అంతర్యుద్ధం... వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పదం.. రాష్ట్రంలో రాజకీయాలను కలచివేసిన పదం.. పార్టీలు-ప్రత్యర్థుల మధ్య ఆరోపణలు. ప్రత్యారోపణలకు కారణమైన మాట.. శ్రీకృష్ణ కమిటీ ముందు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్య ఈ రాజకీయ యుద్ధానికి కారణమైంది.. చివరకు టిఆర్‌ఎస్ పార్టీ గుర్తింపునే రద్దు చేయమని ఇసికి ఫిర్యాదు చేసేంత వరకూ వ్యవహారం వెళ్లింది..
తెలంగాణాకు అనుకూలంగా నివేదిక ఇవ్వకపోతే, తెలంగాణా రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే, రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు కెసిఆర్ వ్యాఖ్యానించారు..
ఆ తరువాత జస్టిస్ శ్రీకృష్ణ హైదరాబాద్ వచ్చినప్పుడు సున్నితంగానే కెసిఆర్ వ్యాఖ్యల్ని ఖండించారు. అప్పటి నుంచీ కెసిఆర్‌పై ప్రత్యర్థుల కదనం ప్రారంభమైంది..అంతర్యుద్ధం అన్న మాట వాడటంపై తీవ్రంగానే వ్యతిరేకత వ్యక్తమైంది.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అన్‌పార్లమెంటరీ పదాల వాడకం ప్రజలను రెచ్చగొట్టడమేనని కాంగ్రెస్ సీరియస్‌గా స్పందించింది..
అంతటితో ఆగలేదు.. కెసిఆర్‌పై మొదట్నుంచీ ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న లగడపాటి రాజగోపాల్ మరింత దూకుడుగానే వ్యవహరించారు.. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి టిఆర్‌ఎస్ పార్టీ గుర్తింపునే రద్దు చేయాలని ఫిర్యాదు కూడా చేశారు...లగడపాటి వ్యవహారం ముందునుంచీ టిఆర్‌ఎస్‌కు మింగుడుపడటం లేదు. ఇప్పుడు ఈ ఎంపి ఇసి దగ్గరకు వెళ్లటంతో టిఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు..
అసలు పార్టీల గుర్తింపును రద్దు చేయాల్సి వస్తే ముందుగా కాంగ్రెస్ పార్టీ గుర్తింపునే రద్దు చేయాల్సి ఉంటుందనీ టిఆర్‌ఎస్ వాదిస్తోంది.
తొమ్మిదో వార్షికోత్సవాల్లో బిజెపికి టిఆర్‌ఎస్ మద్దతును ఇవ్వటంతో బిజెపి కూడా టిఆర్‌ఎస్‌తో చేతులు కలిపేసింది.. అంతర్యుద్ధం వివాదంలో కెసిఆర్ తప్పేమీ లేదని కూడా తేల్చేసింది..అంతర్యుద్ధం అన్నది ప్రజల మధ్య రావటం ఎలా ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో, పార్టీల మధ్య ఇప్పటికే వచ్చేసింది. పార్టీలు రెండుగా ప్రాంతాల మధ్య చీలిపోయాయి. కలిసి ఉన్నా, ఉండలేని పరిస్థితిలో ఒకే పార్టీలో నాయకులు కొనసాగుతున్నారు.. పౌర సమాజంలో ఇంకా ఆ పరిస్థితి రాలేదు.. పౌర సమాజాన్ని చీల్చేందుకు రాజకీయ పార్టీలే ప్రయత్నిస్తున్నాయి. తాము చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యానాలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది పార్టీలు, నాయకులు అర్థం చేసుకోవటం లేదు.. నిజంగా పౌర సమాజంలో పరస్పర విశ్వాసమే కొరవడితే ఆ పరిస్థితిని ఎదుర్కోవటం, అదుపు చేయటం ఈ రాజకీయ వ్యవస్థ వల్ల సాధ్యమయ్యేపని కాదు.. ఈ వాస్తవాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తెరిగి మసలుకుంటే మంచిది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి