల్లుపై రాజ్యసభ ముద్రపడింది.. ఇక లోక్‌సభ ఆమోదమే తరువాయి.. దీనికి ఎంత హంగామా జరుగుతుందో.. ఎన్ని గందరగోళం సృష్టిస్తారో చూడాలి....
మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రకారం........
లోక్‌సభలో, శాసన సభల్లో...౩౩.౩శాతం సీట్లను మహిళలకు కేటాయించటం జరుగుతుంది..
పార్లమెంటులో ఇప్పటికే ఎస్‌సి, ఎస్‌టిలకు ౨౨.౫ శాతం రిజర్వేషన్లు ఉన్నాయి..

ఈ ఎస్‌సి ఎస్‌టి రిజర్వేషన్లలోనూ ౩౩.౩ శాతం మహిళలకు కేటాయించాలని బిల్లు నిర్దేశిస్తోంది.. అదే జరిగితే ఎస్‌సి ఎస్‌టిలకు ఉన్న ౨౨.౫ శాతంలో ౭.౫ శాతం మహిళలకు కేటాయించాల్సి వస్తుంది..
మొత్తం మీద లోక్‌సభలో మహిళల సంఖ్య ౧౮౧మందికి చేరనుంది...
మన రాష్ట్ర అసెంబ్లీలో మహిళల సంఖ్య ౯౮కి చేరుతుంది.
ప్రస్తుతం ౧౫వ లోక్‌సభలో ౫౯ మంది మహిళలు ఉన్నారు.. అంటే మహిళల సంఖ్య ౧౦.౮శాతం..
మన రాష్ట్రానికి సంబంధించి ౧౩వ శాసనసభలో ౩౪ మంది మహిళలు ఉన్నారు.. అంటే మన అసెంబ్లీలో మహిళల శాతం ౧౧.౫

డర్టీ సెవెన్‌...

డాక్టర్‌ ఇజాజ్‌ అలీ...
జెడి(యు) ద్వారా రాజ్యసభలో ప్రవేశించారు..
పేరుకు పెద్ద డాక్టర్‌... చదువులు గొప్ప.. చేష్టలు దిబ్బ..


షబీర్‌ అలీ...
లోక్‌ జనశక్తి పార్టీ నుంచి రాజ్యసభకు చేరుకున్న ఈయన
చదువుకున్నది తక్కువ...
సెటిల్మెంట్లు చేయటంలో.. పంచాయతీలు పరిష్కరించటంలో మేధావి..

కమల్‌ అఖ్తర్‌..
ఉత్తరప్రదేశ్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఈయన గారి రాజకీయ ఆవాసం
ఎస్‌పి మార్క్‌ రాజకీయానికి ఈయన మచ్చుతునక..
సమాజసేవకుడి నుంచి రాజకీయాల్లో ఎదిగిన నేత

ఆమీర్‌ అలం ఖాన్‌
ఈయనా సమాజ్‌వాదీ మాణిక్యమే...
ఈయన రైతు.. పలు పుస్తకాలు కూడా రాశారు..

వీర్‌పాల్‌సింగ్‌ యాదవ్‌
యుపి నుంచే ఎస్‌పి ద్వారా రాజ్యసభకు ఎంపిక..
బిఎ ఎల్‌ఎల్‌బి. చదివి చాలా పదవులు నిర్వహించారు

నందకిశోర్‌ యాదవ్‌..
యుపికే చెందిన ఈయన ములాయంకు సన్నిహిత సహచరుడు
రాజనీతి శాస్త్రంలో ఎంఎ చదువుకున్నాడరు..
లాయర్‌ వృత్తినీ వెలగబెడుతున్నారు..

సుభాష్‌ యాదవ్‌...
ఈయన అడ్రస్‌ కేరాఫ్‌ లాలూ...
లాలూ గారి ముద్దుల బావమరిది...
బావగారి అండతో బీహార్‌లో రాజ్యమేలుతున్న పెత్తందారీ..

27, ఫిబ్రవరి 2010, శనివారం

నేను రాను బిడ్డో సర్కారి దవాఖానకు...

ప్రభుత్వాసుపత్రుల్లో విచిత్రాలు.. విషాదాలు చోటు చేసుకోకపోతే ఆశ్చర్యపోవాలి కానీ... లేకపోతే ఎందుకు?.. ఒకటి కాదు..రెండు కాదు.. వరుసగా... ఒకదాని వెంట ఒకటిగా ఘటనలు జరుగుతున్నా... సర్కారు నోట ఒకే మాట... విచారణ జరిపిస్తాం... ఇంతే తప్ప చర్యల దగ్గరకు వచ్చేసరికి వాటి గురించి ఆలోచించే తీరిక అమాత్యులకు కానీ, అధికారులకు కానీ ఇసుమంతైనా ఉండదు.. ఫలితం ఇవాళ విశాఖ కెజిహెచ్‌లో జరిగిన ఘటన... ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన పసిగుడ్డు కుక్క పాలైంది...

విశాఖ పట్నం కింగ్‌ జార్జి హాస్పిటల్‌... అబ్బో.. దీనికున్న పేరు ప్రతిష్ఠలు అన్నీ ఇన్నీ కావు.. వైద్యంలో ఎంత పేరుందో.. నిర్లక్ష్యంలోనూ అంతే పేరు ఉంది... ఇక్కడి వైద్య అధికారులకు, సిబ్బందికి పేరుకు మాత్రమే ఉద్యోగం... బాధ్యతలంటే వీరికి ఎంతమాత్రం సరిపడవు.. నిన్న రాత్రి అనురాధ అనే ఓ మహిళ కెజిహెచ్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది... ఆ పసికందుకు మొదట స్నానం చేయించాలంటే అయిదు వందల రూపాయలు కావాలంటూ సిబ్బంది తెగేసి చెప్పారు.. అందుకు అనూరాధ కుటుంబ సభ్యులు కాదనటంతో పసికందును అలాగే వదిలేసి వెళ్లారు..తెల్లవారేదాకా కూడా పుట్టింది మగబిడ్డో.. ఆడబిడ్డో కూడా చెప్పలేదు.. బంధువులకు అప్పజెప్పలేదు.. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కుక్క... కళై్లనా తెరవని శిశువును నోట కరచుకుని పరిగెత్తుకుని వెళ్లి పీక్కు తింది...
ఇంత దారుణం జరిగిన తరువాత పుట్టింది మృత శిశువంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్లేటు మార్చారు.. రికార్డులూ మార్చేస్తున్నారు...

చివరకు మీడియాలో వార్తలు వచ్చాయి కాబట్టి రాష్ట్ర రాజధానిలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి రొటీన్‌గా చెప్పే డైలాగే అదే నండీ విచారణ జరిపిస్తామని చెప్పేశారు..
ఒక ఘటన జరగ్గానే సంబంధిత శాఖ మంత్రులు ఎలా స్పందించాలో అలాగే స్పందించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు.. విశాఖ కెజిహెచ్‌లో ఓ పసికందు.. వీధి కుక్కకు పలహారంగా మారితే మంత్రి యథాలాపంగానే విచారణ జరిపిస్తామన్నారు.. మన ప్రభుత్వాసుపత్రుల పట్ల మంత్రికి ఉన్న అపారమైన శ్రద్ధకు జోహారు అర్పించకుండా ఎలా ఉండగలం?
ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్న ఆ బాధితుల శోకాన్ని తీర్చేదెవరు? అవి ఆసుపత్రులా?
కుక్కలు, పందులు సై్వరవిహారం చేసే చెత్తకుప్పలా?
సామాన్యులు కుక్కల కంటే హీనంగా కనిపిస్తున్నారా?
నిర్వహణకు మరోపేరు నిర్లక్ష్యమేనా?
ఆపరేషన్‌ థియేటర్‌లోకి కుక్క ఎలా ప్రవేశించింది?
రికార్డులు తారుమారు చేస్తున్నదెవరు?
ఇలాంటి దారుణాలకు జవాబుదారీ ఎవరు?
సర్కారీ వైద్యం ఎప్పుడు కళు్ల తెరుస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఎవరు జవాబు చెప్పాలి...
2.
ఒకటా రెండా? ఎన్నని చెప్పేది సర్కారీ ఆసుపత్రుల్లో విషాదాలు.. వివాదాల గురించి...
శిశు మరణాలు ఇవాళ ఈ దవాఖానల్లో కొత్తగా జరుగుతున్నవేం కాదు.. ఇవాళే వింటున్న వార్తలంతకంటే కాదు.. ఇంతకు ముందు ఇంతకంటే దారుణాలే చోటు చేసుకున్నాయి... మన పాలకుల్లో పట్టించుకునే వాళు్ల ఎవరైనా ఉంటేనే కదా.. సమస్యలు పరిష్కారమయ్యేది....

ఇప్పుడు తాజాగా విశాఖ కెజిహెచ్‌లో శిశువు కుక్కల పాలు కావటానికి కారణం ఏమిటి?... ఆసుపత్రికి ప్రసూతికోసం వచ్చిన ఆ తల్లి అంతులేని గర్భశోకానికి బాధ్యులెవరు?... ఎనిమిది నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో ఇలాగే ఓ పసికందును ఎవరో ఎత్తుకుపోతే ఇప్పటి వరకు ఆ పసివాడి జాడ ఏమైందో ఇవాల్టి వరకూ తెలియదు.. అంతలోనే మరో ఘటన...
అంతకు ముందు కర్నూలులో ఓ పసివాణ్ణి పంది ఎత్తుకుపోయింది..
అవి సర్కారు ఆసుపత్రులు కావు..? పెంటకుప్పలే.. కుక్కలు.. పందులు యథేచ్చగా ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్‌ వరకూ రావటం ఎక్కడి విచిత్రం... వైద్యం చేయించుకుంటున్న రోగుల దగ్గరకు ఎలాంటి సైడ్‌ ఎఫెక్‌‌స్ట రాకుండా ఉండేందుకు బంధువులను సైతం రానివ్వరే... అలాంటిది ఇంత హీనాతిహీనంగా జంతువులు తిరగుతుంటే.. వాటిని ఆసుపత్రులని ఎలా పిలవాలి?

జిల్లాల్లోనే కాదు.. ఏకంగా రాష్ట్ర రాజధానిలోనే ఇలా జరిగిన ఘటనలో కొల్లలు... ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌ ఇందుకు కేంద్రాలు... మూసీ కాలువలో శిశువుల మృతదేహాలు దొరికితే అడిగే దిక్కు లేదు.. చర్యలు తీసుకున్న నాథుడు లేడు... ఎప్పటిలాగే ఇవాళా ఓ శిశువు పుట్టడమే మృత్యుముఖంలో పుట్టింది.. పుట్టి మరణించింది.. అధికారులకు ఆ శిశువును గురించిన చింత ఎంతమాత్రం లేదు.. ఎందుకంటే ఆ శిశువు ఓ పేదరాలి కడుపున జన్మించింది కాబట్టి....
3.
ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వాసుపత్రులకు తేడా ఎక్కడ వస్తోంది? నిర్లక్ష్యమేనా అది? ఆసుపత్రుల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని అయోమయం రాజ్యమేలుతోంది...అప్పుడే పుట్టిన శిశువుల్ని జంతువులు మాంసం ముద్ద అని లాక్కెళ్తాయి... దోపిడీ దొంగలు డాక్టర్ల వేషం వేసుకుని వచ్చి రోగుల్ని నిలువు దోపిడీ చేస్తారు....
ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే.. అక్కడ వైద్యం జరుగుతుందో... దోపిడీ జరుగుతుందో తెలియని పరిస్థితి... తాము వెళు్తన్నది ఆసుపత్రులకా? మరో చోటికా తెలియదు... సర్కారీ దవాఖానాలను ఇవాళ నిర్లక్ష్యపు రోగం చుట్టుకుంది.. ఏ మందు వేసినా అది నయం అయ్యే పరిస్థితి కనిపించటం లేదు..
రాష్ట్ర రాజధానిలోనే... అత్యంత ప్రసిద్ధి చెందిన రెండు ఆసుపత్రుల్లోనే దొంగలు డాక్టర్ల అవతారమెత్తుతున్నారు.. అందినకాడికి అందినంత రాచ మార్గం లోనే దోచుకు పోతున్నారు..
మెదక్‌ జిల్లాకు చెందిన వాణిశ్రీ జబ్బు పడి గాంధీ ఆసుపత్రికి వచ్చింది. వారం రోజుల పాటు ఇన్‌పేషంట్‌గా చేరి చికిత్స చేయించుకుంటోంది.. ఇంతవరకు బాగానే ఉంది.. ఓ రోజు ఉదయం హటాత్తుగా ఓ డాక్టర్‌ వచ్చి ఇంజక్షన్‌ ఇవ్వాలి పక్కగదిలోకి రమ్మన్నాడు... వాణిశ్రీ, ఆమె తల్లి ఇద్దరూ డాక్టర్‌ గదిలోకి వెళ్లారు.. సదరు డాక్టర్‌ ఆ తల్లికి ఓ చీటీపై మందులు రాసిచ్చి తీసుకురమ్మన్నాడు.. ఆమె అలా వెళ్లిందో లేదో... వాణిశ్రీకి డాక్టర్‌ ఇంజక్షన్‌ ఇచ్చాడు.. ఆమె మత్తులోకి జారిపోయింది.. ఆమె తిరిగి లేచేసరికి మూడున్నర తులాల గొలుసు మాయమైపోయింది. చీటీలో ఉన్న మందు తీసుకురావటానికి వెళ్లిన బాధితురాలి తల్లికి అలాంటి మందే లేదంటూ షాపు వాళు్ల చెప్పటం మరో విచిత్రం...
ఇంత జరిగాకైనా సర్కారు నిద్ర లేచిందా అంటే అబ్బే అలాంటి అలవాటు డిక్ష్నరీలోనే లేదు.. వారం తిరక్కుండానే నీలోఫర్‌లో అదే దొంగ మరో దొంగతనం చేశాడు...
రోగులకు పూర్తి భద్రతను కలిపిస్తామని సర్కారు వారు కబుర్లు చెప్పటంలో, ఉపన్యాసాలు దంచేయటంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు.. అసలు సంగతి దగ్గరకు వచ్చేసరికే, వారికి ఏం చేయాలో కూడా తోచదు.. విచిత్రమేమంటే నీలోఫర్‌ ఆసుపత్రికి కట్టుదిట్టమైన భద్రతే ఉంటుంది.. అయినా దొంగ తన పని తాను కానిచ్చేసుకుని వెళ్తాడు...
ఇక సర్కారీ ఆసుపత్రుల్లో ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మాత్రం ఎవరైనా వెళ్లేందుకు ఎలా సాహసించగలరు?

15, ఫిబ్రవరి 2010, సోమవారం

డయ్యర్‌ వారసులు...


రక్తతర్పణం జరిగింది.. విద్యార్థులతో పాటు... ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా చెప్పుకునే మీడియా ప్రతినిధుల రక్తమూ ఏరులై పారింది... ఆ రుధిర ధారల్లో భద్రతాబలగాల బూట్లు తడిసి సంబరపడ్డాయి. పోలీసులు పదఘట్టనల హోరులో విలేఖరులు, విద్యార్థుల రోదనలు రోదసిలో కలిసిపోయాయి.. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరు?

ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో అగ్గి రాజేసింది ఎవరు?
ఓయులో రక్త చరిత్రను రచించిందెవరు?
కెమెరా కళ్లకు గంతలు కట్టే సాహసం చేసిందెవరు?
మీడియా ప్రాథమిక హక్కులను కాలరాసిందెవరు?
ఓయు నిషేధిత ప్రాంతమా?
మనం ఏ సమాజంలో ఉన్నాం...?
ఏమిటీ దారుణం?

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో చదువుల చెట్టుకు పోలీసు చెద పట్టింది.. ఈ చెదలు ఇప్పుడప్పుడే వదిలేట్టు లేదు.. ప్రశాంతంగా ఎదుగుతున్న విద్యాఫలాలను పూర్తిగా నాశనం చేసేంత వరకు ఈ చీడ విరగడ అయ్యేట్టు కనిపించటం లేదు.. ఇంతకాలం విద్యార్థులనే పీడించిన ఈ పీడ.. ఇప్పుడు మీడియాకూ పాకింది... విచ్చలవిడిగా తాము సాగించే పాశవికత్వానికి సాక్షీభూతంగా నిలిచిన మీడియాను తొలగించటానికి మూకుమ్మడిగా విరుచుకుపడ్డ తీరు గతంలో బ్రిటిష్‌ పోలీసులకు కూడా తెలిసి ఉండదు.. జలియన్‌ వాలాబాగ్‌లో ప్రజల్ని ఊచకోత కోసిన జనరల్‌ డయ్యర్‌కు కూడా ఈపాటి తెలివి తేటలు ఉండకపోవచ్చు..

ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరుగుతున్న సందర్భంలోనైనా దానికి సంబంధించిన వార్తల్ని కవర్‌ చేసేందుకు మీడియాను అనుమతిస్తారు.. కార్గిల్‌ లోనైనా, ఆఫ్గనిస్తాన్‌లోనైనా, ఇరాక్‌లోనైనా, ప్రపంచానికి ఆ యుద్ధాల వార్తలని ప్రపంచానికి అందజేసింది మీడియానే... ప్రభుత్వానికి, ప్రజలకు ఒక వారధిలా వ్యవహరించేది మీడియా... అలాంటి మీడియా కాళ్లూ చేతులూ కట్టేసి కూర్చోబెట్టడం సాధ్యమేనా?
ఉస్మానియాను ప్రభుత్వం నిషేధ ప్రాంతంగా ప్రకటించలేదు.. ఉస్మానియా ఓ విశ్వవిద్యాలయం... రెండు నెలలుగా ఓయు కేంద్రంగా విద్యార్థులు తెలంగాణా రాష్ట్రం కావాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు... వాటిని కవర్‌ చేయటం, అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనలను ప్రసారం చేయటం మీడియా విధి.. వార్తలను సేకరించటం, ప్రసారం చేయటం మీడియా ప్రాథమిక హక్కు... దీన్ని కాదనే అధికారం ఎవరికీ లేదు..కానీ ఈ హక్కుపై ఇవాళ పోలీసు ఉక్కుపాదం పడింది...

