22, ఏప్రిల్ 2010, గురువారం

1956 AN UNITED STORY

రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైన నాటి నుంచీ చురుగ్గానే పని చేస్తోంది. అన్ని పార్టీలు.. వర్గాల నుంచి వేల కొద్దీ నివేదికలను సమీకరించింది.. ఎండాకాలమని కూడా చూడకుండా కమిటీ సభ్యులు జిల్లాల్లో తెగ తిరిగేస్తున్నారు.. పార్టీలతో చర్చలు మొదలు పెట్టింది.. ఇవన్నీ పూర్తయ్యాక కమిటీ ఏం తేలుస్తుందో కానీ, టిఆర్‌ఎస్‌ మాత్రం పరిష్కారాన్ని సూచించింది.. అదేమిటి?

శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన విషయంలో ఏం తేలుస్తుంది?
౬౫ వేలకు పైగా వచ్చిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందా?
ఎలాంటి పరిష్కారం సూచించబోతోంది...?
౧౯౫౬ నవంబర్‌ ౧కి ముందు నాటి పరిస్థితి పునరుద్ధరణ సాధ్యమేనా?
టిఆర్‌ఎస్‌ కోరుకుంటున్నది ఏమిటి?
తెలంగాణా రాష్ట్రమా?
లగడపాటి చెప్తున్నట్లు పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రమా?


తెలంగాణా రాష్ర ఏర్పాటును కోరుతూ ఏకైక అజెండాతో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో చివరి పేరా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణాకు జరిగిన అన్యాయానికి ఏకైక పరిష్కారం ౧౯౫౬ నవంబర్‌ ౧కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించటమేనని టిఆర్‌ఎస్‌ చేసిన డిమాండ్‌ వెనుక మర్మమేమిటి?
తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అజెండాగా పురుడు పోసుకున్న పార్టీ టిఆర్‌ఎస్‌.. అరవై రోజుల పాటు నిర్విరామంగా ఉద్యమించి కేంద్రాన్ని తెలంగాణా ఏర్పాటు దిశగా అడుగులు కదిలేలా చేసిన పార్టీ టిఆర్‌ఎస్‌... ఆంధ్రప్రాంతంలో ఉద్యమాలు ఉధృతంగా సాగినప్పుడు కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. మొదట్లో కమిటీ ఏర్పాటును టిఆర్‌ఎస్‌ తీవ్రంగానే వ్యతిరేకించింది.

కమిటీని అసలు గుర్తించేదే లేదు పొమ్మంది.. రాజీనామాలు చేసింది.. ఆందోళనలూ చేసింది.. చివరకు తానే రాజీ పడింది... తెలంగాణా కావాలన్న తన డిమాండ్‌ ఎంత బలమైందో వివరిస్తూ నివేదిక రూపొందించటానికి పెద్ద కసరత్తే చేసింది.. దాదాపు ౧౪౦౦ పేజీల అతి పెద్ద నివేదికను అందించింది..
ఇంత విస్తారమైన నివేదికను అందిస్తూనే చివరకు సమస్యకు పరిష్కారాన్నీ సూచించింది. ౧౯౫౬ నవంబర్‌ ౧ ముందు నాటి పరిస్థితులను పునరుద్ధరించాలన్నది టిఆర్‌ఎస్‌ డిమాండ్‌..

కెసిఆర్‌ ప్రత్యర్థులకు ఇక్కడే ఆయుధం దొరికినట్లయింది. ౧౯౫౬ నవంబర్‌ ౧కి ముందు హైదరాబాద్‌ స్టేట్‌ అన్నది అస్తిత్వంలో ఉంది కాబట్టి అప్పటి పరిస్థితులను పునరుద్ధరించటం అంటే మహారాష్ట్ర, కర్ణాటకలో కలిసిపోయిన నాటి జిల్లాలను కూడా విడదీయాలని కెసిఆర్‌ కోరుకుంటున్నారని ఎంపి లగడపాటి విశ్లేషించారు..

కెసిఆర్‌ కూడా సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్న కంక్లూషన్‌కు లగడపాటి వచ్చేశారు.. ఇంతకీ టిఆర్‌ఎస్‌ డిమాండ్‌ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?


తెలంగాణ రాష్ట్ర సమితి నేరుగా తెలంగాణ ఏర్పాటును ఎందుకు డిమాండ్‌ చేయలేదు? ౧౯౫౬ నవంబర్‌ ౧ ముందునాటి పరిస్థితుల పునరుద్ధరణనే ఎందుకు కోరుకుంది? వాస్తవంగా అప్పుడున్న భౌగోళిక పరిస్థితులు ఏమిటి?
-----------
౧౯౫౩లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతాన్ని విలీనం చేస్తూ ౧౯౫౬ నవంబర్‌ ౧న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.... ఈ విలీనానికి ముందు కేంద్రం పెద్ద కసరత్తే చేసింది. మొత్తం మీద దేశంలో పలు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తూ ౧౯౫౬ ఆగస్టు ౩౧న ప్రత్యేకంగా స్టేట్స్‌ రీ ఆర్గనైజేషన్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్‌ స్టేట్‌లోని తెలంగాణా జిల్లాల విలీనం.. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు కూడా ఇందులో ఉంది.. ఈ చట్టం ప్రకారం..హైదరాబాద్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలు విలీనం అయ్యాయి.
అవి ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ , ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌ నగర్‌
రాయ్‌చూర్‌ జిల్లాలోని అలంపూర్‌, గద్వాల తాలూకాలు
గుల్బర్గా జిల్లాలోని కొడంగల్‌, తాండూర్‌ తాలూకాలు
నిర్నా సర్కిల్‌ మినహాయించి జహీరాబాద్‌ తాలూకా
బీదర్‌ తాలూకాలోని న్యాల్‌కల్‌ సర్కిల్‌
బీదర్‌ జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌ తాలూకా
నాందేడ్‌ జిల్లాలోని బిచుకొండ, జుక్కల్‌ సర్కిల్‌లు
నాందేడ్‌ జిల్లాలోని ముధోల్‌, భైంసా తాలూకాలు
కిన్వత్‌, రాజూరా, బోథ్‌, ఇస్లాపూర్‌ తాలూకాలు మినహా మిగతా
హైదరాబాద్‌ స్టేట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయినవి కాకుండా మిగిలిన ప్రాంతాలను బొంబాయి, మైసూరు రాష్ట్రాల్లో విలీనం చేశారు.. అప్పటికి ఈ రాష్ట్రాలకు మహారాష్ట్ర, కర్ణాటక అన్న పేర్లు పెట్టలేదు.

ఇంతవరకు బాగానే ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఆగస్టు ౩౧ ౧౯౫౬న. ఆంధ్రప్రదేశ్‌ అస్తిత్వం నెలకొన్నది నవంబర్‌ ౧న.. ఈ రెండు నెలల కాలంలో హైదరాబాద్‌ స్టేట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పరిపాలన సాగింది.. అంటే హైదరాబాద్‌ స్టేట్‌ విభజన ఆగస్టు ౩౧న జరిగిందని భావించాలా? లేక నవంబర్‌ ౧నే జరిగినట్లు అనుకోవాలా? సీనియర్‌ రాజకీయ నాయకులు మాత్రం ఆగస్టు ౩౧న చట్టం వచ్చింది కాబట్టి హైదరాబాద్‌ స్టేట్‌ విభజన ఆనాడే జరిగినట్లు భావించాలంటారు
లగడపాటి మాటలను పరిగణలోకి తీసుకుంటే, తాత్కాలికంగానైనా హైదరాబాద్‌ స్టేట్‌లో పరిపాలన అక్టోబర్‌ ౩౧, ౧౯౫౬ వరకు సాగింది కాబట్టి అప్పటిదాకా హైదరాబాద్‌ స్టేట్‌ అస్తిత్వం పూర్తిగా గుర్తింపులో ఉన్నట్లేనని భావించాలా? చట్టం ముందే అమల్లోకి వచ్చింది కాబట్టి ౧౯౫౬ నవంబర్‌ ౧కి ముందున్న పరిస్థితి అంటే తెలంగాణా మాత్రమే అని టిఆర్‌ఎస్‌ భావనా? శ్రీకృష్ణ కమిటీ దీన్ని ఏవిధంగా అర్థం చేసుకుంటుంది? ఎలా విశ్లేషిస్తుంది?

కామెంట్‌లు లేవు: