6, ఏప్రిల్ 2010, మంగళవారం

రెడ్‌హంట్‌

దంతేవాడ రక్తసముద్రంగా మారింది. తమను ఏరివేసేందుకు భద్రతా బలగాలు ప్రారంభించిన గ్రీన్‌ హంట్‌ను మావోయిస్టులు రెడ్‌హంట్‌గా మార్చేశారు.. తమను వేటాడటానికి వందల సంఖ్యలో వచ్చిన జవాన్లను వెయ్యిమంది మావోలు వెంటాడి వేటాడారు.. మందు పాతరలతో మహా మారణహోమానికి పాల్పడ్డారు. దేశ చరిత్రలోనే మావోయిస్టులు తెగబడ్డ అతి పెద్ద హింసాత్మక ఘటన ఇది..

దేశంలో మావోయిస్టుల కీలక స్థావరం అబూజ్‌మడ్‌ను ఛేదించేందుకు కేంద్రం వ్యూహాత్మక ఆపరేషన్‌ చేపట్టిందన్నది మొన్నటి వార్త...

మావోయిస్టుల నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీని భద్రతా బలగాలు గాయపరిచాయన్నది నిన్నటి వార్త..

దంతేవాడలో మావోయిస్టుల చావు దెబ్బకు కనీవినీ ఎరుగని రీతిలో ౭౫మంది జవాన్లు మృత్యువాత పడ్డారన్నది తాజావార్త..

ఎలా జరిగింది..గ్రీన్‌ హంట్‌ ఆపరేషన్‌లో తప్పటడుగు ఎందుకు పడింది? కిషన్‌జీని గాయపరిచారన్న వార్తల్లో నిజం లేదా? అవుననే అనిపిస్తోంది. ఒక పక్కా వ్యూహంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే జవాన్లు ఒక చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. చత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ అటవీప్రాంతంలో గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్న సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు దాదాపు ౫౦౦ మంది అడవుల్లోకి వెళ్లేందుకు పకడ్బందీగా ప్లాన్‌ వేసుకున్నారు.. దారిపొడవునా మందుపాతరలను వెతుక్కుంటూ, రూట్‌ క్లియర్‌ చేసుకుంటూ ముందుకు సాగారు... రెండు రోజుల పాటు ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ సక్సెస్‌ఫుల్‌గానే సాగింది.. తిరుగు ప్రయాణంలోనే కాస్త ఏమరుపాటు మావోయిస్టులకు నాలుగు దశాబ్దాలలోనే అతి పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా ఆరు చోట్ల మందుపాతరలు పేల్చి ఒక్కుదుటున ౭౫మందికి పైగా జవాన్లను హతమార్చారు...గతంలో బలిమెల రిజర్వాయర్‌ ఘటనలో ౩౮మంది పోలీసుల హతం తరువాత అతిపెద్ద ఘటన ఇదే... తిరుగుబాటలో ఉన్న ౫౦౦ మంది జవాన్లను అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్న మావోయిస్టులు దిగ్బంధం చేశారు... వరుసగా మందుపాతరలను పేల్చటం ద్వారా జవాన్లను తేరుకోకుండా చేశారు. చనిపోయిన వారు చనిపోగా, గాయపడ్డవారిని వదిలేసి నూటయాభై మందికి పైగా జవాన్లను బందీలను చేసి పట్టుకుపోవటం భద్రతాబలగాలకు పెను సవాలుగా మారిపోయింది.

మావోయిస్టుల మారణకాండ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌పై నీలినీడలు కమ్మేలా చేసింది. మావోయిస్టులకు అత్యంత కీలక స్థావరమైన అబూజ్‌మడ్‌ ప్రాంతం దుర్భేద్యమని, ఛేదించటం కష్టసాధ్యమని విస్పష్టంగా తేలిపోయింది. ఒక్కసారిగా వెయ్యిమంది మావోయిస్టులు విరుచుకుపడటం సామాన్యమైన విషయమేం కాదు.. మైనింగ్‌ ప్రూఫ్‌ వాహనాలు సైతం వారి దాడులకు నిలువలేకపోయాయి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయం ఏముంది? కేవలం యుద్ధం ద్వారా, తీవ్రమైన అణచివేత విధానాల ద్వారా మావోయిస్టులను నిరోధించటం అసాధ్యమని కేంద్రమూ గ్రహించింది.. అందుకే ప్రత్యామ్నాయాల మీద దృష్టి సారించింది. చత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతంలో ఆదివాసీలకు ఉపాధి పథకాలను అమలు చేయటం, వినోదాన్ని పంచివ్వటం కోసం డిష్‌టివీలను, వీడియోసీడీలను పంచిపెట్టడం ఇప్పటికే మొదలు పెట్టింది.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తున్నప్పటికీ, అటు ప్రభుత్వానికి కానీ, ఇటు మావోయిస్టులకు కానీ వాటిమీద పెద్దగా విశ్వాసం ఉన్నట్లు కనిపించట్లేదు..

1 కామెంట్‌:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

చిత్తశుద్ధి లోపించిన పాలకవర్గాలకు గునపాతమిది. నేను రాసినదీ చదవగలరు: www.sahacharudu.blogspot.com