ఎందుకు మీడియాను పోలీసులు టార్గెట్‌ చేసుకోవలసి వచ్చింది..? కేవలం శాంతిభద్రతలను పరిరక్షించటం కోసమే పోలీసులు బాధ్యతాయుతంగా పని చేస్తుంటే...మీడియా కవరేజి వల్ల జరిగే నష్టం ఏమిటి? అంటే, మరింకేదో చేసేందుకు పోలీసులు పూనుకున్నారు కాబట్టే... మీడియాను అక్కడి నుంచి తప్పించేందుకు పూనుకున్నారు.. వాళ్లపై లాఠీలు ఝళిపించటమే ప్రత్యామ్నాయంగా కనిపించింది... ఇంకేం.. ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయలేదు.. పది మందిపై వందల మంది ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.. కనపడ్డవారిని కనపడ్డట్టుగా చితకబాదారు..
అంతా అయ్యాక తీరిగ్గా.. అయ్యో దురదృష్టం.. సారీ... తప్పయింది.. చూసుకోలేదు.. కావాలని కొట్టలేదు.. అంటూ మాటలు చెప్పుకొచ్చారు.. ఓ పక్క సారీలు చెప్తూనే.. మరోపక్క చితక్కొట్టారు.. ఈ పరిణామం.... ఓ అరాచక వ్యవస్థను...నియంతల పరిపాలనను తలపించింది...రెండో ప్రపంచయుద్ధ కాలంలో మీడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, తాను కోరుకున్న వార్తలు మాత్రమే ప్రచురితమయ్యేలా చేసుకున్న హిట్లర్‌ వ్యవస్థలో ఉన్నామా మనం?

ఉస్మానియాలో ఈ దాడి ఓ పథకం ప్రకారం జరిగిందన్నది నిర్ద్వంద్వం.. లాఠీచార్జీకి విద్యార్థులే బాధ్యులని ఇవాళ తీరిగ్గా కథలు చెప్పటం సర్కారు వారికి వెన్నెతో పెట్టిన విద్యే... వాస్తవానికి విద్యార్థులు రెండు నెలలుగా అక్కడ నిరసనలు, ప్రదర్శనలు చేస్తున్నారు.. దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు.. క్యాంపస్‌లో ఇటు సీఫెల్‌ వరకు, అటు తెలుగు విశ్వవిద్యాలయం హాస్టల్‌ వరకు ప్రదర్శనలు చేస్తారు.. నినాదాలు చేస్తారు.. ఈలోగా అక్కడ విధ్వంసం చేసేందుకు ఏమీ లేవు.. ధ్వంసం చేసుకుంటే వారి కాలేజీలను వారే ధ్వంసం చేసుకోవాలి.. వారి పుస్తకాలను వారే తగులబెట్టుకోవాలి.. అలా జరిగే అవకాశం ఎలాగూ లేదు.. అలాంటప్పుడు క్యాంపస్‌లోకి వెళ్లి అక్కడ టెంట్‌ వేయాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది...? క్యాంపస్‌ దాటి బయటకు వస్తే వారిని అడ్డుకోవచ్చు... అంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే క్యాంపస్‌లోపల క్యాంప్‌ పెట్టారా?
విద్యార్థులే కవ్వించారని పోలీసులు అంటున్నారు.. రెండు నెలలుగా లేని కవ్వింపు.. నిన్నటి ప్రదర్శనలోనే ఉన్నట్టుండి చోటుచేసుకుందా? ఒక వేళ విద్యార్థులు కవ్విస్తే.. ఇంత పైశాచికంగా కొడ్తారా? అది కవర్‌ చేసిన పాపానికి మీడియాపై దురాగతానికి పాల్పడతారా? ఈ ఘటనతో మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు బలగాలు చాలా చక్కని నిర్వచనం ఇచ్చాయి...ఇలాంటి పోలీసులను మనం రక్షక భటులని పిలుస్తున్నాం.. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది?
జమ్ము కాశ్మీర్‌ సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలతో దద్దరిల్లిపోయే ప్రాంతాన్ని పిఓకే.. పాక్‌ ఆక్యుపైడ్‌ కాశ్మీర్‌ అని పిలుస్తారు.. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి ప్రాంతంగా పిఓయు తయారైంది.. అంటే పోలీస్‌ ఆక్యుపైడ్‌ ఉస్మానియా...