30, డిసెంబర్ 2010, గురువారం

జనవరి ఆరున ప్రజల ముందుకు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌

ఏడాది కాలంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌ను కమిటీ సభ్యులు ఈ రోజు మధ్యాహ్నం 2.3౦ గంటలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించారు. రెండు సంపుటాల్లో సుమారు ఆరు వందల పేజీల నివేదికను హోం మంత్రి చిదంబరం జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నుంచి స్వీకరించారు. అయితే నివేదికలో తెలంగాణ గురించి కానీ, రాష్ట్ర విభజన అంశం గురించి కానీ కమిటీ ఏం చర్చించిందన్నది మాత్రం హోం శాఖ వెల్లడి చేయలేదు. జనవరి 6న ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో నివేదిక గురించి చర్చిస్తామని చిదంబరం నివేదిక అందుకున్న తరువాత చెప్పారు. నివేదికల అంశాలను పార్టీలతో చర్చించిన తరువాత నివేదికను ప్రజల ముందుంచుతామన్నారు. అప్పటి వరకు సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తం మీద నివేదికలో అంశాలు తేటతెల్లం కావటానికి మరో వారం రోజుల పాటు ఎదురుచూడాల్సిందే.
జాతీయ మీడియా అంచనా ప్రకారం రాష్ట్ర విభజనలో కీలక భూమిక వ్యవహరించనున్న హైదరాబాద్‌ విషయంలో శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక సిఫార్సులు చేసిందని సమాచారం. భౌగోళికంగా చూస్తే హైదరాబాద్‌ను తెలంగాణా నుంచి విడదీయటం సాధ్యం కాకపోయినప్పటికీ, చండీగఢ్‌ మాదిరిగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయటానికీ రాష్ట్ర ం మధ్యలో ఉన్న నగరానికి సాధ్యం కాకపోవచ్చు. అదే సమయంలో నాడు మద్రాసు మాదిరిగా హైదరాబాద్‌ను ఈరోజు వదులుకోవటానికి సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిపుణుల కమిటీని పంపించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.