జస్టిస్ శ్రీకృష్ణ.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తన నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచీ చురుగ్గా దూసుకుపోతున్నారు.. మునుపెన్నడూ లేని విధంగా ఒక కమిటీ ఈ విధంగా పనిచేయటం ఇదే తొలిసారేమో.. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా.. ఎవరు ఎన్ని నివేదికలు ఇచ్చినా వినమ్రంగా స్వీకరిస్తూనే తనదైన శైలిలో పనితనాన్ని ప్రదర్శిస్తున్నారు శ్రీకృష్ణ. ముంబయి పేలుళ్ల కేసులో కఠినమైన సిఫారసులతో నివేదికనిచ్చి రికార్డు సృష్టించిన శ్రీకృష్ణ... ఈసారి తన రికార్డునే బద్దలు కొడతారేమో.
మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా విషయంలో ఓ కమిటీ వేసిందంటే.. దానర్థం.. ఆ విషయాన్ని అటకెక్కించినట్లే... ఒక సమస్య పరిష్కారం కోసం కమిటీ వేయటమంటే.. ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానట్లే లెక్క.. ఒక సమస్యను దీర్ఘకాలం నాన్చాలంటే ఓ కమిటీ వేస్తే చాలని సటైర్లు వేసే పరిస్థితి ఉందంటే కమిటీలకు ప్రజల్లో ఎంత విశ్వసనీయత ఉందో అర్థం చేసుకోవచ్చు.
కానీ, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ సంప్రదాయానికి భిన్నంగా పనిచేయటం ఆశ్చర్యం.. విచిత్రం.. కమిటీ ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే పని ప్రారంభించిన శ్రీకృష్ణ కమిటీ ఇప్పటికే దాదాపు ౭౦ వేల నివేదికలను వివిధ వర్గాల నుంచి, పార్టీల నుంచి సేకరించింది. వాటి విశ్లేషణ కూడా ప్రారంభించింది.. అదే సమయంలో క్షేత్రస్థాయి పర్యటనలనూ ప్రారంభించింది.. రెండు రోజుల పాటు మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో సామాన్య ప్రజలతో కమిటీ కలవటం విశేషమే..
మామూలుగా కమిటీలు ఓ హాలులో కూర్చుని అక్కడికే ప్రజలను రమ్మని వచ్చిన వారితో నివేదికలు తీసుకుని వెళ్తాయి.. కానీ, ఈ ఇద్దరు సభ్యులు మాత్రం గ్రామాల్లో కూడా తిరిగారు.. ప్రజలను కలిసారు.. కర్నూలులో కూలీలను కలిసి రాష్ట్రం విడిపోతే మీరు ఎవరితో ఉంటారని ప్రశ్నించారు.. మరో చోట ఓ విద్యార్థి తెలంగాణా వస్తే హైదరాబాద్‌కు ఎలా వెళ్లేదని అడిగితే, ఢిల్లీ, ముంబయి లకు వెళ్లినట్లే వెళ్లవచ్చంటూ షరీఫ్ దీటుగానే జవాబిచ్చారు..
ఇక హైదరాబాద్‌లోనూ శ్రీకృష్ణ కమిటీ సామరస్యంగానే వ్యవహారాన్ని నడుపుతూ వచ్చింది. అన్ని పార్టీలను సంప్రతింపులకోసం పిలిచినా, పిఆర్‌పి, వామపక్షాలు మినహా మిగతా పార్టీలు కుంటిసాకులతో తప్పించుకున్నాయి.. అయినా పరవాలేదంటూ మరోసారి మాట్లాడతానంది..
కెసిఆర్‌ను గొప్ప వక్తంటూ తెగమెచ్చేసుకున్న శ్రీకృష్ణ, అంతర్యుద్ధం అన్న మాట కెసిఆర్ అన్నందుకు సున్నితంగానే ఖండించారు.. మిమ్మల్ని మేం మొదట్లో తిరస్కరించామని కెసిఆర్ నేరుగానే చెప్పినా ఆయన ఏమీ అనలేదు. ఎవరినీ నొప్పించకుండా, తాను నొచ్చుకోకుండా పని సాగించుకుంటూ పోతున్నారు..
ఇంతవరకు బాగానే ఉంది.. శ్రీకృష్ణ పోకడ ఎలా ఉంది? కెసిఆర్‌ను మెచ్చుకోవటం, కర్నూలు, పాలమూరులలో ఒకటి రెండు చోట్ల రాష్ట్ర విభజన జరిగితే మీరెటువైపు ఉంటారని అడగటం వంటివి క్యాజువల్‌గా వేసిన ప్రశ్నలు.. మెచ్చుకోళ్లు.. ఇంతమాత్రానికే తెలంగాణా వాదులకు అనుకూలమనుకుంటే పొరపాటే.... దీన్ని దృష్టిలో ఉంచుకునే మొదట్లో రుసరుసలాడిన టిఆర్‌ఎస్.. క్రమంగా కూల్ అయింది..కానీ ఈ మాత్రం దానికే శ్రీకృష్ణ తెలంగాణాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎలా అనుకోగలం? ముంబయి పేలుళ్ల నివేదికలో ఆయన నిక్కచ్చితనం రేపు రాష్ట్ర విభజన వ్యవహారంపై తానిచ్చే నివేదికలో ఏ విధంగా ప్రతిఫలిస్తుందనేది అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు.. ఆలోగా ఇలాంటి ఊహాగానాలుఎన్నో వస్తూనే ఉంటాయి.. వింటూనే ఉంటాం.. ముందుంది అసలు పండుగ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి