అవినీతి ఈ దేశంలో అత్యంత సహజం.. కాకపోతే.. ఉన్నత స్థానంలో ఉన్నవారు కనీసం తమ ఇమేజి కోసమైనా కొంత నిజాయితీతో వ్యవహరిస్తారని అంతా ఆశిస్తారు.. కానీ, మన అధికారులు వీటన్నింటినీ అధిగమించారు. నిరుడు ఏఐసిటిఇ సభ్యులు నారాయణరావు, నిన్నటికి నిన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కేతన్ దేశాయ్.. రంగు మారిన చదువుల చెట్టుకు ప్రతీకలు.. అవినీతికి స్ట్రెయిట్ అడ్రస్‌లు...
ఉన్నత విద్యాసంస్థల నుంచి నిపుణులైన పట్టభద్రులు రావట్లేదని నాస్‌కామ్ వంటి సంస్థలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేసినప్పుడు కారణం ఏమిటా అని అంతా అనుకున్నారు.. ప్రామాణిక విద్యను అందించటంలో ఎక్కడో లోపం జరిగిందని భావించారు.. కానీ, కారణమంతా ఉన్నత విద్యాసంస్థల బాస్‌ల దగ్గరే ఉందని ఊహించిన వారు లేరు..
ఏఐసిటిఇ సభ్యుడు నారాయణరావు నిరుడు అవినీతి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు యావద్దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంజనీరింగ్ కళాశాలలకు, పాలిటెక్నిక్ కళాశాలలకు అనుమతులిచ్చే అత్యున్నత విద్యామండలి అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది.. సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రామాణికతపై అనుమానపు పొరలు కమ్ముకున్నాయి.
ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతినివ్వాలంటే భవనం భూమి పూజ దగ్గరి నుంచే రూపాయలు వెదజల్లడం మొదలవుతుంది.. కాలేజీలో సీట్ల సంఖ్య, కోర్సులు, ఫ్యాకల్టీలు.. అన్నీ అబద్ధాలే..అంతా అవినీతే..
ఏఐసిటిఇ నిబంధనల ప్రకారం ౧౫ మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్ ఉండాలి. ఎవరైనా తనిఖీకి వస్తే..క్షణాల్లో అద్దె ప్రొఫెసర్లు.. అద్దె సౌకర్యాలు ఏర్పడతాయి.. భారీ మొత్తంలో ముడుపులు సైలెన్స్‌గా ముడుపులు చేతులు మారతాయి.. అంతా సజావుగా సాగిపోతుంది.. అంతే.. అనుమతులను ఆన్‌లైన్ ద్వారా చేస్తున్నాం.. అయితేనేం.. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ముడుపులు స్వీకరించేందుకు ఆఫ్‌లైన్ అయితే ఏం... ఆన్‌లైన్ అయితేనేం...
విద్య వ్యాపారమైంది.. వృత్తి విద్యలో వృత్తి మాత్రమే మిగిలింది.. విద్యార్థులు సమిధలుగా మారారు.. మేనేజిమెంట్ సీట్లు, కార్పస్‌ఫండ్‌లకు ప్రభుత్వమే అనుమతి ఇవ్వటమూ ఇవాళ్టి పరిస్థితికి ఓ కారణం..
ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో ౨౫౦౦ వేల ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి.. నిబంధనల ప్రకారం ఉన్నవి ఎన్నో లెక్కిస్తే పది శాతమైనా మిగలవేమో....
---------2--------------
ఇంజనీరింగ్ విద్య ఇంత వైభవంగా వెలగబెడుతుంటే.. ఇక వైద్య విద్య సంగతి ఏం చెప్పాలి.. రెండు కోట్ల రూపాయల లంచాన్ని సాక్షాత్తూ వైద్యవిద్యా మండలి అధ్యక్షుడే తీసుకుంటూ పట్టుబడ్డ దారుణం ఈ దేశంలో తప్ప, మరే దేశంలోనూ జరగదేమో.. వీళ్ల అవినీతి.. జలగల కంటే దారుణమైంది..
అమ్మకానికి అనుమతులు....
ఇది నిజం.. ఇదేదో మామూలు కళాశాలలకో, పాఠశాలకో ఇచ్చే అనుమతి కాదు...
దేశాన్ని తమ ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఉద్ధరించే విద్యార్థులను తయారు చేసే కాలేజీలకు ఇచ్చే అనుమతులు..
సున్నితమైన వైద్యంతో ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులను తయారు చేసే మెడికల్ కాలేజీలకు ఇచ్చే అనుమతులు..
ఇంజనీరింగ్ కాలేజీకి రెండు కోట్లు..
