5, ఏప్రిల్ 2010, సోమవారం

పెళ్లా? పెటాకులా?


సానియా పెళ్లి జరుగుతుందా? ఇప్పుడిది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. సోహ్రబ్‌తో ఎంగేజ్‌మెంట్‌ పెటాకులైంది... పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌పై మోజు పడితే.. అదీ పేద్ద వివాదమై కూర్చుంది.. పెళ్లికి ముందే అయేషాతో మొదలైన సవతిపోరు.. అసలుకే ఎసరు తెచ్చేట్లుగా ఉంది.. చట్టాల ఉచ్చులో షోయబ్‌ పూర్తిగా కూరుకుపోయాడు.. ఇప్పుడు షోయబ్‌ను అరెస్టు చేస్తే సానియా పెళ్లి వాయిదా పడుతుందా? మరోసారి పెటాకులవుతుందా?


షోయబ్‌ మాలిక్‌ పెళ్లి వ్యవహారం టెన్నిస్‌ గేమ్‌లా మారిపోయింది. మాలిక్‌ బంతి సానియా, అయేషాల మధ్య కొట్టుకుంటోంది. సానియాతో పెళ్లి వార్త ప్రకటించిన వెంటనే అత్యుత్సాహంతో భారత్‌కు పరిగెత్తుకుంటూ వచ్చిన షోయబ్‌ ఇప్పుడు అయేషా పెట్టిన కేసుల చట్రంలో పూర్తిగా కూరుకుపోయాడు.. తాను తొలి భార్యనంటూ.. తనను షోయబ్‌ మోసం చేశాడంటూ అయేషా పోలీసు కేసు పెట్టడం షోయబ్‌ పాలిటి ఉచ్చులా మారింది... పోలీసులూ అత్యుత్సాహంతో షోయబ్‌పై గృహహింస చట్టం కింద కేసు పెట్టారు.. విచారణా మొదలు పెట్టారు..
సానియా ఇంట్లో షోయబ్‌ మాలిక్‌ను, అయేషా కుటుంబాన్ని ఉదయం నుంచీ పోలీసులు విచారిస్తూనే ఉన్నారు.. గృహహింస చట్టం కేసు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ కింద అరెస్టు చేయవచ్చు. ఇప్పటి వరకు షోయబ్‌ను అరెస్టు చేయకపోయినా, పోలీసులు మాత్రం ఆ దిశలోనే కదులుతున్నట్లు స్పష్టంగానే కనిపిస్తోంది. షోయబ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో పాస్‌పోర్ట్‌ కూడా ఉంది.. దీంతో పాటు అర్ధంతరంగా షోయబ్‌ దేశం విడిచిపోకుండా ఉండేందుకు అన్ని విమానాశ్రయాలను కూడా పోలీసులు అలర్ట్‌ చేయడాన్ని బట్టి చూస్తే... షోయబ్‌ వ్యవహారంలో వాళ్లు ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడేం జరుగుతుంది? షోయబ్‌ అరెస్టు ఖాయమేనా? పాకిస్తాన్‌ పౌరుడైనప్పటికీ అతణ్ణి ఇక్కడి చట్టాల ప్రకారం అరెస్టు చేసి విచారించే పూర్తి అధికారం పోలీసులకు ఉంది.. అయితే పాకిస్తాన్‌ సర్కారు ఇప్పటికే ఈ వ్యవహారంలో చొరవ చూపటం ప్రారంభించింది. షోయబ్‌ను తిరిగి పాకిస్తాన్‌కు పంపించాలని భారత్‌ను కోరింది కూడా.. ఎఫ్‌ఐఆర్‌ వివరాలను ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అయితే నమోదైన కేసుల దృష్ట్యా ఇప్పుడప్పుడే షోయబ్‌కు విముక్తి లభిస్తుందనుకోలేం..ఇంకోపక్క షోయబ్‌ లాయర్‌ రమేశ్‌ గుప్తా తన క్లయింట్‌ తప్పేమీ లేదని బల్లగుద్ది వాదిస్తున్నారు.. అయేషా పేరుతో తన క్లయింటుకు వచ్చిన ఫోటోలను కోర్టులో ప్రొడ్యూస్‌ చేస్తానని ఆయన అంటున్నారు..
ఇంకోపక్క సానియాపై ఇదే బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ కేసు నమోదు చేసింది. పాకిస్తాన్‌కు చెందిన షోయబ్‌ను సానియా వివాహం చేసుకోవటం దేశానికి ద్రోహం చేసినట్లేనని ఆ సంస్థ వాదన.. షోయబ్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. భారత్‌ తరపున టెన్నిస్‌ ఆడినందుకు గెలుచుకున్న పతకాలు, ప్రభుత్వాల నుంచి ఉచితంగా పొందిన ప్రోత్సాహకాలను భారత్‌కు తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేసింది.
పెళ్లికోసం సంబరంగా వచ్చిన షోయబ్‌ సంకెళ్లతో కటకటాల వెనక్కి వెళ్తాడా అన్నది ఇప్పటికైతే సందిగ్ధమే.. మొత్తం మీద టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వివాహం దేశంలోనే అతి పెద్ద వివాదాస్పదమైందిగా చరిత్ర సృష్టిస్తోంది..

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

సానియా మిర్జా మొదటి నుంచి సంచలనాలపైనే మక్కువ చూపిస్తోంది. ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. అయినా మనం కొంతమందిని పట్టించుకోడం మానేస్తే బాగుంటుంది. వాళ్లకి అనవసరమైన పబ్లిసిటీ ఇస్తున్నామేమో.. అందుకే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. నిశ్చితార్ధాలు, పెళ్లి పెటాకులు, అన్నింటికీ సంచలనమే.