30, మార్చి 2010, మంగళవారం
ముప్ఫయ్యేళ్లుగా అలజడి...
హైదరాబాద్ పాతనగరంలో మరోమారు అలజడి చోటు చేసుకుంది. జెండాల విషయంలో మొదలైన వివాదం అంతకంతకు విస్తరించింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గతంలోనూ నగరంలో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. దాదాపు ముప్ఫయ్యేళ్లుగా అడపాదడపా ఇదే దుస్థితి... నాటి నుంచి నేటిదాకా సంఘటనల క్రమమిది...
రమీజామీ కేసు సందర్భంగా తొలిసారి 1978లో మొదటిసారిగా పాతనగరంలో మత ఘర్షణలు చెలరేగాయి. దీంతో తొలిసారి నగరంలో కర్ఫ్యూ విధించారు.
1983
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మజ్లిస్, భాజపాల మధ్య సాగిన హోరాహోరీ పోటీ మత ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ అల్లర్లలో నలుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు.
1984
సెప్టెంబరులో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా విధ్వంసం చోటు చేసుకుంది. దావనలంలా వ్యాపించిన అల్లర్లను అదుపు చేయటానికి తొలిసారి జంటనగరాల్లోని యాభై పోలీసుస్టేషన్లతో సహా శివారు పోలీస్స్టేషన్లలో కర్ఫ్యూ విధించారు. పదిరోజులపాటు కర్ఫ్యూ కొనసాగించారు. ఆ మారణకాండలో 12 మంది చనిపోగా, 60 మంది గాయపడ్డారు.
1990
పేరుమోసిన రౌడీషీటర్ సర్దార్ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్లో హతం కావటంతో మొదలైన మతఘర్షణలు కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగాయి. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు సాక్షాత్తు అసెంబ్లీలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రకటించడం విశేషం. డిసెంబరు మొదటివారంలో శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షక్కర్‌గంజ్ పార్థివాడలో నిరుపేదల ఇళ్లపై ముష్కరమూకలు దాడి జరిపాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక మహిళ సజీవదహనమైంది. ఏడాది బాలిక ముఖంపై నరరూప రాక్షసులు పెట్టిన కత్తిగాటు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయి. అప్పటి అల్లర్లలో నగరం మొత్తమ్మీద 150 మంది మరణించగా 500 మంది గాయపడ్డారు. అప్పట్లో అత్యధికంగా 20 రోజులపాటు మధ్యలో సడలిస్తూ సుదీర్ఘకాలం పాతబస్తీ కర్ఫ్యూ గుప్పిల్లో విలవిలలాడింది.
1992
నిమిజ్జనం సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తత, అల్లర్లను అణిచివేయటానికి రెండు రోజులు కర్ఫ్యూ విధించారు.
1992
డిసెంబరు ఆరోతేదీన బ్రాబీ మసీదు విధ్వంసంతో చెలరేగిన మతఘర్షణలు ఐదుగురిని బలిగొన్నాయి. ఇరవై మందికిపైగా గాయపడ్డారు. మూడు రోజులపాటు పాతనగరంలో కర్ఫ్యూ విధించారు.
1995
ఆగస్టులో గణేష్ నిమిజ్జనం సందర్భంగా ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కత్తిపోట్లు, దుకాణాల లూటీలు జరిగాయి. ఈ సందర్భంగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది.
1997
డిసెంబరులో బ్లాక్‌డే సందర్భంగా హింస చెలరేగి ఇద్దరు మరణించారు.
1998
జూన్‌లో ఓ మతాన్ని కించపరుస్తూ వెలువడిన కరపత్రాలు పాతనగరంలో విధ్వంసకాండకు దారి తీశాయి. ఆ అల్లర్లలో ఐదుగురు మృతి చెందగా, కోటి రూపాయిలకు పైగా ఆస్తినష్టం జరిగింది. ఈ సందర్భంలో రెండు రోజులు నిరవధికంగా, నాలుగురోజులు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.
2003
డిసెంబరులో కిషన్‌బాగ్ సిఖ్‌ఛావునిలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు కత్తిపోట్లకు గురై మరణించగా, ఆరుగురు గాయపడ్డారు.
2003
అదే ఏడాది డిసెంబరు ఆరో తేదీ బ్లాక్ డే సందర్భంగా అల్లరిమూకలు చెలరేగి పలుప్రాంతాల్లో రాళ్ల వర్షం కురిపించారు. ఈ సమయంలో జరిగిన అల్లర్లలో ఐదుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. దీంతో పాతనగరంలోని ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.
చి డెన్మార్క్‌లోని ఓ పత్రికలో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ కార్టూన్ ప్రచురితం కావడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇదే సందర్భంలో పాతబస్తీలో ఓ వర్గం వారు దాడులకు తెగబడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
2008
చింతలబస్తీలో ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కత్తిపోట్లతో ఇద్దరికి గాయాలయ్యాయి.
2009
ఆగస్టులో చిన్న విషయమై ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న స్వల్పఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పాతనగరంలోని హబీబ్‌నగర్‌లో జరిగిన ఈ వివాదంతో ఒకరికి గాయాలయ్యాయి.
2009
సెప్టెంబరులో ఆసిఫ్‌నగర్ జేబాబాగ్ ప్రాంతంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
2009
గ్రేటర్ ఎన్నికల తర్వాత మాదన్నపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
2010
శ్రీరామనవమి సందర్భంగా మొదలైన చిన్న వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇప్పటికే ఒకరు మృతిచెందగా, మరికొందరు కత్తిపోట్లతో ఆస్పత్రి పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. పాతబస్తీలోని 17 పోలీస్స్టేషన్ల పరిధుల్లో కర్ఫ్యూ విధించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
మారదు మారదు మనుషులతత్వం మారదు
మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు భ్రమపడకూడదు [[మారదు]]
సూర్య చంద్రులూ మారలేదులే చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం మారటమంటే సుళువుకాదులే [[మారదు]]
పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు చెవులకు చేటలు కడతారు [[మారదు]]
కాసుపడనిదే తాళి కట్టరు పెళ్ళిపీటపై వారు కాలు పెట్టరు
కట్నములేనిదే ఘనతే లేదనీ చదువుకున్నవారే కలలుకందురూ [[మారదు]]
ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో కాపాడేవాడే
బంధువూ అతడే బంధువూ ఆత్మబంధువూ
కామెంట్‌ను పోస్ట్ చేయండి