సానియా మీర్జా... ఇండియన్ టెన్నిస్ సూపర్ స్టార్... ఆమె పెళ్లి అంటే మాటలా? విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ పెళ్లి తరువాత.. దేశం మొత్తం మీద అంత కంటే ఎక్కువ హడావుడి జరిగిన పెళ్లి.. ఈ విషయంలో మీడియా పాత్రకైతే తిరుగే లేదు.. ప్రపంచ పాపరాజీల వ్యవస్థను మించి పోయింది ఇండియన్ మీడియా.. సానియా మీర్జా పెళ్లి వార్త బ్రేక్ అయినప్పటి నుంచీ మీడియాలో ఒకటే హడావుడి... అసలే గ్లామర్ టెన్నిస్ స్టార్... దానికి తోడు ఓ క్రికెటర్‌తో పెళ్లి.. అదీ దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన క్రికెటర్‌తో నిఖా.. మీడియాకు ఇంతకంటే పండుగేం కావాలి? అటు పాకిస్తాన్‌లో, ఇటు భారత్‌లో అన్ని చానళ్లలో, అన్ని వార్తా పత్రికల్లో గత పదిహేను రోజులుగా సానియా, షోయబ్‌ల ఫోటో లేకుండా, వార్త రాకుండా ఉన్న సందర్భం ఒక్కటంటే ఒక్కటి కనిపించదు..
నిఖా వెనుక రేగిన వివాదాన్ని విస్తృతం చేసింది మీడియానే... ముగింపు పలికేలా చేయగలిగిందీ మీడియానే... మీడియాలో సంచలనాల మూలంగానే బెట్టింగ్ వీరులూ భారీగానే బిజినెస్ చేసుకోగలిగారు.. ఐశ్వర్యరాయ్-అభిషేక్‌ల పెళ్లికి కూడా చేయనంత హడావుడి సానియా పెళ్లి విషయంలో మీడియా చేసిందనటంలో సందేహం లేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ వార్త టివి సీరియళ్లు, సినిమా వార్తలు, రియాల్టీ షోలను కూడా మించిపోయింది.
పెళ్లి గోలను మొదలు పెట్టినప్పటి నుంచీ అయేషాతో షోయబ్ పెళ్లి వివాదం, పోలీసు కేసులు, అతణ్ణి అరెస్టు చేస్తారని కొందరు.. చేయరని ఇంకొందరు.. ఇలా రకరకాల ఊహాగానాలతో సృష్టించిన గందరగోళానికి షోయబ్ నిజంగానే ఆందోళన చెందినట్టున్నాడు.. చివరకు పాస్ పోర్ట్ కూడా సీజ్ చేసేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో అయేషాకు తలాక్ ఇవ్వాల్సి వచ్చింది.. ఆ తరువాత కూడా మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు షోయబ్, సానియాల నిఖాకు ఇబ్బందికరంగా మారాయి.
అందుకే మీడియాకు సానియా, షోయబ్‌లను వారి కుటుంబాలు దూరంగా ఉంచుతూ వచ్చాయి. పెళ్లి తతంగం ముగిసే వరకూ కూడా సమాచారం బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు.. పెళ్లి తేదీ దగ్గర నుంచి పెళ్లి జరిగే వేదిక దాకా కూడా రకరకాల వార్తల్ని సృష్టించి మీడియాను గందరగోళంలో పడేశారు.. దీంతో సానియా పెళ్లి వ్యవహారం ఇంకా గందరగోళంగా మారింది.. మొత్తం మీద ఆమె వివాహం తాజ్ కృష్ణాలో జరిగేంత వరకూ అతి రహస్యంగానే ఉంచారు.. చివరకు అతిథులను సైతం గుర్తు తెలియకుండా నల్ల కార్లలో తీసుకువచ్చారు.. మీడియా హడావుడికి తోడు.. సానియా కుటుంబం చేసిన కన్ఫ్యూజన్ ఆమె పెళ్లిని విచిత్రంగా ముగించింది..
పాపరాజీల వ్యవస్థ ఇంగ్లండ్‌కు యువరాణిని లేకుండా చేసింది. ఈ పాపరాజీల వల్లనే ప్రిన్సెస్ డయానా అర్ధంతరంగా చనిపోయింది... ఇప్పుడీ ధోరణి భారత్‌కు కూడా విస్తరించింది. సానియా పెళ్లి విషయంలో ఇదే జరిగింది. తెలుగు చానళ్లు ఒకటి అరా కెమెరాలతో చేసిన హడావుడి ఒక ఎతెユ్తతే, హిందీ చానళ్లు ఒక్కొక్కటి ఆరేడుగురిని యూనిట్లతో సహా పంపించి సైన్యాన్ని మోహరించినట్లు తాజ్‌కృష్ణా దగ్గర, సానియా ఇంటి దగ్గర, అయేషా ఇంటి దగ్గర యూనిట్లను ఏర్పాటు చేశాయి. సానియా షాపింగ్ చేయాలంటే కూడా అర్ధరాత్రి దాటాక కానీ వీలు కాని పరిస్థితి. ఇంత హడావుడి అవసరమా? గతంలో ముంబయిపై దాడి సందర్భంలోనూ మీడియా చూపిన అత్యుత్సాహం టెర్రరిస్టులకు చాలా రకాలుగా ఉపయోగపడిందన్న వాస్తవం గుర్తుండే ఉంటుంది. పాకిస్తాన్‌లోని టెర్రరిస్టుల బాసులు టీవీలు చూస్తూ తమ అనుచరులకు ఆదేశాలిచ్చారు.. తరువాత మీడియా నాలుక్కరుచుకుంది.. సానియా నిఖా విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందనే చెప్పాలి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి