తెలుగు సినిమా... ఈ పేరు చెప్పగానే ఇప్పటిదాకా మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు ఎన్టీరామారావు.. ఆయన్నే కొందరు అన్నగారు అని పిలుస్తారు.. పల్లెల్లో అభిమానులైతే ఎన్టోడు అని ముద్దుగా పిలుచుకుంటారు.. ఇదంతా ఇప్పటిదాకా ఉన్న మాట.. కానీ, ఇక ముందు ఈ మాట వినిపించదు.. ఆ బొమ్మ కనిపించదు.. ఆ పేరే మటుమాయం కానుంది.. ఎన్టీయార్ అంటే ఇప్పుడున్న కుర్ర ఎన్టీయార్ మాత్రమే కనిపిస్తాడు.. అతని మాటలే వినిపిస్తాయి.. సీనియర్ ఎన్టీరామారావు అంటే ఆయన అంటూ ఒకరున్నారా అన్న అనుమానమూ కలుగుతుంది...ఎందుకు? ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది?
తెలుగు చిత్రానికి ఆయన రారాజు.. 1949 దాకా తప్పటడుగులు వేస్తున్న తెలుగు సినిమా నడకను, నడతను తీర్చిదిద్ది స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టిన సినీ భోజుడు.. ఆయన పేరు నందమూరి తారక రామారావు.. మూడున్నర దశాబ్దాలు.. మూడు వందల ఇరవైకి పైగా సినిమాలు.. చలన చిత్ర సెల్యూలాయిడ్ కావ్యానికి అందమైన ముఖచిత్రం నుంచి చివరి పుట దాకా అంతా ఆయనే.. ఇవాళ సినీ పరిశ్రమలో ఆయన పేరు తలచే వారే లేరు.. మాట్లాడే వారే లేరు...
చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే సంస్కృతి తెలుగు సినిమా వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు. ఇదొక మాయా ప్రపంచం.. ఎవరికి ఎవరూ ఏమీ కారు.. అందరూ మొనగాళ్లకు మొనగాళ్లే.. కళామతల్లి ముద్దుబిడ్డలం అని చెప్పుకునే ప్రబుద్ధులంతా ఆ కళకు సేవలు అందించిన వారికి పంగనామాలు పెట్టడం కొత్తేమీ కాదు.. నాటి ఎన్టీయార్ నుంచి నేటి వేటూరి దాకా లివింగ్ లెజెండ్స్ పరిస్థితి అంతా ఇంతే..
ఒక మహోన్నత వ్యక్తికి జయంతి....వర్థంతి ఉత్సవాలు జరిగాయంటే... ఆ వ్యక్తిని జనం పది కాలల పాటు గుర్తు పెట్టుకున్నారని అర్థం.
తెలుగు సినిమాను, తెలుగు జాతి ఔనత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నటుడు, రాజకీయ వేత్త నందమూరి తారాకరామారావు జయంతి ఎప్పటిలాగే ఎన్టిఆర్ ఘాట్ వద్ద జరిగింది.
తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు రొటీన్‌గా వచ్చి నివాళులు అర్పించేసి వెళ్లిపోయారు..
పార్టీకి ఇంకా రామారావు పేరు అవసరం తీరిపోలేదు కాబట్టి వాళ్లు వచ్చారు.. కుటుంబసభ్యులకు తప్పదు కాబట్టి వారూ వచ్చారు..
కానీ, తెలుగు సినిమా పరిశ్రమ నెలకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా జరిగిందా? కనీసం ఆనవాలైనా కనిపించదు..
ఎన్టీయార్ జయంతిని జరుపుకోవలసిన అవసరం, బాధ్యత సినీ పరిశ్రమకు లేదు..
నందమూరి నట వారసులతో పాటు సినీ పరిశ్రమలో ఉన్న నందమూరి అభిమానులు కూడా పెద్ద ఎన్‌టిఆర్‌ను పూర్తిగా మరిచిపోయారు.. కాదు.. కావాలనే విస్మరించారు.. ఎందుకంటే ఇప్పుడు సినిరంగానికి చనిపోయిన ఎన్టీయార్‌తో అవసరం ఏముంది కనుక?
ఒక్క నాగేశ్వరరావు తప్ప ఒక్కరంటే ఒక్కరు సీనీపరిశ్రమకు చెందిన వాళ్లు ఎన్టీయార్ ఘాట్‌కు వచ్చిన పాపాన పోలేదు..ఫిలింనగర్ సంగతి సరేసరి..
సినిమా వాళ్లు వ్యక్తులను గుర్తు పెట్టుకుంటే అదో విచిత్రం.. విశేషం.. మరచిపోవడం సహాజ లక్షణం. ఎన్టీయార్ దాకా ఎందుకు.. సినిమా పాటకు పల్లవి లాంటి వేటూరి సుందర రామ్మూర్తి మరణించి మూడు రోజులైనా కాలేదు.. ఆయన సంతాప సభ పెడ్తే ఆ సభలో సినీ పెద్దలెవరూ కనిపించని దుస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎప్పుడో వెళ్లిపోయిన ఎన్టిఆర్ జయంతిని మాత్రం సినిమా వాళ్లు ఏం గుర్తు పెట్టుకుంటారు లేండి.
తెలుగు సినిమాకు మోరల్స్ లేవా? ఇదీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.. వేదికలపైన సినీపెద్దలు పోచికోలు కబుర్లు చెప్పటానికి ఎలాగైనా సిద్ధపడతారు కానీ, వేదికలు దిగగానే చెవులు దులుపుకుని వెళ్లిపోతారు.. అందుకే ఇప్పుడు ఎన్టీయార్ గతకాలపు స్మృతి కాదు.. ఎన్టీయార్ అంటే అదే సినీప్రముఖులకే అర్థం కాని మాట..
౨
సినిమా రంగానికి మిగతా వారంతా అక్కర్లేక పోవచ్చు. కానీ ఎన్టీయార్ ఒక లెజెండ్ సినీపరిశ్రమకే కాదు.. తెలుగు వారికి, సాంస్కృతికంగా, రాజకీయంగా కూడా దిశ, దశ చూపించిన వాడు.. అలాంటి మహానేతకు సినీరంగం ఎందుకు మంగళం పాడుతోంది. దీని వెనుక సినీ ప్రముఖులకు వేరే ఉద్దేశ్యాలు వేరే ఏమైనా ఉన్నాయా? ఒక పథకం ప్రకారమే చేస్తున్నారా? సినిమా ఒక కళ.. ఇదో కళారంగం.. మేమంతా కళాకారులం.. కళాకారులకు కళే జాతి.. కళామతల్లి ముద్దుబిడ్డలం మేమంతా...
ఇవన్నీ.. సినీ ప్రముఖులు ఎప్పుడూ చెప్పుకునే మాట.. భుజాలు తడుముకునే చేత.. ఇది ఒక విచిత్రమైన వ్యవస్థ.. చిత్రమైన రంగం.. తెలుగు సినిమా ఒక కళారంగం అని చెప్పుకునే దశను ఎప్పుడో దాటిపోయింది.. వీళ్లకు లాభసాటి వ్యాపారం జరగాలి.. ప్రభుత్వాల నుంచి రాయితీలు రావాలి.. ప్రేక్షకుల నుంచి కోట్లు వచ్చిపడాలి. ఫక్తు వ్యాపారం.. ఎవరు డామినేట్ చేస్తే వాళ్లదే రాజ్యం.. వీళ్లు వల్లించేవన్నీ ఒఠ్ఠిమాటలే.. ఇక చనిపోయిన వారిని గుర్తుంచుకుని స్మరించేంత తీరిక, ఓపికా వారికెక్కడుంటుంది?
సినిమా వాళ్లు చెప్పేదంతా నిజం కాదని జనాలకు ఇప్పుడిప్పుడే బుర్రకెక్కుతున్నది. నిజంగానే సినిమా వాళ్లకు వేటూరి మీద అంతటి అభిమానం ఉండి ఉంటే...ఫిలించాంబర్‌లో జరిగిన సంతాప సభకు సినీ పెద్దలెందుకు రాలేదు? ఎన్టిఆర్ జయంతిని ఫిలింనగర్లో ఎందుకు జరుపుకోలేదు? ఒకనాడు లెజెండ్స్‌గా ఉన్న వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఆలనాపాలనా పట్టించుకోవలసిన బాధ్యత సైతం సినీరంగానికి పట్టదు.. అప్పుడప్పుడూ పేద కళాకారులకోసం క్రికెట్టు మాత్రం తెగ ఆడేస్తారు.. డబ్బులు పోగేస్తారు.. కొందరికి పంచేస్తారు.. చిత్రమేమంటే ఈ హీరోలు, హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు పారితోషికంగా వసూలు చేస్తారు.. పేదకళాకారులకు సాయం చేసే విషయానికి వచ్చే సరికి మళ్లీ ప్రేక్షకుల దగ్గర నుంచే వసూలు చేస్తారు.. జేబులోనుంచి ఒక్క పైసా బయటకు తీయరు.. ఇలాంటి వ్యాపారులు ఇక ఎన్టీయార్ కోసం ఏం చేస్తారు? ఆయన్ను ఏం గుర్తుంచుకుంటారు?
ఎన్టీయార్ నట సార్వభౌముడు.. తెలుగు సినిమాకు ఒక ఐకాన్.. ఆయన నటించని పాత్ర లేదు.. జీవించని కేరెక్టర్ లేదు..ఇవాళ తెలుగు సినిమాలో ఎవరు ఎలాంటి కేరెక్టర్ చేయాలన్నా ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఎన్టీయార్ అంతకు ముందు చేసిన ఆ కేరెక్టర్‌ను ఒక్కసారి చూస్తే చాలు.. అన్ని రకాల కేరెక్టర్లు చేసిన వాడు ఎన్టీయార్. అలాంటి ఎన్టీయార్ నటించిన కేరెక్టర్లకు సంబంధించి ఉపయోగించిన ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తువులు, దుస్తులు మ్యూజియం పేరుతో ఉన్న ఒక బిల్డింగ్‌లో దుమ్ముపట్టుకుని పోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తిగొడవగా మారి కోర్టులో పెండింగ్ ఫైళ్ల మధ్య ఇరుక్కుపోయింది.. ఎన్టీయార్ మ్యూజియం అన్నది తెలుగు సినిమా ఆస్తి కనీసం దాన్నైనా పరిరక్షించేందుకు ప్రయత్నించిన పాపాన పోలేదు..
ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఎవరికీ ఎన్టీయార్ అక్కర్లేదు.. ఎందుకంటే ఇవాళ ఎన్టీయార్ వ్యాపార వస్తువు కాదు.. ఆయన పేరుతో కానీ, స్మరణతో కానీ పైసా లాభం రాదు.. ఆయన ఉన్నప్పుడు సినిమాపరంగా, రాజకీయ పరంగా ఆయన్ను ఉపయోగించుకున్నారు.. ఇప్పుడు ఆ అవసరం లేదు.. దానవీరశూర కర్ణలో ఎన్టీయారే చరిత మరువదు నీ చతురత అంటాడు.. కానీ, ఇప్పుడు అది రివర్స్ అయింది.. చరిత మరిచిన నీ నటనా చాతుర్యం..
6 కామెంట్లు:
అహా ! ఇన్నాళ్ళకు మీ బ్లాగులో చక్కగా , ఆపకుండా చదవగలిగింది చూసాను..అంటే నాకు నచ్చింది అని అర్థం...అన్నగారు కాబట్టేమో అని కూడా అనుమానం...అయినా - నచ్చితే ఏమిటి? నచ్చకపోతే ఏమిటి అంటారా?.. :)
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అన్నది నిన్నటి సూత్రం, పోయినోళ్ళను అందరూ మర్చిపోవటమే ఈనాటి సూత్రం
well said..
em raasav Brother Touch Chesav .. Nijanga touch chesav .... Ah mahanubavudi vesina paatralu gurthosthe ... nenu Telugu vadini ayinanduku garvapade feeling vasthundi .. Johar NTR .. NTR Amar Rahe ... He is true Legend ...
నిజం చెప్పారండి. ఇదే విషయం నన్నెప్పుడూ బాధపెట్టేది
పబ్లిక్ గా పేరు వాడేసుకుంటున్న మనవడు కూడా మాటల్లోనే తప్ప చేతల్లో తాతగారికి ఏమీ చేయకపోవడం విచిత్రం.
" ఏమీ చేయలేదు , ఏమీ చేయలేదు " ఏమిటి చేయాలి? ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి? ఆ సచ్చినాయన తనకాలంలో ఎవరికైనా చేయి విదిల్చిన దాఖలాలు వున్నాయా?
ఒకరు ఏదో చేస్తే గాని తమను జనాలు గుర్తుంచుకొనే పరిస్థితుల్లేవటే అది పరాభవమే కాదు అతీ దైన్యం.
NIJANGA MIRU CHALA BAGA RASARU NIJAMAINA ASKSHRA SATYAM LANTI VILUVAINA MATALANI TUTALA PELSHARU HATSAF MI SAMPUTIKI NA JOHARU
కామెంట్‌ను పోస్ట్ చేయండి