మెడికల్ కాలేజీకయితే అయిదు కోట్లు..
ఏమిటివి.. డబ్బులేనా...
అక్షరాలా డబ్బులే.. ఆశ్చర్యపోకండి.. విస్తుపోయే నిజమిది.. నిబంధనల ప్రకారం వెళ్తే.. మన రాష్ట్రంలోనే ఒక్క కాలేజీకి అర్హత ఉండదు.. అన్ని లైసెన్సులూ రద్దు చేయాల్సిందే..
ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పాలంటే కనీసం పదెకరాల స్థలం ఉండాలి..
వైద్యకళాశాల ఏర్పాటు చేయాలంటే 15 ఎకరాల స్థలం ఉండాలి...
ఈ భూమి చూపిన తరువాత బిల్డింగ్‌కు అనుమతి ఇవ్వాలి.. ఎందుకంటే కోర్సుల వారిగా బిల్డింగ్‌ల నిర్మాణం జరగాలి..
వాస్తవంగా ఇంత విస్తారమైన స్థలంలో కోర్సుల వారిగా బిల్డింగ్‌లు ఉన్న కాలేజీలు ఎన్నున్నాయో మనం చూడగలమా?
వీటి దగ్గరే అవినీతి పురివిప్పుకుంటుంది.. బిల్డింగుల వ్యవహారం పూర్తయిందంటే ఉన్నత సంస్థలు సీన్‌లోకి వచ్చేస్తాయి. తనిఖీలకు ఏఐసిటిఇ, ఎంసిఐలు బృందాలను పంపిస్తాయి.. ఇక్కడా డబ్బులు లేందే వ్యవహారం ఎంతమాత్రం పొసగదు.. యాజమాన్యం తనకు కావలసిన బృందం తనిఖీకి వచ్చేలా చేసుకోగల వెసలుబాటు కూడా ఉంది, ముడుపులు ముడితే..
మెంబర్ సెక్రటరీకి ౫ లక్షలు ముడ్తే కోరుకున్న రీజనల్ అధికారిని పంపిస్తారు.. అక్కడి నుంచి సీన్ రీజనల్ అధికారి దగ్గరకు మారుతుంది.. ఆయన గారు తనిఖీ బృందంలోని అధికారులను ఎంపిక చేస్తారు.. ప్రొఫెసర్లు, ఆర్కిటెక్చర్, లాయర్ ఇలా సభ్యులు బృందంలోకి ఎన్నికవుతారు.. వీరిలో ఒక్కొక్కరికీ ౫౦ వేలకు తక్కువ కాకుండానే సొమ్ములు ముడతాయి.
చివరకు రీజనల్ అధికారి వంతు. కళాశాల ఏర్పాటు పూర్తయ్యే స్థాయిని బట్టి పాతిక నుంచి యాభై లక్షల వరకు రూపాయలే యాజమాన్యం ముట్టజెప్తుంది.. మెడికల్ కాలేజీ తనిఖీకే రెండు కోట్ల రూపాయల ఖర్చవుతుంది.. అందరినీ తృప్తి పరిచిన తరువాత ఫైలు ఢిల్లీ చేరుతుంది..
ఇక ఢిల్లీలో పైరవీ మొదలవుతుంది.. ఇక్కడ క్లర్క్ స్థాయి నుంచే దందా మొదలవుతుంది.. స్థాయిని బట్టి సొమ్ములు ఇవ్వాల్సి ఉంటుంది.. ఇక్కడో పాతిక లక్షల దాకా మేనేజిమెంట్‌కు ఖర్చు తప్పదు..
ఇంత జరిగాక కూడా కొర్రీ పడిందంటే.. చివరి మార్గం పొలిటికల్.. ఎంపిలను సంతృప్తి పరచే కార్యక్రమం.. అనుమతుల కోసం వెళ్లే మేనేజిమెంట్లు ఎంపిల ద్వారా తమ పనులను చక్కబెట్టుకుంటాయి.. యాజమాన్యాల అభిప్రాయం మేరకు ఎంపిల్లో కూడా చీప్, అండ్ కాస్టీロ్ల ఉన్నారట.. మన రాష్ట్ర ఎంపిలయితే చాలా కాస్టీロ్ల అంట... యుపి, బీహార్ ఎంపీలయితే చీపంట... వారికి యాభై వేల రూపాయలు చెల్లిస్తే పనయిపోతుందిట..
మన దేశంలో చదువుకునే రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి.. చదువు కొనుక్కుంటున్నాం.. కానీ, విద్యార్థుల కెరీర్‌ను నిలబెట్టే వృత్తివిద్యకూ చెదలు పడితే.. ఏం చేయాలి?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి