29, ఏప్రిల్ 2010, గురువారం

యుగానికి ఒక్కడు...

కమ్మరి కొలిమీ.. కుమ్మరి చక్రం.. జాలరి పగ్గం.. సాలెల మగ్గం..
శరీర కష్టం స్ఫురింప జేసే-- గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు.. నా వినుతించే, నా విరుతించే
నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి
భావం.. భాగ్యం.. ప్రాణం.. ప్రణవం...
ఆయన ప్రతిమాటా బడుగుజీవికి ప్రణవ నాదం.. ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాలు అలసిపోయిన వ్యథార్థ జీవితాలకు జీవనాదాలు..
శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా, సమర్చనంగా త్రికాలాలలో సాగిపోయిన మహాకవి.. ఆధునిక తెలుగు సాహిత్య రణక్షేత్రంలో ఒకే ఒక్క యుద్ధ వీరుడు.. శ్రీరంగం శ్రీనివాసరావు.. శ్రీశ్రీ...

భవభూతి శ్లోకాలు.. పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు.. నా వూహ రసరాజ్య డోల.. నా వూళ కేదార గౌళ.. గిరులు , సాగరులు, కంకేళికా మంజరులు, ఝరులు నా సోదరులు.. నేనొక దుర్గం.. నాదొక స్వర్గం.. అనర్గళం.. అనితర సాధ్యం నా మార్గం...
ఇలా నిశ్చయంగా తన మార్గాన్ని గురించి చెప్పగలిగిన అహం శ్రీశ్రీకి మాత్రమే చెల్లింది.. ఆయన ￧కనులు మూస్తే పద్యం వచ్చింది.. పెదవి కదిపితే నాదమయింది. నినదిస్తే విప్లవమైంది.. నిలదీస్తే తిరుగుబాటు బావుటా ఎగిరింది..
శ్రీశ్రీకి కవిత్వం ఒక తీరని దాహం.. తాను కవిత్వం రాసేందుకు వస్తువు ప్రధానం కాలేదు.. శిల్పం అక్కరకు రాలేదు.. లయ అవసరం లేనే లేదు.. రసం దృష్టిలోనే లేదు.. ఆయన కవిత్వం ఒక నాదం... మనస్సులో ఒక్కుదుటున కలిగే ప్రకంపనలకు అక్షర రూపం ఇస్తే దానికి పేరు శ్రీశ్రీ కవిత్వం.. ఎందుకంటే మరెవరూ ఆ ప్రకంపనలను ఆ స్థాయిలో అందుకోలేదు.. అందుకోలేరు కాబట్టి...
మరో ప్రపంచపు కంచు నగారా విరామమెరుగక మోగింది..
తాచుల వలెనూ..రేచుల వలెనూ, ధనుంజయునిలా సాగండి.. కనపడలేదా మరోప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు..
ఎర్రబావుటా నిగనిగలు.. హోమజ్వాలల భుగభుగలు..
మాటల్ని ఈటెలుగా ప్రయోగించటం, కత్తులుగా మార్చి విసరటం, మంటలుగా రేపటం... శ్రీశ్రీకి కవిత్వం ద్వారా అబ్బిన విద్య.. అలా చేయటం ఆయనకే సాధ్యం.. ఆయన కవిత్వం చదువుతూ ఉంటే.. ఆ పదాలు. పదబంధాలు.. వాటికి నిఘంటు అర్థాలు లేకపోవచ్చు.. భావనలు ఉండకపోవచ్చు.. కానీ, అవి మాటలు కావు.. పదాలు కావు.. పద బంధాలు కానే కావు.. ఆ మాటలు ఎగిసిపడే ఉద్రేకానికి ఉత్ప్రేరకాలు.. కార్మికుల భావోద్వేగానికి బాసటలు.. అరాచక వ్యవస్థపై చేసే యుద్ధానికి పదును తేలిన ఆయుధాలు..
శ్రీశ్రీ తన హృదయంలో నుంచి పొంగుకొచ్చిన అనుభూతిని మన హృదయంలోకి నేరుగా పంపించేస్తాడు.. ఆ కవిత్వాన్ని పెదాలపై పలకడం మొదలు పెట్టడంతోనే మనసు కంపించటం మొదలు పెడుతుంది.. గగుర్పొడుస్తుంది.. నెత్తుటి ప్రవాహ వేగం శరీరంలో పెరిగిందా అన్న భావన కలుగుతుంది..
భవిష్యత్తు తోచక దారితెన్నూ వెతుక్కుంటున్న ప్రజల రొద.. దీనుల మూగవేదనలే కాదు.. నీళ్లు లేక ఎండిపోతున్న గరిక పోచ దుఃఖాన్ని సైతం కవిత్వంలో వినిపించగలిగిన వాడు కాబట్టే శ్రీశ్రీ ఆధునిక కవిత్వానికి మార్గదర్శకుడు కాగలిగాడు..
-2-
ఏమిటీ శ్రీశ్రీ.. మరణించి పాతిక సంవత్సరాలు దాటి పోయిన తరువాత కూడా ఈయన్ను ఆంధ్ర లోకం ఎందుకు స్మరించుకుంటోంది? ఎందుకంటే ఆయన స్వరం సమాజంలోని అన్ని రకాల చైతన్యాలకు ఆనవాళ్లు.. శ్రీశ్రీది కవితా జీవితం.. ఆయనే ఒక జీవిత కావ్యం..
సరిగ్గా వందేళ్ల క్రితం ఆంధ్ర రాష్ట్రం ఉత్తరాన సాగర తీరంలో జన్మించిన శ్రీశ్రీ.. విశాఖ పట్నం ఒడిలో... పారిశ్రామిక విప్లవం బడిలో పెరిగాడు.. వాటితో పాటే ఎదుగుతూ వచ్చాడు.. ఆయన కవిత్వమూ అలాగే పొంగుకుంటూ వచ్చింది.. ఎంత వేగంగా అంటే.. ఆయన కంటే వేగంగా, ఆయనకే అందనంత ఎత్తులో శ్రీశ్రీ కవితా ధార పరుగులు తీసింది.. ఆ పరుగును అందుకోవటం ఎవరికైనా అంత సులభం కాలేదు..
తనకీ ప్రపంచానికీ ఒక రకమైన సామరస్యం కుదిరే దాకా కవి తన మనసు లోపల...., బయటా..... పడే సంఘర్షణ శ్రీశ్రీ ప్రతి కవిత్వంలోనూ కనిపిస్తుంది.. అందువల్లనే రగులుతున్న నెత్తుటినీ, ఉబుకుతున్న కన్నీటిని కలిపి ఈ ప్రపంచానికి ఒక కొత్త టానిక్‌ను అందించగలిగాడు.. చలం చెప్పినట్లు కృష్ణశాస్త్రి తన బాధనంతా అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరిబాధనూ తనలో పలికిస్తాడు.
ఇక ప్రజా ఉద్యమాలతో ఆయన సాన్నిహిత్యం చాలా ఎక్కువ.. అభ్యుదయ రచయితల సంఘం స్థాపనలోనూ, ఆ తరువాత విప్లవ రచయితల సంఘం స్థాపన వెనుక దాగి ఉంది శ్రీశ్రీ ఉద్యమ స్ఫూర్తే...
శ్రీశ్రీ వ్యక్తిగత జీవితం కంటే సామాజిక జీవితంతోనే ఎక్కువ సన్నిహితంగా ఉన్నాడు.. కార్మిక వర్గంతో, కర్షక వర్గంతోనే మమేకమై పోయాడు.. అంతే కాదు రాజకీయ రంగంతోనూ కలిసి ఉన్నాడు..
౨౦వ శతాబ్దపు ఆంధ్ర సాహిత్య మలిభాగాన్ని శాసించిన వాడు శ్రీశ్రీ. అనేక ఉద్యమాలకు సారథ్యం వహించి ఉండవచ్చు. కానీ, తాను నమ్మిన దాన్ని, విలువలను, సిద్ధాంతాన్ని ఆయన ఎన్నడూ వీడలేదు.. ఇందుకోసం ఆయన నిందలు కూడా మోయాల్సి వచ్చింది.. అయినా వెనుకంజ వేసింది లేదు..కొన్ని సంఘాల్లో ఉన్నంత మాత్రాన వాటికి మాత్రమే కట్టుబడి ఉండటం ఆయనకు సాధ్యం కాలేదు.. అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ విధించినప్పుడు.. ఆ తరువాత ౨౦ సూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు వాటిని సమర్థించిన వాడు శ్రీశ్రీ. దీనివల్ల విరసంలో విప్లవమే రేగింది.. ఆయన తన అధ్యక్ష పదవికి రాజీనామాయే చేయాల్సి వచ్చింది.. అయినా ఆయన వెరవ లేదు. ౨౦ సూత్రాల పథకం అమలయితే బడుగులకు లాభం కలుగుతుందని ఆయన బలంగా నమ్మాడు. దానికి కట్టుబడ్డాడు.
విరసం తనపై తాను విధించుకున్న ఎన్నో నియమాలను నేను ధిక్కరించాను.. అన్నిటిలోకీ ముఖ్యమైనది మొదట ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నీ, పిదప ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని బలపరచకపోవటం.. అని ఆయన స్వయంగా తన అనంతంలో పేర్కొన్నారు..అందుకే శ్రీశ్రీని ఇజాలు కట్టిపడేయలేకపోయాయి.. తనకు తానుగా ఆంధ్ర సాహిత్య చరిత్రకు నిలువు సంతకంలా నిలబడిపోయాడు...
విప్లవ కవిత్వం సృష్టించినా, సామాన్యుల్లో చైతన్య జ్వాల రగిలించినా, సినిమా పాటలు రాసినా, శృంగార గీతాలను ఒలికించినా శ్రీశ్రీకే చెల్లింది. తన జీవిత కాలంలో తెలుగు సాహిత్యం తిరిగిన అన్ని మలుపుల్లోనూ శ్రీశ్రీ చైతన్య శీలిగా ఉన్నాడు.. ఉద్యమాలు తీవ్రమైనప్పుడు ముందుండి నాయకత్వం వహించాడు.. క్లిష్ట పరిస్థితుల్లో కీలకంగా నిలబడటానికి వెరవలేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగునాట విప్లవానికి వెలుగు దారి చూపిన వాడు శ్రీశ్రీ. తానే విప్లవమై జగన్నాథ రథచక్రాలను నడిపించుకువచ్చిన వాడు.. ఆయన దారి అనంతం.. ఇతరులకు అందుకోవటం అనితర సాధ్యం.

అంతర్యుద్ధ రాజకీయం

అంతర్యుద్ధం... వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పదం.. రాష్ట్రంలో రాజకీయాలను కలచివేసిన పదం.. పార్టీలు-ప్రత్యర్థుల మధ్య ఆరోపణలు. ప్రత్యారోపణలకు కారణమైన మాట.. శ్రీకృష్ణ కమిటీ ముందు టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్య ఈ రాజకీయ యుద్ధానికి కారణమైంది.. చివరకు టిఆర్‌ఎస్‌ పార్టీ గుర్తింపునే రద్దు చేయమని ఇసికి ఫిర్యాదు చేసేంత వరకూ వ్యవహారం వెళ్లింది..

తెలంగాణాకు అనుకూలంగా నివేదిక ఇవ్వకపోతే, తెలంగాణా రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే, రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ముందు కెసిఆర్‌ వ్యాఖ్యానించారు..
ఆ తరువాత జస్టిస్‌ శ్రీకృష్ణ హైదరాబాద్‌ వచ్చినప్పుడు సున్నితంగానే కెసిఆర్‌ వ్యాఖ్యల్ని ఖండించారు. అప్పటి నుంచీ కెసిఆర్‌పై ప్రత్యర్థుల కదనం ప్రారంభమైంది..అంతర్యుద్ధం అన్న మాట వాడటంపై తీవ్రంగానే వ్యతిరేకత వ్యక్తమైంది.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అన్‌పార్లమెంటరీ పదాల వాడకం ప్రజలను రెచ్చగొట్టడమేనని కాంగ్రెస్‌ సీరియస్‌గా స్పందించింది..
అంతటితో ఆగలేదు.. కెసిఆర్‌పై మొదట్నుంచీ ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న లగడపాటి రాజగోపాల్‌ మరింత దూకుడుగానే వ్యవహరించారు.. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి టిఆర్‌ఎస్‌ పార్టీ గుర్తింపునే రద్దు చేయాలని ఫిర్యాదు కూడా చేశారు...లగడపాటి వ్యవహారం ముందునుంచీ టిఆర్‌ఎస్‌కు మింగుడుపడటం లేదు. ఇప్పుడు ఈ ఎంపి ఇసి దగ్గరకు వెళ్లటంతో టిఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు..
అసలు పార్టీల గుర్తింపును రద్దు చేయాల్సి వస్తే ముందుగా కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపునే రద్దు చేయాల్సి ఉంటుందనీ టిఆర్‌ఎస్‌ వాదిస్తోంది.
తొమ్మిదో వార్షికోత్సవాల్లో బిజెపికి టిఆర్‌ఎస్‌ మద్దతును ఇవ్వటంతో బిజెపి కూడా టిఆర్‌ఎస్‌తో చేతులు కలిపేసింది.. అంతర్యుద్ధం వివాదంలో కెసిఆర్‌ తప్పేమీ లేదని కూడా తేల్చేసింది..అంతర్యుద్ధం అన్నది ప్రజల మధ్య రావటం ఎలా ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో, పార్టీల మధ్య ఇప్పటికే వచ్చేసింది. పార్టీలు రెండుగా ప్రాంతాల మధ్య చీలిపోయాయి. కలిసి ఉన్నా, ఉండలేని పరిస్థితిలో ఒకే పార్టీలో నాయకులు కొనసాగుతున్నారు.. పౌర సమాజంలో ఇంకా ఆ పరిస్థితి రాలేదు.. పౌర సమాజాన్ని చీల్చేందుకు రాజకీయ పార్టీలే ప్రయత్నిస్తున్నాయి. తాము చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యానాలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది పార్టీలు, నాయకులు అర్థం చేసుకోవటం లేదు.. నిజంగా పౌర సమాజంలో పరస్పర విశ్వాసమే కొరవడితే ఆ పరిస్థితిని ఎదుర్కోవటం, అదుపు చేయటం ఈ రాజకీయ వ్యవస్థ వల్ల సాధ్యమయ్యేపని కాదు.. ఈ వాస్తవాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తెరిగి మసలుకుంటే మంచిది.

28, ఏప్రిల్ 2010, బుధవారం

రంగు మారిన చదువుల చెట్టు

అవినీతి ఈ దేశంలో అత్యంత సహజం.. కాకపోతే.. ఉన్నత స్థానంలో ఉన్నవారు కనీసం తమ ఇమేజి కోసమైనా కొంత నిజాయితీతో వ్యవహరిస్తారని అంతా ఆశిస్తారు.. కానీ, మన అధికారులు వీటన్నింటినీ అధిగమించారు. నిరుడు ఏఐసిటిఇ సభ్యులు నారాయణరావు, నిన్నటికి నిన్న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కేతన్‌ దేశాయ్‌.. రంగు మారిన చదువుల చెట్టుకు ప్రతీకలు.. అవినీతికి స్ట్రెయిట్‌ అడ్రస్‌లు...

ఉన్నత విద్యాసంస్థల నుంచి నిపుణులైన పట్టభద్రులు రావట్లేదని నాస్‌కామ్‌ వంటి సంస్థలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేసినప్పుడు కారణం ఏమిటా అని అంతా అనుకున్నారు.. ప్రామాణిక విద్యను అందించటంలో ఎక్కడో లోపం జరిగిందని భావించారు.. కానీ, కారణమంతా ఉన్నత విద్యాసంస్థల బాస్‌ల దగ్గరే ఉందని ఊహించిన వారు లేరు..

ఏఐసిటిఇ సభ్యుడు నారాయణరావు నిరుడు అవినీతి అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయినప్పుడు యావద్దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంజనీరింగ్‌ కళాశాలలకు, పాలిటెక్నిక్‌ కళాశాలలకు అనుమతులిచ్చే అత్యున్నత విద్యామండలి అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది.. సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రామాణికతపై అనుమానపు పొరలు కమ్ముకున్నాయి.

ఇంజనీరింగ్‌ కాలేజీకి అనుమతినివ్వాలంటే భవనం భూమి పూజ దగ్గరి నుంచే రూపాయలు వెదజల్లడం మొదలవుతుంది.. కాలేజీలో సీట్ల సంఖ్య, కోర్సులు, ఫ్యాకల్టీలు.. అన్నీ అబద్ధాలే..అంతా అవినీతే..
ఏఐసిటిఇ నిబంధనల ప్రకారం ౧౫ మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్‌ ఉండాలి. ఎవరైనా తనిఖీకి వస్తే..క్షణాల్లో అద్దె ప్రొఫెసర్లు.. అద్దె సౌకర్యాలు ఏర్పడతాయి.. భారీ మొత్తంలో ముడుపులు సైలెన్స్‌గా ముడుపులు చేతులు మారతాయి.. అంతా సజావుగా సాగిపోతుంది.. అంతే.. అనుమతులను ఆన్‌లైన్‌ ద్వారా చేస్తున్నాం.. అయితేనేం.. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ముడుపులు స్వీకరించేందుకు ఆఫ్‌లైన్‌ అయితే ఏం... ఆన్‌లైన్‌ అయితేనేం...

విద్య వ్యాపారమైంది.. వృత్తి విద్యలో వృత్తి మాత్రమే మిగిలింది.. విద్యార్థులు సమిధలుగా మారారు.. మేనేజిమెంట్‌ సీట్లు, కార్పస్‌ఫండ్‌లకు ప్రభుత్వమే అనుమతి ఇవ్వటమూ ఇవాళ్టి పరిస్థితికి ఓ కారణం..

ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో ౨౫౦౦ వేల ఇంజనీరింగ్‌ కళాశాలలున్నాయి.. నిబంధనల ప్రకారం ఉన్నవి ఎన్నో లెక్కిస్తే పది శాతమైనా మిగలవేమో....
---------2--------------
ఇంజనీరింగ్‌ విద్య ఇంత వైభవంగా వెలగబెడుతుంటే.. ఇక వైద్య విద్య సంగతి ఏం చెప్పాలి.. రెండు కోట్ల రూపాయల లంచాన్ని సాక్షాత్తూ వైద్యవిద్యా మండలి అధ్యక్షుడే తీసుకుంటూ పట్టుబడ్డ దారుణం ఈ దేశంలో తప్ప, మరే దేశంలోనూ జరగదేమో.. వీళ్ల అవినీతి.. జలగల కంటే దారుణమైంది..
అమ్మకానికి అనుమతులు....
ఇది నిజం.. ఇదేదో మామూలు కళాశాలలకో, పాఠశాలకో ఇచ్చే అనుమతి కాదు...
దేశాన్ని తమ ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో ఉద్ధరించే విద్యార్థులను తయారు చేసే కాలేజీలకు ఇచ్చే అనుమతులు..
సున్నితమైన వైద్యంతో ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులను తయారు చేసే మెడికల్‌ కాలేజీలకు ఇచ్చే అనుమతులు..
ఇంజనీరింగ్‌ కాలేజీకి రెండు కోట్లు..
మెడికల్‌ కాలేజీకయితే అయిదు కోట్లు..

ఏమిటివి.. డబ్బులేనా...
అక్షరాలా డబ్బులే.. ఆశ్చర్యపోకండి.. విస్తుపోయే నిజమిది.. నిబంధనల ప్రకారం వెళ్తే.. మన రాష్ట్రంలోనే ఒక్క కాలేజీకి అర్హత ఉండదు.. అన్ని లైసెన్సులూ రద్దు చేయాల్సిందే..
ఇంజనీరింగ్‌ కళాశాల నెలకొల్పాలంటే కనీసం పదెకరాల స్థలం ఉండాలి..
వైద్యకళాశాల ఏర్పాటు చేయాలంటే 15 ఎకరాల స్థలం ఉండాలి...
ఈ భూమి చూపిన తరువాత బిల్డింగ్‌కు అనుమతి ఇవ్వాలి.. ఎందుకంటే కోర్సుల వారిగా బిల్డింగ్‌ల నిర్మాణం జరగాలి..
వాస్తవంగా ఇంత విస్తారమైన స్థలంలో కోర్సుల వారిగా బిల్డింగ్‌లు ఉన్న కాలేజీలు ఎన్నున్నాయో మనం చూడగలమా?

వీటి దగ్గరే అవినీతి పురివిప్పుకుంటుంది.. బిల్డింగుల వ్యవహారం పూర్తయిందంటే ఉన్నత సంస్థలు సీన్‌లోకి వచ్చేస్తాయి. తనిఖీలకు ఏఐసిటిఇ, ఎంసిఐలు బృందాలను పంపిస్తాయి.. ఇక్కడా డబ్బులు లేందే వ్యవహారం ఎంతమాత్రం పొసగదు.. యాజమాన్యం తనకు కావలసిన బృందం తనిఖీకి వచ్చేలా చేసుకోగల వెసలుబాటు కూడా ఉంది, ముడుపులు ముడితే..
మెంబర్‌ సెక్రటరీకి ౫ లక్షలు ముడ్తే కోరుకున్న రీజనల్‌ అధికారిని పంపిస్తారు.. అక్కడి నుంచి సీన్‌ రీజనల్‌ అధికారి దగ్గరకు మారుతుంది.. ఆయన గారు తనిఖీ బృందంలోని అధికారులను ఎంపిక చేస్తారు.. ప్రొఫెసర్లు, ఆర్కిటెక్చర్‌, లాయర్‌ ఇలా సభ్యులు బృందంలోకి ఎన్నికవుతారు.. వీరిలో ఒక్కొక్కరికీ ౫౦ వేలకు తక్కువ కాకుండానే సొమ్ములు ముడతాయి.
చివరకు రీజనల్‌ అధికారి వంతు. కళాశాల ఏర్పాటు పూర్తయ్యే స్థాయిని బట్టి పాతిక నుంచి యాభై లక్షల వరకు రూపాయలే యాజమాన్యం ముట్టజెప్తుంది.. మెడికల్‌ కాలేజీ తనిఖీకే రెండు కోట్ల రూపాయల ఖర్చవుతుంది.. అందరినీ తృప్తి పరిచిన తరువాత ఫైలు ఢిల్లీ చేరుతుంది..
ఇక ఢిల్లీలో పైరవీ మొదలవుతుంది.. ఇక్కడ క్లర్క్‌ స్థాయి నుంచే దందా మొదలవుతుంది.. స్థాయిని బట్టి సొమ్ములు ఇవ్వాల్సి ఉంటుంది.. ఇక్కడో పాతిక లక్షల దాకా మేనేజిమెంట్‌కు ఖర్చు తప్పదు..

ఇంత జరిగాక కూడా కొర్రీ పడిందంటే.. చివరి మార్గం పొలిటికల్‌.. ఎంపిలను సంతృప్తి పరచే కార్యక్రమం.. అనుమతుల కోసం వెళ్లే మేనేజిమెంట్లు ఎంపిల ద్వారా తమ పనులను చక్కబెట్టుకుంటాయి.. యాజమాన్యాల అభిప్రాయం మేరకు ఎంపిల్లో కూడా చీప్‌, అండ్‌ కాస్టీロ్ల ఉన్నారట.. మన రాష్ట్ర ఎంపిలయితే చాలా కాస్టీロ్ల అంట... యుపి, బీహార్‌ ఎంపీలయితే చీపంట... వారికి యాభై వేల రూపాయలు చెల్లిస్తే పనయిపోతుందిట..
మన దేశంలో చదువుకునే రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి.. చదువు కొనుక్కుంటున్నాం.. కానీ, విద్యార్థుల కెరీర్‌ను నిలబెట్టే వృత్తివిద్యకూ చెదలు పడితే.. ఏం చేయాలి?

మొదటిసారి ప్రతినిధుల సభ

తెలంగాణ రాష్ట్ర సమితి దిశ మార్చుకుందా? కెసిఆర్‌ వైఖరి మార్చుకున్నారా? టిఆర్‌ఎస్‌ తొమ్మిదో వార్షికోత్సవాలు జరిగిన తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది.. పార్టీ స్థాపించిన నాటి నుంచీ మునుపెన్నడూ జరగని రీతిలో ఈ ప్రతినిధుల సభ జరగడం విశేషం..

తెలంగాణా రాష్ట్ర సమితి సమావేశం అనగానే.. ఒక బహిరంగ సభను ఏర్పాటు.. దాని కోసం పెద్ద హంగామా, హడావుడి, జనసమీకరణ చేయటం ఆనవాయితీ.. సభకు వీలైనంత లేటుగా కెసిఆర్‌ వచ్చి ప్రసంగం ముగించుకుని వెళ్లిపోవటం ఒక తంతుగా సాగుతున్నదే..

తొమ్మిదో వార్షికోత్సవాలు ఇందుకు పూర్తి భిన్నంగా జరగటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రతినిధుల సభ జరిగింది.. తెలుగుదేశం మహానాడు తరహాలోనే ఇదీ కొనసాగింది.

కెసిఆర్‌, జయశంకర్‌ లాంటి ఒకరిద్దరితో సరిపెట్టకుండా ఏకంగా 12 మంది ప్రతినిధులకు మాట్లాడే అవకాశం రావటం టిఆర్‌ఎస్‌ చరిత్రలోనే రికార్డు..
తెలంగాణాకు సంబంధించి మొత్తం ౨౩ తీర్మానాలను ప్రతినిధుల సభ ఆమోదించింది. తెలంగాణా రాష్ట్ర సాధనతో పాటుగా అన్ని రంగాల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ఈ తీర్మానాల్లో చోటు కల్పించటం విశేషం.. అన్నింటికీ మించి పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ తక్కువ సమయం మాట్లాడటమూ విచిత్రమే.

టీ.వీ ఛానల్స్ తాజా రెటింగ్స్ వీక్-17

Gemini TV 662
Teja TV 376
Maa Telugu 362
Eenadu TV 348
Zee Telugu 334
Sitara 41


TV9 125
TV5 81
NTV News 42
ETV2 38
I News 33
Sakshi TV 28
HM TV 24
Zee 24 Ghantalu 18
ABN 18
Studio N 18
Mahaa TV 12
Raj News 6
Gemini News 5


(Source: TAM CS 15+ Yrs wk-17)



24, ఏప్రిల్ 2010, శనివారం

ట్యాప్‌ లీడర్లు

వాళ్ల ఫోన్లు టాప్‌ అయ్యాయి... మీ ఫోన్లు టాప్‌ కాబోతున్నాయి.. ముందుగానే జాగ్రత్త పడండి.. విపక్ష రాజకీయ నాయకులకే కాదు.. అధికార పార్టీల నేతలకూ ఇదో హెచ్చరిక... అదేమని ఆశ్చర్యపోకండి.. అధికారంలో ఉన్న సర్కారు వారికి తమ పార్టీ వారిపైనే నమ్మకం లేకుండా పోయింది.. ద్రోహం చేసింది.. చివరకు ఈ దేశంలో రాజకీయ నాయకులకూ ప్రెユవసీ అన్నది లేకుండా పోయింది..
సీనియర్‌ నాయకులు..ప్రతిపక్ష నేతలు.. పార్టీల అగ్రనేతలు..ముఖ్యమంత్రులు.. కేంద్ర మంత్రులు...
వీరూ వారని కాదు.. తమ పర భేదం లేదు.. అడుగడుగునా అనుమానం.. అందరి ఫోన్లనూ సర్కారు వింటోంది.. దొంగచాటున గూఢచర్యం నిర్వహిస్తోంది.. వ్యక్తిగత సంభాషణలనూ రికార్డు చేస్తోంది.. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్లపై నిఘా పెట్టింది...

2007 ఫిబ్రవరి...
దిగ్విజయ్‌ సింగ్‌...(కాంగ్రెస్‌ సీనియర్‌ నేత)
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఎన్నికల గురించి పంజాబ్‌కు చెందిన ఓ లీడర్‌తో మాట్లాడుతుంటే ఫోన్‌ టాప్‌ చేసారు..
2007, అక్టోబర్‌..
నితిష్‌ కుమార్‌(బీహార్‌ ముఖ్యమంత్రి)
కేంద్రం నుంచి నిధుల గురించి రెసిడెంట్‌ కమిషనర్‌తో మాట్లాడుతున్న సంభాషణలు రికార్డు అయ్యాయి.
2008, జూలై
ప్రకాశ్‌ కారత్‌ (సిపిఎం ప్రధాన కార్యదర్శి)
అణు ఒప్పందం విషయంలో అవిశ్వాస తీర్మానం సమయంలో సహచరులతో మాట్లాడిన సంభాషణలు ట్యాప్‌ అయ్యాయి..
2008, జూలై
చంద్రబాబు నాయుడు (తెలుగుదేశం అధ్యక్షుడు)
యుపిఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం సమయంలో సహచర విపక్ష నేతలతో మాట్లాడిన సంభాషణలు ట్యాప్‌ అయ్యాయి.
2010, ఏప్రిల్‌..
శరద్‌ పవార్‌(కేంద్ర వ్యవసాయ మంత్రి)
ఐపిఎల్‌ చైర్మన్‌ లలిత్‌ మోడీతో జరిపిన సంభాషణలను టాప్‌ చేసి రికార్డు చేశారు..

