హైదరాబాద్‌లో చోరీ సీజన్ మొదలైంది.. సమ్మర్ వచ్చిందంటే చాలు.. దొంగలకు భలే గిరాకీ.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన దొంగలు ప్రజల అశ్రద్ధను భలే సొమ్ము చేసుకుంటున్నారు.. గ్రేటర్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దొంగల భయమే.. ఏ కాలనీకి వెళ్లినా దొంగతనం వార్తలే...
వేసవిలో ఎండలు ఎంతగా మండిపోతున్నాయో.. దొంగలు అంతకంటే ఎక్కువగా విజృంభిస్తున్నారు.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన దొంగలు ఎంపిక చేసుకున్న కాలనీలలో పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేస్తున్నారు.. రాత్రి ౧౨ గంటలైతే చాలు.. దొంగలకు తెల్లవారుతుంది.. నాలుగు గంటలయ్యేసరికి కాలనీలలో తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని తమ పని కానిచ్చేసుకుని చక్కా వెళ్లిపోతారు..
వనస్థలిపురం, పహాడీ షరీఫ్, పీర్జాదీగూడ ఘటనలు పోలీసుల కంటి మీద నిద్ర లేకుండా చేశాయి.. ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే దొంగతనాలు, దోపిడీలు, హత్యల లిస్ట్ చూస్తే సామాన్యుడి గుండెలు గుభేలుమంటున్నాయి.
హత్యలు 68
సొమ్ముల కోసం హత్యలు 6
కల్పబుల్ హోమిసైడ్స్ 7
చోరీలు 2532
నిరుటితో పోలిస్తే సంఖ్యాపరంగా దొంగతనాలు తక్కువే జరగిఉండవచ్చు కానీ, ప్రస్తుత పరిస్థితిలో ప్రజల భద్రత అన్నది గాల్లో దీపంగానే ఉండిపోయింది. భద్రత ఏర్పాట్లు ఎవరికి వారు మరింత కట్టుదిట్టం చేసుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.
విచ్చల విడిగా జరుగుతున్న ఈ దొంగతనాలను పూర్తిగా నియంత్రించటం అంత తేలికేమీ కాదు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో పోలీసులు జనాభాకు తగినంత సంఖ్యలో లేరు. ఒక పోలీసు స్టేషన్ పరిధిలో చిన్నాచితకా కాలనీలతో కలిపి ౩౦ కాలనీలైనా ఉంటాయి.. ఒకటి రెండు పెట్రోలింగ్ వ్యాన్లతో రాత్రంతా గస్తీ తిరగడం వల్ల ఏదో నియంత్రించగలుగుతామని అనుకోవటం భ్రమ... పోలీసు వ్యాన్ ఒక కాలనీలో ఉంటే, మిగతా కాలనీల సంగతి అంతే..అందువల్లే పోలీసులు తమకు తోడుగా కాలనీల్లో ప్రజల సహకారాన్నీ కోరుతున్నారు.. అన్ని కాలనీల్లో ప్రజలు రాత్రి ౧౨ నుంచి తెల్లవారు జామున ౪ గంటల దాకా గస్తీ తిరగాలని కోరుతున్నారు..
ఇళ్లల్లో మహిళలు సైతం దొంగలను అడ్డుకోవటానికి కారంపొడి వంటి వస్తువులను అందుబాటులో ఉంచుకుంటే మంచిదనీ పోలీసుల సూచన.. ఎవరికి వారు తమ భద్రత ఏర్పాట్లను అప్డేట్ చేసుకోవటం అవసరమని స్పష్టం చేస్తున్నారు.. ఇంతగా విస్తరించిన మహానగరంలో అరకొర సిబ్బందితో దొంగతనాలను జీరో లెవల్‌కు తీసుకురావటం అసాధ్యమైన పని.. ప్రజలు తమవంతుగా పోలీసులకు సహకరిస్తే కొంతవరకైనా వీటిని నియంత్రించవచ్చేమో....
1 కామెంట్:
అన్ సీజన్ లోనే నాకు తెలిసిన ఒక పెద్దాయన ఇంట్లో దొంగలు దూరారు. టీవీ గట్రా ఎత్తుకుపోయారు,ఆ అనుభవం బాగానే పనిచేసింది. ఆయనది దిల్ షుక్ నగర్. ఆయన జర్నలిస్టు ఏదో బ్లాగు అంటారే అది కూడా ఉన్నట్తు గుర్తు. ఆ తో మొదలై ని తో ముగుస్తుంది ఆ పేరు. నీకేమైనా తెలిస్తే చెప్పు. ఆయనకు మాత్రం నేను చెప్పినట్టు చెప్పొద్దు ప్లీజ్... :))))))
కామెంట్‌ను పోస్ట్ చేయండి