20, ఏప్రిల్ 2010, మంగళవారం

తెలుగు సినిమా బాగుపడే అవకాశాలు ఉన్నాయా?

దివాళా బాటలో నడుస్తున్న తెలుగు సినిమా బాగుపడే అవకాశాలు ఉన్నాయా? కొందరి చేతుల్లో నలుగుతున్న సినిమా పరిశ్రమను చక్కదిద్దడం నిర్మాతల మండలి వల్ల సాధ్యమేనా? నలభై కోట్లకు పడగలెత్తిన తెలుగు సినిమా బడ్జెట్‌ తగ్గించాలనుకోవటం నిర్మాతల వల్ల అవుతుందా అన్నది అనుమానమే.. కోట్లాది రూపాయలు రె మ్యూనరేషన్‌ తీసుకునే హీరోల రెమ్యూనరేషన్‌లో కోత విధించాలని నిర్మాతల మండలి చెప్తోంది.. అది సాధ్యమేనని
అంటున్నారు కొందరు నిర్మాతలు. సినిమా ఖర్చుకు కత్తెర విధించడం కోసం ఓ కమిటీని కూడా నియమించనున్నారు.

ఒక తెలుగు సినిమా బడ్జెట్‌ ౪౦ కోట్లు...ఒక హీరో రెమ్యూనరేషన్‌ ౫ కోట్లు....ఇదంతా బాగానే ఉంది. కాని సినిమా విడుదల తర్వాత నిర్మాతకు ఎంత మిగులుతుందో గ్యారంటీ లేదు. పెరిగిపోతున్న బడ్జెట్‌తో సినిమాలు నిర్మించేందుకు నానా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినిమా నిర్మాతలు కష్టాల నుంచి గట్టేక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నిర్మాతలంతా ఒక్కటయ్యారు. భారీ బడ్జెట్‌ సినిమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏయే రంగాల్లో నిర్మాణ వ్యయం తగ్గించగలమో చర్చించేందుకు ఫిలించాంబర్‌లో కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్లతో పాటు కమెడియన్ల రెమ్యూనరేషన్‌ విషయంలో కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
౧). హీరో రెమ్యునరేషన్‌ను సగానికి సగం తగ్గించి, సినిమా రిలీజ్‌ సమయంలో వ్యాపారంలో వాటా రూపంలో మరి కొంత ఇవ్వవచ్చు...
౨). హీరోయిన్‌ రెమ్యునరేషన్‌ను ౫లక్షలకు మించి ఇవ్వరాదు..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హీరోయిన్లకు గెస్ట్‌హౌస్‌లే విడిది కావాలి.. స్టార్‌ హోటళ్లలో విడిది ఇవ్వరాదు.
౨). కార్‌వ్యాన్‌ స్టూడియోల్లో అనుమతించరాదు.
౩). ఆర్టిస్టులకు పర్సనల్‌ అసిస్టెంట్స్‌ తగ్గించుకోవాలి.
౪). పర్సనల్‌ కోసం కంపెనీ వ్యక్తులనే వినియోగించుకోవాలి.
౫). షూటింగ్‌ పని దినాలు తగ్గించుకోవాలి
౬). పని దినాల కోసం హీరో, నిర్మాత, దర్శకుడి మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలి.
౭). పెద్ద సినిమాలకు లక్ష నుంచి లక్షా ఇరవై వేల అడుగుల వరకు మాత్రమే నెగెటివ్‌ ఎక్స్‌పోజ్‌ చేయాలి.
౮). చిన్న సినిమాలకు ౫౦ నుంచి ౬౦ వేల అడుగుల వరకు మాత్రమే నెగెటివ్‌ ఎక్స్‌పోజ్‌ చేయాలి.
౯). షూటింగ్‌ సమయంలో పర్సనల్‌ సెల్‌ఫోన్స్‌ వాడితే నిర్మాతకు ఫైన్‌ కట్టాలి. (గజని సినిమా నిర్మాతకు అమీర్‌ఖాన్‌ ౫౦౦ రూపాయలు ఫైన్‌ కట్టారు)
౧౦). ఆరిస్టులు సరైన సమయానికి షూటింగ్‌కు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవాలి.
౧౧). బాలీవుడ్‌ సినిమా సెユ్టల్‌లో బఫే (ఫుడ్‌) సిస్టమ్‌ అమలు చేయాలి.
తెలుగు సినిమా పూర్తిగా దివాళ తీసింది. హీరో, డైరెక్టర్‌ డామినేట్‌ చేసే ఈ రోజుల్లో నిర్మాత స్థానం ఎక్కడుందో భూతద్దం పెట్టి వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికి కారణం? సినిమా బడ్జెట్‌ పెరగడం. ఒకప్పుడు లోబడ్జెట్‌లో కళాఖండాలు తీసిన తెలుగు సినిమా ఇప్పుడు బడ్జెట్‌ పద్మవ్యూహంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రిస్టేజ్‌ కోసం బడ్జెట్‌ పెంచుకోవడం...రికవరీ లేక తల బాదుకోవడం నేటి నిర్మాత దుస్థితి. హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్స్‌తో పాటు కమెడియన్లు, ఇతర భాషల నుంచి దిగుమతి చేసుకునే క్యారెక్టర్‌ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లే దీనికి కారణం అని చెప్పవచ్చు. సినిమా నిర్మాణం నిర్మాత చేతుల్లోంచి జారీ పోయిన నేపథ్యంలో
ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్‌, ఇతర వ్యవహారాలకు సంబంధించిన బడ్జెట్‌ తగ్గించుకుంటేనే తెలుగు సినిమా నిర్మాత బ్రతికి బట్టకట్టగలడనేది నిజం.
2
వాడివేడి సమావేశం
తెలుగు సినిమా నిర్మాణ వ్యయం తగ్గించేందుకు నిర్మాతల మండలి ఏర్పాటు చేసుకున్న సమావేశం వాడివేడిగా సాగింది. నిర్మాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు థియేటర్ల అద్దె విధానంపై కూడా చర్చ జరిగింది. దీంతో థియేటర్లు తన గుప్పిట్లో పెట్టుకున్న నిర్మాత ఒకరు బయటికి వెళ్లిపోగా, అసలు నిర్మాతల మండలిపైనే తనకు నమ్మకం లేదని మరో సీనియర్‌ నిర్మాత సమావేశం నుంచి నిష్కృమించారు.

నష్టాల ఊబిలో కూరుకుపోయిన తెలుగు సినిమా నిర్మాతలను గట్టెక్కించేందుకు నిర్మాతల మండలి నడుంబిగించింది. బడ్జెట్‌ తగ్గించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే నిర్ణయించేందుకు చిన్న, పెద్ద నిర్మాతలందరూ ఫిలించాంబర్‌లో దాదాపు రెండున్నర గంటల వరకు చర్చించారు. కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న అల్లు అరివింద్‌, దిల్‌రాజు, సురేష్‌బాబు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కె.ఎల్‌.నారాయణ,పోకూరి బాబురావు, సుప్రియా, అచ్చిరెడ్డితో పాటు నట్టికుమార్‌, సురేంద్రనాథ్‌రెడ్డి, సాయివెంకట్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ వంటి చిన్న నిర్మాతలు కూడా ఈ సమావేశానికి హాజరైయ్యారు. అంతేకాదు..చిన్న నిర్మాతలు దాదాపు ముఫై డిమాండ్లతో నిర్మాతల మండలికి ఓ వినతి పత్రం కూడా అందజేశారు. పలు అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలోనే అసలు నిర్మాతల మండలిపై నమ్మకం లేదని, ఇవన్ని అమలు జరిగే పనులు కావని ఆదిశేషగిరిరావు బయటికి వెళ్లిపోయారు. థియేటర్ల అద్దె విధానంపై చిన్న నిర్మాతలు చర్చించడంతో అల్లు అరవింద్‌ సమావేశం నుంచి నిష్కృమించారు.
కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ తగ్గించేందుకు ఓ కమిటీని నియమించారు.ఈ విషయంలో కూడా నిర్మాతల మధ్య కాస్త అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఈ కమిటీకి దాసరి నారాయణరావు చైర్మన్‌గా ఉండాలని కొందరు నిర్మాతలు పట్టుబడితే..మరి కొంతమంది దాసరి కాకుండా వేరే వారేవరైనా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా గత మూడు రోజుల క్రితమే జరిగింది. నిర్మాతల మద్య ఉన్న విభేదాలు తొలగించుకునే అంశంపై కూడా నిర్మాతల మండలి చర్చించింది. ఇదంతా కాస్సెపు పక్కన పెడితే నిర్మాతల మండలిలో చర్చించుకునేవన్ని ప్రాక్టికల్‌గా అయ్యే పనులు కావని సమావేశంలో పాల్గొన్న నిర్మాతలే చర్చించుకోవడం కొసమెరుపు.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సమీప భవిష్యత్తు లో అటువంటిది జరగదని సగటు ప్రేక్షకుడి ఆలొచన.

Saahitya Abhimaani చెప్పారు...

ఇవన్ని కాదు కానీ, ప్రేక్షకులు మంచి సినిమాని ఆదరిస్తే మంచి సినిమాలు వస్తాయి.

అజ్ఞాత చెప్పారు...

> హీరోయిన్లకు గెస్ట్‌హౌస్‌లే విడిది కావాలి.
alaga