ఫోన్‌ ట్యాపింగ్‌.. ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి.. సొంత పార్టీ వారిని సైతం విడవకుండా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ సీనియర్‌ నాయకులకు మింగుడుపడకుండా తయారైంది.. పార్లమెంటును నిలువునా కుదిపేసిన ఈ ఉదంతం యుపిఏ సర్కారుకు ఉచ్చు బిగిస్తోంది..
ప్రముఖ నాయకుల సెల్‌ఫోన్‌లను దొంగతనంగా వినేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. అంతర్జాతీయ సంస్థల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను యుపిఏ సర్కారు కొనుగోలు చేసింది. ౨౦౦౫-౦౬ సంవత్సరంలోనే దీనికి అంకురార్పణ జరిగింది. నేషనల్‌ టెక్నికల్‌ రీసర్చ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించటం మొదలు పెట్టారు..
౨౦౦౬ జనవరి ౭న ఈ సాఫ్ట్‌వేర్‌ ఎలా పని చేస్తున్నదీ తొలిసారి పరీక్షించారు.. అప్పటి జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్‌ ఫోన్‌ను తొలిసారి టాప్‌ చేసి ప్రయత్నించారు.. ఆ పరీక్ష సక్సెస్‌ కావటంతో ఇక నాయకులపై ప్రయోగించటం మొదలు పెట్టారు..

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ల సెల్‌ఫోన్లను కొత్త ఆఫ్‌ ది ఎయిర్‌ జిఎస్‌ఎం మానిటరింగ్‌ డివైస్‌ ద్వారా టాప్‌ చేసినట్లు సమాచారం.. ఈ డివైస్‌ రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఫోన్లను తేలిగ్గా ట్యాప్‌ చేస్తుంది.
అమెరికాతో అణు ఒప్పందం విషయంలో వామపక్ష పార్టీలు యుపిఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుల వ్యూహ, ప్రతి వ్యూహాలను తెలుసుకోవటానికి కూడా సర్కారు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంది.
విచిత్రమేమంటే ఈ డివైస్‌ను ఎక్కడైనా, ఎలా అయినా చాలా తేలిగ్గా ఉపయోగించవచ్చు. నేషనల్‌ టెక్నికల్‌ రీసర్చ్‌ ఆర్గనైజేషనే దీన్ని ఆపరేట్‌ చేస్తుంది. అయితే ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నట్లు రుజువు చేయటం అంత సులభం కాదు. ఇది చాలా చిన్న డివైస్‌ కావటం ఒక ఎతెユ్తతే.. సమస్య మరీ జటిలమైతే, హార్డ్‌ డిస్క్‌లో రికార్డయిన సంభాషణలను ఒక్క బటన్‌తో ఎరేస్‌ చేసేయవచ్చు.. మూడో కంటికి తెలియకుండా ఇది జరిగిపోతుంది.. దొంగ దొరక్కుండా తప్పించుకునేందుకు వీలుంది కాబట్టే సర్కారు ఈ చర్యలకు పూనుకోగలిగింది.. ఇది చట్టవ్యతిరేకమనీ, అనైతికమనీ, ఎవరు ఎన్ని మొత్తుకుంటే మాత్రం ఏం ప్రయోజనం?

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

సినిమా బడ్జెట్‌ పెరిగిపోడానికి కారణం ఎవరు?

సినిమా బడ్జెట్‌ పెరిగిపోడానికి కారణం ఎవరు? కేవలం హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్‌ వల్లే బడ్జెట్‌ పెరుగుతోందా? లేక సినిమా...సినిమాకు భారీగా సెట్స్‌, గ్రాఫిక్స్‌ మయాజాలం వల్ల బడ్జెట్‌ పెరుగుతుందా? అందరూ అనుకుంటున్నట్లు హీరోహీరోయిన్ల రెమ్యూనరేషనే కారణమైతే......తగ్గించుకునేందుకు వారు సిద్ధమడితే ఇండస్ట్రీ బాగుడుతుందా? బడ్జెట్‌ తగ్గించుకుంటామని మీటింగులు పెట్టుకున్న నిర్మాతల వల్ల నిజంగానే సాధ్యమవుతుందా?

తెలుగు చిత్రసీమ ౭౫ఏళ్ల చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా ‘మగధీర’. చిర ంజీవి తనయుడు రామ్‌చరణ్‌ తేజ్‌ నటించిన ఈ సినిమా బడ్జెట్‌ వ్యయం సుమారు 4౦ కోట్లు. రెండున్నర గంటల పాటు ఈ 4౦ కోట్ల రూపాయల క్వాలిటీ తెరమీద కనిపిస్తుంటుంది. ఇదే చిరంజీవి కుటుంబానికి చెందిన హీరో అల్లు అర్జున్‌ తాజాగా నటిస్తున్న ‘బద్రినాథ్‌’ సినిమాను సుమారు 45కోట్లతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ హీరోలు, ప్రొడక్షన్‌ సంస్థల ప్రిస్టేజీ, రికార్డుల స్టేటస్‌ కోసమే తప్ప మరొకటి కాదనేది సుస్పష్టం. ఇదిలా ఉంటే బడ్జెట్‌ తగ్గించేందుకు నిర్మాతల మండలి నియమించుకున్న కమిటీలో అల్లు అరవింద్‌ సభ్యుడు కావడం విశేషం. పైన పేర్కొన్న రెండు సినిమాలకు నిర్మాత కూడా అల్లు అరవిందే.
తెలుగు సినిమా మార్కెట్‌ ఎంత? సినిమా మీద పెడుతున్న ఖర్చు ఎంత? ఇంతకీ సినిమా బడ్జెట్‌ ఎవరి వల్ల పెరుగుతోంది. అంటే...గతంలో కంపెనీ మేకప్‌మెన్‌ మాత్రమే షూటింగ్‌లో ఆర్టిస్టులందరికీ మేకప్‌ వేసేవారు. కాని నేటి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక ఆర్టిస్టుకు మేకప్‌మెన్‌, హెయిర్‌ డ్రస్సర్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌, మేనేజర్‌, కారు డ్రెユవర్‌ ఇలా ప్రత్యేకంగా ఉంటున్నారు. అంటే ఆర్టిస్టు నటించడానికి రెమ్యూనరేన్‌ ఇవ్వడంతో పాటు సదరు ఆర్టిస్టు చుట్టూ ఉండే అదనపు అయిదుగురు వ్యక్తుల ఖర్చులు కూడా నిర్మాతే భరించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక ముంబాయి నుంచి దిగుమతి చేసుకునే హీరోయిన్ల విషయానికొస్తే స్టార్‌ హోటల్‌లో అకామిడేషన్‌ పాటు హీరోయిన్‌ తల్లి, చెల్లి, ఇలా బంధువర్గం, కొందరు హీరోయిన్ల బాయ్‌ఫ్రెండ్స్‌ వచ్చినా వాళ్ల ఖర్చు కూడా పాపం నిర్మాతయే భరించాలి. ఒక ఆర్టిస్టుకు ఎంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారో అంతకంటే రెండింతల ఎక్కువగా ఖర్చు సదరు ఆర్టిస్టుల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇంట్లో భోజనం చేసుకుని హోటల్‌ బిల్లు నిర్మాతకు ఇచ్చే ఆర్టిస్టులు, సొంత కారులో డీజిల్‌ పోయించుకుని నిర్మాత దగ్గరి నుంచి బిల్లు వసూలు చేసే ఆర్టిసుల్టు కోకొల్లలు. ఈ అదనపు బడ్జెట్‌ను ఇంతకాలం భరించిన నిర్మాతలు కాస్త ఆలస్యంగానైనా తేరుకోవడం మంచిదే.
వంద, రెండు వందల రోజుల పాటు షూటింగ్‌ జరుపుకునే ప్రిస్టేజియస్‌ ఆనవాయితీకి ఇక నిర్మాతలు పుల్‌స్టాప్‌ పెట్టనున్నారు. అంతే కాదు లక్షల కొద్ది నెగెటివ్‌ ఎక్స్‌పోజ్‌ చేసే ప్రక్రియతో పాటు అనవసరమైన సెట్స్‌ వేసే విధానానికి స్వస్తి చెప్పాలని నిర్మాతల మండలి నిర్ణయించారు. రెమ్యూనరేషన్‌లో కోత, అనవసరమైన ఖర్చులను కూడా పూర్తిగా తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా....డ్రెユవర్లను, అసిస్టెంట్లను కూడా తగ్గించాలనుకనే నిర్ణయం సినిమా కార్మికుల పొట్ట కొట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సినీ కార్మికులు కోరుతున్నారు.



నొప్పింపక... తానొవ్వని జస్టిస్‌ శ్రీకృష్ణ

జస్టిస్‌ శ్రీకృష్ణ.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తన నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచీ చురుగ్గా దూసుకుపోతున్నారు.. మునుపెన్నడూ లేని విధంగా ఒక కమిటీ ఈ విధంగా పనిచేయటం ఇదే తొలిసారేమో.. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా.. ఎవరు ఎన్ని నివేదికలు ఇచ్చినా వినమ్రంగా స్వీకరిస్తూనే తనదైన శైలిలో పనితనాన్ని ప్రదర్శిస్తున్నారు శ్రీకృష్ణ. ముంబయి పేలుళ్ల కేసులో కఠినమైన సిఫారసులతో నివేదికనిచ్చి రికార్డు సృష్టించిన శ్రీకృష్ణ... ఈసారి తన రికార్డునే బద్దలు కొడతారేమో.

మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా విషయంలో ఓ కమిటీ వేసిందంటే.. దానర్థం.. ఆ విషయాన్ని అటకెక్కించినట్లే... ఒక సమస్య పరిష్కారం కోసం కమిటీ వేయటమంటే.. ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానట్లే లెక్క.. ఒక సమస్యను దీర్ఘకాలం నాన్చాలంటే ఓ కమిటీ వేస్తే చాలని సటైర్లు వేసే పరిస్థితి ఉందంటే కమిటీలకు ప్రజల్లో ఎంత విశ్వసనీయత ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ, జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఈ సంప్రదాయానికి భిన్నంగా పనిచేయటం ఆశ్చర్యం.. విచిత్రం.. కమిటీ ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే పని ప్రారంభించిన శ్రీకృష్ణ కమిటీ ఇప్పటికే దాదాపు ౭౦ వేల నివేదికలను వివిధ వర్గాల నుంచి, పార్టీల నుంచి సేకరించింది. వాటి విశ్లేషణ కూడా ప్రారంభించింది.. అదే సమయంలో క్షేత్రస్థాయి పర్యటనలనూ ప్రారంభించింది.. రెండు రోజుల పాటు మహబూబ్‌ నగర్‌, కర్నూలు జిల్లాల్లో సామాన్య ప్రజలతో కమిటీ కలవటం విశేషమే..
మామూలుగా కమిటీలు ఓ హాలులో కూర్చుని అక్కడికే ప్రజలను రమ్మని వచ్చిన వారితో నివేదికలు తీసుకుని వెళ్తాయి.. కానీ, ఈ ఇద్దరు సభ్యులు మాత్రం గ్రామాల్లో కూడా తిరిగారు.. ప్రజలను కలిసారు.. కర్నూలులో కూలీలను కలిసి రాష్ట్రం విడిపోతే మీరు ఎవరితో ఉంటారని ప్రశ్నించారు.. మరో చోట ఓ విద్యార్థి తెలంగాణా వస్తే హైదరాబాద్‌కు ఎలా వెళ్లేదని అడిగితే, ఢిల్లీ, ముంబయి లకు వెళ్లినట్లే వెళ్లవచ్చంటూ షరీఫ్‌ దీటుగానే జవాబిచ్చారు..

ఇక హైదరాబాద్‌లోనూ శ్రీకృష్ణ కమిటీ సామరస్యంగానే వ్యవహారాన్ని నడుపుతూ వచ్చింది. అన్ని పార్టీలను సంప్రతింపులకోసం పిలిచినా, పిఆర్‌పి, వామపక్షాలు మినహా మిగతా పార్టీలు కుంటిసాకులతో తప్పించుకున్నాయి.. అయినా పరవాలేదంటూ మరోసారి మాట్లాడతానంది..

కెసిఆర్‌ను గొప్ప వక్తంటూ తెగమెచ్చేసుకున్న శ్రీకృష్ణ, అంతర్యుద్ధం అన్న మాట కెసిఆర్‌ అన్నందుకు సున్నితంగానే ఖండించారు.. మిమ్మల్ని మేం మొదట్లో తిరస్కరించామని కెసిఆర్‌ నేరుగానే చెప్పినా ఆయన ఏమీ అనలేదు. ఎవరినీ నొప్పించకుండా, తాను నొచ్చుకోకుండా పని సాగించుకుంటూ పోతున్నారు..

ఇంతవరకు బాగానే ఉంది.. శ్రీకృష్ణ పోకడ ఎలా ఉంది? కెసిఆర్‌ను మెచ్చుకోవటం, కర్నూలు, పాలమూరులలో ఒకటి రెండు చోట్ల రాష్ట్ర విభజన జరిగితే మీరెటువైపు ఉంటారని అడగటం వంటివి క్యాజువల్‌గా వేసిన ప్రశ్నలు.. మెచ్చుకోళ్లు.. ఇంతమాత్రానికే తెలంగాణా వాదులకు అనుకూలమనుకుంటే పొరపాటే.... దీన్ని దృష్టిలో ఉంచుకునే మొదట్లో రుసరుసలాడిన టిఆర్‌ఎస్‌.. క్రమంగా కూల్‌ అయింది..కానీ ఈ మాత్రం దానికే శ్రీకృష్ణ తెలంగాణాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎలా అనుకోగలం? ముంబయి పేలుళ్ల నివేదికలో ఆయన నిక్కచ్చితనం రేపు రాష్ట్ర విభజన వ్యవహారంపై తానిచ్చే నివేదికలో ఏ విధంగా ప్రతిఫలిస్తుందనేది అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు.. ఆలోగా ఇలాంటి ఊహాగానాలుఎన్నో వస్తూనే ఉంటాయి.. వింటూనే ఉంటాం.. ముందుంది అసలు పండుగ...

22, ఏప్రిల్ 2010, గురువారం

1956 AN UNITED STORY

రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైన నాటి నుంచీ చురుగ్గానే పని చేస్తోంది. అన్ని పార్టీలు.. వర్గాల నుంచి వేల కొద్దీ నివేదికలను సమీకరించింది.. ఎండాకాలమని కూడా చూడకుండా కమిటీ సభ్యులు జిల్లాల్లో తెగ తిరిగేస్తున్నారు.. పార్టీలతో చర్చలు మొదలు పెట్టింది.. ఇవన్నీ పూర్తయ్యాక కమిటీ ఏం తేలుస్తుందో కానీ, టిఆర్‌ఎస్‌ మాత్రం పరిష్కారాన్ని సూచించింది.. అదేమిటి?

శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన విషయంలో ఏం తేలుస్తుంది?
౬౫ వేలకు పైగా వచ్చిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందా?
ఎలాంటి పరిష్కారం సూచించబోతోంది...?
౧౯౫౬ నవంబర్‌ ౧కి ముందు నాటి పరిస్థితి పునరుద్ధరణ సాధ్యమేనా?
టిఆర్‌ఎస్‌ కోరుకుంటున్నది ఏమిటి?
తెలంగాణా రాష్ట్రమా?
లగడపాటి చెప్తున్నట్లు పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రమా?


తెలంగాణా రాష్ర ఏర్పాటును కోరుతూ ఏకైక అజెండాతో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో చివరి పేరా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణాకు జరిగిన అన్యాయానికి ఏకైక పరిష్కారం ౧౯౫౬ నవంబర్‌ ౧కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించటమేనని టిఆర్‌ఎస్‌ చేసిన డిమాండ్‌ వెనుక మర్మమేమిటి?
తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అజెండాగా పురుడు పోసుకున్న పార్టీ టిఆర్‌ఎస్‌.. అరవై రోజుల పాటు నిర్విరామంగా ఉద్యమించి కేంద్రాన్ని తెలంగాణా ఏర్పాటు దిశగా అడుగులు కదిలేలా చేసిన పార్టీ టిఆర్‌ఎస్‌... ఆంధ్రప్రాంతంలో ఉద్యమాలు ఉధృతంగా సాగినప్పుడు కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. మొదట్లో కమిటీ ఏర్పాటును టిఆర్‌ఎస్‌ తీవ్రంగానే వ్యతిరేకించింది.

కమిటీని అసలు గుర్తించేదే లేదు పొమ్మంది.. రాజీనామాలు చేసింది.. ఆందోళనలూ చేసింది.. చివరకు తానే రాజీ పడింది... తెలంగాణా కావాలన్న తన డిమాండ్‌ ఎంత బలమైందో వివరిస్తూ నివేదిక రూపొందించటానికి పెద్ద కసరత్తే చేసింది.. దాదాపు ౧౪౦౦ పేజీల అతి పెద్ద నివేదికను అందించింది..
ఇంత విస్తారమైన నివేదికను అందిస్తూనే చివరకు సమస్యకు పరిష్కారాన్నీ సూచించింది. ౧౯౫౬ నవంబర్‌ ౧ ముందు నాటి పరిస్థితులను పునరుద్ధరించాలన్నది టిఆర్‌ఎస్‌ డిమాండ్‌..

కెసిఆర్‌ ప్రత్యర్థులకు ఇక్కడే ఆయుధం దొరికినట్లయింది. ౧౯౫౬ నవంబర్‌ ౧కి ముందు హైదరాబాద్‌ స్టేట్‌ అన్నది అస్తిత్వంలో ఉంది కాబట్టి అప్పటి పరిస్థితులను పునరుద్ధరించటం అంటే మహారాష్ట్ర, కర్ణాటకలో కలిసిపోయిన నాటి జిల్లాలను కూడా విడదీయాలని కెసిఆర్‌ కోరుకుంటున్నారని ఎంపి లగడపాటి విశ్లేషించారు..

కెసిఆర్‌ కూడా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్న కంక్లూషన్‌కు లగడపాటి వచ్చేశారు.. ఇంతకీ టిఆర్‌ఎస్‌ డిమాండ్‌ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?


తెలంగాణ రాష్ట్ర సమితి నేరుగా తెలంగాణ ఏర్పాటును ఎందుకు డిమాండ్‌ చేయలేదు? ౧౯౫౬ నవంబర్‌ ౧ ముందునాటి పరిస్థితుల పునరుద్ధరణనే ఎందుకు కోరుకుంది? వాస్తవంగా అప్పుడున్న భౌగోళిక పరిస్థితులు ఏమిటి?
-----------
౧౯౫౩లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతాన్ని విలీనం చేస్తూ ౧౯౫౬ నవంబర్‌ ౧న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.... ఈ విలీనానికి ముందు కేంద్రం పెద్ద కసరత్తే చేసింది. మొత్తం మీద దేశంలో పలు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ ౧౯౫౬ ఆగస్టు ౩౧న ప్రత్యేకంగా స్టేట్స్‌ రీ ఆర్గనైజేషన్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్‌ స్టేట్‌లోని తెలంగాణా జిల్లాల విలీనం.. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు కూడా ఇందులో ఉంది.. ఈ చట్టం ప్రకారం..హైదరాబాద్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలు విలీనం అయ్యాయి.
అవి ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ , ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌ నగర్‌
రాయ్‌చూర్‌ జిల్లాలోని అలంపూర్‌, గద్వాల తాలూకాలు
గుల్బర్గా జిల్లాలోని కొడంగల్‌, తాండూర్‌ తాలూకాలు
నిర్నా సర్కిల్‌ మినహాయించి జహీరాబాద్‌ తాలూకా
బీదర్‌ తాలూకాలోని న్యాల్‌కల్‌ సర్కిల్‌
బీదర్‌ జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌ తాలూకా
నాందేడ్‌ జిల్లాలోని బిచుకొండ, జుక్కల్‌ సర్కిల్‌లు
నాందేడ్‌ జిల్లాలోని ముధోల్‌, భైంసా తాలూకాలు
కిన్వత్‌, రాజూరా, బోథ్‌, ఇస్లాపూర్‌ తాలూకాలు మినహా మిగతా
హైదరాబాద్‌ స్టేట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయినవి కాకుండా మిగిలిన ప్రాంతాలను బొంబాయి, మైసూరు రాష్ట్రాల్లో విలీనం చేశారు.. అప్పటికి ఈ రాష్ట్రాలకు మహారాష్ట్ర, కర్ణాటక అన్న పేర్లు పెట్టలేదు.

ఇంతవరకు బాగానే ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఆగస్టు ౩౧ ౧౯౫౬న. ఆంధ్రప్రదేశ్‌ అస్తిత్వం నెలకొన్నది నవంబర్‌ ౧న.. ఈ రెండు నెలల కాలంలో హైదరాబాద్‌ స్టేట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పరిపాలన సాగింది.. అంటే హైదరాబాద్‌ స్టేట్‌ విభజన ఆగస్టు ౩౧న జరిగిందని భావించాలా? లేక నవంబర్‌ ౧నే జరిగినట్లు అనుకోవాలా? సీనియర్‌ రాజకీయ నాయకులు మాత్రం ఆగస్టు ౩౧న చట్టం వచ్చింది కాబట్టి హైదరాబాద్‌ స్టేట్‌ విభజన ఆనాడే జరిగినట్లు భావించాలంటారు
లగడపాటి మాటలను పరిగణలోకి తీసుకుంటే, తాత్కాలికంగానైనా హైదరాబాద్‌ స్టేట్‌లో పరిపాలన అక్టోబర్‌ ౩౧, ౧౯౫౬ వరకు సాగింది కాబట్టి అప్పటిదాకా హైదరాబాద్‌ స్టేట్‌ అస్తిత్వం పూర్తిగా గుర్తింపులో ఉన్నట్లేనని భావించాలా? చట్టం ముందే అమల్లోకి వచ్చింది కాబట్టి ౧౯౫౬ నవంబర్‌ ౧కి ముందున్న పరిస్థితి అంటే తెలంగాణా మాత్రమే అని టిఆర్‌ఎస్‌ భావనా? శ్రీకృష్ణ కమిటీ దీన్ని ఏవిధంగా అర్థం చేసుకుంటుంది? ఎలా విశ్లేషిస్తుంది?

21, ఏప్రిల్ 2010, బుధవారం

చోరీ సీజన్‌..

హైదరాబాద్‌లో చోరీ సీజన్‌ మొదలైంది.. సమ్మర్‌ వచ్చిందంటే చాలు.. దొంగలకు భలే గిరాకీ.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన దొంగలు ప్రజల అశ్రద్ధను భలే సొమ్ము చేసుకుంటున్నారు.. గ్రేటర్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా దొంగల భయమే.. ఏ కాలనీకి వెళ్లినా దొంగతనం వార్తలే...
వేసవిలో ఎండలు ఎంతగా మండిపోతున్నాయో.. దొంగలు అంతకంటే ఎక్కువగా విజృంభిస్తున్నారు.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన దొంగలు ఎంపిక చేసుకున్న కాలనీలలో పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేస్తున్నారు.. రాత్రి ౧౨ గంటలైతే చాలు.. దొంగలకు తెల్లవారుతుంది.. నాలుగు గంటలయ్యేసరికి కాలనీలలో తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని తమ పని కానిచ్చేసుకుని చక్కా వెళ్లిపోతారు..

వనస్థలిపురం, పహాడీ షరీఫ్‌, పీర్జాదీగూడ ఘటనలు పోలీసుల కంటి మీద నిద్ర లేకుండా చేశాయి.. ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే దొంగతనాలు, దోపిడీలు, హత్యల లిస్ట్‌ చూస్తే సామాన్యుడి గుండెలు గుభేలుమంటున్నాయి.
హత్యలు 68
సొమ్ముల కోసం హత్యలు 6
కల్పబుల్‌ హోమిసైడ్స్‌ 7
చోరీలు 2532

నిరుటితో పోలిస్తే సంఖ్యాపరంగా దొంగతనాలు తక్కువే జరగిఉండవచ్చు కానీ, ప్రస్తుత పరిస్థితిలో ప్రజల భద్రత అన్నది గాల్లో దీపంగానే ఉండిపోయింది. భద్రత ఏర్పాట్లు ఎవరికి వారు మరింత కట్టుదిట్టం చేసుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

విచ్చల విడిగా జరుగుతున్న ఈ దొంగతనాలను పూర్తిగా నియంత్రించటం అంత తేలికేమీ కాదు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో పోలీసులు జనాభాకు తగినంత సంఖ్యలో లేరు. ఒక పోలీసు స్టేషన్‌ పరిధిలో చిన్నాచితకా కాలనీలతో కలిపి ౩౦ కాలనీలైనా ఉంటాయి.. ఒకటి రెండు పెట్రోలింగ్‌ వ్యాన్‌లతో రాత్రంతా గస్తీ తిరగడం వల్ల ఏదో నియంత్రించగలుగుతామని అనుకోవటం భ్రమ... పోలీసు వ్యాన్‌ ఒక కాలనీలో ఉంటే, మిగతా కాలనీల సంగతి అంతే..అందువల్లే పోలీసులు తమకు తోడుగా కాలనీల్లో ప్రజల సహకారాన్నీ కోరుతున్నారు.. అన్ని కాలనీల్లో ప్రజలు రాత్రి ౧౨ నుంచి తెల్లవారు జామున ౪ గంటల దాకా గస్తీ తిరగాలని కోరుతున్నారు..
ఇళ్లల్లో మహిళలు సైతం దొంగలను అడ్డుకోవటానికి కారంపొడి వంటి వస్తువులను అందుబాటులో ఉంచుకుంటే మంచిదనీ పోలీసుల సూచన.. ఎవరికి వారు తమ భద్రత ఏర్పాట్లను అప్‌డేట్‌ చేసుకోవటం అవసరమని స్పష్టం చేస్తున్నారు.. ఇంతగా విస్తరించిన మహానగరంలో అరకొర సిబ్బందితో దొంగతనాలను జీరో లెవల్‌కు తీసుకురావటం అసాధ్యమైన పని.. ప్రజలు తమవంతుగా పోలీసులకు సహకరిస్తే కొంతవరకైనా వీటిని నియంత్రించవచ్చేమో....

చిరంజీవిని మీడియా టార్గెట్‌ చేసిందా?

చిరంజీవిని మీడియా టార్గెట్‌ చేసిందా? ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేందుకు మీడియా పనిగట్టుకొని దాడి చేస్తోందా? ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తాజాగా చేస్తున్న ఆరోపణ ఇది.. కొంత కాలంగా కొన్ని పత్రికల్లో, చానళ్లలో పిఆర్‌పికి ప్రతికూలంగా వస్తున్న కథనాలు పిఆర్‌పి అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేసే పరిస్థితిని కల్పించాయి..
చిరంజీవి రాజకీయాల విషయంలో మొదట్నుంచీ మీడియా అత్యుత్సాహాన్నే ప్రదర్శిస్తూ వచ్చింది. తన రాజకీయ ప్రవేశాన్ని చిరంజీవి ఎంత దాచాలనుకున్నారో... అంతకంటే ఎక్కువగా ఆయన కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావటానికి మీడియా పాపరాజీల్లా చిరంజీవి, ఆయన కుటుంబం వెంటబడింది.. ఎక్కడ ఏ చిన్న సమావేశం ఏర్పాటు చేసినా రాజకీయ దృక్కోణంతోనే చూసింది..

తీరా పార్టీ ఆవిర్భవించిన తరువాత పెద్ద సంచలనం అనుకున్న పార్టీ అనుకున్నంత సెన్సేషన్‌ సృష్టించలేకపోయింది. పార్టీ వ్యూహకర్తల రాజకీయ అవగాహనా లేమి మీడియాకు ఆటపట్టుగా మారింది.. ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన చిరంజీవి సభలకు జనవాహిని తరలి వచ్చినా.. ఓట్లుగా మారలేకపోయాయి. ౧౮ శాతం ఓట్లతోనే పిఆర్‌పి సరిపెట్టుకోవలసి వచ్చింది. ఎన్నికల తరువాత మీడియాలో ఒక వర్గం తనను టార్గెట్‌ చేస్తోందంటూ చిరంజీవి పదే పదే ఆరోపిస్తూ వచ్చారు.. ఆ రెండు పత్రికలు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.. ఒక పత్రిక జెండా ఎత్తేద్దాం అని రాస్తే.. మరో పత్రిక బాక్స్‌ ఖాళీ అంటూ మరో కథనం రాసింది. ఓ చానల్‌ దుకాణం బంద్‌ పేరుతో పిఆర్‌పిపై కథనం ప్రసారం చేసింది.
పిఆర్‌పి అధినేత చిరంజీవికి కానీ, ఆయన వందిమాగధ బృందానికి కానీ, తొలినాళ్ల నుంచీ కూడా మీడియా మేనేజిమెంట్‌పై సరైన అవగాహన లేదు.. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు మీడియా మేనేజిమెంట్‌ను ఎంత సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేశాయో.. పిఆర్‌పి ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్‌ అయింది. పైగా పార్టీలో మీడియా మేనేజర్లు అంటూ ఎవరూ లేకుండా పోయారు.. అంతకు మించి చిరంజీవి మినహా అంత చరిష్మా ఉన్న నాయకుడు దుర్భిణీ వేసి వెతికినా పిఆర్‌పిలో కనిపించరు.. మన రాజకీయాల్లో ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవటం ఏ పార్టీకైనా తప్పదు.. కానీ పిఆర్‌పి దీన్ని విస్మరించింది. బావగారి బొమ్మ చూపించి చానళ్లు టిఆర్‌పి రేటింగ్‌లు పెంచుకుంటున్నాయంటూ బావమరిది అల్లు అరవింద్‌ చాలాసార్లు బాహాటంగానే అన్నారు కూడా... మొత్తం మీద అటు ప్రధాన పార్టీలు, ఇటు మీడియాల మధ్య పిఆర్‌పి పోకచెక్కలా నలిగిపోతోంది.

20, ఏప్రిల్ 2010, మంగళవారం

తెలుగు సినిమా బాగుపడే అవకాశాలు ఉన్నాయా?

దివాళా బాటలో నడుస్తున్న తెలుగు సినిమా బాగుపడే అవకాశాలు ఉన్నాయా? కొందరి చేతుల్లో నలుగుతున్న సినిమా పరిశ్రమను చక్కదిద్దడం నిర్మాతల మండలి వల్ల సాధ్యమేనా? నలభై కోట్లకు పడగలెత్తిన తెలుగు సినిమా బడ్జెట్‌ తగ్గించాలనుకోవటం నిర్మాతల వల్ల అవుతుందా అన్నది అనుమానమే.. కోట్లాది రూపాయలు రె మ్యూనరేషన్‌ తీసుకునే హీరోల రెమ్యూనరేషన్‌లో కోత విధించాలని నిర్మాతల మండలి చెప్తోంది.. అది సాధ్యమేనని
అంటున్నారు కొందరు నిర్మాతలు. సినిమా ఖర్చుకు కత్తెర విధించడం కోసం ఓ కమిటీని కూడా నియమించనున్నారు.

ఒక తెలుగు సినిమా బడ్జెట్‌ ౪౦ కోట్లు...ఒక హీరో రెమ్యూనరేషన్‌ ౫ కోట్లు....ఇదంతా బాగానే ఉంది. కాని సినిమా విడుదల తర్వాత నిర్మాతకు ఎంత మిగులుతుందో గ్యారంటీ లేదు. పెరిగిపోతున్న బడ్జెట్‌తో సినిమాలు నిర్మించేందుకు నానా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినిమా నిర్మాతలు కష్టాల నుంచి గట్టేక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నిర్మాతలంతా ఒక్కటయ్యారు. భారీ బడ్జెట్‌ సినిమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏయే రంగాల్లో నిర్మాణ వ్యయం తగ్గించగలమో చర్చించేందుకు ఫిలించాంబర్‌లో కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్లతో పాటు కమెడియన్ల రెమ్యూనరేషన్‌ విషయంలో కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
౧). హీరో రెమ్యునరేషన్‌ను సగానికి సగం తగ్గించి, సినిమా రిలీజ్‌ సమయంలో వ్యాపారంలో వాటా రూపంలో మరి కొంత ఇవ్వవచ్చు...
౨). హీరోయిన్‌ రెమ్యునరేషన్‌ను ౫లక్షలకు మించి ఇవ్వరాదు..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హీరోయిన్లకు గెస్ట్‌హౌస్‌లే విడిది కావాలి.. స్టార్‌ హోటళ్లలో విడిది ఇవ్వరాదు.
౨). కార్‌వ్యాన్‌ స్టూడియోల్లో అనుమతించరాదు.
౩). ఆర్టిస్టులకు పర్సనల్‌ అసిస్టెంట్స్‌ తగ్గించుకోవాలి.
౪). పర్సనల్‌ కోసం కంపెనీ వ్యక్తులనే వినియోగించుకోవాలి.
౫). షూటింగ్‌ పని దినాలు తగ్గించుకోవాలి
౬). పని దినాల కోసం హీరో, నిర్మాత, దర్శకుడి మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలి.
౭). పెద్ద సినిమాలకు లక్ష నుంచి లక్షా ఇరవై వేల అడుగుల వరకు మాత్రమే నెగెటివ్‌ ఎక్స్‌పోజ్‌ చేయాలి.
౮). చిన్న సినిమాలకు ౫౦ నుంచి ౬౦ వేల అడుగుల వరకు మాత్రమే నెగెటివ్‌ ఎక్స్‌పోజ్‌ చేయాలి.
౯). షూటింగ్‌ సమయంలో పర్సనల్‌ సెల్‌ఫోన్స్‌ వాడితే నిర్మాతకు ఫైన్‌ కట్టాలి. (గజని సినిమా నిర్మాతకు అమీర్‌ఖాన్‌ ౫౦౦ రూపాయలు ఫైన్‌ కట్టారు)
౧౦). ఆరిస్టులు సరైన సమయానికి షూటింగ్‌కు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవాలి.
౧౧). బాలీవుడ్‌ సినిమా సెユ్టల్‌లో బఫే (ఫుడ్‌) సిస్టమ్‌ అమలు చేయాలి.
తెలుగు సినిమా పూర్తిగా దివాళ తీసింది. హీరో, డైరెక్టర్‌ డామినేట్‌ చేసే ఈ రోజుల్లో నిర్మాత స్థానం ఎక్కడుందో భూతద్దం పెట్టి వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికి కారణం? సినిమా బడ్జెట్‌ పెరగడం. ఒకప్పుడు లోబడ్జెట్‌లో కళాఖండాలు తీసిన తెలుగు సినిమా ఇప్పుడు బడ్జెట్‌ పద్మవ్యూహంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రిస్టేజ్‌ కోసం బడ్జెట్‌ పెంచుకోవడం...రికవరీ లేక తల బాదుకోవడం నేటి నిర్మాత దుస్థితి. హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్స్‌తో పాటు కమెడియన్లు, ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకునే క్యారెక్టర్‌ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లే దీనికి కారణం అని చెప్పవచ్చు. సినిమా నిర్మాణం నిర్మాత చేతుల్లోంచి జారీ పోయిన నేపథ్యంలో
ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్‌, ఇతర వ్యవహారాలకు సంబంధించిన బడ్జెట్‌ తగ్గించుకుంటేనే తెలుగు సినిమా నిర్మాత బ్రతికి బట్టకట్టగలడనేది నిజం.
2
వాడివేడి సమావేశం
తెలుగు సినిమా నిర్మాణ వ్యయం తగ్గించేందుకు నిర్మాతల మండలి ఏర్పాటు చేసుకున్న సమావేశం వాడివేడిగా సాగింది. నిర్మాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు థియేటర్ల అద్దె విధానంపై కూడా చర్చ జరిగింది. దీంతో థియేటర్లు తన గుప్పిట్లో పెట్టుకున్న నిర్మాత ఒకరు బయటికి వెళ్లిపోగా, అసలు నిర్మాతల మండలిపైనే తనకు నమ్మకం లేదని మరో సీనియర్‌ నిర్మాత సమావేశం నుంచి నిష్కృమించారు.

నష్టాల ఊబిలో కూరుకుపోయిన తెలుగు సినిమా నిర్మాతలను గట్టెక్కించేందుకు నిర్మాతల మండలి నడుంబిగించింది. బడ్జెట్‌ తగ్గించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే నిర్ణయించేందుకు చిన్న, పెద్ద నిర్మాతలందరూ ఫిలించాంబర్‌లో దాదాపు రెండున్నర గంటల వరకు చర్చించారు. కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న అల్లు అరివింద్‌, దిల్‌రాజు, సురేష్‌బాబు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కె.ఎల్‌.నారాయణ,పోకూరి బాబురావు, సుప్రియా, అచ్చిరెడ్డితో పాటు నట్టికుమార్‌, సురేంద్రనాథ్‌రెడ్డి, సాయివెంకట్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ వంటి చిన్న నిర్మాతలు కూడా ఈ సమావేశానికి హాజరైయ్యారు. అంతేకాదు..చిన్న నిర్మాతలు దాదాపు ముఫై డిమాండ్లతో నిర్మాతల మండలికి ఓ వినతి పత్రం కూడా అందజేశారు. పలు అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలోనే అసలు నిర్మాతల మండలిపై నమ్మకం లేదని, ఇవన్ని అమలు జరిగే పనులు కావని ఆదిశేషగిరిరావు బయటికి వెళ్లిపోయారు. థియేటర్ల అద్దె విధానంపై చిన్న నిర్మాతలు చర్చించడంతో అల్లు అరవింద్‌ సమావేశం నుంచి నిష్కృమించారు.
కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ తగ్గించేందుకు ఓ కమిటీని నియమించారు.ఈ విషయంలో కూడా నిర్మాతల మధ్య కాస్త అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఈ కమిటీకి దాసరి నారాయణరావు చైర్మన్‌గా ఉండాలని కొందరు నిర్మాతలు పట్టుబడితే..మరి కొంతమంది దాసరి కాకుండా వేరే వారేవరైనా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా గత మూడు రోజుల క్రితమే జరిగింది. నిర్మాతల మద్య ఉన్న విభేదాలు తొలగించుకునే అంశంపై కూడా నిర్మాతల మండలి చర్చించింది. ఇదంతా కాస్సెపు పక్కన పెడితే నిర్మాతల మండలిలో చర్చించుకునేవన్ని ప్రాక్టికల్‌గా అయ్యే పనులు కావని సమావేశంలో పాల్గొన్న నిర్మాతలే చర్చించుకోవడం కొసమెరుపు.

14, ఏప్రిల్ 2010, బుధవారం

బ్లూ టెర్రర్‌-బ్లూటూత్‌ టెర్రర్‌

బ్లూ టెర్రర్‌... ఇదో కొత్త తరహా టెర్రరిజం... వైట్‌ కాలర్‌ టెర్రరిజం... బాంబులు పేల్చకుండా.. కాల్పులు జరపకుండా, దాడులు చేయకుండానే భయాన్ని సృష్టించే కొత్త టెర్రరిజం... ఇది నిజం.. మీకు తెలియకుండానే మిమ్మల్ని మరొకరు గమనిస్తున్నారు.. మీ మాటల్ని వింటున్నారు.. మీ ప్రెユవసీని కాజేస్తున్నారు.. మీ సెల్‌ఫోన్‌లోని ఎస్‌ఎంఎస్‌లను చదివేస్తున్నారు.. మీ ఫోన్‌లోని పర్సనల్‌ ఫోటోలను దొంగిలిస్తున్నారు.. ఆశ్చర్యం కాదు.. విస్తు కొలిపే అంశం ఇది.. ఒళ్లు గగుర్పొడిచే విషయమిది..

సరి కొత్త ఫీచర్లతో కొత్త ఫోన్‌ కొన్నారా? హైఫై టెక్నాలజీ, ఐఆర్‌, ౫ ఎంపి కెమెరా, జిపిఆర్‌ఎస్‌, నావిగేషన్‌, ౩జి, బ్లూటూత్‌..మ్యూజిక్‌ ఎడిషన్‌... అబ్బో ఇన్ని ఫీచర్లు.. పోస్ట్‌ మోడ్రన్‌ సెల్‌ఫోన్‌... స్నేహితులంతా చూసి మెచ్చుకునే ఉంటారు.. కానీ, సంబరపడిపోకండి... మీరు ఎంతో ఆత్రంగా కొనుక్కున్న ఫోన్‌ను మీకు తెలియకుండానే ఎవరో వాడుకుంటున్నారంటే మీకొచ్చే కోపాన్ని ఆర్థం చేసుకోవాల్సిందే...

కానీ, నిజం.. మీ ఫోన్‌ మీ చేతుల్లోనే ఉంటుంది.. కానీ, మీ నెంబర్‌ నుంచి అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ వెళ్తుంటాయి... ఎస్‌ఎంఎస్‌లూ వెళ్లిపోతాయి.. ఇంటర్నెట్‌ డౌన్‌లోడ్‌లు కూడా అవుతాయి.. ప్రీపెయిడ్‌ అయితే, క్షణాల్లో జీరో బ్యాలెన్స్‌లోకి వెళ్లిపోతారు.. పోస్ట్‌పెయిడ్‌ అయితే నెల తిరిగేసరికి వచ్చే బిల్లు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి...
ఇంకా అర్థం కాలేదా? ఇది నిజం.. టెక్నాలజీ అభివృద్ధి చెందిందని మనం తెగ ఆనందపడిపోతున్నామే కానీ, అదే మన కొంప ముంచుతోంది.. సెల్‌ఫోన్‌లలో ఉండే బ్లూటూత్‌ వంటి వైర్‌లెస్‌ టెక్నాలజీని ఎంచక్కా దొంగలిస్తున్నారు సెల్‌ హాకర్లు... ఇన్నాళ్లూ కంప్యూటర్‌ హాకింగ్‌ గురించి విన్నాం.. ఇప్పుడు సెల్‌ హ్యాకింగ్‌ మొదలైంది. మీ ఫోన్‌ డివైస్‌లో బ్లూటూత్‌ ఆప్షన్‌ ఆన్‌లో ఉంటే చాలు.. ఎవరైనా మీ ఫోన్‌ను ఎంచక్కా హాక్‌ చేయవచ్చు. మీ ఫోన్‌లో ఉన్న అన్ని ఎస్‌ఎంఎస్‌లు, ఇమేజెస్‌ను, వీడియోలను చూసుకోవచ్చు. మీ కన్వర్జేషన్‌ను వినేయవచ్చు..


ఇంతకీ బ్లూటూత్‌ ఆప్షన్‌ను ఎలా హాక్‌ చేస్తారు? మన ఫోన్‌ను మనకు తెలియకుండా ఇతరులు వాడటం సాధ్యమేనా? ఎస్‌..మన బ్లూటూత్‌ను యాక్టివేట్‌ చేసినప్పుడు అందులోకి పొరపాటున ఇతరులను అనుమతించామా.. ఇక అంతే సంగతులు.. సూపర్‌ బ్లూటూత్‌ హాక్‌ సాఫ్ట్‌వేర్‌ లాంటి ఆధునిక హాకింగ్‌ సాఫ్ట్‌వేర్లను మన డివైస్‌లోకి పంపించేస్తారు.. అంతే ఇక మన ఫోన్‌ హాకర్ల చేతులో పడినట్లే.. మన ఫోన్‌ మన చేతులోనే ఉంటుంది.. ఇతరులు దాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు..
బ్లూటూత్‌ హాకింగ్‌ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి...రకరకాల సమస్యలతో వినియోగదారులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు...
..................
మీ ఫోన్‌ మీ జేబులోనే ఉంది.. మీరే వాడతారు.. సాధారణంగా ఎవరికీ ఇవ్వరు.. కానీ, ఓరోజు మీకు పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.. ఫలానా ఫోన్‌కు అసభ్యకరంగా కాల్స్‌ చేసి ఫలానా అమ్మాయిని వేదిస్తున్నావట? తమాషాగా ఉందా? అంటూ పోలీస్‌ హెచ్చరిస్తాడు.. ఇదేమిటని ఆశ్చర్యపోయే లోగానే.. ఏంటి బాస్‌.. మొన్న డబ్బులడిగావు...ఫలానా అకౌంట్‌లో వేయమని.. వేశాను చూసుకున్నావా అని మరో స్నేహితుడు వచ్చి పలకరించాడు... మీరు ఆ కాల్స్‌ చేయలేదు.. డబ్బుల కోసం ఎవరినీ అడగలేదు.. అయినా మీ ఫోన్‌ లోని బ్లూటూత్‌ ఆ పని చేసింది..
ప్రధానంగా వ్యాపారులకు ఈ పరిజ్ఞానం శాపంగా మారిపోయింది. అర్జెంట్‌ కాల్స్‌ అటెండ్‌ చేసేందుకు బ్లూటూత్‌ను ఎక్కువగా వాడేది వ్యాపారులే.. వీళ్ల లావాదేవీలన్నీ హాకర్ల కారణంగా గందరగోళంలో పడుతున్నాయి. ఈ హ్యాకర్లను పట్టుకోవటం అంత తేలికేమీ కాదు.. అందుకే ప్రజలే జాగ్రత్తగా ఉండటం అవసరం..
బ్లూటూత్‌ను అవసరమైనప్పుడే యాక్టివేట్‌ చేయాలి.
బ్లూటూత్‌ యాక్టివేట్‌లో ఉన్నప్పుడు తెలియని వాళ్లు లైన్‌లో ఉంటే వెంటనే డిలిట్‌ చేయాలి.
తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో బ్లూటూత్‌ అనుమతి ఇవ్వవద్దు
యాంటీ హాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో లోడ్‌ చేసుకుంటే మంచిది.

పోలీసులు తీరు ఎందుకు విమర్శలకు గురవుతోంది?

ఆందోళనలు.. నిరసనలు.. ఉద్యమాలు... వీటిలో ఏ ఒక్కటి చెలరేగినా వాటిని నిరోధించటం, అడ్డుకోవటం పోలీసుల బాధ్యత. కానీ ఎక్కడ ఆందోళనలు రేగినా వాటిని అదుపు చేయటంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తరచూ ఎందుకు విమర్శలకు గురవుతోంది?.. ఇందుకు కారణం ఇటీవలి కాలంలో ప్రతి ఆందోళనలోనూ పోలీసు లాఠీ విచక్షణ లేకుండా విరుగుతోంది..

ఉస్మానియాలో విద్యార్థులపై లాఠీ చార్జి...
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆందోళన కారులపై విరిగిన లాఠీ..
కోల్‌కత్తా ఆసుపత్రిలో నిరసనకారులను చెదరగొట్టిన లాఠీ...
ఢిల్లీ.. భోపాల్‌.. సింగూర్‌.. ఇలా ఎక్కడ నిరసన రేగినా హింసాత్మకం కాకుండా ముగిసింది లేదు.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసన కారులపై పోలీసులే ఎలాంటి కవ్వింపు లేకుండా విరుచుకుపడుతున్నారన్నది సాధారణంగా వచ్చే విమర్శ. ఇందులో నిజం పాలు ఎంత అంటే , ఇటీవల ఉస్మానియాలో విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీ జరిపిన తీరును సిఐటి తప్పుపట్టినంత అని చెప్పవచ్చు... ఉస్మానియాలో విద్యార్థులపై లాఠీ చార్జీ విషయంలో పోలీసులే దూకుడుగా వ్యవహరించినట్లు సిఐడి నివేదిక తేల్చింది. ఈ వ్యవహారంలో ఆరుగురు పోలీసు ఉన్నతాధికారుల వైఖరిని సిఐడి తీవ్రంగా తప్పు పట్టింది. వాళ్లపై చర్య తీసుకోవాలని కూడా సిఫారసు చేసింది. డిజిపికి నివేదికను కూడా సమర్పించింది. దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఉస్మానియాలోనే కాదు.. జైపూర్‌లో ఓ కార్పోరేట్‌ ఆసుపత్రిలో వైద్యులు వైద్య సేవలందించేందుకు నిరాకరించటం వల్ల ఇద్దరు చనిపోయారు.. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన నిరసన కారులపై పోలీసు లాఠీ దారుణంగా విరుచుకుపడింది. అంతకు ముందు రోజు గుంటూరులోనూ ఇదే పరిస్థితి...
ఎందుకిలా జరుగుతోంది.. ఆందోళన కారులు ప్రొవోక్‌ చేయకుండానే పోలీసులు ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. నిరసన కారులు అదుపు తప్పి ప్రవర్తిస్తుంటే వాళ్లను చెదరగొట్టడానికి ప్రయత్నించవచ్చు. ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి.. వాటర్‌ కేనన్లను వాడటం వంటివి చేయటం, టియర్‌ గ్యాస్‌ను వదలంటం వంటివన్నీ చేసాక కానీ ప్రత్యక్షంగా అణచివేతకు సిద్ధపడకూడదు.. అలా కాకుండా, ముందుగానే లాఠీలకు పని చెప్పటం, గాల్లో కాల్పులు చేయటం శాంతియుతంగా సాగే ఆందోళనను నిష్కారణంగా హింసాత్మకం చేస్తున్నారు..

ఆందోళనలు జరుగుతున్న సమయంలో బందోబస్తుకు వెళ్లే పోలీసులు ముందుగానే లాఠీచార్జీకి మానసికంగా సిద్ధపడుతున్నారా? అదే నిజమైతే అంతకంటే నేరం మరొకటి ఉండదు..ఇదే కారణం కాకపోవచ్చు. ఏవైనా ఆందోళనలు రేగినప్పుడు పోలీసులు మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారా? ఎండల్లో, వానల్లో చాలాసేపు నిలబడి ఉండటం వల్ల, కాపలా కాయటం వల్ల తమకు తెలియకుండానే చిరాకు పడుతున్నారా? కారణాలు ఏవైనా కావచ్చు. కానీ, ప్రొవొకేషన్‌ అనేది లేకుండా శాంతియుతంగా సాగే నిరసనలపై జులుం ప్రదర్శించటం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదు.. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మొక్కుబడి విచారణలతోనూ, నామమాత్రపు నివేదికలతో సరిపెట్టడం, ఇలాంటి దూకుడు చర్యలను ఆపడానికి ఏం చేయాలో ఆలోచించాలి.. చర్యలు తీసుకోవాలి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళనలు చేసే హక్కు అందరికీ ఉంది.. కొన్ని పరిమితుల్లో శాంతియుతంగా చేసుకున్నంత వరకు వాటిని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు..


13, ఏప్రిల్ 2010, మంగళవారం

చంద్రబాబు నాయుడు మరోసారి కీలక పాత్ర పోషిస్తున్నారా?

జాతీయ రాజకీయాలు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. బొటాబొటి సంఖ్యాబలంతో సర్కారును నెమ్మదిగా నెట్టుకొస్తున్న యుపిఏ కు ఇప్పుడు పెద్ద ముప్పే వచ్చి పడింది. బిజెపి యేతర ప్రతిపక్షాలన్నీ ఆర్థిక బిల్లులపై కోత తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించటం సర్కారుకు తలనొప్పి తెచ్చిపెట్టింది.. కోతతీర్మానమే ప్రవేశపెడితే, సర్కారు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి..
మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వం తొలిసారి అత్యంత కీలకమైన పరీక్షను ఎదుర్కోబోతోంది. కాంగ్రెస్‌, బిజెపి యేతర విపక్షాలన్నీ ఒక తాటిపైకి వచ్చాయి. అధిక ధరలు, ఇతర అంశాలపై సర్కారును నిలదీసేందుకు, ఆర్థిక బిల్లులపై కోత తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు నాయుడి నేతృత్వంలో సమావేశమైన ౧౩ పార్టీలు నిర్ణయించాయి. దీని వెనుక ఉన్న ఇదే జరిగితే సర్కారు మైనార్టీలోకి పడిపోయే అవకాశం ఉంది..

కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ బలం దాదాపు ౨౮౭ దాకా ఉంది.
ఇందులో కాంగ్రెస్‌కు సొంతంగా ఉన్న బలం ౨౦౮
తృణమూల్‌ కాంగ్రెస్‌ ౧౯
డిఎంకె ౧౮
ఎన్‌సిపి ౯
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ౩
ముస్లిం లీగ్‌ ౨
బయటి నుంచి సపోర్ట్‌ ఇస్తున్న పార్టీలు
బిఎస్‌పి ౨౧
జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా ౧
స్వతంత్రులు ౬
................................

ఢిల్లీలో సమావేశమైన ౧౩ పార్టీల బలం ౮౭ దాకా ఉంది. వీటిలో
ఎస్పీ ౨౨
సిపిఎం ౧౬
బిజెడి ౧౪
అన్నాడిఎంకె ౯
టిడిపి ౬
ఆర్‌ఎల్‌డి ౫
సిపిఐ ౪
ఆర్‌జెడి ౪
ఫార్వర్డ్‌ బ్లాక్‌ ౨
జెడి(ఎస్‌) ౩
ఆర్‌ఎస్‌ ౨
వీటికి తోడు ఎన్‌డిఏ బలం ౧౫౧ ఎలాగో ఉంది..
ధరలపై కోత తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఎన్‌డిఏ ఇంతకు ముందే హెచ్చరించింది. ఇప్పుడు పదమూడు పార్టీల కూటమి అదే మాట అంటోంది.. ఇంతవరకు బాగానే ఉంది కానీ, బిఎస్‌పి ఎలా స్పందిస్తుందన్న దానిపైనే ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉంది. బిఎస్‌పికి ఉన్న ౨౧మంది ఎంపిలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవకపోయినా, వ్యతిరేకంగా ఓటేస్తారా లేదా అన్నదే సమస్య. తటస్థంగా ఉన్నా సర్కారు గండం నుంచి గట్టెక్కుతుంది.

జాతీయ రాజకీయ పునస్సమీకరణలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కీలక పాత్ర పోషిస్తున్నారా? ఔను.. ఢిల్లీలో జరిగిన పదమూడు పార్టీలు సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు మైసూరా రెడ్డి ఇల్లు వేదిక కావటం కీలకం...
తెలుగుదేశం పార్టీ అధినేత మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ౧౯౯౭-౯౮లలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో చక్రం తిప్పినట్లే.. ఇప్పుడూ క్రమంగా జాతీయ సమీకరణాల్లో తనదైన శైలిలో విపక్షాలను ఏకం చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు.. రెండోసారి ఓటమి పాలైన తరువాత జాతీయ స్థాయిలో మసకబారిన తన ఇమేజిని మళ్లీ పెంచుకునే దిశగా బాబు పావులు కదుపుతున్నారు.. ధరల పెరుగుదల అంశం ఆయనకు బాగా కలిసి వచ్చింది. మూడో ఫ్రంట్‌ అన్న పదం అచ్చిరాలేదో ఏమో.. అలాంటి పేర్లు కానీ, కూటములు కట్టడం కానీ చేయకుండానే, విడివిడిగా ఉంటూనే ఒక్కటిగా ఆందోళన పథంలో నడిచేందుకు బాబు వ్యూహం పన్నుతున్నారు..
రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ వస్తోంది.. ఈ వాతావరణంలో తాను తిరిగి అధికారంలోకి రాలేనన్న అనుమానం వస్తే రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ వెనుకాడకపోవచ్చు. అలాంటప్పుడు ఆంధ్రప్రాంతంలో అధికారాన్ని కొల్లగొట్టేందుకు తెలుగుదేశంకు అన్ని అవకాశాలు ఉన్నాయి. సమైక్యంగా ఉన్నా రాష్ట్రంలోనూ తామే అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమా టిడిపి శ్రేణుల్లో దృఢంగానే ఉంది. ఇదే జరిగితే తెలుగుదేశం జాతీయ పార్టీగా అవతరించే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.. అలాంటప్పుడు చంద్రబాబు పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించవచ్చు. వచ్చే ఎన్నికల్లో కనీసం ౨౫ నుంచి ౩౦ వరకు ఎంపి స్థానాలపై తెలుగుదేశం పార్టీ గురి పెట్టింది. అనుకున్నంత బలాన్ని పొందగలిగితే ఢిల్లీలో చంద్రబాబు తిరిగి ఓ వెలుగు వెలగడం కష్టమేమీ కాదు.. జాతీయ పార్టీగా ఎదగాలంటే పొరుగున ఉన్న రాష్ట్రాల్లోకి టిడిపిని విస్తరించాలన్న ఆలోచనలోనూ చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.. మొత్తం మీద చంద్రబాబు దూరదృష్టితో, ఒక ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీగానే పుట్టింది.. అదే సిద్ధాంతంతో ఇప్పటివరకూ కొనసాగుతోంది.. మిగతా విపక్షాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతూ వచ్చినవే.. ఇప్పుడు వీటన్నింటినీ మరోసారి ఏకం చేసే పనిలో బాబు నిమగ్నమయ్యారు.. ఇందులో ఆయన సాధించే సక్సెస్‌ తెలుగుదేశం భవిష్యత్తుకు బాట అవుతుంది.

12, ఏప్రిల్ 2010, సోమవారం

సానియా పెళ్లికి మీడియా బాజాలు..

సానియా మీర్జా... ఇండియన్‌ టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌... ఆమె పెళ్లి అంటే మాటలా? విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ పెళ్లి తరువాత.. దేశం మొత్తం మీద అంత కంటే ఎక్కువ హడావుడి జరిగిన పెళ్లి.. ఈ విషయంలో మీడియా పాత్రకైతే తిరుగే లేదు.. ప్రపంచ పాపరాజీల వ్యవస్థను మించి పోయింది ఇండియన్‌ మీడియా.. సానియా మీర్జా పెళ్లి వార్త బ్రేక్‌ అయినప్పటి నుంచీ మీడియాలో ఒకటే హడావుడి... అసలే గ్లామర్‌ టెన్నిస్‌ స్టార్‌... దానికి తోడు ఓ క్రికెటర్‌తో పెళ్లి.. అదీ దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన క్రికెటర్‌తో నిఖా.. మీడియాకు ఇంతకంటే పండుగేం కావాలి? అటు పాకిస్తాన్‌లో, ఇటు భారత్‌లో అన్ని చానళ్లలో, అన్ని వార్తా పత్రికల్లో గత పదిహేను రోజులుగా సానియా, షోయబ్‌ల ఫోటో లేకుండా, వార్త రాకుండా ఉన్న సందర్భం ఒక్కటంటే ఒక్కటి కనిపించదు..

నిఖా వెనుక రేగిన వివాదాన్ని విస్తృతం చేసింది మీడియానే... ముగింపు పలికేలా చేయగలిగిందీ మీడియానే... మీడియాలో సంచలనాల మూలంగానే బెట్టింగ్‌ వీరులూ భారీగానే బిజినెస్‌ చేసుకోగలిగారు.. ఐశ్వర్యరాయ్‌-అభిషేక్‌ల పెళ్లికి కూడా చేయనంత హడావుడి సానియా పెళ్లి విషయంలో మీడియా చేసిందనటంలో సందేహం లేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ వార్త టివి సీరియళ్లు, సినిమా వార్తలు, రియాల్టీ షోలను కూడా మించిపోయింది.
పెళ్లి గోలను మొదలు పెట్టినప్పటి నుంచీ అయేషాతో షోయబ్‌ పెళ్లి వివాదం, పోలీసు కేసులు, అతణ్ణి అరెస్టు చేస్తారని కొందరు.. చేయరని ఇంకొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలతో సృష్టించిన గందరగోళానికి షోయబ్‌ నిజంగానే ఆందోళన చెందినట్టున్నాడు.. చివరకు పాస్‌ పోర్ట్‌ కూడా సీజ్‌ చేసేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో అయేషాకు తలాక్‌ ఇవ్వాల్సి వచ్చింది.. ఆ తరువాత కూడా మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు షోయబ్‌, సానియాల నిఖాకు ఇబ్బందికరంగా మారాయి.

అందుకే మీడియాకు సానియా, షోయబ్‌లను వారి కుటుంబాలు దూరంగా ఉంచుతూ వచ్చాయి. పెళ్లి తతంగం ముగిసే వరకూ కూడా సమాచారం బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు.. పెళ్లి తేదీ దగ్గర నుంచి పెళ్లి జరిగే వేదిక దాకా కూడా రకరకాల వార్తల్ని సృష్టించి మీడియాను గందరగోళంలో పడేశారు.. దీంతో సానియా పెళ్లి వ్యవహారం ఇంకా గందరగోళంగా మారింది.. మొత్తం మీద ఆమె వివాహం తాజ్‌ కృష్ణాలో జరిగేంత వరకూ అతి రహస్యంగానే ఉంచారు.. చివరకు అతిథులను సైతం గుర్తు తెలియకుండా నల్ల కార్లలో తీసుకువచ్చారు.. మీడియా హడావుడికి తోడు.. సానియా కుటుంబం చేసిన కన్ఫ్యూజన్‌ ఆమె పెళ్లిని విచిత్రంగా ముగించింది..
పాపరాజీల వ్యవస్థ ఇంగ్లండ్‌కు యువరాణిని లేకుండా చేసింది. ఈ పాపరాజీల వల్లనే ప్రిన్సెస్‌ డయానా అర్ధంతరంగా చనిపోయింది... ఇప్పుడీ ధోరణి భారత్‌కు కూడా విస్తరించింది. సానియా పెళ్లి విషయంలో ఇదే జరిగింది. తెలుగు చానళ్లు ఒకటి అరా కెమెరాలతో చేసిన హడావుడి ఒక ఎతెユ్తతే, హిందీ చానళ్లు ఒక్కొక్కటి ఆరేడుగురిని యూనిట్లతో సహా పంపించి సైన్యాన్ని మోహరించినట్లు తాజ్‌కృష్ణా దగ్గర, సానియా ఇంటి దగ్గర, అయేషా ఇంటి దగ్గర యూనిట్లను ఏర్పాటు చేశాయి. సానియా షాపింగ్‌ చేయాలంటే కూడా అర్ధరాత్రి దాటాక కానీ వీలు కాని పరిస్థితి. ఇంత హడావుడి అవసరమా? గతంలో ముంబయిపై దాడి సందర్భంలోనూ మీడియా చూపిన అత్యుత్సాహం టెర్రరిస్టులకు చాలా రకాలుగా ఉపయోగపడిందన్న వాస్తవం గుర్తుండే ఉంటుంది. పాకిస్తాన్‌లోని టెర్రరిస్టుల బాసులు టీవీలు చూస్తూ తమ అనుచరులకు ఆదేశాలిచ్చారు.. తరువాత మీడియా నాలుక్కరుచుకుంది.. సానియా నిఖా విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందనే చెప్పాలి...


8, ఏప్రిల్ 2010, గురువారం

ఎన్నాళ్లీ మంటలు?

మళ్లీ యాసిడ్‌ మంటలు పెట్రేగుతున్నాయి. పైశాచికత్వం పెచ్చుమీరుతోంది.. చట్టాలు చేస్తామన్న వారు మాటలకే పరిమితమయ్యారు.. ఉన్మాదులు రెచ్చిపోతుంటే, అమాయకులు అన్యాయంగా బలవుతుంటే.. ఆర్చేవారు లేరు.. తీర్చే వారు లేరు.. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు చోట్ల యాసిడ్‌ దాడులు జరిగాయి... బాధితులు మృత్యువుతో పోరాడుతున్నారు... ఈ పరిస్థితి ఎంతకాలం? ద్రావకం దాడులను నిరోధించేదెలా?

మొన్న ప్రణీత.. నిన్న లలితాబాయ్‌... ఇవాళ సుల్తానా... యాసిడ్‌ దాడులకు బలైపోయిన అభాగ్యులు... కఠినంగా శిక్షిస్తామని సర్కారు హెచ్చరించినా, చట్టంలో సవరణలను ప్రతిపాదించినా ఉన్మాదుల దాడులు ఆగింది లేదు.. నియంత్రించిందీ లేదు.. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా తెనాలిలో లలితాబాయ్‌ అనే పధ్నాలుగేళ్ల బాలికపై సుబ్బారావు అనే వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశాడు.. దాదాపు నలభై శాతం ఆమె శరీరం కాలిపోయింది.

ఇదే సమయంలో ఇదే జిల్లాలో ఓ అన్నపై తమ్ముడు యాసిడ్‌తో దాడి చేసి మృత్యు ముఖంలోకి తోసేశాడు...అదేం దురదృష్టమో కానీ, గత ఏడాది కాలంలో రాష్ట్రం మొత్తం మీద ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనిమిది ఘటనలు ఇలాంటివి జరిగాయి. అయితే ఒక్కరిపైనా చర్య తీసుకున్న దాఖలా లేదు..

ఈ రెండు ఘటనలు జరిగి ౨౪ గంటలైనా కాలేదు.. నాంపల్లి కోర్టు సాక్షిగా అంతా చూస్తుండగానే ఓ మహిళపై మరో మహిళే దాడి చేసింది.
గతంలో యాసిడ్‌ దాడులు జరిగినప్పుడే అసెంబ్లీలో దుమారం రేగింది.. యాసిడ్‌ దాడులకు పాల్పడే వారిపై రౌడీషీట్‌ తెరిచి కఠినంగా శిక్షించేలా చట్ట సవరణకూ సర్కారు ప్రతిపాదన చేసింది. శాసనసభ ఆమోదమూ తెలిపింది కానీ, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడందే చట్టం సంపూర్ణం కాదు.. వాస్తవానికి యాసిడ్‌ అనేది మార్కెట్లో సులభంగా దొరికే సరుకైపోయింది. విచక్షణ లేకుండా ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోనైన క్షణంలో పైశాచిక ఆలోచనలు చేసే వారి వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. యాసిడ్‌ అమ్మకాలను నిషేధించాలన్న డిమాండ్‌ చాలాకాలంగా వినవస్తున్నదే.. కానీ, దాని వల్ల వాస్తవంగా కలిగే వస్తూత్పత్తి ప్రయోజనాలు దెబ్బతింటాయి. అలా అని ఇలాంటి దాడులను నిరోధించటానికి కఠినంగా వ్యవహరించకపోతే అమాయకుల జీవితాలు నాశనమవుతాయి.. ఇలాంటి దాడులకు పాల్పడేవారిపై హత్యానేరం మోపి విచారించాలన్న మహిళా సంఘాల డిమాండ్‌ను సర్కారు పరిగణించాలి.. ఒక్కరినైనా కఠినంగా శిక్షించగలిగితే.. దాని ప్రభావం మిగతావారిపై పడే అవకాశం ఉంది..


7, ఏప్రిల్ 2010, బుధవారం

దేశ రాజధానిలో రాష్ట్ర రాజకీయాల సందడి

దేశ రాజధానిలో రాష్ట్ర రాజకీయాల సందడి ప్రారంభమైంది. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించే గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు తుది కసరత్తులు చేస్తున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర వాదాల కారణంగా రెండు వర్గాలుగా చీలిపోయిన ప్రధాన పార్టీలు, నివేదిక సమర్పణలో కూడా అదే వైఖరిలో ముందుకు పోతున్నాయి...

విభజన.. సమైక్య వాదాలు.. సాక్ష్యాలు, ఆధారాలు.. వివరణలు.. విశ్లేషణలతో రాజకీయ పార్టీల నివేదికలు తుదిరూపానికి వచ్చేశాయి.. శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు ఇవ్వాల్సిన గడువు మరో మూడు రోజుల్లో ముగుస్తుండటంతో ఢిల్లీలో మనవారి హల్‌చల్‌ మొదలైంది... వివిధ రాజకీయ పార్టీలు, వర్గాలు.. బృందాలుగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నాయి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధానంగా ఆకాంక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ౧౪౦౦ పేజీల సుదీర్ఘ నివేదికను సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణాకు వివిధ రంగాల్లో జరిగిన అన్యాయాలను ఉటంకిస్తూ అతి పెద్ద నివేదికనే టిఆర్‌ఎస్‌ రూపొందించింది..

ప్రదాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్నట్లే నివేదిక విషయంలోనూ వ్యవహరిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన వైఖరేంటో స్పష్టం చేయలేదు.. సరికదా.. పార్టీలోనే రెండు గ్రూపులను ఏర్పాటు చేసి ఎవరి గోల వారే పడండంటూ తేల్చేశారు.. ఇంకేం తెలంగాణా టిడిపి, సీమాంధ్ర టిడిపి అంటూ రెండు కుంపట్లు ఏర్పడి రెండు నివేదికలను రూపొందించాయి.. ఈ రెండు బృందాలు ఇప్పటికే ఢిల్లీలో మకాం పెట్టాయి.
కాంగ్రెస్‌ పార్టీ మాత్రం నివేదికలు ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు లేదు.. నివేదికలు ఇచ్చేందుకు గడువును పెంచాలని కోరనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి వీరప్పమొయిలీ పేర్కొనటం ఇందుకు తార్కాణం.. చివరకు నివేదికల విషయం దగ్గరలోనైనా రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఒక స్పష్టమైన వైఖరికి రాలేకపోయాయి. ప్రస్తుతం రెండు రాజకీయ పార్టీలు ఎస్కేపిజం అన్న సిద్ధాంతం తప్ప మరొక ధోరణిని అవలంబించే రిస్క్‌ తీసుకోలేకపోతున్నాయి. ఏమైతేనేం.. శ్రీకృష్ణ కమిటీ ఈ నేవేదికలన్నింటినీ పోగు చేసుకుని ఎలాంటి పరిష్కారాన్ని సూచిస్తుందన్నది మాత్రం వేచిచూడాలి...


6, ఏప్రిల్ 2010, మంగళవారం

బెట్టింగ్‌ పెళ్లి

సానియా, షోయబ్‌ల పెళ్లి జరుగుతుందో లేదో అన్నది పెద్ద పజిల్‌లాగా మారింది. ఒకటొకటిగా పడ్డ చిక్కుముళ్లు ఎలా వీడతాయి? అసలు పెళ్లి జరుగుతుందా? లేక షోయబ్‌ పోలీసులు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడా? హైదరాబాద్‌ సహా ప్రపంచమంతటా తెగ ఉత్కంఠ రేగుతోంది.. చాలాకాలంగా ఖాళీగా ఉన్న బెట్టింగ్‌ రాయళ్లకైతే పండగే మొదలైంది..

భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటేనే తెగ టెన్షన్‌గా ఉంటుంది..

అలాంటిది ఇరుదేశాల మధ్య పెళ్లి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటే ఇంకెంత ఉత్కంఠ ఉండాలి?

అది కూడా ఇరు దేశాల సెలబ్రిటీల వివాహం అనేసరికి ఇక అందరి దృష్టీ ఆ పెళ్లిపైనే ఉంటుందనటంలో సందేహమా?

ఒకరు క్రికెట్‌ స్టార్‌ షోయబ్‌ మాలిక్‌.. మరొకరు గ్లామర్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా...
ఇంకేం మీడియా తన సైన్యాన్ని అక్కడే మోహరించింది.. వార్తల్లో మరో వార్త లేనంతగా ఆసక్తి పెరిగిపోయింది..

ఇక్కడే చిన్న ట్విస్ట్‌... అది వివాహానికి ముందు వివాదం రేగటం...
షోయబ్‌ మాలిక్‌కు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని ఆరోపణ రావటం.. ఆ అమ్మాయి హైదరాబాదీయే కావటం.. పోలీసు కేసులు.. పాస్‌పోర్ట్‌ సీజింగ్‌... దర్యాప్తు బృందాల విచారణలు...
అక్కడి నుంచి అసలు కథ మొదలైంది.. చాలా కాలంగా పెద్ద వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న ఓ సీక్రేట్‌ వ్యాపారం తెరమీదకు వచ్చింది.. అదే బెట్టింగ్‌...
హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి అన్ని నగరాల్లో బెట్టింగ్‌ ఊపందుకుంది.. షోయబ్‌, సానియా పెళ్లి వివాదాన్ని సొమ్ము చేసుకునేందుకు బుకీలు బిజినెస్‌ మొదలు పెట్టారు.. సానియా వివాహం వాళ్లు ప్రకటించినట్లుగా ఏప్రిల్‌ ౧౫న జరుగుతుందా? అన్న విషయంపైనే బెట్టింగ్‌ సాగుతోంది.. ప్రతి రూపాయికి, రూపాయి ఇరవై అయిదు పైసల బెట్టింగ్‌ కూడా నడుస్తోంది.. ఒకవేళ పెళ్లి జరగకపోతే రూపాయికి ౩ రూపాయల ౫౦ పైసలు ఇస్తారన్నమాట.. బుకీల సెంటిమెంట్‌ ప్రకారం ఏప్రిల్‌ ౧౫న ఖచ్చితంగా సానియా, షోయబ్‌ల పెళ్లి జరుగుతుంది.. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బెట్టింగ్‌ రేట్లు పెరిగినా పెరగవచ్చు. పాకిస్తాన్‌లో కూడా ఈ రకమైన బెట్టింగ్‌లు కొనసాగుతుండటం విశేషం.. ఇరుదేశాల బుకీల సరిహద్దుల మధ్య ఎప్పటికప్పుడు సంప్రతింపులు కూడా జరుగుతున్నాయని సమాచారం.. మొత్తం మీద షోయబ్‌ వివాదం బెట్టింగ్‌ ఇండస్ట్రీకి మంచి డిమాండ్‌ను తెచ్చిపెట్టింది..మరో విశేషం ఏమంటే బెట్టింగ్‌ సొమ్ము ఎటువైపు ఎక్కువగా ముడితే అంటే.. పెళ్లి అవుతుందని ఎక్కువ మంది బెట్‌ చేస్తే... పెళ్లి ఆపేందుకు బుకీలు ప్రయత్నిస్తారు.. కాదని ఎక్కువ మంది బెట్‌ చేస్తే పెళ్లి చేసేస్తారు.. ఎందుకంటే బెట్టింగ్‌ బిజినెస్‌లో కూడా దావూద్‌ టీమ్‌ జోక్యం చేసుకున్నట్లు సమాచారం ఉంది కాబట్టి..


రెడ్‌హంట్‌

దంతేవాడ రక్తసముద్రంగా మారింది. తమను ఏరివేసేందుకు భద్రతా బలగాలు ప్రారంభించిన గ్రీన్‌ హంట్‌ను మావోయిస్టులు రెడ్‌హంట్‌గా మార్చేశారు.. తమను వేటాడటానికి వందల సంఖ్యలో వచ్చిన జవాన్లను వెయ్యిమంది మావోలు వెంటాడి వేటాడారు.. మందు పాతరలతో మహా మారణహోమానికి పాల్పడ్డారు. దేశ చరిత్రలోనే మావోయిస్టులు తెగబడ్డ అతి పెద్ద హింసాత్మక ఘటన ఇది..

దేశంలో మావోయిస్టుల కీలక స్థావరం అబూజ్‌మడ్‌ను ఛేదించేందుకు కేంద్రం వ్యూహాత్మక ఆపరేషన్‌ చేపట్టిందన్నది మొన్నటి వార్త...

మావోయిస్టుల నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీని భద్రతా బలగాలు గాయపరిచాయన్నది నిన్నటి వార్త..

దంతేవాడలో మావోయిస్టుల చావు దెబ్బకు కనీవినీ ఎరుగని రీతిలో ౭౫మంది జవాన్లు మృత్యువాత పడ్డారన్నది తాజావార్త..

ఎలా జరిగింది..గ్రీన్‌ హంట్‌ ఆపరేషన్‌లో తప్పటడుగు ఎందుకు పడింది? కిషన్‌జీని గాయపరిచారన్న వార్తల్లో నిజం లేదా? అవుననే అనిపిస్తోంది. ఒక పక్కా వ్యూహంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే జవాన్లు ఒక చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ అటవీప్రాంతంలో గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్న సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు దాదాపు ౫౦౦ మంది అడవుల్లోకి వెళ్లేందుకు పకడ్బందీగా ప్లాన్‌ వేసుకున్నారు.. దారిపొడవునా మందుపాతరలను వెతుక్కుంటూ, రూట్‌ క్లియర్‌ చేసుకుంటూ ముందుకు సాగారు... రెండు రోజుల పాటు ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ సక్సెస్‌ఫుల్‌గానే సాగింది.. తిరుగు ప్రయాణంలోనే కాస్త ఏమరుపాటు మావోయిస్టులకు నాలుగు దశాబ్దాలలోనే అతి పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా ఆరు చోట్ల మందుపాతరలు పేల్చి ఒక్కుదుటున ౭౫మందికి పైగా జవాన్లను హతమార్చారు...గతంలో బలిమెల రిజర్వాయర్‌ ఘటనలో ౩౮మంది పోలీసుల హతం తరువాత అతిపెద్ద ఘటన ఇదే... తిరుగుబాటలో ఉన్న ౫౦౦ మంది జవాన్లను అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్న మావోయిస్టులు దిగ్బంధం చేశారు... వరుసగా మందుపాతరలను పేల్చటం ద్వారా జవాన్లను తేరుకోకుండా చేశారు. చనిపోయిన వారు చనిపోగా, గాయపడ్డవారిని వదిలేసి నూటయాభై మందికి పైగా జవాన్లను బందీలను చేసి పట్టుకుపోవటం భద్రతాబలగాలకు పెను సవాలుగా మారిపోయింది.

మావోయిస్టుల మారణకాండ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌పై నీలినీడలు కమ్మేలా చేసింది. మావోయిస్టులకు అత్యంత కీలక స్థావరమైన అబూజ్‌మడ్‌ ప్రాంతం దుర్భేద్యమని, ఛేదించటం కష్టసాధ్యమని విస్పష్టంగా తేలిపోయింది. ఒక్కసారిగా వెయ్యిమంది మావోయిస్టులు విరుచుకుపడటం సామాన్యమైన విషయమేం కాదు.. మైనింగ్‌ ప్రూఫ్‌ వాహనాలు సైతం వారి దాడులకు నిలువలేకపోయాయి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయం ఏముంది? కేవలం యుద్ధం ద్వారా, తీవ్రమైన అణచివేత విధానాల ద్వారా మావోయిస్టులను నిరోధించటం అసాధ్యమని కేంద్రమూ గ్రహించింది.. అందుకే ప్రత్యామ్నాయాల మీద దృష్టి సారించింది. చత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతంలో ఆదివాసీలకు ఉపాధి పథకాలను అమలు చేయటం, వినోదాన్ని పంచివ్వటం కోసం డిష్‌టివీలను, వీడియోసీడీలను పంచిపెట్టడం ఇప్పటికే మొదలు పెట్టింది.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తున్నప్పటికీ, అటు ప్రభుత్వానికి కానీ, ఇటు మావోయిస్టులకు కానీ వాటిమీద పెద్దగా విశ్వాసం ఉన్నట్లు కనిపించట్లేదు..

5, ఏప్రిల్ 2010, సోమవారం

పెళ్లా? పెటాకులా?


సానియా పెళ్లి జరుగుతుందా? ఇప్పుడిది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. సోహ్రబ్‌తో ఎంగేజ్‌మెంట్‌ పెటాకులైంది... పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌పై మోజు పడితే.. అదీ పేద్ద వివాదమై కూర్చుంది.. పెళ్లికి ముందే అయేషాతో మొదలైన సవతిపోరు.. అసలుకే ఎసరు తెచ్చేట్లుగా ఉంది.. చట్టాల ఉచ్చులో షోయబ్‌ పూర్తిగా కూరుకుపోయాడు.. ఇప్పుడు షోయబ్‌ను అరెస్టు చేస్తే సానియా పెళ్లి వాయిదా పడుతుందా? మరోసారి పెటాకులవుతుందా?


షోయబ్‌ మాలిక్‌ పెళ్లి వ్యవహారం టెన్నిస్‌ గేమ్‌లా మారిపోయింది. మాలిక్‌ బంతి సానియా, అయేషాల మధ్య కొట్టుకుంటోంది. సానియాతో పెళ్లి వార్త ప్రకటించిన వెంటనే అత్యుత్సాహంతో భారత్‌కు పరిగెత్తుకుంటూ వచ్చిన షోయబ్‌ ఇప్పుడు అయేషా పెట్టిన కేసుల చట్రంలో పూర్తిగా కూరుకుపోయాడు.. తాను తొలి భార్యనంటూ.. తనను షోయబ్‌ మోసం చేశాడంటూ అయేషా పోలీసు కేసు పెట్టడం షోయబ్‌ పాలిటి ఉచ్చులా మారింది... పోలీసులూ అత్యుత్సాహంతో షోయబ్‌పై గృహహింస చట్టం కింద కేసు పెట్టారు.. విచారణా మొదలు పెట్టారు..
సానియా ఇంట్లో షోయబ్‌ మాలిక్‌ను, అయేషా కుటుంబాన్ని ఉదయం నుంచీ పోలీసులు విచారిస్తూనే ఉన్నారు.. గృహహింస చట్టం కేసు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ కింద అరెస్టు చేయవచ్చు. ఇప్పటి వరకు షోయబ్‌ను అరెస్టు చేయకపోయినా, పోలీసులు మాత్రం ఆ దిశలోనే కదులుతున్నట్లు స్పష్టంగానే కనిపిస్తోంది. షోయబ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో పాస్‌పోర్ట్‌ కూడా ఉంది.. దీంతో పాటు అర్ధంతరంగా షోయబ్‌ దేశం విడిచిపోకుండా ఉండేందుకు అన్ని విమానాశ్రయాలను కూడా పోలీసులు అలర్ట్‌ చేయడాన్ని బట్టి చూస్తే... షోయబ్‌ వ్యవహారంలో వాళ్లు ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడేం జరుగుతుంది? షోయబ్‌ అరెస్టు ఖాయమేనా? పాకిస్తాన్‌ పౌరుడైనప్పటికీ అతణ్ణి ఇక్కడి చట్టాల ప్రకారం అరెస్టు చేసి విచారించే పూర్తి అధికారం పోలీసులకు ఉంది.. అయితే పాకిస్తాన్‌ సర్కారు ఇప్పటికే ఈ వ్యవహారంలో చొరవ చూపటం ప్రారంభించింది. షోయబ్‌ను తిరిగి పాకిస్తాన్‌కు పంపించాలని భారత్‌ను కోరింది కూడా.. ఎఫ్‌ఐఆర్‌ వివరాలను ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అయితే నమోదైన కేసుల దృష్ట్యా ఇప్పుడప్పుడే షోయబ్‌కు విముక్తి లభిస్తుందనుకోలేం..ఇంకోపక్క షోయబ్‌ లాయర్‌ రమేశ్‌ గుప్తా తన క్లయింట్‌ తప్పేమీ లేదని బల్లగుద్ది వాదిస్తున్నారు.. అయేషా పేరుతో తన క్లయింటుకు వచ్చిన ఫోటోలను కోర్టులో ప్రొడ్యూస్‌ చేస్తానని ఆయన అంటున్నారు..
ఇంకోపక్క సానియాపై ఇదే బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ కేసు నమోదు చేసింది. పాకిస్తాన్‌కు చెందిన షోయబ్‌ను సానియా వివాహం చేసుకోవటం దేశానికి ద్రోహం చేసినట్లేనని ఆ సంస్థ వాదన.. షోయబ్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. భారత్‌ తరపున టెన్నిస్‌ ఆడినందుకు గెలుచుకున్న పతకాలు, ప్రభుత్వాల నుంచి ఉచితంగా పొందిన ప్రోత్సాహకాలను భారత్‌కు తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేసింది.
పెళ్లికోసం సంబరంగా వచ్చిన షోయబ్‌ సంకెళ్లతో కటకటాల వెనక్కి వెళ్తాడా అన్నది ఇప్పటికైతే సందిగ్ధమే.. మొత్తం మీద టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వివాహం దేశంలోనే అతి పెద్ద వివాదాస్పదమైందిగా చరిత్ర సృష్టిస్తోంది..

4, ఏప్రిల్ 2010, ఆదివారం

మతోన్మాదం తోకముడిచింది

మతోన్మాదం తోకముడిచింది.. అమాయకులను మతం పేరుతో రెచ్చగొట్టి మారణ కాండను సృష్టించేందుకు ఉన్మాదులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. హైదరాబాద్‌ పాతబస్తీ ప్రజలు తామెంత సామరస్యంగా ఉన్నారో మరోసారి నిరూపించారు.. ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా... వదంతులు పుట్టించినా ప్రజలు సంయమనం కోల్పోకపోవటం విశేషం... శాంతియుత సహజీవనానికి తాము ఆదర్శమని ప్రజలు నిరూపించిన అపురూప క్షణం ఇది..

దాదాపు పదమూడేళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న పాతబస్తీలో కొందరు ముష్కరులు విసిరిన ఓ చిన్న నిప్పురవ్వ, కార్చిచ్చును రగిల్చింది.. జెండాల ఏర్పాటులో ఇరు వర్గాల మధ్య రేగిన చిన్న వివాదాన్ని మత కల్లోలంగా మార్చేందుకు తెర వెనుక నుంచి కొందరు బడాబాబులు తీవ్రంగా ప్రయత్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. వదంతులను ప్రచారం చేయటం.. ఉద్రేకపూరిత వార్తలతో అల్లర్లను బాగానే రెచ్చగొట్టారు..చాలా కాలంగా పని లేకుండా ఖాళీగా ఉన్న కిరాయి రౌడీలకు మంచి అవకాశమే లభించినట్లయింది..
అల్లర్లు తీవ్రంగానే అయ్యాయి. రౌడీమూకలు కనిపించిన వాళ్లను కనిపించినట్లుగా చితకబాదారు.. వాహనాలను ధ్వంసం చేశారు. తగులబెట్టారు.. చివరకు కర్ఫ్యూ విధించే పరిస్థితిని కొని తెచ్చారు..
స్పాట్‌..యాంబియన్స్‌...
ఇంత జరిగినా.. భయం భయంగా వాతావరణం ఉన్నా.. సాధారణ ప్రజలు ధైర్యంతో ఉన్నారు.. ఇంతటి ఉద్రిక్తతలోనూ మతాలకు అతీతంగా సామరస్యంగా వ్యవహరించారు.. పరస్పరం సహకరించుకున్నారు.. ఒకరికొకరు అండగా నిలిచారు.. మేము స్నేహంగా ఉన్నాం.. సహనంతో ఉన్నాం.. ఎవరెన్ని మాటలు చెప్పినా మేం వినేది లేదు.. కర్ఫ్యూ మాకు వద్దు.. ఎత్తేయండి అంటూ నినదించారు..

ఇంత సున్నితమైన సమస్యను సమర్థంగా పరిష్కరించటంలో పోలీసుల పాత్ర కీలకమైంది. జెండాల మూలంగా వివాదాన్ని ముందుగా నివారించలేకపోయినప్పటికీ, ఆ తరువాత ఘర్షణల్ని అత్యంత వేగంగా అదుపులోకి తీసుకురావటంలో సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఎకె ఖాన్‌ నేతృత్వంలోని బృందం పూర్తిగా సక్సెస్‌ అయింది...

ప్రజల తరపున, ప్రజల వెంట, ప్రజలతో మమేకమై ఏడాది కాలంగా ముందుకు సాగుతున్న జీ ౨౪ గంటలు చానల్‌ పాతబస్తీ అల్లర్లను మరింత రెచ్చగొట్టకుండా, ఎలాంటి దృశ్యాలను ప్రసారం చేయకుండా జాగ్రత్త వహించింది. తన వంతు బాధ్యతగా పాతబస్తీలో శాంతియాత్రను నిర్వహించి ప్రజల మధ్య సామరస్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసింది..

హైదరాబాద్‌లో, ముఖ్యంగా పాతబస్తీలో కేవలం హిందూ ముస్లింలు మాత్రమే కాదు... పార్శీలు ఉన్నారు.. అరబ్బులు ఉన్నారు.. ఇరానియన్లు ఉన్నారు... అనేక మతాల ప్రజలు ఉన్న బస్తీ అది.. నిజాం రాజసానికి నిలువెత్తు దర్పణమైన పాతబస్తీని రాజకీయాల కోసం, జిహాదీ హింసాకాండ కోసం పావుగా వాడుకోవటం ప్రజలు గ్రహించారు.. ముష్కరుల కూటనీతిని నిష్కర్షగా తిప్పికొట్టారు.. శాంతి కపోతాన్ని ఎగురవేశారు.. ప్రజల జీవితాలతో ఆటలాడుకోవాలనుకున్న ముష్కరులకు ప్రజలు శృంగభంగం కలిగించారు..